8, అక్టోబర్ 2013, మంగళవారం

ఎందుకిలా జరిగింది? ఎవరిలా చిదిమేశారు?

(ఈరోజు హెచ్.ఎం.ఆర్.ఐ. ఆవిర్భావదినం సందర్భంగా)
కారణం ఎవరయినా జరగరానిది జరిగిపోయింది. మొత్తం ప్రపంచానికే ఆదర్శంగా నిలవాల్సిన ఓ అద్భుత పధకం కొందరి నిర్వాకాలకు నీరుకారిపోయింది. మరి కొందరి స్వార్ధాలకు బలయిపోయింది. ఇంకొందరి ఆహాలను చల్లార్చడానికి మాడి మసయిపోయింది. రాజకీయ చదరంగంలో చిక్కుకుపోయి  ఎత్తులు పైఎత్తులకు  చిత్తయిపోయింది.
ఇంత జరిగినా ఏమీ జరగనట్టే వుండడానికి కారణం వుంది. ఈ పధకం వల్ల లబ్ది పొందుతున్న వారు నిరుపేదలు. వారికి నోరూవాయీ లేదు.
కష్టం వచ్చినా చెప్పుకోలేరు. ఆ కష్టం తొలగినా చెప్పుకోలేరు. ఎందుకంటె చెప్పుకోవడానికి వారికెవరూ లేరు.
వారి గురించి రాసేవారు లేరు. ఎందుకంటె వారిలో చాలా మంది నిరక్షరాస్యులు.
వారి గురించి బుల్లి తెరలపై చూపించేవారు లేరు. ఎందుకంటె అలాటి ఆధునిక సౌకర్యాలకు దూరంగా ఎక్కడో బతుకులీడుస్తున్న బడుగులు వాళ్ళు. అందుకే, ప్రచారానికి పనికిరాని  ఈ పధకం నీరుకారిపోతున్నా ఎవరికీ పట్టలేదు.  
అరయంగా కర్ణుడీల్గె ఆర్గురి చేతన్అన్నట్టు  భ్రష్టుపట్టిపోతున్న ఈ పధకం గురించి తెలుసుకోవాలంటే కొంత నేపధ్యం అర్ధం చేసుకోవాలి.
ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తోంది.ఇందులో సింహ భాగం నిర్వహణ వ్యయం కిందికే పోతోంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు కొంత మేరకు ప్రజల ఆరోగ్య సేవల అవసరాలను తీరుస్తున్నప్పటికీ- డాక్టర్ల కొరత అన్నది ఎప్పటికీ తీరని సమస్యగానే మిగిలిపోతున్నది. మన రాష్ట్రంలో ఎనభయి వేల గ్రామాలుంటేకేవలం పదిహేను వందల చోట్ల మాత్రమే వైద్యులు అందుబాటులో ఉన్నారు. వైద్య కళాశాలలో పట్టా పుచ్చుకున్న ఏ ఒక్కరు కూడా పల్లెలకు వెళ్లి వైద్యం చేయడానికి సిద్దంగా లేరంటే అతిశయోక్తి కాదు. ఇక మందుల విషయం చెప్పనక్కరలేదు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు దూరంగా వున్న పల్లెల్లో నివసించే వారికి ఈ అరకొర సదుపాయం కూడా అందుబాటులో లేదు. నాటు వైద్యుల దయా దాక్షిణ్యాల పైనా, వారిచ్చే నాటు మందుల పైనా  ఆధారపడాల్సిన దీన స్తితి వారిది. బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా అరణ్య ప్రాంతాలలో - అంత సులువుగా చేరుకోలేని కోయ గూడాలులంబాడి తండాల్లో వుండే పేద వారికి రోగం రొస్టూ వస్తే ఇక ఇంతే సంగతులు. అలాటివారు సాధారణంగా షుగరురక్త పోటుఉబ్బసంకీళ్ళ వ్యాధులతో బాధపడుతుంటారు. అసలు ఇలాటి జబ్బులు తమకు వున్నట్టు కూడా వీరికి తెలియదు. ఎందుకంటె ఎలాటి వైద్య పరీక్షలు ఎప్పుడూ చేయించుకుని ఎరుగరు కనుక. రోగం ముదిరి  ఏపక్షవాతానికో దారి తీసేదాకా 'బీపీవున్నట్టు కూడా తెలియదు.

వైద్య ఆరోగ్య శాఖ ఎన్ని నిధులు ఖర్చుచేస్తున్నా ఫలితాలు ఆశాజనకంగా వుండడం లేదు. ఈ శాఖ పేరులో వైద్యం ముందు ఆరోగ్యం తరువాత వున్నాయి. వైద్యం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడడం అనే అర్ధం వుంది. అసలు ప్రజలు ఆరోగ్యంగా వుంటే వైద్యంతో నిమిత్తం ఏముంటుంది. ఇదిగో ఈ ఆలోచనలోనుంచి పురుడు పోసుకున్నదే 104 పధకం.


