14, జనవరి 2015, బుధవారం

అది అదే! ఇది ఇదే!


కొన్ని విషయాలు విన్నప్పుడు కొన్ని పాత సంగతులు గుర్తుకు రావడం సహజం.
మూడు దశాబ్దాల క్రితం నా మొదటి  విదేశీ ప్రయాణం. పాత  సూట్ కేసులో బట్టలు సర్దుకుని వెళ్లి, వచ్చేటప్పుడు కొత్త సూటుకేసు కొనుక్కుని తిరిగివస్తే లగేజి బరువు కొంత  కలిసి వస్తుందని  మిత్రుడు ఒకరు  చెప్పిన మాట విని ఓ పరమ చెత్త సూటుకేసుతో సింగపూరులో  దిగబడ్డాను. అప్పటివరకు బేగం పేట ఎయిర్ పోర్ట్, ఢిల్లీ ఎయిర్ పోర్ట్ మాత్రమె చూసిన అనుభవం. అదే కళ్ళతో సింగపూరు ఎయిర్ పోర్ట్  చూసినప్పుడు కళ్ళు గిర్రున తిరిగాయి.  కొత్తగా  నిర్మించిన ఎయిర్ పోర్ట్ మాదిరిగా తళతళలాడి పోతోంది. ఊళ్ళోకి తీసుకెళ్ళాల్సిన బస్సుకు కాస్త  వ్యవధానం ఉండడంతో ఇంగ్లీష్ వచ్చిన ఓ పెద్దమనిషితో మాటలు కలిపాను. ఎయిర్ పోర్ట్ గొప్పతనం గురించి ప్రస్తావిస్తే, అతడు తాపీగా విని, 'మరో మూడు నెలలు ఆగి రండి. అప్పటికి కొత్త ఎయిర్ పోర్ట్ తయారవుతుంది' అన్నాడు చాలా సింపుల్ గా. బదులు ఏం చెప్పాలో  తోచక, 'కాస్త ఈ  సూట్ కేసు చూస్తుంటారా, ఇప్పుడే బాత్ రూమ్ కి వెళ్లి వస్తాను' అన్నాను నా లగేజి  చూపిస్తూ.
'అక్కడ వుంచి మూడు రోజుల తరువాత రండి. అదక్కడే వుంటుంది' అన్నాడతను మరింత తాపీగా.
ఈ పాత సంగతి ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చిందంటారా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంట బెట్టుకుని వెళ్ళిన సింగపూరు బృందంలోని  ఒకరు తిరుమల కాటేజీలో  లాప్ టాప్ వుంచి దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి అది గల్లంతయిందని ఈరోజు పత్రికల్లో చదివినప్పుడు, అలనాటి నా సింగ పూరు అనుభవం స్పురణకు వచ్చింది. 


ఇటువంటి విషయాల్లో సింగపూరుని  మోడల్ గా తీసుకుంటే ఎంతో బాగుంటుంది కదా అనికూడా అనిపించింది.

(Note: Image Courtesy Andhra Jyothy, Dated 14-01-2015)

13, జనవరి 2015, మంగళవారం

బొటనవేలి కధ


చదువు రానివాళ్ళని, సంతకం చేయడం తెలియనివాళ్ళని అంగుష్టమాత్రులని సంస్కృతంలో, నిశానీగాళ్ళని సంకర భాషలో, వేలిముద్రగాళ్ళని అచ్చ తెలుగులో ఎద్దేవా చేస్తుంటారు. కాని వారికి తెలియంది ఒకటుంది. వేలెడు బొటనవేలే కదా అనుకోకండి దానికి కూడా బోలెడు చరిత్ర వుంది సుమా!
ఒక్కసారి అరచేయి ఎలావుంటుందో, అందులో వేళ్ళ అమరిక ఎలా వుంటుందో గమనించండి. చూపుడు వేలు, మధ్యవేలు, ఉంగరం వేలు, చిటికిన వేలు పక్కపక్కన వుంటే ఒక్క బొటనవేలు ఒక్కటే విడిగా వుంటుంది. ఆ ఒక్కటి లేదనుకోండి ఇంతోటి నాగరీకం ఉండేదే కాదు. మనుషులందరూ పాత రాతియుగంలోనే ఉండిపోయేవారు. బొటనవేలు ప్రాశస్త్యం తెలిసిన వాడు కనుకనే ద్రోణాచార్యుడు ఆ వేలిని గురుదక్షిణగా ఇమ్మంటాడు తన శిష్యుడు కాని ఏకలవ్యుడిని. ప్రియ శిష్యుడు అర్జునుడికి పోటీ అతడొక్కడే అని గ్రహించిన ద్రోణుడు బొటనవేలును గురుదక్షిణగా కోరి ఏకలవ్యుడిని శాశ్వితంగా  విలువిద్యకు దూరం చేసినట్టు పురాణ కధనం.

