24, జనవరి 2015, శనివారం

అభివృద్ధిపధంలో - 'భారత రిపబ్లిక్'

Published by 'SURYA', Telugu Daily in its Edit Page on 25-01-2015, SUNDAY)

( జనవరి ఇరవై ఆరు, భారత గణతంత్ర దినోత్సవం)



దసరాదీపావళి మొదలయిన పండగల సరసన చేర్చదగిన జాతీయ పర్వదినాలు ఆగస్టు పదిహేనుజనవరి యిరవై ఆరు.
పంద్రాగష్టును మొదటిసారి పండుగ రూపంలో స్వతంత్ర భరతజాతి యావత్తు ఒక్కటై జరుపుకున్ననాటికి  నేను నెలల బిడ్డని. రెండో పండగ- రిపబ్లిక్ డే - గణతంత్ర దినోత్సవాన్ని  తొలిసారి జరుపుకున్నప్పుడు నా వయస్సు అటూఇటుగా నాలుగేళ్ళు. అంటే దాదాపు నాతోపాటే పెరిగి పెద్దవుతూ వచ్చిన పర్వదినాలు ఇవి.
భారత రిపబ్లిక్ కు - దానితోపాటే జాతీయ గీతం 'జనగణమనకు షష్టిపూర్తి కూడా పూర్తయి ఆరో ఏడు నడుస్తోంది. నిండు నూరేళ్ళు జీవించ గలిగే అవకాశం వుంటే - అరవై సంవత్సరాలు అన్నది మనుషుల విషయంలో పెద్దమాటే. కానీ ఒక జాతి జీవితంలో అరవై ఏళ్ళు ఒక లెక్కలోది  కాదు. అయితే, ఏ  ఏటికాయేడు వెనక్కి తిరిగి చూసుకుని సాధించినది ఎంతో లెక్కలు వేసుకోకపోతే సాధించాల్సిన లెక్కలు తేలడం కష్టం. అందుకని ఈ ఏడాది ఈ పండుగ సమయంలో అందరం పరస్పర శుభాకాంక్షలు తెలుపుకోవడంతో పాటు  'నడిచి వచ్చిన దారిని ఒకమారు పరిశీలించుకోవాల్సిన సందర్భం ఇది.

నాకు ఊహ తెలుస్తున్న వయస్సులో ఈ రెండు పండగలను యెంతో ఉత్సాహంతో జరుపుకున్న రోజులు యిప్పటికీ జ్ఞాపకం వున్నాయి. పొద్దున్నే లేచి బడికి వెళ్లి త్రివర్ణ పతాకాలు చేతబట్టుకుని ఊరంతా తిరుగుతూ ప్రభాత్ భేరిలో పాల్గొనే వాళ్ళం.

ప్రభాత్ భేరి అనే మాటకు అర్ధం తెలియని వయసు. అయినా అలా ఊరేగింపుగా బయలుదేరి 'భారత్ మాతాకీ జై' అని నినాదాలు చేస్తూ వీధుల్లో తిరుగుతూ వుంటే ఊరంతా ఉత్సాహం ఉరకలెత్తేది.  'జనగణమనగీతంలో- ఏ ఏ భాషల ప్రస్తావనవుందోఏ ఏ ప్రాంతాల  ప్రసక్తి వుందో మాకు అప్పటికి తెలియదు.  ఆ గీతాన్ని ఎవరు రాసారో,  ఏ భాషలో రాసారో అంతకంటే తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే అది అందరి గీతం. జనగణమన చరణాలలోని - 'ను 'లాగా- 'ను 'లాగాతప్పులు దొర్లకుండా ఎలా పాడాలన్న తపన ఒక్కటే మాకు తెలిసింది. ఢిల్లీ  ఎక్కడ వుందో తెలియదుఎర్రకోట అంటే తెలియదుకానీ దానిపై చాచా నెహ్రూ  జండా ఎగురవేస్తాడని మాత్రం తెలుసు. ఏమీ తెలియని అజ్ఞానంలోని మధురిమను ఆస్వాదించడం కూడా ఒక మంచి అనుభవమే అని ఈనాడు ఆ రోజులను గుర్తుకు తెచ్చుకుంటే అనిపిస్తోంది.
అవును. ఎక్కడికి పోయాయి ఆ రోజులు?
'లేవరా నాన్నా! ఈరోజు స్కూల్లో జండా ఎగరేస్తారు తొందరగా వెళ్ళాలిఅంటే- కాసేపు పడుకోనీ మమ్మీఈ రోజు సెలవే కదా!అని పిల్లలు నసిగే  రోజులు వచ్చేసాయి. పండగ దినం స్తానంలో సెలవు రోజు వచ్చింది. తప్పులు లేకుండా జనగణమనపాడడం పోయి –   గీతంలో తప్పులెన్నే రోజు వచ్చింది. భారతీయ జండాకు బదులు మరో జండా ఎగురవేస్తామనే వితండ వాదం పుట్టుకొచ్చింది.ఏటేటా జరిగే  పతాక ఆవిష్కరణలు మొక్కుబడిగా మారిపోయాయి. ఎప్పుడేమి జరుగుతుందో అన్న భయం మధ్యనిఘా పోలీసుల డేగ కళ్ళ పహరాల నడుమ జాతీయ పండుగలు జరుపుకునే దుస్తితి దాపురించింది.

సైనిక కవాతులుశస్త్రాస్త్ర ప్రదర్శనలుభారీ టాంకులువైమానిక దళ విన్యాసాలతో ఎలాంటి పరిణామాలనయినా ఎదుర్కోగల యుద్ధ సన్నద్ధతనుజాతి సంసిద్ధతను ఒక పక్క ప్రదర్శిస్తూనే మరో పక్క బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనుకనుంచి నాయకులు చేసే ప్రసంగాలు వినవలసి రావడం యెంతటి  విషాదం?
శాంతి భారతంగా పేరొందిన భారతదేశంలో ఈనాడు ఎక్కడ ఏమిజరుగుతుందోఎక్కడ ఏ బాంబు పేలుతుందో తెలియని పరిస్తితి పొటమరించడం యెంతటి  దారుణం?
మతమన్నది మనకంటికి మసకయితే
గతమన్నది మనకంటికి కురుపయితే
మతం వద్దు గతం వద్దు మారణ హోమం వద్దు అన్న సూక్తులను వొంటబట్టించుకుని ఎదిగిన ఓ తరం వారు,  ఈనాటి పరిస్తితులను చూసి – 'మనం కోరుకున్న స్వేఛ్చా భారతం ఇదేనా  అని మధనపడాల్సిరావడం మరెంతటి దుస్తరం?
మతాల దురభిమానాలతోకులాల కుంపట్లతోప్రాంతీయ ద్వేషాలతో దేశం  యావత్తు అడ్డంగా నిలువుగా చీలిపోతుంటే-
స్వార్ధమే పరమావధిగాసంపాదనే ఉపాధిగాఅడ్డదారుల్లో అందినంత స్వాహా చేయడమే అంతిమ లక్ష్యంగా నీతికి దూరంగాఅవినీతికి ఆలంబనగా తయారయిన రాజకీయ దళారులంతా కలసి కుమ్మక్కై  జాతి సంపదను నిస్సిగ్గుగా కొల్లగొడుతుంటే-
జనరంజకంగా పాలించాల్సిన అధికార  యంత్రాంగం లంచాల మత్తులోపడి ప్రజల రక్తం పీలుస్తుంటే -
రాజ్యాంగం ఏర్పరచిన అన్ని వ్యవస్థలు, మారుతున్న కాలానికి అనుగుణంగా విలువలను నిలువు పాతర వేసి కుప్పకూలి  కునారిల్లుతున్న సమయంలో, ‘నేనున్నానంటూ’ జనాలకు వెన్నుదన్నుగా నిలబడాల్సిన మీడియా సయితంతానూ ఆ తానులో ఓ ముక్కగా మారిపోతుంటే 
నిస్సహాయంగా నిలబడి జనం చూడాల్సి రావడం యెంత విషాదంయెంత దారుణంయెంత దుస్తరం,యెంత బాధాకరం?  