అప్పటికే - ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం ప్రాతిపదికన ఏర్పాటయిపనిచేస్తున్న -104- ఉచిత వైద్య సలహా కేంద్రం నిర్వాహకులు - హె చ్ ఎం ఆర్ ఐ (హెల్త్ మానేజిమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) వారు ఈసమస్యపై దృష్టి సారించారు. అందుబాటులో వున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు మూడు కిలోమీటర్ల ఆవల వుండే ప్రతి పల్లెకు- నెల నెలా క్రమం తప్పకుండా వెళ్లి - వూరివారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించే వాహనానికి రూపకల్పన చేశారు. 108 అంబులెన్సు ప్రమాదం అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించినదయితే ఈ 104 సంచార వైద్య వాహనం - పేద పల్లె ప్రజల ప్రాణాలు ప్రమాదం అంచుకు చేరకుండా చూస్తుంది. ఇంతా చేసి ఈ పధకం కింద లబ్ది పొందేవారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే- ఒక్కొక్కరిపై పెట్టె ఖర్చు ఏడాదికి కేవలం ఎనభయి రూపాయలు మాత్రమే. అంటే - వైద్య ఆరోగ్య రంగం బడ్జెట్ లో పది శాతం కన్నా తక్కువన్నమాట.
 104 వాహనం ప్రతి నెలా ఒక నిర్దేశిత దినం నాడు క్రమం తప్పకుండా ఒక గ్రామాన్ని సందర్శిస్తుంది. ఇందులో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ముగ్గురు ఏ ఎన్ ఎం లు(నర్సులు)ఒక ఫార్మసిస్టుఒక లాబ్ టేక్నీషియన్ఒక డ్రయివర్తో సహా మొత్తం ఏడుగురు సిబ్బంది వుంటారు. బయో మెట్రిక్ పద్దతి ద్వారా రోగుల వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు. గర్భిణీ స్త్రీలనుబాలింతలను పరీక్షించి మందులు ఇస్తారు. గర్భిణి కడుపులో పిండం పెరుగుదలను నెలనెలా గమనిస్తూ తగిన జాగ్రత్తలు సూచిస్తారు.అవసరమని భావిస్తే,108 అంబులెన్సుకి ఫోన్ చేసి రప్పించి ఆసుపత్రిలో చేర్పిస్తారు.రక్త పోటుషుగర్ ఉన్నవారికి నెలవారీగా చేయాల్సిన రక్త పరీక్షలు ఇతర పరీక్షలు నిర్వహిస్తారు.
నిజానికి ఇలాటి వారందరూ ప్రతినెలా పరీక్షలు చేయించుకుని  మందు మోతాదులు మార్చుకుంటూ వుండాలి. బస్తీల్లో వున్నవాళ్ళే ఈ విషయాల్లో అశ్రద్ధ చేస్తుంటారు. పల్లె ప్రజల సంగతి చెప్పేది ఏముంటుంది. కనుకే ఈ వాహనం ప్రతినెలా ఒక నిర్దిష్ట దినం నాడు విధిగా ఆయా గ్రామాలకు వెడుతుంది. ఖచ్చితంగా వస్తుందని తెలుసుకనుక రోగులు కూడా శ్రద్ధగా పరీక్షలు చేయించుకుంటారు. మందులు వాడతారు. ఫలితంగా చిన్న చిన్న  శారీరక రుగ్మతలు  అలవికాని పెద్ద పెద్ద రోగాలుగా మారవు. ప్రజలు ఆరోగ్యంగా వుంటే వైద్యం అవసరమే వుండదు. అప్పుడు వైద్య ఆరోగ్య శాఖ ఆరోగ్య వైద్య శాఖగా మారుతుంది.
ఇంత చక్కటి పధకం కార్య రూపం ధరించేసరికల్లా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఒక్కమారుగా మారిపోయాయి. ప్రాధాన్యతలు మారాయి. రాజకీయ నిర్దేశకత్వం కొరవడడంతో అధికారులు తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు. ఈ మాత్రం దానికి స్వచ్చంద సంస్థల ప్రమేయం యెందుకు మనమే చేస్తే పోలా అనుకున్నారు. కొందరు సిబ్బంది కూడా వారికి సహకరించారు. ప్రభుత్వమే నిర్వహిస్తే తాము కూడా ప్రభుత్వ సిబ్బందిగా మారతామని ఆశ పడ్డట్టున్నారు. సమ్మెలు చేశారు. ప్రభుత్వం నుంచి నిధుల మంజూరు మందగించింది. ఏతావాతా జరిగిందేమిటంటే  ప్రజలకు మేలు చేసే ఒక మంచి పధకం అటకెక్కింది. అటకనుంచి దించామంటున్నారు సర్కారువారు. దించినా పధకం మొదలు పెట్టిన నాటి చిత్తశుద్ధి యెంత మిగిలి వున్నదనేదే జవాబు దొరకని ప్రశ్న. 
(08-10 - 2013)