నిజమే. మనిషికి బొటనవేలు అనేది లేకపోతే చేతికి పట్టు చిక్కదు. దేన్నీ పట్టుకోలేదు. పట్టుకోలేకపోతే ఇన్నిన్ని విద్యలు అతగాడికి అలవడేవి కావు. ఒక చేత్తో రాతిని పట్టుకుని మరో రాతితో దాన్ని కొట్టి నిప్పు రాజేసిన విధానమే  ఆదిమజాతి మనుషుల జీవితాలనే  సమూలంగా మార్చివేసింది. మొత్తం నరజాతి చరిత్రనే పెద్ద మలుపు  తిప్పింది. ఆయుధం పట్టాలన్నా, అన్నం తినాలన్నా, అసలు ఏపని చేత్తో చేయలన్నా బొటనవేలే కీలకం. మనిషి చేతికి  ఆ బొటనవేలే లేకపోతే మానవుడు ఇప్పటికీ ఆదిమ మానవుడి మాదిరిగానే మిగిలిపోయి ఉండేవాడని సూతుడు సౌనకాది మునులకు చెప్పగా వారిలో ఒకండు ఆ విషయాన్ని భవదీయుడితో పంచుకోవడం జరిగింది.

మంగళం మహత్! శ్రీ! శ్రీ! శ్రీ!  
NOTE: Courtesy Image Owner       

12, జనవరి 2015, సోమవారం

శాశ్వితమైనది అశాశ్వితమొక్కటే


ఆశాశ్వితమైనదానిని శాశ్వితమని నమ్మడం మానవ సహజం. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శ్రీ మోహన్ కందా ఇందుకు సంబంధించి ఒక విషయం చెబుతుండేవారు. 'ప్రభుత్వ  అధికారులకు పలానా రోజు పదవీ విరమణ చేయాల్సి వుంటుందని బ్రహ్మలిఖితం మాదిరిగా ముందే రాసివుంటుంది. అయినా ఆఖరు రోజు దగ్గర పడుతున్నా కూడా ఆ పదవి శాశ్వితమనే భ్రమలోనే వారుంటార'ని ఆయన అనేవారు. కందా గారి అభిప్రాయం రాజకీయ నాయకులకి కూడా వర్తిస్తుంది.    
కాకపొతే వారిది ఓ విధంగా విచిత్ర మనస్తత్వం. 'వుంటే పదవిలో అయినా వుండాలి. పదవి లేకపోతే వార్తల్లో అయినా వుండాలి' అనేది వారి తత్వం.
వై.యస్.ఆర్.సీ.పీ. అధ్యక్షుడు వై.యస్.జగన్ మోహన రెడ్డి ప్రస్తుతం అధికారంలో లేరు. విభజిత ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో  ప్రస్తుతం ఆయన పాత్ర  ప్రతిపక్ష నాయకునికే పరిమితం. పాత్రను మార్చగలిగే శక్తి కేవలం ఎన్నికలకు మాత్రమే  వుంది. అవీ ఇప్పట్లో లేవు. 2019 దాకా ఆగాలి. అయినా సరే ఇటీవల ఆయన కొన్ని  విచిత్రమైన వ్యాఖ్యలు
చేసారు.

'చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ రెండేళ్ళలోనే అధికారం కోల్పోతుందని, ఒకవేళ పూర్తి కాలం పాలించినా తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుందనీ, ఏకంగా ముప్పై ఏళ్ళపాటు జనరంజకంగా పాలించి జనం గుండెల్లో శాశ్వితంగా నిలిచిపోతాన'నీ ఆయన వ్యాఖ్యల  సారాంశం.
ఒక రకంగా చూస్తె ఇది కొత్త విషయం ఏమీ కాదు. నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా అయన ఈ సంగతి పలుమార్లు చెప్పారు.
జగన్ వ్యాఖ్యలు సహజంగానే టీడీపీలో కలకలం రేపాయి. రకరకాలుగా ప్రతి వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. అవి ఇక్కడ అప్రస్తుతం. ఎందుకంటె ఏ రాజకీయ నాయకుడయినా తను అధికారంలోకి రావాలనీ, ఆ  అధికారం కూడా  శాశ్వితమనే అనుకుంటాడు. అందులో అసహజమేమీ లేదు. ఈ విషయంలో మినహాయింపు ఇవ్వగల రాజకీయ నాయకుడు ఎవ్వరూ ఈ రోజుల్లో కలికానికి కూడా దొరకరు. ఏదో ఒక విధంగా, ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరూ తమ అధికారం సుదీర్ఘ కాలం సాగాలనే తమ మనసులోని మాటను చెప్పకనే చెబుతుంటారు. అయిదేళ్ళ కాల వ్యవధికి ప్రజలు అధికారం ఇస్తే ముప్పయ్యేళ్ళ ప్రణాళికలు గురించి మాట్లాడుతుండడం దీనికి ఒక ఉదాహరణ.
ఇది సరే! అధికారాన్ని పదికాలాలపాటు పదిలంగా కాపాడుకున్న  నాయకులు కూడా చరిత్రలో వున్నారు. చరిత్రలో ఎందుకు, సిక్కిం ప్రస్తుత ముఖ్యమంత్రి పవన్ చాల్మింగ్ నే తీసుకోండి. నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన విజయబావుటా ఎగురవేసి అయిదోమారు ముఖ్యమంత్రి కాగలిగారు. ఇప్పటికే అంటే 1994  డిసెంబరు 12 వ తేదీన మొదటిసారి  ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటినాటినుంచి దరిమిలా అయిదేళ్ళకోమారు జరిగిన ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తూ నాలుగు పర్యాయాలు అంటే ఏకంగా ఇరవై ఏళ్ళు రాష్ట్రాన్ని  పాలించిన ఘనత పవన్ చాల్మింగ్ ఖాతాలో వుంది. ఈసారి అయిదేళ్ళు పూర్తయితే సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన జ్యోతిబసు రికార్డును ఆయన అధిగమిస్తారు. ముఖ్యమంత్రిగా రజితోత్సవం జరుపుకోగల అరుదయిన అపూర్వమయిన ఘనత ఈ సిక్కిం నాయకుడిదవుతుంది.
పొతే,  జ్యోతిబసు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా (1977-2000) వరుసగా ఇరవై మూడు సంవత్సరాల మూడున్నర మాసాలు  పాలించారు. అదీ సీపీఎం నాయకత్వంలోని వామపక్ష కూటమి ముఖ్యమంత్రిగా. వార్ధక్య కారణాలతో పదవి నుంచి తనకు తానే తప్పుకున్నారు. ఇది కూడా  చాలా అరుదయిన విషయమే.
ఇంత సుదీర్ఘ కాలం కాకపోయినా, వరసగా మూడు పర్యాయాలు ముఖ్యమంత్రులయిన వారు మరో ఆరుగురు వున్నారు. వీరిలో ముగ్గురు, శ్రీమతి షీలా దీక్షిత్, (ఢిల్లీ), శ్రీ తరుణ్ గగోయ్,(అసోం), ఓక్రామ్ ఇబోబి సింగ్ -  కాంగ్రెస్ వారే  కావడం విశేషం. పొతే మిగిలిన ముగ్గురిలో ఒకరు ప్రస్తుత భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ, బీజేపీ,  (గుజరాత్, 2001 - 2014) శ్రీ మాణిక్ సర్కార్, సీపీఎం (త్రిపుర), శ్రీ నవీన్ పట్నాయక్, బీజేడీ, (ఒడిషా).
ఈ జాబితాలో చేరినవారు  మరికొందరు వున్నారు.
శ్రీ మోహన్ లాల్ సుఖాడియా, కాంగ్రెస్ (రాజస్తాన్, పదహారు సంవత్సరాల ఎనిమిది మాసాలు, 1954 - 1971)
శ్రీ గెగాంగ్ అపాంగ్ (అరుణాచల్ ప్రదేశ్, 1980 - 1999)
శ్రీ బీ.సీ. రాయ్ (కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్, 1948 - 1962)
శ్రీ  కామరాజ్ నాడార్ (కాంగ్రెస్, తమిళ్ నాడు, 1954 - 1963)
శ్రీ వసంత రావు నాయక్ (కాంగ్రెస్, మహారాష్ట్ర, 1963 - 1975)
శ్రీ ఎం.జీ. రామచంద్రన్ (అన్నా డీ.ఎం.కే., తమిళ్ నాడు, 1977 - 1987)
తెలుగు రాష్ట్రం ప్రత్యేకించి మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం అయిన ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ లో శ్రీ చంద్రబాబునాయుడికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు వుంది. ఆయన వరసగా రెండు దఫాలు, 1995 సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి  2004 మే నెల 13 వరకు తిరిగి మూడో సారి 2014 జూన్  8 నుంచి ఈరోజు వరకు మొత్తం 3600 రోజులు అధికారంలో వున్న ఘనత సంపాదించుకున్నారు. 2009 వరకు  సుదీర్ఘకాలం పాలించిన  రికార్డు అంతవరకు చంద్రబాబు పేరిటే వుండేది.  