4, మే 2013, శనివారం

ఆరోగ్యశ్రీ కధా కమామిషూ


కొత్త సంవత్సరంలో ఒక సాయంత్రం ముచ్చట్ల సమావేశం

కలిపింది 104,108 పధకాల రూపశిల్పి అయిన ఒక డాక్టరు గారు.

కలిసింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన అధికారి, ఆయనతో పాటు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మరో అధికారి. స్టేట్ బ్యాంకులో అత్యున్నత పదవిలో పనిచేసిన ఇంకో అధికారి.  108 లో  కీలక భూమిక పోషించిన ఒక వ్యక్తి,  గుంపులో గోవిందుడిగా నేను సరే. పేర్లు పేర్కొనక పోవడానికి కారణం వేరే ఏమీ లేదు, వారి గౌరవాన్ని మరింత పెంచడానికే. అందరూ అందరే. నీతికీ, నిజాయితీకి ప్రసిద్ధులు, నిబద్ధులు. అందుకే మచ్చ లేకుండా అంతంత పెద్ద అధికార కొలువులు  చేసి  ఉద్యోగ విరమణ అనతరం  గుండె మీద చేయివేసుకుని  హాయిగా నిద్ర పోగలుగుతున్నారు.   

ఈ మధ్య అంటే అంతగా కుదరడం లేదు కాని వీరితో సాయంకాలక్షేపాలు నాకు గతంలో మామూలే.

మాటల నడుమ ఆరోగ్యశ్రీ  ప్రస్తావన వచ్చింది.

మాటల్లో మాటగా తెలియవచ్చిన ఆరోగ్యశ్రీ  నేపధ్యం ఏమిటంటే –




ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం

ఉదయం వేళల్లో సీఎం సాధారణ ప్రజలను కలుసుకునే సమయం.

సీఎం ఒక్కొక్కర్నీ కలుసుకుంటూ, వారినుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తూ, వాటికి తగిన హామీలను ఇస్తూ, సంబంధిత పేషీ అధికారులకు సూచనలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు.

వైద్య ఆరోగ్య శాఖకు కొత్తగా ఒక అధికారి వచ్చారు. విషయ అవగాహన కోసం ఆయన కూడా ఆ సమయంలో ముఖ్యమంత్రి వెంట వున్నారు.

సీఎం ను స్వయంగా కలసి కష్ట సుఖాలను చెప్పుకోవడానికి వచ్చిన ఆ మహా జనంలో ఒక అమ్మాయి కూడా వుంది. అయితే వచ్చిన కష్టం ఆ అమ్మాయిది కాదు. ఆ అమ్మాయి అమ్మది. అది కూడా మామూలు కష్టం కాదు. తీవ్రమయిన ఆరోగ్య సమస్య. మామూలు మనుషులే కాదు కలిగిన వారిని కుదేలు చేసే క్యాన్సర్. ఆవిడను   చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి కన్న కూతురు తీసుకువచ్చింది.

ముఖ్యమంత్రి అమ్మాయి చెప్పింది సావధానంగా విన్నారు. స్వయంగా డాక్టర్ అయిన ఆయన మెడికల్ రిపోర్టులు పరిశీలించారు. విషయం అర్ధం అయింది. ఏం చేసినా ఆవిడ బతికే అవకాశాలు శూన్యం.

కానీ మరోపక్క మా అమ్మ నాకు కావాలి. అనే ఆ అమ్మాయి విలాపం.

వైద్యం చేయిస్తాను. కానీ వ్యాధి ముదిరిపోయింది. ప్రయోజనం వుండకపోవచ్చు అన్నారు ముఖ్యమంత్రి.

ఆరు నెలలు బతికినా చాలు, నా కన్న తల్లి నా కళ్ళ ముందు వుంటే అదే పదివేలు అన్నదా అమ్మాయి.

చనిపోతుందని, ఇంకా ఎంతో కాలం బతకదనీ నాకూ తెలుసు. కానీ వైద్యం చేయించకుండా వుండలేము కదా! అంది కూడా.

ఆ మాటతో కంగుతిన్న ముఖ్యమంత్రి ఏమనుకున్నారో యేమో! కాకపొతే,  ఒక నిశ్చయానికి వచ్చినట్టు ఆయన ముఖమే చెబుతోంది. 