6, అక్టోబర్ 2013, ఆదివారం

నా గురించి నలుగురూ - 5 (ఆఖరి భాగం)

నా గురించి డి.వెంకట్రామయ్య గారు - 5
“నా ఉద్యోగం న్యూస్ రీడర్ అయినప్పటికీ ఓసారి న్యూస్ ఎడిటర్ మల్లాది రామారావు గారు (ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్ వద్ద ప్రెస్ సెక్రెటరీగా వున్న మల్లాది కృష్ణానంద్ అన్నగారు) నన్ను పిలిచి ‘ మాస్టారూ ఎన్నాళ్ళని ఇక్కడ కూర్చుని న్యూస్ బులెటిన్లతో కుస్తీ పడతారు. మధ్యమధ్య  రిపోర్టింగ్ కు వెళ్ళి వస్తుండండి. రేపు ఉదయం అసెంబ్లీకి వెళ్ళండి’ అన్నారు. అవి శాసన సభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నరోజులు. నేను ఉదయం వెళ్ళే సరికే అసెంబ్లీలో ‘QUESTION HOUR’  నడుస్తోంది. అప్పట్నించి భోజన విరామానికి సభ వాయిదా పడేవరకు మూడు నాలుగు గంటలపాటు అక్కడే కూర్చున్నాను. ఛాతీలో కాస్త నొప్పిగా వున్నట్టు అనిపించింది కాని పట్టించుకోలేదు. ఆఫీసుకు వచ్చి రిపోర్ట్ రాస్తుండగా నొప్పి మరికాస్త పెరిగింది. ఛాతీ ఎడమ వైపు నుంచి భుజానికి ఏదో సర్రున పాకినట్టనిపించింది. వొళ్ళంతా ముచ్చెమటలు పోశాయి. శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందిగా వుంది. ఇక నా వల్ల కాదని అర్ధమై పోయింది. ‘వొంట్లో బాగాలేదు. ఇంటికి పోతున్నాన’ని రామారావు గారికి చెప్పేసి వెళ్ళిపోయాను. అవేళలో అంత  త్వరగా వచ్చిన నన్ను చూసి మా ఆవిడ ఆశ్చర్యపోయింది. ‘ఏమిటిలా వచ్చారు. ఏమైంది మీకు వొంట్లో ఎలావుంది’ అని కంగారు పడడం మొదలు పెట్టింది. విషయం చెబితే డాక్టరు దగ్గరకు వెడదామని హడావిడి చేస్తుందని పొడి పొడిగా నాలుగుముక్కలు చెప్పి ‘ఏమీ వద్ద’ని కసరి అలాగే పండుకున్నాను.
“ఎన్నడూ లేనిది ఆవిధంగా పని మధ్యలో వొదిలేసి వెళ్ళిపోయానని తెలిసి శ్రీనివాసరావు, జ్వాలా నరసింహారావూ (వీరిద్దరినీ జంట కవులనేవారు. నిద్రపోయేటప్పుడు తప్ప ఎప్పుడూ కలిసేవుండేవారు) ఆ సాయంత్రం మా ఇంటికి విషయం కనుక్కుందామని  వచ్చారు. నేను చెప్పేది  వినిపించుకోకుండా డాక్టర్ మనోహరరావు (శ్రీనివాసరావు మేనల్లుడు) దగ్గరకు తీసుకువెళ్ళారు. తరువాత డాక్టర్ గారిని కూడా వెంటబెట్టుకుని గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్ళి అందులో చేర్పించారు. ‘ANGINA PECTORIS’  అనే హృదయ సంబంధమైన రుగ్మత వల్ల నాకలా అయిందని నిర్ధారించిన వైద్యులు రెండు రోజులపాటు ఐ సీ యూ లోనే వుంచి ఆ తరువాత ఇంటికి పంపారు. మరునాడు కాబోలు జ్వాలా నరసింహారావూ. శ్రీనివాసరావు సతీ సమేతంగా మా ఇంటికి వచ్చారు.
మాటల మధ్య మా ఆవిడ శ్రీనివాసరావుతో – ‘ ఆరోజు మీరు దేవుడల్లే వచ్చి ఆసుపత్రిలో చేర్పించార’ని  ఏదో  చెప్పబోతుంటే ఆయన తన మామూలు తరహాలోనే ‘ఈ ఇంట్లో దేవుడు అనే మాట వినడం విచిత్రంగా వుంది’ అన్నారు చిరునవ్వుతో.
నా నాస్తికత్వం మీద ఆయన విసిరిన వ్యంగ బాణం అది.
ఇలా అన్ని సందర్భాలలో నవ్వుతూ నవ్విస్తూ వుండే ఈ మనిషి ఎప్పుడయినా కంట నీరు పెట్టుకుంటాడా అనిపించేది. అదీ చూశాను. నేను రిటైర్ అయినప్పుడు జరిగిన వీడ్కోలు సభలో నా గురించి మాట్లాడబోయి, మాటలు పెగలక కంట తడిపెట్టారు.”
(అయిపోయింది)


