10, నవంబర్ 2012, శనివారం

మిత్రవాక్యం



ఐ. వెంకట్రావు, చీఫ్ ఎడిటర్, మహా టీవీ,
మాజీ ఎడిటర్, ఆంధ్ర జ్యోతి, మాజీ చైర్మన్, ప్రెస్ అకాడమి



అలనాటి సోవియట్ అనుభవాలు అంటే ఇదేదో రాజకీయ సంబంధమైన పుస్తకం అనుకున్నాను. కానీ భండారు శ్రీనివాసరావు వాటి జోలికి పోకుండా కేవలం ఒక సాధారణ వ్యక్తిగా తన అనుభవాలను గ్రంథస్తం చేయడం బాగుంది. ఈ పుస్తకానికి ‘మార్పు చూసిన కళ్ళు’ అని పేరు పెట్టడం ఇంకా బాగుంది. ఇందులోనే  ఆయన కవి హృదయం కూడా  అర్ధమవుతుంది.
శ్రీనివాసరావు, నేనూ డెబ్బయ్యవ దశకంలో బెజవాడలో ఆంధ్ర జ్యోతిలో కలిసి పనిచేసాము. వాళ్ల అన్నగారు భండారు పర్వతాలరావు గారినుంచి చక్కని  సంభాషణా చతురతను  అందిపుచ్చుకుని వుంటారు. ఎక్కడవుంటే అక్కడ నవ్వుల వాన కురిపించడం వాళ్లకు వంశానుగతంగా లభించిన వరమేమో.
శ్రీనివాసరావు   జర్నలిస్టుగా కన్నా హాస్య  రచయితగా  మరింత బాగా రాణిస్తాడన్న అభిప్రాయం మాలో చాల మందికి వుండేది.  ఆరోజుల్లోనే  ఆంధ్రజ్యోతిలో ఆయన అనుదినం  రాసిన  నాలుగు పంక్తుల ‘వాక్టూన్లు’,  ఆ తరువాత ఆకాశవాణిలో సొంత గొంతుకతో  వారం వారం వినిపించిన ‘జీవన స్రవంతి’ దీనికి ప్రబల  తార్కాణం. ఆ వొరవొడే ఈ పుస్తకంలో కూడా తొంగి చూసింది. చదివించే గుణాన్ని  సుతారంగా ఈ రచనకు అద్దింది.
శ్రీనివాసరావు మాస్కోలో వున్న రోజుల్లో నేనొకసారి వెళ్లాను. వున్నది కొద్ది రోజులే అయినా ఈ పుస్తకంలో రాసినవి అక్షర సత్యాలని అప్పటి రోజులను తలచుకుంటే అనిపిస్తోంది.
ఇన్నేళ్ళ తరువాత రాసినా వాటిల్లో తాజాతనం తగ్గకపోవడానికి ఆ రోజులకున్న ప్రత్యేకతే కారణం.
భండారు శ్రీనివాసరావు ఆకాశవాణి నుంచి, దూరదర్శన్ నుంచి వృత్తిరీత్యా  పదవీ విరమణ చేసివుండవచ్చు.  కానీ,  ప్రవృత్తి రీత్యా ఆయనకు అక్షర సన్యాసం లేదు. అందుకే కాబోలు ఇప్పటికీ ఆయన అక్షర సాంగత్యాన్నే కొనసాగిస్తున్నారు.
ఆలస్యంగా అయినా ఈ  పుస్తకాన్ని వెలుగులోకి తీసుకువస్తున్నందుకు ‘వయోధిక పాత్రికేయ సంఘం’ వారు అభినందనీయులు.