ఏం చేద్దాం అన్నట్టు అధికారులవైపు చూసారు, ఏదయినా చేసి తీరాలి అన్నట్టుగా.         

ఎవరికీ ఏం చేయాలో, ఏం జవాబు చెప్పాలో తెలియదు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎంతో కొంత సాయం చేసినా అది అరకొరే.

ఆ అమ్మాయిని మరునాడు రమ్మన్నారు. సీఎం  అధికారులతో మాట్లాడారు. ఇలాటి అభాగ్యులకు ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి ఒక పరిష్కారంతో రమ్మన్నారు.

అరకొర సాయాలతో అభాగ్యులకు ఒరిగేదేమీ వుండదు. డబ్బున్న వారికీ, అది లేని వారికీ కూడా జబ్బులు వస్తాయి. వున్నవారికీ, లేనివారికీ ఒకే రకంగా వైద్య సదుపాయం అందించే అవకాశం లేదా? ప్రభుత్వం ఏమీ చేయలేదా?

ఈ ప్రశ్నకు దొరికిన సమాధానమే ఆరోగ్యశ్రీ

 

(08-01-2013)

2, మే 2013, గురువారం

బాబోయ్!



‘మీలో చక్కని వాదనాపటిమ వున్న మాట నిజమే కాని కొన్ని సందర్భాలలో అడ్డదిడ్డంగా వాదిస్తారు అనిపిస్తుంది’
‘నేనా! వాదిస్తానా! మీ అంచనా పూర్తిగా  తప్పన్నది నా అభిప్రాయం. వాదన సరే అసలు నేను ఎవరితోనూ ఎక్కువ తక్కువ మాట్లాడను కూడా. అది నా నైజం. వాదులాటల్లో నాకసలు నమ్మకమే లేదు. ఆ మాటకొస్తే మీలోనే లేనిపోని వాదాలు చేసే గుణం వుందని నాకనిపిస్తోంది. అంతేకాదు అడ్డదిడ్డంగా వాదులాటకు దిగడం మీ వంశంలోనే వుందనుకుంటాను. మీ నాన్నా అంతే. అమ్మా అంతే. కారణం లేకుండా అందరితో ఆర్గ్యుమెంట్లకు దిగుతారు. మొత్తం కుటుంబం అంతా అంతే. నేను తలాతోకా లేకుండా మాట్లాడతానని మీకు చెప్పిన ఆ తలకాయలేని మనిషి ఎవరు? నా మెంటాలిటీ ఆర్గ్యుమెంటాలిటీ అని యెలా నిర్ధారణకు వచ్చారు? ఆర్గ్యుమెంట్ స్పెల్లింగే తెలవదు నాకు. నన్ను పట్టుకుని అంత మాట అంటారా! అయినదానికీ కానిదానికీ వాదాలకు దిగడం మా వంశంలోనే లేదు. ఎవరు ఎన్ని అంటున్నా నోరు తెరిచి ఎదురే మాట్లాడం. అలాటిది నాది వాదులాడే తత్వం అనడానికి మీకు నోరెలా వచ్చింది..............’
(ఫేస్ బుక్ లో కనబడ్డ జోక్కి స్వేచ్చానువాదం )
(కార్టూనిస్ట్ మల్లిక్ గారికి ధన్యవాదాలు)