ఆ ఏడాది రాజశేఖరరెడ్డి రెండో పర్యాయం ముఖ్యమంత్రి అయినప్పుడు,   అయిదేళ్ళ తరువాత, మొత్తం పదేళ్ళ పాలనాకాలం పూర్తిచేసుకుని   వైయస్సార్ దాన్ని  అధిగమించే అవకాశం ఉంటుందని  భావించారు. అయితే దురదృష్టవశాత్తు హెలికాప్టర్ దుర్ఘటనలో వైయస్సార్ ఆకస్మికంగా కన్నుమూయడంతో ఆయన మొత్తం 1938 రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేయగలిగారు. ఇక ముందు ముందు రాజకీయ సుస్థిరతకు రోజులు చెల్లిపోయి,  సంకీర్ణశకం రాజకీయాలే రాజ్యమేలే అవకాశాలు ఉన్నందువల్ల, మూడో టరం కూడా ముఖ్యమంత్రిగా  ఎన్నికయిన చంద్రబాబు రికార్డును భవిష్యత్తులో  తిరగరాయడం ఎవరికయినా  కష్టసాధ్యమే కాగలదు. వీరిద్దరి తరువాత మూడో స్థానంలో కాసు బ్రహ్మానంద రెడ్డి (2777 రోజులు) వున్నారు. ఎన్టీయార్ సయితం 2751 రోజులే సీ.ఎమ్. పీఠం మీద ఉండగలిగారు.
చాలాకాలం ముఖ్యమంత్రులుగా పనిచేసి కొందరిలా చరిత్రపుటలకు  ఎక్కితే మరికొందరు మరో రకంగా చరిత్ర సృష్టించారు. కాళ్ళ పారాణి సామెత చందంగా అలా ప్రమాణ స్వీకారం చేసి ఇలా గద్దె దిగిపోయిన బాపతు. వీరిలో ముందు చెప్పుకోవాల్సింది జగదంబికా పాల్ గురించి. ఎక్కడా విన్నట్టు కూడా అనిపించని ఈ పేరుగల ఆసామీ ఉత్తర ప్రదేశ్ వంటి అతిపెద్ద రాష్ట్రానికి అతి పిన్నకాలం - 'మూడంటే మూడు రోజులు' ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1998 ఫిబ్రవరి 21 న అప్పటి యూపీ గవర్నర్ రొమేష్ భండారీ,  కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని బర్తరప్ చేయడంతో జగదంబికా పాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. గవర్నర్ నిర్ణయాన్ని కళ్యాణ్ సింగ్ సుప్రీం కోర్టులో సవాలు చేసారు. సింగ్ తొలగింపు రాజ్యాంగ విరుద్ధం అని సర్వోన్నత న్యాయస్థానం  నిర్ణయించడంతో మూడో రోజునే జగదంబికా పాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. కళ్యాణ్ సింగ్ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఇక బీహారులో సతీష్ ప్రసాద్ సింగ్ అనే పెద్దమనిషి అయిదే రోజులు ముఖ్యమంత్రి వైభోగం అనుభవించారు.  1968 జనవరి 28 న ముఖ్యమంత్రి అవడం, ఫిబ్రవరి ఒకటో తేదీకల్లా పదవి నుంచి దిగిపోవడం చకచకా జరిగిపోయాయి. కాకపొతే అసలు ముఖ్యమంత్రి ఎంపికలో జరిగిన ఆలస్యం ఆయనకి  ఆవిధంగా కలిసివచ్చింది. మేఘాలయలో యస్ సీ మారక్ 1998 ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి మూడో తేదీ వరకు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నారు. ఒకానొక కాలంలో  అక్కడ రాజకీయ అనిస్థితి ఏ దశకు చేరుకుందంటే,  'విందు భోజనాల్లోనే రాత్రికి రాత్రే  ముఖ్యమంత్రులను మార్చే స్థాయికి వెళ్లిందని హాస్యోక్తిగా  చెప్పుకునేవారు.
ఇక దక్షిణాదిన తమిళనాడులో ఎమ్జీ రామచంద్రన్  మరణానంతరం ఆయన భార్య జానకీ రామచంద్రన్ ఆయన స్థానంలో ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆవిడ ఆ పదవిలో, 1998 జనవరి ఏడోతేదీ  నుంచి జనవరి ముప్పయ్యోతేదీ వరకు, ఇరవయ్ నాలుగు రోజులు మాత్రమే ఉండగలిగారు.
ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఈ విశిష్ట స్థానం  లభించింది. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు నేతృత్వంలో తొట్టతొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి రోజుల్లోనే అప్పటి గవర్నర్ శ్రీ రాం లాల్,  ఎన్టీయార్ ని తొలగించి శ్రీ నాదెండ్ల భాస్కర రావుని  ముఖ్యమంత్రి పీఠం ఎక్కించారు. అప్పుడు రగిలిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం దరిమిలా ఆయన నెల రోజుల్లోనే (1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు  16 )  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. శ్రీ రామారావు సరిగ్గా నెల తిరిగేసరికల్లా మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగారు.
ఇటువంటి ఉదంతాలు  మరికొన్ని వున్నాయి. బీహారు ముఖ్యమంత్రిగా బీపీ మండల్ 31 రోజులు (1968), కేరళలో మహమ్మద్ కోయా 45 రోజులు (1979), హర్యానాలో ఓపీ చౌతాలా 20  రోజులు (1989 ) ముఖ్యమంత్రి పదవిని వెలగబెట్టారు.
అయినా పదవిలో ఎన్నాళ్ళు వున్నామన్నది కాదు లెక్క. ప్రజలకు పనికొచ్చే పనులు ఎన్ని చేసామన్నదే చివరికి  లెక్కలోకి వచ్చే ముక్క.  
ఎవరో వేదాంతి చెప్పినట్టు శాశ్వితమైనది అశాశ్వితమొక్కటే. (12-01-2015)
NOTE: Courtesy Image Owner