అయితే ఏమిటట?

నాణానికి బొమ్మా బొరుసూ ఉన్నట్టేప్రపంచం గర్వించదగిన  గొప్ప లక్షణాలను కూడా స్వతంత్ర భారతం తన కొంగున ముడివేసుకుంది. 1947 లో మన దేశంతో పాటే స్వేచ్చా వాయువులు పీల్చుకున్న అనేక ఆసియా దేశాలుఇరుగు పొరుగు దేశాలు ఈ అరవై అయిదేళ్ళలో కొంతకాలం పాటయినా ప్రజాస్వామ్య పధాన్ని వీడి నియంతృత్వపు బాటలో నడిచిన దాఖలాలున్నాయి. మన దేశం మాత్రం ఎన్ని వొడిదుడుకులకు లోనయినామరెన్ని వొత్తిడులకు గురయినా ఎంచుకున్న మార్గంలోనే అప్రతిహతంగా  పురోగమించి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలలో ఒకటిగా తన స్తానాన్ని పదిలం చేసుకుంది.

జనాభాలో అత్యధిక భాగం నిరక్షరకుక్షులయినా 'వోటుఅనే ఆయుధంతో ప్రభుత్వాలను మార్చగల సత్తా వారి సొంతం.
అక్షర జ్ఞానం లేకపోయినాకానులూఏగానులనుంచిబేడలూ అర్ధణాల నుంచి నయా పైసల లెక్కకు అలవోకగా మారగలిగిన 'మేధోతనంవారి ఆస్తి.
గిద్దెలుసోలలుశేర్లుసవాశేర్లుమానికెల కొలతలనుంచి లీటర్లకు అతి తక్కువ వ్యవధిలో మారిన చరిత్ర వారిది.
అలాగేవీసెలుమణుగులనుంచి కిలోగ్రాములకుబస్తాలనుంచి క్వింటాళ్లకు,  'మైలు రాళ్ళనిఅధిగమించి కిలోమీటర్లకు ఎదిగారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా కిలోమీటర్ల లెక్కల్లోకి మారిపోకుండా పాతకాలంలోలా   ఇంకా 'మైలు'రాళ్ళదగ్గరే ఆగిపోయిన సంగతి ఇక్కడ గమనార్హం.
చదువూసంధ్యా లేని వాళ్లనీఎందుకు  పనికిరాని వాళ్ళనీ  ఇతర దేశాల వారికి మనపై చిన్నచూపు. కానీ అలాటి మనవాళ్ళు - దేశానికి స్వాతంత్రం రాగానే నిర్వహించిన తొలి ఎన్నికల్లో పార్టీల గుర్తులున్న పెట్టెలలో వోటు వేసే దశను అలవోకగా దాటేసారు. ఆ తరువాత  ఒకే బాలట్ పేపరుపై  ముద్రించిన అనేక పార్టీల  గుర్తులనుంచి తాము ఎంచుకున్న అభ్యర్ధిని అతడి గుర్తుతోనే   గుర్తుపట్టి  వోటు వేయగల పరిణతిని అందుకున్నారు. ఇప్పుడు ఏకంగా అధునాతన  ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను తడబడకుండా ఉపయోగించుకోగల సామర్ధ్యాన్ని అలవరచుకోగలిగారు. 

'ఏ రంగం చూసినా ఏమున్నది గర్వకారణంఅనే నిర్లిప్త స్తితిని అధిగమించి  ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో భారతీయుల ముద్ర స్పుటంగాప్రస్పుటంగా ప్రపంచ వ్యాప్తంగా కానరాగల అత్యున్నత శిఖరాలకు మన దేశం చేరుకోగలగడం స్వతంత్ర భారతం సాధించిన మరో ఘనత.

'చందమామ రావేఅంటూ పాటలు పాడే స్తితి నుంచి 'చంద్రయాన్వరకు ఎదగగలిగాము. అంతరిక్ష పరిశోధనల్లో అభివృద్ధి చెందిన  దేశాల సరసకు చేరగలిగాము. సుదూర లక్ష్యాలను చేధించగలిగిన అధునాతన రక్షణ  క్షిపణులను అంబుల పొదిలో చేర్చుకోగలిగాము. సస్య విప్లవం విజయవంతం చేసుకుని ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే దుస్తితి తప్పించుకుని స్వయం సమృద్ధిని సాధించుకోగలిగాము.       

ఏ ఇంగ్లీష్ వారితో తలపడిఅహింసా మార్గంలో వారితో  పోరాడి స్వతంత్రం సంపాదించుకున్నామో ఇంగ్లీషు వారి భాషనే ఆయుధంగా చేసుకుని - దేశ దేశాలలో కంప్యూటర్ రంగాన్ని మన కనుసన్నలతో శాసించగలుగుతున్నాము.  

అయితే , 'అంగట్లో  అన్నీవున్నా అల్లుడి నోట్లో శని' అన్న సామెత చందంగా  ఎక్కడో ఏదో లోటు జనం మనస్సులని కుదిపేస్తోంది. ఆరు దశాబ్దాల పైచిలుకు కాలంలో సాధించిన అభివృద్ధి అంతా అడవిగాచిన వెన్నెల అవుతున్నదేమో అన్న శంక కలవరపెడుతోంది. స్వతంత్ర భారతం ఆలపిస్తున్న స్వేఛ్చా గీతికల్లో వుండి వుండి అపశ్రుతి వినబడుతోంది.

వెడుతున్న దోవ మంచిదే. కానీనడుస్తున్న కాళ్లే తడబడుతున్నాయి. కాలికి కాలే అడ్డంపడి గమ్యాన్ని మరింత దూరం చేస్తున్నాయి.

విభిన్న స్వరాలతో వినిపిస్తున్న సందేశం మంచిదే. కానీ మధ్య మధ్య వినబడుతున్న  అపస్వరాలు అసలు అర్ధాన్నే మార్చివేస్తున్నాయి.