1, మే 2013, బుధవారం

రేడియో రోజులు


(ఈరోజు ఫేస్ బుక్ లో అమెరికా నుంచి నరిసెట్టి ఇన్నయ్య గారు పోస్ట్ చేసిన మాజీ పోలీసు డైరెక్టర్ జనరల్ శ్రీ పీ ఎస్ రామమోహన రావు గారి ఫోటో చూసిన తరువాత మదిలో మెదిలిన జ్ఞాపకం – భండారు శ్రీనివాసరావు) 
అసలు సిసలు పోలీసు అధికారి పీ ఎస్ రామమోహన రావు గారితో నాకూ కొన్ని మరచిపోలేని అనుభవాలు వున్నాయి. నేను మాస్కో వెళ్ళేటప్పుడు ఆయన డీజీపీ. అప్పటికే కొందరం జర్నలిస్టులం మొదలు పెట్టిన యాంటీ హెల్మెట్ ఉద్యమంతో సీనియర్ పోలీసు అధికారులు మనస్తాపంతో వున్నారు. నన్ను అరెస్టు చేయడం, ఎన్టీయార్ ముఖ్యమంత్రిగా దర్యాప్తు కోసం వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటుచేయడం, ఆ వెంటనే నా మాస్కో ప్రయాణం - మా నడుమ సత్సంబంధాలలో పైకి కనబడని తేడా తీసుకువచ్చాయి. మాస్కో వెళ్ళబోయేముందు డీజీపీ రామమోహన రావు గారిని ఆయన ఆఫీసుకు వెళ్ళి కలిసాను. చాలా ఆప్యాయంగా పలకరించి క్షేమ సంచారాలు కనుక్కుని వీడ్కోలు చెబుతూ ఒక మాట అన్నారు. ‘మాస్కోలో పోలీసులతో జాగ్రత్త. మన దగ్గరలా హెల్మెట్ల విషయంలోలా ఠలాయిస్తే కుదరదు.’
వయసు అలాటిది మరి. నేనూ అలానే జవాబు చెప్పాను. ‘మాస్కో చాలా చలి ప్రదేశం అని విన్నాను. మంచు కురిసే రోడ్లపై ‘టూ వీలర్స్ ఎలౌ చేయరనుకుంటాను’
రామమోహన రావుగారు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా వున్నప్పుడు ఖమ్మం బస్ స్టాండులో ఒక ఉద్యోగితో సీటు రిజర్వేషన్ విషయంలో పేచీ వచ్చింది. హైదరాబాదు రాగానే ఘాటుగా ఓ పిర్యాదు రాసి పంపించాను. మూడు రోజుల తరువాత అనుకుంటాను అదే ఉద్యోగి మా మేనల్లుడిని వెంటబెట్టుకుని హైదరాబాదు వచ్చాడు.
‘ఏదో తెలియక చేసాడు, ఇప్పుడు ఎమ్డీ గారు నీ పిర్యాదు మీద చాలా దూరం ట్రాన్సఫర్ చేశారు, నాకు బాగా తెలిసిన వాళ్లు. నువ్వే మళ్ళీ ఏదో సర్ది చెప్పి బదిలీ క్యాన్సిల్ చేయించు’ ఇదీ మా వాడి రాయబారం.
సరేనని ఆయన ఆఫీసుకు వెళ్ళి కలిసి విషయం చెప్పాను. అప్పుడాయన ఇలా అన్నారు.
‘మీరు కంప్లయింటు ఇచ్చారు. మీ మీద గౌరవం కొద్దీ విచారణ కూడా జరపకుండా బదిలీ చేసాను. అదీ నేను చేసిన పొరబాటు. ఇప్పడు మీ మాట విని మరో పొరబాటు చేయడం ఇష్టం లేదు. బదిలీ క్యాన్సిల్ చేయడం చిటికెలో పని. కాని సంస్థలో డిసిప్లిన్ మాటేమిటి. ఎమ్డీ ట్రాన్స్ఫర్ చేస్తే నాకొక లెక్కా! ఒక్క రోజులో మళ్ళీ క్యాన్సిల్ చేయించుకున్నానని అందరితో చెప్పుకుంటాడు. క్రమశిక్షణ దెబ్బతింటుంది. ముందు పోయి వేసిన చోట జాయిన్ కమ్మని చెప్పండి. ఓ ఆరు నెలల తరువాత మళ్ళీ వెనక్కు వేస్తాను’
దట్ ఈజ్ రామ్మోహనరావు గారు!

(01-05-2013)

ఇల్లాలి ముచ్చట్లు




హోటల్లో మీటింగు కాగానే హ్యాండు బ్యాగు తీసుకుని బయటకు వచ్చాను. వస్తూనే కారు తాళాల కోసం చూసుకుంటే అవి కనిపించలేదు. బ్యాగు తీసి చూసాను, కనిపించలేదు. మీటింగు జరిగిన హాల్లోకి వెళ్ళి వెతికాను. లేవు. అక్కడి సిబ్బందిని వాకబు చేసాను. తెలియదన్నారు.  సడెన్ గా గుర్తుకు వచ్చింది. తాళాలు  కారులోనే వొదిలిపెట్టి వుంటాను. పైగా నాకది  అలవాటు కూడా.  