11, జనవరి 2015, ఆదివారం

నాలుగు, ఆ పక్కన అయిదు సున్నాలు



4,00000
అంటే అక్షరాలా నాలుగు లక్షలన్నమాట.
అంటే ఏమిటంటే.
నా సొంత బ్లాగు
http://bhandarusrinivasarao.blogspot.in/  
కు
ఈరోజు వరకు వచ్చిన హిట్లన్న మాట.
అందుకోండి అందరూ నాలుగు లక్షల ధన్యవాదాలు

-భండారు శ్రీనివాసరావు 



(NOTE: Courtesy Cartoonist)

ప్రచార భారత్ !


ఈ ఫోటోలో రోడ్డు చూడండి,  అద్దం మాదిరి శుభ్రంగా  వుంది. చీపుళ్ళు చేతబట్టి ఎందుకు వూడుస్తున్నారో అర్ధంకావడంలేదు. ఇదే ప్రచారార్భాటం అంటే.



(NOTE: Photo Courtesy Image Owner)

10, జనవరి 2015, శనివారం

ప్రశ్నోపనిషత్ అను అదే తల, అదే రాయి



నాయనా ఏకాంబరం నేను అడిగిన దానికి అడిగినట్టు సమాధానము చెప్పుము …”
అటులనే గురువుగారూ!
జనవరి నెల తరువాత ఏ నెల వచ్చును?”
ఫిబ్రవరి వచ్చును
కరెక్ట్‌ ఆన్సర్‌! నువ్వో కొవ్వత్తి గెలుచుకున్నావు. బైదిబైఇంత టఫ్‌ ప్రశ్నకి అంత ఈజీ సమాధానం చెప్పావంటేనాకు భలే ముచ్చటేస్తోంది. నా పదహారో ఏడు వరకు నా పేరు కూడా నేను సరిగ్గా చెప్పలేకపోయే వాణ్ణి. కాబట్టి, కావున, అంచేత నువ్వింత  చిన్న వయసులో ఎంత చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పినా నాకు పిచ్చిపిచ్చిగా ఆనందం కలుగుతుంది. వెర్రివెర్రిగా ఆశ్చర్యం వేస్తుంది. సరే, పొతే....
తరవాతి ప్రశ్నలు చాలా కష్టం ఇంత  తేలిక కాదు సుమా! ఈసారి నేను వరసగా పది ప్రశ్నలు అడుగుతాను. ఠకీఠకీమని సమాధానం చెప్పాలి. రెడీనా!
ఓకే. నేను రెడీ
దానము వల్ల ఏమి వచ్చును?"
చేతి దురద తీరి పుణ్యమువచ్చును
వాగ్దానము వల్ల ఏమి వచ్చును?"
కొండొకచో అధికారము రావచ్చును"
"వచ్చిన పిదప వాగ్దానములను ఏమి చేయవలెను?"
"కట్టగట్టి మరచిపోవలెను"
"ప్రజలు మరవనిచో...?"
"ఆరునూరయినా సరే పాత  వాగ్దానము నెరవేర్చెదమని మరో  కొత్త వాగ్దానము చేయవలెను"
ఆ వాగ్దానము తప్పినచో ఏమి జరుగును?"
ఆందోళన కలుగును"
ఆందోళన ఎందుకు  కలుగును?"
అధికారమునకు ముప్పు వచ్చునేమో అన్న భయము వల్ల కలుగును"
భయము ఎందుకు కలుగును?"
ప్రజాగ్రహము వల్ల కలుగును"
ప్రజాగ్రహము వల్ల ఏమి జరుగును?
"ఎన్నికల్లో అధికారము దూరము కావచ్చును"
"అప్పుడు కిం కర్తవ్యమ్?"
"తిరిగి ప్రజల చెంతకు చేరవలెను"
"చేరి....."
"కొత్త వాగ్దానములు చేయవలెను"
"ప్రజలు నమ్మనిచో..."
"ఆ ప్రశ్న ఉత్పన్నము కాదు. తల పగల గొట్టుకొనుటకు వారికి ఏదో ఒక రాయి కావలెను కదా!'
"సెభాష్‌. చక్కటి జవాబులు చెప్పి  రెండు టార్చి లైట్లు, ఒక చార్జింగ్‌ లాంతరు  గెలుచుకున్నావు. తరవాతి రౌండ్‌లోకి వెళ్ళేముందుకాసేపు కరెంట్‌ కట్‌



NOTE: Courtesy Image Owner 

9, జనవరి 2015, శుక్రవారం

బుడగలు పగిలిపోతాయి జాగ్రత్త!