(సం) ఇనగంటి వెంకట్రావు 



మార్పుచూసిన కళ్ళు


మార్పుచూసిన కళ్ళు


“కొంత కాలం గడిచిన తరువాత కొన్ని విషయాలు విచిత్రంగా అనిపిస్తాయి. కొన్ని ఔనా! అనిపిస్తే మరికొన్ని ఔరా! అనిపిస్తాయి. గతానికి వున్న గొప్పదనం అదే.
“భండారు శ్రీనివాసరావు రాసిన ‘మార్పు చూసిన కళ్ళు’ చదువుతుంటే ఆయన అనుభవాలు అందరి అనుభవం లోకి వస్తే యెంత బాగుండు అని నాకు అనిపించింది. కానీ ఇప్పుడది అసంభవం. రచయిత ఆ దేశంలో గడిపివచ్చిన కాలం అలాటిది. ఇప్పుడది చరిత్రలో భాగం.
“ఒక దేశంలో కొన్నాళ్లో, కొన్నేళ్లో వుండివచ్చేవాళ్ళు చాలామంది తారసపడుతుంటారు. అక్కడి అనుభవాలను గుదిగుచ్చినట్టు చెప్పేవాళ్ళూ  వుంటారు. కానీ, ఆహ్లాదకరంగా, వాస్తవాలను వక్రీకరించకుండా, ఏకబిగిన చదవాలని అనిపించేట్టుగా కొందరు మాత్రమే తమ అనుభూతులను అక్షరబద్ధం చేయగలుగుతారు. ఇది చదివిన తరువాత శ్రీనివాసరావు ఈ కోవకు చెందిన వాడన్న అభిప్రాయం నాకు కలిగింది.”


– శ్రీ కె.ఎస్.శర్మ,(ఐ.యే.ఎస్.),  మాజీ సీయీవో, ప్రసార భారతి (ఆకాశవాణి,దూరదర్శన్) న్యూ ఢిల్లీ

ఈ విశేషాలు తెలుసుకోవాలంటే   ‘మార్పుచూసిన కళ్ళు’ పుస్తకం చదవండి. అలనాటి కమ్యూనిస్ట్ రష్యా చరమాంకం విశేషాలను అక్షరబద్ధం చేస్తూ సాగిన రచన. ముద్రణ పూర్తయి విడుదలకు సిద్ధంగా వుంది. ప్రతులకు, వివరాలకు: శ్రీ కె. లక్ష్మణరావు, కార్యదర్శి, వయోధిక పాత్రికేయ సంఘం, హైదరాబాదు. ఫోను: 9394712208, Email: lakshmanarao_konda@yahoo.co.in>,

9, నవంబర్ 2012, శుక్రవారం

రష్యన్ మహిళ నోట తెలుగు మాట


రష్యన్ మహిళ నోట తెలుగు మాట



మేము మాస్కో చేరిన మరునాడే రేడియో మాస్కో తెలుగు విభాగంలో పనిచేసే లిదా స్పిర్నోవా అనే ఆవిడ మా ఫ్లాట్ కు వచ్చి తనని తాను పరిచయం చేసుకుంది.
'శ్రీనివాసరావు గారూ మీ ఆగమనం కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తూ రోజులు గడుపుతున్నాము’ అంటూ జగదేకవీరుడు సినిమాలో సరోజాదేవి మాదిరిగా ముద్దుముద్దుగా మాట్లాడుతుంటే దేశం కాని దేశంలో తెలుగు తెలిసిన విదేశీ వనిత ఒకరున్నారని సంతోషపడ్డాము.’
వివరాలు తెలుసుకోవాలంటే ‘మార్పుచూసిన కళ్ళు’ పుస్తకం చదవండి. అలనాటి కమ్యూనిస్ట్ రష్యా చరమాంకం విశేషాలను అక్షరబద్ధం చేస్తూ సాగిన రచన. ముద్రణ పూర్తయి విడుదలకు సిద్ధంగా వుంది. ప్రతులకు, వివరాలకు: శ్రీ కె. లక్ష్మణరావు, కార్యదర్శి, వయోధిక పాత్రికేయ సంఘం, హైదరాబాదు. ఫోను: 9394712208, Email: lakshmanarao_konda@yahoo.co.in>,