పొరపచ్చాలు లేని దాంపత్యం మాది. ఈ ఒక్క విషయంలోనే నాకూ ఆయనకూ పడదు.  తాళాలు కారులో వొదలవద్దు అని అస్తమానం సతాయిస్తుంటారు. నాకేమో అవి అక్కడ వుంటేనే సేఫ్ అనిపిస్తుంది. ‘కారులోనే తాళాలు వుంచితే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే’ అన్నది మావారి థియరీ. కాని ఈ విషయంలో నా దారి నాదే. ఆయన గోల ఆయనదే.
పార్కింగ్ లో చూస్తే కారు కనబడలేదు. మా వారి మాటే కరెక్ట్ అయింది.
కారు పోయిందని తెలియగానే కాళ్ళల్లో వొణుకు మొదలయింది. హోటల్ వాళ్లకు చెప్పి పోలీసులకు ఫోను చేసాను. యేకళన వున్నారో నేను చెప్పినవన్నీ వెంటనే నోటు చేసుకున్నారు. కారు నెంబరు, పోయిన చోటు అన్నీ చెప్పాను. కారులోనే తాళం చేతులు మరచిపోయిన సంగతి కూడా చెప్పేసి, ఎవడో పట్టుకుపోయివుంటాడు అన్న అనుమానం కూడా వెల్లడించాను. దొంగతనం గురించి చెబుతుంటే మా వారు గుర్తుకువచ్చారు. ఆయన సతాయింపు గుర్తుకువచ్చి చెప్పాలా అక్కరలేదా  అనుకుంటూనే మా వారికి ఫోను చేసాను.
‘హలో హనీ!’
ఇలాటి చిక్కు పరిస్థితులు ఎదురయినప్పుడు ఆయన్ని నేను అలానే పిలుస్తాను.
“నువ్వు రోజూ చెప్పేదే ఇవాళ నిజమయింది. కారులో తాళాలు పెట్టి మీటింగుకు వెళ్లాను. వచ్చి చూస్తే  పార్కింగులో కారు కనిపించలేదు.’
కాసేపు నిశ్శబ్ధం. బహుశా కోపం కొద్దీ లైన్ కట్ చేసివుంటారు.
ఇంతలో ఆయన గొంతు వినిపించింది.
‘ఇడియట్! నువ్వు కారులో వెళ్ళలేదు. నేనే నిన్ను  హోటల్ దగ్గర డ్రాప్  చేసి వచ్చాను. అది మరచిపోయావా?’
నిజమే. ఇక ఏం చెప్పను. నేను కారు తీసుకురానిమాట నిజమే. అమ్మయ్య అనుకున్నాను.
‘సరే లెండి. ఏదో మతిమరపు. వెంటనే బయలుదేరి రండి. ఇంటికి పోదాం’ అన్నాను.
‘యెలా రమ్మంటావు? ఈ కారు మాదే,  దొంగ కారు కాదు మొర్రో  అని ఎంతసేపటి నుంచో మొత్తుకుంటున్నాను. అయినా ఈ పోలీసులు వినిపించుకోవడం లేదే!’


ఇప్పుడు మౌనం నా వంతయింది. (నెట్లో ఇంగ్లీష్ కధకు స్వేఛ్చానువాదం)

30, ఏప్రిల్ 2013, మంగళవారం

నమ్మితే నమ్మండి అను ఇండియా దట్ ఈజ్ భారత్!



కొన్ని విషయాలు వింటుంటే నిజమా! అనిపిస్తాయి.
నిజంగా నిజమేనా అన్న అనుమానం కలిగిస్తాయి. నిజమెంతో నిగ్గుతేల్చే అవకాశం లేనప్పుడు –పోనీ మంచి విషయమే కదా నమ్మేస్తే పోలా అని కూడా అనిపిస్తుంది. అలాటి నమ్మలేని ఓ నిజం నెట్లో సంచరిస్తోంది. నమ్మితే నమ్మండి.
ఇంతకీ ఆ నమ్మలేని నిజం ఏమిటో తెలుసా?
ప్రపంచం యావత్తులో అత్యంత సంపన్న దేశం ‘భారత దేశం’ అన్నదే ఆ నమ్మలేని నిజం.