(Published by 'SURYA' telugu daily on 11-01-2015, SUNDAY)
అర్ధం అయినట్టు అనిపిస్తూ  అర్ధం కానిది అర్ధ శాస్త్రం అన్నాడొక అర్ధ శాస్త్రవేత్త.
చిన్నప్పుడు చందమామ పత్రికలో  సిందుబాద్ యాత్రలు అనే సీరియల్ కధలు వచ్చేవి. వ్యాపారం నిమిత్తం ఆయన పడవలనిండా సరుకులు నింపుకుని విదేశాలకు వెళ్ళి, బోలెడు బోలెడు  లాభాలు గడించి స్వదేశానికి తిరిగి వస్తుండగా సముద్రంలో చెలరేగిన తుపాను కారణంగా వోడ మునిగిపోయి సర్వస్వం కోల్పోవడం,  అతగాడు మాత్రం పట్టు వదలని  విక్రమార్కుడి మాదిరిగా  మొక్కవోని ధైర్యంతో మళ్ళీ మళ్ళీ ప్రయాణాలు చేసి, మళ్ళీ మళ్ళీ వ్యాపారాలు చేసి  పోయిన సిరిసంపదలనన్నింటినీ తిరిగి  కూడగట్టుకోవడం, తిరిగి వోడలు మునిగిపోయో, సముద్రపు దొంగల పాలయ్యో సంపాదించిన సంపాదననంతా పోగొట్టుకుంటూ,  తిరిగి కూడగట్టుకుంటూ -    ఇలా వొళ్ళు గగుర్పొడిచే సంఘటనలతో ఆ కధలు సాగిపోయేవి. చదవడానికి ఎంతో  బాగుండేవి కాని, ఎక్కడో సముద్రంలో తుపానులు వస్తే సిందుబాదు అనే పెద్ద వ్యాపారి వున్నట్టుండి బికారి కావడం ఎందుకో ఏమిటో  చిన్న బుర్రలకు అర్ధం అయ్యేవి కావు.
గత  మంగళవారం. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారికి అమంగళవారం.  సుమారు మూడులక్షల కోట్ల రూపాయల మదుపర్ల  సొమ్ము  ఒక్క రోజులో ఆవిరి అయిపోయిందని  తెల్లారి పత్రికల్లో కధనాలు. ఇంత డబ్బు ఒకే ఒక్క రోజులో పోగొట్టుకోవడానికి వాళ్లు ధర్మరాజులా పాచికల జూదం ఆడలేదు. గుర్రప్పందాల జోలికి పోలేదు.  మరి యెందుకు పోయినట్టు అంత డబ్బు.
కారణం విన్నప్పుడు  సిందుబాదు కధ జ్ఞాపకం వచ్చింది.
ఎక్కడో యూరోపు ఖండంలోని గ్రీసు దేశంలో చెలరేగిన  రాజకీయ సంక్షోభం, మనదేశంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలడానికి దారితీసింది (ట). మన దేశంతో పోలిస్తే చాలా చాలా చిన్న దేశం అది.  మొత్తం గ్రీసు దేశపు జనాభా   కోటీ పదిలక్షలు అంటే అర్ధం చేసుకోవచ్చు అదెంత చిన్నదో. సరే.  దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బాగా తగ్గడం కూడా మన దేశంలో మార్కెట్ ప్రతికూలతలకు దోహదపడ్డాయి. ఏమైతేనేం, లక్షలాదిమంది సిందుబాదులు షేర్ మార్కెట్లో 'బేర్ల' చెలగాటంతో బావురుమన్నారు.
మన దేశంలో ఆర్ధిక సంస్కరణలు మొదలయ్యేంత వరకు జనంలో షేర్లు గురించి తెలిసిన వాళ్ళు తక్కువ. పత్రికల్లో కూడా వాటికి ప్రాధాన్యం అంతగా వుండేది కాదు. తెలుగు పత్రికలయితే కేవలం మొక్కుబడిగా తప్పదు అన్నట్టు షేర్ల హెచ్చుతగ్గులకు సంబంధించిన సమాచారం అరకొరగా ఇచ్చేవి. ప్రజలు కూడా అవి తమకు సంబంధించినవి కావు, ఎవరో కలిగినవాళ్ళ వ్యవహారమని అసలు పట్టించుకునే వారు కాదు. కానీ క్రమంగా జనంలో అవగాహన పెరిగింది. పల్లెటూళ్ళలో సయితం 'షేర్ బ్రోకర్లు' పుట్టుకొచ్చారు. తక్కువ మదుపు సమయంలో ఎక్కువ  ఆదాయం ఇచ్చే కల్పవృక్షంగా షేర్ మార్కెట్ జనం దృష్టిలో కనబడసాగింది. ఈ క్రమంలో కొందరేమో  కోట్లకు పడగలెత్తారు. చాలామంది వున్నది పోగొట్టుకుని బజారున పడ్డారు.  