మాస్కో ఎయిర్ పోర్ట్ లో ఇంగువ తెచ్చిన తంటా


మాస్కో ఎయిర్ పోర్ట్ లో ఇంగువ తెచ్చిన తంటా






"మాస్కోలో శాకాహారులకు ఏమీ దొరకవు అన్న హెచ్చరికలతో బయలుదేరిన మేము - మాస్కో ఎయిర్ పోర్ట్ లో  లగేజి కలెక్ట్ చేసుకునేందుకు ఎదురు చూస్తున్నాము. హైదరాబాదు నుంచి సూటు కేసులనిండా పట్టుకొచ్చిన వంట  సంభారాలతో కస్టమ్స్ అధికారులనుంచి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు కాని, మా ఆవిడ తెచ్చిన ఇంగువ డబ్బా కొంత తంటా తెచ్చిపెట్టింది. ఇంగువని ఇంగ్లీష్ లో ఏమంటారో ఆ క్షణంలో గుర్తురాలేదు. అది తినే వస్తువనీ, వంటల్లో వాడుకుంటామని ఎన్నో విధాలుగా చెప్పిచూసాను. ఇంగ్లీష్ భాష ఇసుమంత కూడా అర్ధం కాని రష్యన్ అధికారుల ముందు నా ప్రయత్నం వృధా ప్రయాస అని అర్ధం అయింది. పైపెచ్చు ఘాటయిన ఇంగువ వాసన వారి అనుమానాలను మరింత పెంచింది. చివరకు ఇంగువ ముక్క నోటిలో వేసుకుని నమిలి చూపించి, అది వారనుకుంటున్నంత ప్రమాదకరము, మాదక ద్రవ్యం కాదని రుజువు చేసుకున్న తరువాతనే అక్కడ నుంచి బయట పడగలిగాము" 
   
ఇలాటి సంగతులు తెలుసుకోవాలంటే ‘మార్పుచూసిన కళ్ళు’ పుస్తకం చదవండి. అలనాటి కమ్యూనిస్ట్ రష్యా చరమాంకం విశేషాలను అక్షరబద్ధం చేస్తూ సాగిన రచన. ముద్రణ పూర్తయి విడుదలకు సిద్ధంగా వుంది. ప్రతులకు, వివరాలకు: శ్రీ కె. లక్ష్మణరావు, కార్యదర్శి, వయోధిక పాత్రికేయ సంఘం, హైదరాబాదు. ఫోను:            9394712208      , Email: lakshmanarao_konda@yahoo.co.in>,

5, నవంబర్ 2012, సోమవారం

ప్రసిద్ధ జర్నలిస్ట్ ధర్మవరపు సీతారాం ఇక లేరు


ప్రసిద్ధ జర్నలిస్ట్ ధర్మవరపు సీతారాం ఇక లేరు
ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ ధర్మవరపు సీతారాం ఈ సాయంత్రం (సోమవారం)  హైదరాబాదు, సీతాఫల్ మండి లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన వయస్సు 87  సంవత్సరాలు. కొద్దికాలంగా ఆయన అస్వస్తులుగా వున్నారు. జర్నలిజాన్ని ఒక నషాగా భావించే సీతారాం పెద్దగా చదువుకోలేదు. 1925 అక్టోబర్ ఆరోతేదీన నల్గొండ జిల్లా, హుజూర్ నగర్  సమీపంలోని  లక్కారం గ్రామంలో జన్మించిన సీతారాం హైదరాబాదు విమోచనకు ముందు హైదరాబాదు బులెటిన్అనే జర్నల్ లో జర్నలిస్టుగా  జీవితాన్ని ప్రారంభించారు. అప్పటినుంచి పత్రికా రచయితగా అయిదు దశాబ్దాల సుదీర్ఘ జీవితం కొనసాగించారు. కొంతకాలం స్కై లైన్ అనే పత్రికను  నడిపారు. స్టేట్స్ మన్, ఇకనామిక్ టైమ్స్, పేట్రియాట్, లింక్ వంటి ప్రసిద్ధ ఆంగ్ల జాతీయ  పత్రికల్లో పనిచేశారు. యు.ఎన్.ఐ. వార్తాసంస్థకు హైదరాబాదు, కలకత్తా, మద్రాసు బ్యూరోల అధిపతిగా సేవలందించారు. వీ.వీ.గిరి రాష్ట్రపతిగా వున్నకాలంలో ఆయనతో కలసి యూరోపులో పర్యటించారు. నిర్భీతి, నిజాయితీ, ముక్కుసూటితనం ఆయన నైజం. జర్నలిస్టుగా ఆయన సాధించిన విజయాలు యువ జర్నలిస్టులు  నేర్చుకోవాల్సిన పాఠాలు. శ్రీ సీతారాం కాలంలో జర్నలిస్టుగా వున్నందుకు గర్విస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ‘జర్నలిజం ఒక నషాఅంటూ  ఆయన రాసిన ఒక వ్యాసంలోని కొన్ని విశేషాలతో ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తాను.