నిజానికి ఇందులో నిజమెంతో తెలియదు కాబట్టి ఒక కధలాగానే చెప్పుకుందాం.
అనగనగా వైద్యరాజ్ అనే వ్యక్తి ఇంట్లో మూడు పురాతన రాతి విగ్రహాలు వుంటూ వచ్చాయి. ఈ వైద్యరాజ్ మహాశయులవారి వంశ  చరిత్ర కూడా ఘనమైనదే. ఆయన కృష్ణదేవరాయల వంశీకుడు. మూడువందల ఏళ్లనుంచి మైసూరులోని ఆయన గృహంలో ఆ మూడు పురాతన దేవతా విగ్రహాలు తరతరాలుగా పూజలందుకుంటున్నాయి. నిజానికి అవి రాళ్ళూ కావు. దేవతా విగ్రహాలు కావు. లెక్కకట్టడానికి సాధ్యం కాని విలువైన వజ్రాలు. ఈ సంగతి బయటకు పొక్కీపొక్కక ముందే ఆ వజ్రాలను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కారణాలు తెలవవు కాని ఆ వజ్రాలను ప్రస్తుతం ఓ స్విస్ బ్యాంకులో భద్రపరిచి వుంచారు.
అసలు ఈ కధలోని అసలు కధ ఇక్కడే మొదలవుతుంది.
ఈ వజ్రాల విలువను లెక్కకట్టి చూసారు. లెక్కకట్టిన నిపుణులు ఆశ్చర్యంతో నోళ్ళు వెళ్ళబెట్టారు.
ఈ మూడు వజ్రాలలో ఒక్కొక్క దాని విలువ ఎంతంటే అమెరికా, ఇంగ్లాండ్ ఈ రెండు దేశాల స్తూల దేశీయ ఉత్పత్తికంటే ఎక్కువ. వీటిని కొనగలిగిన డబ్బు ప్రపంచ బ్యాంకు దగ్గర కూడా లేదు.
అంతే కాదు వీటిల్లో ఒక్క వజ్రం విలువ తీసుకున్నా – ప్రపంచ బ్యాంకు నుంచి మన దేశం ఇంతవరకు తీసుకున్న అప్పుకు మూడు రెట్లు ఎక్కువ. పది మంది బిల్ గేట్స్ సంపదకు సమానం. వీటితో ఏడు వర్ధమాన దేశాలను కొనుగోలు చేయవచ్చట. ఇంకో ‘ట’ కూడా వుంది. వాయిదాల పద్ధతిలో అమ్మితే కొనడానికి సిద్ధం అని ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చిందట. అయితే మన ప్రధాన మంత్రి గారు మాత్రం ‘ససేమిరా’ అనేసారుట.
మామూలుగా ఇలాటి విషయాలు చెప్పేవాళ్ళు పలానా పేపర్లో రాశారు చూడలేదా అనేస్తారు. అలాగే ఈ కధ చెబుతున్న వాళ్లు కూడా 2011  లోనే  టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఈ వార్త వేసారు, వీలయితే ఆ పాత పేపరు తెచ్చుకుని  చదువుకోమంటున్నారు. హిందూ లో కూడా రాశారు చూసుకోమంటున్నారు. స్టార్ టీవీ వాళ్లు ఈ వజ్రాల వ్యవహారం గురించి ఓ డాక్యుమెంటరీ ప్రసారం చేశారంటున్నారు.
ఇదంతా చదివిన తరువాత ఎప్పుడో ఏనాడో విన్న ‘ఫారెన్ లాటరీ’ సంగతులేమైనా గుర్తుకువస్తే మాత్రం నా పూచీ లేదు. (30-04-2013)
Note: Courtesy Image Owner 

29, ఏప్రిల్ 2013, సోమవారం

అభినవ శబరి కధ



ఆ ముసిలావిడ్ని చూస్తే   బస్ కండక్టర్ కు ముచ్చటేస్తుంది. ఎందుకంటే  ఎప్పుడు బస్సు ఎక్కినా సరే దగ్గరకు  పిలిచి గుప్పెడు జీడిపప్పులో, బాదం పప్పులో అతడి చేతిలో పోస్తుంది.