అందరూ మంచివాళ్ళే. కానీ మానసిక కాలుష్యమే  వాళ్ళ మంచితనాన్ని మంచులా కరిగించి వేస్తోంది. హరించి వేస్తోంది.

స్వార్ధం ముందు నిస్వార్ధం తలవంచుతోంది. అధికారం అన్నదే పరమావధిగాధనార్జన అన్నదే అంతిమ ధ్యేయంగా - అవలక్షణలక్షిత సమాజం కళ్ళ ముందే ఆవిష్కృత మవుతోంది.

అయితే, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ రకమయిన పరిణామాలు అనివార్యంఅతి సహజం. కానీ  అవి  తాత్కాలికం కావాలి. శాశ్వితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత  మాత్రం అందరిదీ.

ఒకరిపై మరొకరు నెపాలు మోపకుండాతప్పులు దిద్దుకోగలిగితే మార్పు అనివార్యం. అభివృద్ధి సురుచిర సాధ్యం.

భారత రిపబ్లిక్ వార్షికోత్సవ శుభసమయంలో  మనమందరం జాతికి కలసికట్టుగా ఇవ్వాల్సిన కానుక అదే.

21, జనవరి 2015, బుధవారం

పాలక ప్రతిపక్షాలకు రాష్ట్రపతి హితబోధ

(Published by 'SURYA' telugu daily in its edit page on 22-01-2015, Thursday)

దేశ ప్రధమ పౌరుడు భావి పౌరులతో ముచ్చటిస్తూ తన మనసులోని మాట విప్పి చెప్పారు. దశాబ్దాల రాజకీయ అనుభవసారాన్ని మొత్తం రంగరించి మరీ చెప్పారు. పాలకపక్షం వారికీ, ప్రతిపక్షం వారికీ అందరికీ పనికొచ్చే పసిడి ముక్కలు చెప్పారు. ప్రస్తుత పరిస్తితులను అవగాహన చేసుకుని ఆవేదనతో కూడిన హితబోధ చేశారు.
చెప్పింది సాక్షాత్తు భారత రాష్ట్రపతి. విన్నది భవిష్యత్ భారతానికి నిర్ణేతలయిన  విద్యార్ధులు. కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్ధులతో,  శ్రీ ప్రణబ్ ముఖర్జీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గత సోమవారం నాడు  ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్ధులు అడిగిన అనేక ప్రశ్నలకు రాష్ట్రపతి జవాబులు చెప్పారు. నేడు దేశం ఎదుర్కుంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలను ఆయన తన సమాధానాల్లో స్పృశించారు. మొత్తం జాతికి ఒక పెద్దగా,  ఎలాటి హితవు పలకాలో  శ్రీ ముఖర్జీ  ఆ సంభాషణలో స్పష్టంగా చెప్పారు. అవి విద్యార్ధులకోసం చెప్పిన జవాబులే.  కానీ  దేశానికి జవాబుదారీగా వుండాల్సిన పాలక ప్రతిపక్షాలకు కూడా పనికొచ్చే హితబోధలు వాటిల్లో వున్నాయి. చురుక్కుమనిపించేలా  మాత్రమే కాదు,  ఆలోచింపచేసేలా కూడా  వున్నాయి. ఆ హితవచనాలు విని ఆచరించగలిగితే అది జాతి హితానికి ఎంతో  మంచిదనిపించేలా కూడా వున్నాయి.
ప్రస్తుతం దేశాన్ని పాలిస్తోంది భారతీయ జనతాపార్టీ. పేరుకు సంకీర్ణ ప్రభుత్వం. కానీ , ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో, ఆయన పేరుతొ ఎదురులేకుండా సాగిపోతున్న  ప్రభుత్వం అది.  శ్రీ ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నికయింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో. ప్రస్తుతం ఆ పార్టీ,  లోకసభలో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని దుస్తితిలో వుంది. ప్రధాని మోడీకి, ఆయన పార్టీ అయిన బీజేపీకి కాంగ్రెస్ అంటేనే చుక్కెదురు. ఇలాటి నేపధ్యంలో రాష్ట్రపతి తనకున్న పరిమితుల్లోనే హితబోధ చేశారు. జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ, జరగాల్సిన విధి విధానాలను విశ్లేషించారు.  అలాగని ఆయన ఈ కార్యక్రమంలో ఎక్కడా కూడా ఎవ్వరు నొచ్చుకునే విధంగా మాట్లాడలేదు. ఒక కుటుంబ పెద్ద తన కుటుంబ విషయాలను తనవారితో యెలా మాట్లాడతాడో ఆవిధంగానే సాగింది రాష్ట్రపతి ప్రసంగం.