(శ్రీ డి.వెంకట్రామయ్య వీడ్కోలు సభ)


(ఆకాశవాణిలో నా అనుభవాలు – శ్రీ డి వెంకట్రామయ్య, ‘రచన’ అక్టోబర్, 2013 సంచిక నుంచి – రచన సంపాదకులు శాయి గారికి కృతజ్ఞతలు) 

నా గురించి నలుగురూ ..... 4

నా గురించి శ్రీ డి. వెంకట్రామయ్య గారు  
“కలిసి తిరగడం, కులాసా కాలక్షేపాలు చేయడంలో మాత్రమే కాదు నాకు అన్నివిధాల ఆప్తమిత్రుడుగానే వుంటూ వచ్చారు భండారు శ్రీనివాసరావు.  ‘A friend in need …’ అన్న ఆంగ్ల సూక్తి మాదిరిగా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సాయం చేయడానికి ఆయన సర్వదా సిద్ధం. హైదరాబాదులో న్యూస్ రీడర్ గా వున్న నన్ను ఢిల్లీ అధికారులు ఎవరికో సాయం చేయాలనుకుని నన్ను అన్యాయంగా ఢిల్లీ బదిలీ చేశారు. ఇలా రెండు సార్లు జరిగింది. రెండోసారి బదిలీ ఉత్తర్వులు రద్దు చేయించడంలో ప్రధానపాత్ర  శ్రీనివాసరావుదే.


(శ్రీ డి.వెంకట్రామయ్య)

అప్పట్లో కేంద్ర సమాచార శాఖ ఉప మంత్రిగా మన రాష్ట్రానికి చెందిన మల్లికార్జున్ వుండేవారు. కాంగ్రెస్ ఎం ఎల్ ఏ డీ కే  సమరసింహారెడ్డి మాట సాయంతో నేనూ శ్రీనివాసరావు కలిసి ఢిల్లీ వెళ్ళి వారం రోజులు అక్కడ వున్నాం. మంత్రి మల్లికార్జున్ నీ,  ఇతర అధికారులను కలిసి శాయంగల విన్నపాలు చేసాము. నెలలు గడిచిపోయాయి కాని పని కాలేదు. అలాటి తరుణంలో శ్రీనివాసరావు మల్లికార్జున్ గారిని కలిసి నా సమస్య మళ్ళీ చెప్పారు. చివరిసారి వెళ్ళినప్పుడు మంత్రితో చివాట్లు కూడా తిన్నారు. ‘ఎందుకిలా మాటిమాటికీ వచ్చి డిస్టర్బ్ చేస్తావ్.. నువ్వేమైనా అయన ఏజెంటువా ....’అన్న ధోరణిలో ఆగ్రహం వెలిబుచ్చారట. (ఇక్కడ వో విషయం వివరించాలి. అసలు జరిగినదేమంటే మంత్రిగారికి నా మీద కోపం వచ్చిన మాట నిజం. ఇలా విసిగించావంటే సస్పెండ్ చేస్తా అన్న మాట కూడా వాడారు. అయితే అప్పుడు నేను చెప్పిన జవాబు ఆయన్ని కదిలించింది. నన్ను సస్పెండ్ చేస్తే చేయండి. వెంకట్రామయ్య గారికి మాత్రం న్యాయం చేయండి అనేశాను. అంతకుముందు విలేకరిగా పరిచయం బాగా వున్నవాడినే కావడంతో ఆయన కూడా ఏమీ అనలేకపోయారు. మొత్తం మీద కధ సుఖాంతం అయింది. వెంకట్రామయ్య గారి బదిలీ రద్దయింది.)”

(ఆకాశవాణిలో నా అనుభవాలు – శ్రీ డి వెంకట్రామయ్య, ‘రచన’ అక్టోబర్, 2013 సంచిక నుంచి – రచన సంపాదకులు శాయి గారికి కృతజ్ఞతలు) 