ఒకరోజు అడిగాడు. యెందుకు మామ్మగారు ఇలా జీడిపప్పులు మీరు తినకుండా నాలాటి వాళ్లకు ఇస్తుంటారు
నవలడానికి పళ్ళు లేవు నాయనా!   అందుకే నీ బోటి వాళ్లకు ఇస్తుంటాను’ అంది.
‘మీకు  పళ్ళు లేవు. తినలేరు. అది సరే!  మరి వీటిని యెందుకు కొంటున్నట్టు? ఎవరి కోసం కొంటున్నట్టు?’ మళ్ళీ అడిగాడు కండక్టర్ ఆవిడ ఇచ్చిన జీడిపప్పుల్ని నోరారా నవిలి తింటూ.
‘జీడిపప్పులు అంటే తినలేను  కాని వాటి చుట్టూ వుండే చాక్లెట్ అంటే నాకు ప్రాణం.  అందుకే షాపుల్లో ఇలాటి చాకో నట్
చాక్లెట్లను వెతికి మరీ కొంటుంటాను.’ వున్న మాట చెప్పేసి ముసలావిడ  బస్సు దిగి వెళ్ళిపోయింది.

(courtesy image owner)

27, ఏప్రిల్ 2013, శనివారం

మన్నించడమే మనిషి పని



ఆ దంపతులది అన్యోన్య దాంపత్యం.   లేక లేక మగపిల్లవాడు  పుట్టాడు. వాళ్ల ఆనందానికి అంతే లేదు. ఎత్తుకెత్తుగా పిల్లాడిని అబ్బురంగా అపురూపంగా పెంచుకుంటున్నారు. చూస్తుండగానే  అతడికి రెండేళ్లు వచ్చాయి.




తండ్రి ఒక రోజు హడావిడిగా ఆఫీసుకు వెళ్లాడు. ఆ తొందరలో తాను రోజూ వేసుకునే మందు  బాటిల్ మూతపెట్టడం మరచిపోయాడు.  ఆఫీసుకు వెళ్ళగానే ఆ విషయం గుర్తుకువచ్చింది. వెంటనే ఇంటికి  ఫోను చేసి భార్యకు విషయం చెప్పి ముందు ఆ  మందు  సీసా మాట  సంగతి చూడమన్నాడు. ఆమె సరే అంది కాని ఇంటిపనుల్లో తలమునకలైవుండి  ఆ విషయమే మరచిపోయింది. భర్త గుర్తు చేసిన విషయం ఆలస్యంగా ఆమెకు  గుర్తుకు వచ్చింది. కాని అప్పటికే జరగాల్సిన ఆలశ్యం జరిగిపోయింది.
ఇంట్లో  ఆడుకుంటున్న పిల్లాడికి భోజనాల బల్ల మీది మందు సీసా కనిపించింది. అందులోని ద్రవం రంగు అతడిని ఆకర్షించింది. చూసి ముచ్చట పడ్డాడు. మూత లేని ఆ సీసా పట్టుకుని  అందులోని మందంతా  గటగటా తాగేసాడు. అది పెద్దవాళ్ళు వాడాల్సిన మందు. వాళ్ళు కూడా కొద్ది డోసుల్లో తీసుకోవాల్సిన ఘాటయిన  ఔషధం. సీసా మొత్తం ఒకేసారి తాగడంతో ఆ పసివాడు తట్టుకోలేకపోయాడు.  మందు వికటించి పిల్లాడు వున్నపెట్టున స్పృహ కోల్పోయాడు. అది చూసి తల్లి  చిగురుటాకులా వొణికిపోయింది. అదిరే గుండెలతో  ఆదరాబాదరాగా పిల్లాడ్ని చేతుల మీద వేసుకుని దగ్గరలోని  ఆస్పత్రికి తీసుకువెళ్ళింది. భర్తకు ఫోను చేసి విషయం చెప్పింది. అప్పటికే  జరగరానిది జరిగిపోయింది. పిల్లాడి ప్రాణం పోయిందని  డాక్టర్లు  చెప్పగానే ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి. ఆ నిజాన్ని తట్టుకోలేక  నిస్సత్తువుగా  కూలబడిపోయింది.
తండ్రి ఆఫీసునుంచి ఆఘమేఘాలమీద  వచ్చాడు. విగతజీవుడిగా మంచం మీద పడివున్న కన్నకొడుకుని చూశాడు. గుండెల్లోనుంచి  దుఃఖం తన్నుకువచ్చింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లవాడు తమ  అశ్రద్ధకి బలై  పోయాడన్న వాస్తవం అతడ్ని మరీ కుంగ తీసింది.  కుర్రాడి శవం పక్కనే కూలబడి గుండెలు బాదుకుంటూ రోదిస్తున్న భార్యను చూశాడు. ఆమె వైపు నెమ్మదిగా అడుగులు వేశాడు.
ఇదంతా తన వల్లనే జరిగిందనీ,  ఫోను రాగానే చేతిలో పని పక్కనబెట్టి ముందా  మందు సీసా భద్రం చేసి వున్నట్టయితే  ఈ పరిస్తితి  వచ్చివుండేది కాదని ఆ తల్లి  తల్లడిల్లుతోంది. భర్త వంక చూడడానికి కూడా భయపడుతోంది. నీవల్లనే ఇదంతా జరిగిందంటూ కోపడతాడని  కంగారు పడుతోంది.
అతడు భార్య దగ్గరికి వచ్చాడు. భార్య కళ్ళల్లోకి చూశాడు. ఆ చూపులో కోపం  లేదు. భుజం మీద చేయివేశాడు.ఆ స్పర్శలో కాఠిన్యం లేదు.  నెమ్మదిగా భార్యతో అన్నాడు.
‘ఇందులో ఎవరు చేసిందీ లేదు. ఎవరు చేయ కలిగిందీ  లేదు.వాడితో మనకు ప్రాప్తం లేదు. అందుకే ప్రాప్తమున్నలోకానికి వెళ్ళిపోయాడు’
భర్త నుంచి వచ్చిన ఈ అనూహ్య  స్పందన ఆమెను అంతులేని ఆశ్చర్యానికి గురిచేసింది.
కలా  నిజమా అనుకుంది. ఎన్నోమాటలు పడాల్సివస్తుందని అనుకుంటే భర్త పల్లెత్తు మాట అనకపోవడం  ఆమెకు వూరట కలిగించింది. జరిగినదాన్ని పొరబాటుగా తీసుకున్నాడే కాని తప్పుగా భావించని భర్త ఉదాత్త మనస్తత్వం  ఆమెను కదిలించివేసింది.  