ప్రతిపక్షం యెలా వ్యవహరించాలో, పాలక పక్షం యెలా నడుచుకోకూడదో శ్రీ ప్రణబ్ ముఖర్జీ అన్యాపదేశంగా ప్రస్తావించారు. ప్రజల ద్వారా ఎన్నికయిన ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన చట్టసభల్లో కనబరుస్తున్న ప్రవర్తనను  ఆయన ప్రశ్నించారు. ఒకరకంగా చెప్పాలంటే యావద్దేశ పౌరుల మనస్సుల్లో కదలాడుతున్న అంశాలనే రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు.
చట్ట సభల పనితీరు పట్ల ఆయన ఆవేదన, సభల నిర్వహణకు కలుగుతున్న ఆటంకాల పట్ల అసహనం ఆయన మాటల్లో వ్యక్తం అయింది.
పార్లమెంటు సభ్యులు సభ జరగనివ్వకుండా నినాదాలు చేయడం, స్వతంత్ర భారతం స్వయంగా రూపొందించుకున్న  పార్లమెంటరీ సంప్రదాయాలకు మేలు చెయ్యదన్న అభిప్రాయం అయన మాటల్లో ద్యోతకమయింది. ఈ విషయంలో విపక్షాలు వ్యవహరిస్తున్న తీరును రాష్ట్రపతి తీవ్రంగా దుయ్యబట్టారు.
'సభలో అల్పసంఖ్యాకులు (మైనారిటీ) తమ ఆందోళనలతో అధిక సంఖ్యాకుల (మెజారిటీ) హక్కులకు భంగం కలిగిస్తున్నారు. దీన్ని ఎంతమాత్రం అనుమతించరాదు' అని శ్రీ ప్రణబ్ ముఖర్జీ చెప్పారు.
'చట్టాలు చేయడం చట్ట సభల కర్తవ్యం. ఇందులో పార్లమెంటు విఫలం అయితే ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ప్రజలు పెట్టుకున్న నమ్మకం వమ్మవుతుంది. ఇలా చేయడం అంటే ప్రజల విశ్వాసానికి ఘాతుకం కలిగించడమే' అని రాష్ట్రపతి అన్నారు. అంచేత ఎట్టి పరిస్తితుల్లోను పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయాలు కలగకుండా చూడాలని హితవు పలికారు. శీతాకాల సమావేశాల్లో విపక్షాలు సభను అడ్డుకున్న నేపధ్యాన్ని మనసులో పెట్టుకుని రాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేసివుంటారని భావిస్తున్నారు. విధాన నిర్ణయాలు తీసుకోవాల్సిన పార్లమెంటు, సామూహిక ఆందోళనలకు, బజారు స్థాయి నిరసనలకు వేదిక కారాదని ఆయన చెప్పిన తీరును బట్టి,  ఈ పరిణామాలు ఆయన్ని ఎంతగా కలత పెట్టి వుంటాయో అర్ధం చేసుకోవచ్చు. 'పార్లమెంటు అనేది ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తివంతమైన సాధనం. దాన్ని మరింత శక్తివంతంగా ఉపయోగించుకోవాలి. సభను స్తంభింపచేయడమే ప్రధానంగా పెట్టుకుంటే విలువయిన సభ సమయం వృధా అయిపోతుంది. విధాన ప్రక్రియ కుంటుపడుతుంది' అని ఆయన అన్నారు.
పార్లమెంటు సమావేశాల కాలం కాలక్రమంలో క్రమేపీ కుదించుకుంటూ పోవడం, సుదీర్ఘ కాలం పార్లమెంటు సభ్యుడిగా వున్న ప్రణబ్ మనసును కలత పెట్టి వుంటుంది. అందుకే ఆయన, పార్లమెంటు సమావేశాల సమయం యెలా కుదించుకుపోయిందో గణాంకాలతో సహా  వివరాలను వెల్లడించారు.
విపక్షాలకు సుద్దులు చెప్పడంతోనే రాష్ట్రపతి సరిపుచ్చుకోలేదు. అంతే తీవ్రంగా అధికార పక్షం తీరును కూడా ఎండగట్టారు.  మోడీ ప్రభుత్వం ఆర్డినెన్సుల బాటలో వెళ్లడం ఆయనకు రుచించినట్టుగా లేదు. 'చట్టసభల్లో ఒక పద్దతి ప్రకారం చట్టాలు జరగాలి. అలాకాకుండా సాధారణ చట్టాలకు సైతం ఆర్డినెన్సుల మార్గం ఎంచుకోవడం సరికాద'ని అన్నారు. అసాధారణమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాల్లో  మాత్రమే ఆర్డినెన్సులు జారీ చేయాలని రాజ్యాంగం పేర్కొంటున్న విషయాన్ని రాష్ట్రపతి ప్రస్తావించారు. 'ఏ ఆర్డినెన్సు జారీ చేసినా దానికి ఆరు నెలలలోగా పార్లమెంటు ఆమోదం లభించేలా చూడాలి. లేనిపక్షంలో అది నిరర్ధకమవుతుంద'ని చెప్పారు.
మోడీ ప్రభుత్వం కొన్ని ఆర్డినెన్సుల విషయంలో అనుసరించబోతున్న పద్దతి ఎలాటిదో తెలియని వ్యక్తి కాదు శ్రీ ప్రణబ్ ముఖర్జీ. రాజ్యసభలో కొన్ని బిల్లులను ఆమోదింప చేసుకునే బలం ప్రస్తుతానికి బీజేపీకి, దాని మిత్ర పక్షాలతో కూడిన  ఎండీఏ కూటమికి లేని మాట నిజం. అందుకే పార్లమెంటు ఉభయ సభల  సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి బిల్లులను గట్టెక్కించే వ్యూహ రచన చేస్తున్న సంగతి కూడా బహిరంగ రహస్యమే.
విద్యార్ధులతో మాటా మంతీ కార్యక్రమంలోనే రాష్ట్రపతి తెలివిగా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇది ఆచరణ సాధ్యం కాకపోవచ్చన్న ధ్వని ఆయన మాటల్లో వ్యక్తం అయింది. 1952  నుంచి ఇప్పటివరకు అలాటి సందర్భాలు నాలుగే వచ్చాయి. సంయుక్త సమావేశాల్లో బిల్లులను నాలుగు పర్యాయాలు మాత్రమే ఆమోదం పొందేలా పాలక పక్షాలు ప్రయత్నించిన సంగతిని  ఆయన ప్రస్తావించడం గమనార్హం. ఈ అంశంలో తన వైఖరి  యెలా వుండబోతోందో అయన ఈ విధంగా అన్యాపదేశంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియచేశారనుకోవాలి.          
కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటుచేస్తారు. ఏదైనా ప్రభుత్వ బిల్లును ఉభయ సభల్లో ఒకటి ఆమోదించి మరొకటి తిరస్కరించినప్పుడు ఆ బిల్లును తిరిగి ఆమోదింప చేసుకోవడానికి రాజ్యాంగంలో ప్రత్యేక సౌలభ్యం వుంది. గతంలో ఇలాగే ఉభయ సభల సంయుక్త సమావేశాలు ఏర్పాటు చేసి, 1961 లో వరకట్న నిషేదం బిల్లును, 1978లో బ్యాంకింగ్ సర్వీసు కమీషన్ రద్దు బిల్లును, 2002లో ఉగ్రవాద నిరోధక బిల్లును ఆనాటి ప్రభుత్వాలు చట్టాలుగా మార్చుకోగలిగాయి.
సాధారణంగా పాలక పక్షాలకు లోక సభలో బిల్లులను ఆమోదింప చేసుకోగల మెజారిటీ వుంటుంది. రాజ్యసభతోనే అప్పుడప్పుడు చిక్కులు ఎదురవుతాయి. రాజ్యసభకు రొటేషన్ ప్రకారం సభ్యులను ఎన్నుకుంటారు కాబట్టి ఏదైనా కొత్త పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం లోకసభలోనే ఆ పార్టీకి  మెజారిటీ వుంటుంది. రాజ్యసభలో కొంతకాలంపాటు పాత పాలక పక్షానికే ఎక్కువమంది సభ్యులు వుండడం కద్దు. ప్రస్తుతం రాజ్యసభలో అదే పరిస్తితి. బీమా, బొగ్గు గనులు, భూసేకరణ చట్ట సవరణ, పౌరసత్వ సవరణ మొదలయిన అంశాలకు సంబంధించి జారీ చేసిన ఆర్దినెన్సులకు చట్ట స్వరూపం కల్పించడంలో ప్రతిపక్షాలనుంచి చిక్కులు రాగలవన్న సందేహం పాలక పక్షానికి  వుంది.    
ఈ గడ్డు పరిస్తితిని అధిగమించడానికి మోడీ ప్రభుత్వం,  రాజ్యాంగంలో ఇందుకోసం పొందుపరచిన   118 వ అధికరణం ఉపయోగించుకునే అవకాశాలున్నాయని మీడియాలో కధనాలు వెలువడుతున్న తరుణంలో  రాష్ట్రపతి చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రాముఖ్యత ఏర్పడుతోంది. సంయుక్త సమావేశంలో బిల్లులను ఆమోదించేటప్పుడు వోటు వేసే వారి సంఖ్యను పరిగణలోకి తీసుకుంటారు తప్ప వారు రాజ్యసభ సభ్యులా, లేక లోకసభ సభ్యులా అన్న విషయం గమనంలోకి తీసుకోరు. 'విపక్షాలు బిల్లుల ఆమోదానికి సహకరించవు, లేదా ఆర్డినెన్సుల కాలపరిమితి ముగిసిపోతుంది' అనుకున్నప్పుడు పాలక పక్షాలు రాజ్యంగంలో పొందుపరచిన ఈ అధికరణాన్ని వాడుకుంటాయి. అయితే అత్యంత అత్యవసరం అనుకున్నప్పుడే ఈ వెసులుబాటును గతంలో ఉపయోగించుకున్నట్టు రికార్డులు చెబుతున్నాయి.
రాష్ట్రపతి చేసిన ఈ వ్యాఖ్యలు మోడీ ప్రభుత్వంలో కదలిక తెచ్చిన సూచనలు కానవస్తున్నాయి. ఒక్క రోజు వ్యవధానం తీసుకుని కేంద్రంలోని సీనియర్ మంత్రులు ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ వెంకయ్య నాయుడు, 'దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఆర్దినెన్సులను జారీచేసింద'ని చెప్పారు. 'మోడీ ప్రభుత్వం ఆరుమాసాల కాలంలో రికార్డు స్థాయిలో ఆర్దినెన్సులను జారీ చేసిందనీ, పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకోవడం లేద'ని కాంగ్రెస్ నాయకులు  చేస్తున్న విమర్శలను వెంకయ్యనాయుడు తగిన గణాంకాలను ఉదహరిస్తూ తిప్పికొట్టారు. 1952 నుంచి ఇప్పటివరకు కేంద్రం మొత్తం  637 ఆర్డినెన్సులను జారీ చేయగా వాటిల్లో 456 ఆర్డినెన్సులు  కాంగ్రెస్ ప్రభుత్వ హయాములోనే జారీ అయిన సంగతి ఆయన గుర్తు చేశారు.
ఫిబ్రవరి మూడో వారంలో పార్లమెంటు సమావేశాలు మొదలయ్యే అవకాశాల దృష్ట్యా సంయుక్త సమావేశాల విషయంలో కేంద్రం అప్పటిలోగా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం  వుంది.
అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టం. ఇలాటి విషయాల్లో అన్ని పార్టీలదీ  ఒకటే విధానం. అదికారంలో వున్నప్పుడు ఒక తీరు, లేనప్పుడు మరో తీరు.
రాజకీయ అనుకూలతలే పార్టీల నిర్ణయాలకు ప్రాతిపదికలవుతున్నాయి. రాజకీయ ప్రయోజనాలే నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. దేశ హితం, జాతి హితం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి.
రాష్ట్రపతి హితవచనలయినా పాలక ప్రతిపక్షాలను దారిలో పెడతాయని ఆశిద్దాం. (21-01-2015)