శ్రీ డి.సీతారాం 

పదహారేళ్ళ వయస్సులో హైదరాబాదు బులెటిన్ లో కుర్ర రిపోర్టర్ గా చేరాను. సైకిల్ చేతిలో వుండేది. తొలి అనుభవాలనుంచే రిపోర్టర్ చాలా నేర్చుకుంటాడు.
నిజానికి జర్నలిజం ఒక వ్యామోహం. మానవ సహజమయిన సౌకర్యాలను గురించి పట్టింపు వుండేది కాదు. వీటన్నిటికీ పరిహారం ఏమిటంటే, మీకు లభించే గుర్తింపు. మీరంటే గౌరవిస్తారు. మీరంటే భయపడతారు.
ఒక్కోసారి పెద్ద ప్రయత్నం  లేకుండానే కొన్ని అద్భుతమైన  వార్తలు వచ్చి  విలేకరి వొళ్ళో  పడతాయి. 1967  లో నిజాం అస్వస్థతకు గురై మరణించినప్పటి వార్త నాకు అలానే అయాచితంగా దొరికింది. అప్పుడు యు.ఎన్.ఐ. ఆఫీసు నిజాం క్లబ్ ని ఆనుకుని వున్న రోషన్ మంజిల్ లో వుండేది. అప్పట్లో మూడు సంపన్న క్లబ్బుల్లో సభ్యత్వం కలిగిన ఏకైక జర్నలిష్టును నేనే. అక్కడ బ్యూరో చీఫ్ గా ఉద్యోగం చేస్తూనే నాలుగు ఆంగ్ల పత్రికలకు కరస్పాండెంట్ గా పనిచేసేవాడిని.సహజంగా క్లబ్బు పక్షులకు అన్ని రకాల వారితో ఇష్టాగోష్టిగా మాట్లాడుకునే వీలుంటుంది. పారిశ్రామికవేత్తలు, ఐ.యే.ఎస్., ఐ.పి.ఎస్. వంటి మూడక్షరాల బ్యూరోక్రాట్లు, జూదర్లు,లోఫర్లు,తిరుగుబోతులు అందరూ అక్కడ దర్శనమిస్తారు. రాజకీయ,అధికార సౌధాల్లోని ముచ్చట్ల నుంచి సామాజిక రంకు పురాణాల వరకు అక్కడ బయల్పడుతుంటాయి. నా నివాసం జాంబాగ్ లో. స్కూటర్ పై బయలుదేరి బొగ్గులకుంట మీదుగా యే అర్ధరాత్రికో ఇంటికి చేరుకోవడం అలవాటు. ఓ రాత్రి అలా  వస్తుండగా నిజాం రాజ భవనంలో దీపాలు వెలుగుతూ కనిపించాయి. ప్రధాన ద్వారం తెరిచివుంది. గార్డులు  సావధానంగా నిలబడి వున్నారు. ఒక కారు బయటకు వస్తోంది. కారులో వున్నది డాక్టర్ రామయ్య కాదుకదా అన్న అనుమానం కలిగింది. ఇంటికి వెళ్లి డాక్టర్ కు ఫోను చేసాను. రాజభవనంలో ఎవరో అస్వస్తులుగా వున్నారు. ఎవరని అడిగితే  కరక్టుగా జవాబు రాకపోవచ్చు. అందుకే ధైర్యం చేసి సూటిగా అడిగేశా. డాక్టర్, ముసలాయన తెల్లారేదాకా వుంటాడాఅని. ఆయన ముక్తసరిగా యెలా చెప్పగలను? మంచే జరుగుతుందని అనుకుందాంఅన్నాడు. ఇక ఆలశ్యం చేయకుండా ఫోను తీసుకుని ఆఫీసుకు ఫోను చేసి డ్యూటీలో వున్న ఆపరేటర్ కు  నిజాం కు తీవ్ర అస్వస్తతఅంటూ రెండు లైన్ల ఫ్లాష్ వార్త చెప్పాను. ఉద్దేశ్య పూర్వకంగానే స్తానిక పత్రికలకు ఈ వార్తను తెల్లవారు ఝాము వరకు విడుదల చేయకుండా ఆపాను. ఈ విధంగా చేయడం వల్ల ప్రత్యర్ధి న్యూస్ ఏజెన్సీ పీ.టీ.ఐ. కి వార్త లీక్ అయ్యే అవకాశం వుండదు. మరునాటికల్లా ఈ వార్త సంచలనంగా మారింది. నిజాం వంటశాలలో పనిచేసేవాడు మా ఆఫీసులో ప్యూను జానే జాద్  కు బంధువు. సమాచారం పట్టి సాయంత్రానికల్లా నిజాం మృతిఅంటూ స్నాప్ వార్త పంపాను. ప్రత్యర్ధి వార్తా సంస్థలు  అప్పటికి ఇంకా నిజాం అస్వస్థతకు సంబంధించిన వార్తలు మాత్రమే ఇస్తున్నాయి. ఆ సమయంలో మా వార్తాసంస్థ నిజాం మరణం గురించి ప్రపంచానికి తెలియచేసింది.
ఇలాటి ఆసక్తికర కధనాలు అనేకం ఆ వ్యాసంలో సీతారాం చెప్పుకొచ్చారు.  (05-11-2012) 