‘జరగరాని ఘోరం జరిగిపోయింది. పొరబాటు  ఎవరిదయినా పిల్లవాడు దక్కకుండా పోయాడు. ఇందులో  నాకూ  భాగం వుంది. ఆఫీసు తొందరలో వెడుతున్నా కాస్త నేనే ఆ  మందు సీసా మూత తానే పెట్టినట్టయితే ఇంత ఘోరం జరిగివుండేదే కాదేమో.’
భర్త మాటలు లీలగా వినబడుతున్నాయి.
అతడి ఆలోచనలు అతడివి.
‘భార్యను నిందించడం వల్ల  లాభం ఏమిటి?  పిల్లాడిని కోల్పోయి అసలే పుట్టెడు దుఃఖంలో వుంది. నవమాసాలు మోసింది ఆమె.  పురిటి నొప్పులు భరించింది ఆమె.  ఇంటిదీపం కంటిముందే కన్నుమూయడం కంటే  కన్నతల్లికి  గర్భశోకం వేరే ఏముంటుంది.  నెపం  మోపి ఈ పాపం నీదే అనేయడం తేలికే. కాని అలాటి ఈటెల్లాంటి మాటలతో మనసును మరింత గాయపరిస్తే   ఆ కన్నతల్లి కడుపు మరెంతగా రగిలిపోతుంది.’
ఇలా ఆలోచించిన అతగాడు  భార్యను పల్లెత్తు మాట అనలేదు.
నిజానికి   ఈ పరిస్తితిలో ఆమెకు కావాల్సింది కూడా  వూరడింపుతో కూడిన ఓ చల్లని మాట. అది అర్ధం చేసుకున్నవాడు కాబట్టే  అతడు ఆ  విజ్ఞతను ప్రదర్శించాడు.  దానితో, అంత  దుఃఖంలోవున్న ఆమె మనసు  దూదిపింజలా తేలికయింది.
మంచి మనసుకు మంచితనం తోడయితే ఆ మనిషి మహామనీషి అవుతాడు.

(27-04-2013)