5, అక్టోబర్ 2013, శనివారం

నా గురించి నలుగురూ ......3

నా గురించి నేను నలుగురికీ చెప్పుకోవడం ఓ సంగతి. నలుగురూ  నా గురించి ఏం చెప్పుకుంటున్నారో అన్నది మరో సంగతి. ఆ చెప్పేవాళ్ళు పెద్దవాళ్లయితే ఇక ఆ విషయం చెప్పుకోవడానికి అడ్డం ఏముంటుంది. కేవలం ఈ వొకే ఒక్క కారణంతో,  ఆకాశవాణి న్యూస్ రీడర్ శ్రీ డి. వెంకట్రామయ్య గారు ‘రచన’ మాస పత్రిక తాజా సంచికలో తన రేడియో అనుభవాల్లో భాగంగా  నా గురించి చేసిన కొన్ని ప్రస్తావనలను పోస్ట్ చేస్తున్నాను. నిజానికి వీటిని నేను   చక్కని ప్రశంసాపత్రాలుగా భావిస్తాను.- భండారు శ్రీనివాసరావు


(శ్రీ డి.వెంకట్రామయ్య)

“సుమారు పాతికేళ్ళక్రితం సకుటుంబంగా సోవియట్ రష్యా వెళ్ళి నాలుగున్నర సంవత్సరాలపాటు అక్కడ వుండి  రేడియో మాస్కోలో తెలుగు వార్తలు చదివొచ్చారు భండారు శ్రీనివాసరావు.  అప్పుడాయన కాకుండా నేను మాస్కో వెళ్ళవలసింది. రేడియో మాస్కోలో తెలుగు వార్తలు చదవడం కోసం ఆకాశవాణి న్యూస్ రీడర్లను ఒకరి తరువాత ఒకరిని తీసుకువెళ్ళి రెండేళ్లో మూడేళ్లో  అక్కడ  వుంచుకునేవారప్పట్లో. నాకంటే సీనియర్లయిన  తిరుమలశెట్టి శ్రీరాములుగారు, కందుకూరి సూర్యనారాయణగారు ఏడిద గోపాలరావుగారు (గోపాల్రావుగారు రేడియో సర్వీసులో నాకంటే జూనియర్ కాని న్యూస్ రీడర్ గా  కాస్త సీనియర్) లాంటి వాళ్ళంతా రష్యా వెళ్ళివచ్చాక నా వంతు వచ్చింది. వ్యక్తిగతమైన కొన్ని ఇబ్బందులవల్ల నేను వెళ్ళలేకపోగా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని,  తాను న్యూస్ రీడర్ కాకపోయినా ఆకాశవాణి, రేడియో మాస్కో అధికారుల ఆమోదంతో రష్యా వెళ్లివచ్చారు శ్రీనివాసరావు. వెళ్ళడమేనా,  తనకంటే ముందు వెళ్ళిన వాళ్ళకంటే రెండేళ్లు ఎక్కువగానే అక్కడవుండి  మాస్కో మహానగరంలో తన జెండా ఎగరేసి మరీ వచ్చారు శ్రీనివాసరావు. రేడియో  మాస్కోలో తెలుగులో వార్తలు చదివిన చివరి వ్యక్తి శ్రీనివాసరావే. ఆ తరువాత ఆ రేడియోలో తెలుగు వార్తల  ప్రసారాన్ని నిలిపివేశారు.
“శ్రీనివాసరావు మాస్కోలో వున్నంతకాలమూ అక్కడా ఆయన ఇల్లు ధర్మసత్రంగానే వుండేదట. అక్కడ వుండి  చదువుకునే తెలుగు విద్యార్ధులు, ఒంటరి ఉద్యోగులు, యాత్రీకులూ అందరికీ అన్నివేళలా తలుపులు బార్లా తెరిచి స్వాగతం పలికేవారు భండారు  దంపతులు. తన సరసోక్తులతో, మధురసాలతో శ్రీనివాసరావు ఆతిధ్యం ఇస్తే, తెలుగు తిండికి మొహం వాచిపోయి వున్న వాళ్ళందరికీ కమ్మటి భోజనం వండి వార్చేవారు నిర్మల గారు. తానూ, తన భార్యాబిడ్డలూ ఆ నాలుగేళ్ళూ మాస్కోలో గడిపిన జీవిత విశేషాలతో ‘మార్పు చూసిన కళ్ళు’ అన్న పేరుతొ ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఒక చిరు గ్రంధాన్ని కూడా గత సంవత్సరాంతంలో రచించారు భండారు శ్రీనివాసరావు “
ఇంకా వుంది .........