ఇద్దరు అధికారులు – ఒకే పాఠం - భండారు శ్రీనివాసరావు


ఇద్దరు అధికారులు – ఒకే పాఠం 
యెంత అల్పులమో తెలుసుకోవడానికి అనుదినం ఎదురయ్యే సంఘటనలను కొంత నిశితంగా పరిశీలిస్తే చాలని గత రెండు రోజుల అనుభవం నాకు మరోసారి తెలియపరిచింది.
మొన్న శనివారం నాడు దూరదర్శన్ సప్తగిరి ఆధ్వర్యంలో హైదరాబాదు రవీంద్రభారతిలో స్వర సమరం అనే సంగీత పోటీ జరిగింది. గవర్నర్ శ్రీ నరసింహన్ ముఖ్య అతిధి. సతీసమేతంగా హాజరయి శాస్త్రీయ సంగీతం పట్ల తమ మక్కువను చూపారు. ఆద్యంతం తెలుగులో ప్రసంగిస్తూ ఇలాటి అద్భుత కార్యక్రమాలను నిర్వహించే శక్తి కేవలం దూరదర్శన్ కు మాత్రమే వుందని ఉద్ఘాటిస్తూ, ఆ సంస్థ ఇటువంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించడం ద్వారా శాస్త్రీయ  సంగీతాన్ని ప్రోత్సహించాలని ఉద్బోధించారు. సరే అసలు విషయం ఇది కాదు.
మాజీ పోలీసు డైరెక్టర్ జనరల్ శ్రీ ఆర్.ప్రభాకర రావు, వారి శ్రీమతి వేదవతి  సంగీతం మీద వున్న ఆసక్తితో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.   శ్రీ ప్రభాకర రావు పోలీసు శాఖలో అనేక ఉన్నత పదవులను నిర్వహించి సమర్ధుడైన అధికారిగా నిరూపించుకున్నారు. ఆయన్ని గుర్తుపట్టిన దూరదర్శన్ సిబ్బందిలో కొందరు వారిని మొదటి వరుసలో కూర్చోవాల్సిందిగా అభ్యర్ధించారు. అయినా సున్నితంగా తిరస్కరించి సాధారణ ప్రేక్షకుల మాదిరిగానే వారిద్దరూ వెనుక వరుసలోనే కూర్చుని కార్యక్రమాన్ని ఆసాంతం తిలకించారు.