NOTE: Courtesy Image Owner 

20, జనవరి 2015, మంగళవారం

ఎయిర్ ఫోర్స్ వన్


అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత సందర్శన పుణ్యమా అని ఆయన అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ వన్ గురించి మీడియాలో ఎన్నో ఆసక్తికరమైన కధనాలు వెలువడుతున్నాయి. ఈ నేపధ్యంలో దశాబ్దకాలం క్రితం నేనూ మా ఆవిడా అమెరికాలోని సియాటిల్ కు వెళ్ళినప్పుడు ఆ విమానం ఎక్కి కలయ తిరిగే ఓ అపూర్వ అవకాశం లభించింది. ఆ వివరాలను అప్పట్లో నా బ్లాగులో 'అమెరికా అనుభవాలు'  అనే శీర్షికతో అనేక భాగాలుగా రాసి నిక్షిప్తం చేసాను. అదే ఇది:  

"ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలయిన మైక్రోసాఫ్ట్ , బోయింగ్ ప్రధాన కార్యాలయాలు సియాటిల్ లోనే వున్నాయి. ఇన్ఫోసిస్ తరపున బోయింగ్ విమానాల తయారీ కర్మాగారంలో పనిచేస్తున్న మా అబ్బాయి సందీప్ ఏర్పాటుచేసిన ప్రత్యేక అనుమతి పత్రాలతో  ఒక రోజు బోయింగ్ కర్మాగారానికి వెళ్ళాము. అనేక వందల ఎకరాల విస్తీర్ణంలో వున్న ఈ ఫ్యాక్టరీని ప్రవేశ రుసుముతో సందర్శించే వీలు కల్పించారు. ఎంతో భద్రత అవసరమయిన ఈ కర్మాగారాన్ని సందర్శించేందుకు ఉత్సాహపడే పర్యాటకులను ప్రవేశ రుసుముతో అనుమతించడం ద్వారా టూరిజంను వారు ఎలా ప్రోత్సహిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ని కూడా ఇదేవిధంగా సందర్శించే వీలు వుందని విన్నాను.
"మిగిలిన సందర్శకులతో కలిపి మమ్మల్ని కూడా ప్రత్యేక బస్సుల్లో లోపలకు తీసుకు వెళ్లారు. అన్నీ చూపించి విషయాలను విశద పరిచేందుకు వెంట గైడ్లు కూడా వున్నారు.
అసలు బోయింగ్ విమానమే ఎంతో పెద్దగా వుంటుంది. అలాటిది వాటిని తయారు చేసే ఫాక్టరీ యెంత పెద్దగా వుంటుందో ఊహించుకోవచ్చు. విడి భాగాలను తయారు చేసి వాటినన్నిటినీ ఒకచోట చేర్చి విమానాన్ని నిర్మించే వివిధ దశలను మేము కళ్ళారా చూసాము. అంతేకాకుండా బోయింగ్ విమాన నిర్మాణం ఎలా జరుగుతుందో కళ్ళకు కట్టినట్టు చూపే డాక్యుమెంటరీని కూడా ప్రదర్శించారు. ఈ కర్మాగారం ఆవరణలోనే పెద్ద పెద్ద రన్ వే లతో కూడిన విమానాశ్రయాన్ని కూడా నిర్మించారు.
"రైట్ సోదరులు కనుక్కున్న తొలి విమానం నుంచి ఇంతవరకు తయారయిన అధునాతన యుద్ధ విమానాలు, ప్రయాణీకుల విమానాలు, సరకుల రవాణా విమానాలు, హెలికాప్టర్లు వుంచిన ఒక ప్రదర్శనశాల కూడా వుంది. అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ వన్పాత మోడల్ కూడా అక్కడ వుంది. సందర్శకులు అందులోకి ఎక్కి కాక్ పిట్ తొ సహా ప్రెసిడెంట్ కోసం విమానంలో ఏర్పాటు చేసిన పడక గది, సమావేశ మందిరం, పత్రికా విలేఖరులతో మాట్లాడే హాలు అన్నీ చూడవచ్చు. టెలిఫోన్, టెలెక్స్, కంప్యూటర్, ఇంటర్నెట్, టీవీ మొదలయిన అత్యాధునిక సమాచార పరికరాలన్నీ అందులో వున్నాయి.
"అమెరికా ప్రెసిడెంట్ విమానంలోకి ఎక్కి అన్నీ చూడడం అన్నది నిజంగా ఒక మరపురాని అనుభూతి. ఇవన్నీ ఎందుకు ప్రస్తావిస్తూ వున్నానంటే ఈ దేశంలో పర్యాటక రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను తెలియచెప్పడానికే. నిజానికి బోయింగ్ విమానాల కర్మాగారం రక్షణ అవసరాల దృష్ట్యా నిషేధిత ప్రదేశమయినా టికెట్లు పెట్టి మరీ ప్రజలకు చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఏటా ఎన్నో వేలమంది దీన్ని సందర్శిస్తూ వుంటారు. (2004)