(ఆకాశవాణిలో నా అనుభవాలు – శ్రీ డి వెంకట్రామయ్య, ‘రచన’ అక్టోబర్, 2013 సంచిక నుంచి – రచన సంపాదకులు శాయి గారికి కృతజ్ఞతలు) 

4, అక్టోబర్ 2013, శుక్రవారం

నా గురించి నలుగురు -2

నా గురించి శ్రీ డి.వెంకట్రామయ్య గారు   
నా గురించి నేను నలుగురికీ చెప్పుకోవడం ఓ సంగతి. నలుగురూ  నా గురించి ఏం చెప్పుకుంటున్నారో అన్నది మరో సంగతి. ఆ చెప్పేవాళ్ళు పెద్దవాళ్లయితే ఇక ఆ విషయం చెప్పుకోవడానికి అడ్డం ఏముంటుంది. కేవలం ఈ వొకే ఒక్క కారణంతో,  ఆకాశవాణి న్యూస్ రీడర్ శ్రీ డి. వెంకట్రామయ్య గారు ‘రచన’ మాస పత్రిక తాజా సంచికలో తన రేడియో అనుభవాల్లో భాగంగా  నా గురించి చేసిన కొన్ని ప్రస్తావనలను పోస్ట్ చేస్తున్నాను. నిజానికి వీటిని నేను   చక్కని ప్రశంసాపత్రాలుగా భావిస్తాను.- భండారు శ్రీనివాసరావు


(శ్రీ డి. వెంకట్రామయ్య)

“ఆకాశవాణి న్యూస్ రూమ్ లో పనిచేసే పద్ధతిలో భండారు శ్రీనివాసరావుకీ నాకూ పరస్పరవిరుద్ధమైన అభిప్రాయాలు వుండేవి. కాస్త పట్టూ విడుపూ వుండాలనేవారాయన. పట్టుండాలి కాని విడుపెందుకు అనే వాడ్ని నేను. (ఆయన పొరసంబంధాలమనిషి. అనేకమందితో సంబంధాలు వుంటేనే వార్తలు సేకరించడం సులువు అనేది ఆయన పాలసీ. కానీ వార్తల ఎంపిక విషయంలో నా ధోరణి నాదే) నన్ను ఆయనా మార్చలేకపోయారు. ఆయన్ని నేనూ ప్రభావితుడ్ని చేయలేకపోయాను. చివరి దాకా అంతే!
“విచిత్రమైన విషయం ఏమిటంటే, ఆఫీసు విషయాల్లో ఏమాత్రం ఏకాభిప్రాయం లేని నేనూ శ్రీనివాసరావు ఆఫీసు ఆవరణ దాటి బయటకు రాగానే ఒక్కటై పోయేవాళ్ళం. ఎన్నో ఏళ్ళపాటు ఎన్నో సాయంత్రాలు ..ఎన్నెన్నో రాత్రులు...గంటలకొద్దీ కబుర్లు..సినిమాలు...షికార్లు...అంతేనా అంతకుమించిన అన్ని కాలక్షేపాలు... చతుర్ముఖ పారాయణాలు...  దూమపానాలు.... మధుపానాలు... ఏదో ఒక బార్...లేదా ప్రెస్ క్లబ్...అన్నింటికీ మించి చిక్కడపల్లిలో శ్రీనివాసరావు ఇల్లు. ఇవే మా ‘అడ్డాలు’.
“ఆయనా నేనూ దగ్గర దగ్గర ఇళ్ళల్లో వుండేవాళ్ళం. ఆయన అక్కడ వున్నంత కాలం దాదాపు కొన్నేళ్లపాటు నేనూ, వనం జ్వాలా నరసింహారావు వంటి మరికొందరం మిత్రులం కనీసం వారానికి రెండు మూడు రోజులయినా వారింటికి చేరేవాళ్ళం. గంటలకొద్దీ గడిపేవాళ్ళం. ఆరోజుల్లో ఆయన ఇల్లు ఓ ధర్మసత్రంలా వుండేది. అసలే ఆయన బంధు వర్గమే పెద్దది. దానికి తోడు స్నేహితులు. అందరూ బంధువులే....అందరూ స్నేహితులే... ఎప్పుడు ఏ వేళ చూసినా ఎవరో ఒకరు వచ్చిపోతుండేవారు. ఎప్పుడు ఎవరు వచ్చినా వచ్చిన వాళ్ళందరికీ అతిధి మర్యాదలు చేసి, ఆదరించి అన్నమ్పెట్టికాని పంపేవారు కాదు ఆయన శ్రీమతి నిర్మలాదేవి. ఆరోజుల్లో ఆవిడను చూసినప్పుడల్లా ‘వండనలయదు వేవురు వచ్చిరేని...అన్నపూర్ణకు నుద్దియౌ అతని గృహిణి...’ అని మనుచరిత్రలో ప్రవరాఖ్యుడి భార్య గురించి చదువుకున్న పద్యం గుర్తుకు వచ్చేది.”

(ఆకాశవాణిలో నా అనుభవాలు – శ్రీ డి వెంకట్రామయ్య, ‘రచన’ అక్టోబర్, 2013 సంచిక నుంచి – రచన సంపాదకులు శాయి గారికి కృతజ్ఞతలు)  
(04-10-2013)

నా గురించి నలుగురు ........