శ్రీ ప్రభాకరరావు,శ్రీమతి వేదవతి 

గవర్నర్ పాల్గొంటున్న దృష్ట్యా రవీంద్రభారతి ఆవరణలో కట్టుదిట్టమయిన పోలీసు బందోబస్తు చేశారు. కార్యక్రమం ముగిసిన తరువాత  రంగస్థలం మీద కళాకారులను అభినందిస్తూ  నరసింహన్ దంపతులు  కొద్దిసేపు అక్కడే వుండిపోయారు. ప్రభాకరరావు దంపతులు ఈలోగా బయటకు వెళ్ళడానికి ప్రయత్నించగా ద్వారం వద్దవున్న పోలీసు అధికారులు అడ్డగించారు. కొత్తగా ఉద్యోగంలో చేరి విధులు నిర్వహిస్తున్న ఆ సిబ్బందికి తాము అభ్యంతరం చెబుతున్న వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం తమ శాఖకు అత్యున్నత అధికారిగా పనిచేశారన్న విషయం తెలిసివుండక పోవచ్చు. మధ్యలో ఎవరో కల్పించుకుని ఆయన ఎవరో చెప్పబోతుంటే శ్రీ ప్రభాకర రావు వద్దని సైగచేసారు. ‘వారి డ్యూటీ వారిని చేయనీయండి’ అంటూ మళ్ళీ వెనక్కు వచ్చి హాలులో కూర్చుండిపోయారు.
రోజు తిరగకుండా మరో సారి మళ్ళీ ఇదేమాదిరి సంఘటన అనుభవంలోకి వచ్చింది. మర్నాడు  ఆదివారం గవర్నర్ శ్రీ నరసింహన్ పుట్టినరోజు. రాజభవన్ లో అనేకమంది వారిని కలుసుకుని శుభాకాంక్షలు తెలియచేసారు. శ్రీ నరసింహన్ పూర్వాశ్రమంలో పోలీసు అధికారిగా పనిచేసినందువల్లనేమో లోగడ పోలీసు శాఖలో ఉన్నత పదవుల్లో పనిచేసిన అనేకమంది గవర్నర్ ను అభినందించడానికి రాజ్ భవన్ కు వచ్చారు. గతంలో రేడియోలో పనిచేసి నప్పుడు సన్నిహితంగా మెలిగిన అనేకమంది  అధికారులను చాలా సంవత్సరాల తరువాత అక్కడ కలుసుకోవడం జరిగింది. వారిలో శ్రీ రామస్వామి ఒకరు. ఆయన హైదరాబాదు పోలీసు కమీషనర్ గా  పనిచేశారు. నిబంధనల ప్రకారం తన సెల్ ఫోనును కారులో బయటే వుంచేసి లోపలకు రావడం చూసి ఆ విషయాన్ని ఆయనతో ప్రస్తావిస్తే ‘పోలీసుశాఖలో ఇన్నేళ్ళు పనిచేసి మేమే రూల్స్ పాటించకపోతే యెట్లా’ అన్నట్టు చిరునవ్వే సమాధానం.
‘ఎదిగినకొద్దీ వొదగమ’ని ఓ సినీ కవి  చక్కని పాట రాశారు. విన్నప్పుడల్లా యెంత చక్కని పాట అని ఎన్నోసార్లు అనుకుంటాం. కాని సందర్భం వచ్చినప్పుడు మాత్రం గుర్తురాదు. ఉద్యోగం ద్వారా సమకూడిన హోదా ఒక్కటే గుర్తుంటుంది.
ఒక రోజు తేడాతో చూసిన ఈ రెండు సంఘటనలు మనసుపై మంచి ముద్రవేశాయి. అలా వుండగలిగితే  యెంత బాగుండు ఒక్క క్షణం అనిపిస్తుంది. కాని మనసు కోతి లాటిది. దానికి తోడు,  పాడు అహం ఆ ఆలోచనను అనుక్షణం చంపేస్తూనే వుంటుంది. ఏం చేస్తాం! (05-11-2012)                     