NOTE: Courtesy Image Owner 

మరో బ్రేకొచ్చేసరికి మళ్ళీ వారు వీరవుతారేమో!


యాంఖర్ : ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ చర్చాకార్యక్రమం మొదలు పెట్టేముందు, ఈనాడు హాజరయిన అతిధుల్లో పలానా వారు పలానా పార్టీ అని పరిచయం చేసాము. అయితే ఇంతకుముందు బ్రేక్ ఇచ్చిన సమయంలో వారు పార్టీ మారి వేరే పార్టీలో చేరుతున్నట్టు తెలియచేసారు. ఈ మార్పు గమనించ ప్రార్ధన.





NOTE: Courtesy Image Owner 

19, జనవరి 2015, సోమవారం

తెరిచి పెట్టిన పుస్తకం


మరుగేలరా ఓ రాఘవాఅని  పాడుకునే రోజులకు రోజులు  దగ్గర పడుతున్నాయి. ఇక ముందు ముందు  మనుషుల జీవితాల్లో చాటు మాటులు వుండవు. అంతా బహిరంగమే. బతుకు బస్ స్టాండ్అనుకుంటూ బాధపడే భవిష్యత్తు ఎలా వుంటుందో తెలిపే ఓ ఆంగ్ల కధనం ఒకటి  ఇప్పుడు నెట్లో షికార్లు చేస్తోంది. దానికి స్వేచ్చానువాదం:


2020లో బ్రేక్ ఫాస్ట్ ఆర్డర్ చేయడం కోసం చట్నీస్ కు  ఫోన్ చేస్తే ఆ సంభాషణ ఇలా సరసంగా సాగుతుంది.
గుడ్ మార్నింగ్. నాకు వెంటనే నాలుగు ప్లేట్లు .....
ఒక్క నిమిషం సర్! మీ మల్టీ పర్పస్  కార్డ్ నెంబర్ చెబుతారా?”
కార్డు నెంబరా! ఒక్క నిమిషం ఆగండి చూసి చెబుతాను..... నా నెంబరు ... 889861356102049 998-45-54610"
థాంక్స్. అయితే మీ పేరు శ్రీనివాసరావు. మాదాపూర్ లో మహారాజా ఛాట్ ఎదురుగా వున్న అపార్ట్ మెంటులో నాలుగో అంతస్తులోని ఫ్లాట్లో వుంటారు. మీరక్కడ ఏడాదిగా అద్దెకు వుంటున్నారు. మీ లాండ్ లైన్ నెంబరు 23731056. సారీ అది బీ యస్ ఎన్ ఎల్ కనెక్షన్ కావడం వల్ల కేబుల్ షార్టేజ్ కారణంగా ఇంకా షిఫ్ట్ చేయలేదు. ప్రస్తుతం ,మీ  మొబైల్ నెంబరు  9849130595.  ఇప్పుడు చెప్పండి. మీకేమి కావాలి?”
నాకేమి కావాలో చెబుతాను సరే! ఇంతకీ  నా ఫోను నెంబర్లు, నా వివరాలు మీ దగ్గర ఎలావున్నాయి?”
సిష్టంతో కనెక్ట్ అయివున్నాం సర్”   
సరే! నాకు త్వరగా నాలుగు ప్లేట్లు బాబాయి ఇడ్లీ ...
వన్ మినిట్ సర్! మీరు మొన్న ఉదయం మీ భార్యతో కలసి వెళ్లి  శ్రీనగర్ కాలనీలోని క్లినిక్ లో  షుగర్ చెక్ చేయించుకున్నారు. ఆ రిపోర్ట్ ప్రకారం మీరు ఉదయం పూట ఇడ్లీ తినడం అంత శ్రేయస్కరం కాదు. మీ ఆవిడ రిపోర్ట్ బాగానే వుంది. ఆమెకు ఇడ్లీ చెబుతాను. మీకు  బ్రౌన్ బ్రెడ్ శాండ్ విచ్ ఆర్డర్ చేస్తాను.
ఓకే! బిల్లు సుమారుగా ఎంతవుతుంది?”
యెంత సర్! చాలాతక్కువ. సర్వీస్ చార్జ్ కాకుండా  పన్నెండు వందలు
కార్డు మీద పే చెయ్యవచ్చా?”
తప్పకుండా. కాకపోతే చిన్న ప్రాబ్లం సర్!  కంప్యూటర్ చెబుతున్నదాన్నిబట్టి చూస్తే  మీ క్రెడిట్ కార్డు క్రెడిట్ రికార్డు ఏమీ బాగాలేదు. ఇప్పటికే మూడు వాయిదాలు కట్టలేదు.  హౌసింగ్ లోన్ బకాయి కూడా పేరుకు పోయివుంది. అందువల్ల మీరు ఖచ్చితంగా క్యాష్  మాత్రమే కట్టాల్సి వుంటుంది
ఓ షిట్! ************
సర్! మీరు అసభ్యంగా మాట్లాడుతున్నారు. అసలే  మీ మీద బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో ఒక కేసు నమోదయి వుంది. మూడు రోజుల క్రితం బార్ నుంచి కారులో వస్తూ పోలీసులకు పట్టుపడి వాళ్ళతో తగాదా పెట్టుకున్నారని రికార్డ్ చెబుతోంది. కాబట్టి మరో కేసుకు అప్పుడే తొందర పడవద్దని మర్యాద పూర్వకంగా సలహా ఇస్తున్నాను.
ఓ! షి..... వద్దులే. మీ టిఫిన్ వద్దు నా పిండా కూడూ వద్దు. ఈ పూటకు ఇంట్లోనే ఏదో వండుకు తింటాం తల్లీ!
అదిగో సర్! అదే వద్దన్నాను. తల్లి  ఏమిటి తల్లి! బల్లి లాగా...
ఇవతల వ్యక్తి  పరిస్తితి చెప్పక్కరలేదు. ఊహించుకోవచ్చు. ఏదో చిత్రంలో బ్రహ్మానందం పాత్ర మాదిరిగా కింద పడి గిల గిలా కొట్టుకుంటున్నాడు. 
NOTE:  Courtesy Image Owner 