నా గురించి శ్రీ డి.వెంకట్రామయ్య గారు

నా గురించి నేను నలుగురికీ చెప్పుకోవడం ఓ సంగతి. నలుగురూ  నా గురించి ఏం చెప్పుకుంటున్నారో అన్నది మరో సంగతి. ఆ చెప్పేవాళ్ళు పెద్దవాళ్లయితే ఇక ఆ విషయం చెప్పుకోవడానికి అడ్డం ఏముంటుంది. కేవలం ఈ వొకే ఒక్క కారణంతో,  ఆకాశవాణి న్యూస్ రీడర్ శ్రీ డి. వెంకట్రామయ్య గారు ‘రచన’ మాస పత్రిక తాజా సంచికలో తన రేడియో అనుభవాల్లో భాగంగా  నా గురించి చేసిన కొన్ని ప్రస్తావనలను పోస్ట్ చేస్తున్నాను. నిజానికి వీటిని నేను   చక్కని ప్రశంసాపత్రాలుగా భావిస్తాను.- భండారు శ్రీనివాసరావు


(శ్రీ డి. వెంకట్రామయ్య) 

“ నాకిప్పటికీ బాగా గుర్తుంది. సందర్భం ఏమిటో జ్ఞాపకం లేదు. ఒకనాటి సాయంత్రం డ్యూటీ ముగించుకుని నేనూ భండారు శ్రీని వాసరావు గారూ (ఇకనుంచి ఈ గౌరవ వాచకం తీసివేసి రాస్తాను) న్యూస్ రూమ్ నుంచి బయటకు నడుస్తుండగా ఆయనో మాట అన్నారు.
“మీరు కుండలు బద్దలు కొట్టండి.  కాని కుండలు కొనుక్కొచ్చి మరీ బద్దలు కొడతానంటే యెలా “ అని. అంతకుముందు ఆఫీసులో ఏదో జరిగింది. ...ఎవరితోనో నేను ఘర్షణకు దిగడమో, తీవ్రస్థాయిలో వాదించడమో జరిగింది.  అలాటి సందర్భాలలో అవసరానికి మించి ఆవేశపడడం, అవతలి వ్యక్తి ఎవరయినా సరే, ఏమాత్రం సంకోచించకుండా వున్న మాట మొహాన  అనేయడంవంటి నా సహజ స్వభావం గురించి , శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్య ఇది. ‘కుండలు కొనుక్కొచ్చి మరీ బద్దలు కొట్టడం’ అన్న ఆయన చమత్కారానికి నేనూ నవ్వుకున్నాను. ఆ చమత్కారపు మాటల వెనక నా బోటివారు ఆలోచించవలసిన, చేతనయితే అనుసరించవలసిన మంచి సలహా వున్నట్టు నాకనిపించింది.
అప్పుడే కాదు,  అంతకి ముందు ఆ తరువాతా కూడా ఎన్నో సందర్భాలలో, తన చమత్కారాలు, చతురోక్తులు  జోడించి  ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ  నాకెన్నో సలహాలు అందించేవారాయన. కాని నేను వింటేగా. రాజు కంటే మొండివాడు బలవంతుడు అన్నట్టు నా మొండితనం నాదే. ఎన్నిమార్లు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆయన నన్నెంత మాత్రం మార్చలేకపోయారు, ముఖ్యంగా ఆఫీసు విషయాల్లో. శ్రీనివాసరావులాటి మిత్రుల  సుదీర్ఘ సహవాసంవల్ల ఆఫీసునుంచి బయటకు వచ్చిన తరువాతైనా  కాస్త నవ్వడం నేర్చుకున్నాను. నలుగురిలో మసలడం నేర్చుకున్నాను. నాలుగు మాటలు నేర్చుకున్నాను. అయినా ఆఫేసులో కూర్చున్నంతసేపు నా పని నాదే, నా పద్ధతులు నావే. నా నియమాలు నావే. సక్రమం, సమజసం  అనుకున్న మార్గాన్ని ఏమాత్రం విడవలేదు”  
(ఆకాశవాణిలో నా అనుభవాలు – శ్రీ డి వెంకట్రామయ్య, ‘రచన’ అక్టోబర్, 2013 సంచిక నుంచి – రచన సంపాదకులు శాయి గారికి కృతజ్ఞతలు) 
(04-10-2013)