షేర్ మార్కెట్లు కుప్పకూలడం ఇది మొదటి సారీ కాదు. అల్లా అని ఆఖరుసారి కాదు. బాగా అభివృద్ధిచెందిన దేశాల్లో కూడా షేర్ మార్కెట్లు ఢమాల్ అన్న సందర్భాలు చాలా చాలా వున్నాయి.
షేర్ మార్కెట్ అంటేనే ఒక రకంగా పెట్టుబళ్ళ మార్కెట్. పెట్టుబడులు పెట్టడానికి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టక్కరలేదు. మన దగ్గర డబ్బుంటే పెద్ద పెద్ద కంపెనీల్లో షేర్లు కొని పెట్టుబళ్ళు పెట్టొచ్చు. ధర పెరిగినప్పుడు వాటిని అమ్ముకోవచ్చు. ఇలా కొంటూ, అమ్ముతూ లాభాలు కళ్ళ చూడవచ్చు. ఈ ఆశే జనాలను షేర్ మార్కెట్ వైపు పరుగులు తీయిస్తుంటుంది. ఒక్క షేర్లే కాదు రియల్ ఎస్టేట్ కూడా పెట్టుబళ్ళకు పెద్ద  కార్య క్షేత్రంగా  మారింది.
గత రెండు దశాబ్దాలుగా  జనాలను ఇంతగా వెర్రెత్తె౦చిన రంగం మరోటిలేదంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రం రెండుగా చీలిపోవడానికి ముందు హైదరాబాదు చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా విస్తరించింది. వేలల్లో వున్న భూముల ధరలు లక్షల్లోకి, ఆ తరువాత కోట్లల్లోకి ఎగబాకి 'మట్టే బంగారం' అనే మాట  నిజమై కూర్చుంది. ఆర్ధిక సంస్కరణల ప్రభావం, ఐ.టీ. రంగం విస్తరణ ఇందుకు దోహదం చేసాయి. చిన్న చిన్నగా  ఈ రంగంలోకి దిగినవాళ్ళలో అనేకులు చూస్తుండగానే కోటీశ్వరులు కావడంతో అందరి కళ్ళు రియల్ ఎస్టేట్ పై పడ్డాయి. లాభాలు ఇబ్బడిముబ్బడిగా వస్తుండడంతో వాటితో పాటే సకల అవలక్షణాలు సమాజంలోకి వచ్చిపడ్డాయి. రియల్ ఎస్టేట్ దందాలు పెరిగాయి. నేర ప్రవృత్తి కొత్త మొగ్గలు వేసింది. యెంత సంపాదించారు అన్న దానికే కాని ఎలా సంపాదించారు అన్నదానికి విలువ లేకుండా పోయింది.  వ్యాపారం పెరిగిన స్థాయిలోనే, అంతే  వేగంగా నైతిక విలువల పతనం కూడా అదే జోరులో సాగింది.
రాష్ట్ర విభజన అనంతరం  రియల్ ఎస్టేట్ రంగానికి కాస్త కళ్ళెం పడుతుందని ఆశించారు కాని, మనిషి నెత్తురు మరిగిన పులి మల్లే వ్యాపారులు ఒక ముఠా మాదిరిగా మారి చిన్నదో పెద్దదో ఒక గూడు ఏర్పాటు చేసుకోవాలనే సామాన్యుల ఆశలపై నీళ్ళు చల్లారు. ఇప్పుడీ వ్యాపారం ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని ప్రాంతంగా ప్రకటించిన తుళ్ళూరు ప్రాంతం  వైపు మళ్ళింది. పలానా చోట అని స్థల నిర్ధారణ  ఇంకా జరగలేదు కాని ఆ ప్రాంతంలో  భూముల వ్యాపారం మాత్రం తారాస్థాయికి చేరింది. భూయజమానులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నడుమ లావాదేవీలు జరిపే దళారులు పెద్ద సంఖ్యలో పుట్టుకొచ్చారు. మొన్నమొన్నటివరకు బయట వ్యక్తులు ఎవరూ తొంగి చూడని ఆ ప్రాంతంలో ఇప్పుడు ఖరీదయిన కార్లు  సంచారం చేస్తున్నాయి. విజయవాడ, గుంటూరు నగరాలలోని హోటళ్ళు ఈ బేహారులతో నిండిపోతున్నాయి. ఎక్కడ నలుగురు  కలిసినా, ఎక్కడ విన్నా భూముల ధరవరలు గురించిన ముచ్చట్లే. కోట్లకు పెరిగిన భూముల ధరలు గురించిన కబుర్లే.
'పచ్చని పొలాలను అమ్ముకుని నెలవారీ ఆదాయం కోసం ఎదురుచూస్తున్నారా? ప్రతినెలా పదివేలనుంచి పది లక్షల రూపాయల అద్దె వచ్చే బిల్డింగులు అమ్మకానికి వున్నా'యంటూ  ఊరించే ప్రకటనలు ఫ్లెక్సీల రూపంలో దర్శనమిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే, ఈ వార్తా కధనాలు చదువుతుంటే ఎప్పుడో తాతలనాడు  అమెరికాలో సంభవించిన 'పేలిన బుడగ' వృత్తాంతం స్పురణకు వస్తోంది.
దాదాపు వందేళ్ళ నాటి  చరిత్ర. అమెరికా అప్పటికే సంపన్న దేశం. తూర్పున వున్న న్యూ యార్క్ వంటి ప్రాంతాలు అభివృద్ధిపధంలో  తులతూగుతున్న రోజులు.. పౌరుల ఆదాయం బాగా పెరగడంతో వారికి ఉల్లాస జీవితం మీద మక్కువ పెరిగింది. మిగులు డబ్బులతో విహార యాత్రలు మొదలు పెట్టారు. అలాటివారికి  వాతావరణ రీత్యా ఫ్లారిడా ప్రాంతం చాలా అనువయినదిగా కనబడింది. పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండడంతో ఒకప్పుడు నిద్రాణంగా వున్న ప్రాంతం కళకళలాడసాగింది. పర్యాటకులకు కావాల్సిన హోటళ్ళు, ఇతర సదుపాయాలు కల్పించడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడికి ఎగబడ్డారు. చౌకగా భూములు దొరకడం వారికి మొదట్లో కలిసివచ్చింది. క్రమంగా డిమాండు పెరగడం, డానికి తగ్గట్టుగా వ్యాపారుల్లో పోటీ పెరగడం, దానాదీనా భూముల రేట్లకు రెక్కలు రావడం స్వాభావికంగా జరిగిపోయింది.