17, జనవరి 2015, శనివారం

రాజకీయాల రంగూ రుచీ మార్చిన యన్టీయార్

PUBLISHED IN 'SURYA'TELUGU DAILY IN ITS EDIT PAGE ON 18-01-2015,SUNDAY
(జనవరి, 18 యన్టీఆర్ వర్ధంతి) 


యన్టీయార్ అని అభిమానులు ముచ్చటగా పిలుచుకునే నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో కొందరు తెలుగు దేశం నాయకులు ఆయన్ని కలిసి, 'పలానా జిల్లా ఎస్పీ ని బదిలీ చేయాల'ని  కోరారు. వారిని యన్టీయార్ రెండే రెండు ప్రశ్నలు అడిగారు.
"ఆ పోలీసు అధికారి అవినీతి పరుడా? చేతకానివాడా?"
కాదన్నారు వాళ్లు.
"మరేమిటి?" సీ.ఎం. అరా.
"మన పార్టీకి పనికి రాడు" పార్టీ నేతల జవాబు.
"పార్టీకి పనికి రాకపోతే మీకేమిటి నష్టం? పార్టీ పని మీరు చేయండి. ప్రభుత్వం చేయాల్సింది అధికారులు చేస్తారు" సంభాషణ ముగించారు యన్టీయార్.
ఆ ఎస్.పీ. ఎవరో కాదు ఉద్యోగపర్వంలో అత్యంత సమర్ధుడనీ, నిజాయితీపరుడనీ పేరు తెచ్చుకుని తదనంతర కాలంలో పోలీసు డైరెక్టర్ జనరల్ గా పదవీ విరమణ చేసిన ఐ.పీ.ఎస్. అధికారి శ్రీ  ఏ.కే. మహంతి. ఒక టీవీ ఛానల్ చర్చలో ఆయనే ఈ ఉదంతం వెల్లడించారు.
రాష్ట్ర రాజకీయ చరిత్రలో యన్టీయార్ ది ఒక ఉత్కృష్ట అధ్యాయం. రాజకీయాల దశను దిశను ఆయన ఒక మలుపు తిప్పారు. నిజం చెప్పాలంటే రాజకీయాల రంగూ, రుచీ మార్చారు. సమాజంలో కొన్నివర్గాలకే పరిమితమైవున్న రాజకీయ అవకాశాలను  బడుగు బలహీన వర్గాలకు సైతం అందుబాటులోకి తెచ్చారు. ఒక ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయుడు, ఒక సామాన్య గృహిణి, ఒక లాయరు, ఒక చిన్న వ్యాపారి ఇలా అనేకమంది ఆయన హయాములో  ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మంత్రులు కాగలిగారు. మొత్తం రాజకీయ రంగం రూపురేఖలు మారిపోయింది కూడా యన్టీయార్ తెలుగుదేశం పేరుతొ ఒక ప్రాంతీయ పార్టీని పెట్టిన తరువాతనే.     
 తెలుగుదేశం పార్టీ తొలిసారి ఎన్నికల కురుక్షేత్రంలో అడుగుపెట్టి, తొలి అడుగులోనే విజయభేరి మోగించి 1983 లో అధికారంలోకి వచ్చింది. ఈ అపూర్వ విజయానికి ఎన్టీ రామారావు వ్యక్తిగత ఆకర్షణ, గత కాంగ్రెస్ పాలనపై ప్రజలకు కలిగిన ఏష్టత ప్రధానంగా దోహదం చేసాయి. రాష్ట్రావతరణం నుంచి ఏకఛత్రాధిపత్యంగా సాగుతూ వచ్చిన కాంగ్రెస్ పాలనకు గండి పడింది. అంతవరకూ ప్రాంతీయ పార్టీల పొడ ఎరుగని తెలుగు ఓటర్లు, 'తెలుగుజాతి ఆత్మ గౌరవం' నినాదంతో ముందుకు వచ్చిన  తెలుగుదేశం పార్టీకి అఖండ విజయం కట్టబెట్టారు. రాజకీయాల్లో తొమ్మిది మాసాల పసికూన తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికల్లో 203  స్థానాల్లో విజయ బావుటా ఎగురవేసింది. పాలకపక్షం అయిన కాంగ్రెస్ 60  సీట్లకే పరిమితమయింది. ఈ అసాధారణ విజయంతో ఎన్టీయార్ ప్రతిభ దేశం నలుమూలకు పాకింది.
అంతవరకూ తెలుగు సినీ పరిశ్రమను ఏలిన శ్రీ రామారావుకు, రాజకీయరంగంలో సయితం లభించిన ఈ ప్రజాకర్షణ ఆత్మ స్తైర్యాన్ని మరింత పెంచింది. ఈ విజయం వల్ల వొనగూడిన ఆత్మవిశ్వాసంతో ఆయన మరింత దూకుడు ప్రదర్శించి జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ వ్యతిరేకులను కూడగట్టి ఆ పార్టీకి రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పాటుచేయాలనే ఉద్దేశ్యంతో పావులు కదిపారు. సహజంగానే ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాలను దెబ్బతీసింది. 'కేంద్రం ఒక మిధ్య' అని అభివర్ణిస్తూ, 'కేంద్ర పెత్తనాన్ని ఇక సహించేది లేదు' అనే రీతిలో తెలుగుదేశం అధినేత  ప్రదర్శించిన ధిక్కార ధోరణి యన్టీయార్ కు జనబాహుళ్యంలో మరింత ఆదరణను, రాజకీయాల్లో మరిన్ని నిరసనలను సంపాదించి పెట్టింది. పైకి అహంభావంగా కానవచ్చే ఎన్టీయార్ మనస్తత్వం, స్వపక్షంలోనే విపక్షం పురుడుపోసుకోవడానికి ఉపకరించింది. ఏడాది తిరక్కుండానే ఆయన మంత్రివర్గంలోని సీనియర్ మంత్రి శ్రీ నాదెండ్ల  భాస్కరరావు నాయకత్వంలో జరిగిన తిరుగుబాటు ఆగస్టు సంక్షోభం రూపంలో శ్రీ రామారావు పదవికే ముప్పుతెచ్చింది. దరిమిలా జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం నిద్రాణంగా వున్న తెలుగుప్రజల రాజకీయ చైతన్యాన్ని మళ్ళీ కొత్త చిగుళ్ళు తొడిగించింది. రాష్ట్ర రాజకీయాన్ని ఓ మలుపు తిప్పి సరికొత్త రాజకీయాలకు తెర తీసింది. ఎన్నికల ద్వారా కాకుండా ఎన్నికయిన సభ్యులను తమ వైపు తిప్పుకుని, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వాలను అడ్డదోవలో కూలదోసే దుష్ట సంస్కృతి అప్పటినుంచే తెలుగు రాజకీయాల్లో వేళ్ళూనుకుంది. ఈనాడు యధేచ్చగా సాగిపోతున్న పార్టీ మార్పిళ్ళ రాజకీయాలకు ఆనాడే బీజం పడింది. తెలుగుదేశం పార్టీ అవిర్భావంవల్ల రాజకీయాలు ఎంతగా చైతన్యవంతం అయ్యాయో, ఎంతగా బడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం పెరిగిపోయిందో, అంతే స్థాయిలో రాజకీయాలు కాలుష్య కాసరాలు  కావడం, నైతిక విలువలు దారుణంగా  క్షీణించడం ఇటువంటి అవలక్షణాలు అన్నీ అలాగే పెరిగిపోయాయి అనడం  సత్య దూరం కానేరదు. ఈ మంచి చెడులకు  రామారావు గారిని బాధ్యుడిని చేయడం కూడా సమజసం కాదు. ఎందుకంటే అయన తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రాజకీయాల పట్ల ఆయనకు ఒక నిర్దుష్టమైన అవగాహన వుండేది. ఆయన్ని బాగా ఎరిగినవారికీ, సన్నిహితంగా మెలిగిన  అధికారులకు, కొందరు విలేకరులకు  ఈ విషయం ఎరుకే. దానికి మహంతి వంటి సీనియర్ పోలీసు అధికారులే ప్రత్యక్ష సాక్షులు.  ఆ  ఉదంతంతో ఈ వ్యాసాన్ని మొదలు పెట్టిన కారణం కూడా అదే.
ఏ కాంగ్రెస్ పార్టీని యన్టీయార్ సకల పాపాలకు కూపంగా అభివర్ణిస్తూ వచ్చారో, చివరికి ఆయన స్థాపించిన తెలుగు దేశం పార్టీలో  సయితం అవే అవలక్షణాలు చోటు చేసుకోవడాన్ని ఆయన కళ్ళారా గమనించారు. కానీ, ప్రస్తుత రాజకీయాల్లో చేయగలిగింది ఏమీ లేదని అందరూ నాయకుల్లాగానే అయన కూడా సమాధానపడ్డారేమో తెలియదు. కానీ తను నమ్మిన విషయాల్లో యన్టీయార్ కు వున్న చిత్తశుద్ధిని ఆయన వ్యతిరేకులు కూడా సందేహించలేరనేది మాత్రం వాస్తవం.
గతం తవ్వడం వల్ల ప్రయోజనం వుండదు. అయితే సినిమాల్లో, రాజకీయాల్లో తనదయిన శైలితో ప్రకాశించిన శ్రీ రామారావు గారి జీవితం 'ముగింపు' మాత్రం చాలా బాధాకరం. ఆయన అభిమానులు, వ్యతిరేకులు సైతం ఖేధపడే రీతిలో ఆయన మరణించడం  విధి వైపరీత్యం. చనిపోయిన తరువాత నేల ఈనినట్టు రాష్ట్రం నలుమూలలనుంచి తరలివచ్చిన అశేష జనవాహినిని చూసిన ప్రతి ఒక్కరూ,   జనం గుండెల్లో ఆయన ఎంతగా గూడుకట్టుకుని వున్నారో అర్ధం చేసుకుని వుంటారు.                
చనిపోయినవాడి కన్నులు చారడేసి అని సామెత. పోయినవాళ్ళను గౌరవంగా తలచుకోవడానికి అలా అంటారు. బతికివున్నప్పుడు కూడా అదేవిధమైన గౌరవ,ప్రతిపత్తులు, మర్యాద మన్ననలు సంపాదించుకున్నవాళ్ళు మరింత అదృష్టవంతులు. ఆ కోవకు చెందిన వ్యక్తుల్లో మొట్టమొదట స్మరించుకోదగినవారు యన్.టీ. రామారావు గారు.