2, అక్టోబర్ 2013, బుధవారం

ఇడ్లీ వడ చేత్తో తిన్న ఇందిరా గాంధి


ఖమ్మం జిల్లా ఏర్పడి నిన్నటికి అరవై ఏళ్ళు నిండాయి. నిన్న మొదలయిన ఈ అరవై వసంతాల ఉత్సవాలను వచ్చే జనవరి ఇరవై ఆరువరకు జరపాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈనాడు ఖమ్మం ఎడిషన్ లో చాలా ఆసక్తికరమైన విషయాలను, ఫొటోలతో సహా ప్రచురించారు.
రాజీవ్ గాంధి ప్రధాన మంత్రిగా జిల్లాలో వరద బాధిత ప్రాంతాలను పరిశీలించడానికి వచ్చినప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి. జలగం వెంగళరావు గారు కేంద్ర మంత్రి, పీసీసీ అధ్యక్షుడు కూడా. భద్రాచలం చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో తగిన భద్రతా సిబ్బంది కూడా లేకుండా తిరిగినప్పుడు ఆయన వెంట వున్నవారిలో ఆకాశవాణి విలేకరిగా నేను కూడా వున్నాను. ఓ మారుమూల గిరిజ పల్లెకు వెళ్ళి, ఒక స్థానికుడి ఇంట్లోకి వెళ్ళి పోయ్యిమీది చట్టిలోని అన్నం మెతుకులను రుచి చూసి, బయటి ప్రపంచానికి దూరంగా వున్న వారి బీద బతుకులకు సర్కారు భరోసాగా వుందన్న నమ్మకాన్ని ఆ పేదవారిలో కలిగించారు.

  

ఓసారి ఇందిరాగాంధి మాజీ ప్రధాన మంత్రిగా జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో మారిన సమీకరణాల  కారణంగా ఆవిడను ఘనంగా కాకపోతే పోనీండి,  ఓ మోస్తరుగా రిసీవ్ చేసుకునే నాయకులు కూడా లేకపోయారు. ఓ గెస్ట్ హౌస్ లో బస చేసినప్పుడు అప్పట్లో ఓ చోటా కాంగ్రెస్ నాయకుడు ఈశ్వర్ లింగం ఆమె బ్రేక్ ఫాస్ట్  కోసం  దగ్గర్లో ఓ హోటల్ నుంచి  ఇడ్లీ వడ తెప్పించి పెట్టారు. వాటితో పాటు ఇచ్చిన ఓ సత్తు చెంచాతో తినలేక ఇందిరాగాంధి చేత్తోనే తిన్నారని దానికి ప్రత్యక్ష సాక్షి  అయిన కౌటూరు దుర్గాప్రసాద్ చెప్పారు. ఆవిడ టిఫిన్ చేస్తున్నప్పుడు పక్కన కూర్చున్న వారిలో పాలేరు సమితి మాజీ అధ్యక్షులు రావులపాటి సత్యనారాయణ రావు గారు (మాజీ ఐజీ రావులపాటి సీతారామారావుగారి తండ్రి) వున్నారు.  
ఆరోజుల్లో శ్రీమతి గాంధి రాజకీయంగా వొంటరి. కాంగ్రెస్ పార్టీని చీల్చి కాంగెస్ (ఐ) పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. అప్పటివరకు ఆమెకు వీర విధేయుడిగా వున్న ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఆమెతో విభేదించి పాత కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. ఇక ఆవిడను ఖమ్మం పర్యటనలో కనుక్కునే నాధుడు యెవ్వడు?
ఆవిడ వెంట వచ్చిన మర్రి చెన్నారెడ్డి, జీ వెంకటస్వామి   ప్రభ్రుతులు శ్రీమతి గాంధీని హిల్ బంగ్లా లో దింపి వసతి సరిపోకనో యేమో మన్నెగూడెం వెంకటరెడ్డి ఇంటికి వెళ్లారు. అంచేత ఆవిడ బ్రేక్ ఫాస్ట్ బాధ్యత చిన్న నాయకుల మీద పడింది.


ఖమ్మం ఎన్నికల సభ బాగా జరిగింది. కాంగ్రెస్ లో సిండికేటుగా పిలవబడే అగ్రనాయకులందరూ కలసి తనని వొంటరిదాన్ని చేసి బయటకు పంపారని శ్రీమతి గాంధి చేసే వాదనను జనం నమ్మారు. అందరూ ఒక్కటై ఈమెను వేదిస్తున్నారన్న నమ్మకం ప్రబలసాగింది. గెస్ట్ హౌస్ పక్కనే సభ జరగాల్సిన పెవిలియన్ మైదానం జనంతో కిక్కిరిసిపోయింది. రాత్రి ఏడు గంటలకు రావాల్సిన శ్రీమతి గాంధి మరునాడు ఉదయం ఖమ్మం వచ్చారు. అయినా సభకు వచ్చిన  ఎవ్వరూ అక్కడనుండి కదలలేదు. ఆవిడ ఖమ్మం సభలో ప్రసంగిస్తూ వున్నప్పుడే కాంగ్రెస్ (ఐ) పార్టీకి ‘హస్తం గుర్తు’  కేటాయించినట్టు కబురు వచ్చింది.
కొసమెరుపు ఏమిటంటే ఆరోజు పెవిలియన్ మైదానంలో అమ్ముడు పోయిన మిర్చి బజ్జీలు అప్పటికీ ఇప్పటికీ ఒక రికార్డుగా చెప్పుకుంటారు.

(02-10-2013)