ఆ ప్రాంతంలో వున్న మియామీ బీచ్ పర్యాటకులకు స్వర్గధామం అనే పేరు తెచ్చుకుంది. దేశంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను ఆ ప్రాంతంపై  పడింది. న్యూ యార్క్ లోని టైం స్క్వేర్ లో కళ్ళు మిరుమిట్లు కొలిపే విద్యుత్ కాంతులతో ఒక పెద్ద ప్రకటన  బోర్డు వెలిసింది. 'జూన్ నెలలో మియామీ చూడనివాళ్ళ  జీవితం వ్యర్ధం' అని అర్ధం వచ్చే భారీ  ప్రకటనలతో ఆకర్షితులయిన పర్యాటకులు పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్ళడం మొదలయింది. కేవలం ఊహాగానాల ప్రాతిపదికగా అక్కడ  భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. పర్యాటకులకు అవసరమయ్యే సకల  సంబారాలు సరఫరా  చేయడానికి దేశం నలుమూలలనుంచి రైలు రోడ్డు మార్గాల ద్వారా  సరుకులను అక్కడికి తరలించేవారు. ఒకానొక సమయంలో ఈ రద్దీ  ఎంతగా పెరిగిపోయిందంటే,  రైళ్ళ రాకపోకలు స్తంభించిపోయే పరిస్తితి ఏర్పడింది. అయిదేళ్ళలో మొత్తం  పూర్తిగా తిరగబడింది. ఊహాగానాలు గాలికి ఎగిరిపోయాయి, అంచనాలు  తప్పిపోయాయి. ఫోర్బెస్ మ్యాగజిన్  ముందుగానే హెచ్చరించింది కానీ,  అప్పటికే  పరిస్తితులు చేయి దాటిపోయాయి. భూముల వాస్తవ ధరలు గురించి ఆలోచించకుండా కేవలం వ్యాపారుల అంచనాలను బట్టి ధరలను పెంచుకుంటూ పోవడం వల్ల మార్కెట్ తలకిందయిపోయింది. మియామీలో భూముల్ని కొని ఒక్క రోజులోనే  పదిరెట్ల లాభానికి అమ్ముకోవచ్చనే ఆశలు అడుగంటాయి. వీటికి తోడు,  ఆ ప్రాంతంలో వచ్చిన హరికేన్ తో పరిస్తితులు పెనం  మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా తయారయాయి. పులిమీద పుట్ర మాదిరిగా  వాల్ స్ట్రీట్ షేర్ మార్కెట్  కుప్పకూలడంతో ఫ్లారిడా ఆర్ధిక పతనం సంపూర్ణమయింది. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి ఫ్లారిడాకు కొన్ని దశాబ్దాలు పట్టింది.
ఇది చరిత్ర.  పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి. అంతే చెప్పేది.

(09-01-2015)