ఆయన చనిపోయి ఈనాటికి (జనవరి, 18) పందొమ్మిదేళ్లు గడిచిపోయాయి.  ఒకరకంగా అప్పటికీ ఇప్పటికి  ఒక తరం మారిపోయింది. అయినా తెలుగు ప్రజల గుండెల్లో ఆయన స్మృతి పదిలంగానే వుంది. (18-01-2015)

16, జనవరి 2015, శుక్రవారం

అమెరికా పత్రిక్కి ఎక్కిన తెలుగు అత్తాకోడళ్ళ అనురాగాలు


అమెరికా పశ్చిమ భాగంలో వున్న సియాటిల్ కి దాదాపు మూడువందల మైళ్ల దూరంలో వుంది  స్పోకెన్ నగరం. లోగడ హైదరాబాదు ఆలిండియా రేడియోలో నా సహోద్యోగిగా పనిచేసిన పవని విజయలక్ష్మి ఆమె భర్త బాలాజీ ఉద్యోగరీత్యా ఆ నగరంలో వుంటున్నారు. అక్కడ వాళ్లు చూడ ముచ్చటయిన ఇల్లు కొనుక్కున్నారు. అమెరికాలో ఇది ఏమంత విచిత్రం ఏమీ కాదు. వాళ్లకు విచిత్రం అనిపించిన విషయం వేరే వుంది. అదేమిటంటే  బాలాజీ తలిదండ్రులు హైదరాబాద్ నుంచి వచ్చి కొడుకూ కోడలి దగ్గర ఆరు నెలలు వుండి తిరిగి ఇండియాకు వెళ్లారు. వేరు కాపురం పెట్టుకున్న కొడుకు దగ్గర తలిదండ్రులు అన్ని నెలలు గడపడం అక్కడి అమెరికన్లకు ఎంతో వింతగా అనిపించింది. ఆ నోటా ఈ నోటా పడి ఈ సంగతి ఆ నగరం నుంచి వెలువడే ప్రసిద్ధ దినపత్రిక  'స్పోక్స్ మన్ రివ్యూ'  పత్రిక విలేఖరి రెబెక్కా నప్పీ చెవిన పడింది. ఇంకేముంది ఆమె అమాంతం విజయలక్ష్మి అడ్రసు కనుక్కుని ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేసి మొత్తం ఫామిలీ ఫొటోలతో సహా మొదటి పుటలో ప్రచురించింది.

ఈ నేపధ్యం అంతా ఎందుకంటే ఈ విజయలక్ష్మి ఇవ్వాళ ఇల్లు వెతుక్కుని మరీ మా ఇంటికి వచ్చింది. లోగడ హైదరాబాదులో వున్నప్పుడు ఆవిడకు మా ఆవిడకు మంచి పరిచయం. మేము అమెరికా వెళ్ళినప్పుడు కూడా వాళ్ల వూరు వెళ్ళాము. కూర్చున్నది కాసేపయినా గలగలా ఎన్నెన్నో కబుర్లుచెప్పి వెళ్ళింది. స్నేహమంటే ఇదే కదా అనిపించింది.

రేపో ఎల్లుండో తిరిగి వెళ్ళే హడావిడిలో కూడా గుర్తు పెట్టుకుని మరీ మా ఇంటికి వచ్చింది పవని విజయలక్ష్మి. ఆమె సహృదయతకు ధన్యవాదాలు.