3, నవంబర్ 2012, శనివారం

దేశాన్ని ఎవరు పాలిస్తున్నారు? – భండారు శ్రీనివాసరావు


దేశాన్ని ఎవరు పాలిస్తున్నారు? భండారు శ్రీనివాసరావు
 
న్యాయబద్ధంగా, చట్ట బద్ధంగా ఒక కోటి రూపాయలు సంపాదించాలంటే ఎన్నేళ్ళు కష్టపడాలి? యెంత కష్ట పడాలి?
అదే అక్షరాలా నలభయ్ మూడు వేల  కోట్లరూపాయలు సంపాదించాలంటే
ఇది కాలము,దూరము,  కాలము సమయము లెక్కకాదు లెక్కకట్టి చెప్పడానికి. కానీ ఈ ప్రశ్నకూ  ఈ మధ్య జవాబు  దొరికింది.
ఒక్క కేంద్ర మంత్రిని తప్పిస్తే చాలు అంత  డబ్బూ రెక్కలు కట్టుకుని వచ్చి వొళ్ళో వాలుతుందని అపర కుబేరుడు రిలయన్స్ సంస్థాపక అధినేత దీరూ భాయ్ అంబానీ పెద్ద కుమారుడు ముఖేష్ అంబానీ రుజువు చేశారు.        
ప్రభుత్వాలపై కార్పొరేట్  ప్రపంచం పట్టు ఎలాటిదో ఈ సంఘటన తెలియచెప్పింది.


పాలకులు సంపన్న వర్గాల నడుమ ఈ రకమయిన పరస్పరాధేయ సంబంధాలు అనేక  దేశాల్లో అనేకానేక రూపాల్లో కానవస్తాయి. రాజులు రాజ్యాల రోజుల్లో పాలకులపై పెత్తనాన్ని మత పెద్దలు పోషిస్తే, ఆధునిక కాలంలో బడా పారిశ్రామిక వేత్తలు ఈ పాత్రను సొంతం చేసుకున్నారు.
రాజకీయ పార్టీలకు అధికారం పరమావధి. ఎన్నికల సమరాంగణంలో గెలిచి పీఠం ఎక్కాలంటే డబ్బుది ప్రధాన భూమిక. డబ్బు ద్వారా అధికారం అన్నది వారి మార్గం అయితే, అధికారంలో వున్నవారిని లోబరచుకోవడం  ద్వారా డబ్బు సంపాదించడం పారిశ్రామికవర్గాల పన్నుగడ. అందుకే వీరి నడుమ సయోధ్యకు సానుకూలతలు అనేకం. అవగాహనకు అవకాశాలు అపారం. ఇచ్చి పుచ్చుకోవడాలకు వీలు సాళ్లు పుష్కలం.

అయితే, ప్రభుత్వాలపైనా, పాలకులపైనా రాజ్యాంగేతర శక్తులు పట్టుచిక్కించుకుంటే ముందు దెబ్బతినేది  పాలితులయిన ప్రజల ప్రయోజనాలే. పాలకులు, పారిశ్రామికవేత్తలకు నడుమ పైకి కనిపించకుండా  కుదిరే ఏవిధమయిన వొప్పందం అయినా అది సామాన్య  జనాలకు మేలు చేసేదిగా వుంటుందని అనుకోవడానికి వీలుండదు.
ఈ ప్రస్తావనకు ప్రాతిపదిక అయిన వర్తమానానికి వస్తే –
ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. ఎన్నికల సమరాంగణంలోకి దూకే  పోరాట జట్టుగా కొత్త మంత్రివర్గాన్ని ప్రధానే అభివర్ణించారు. ఇందుకోసం ఆయనా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కలసి పెద్ద కసరత్తే చేశారు. సీనియారిటీ లెక్కలు తీసారు. విధేయతను కొలిచి చూసారు. రాహుల్ కోరిక మేరకు యువకులను, కొత్తవారిని మంత్రులుగా తీసుకున్నారు. మొదటిసారి లోకసభకు ఎన్నికయినవారికి కూడా మంత్రి పదవులు ఇచ్చారు. ఈ క్రమంలో  కొందరు సీనియర్లకు ఉద్వాసన చెప్పారు. వారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. మంత్రిపదవే పోయిన తరువాత ఇక కొత్తగా కట్టబెట్టే పార్టీ పదవులతో చేసేదేమిటన్న నిర్వేదం కొందరికి  మిగిల్చారు. తాజాగా  ఆరోపణల  మచ్చ పడ్డ  మరికొందరికి మాత్రం  మరింత మంచి శాఖలు పందారం చేశారు. వినయ విధేయతల ప్రాతిపదికపై  కొన్ని కొత్త ముఖాలకి మంత్రివర్గంలో చోటు కల్పించారు. విధేయత విషయంలో అందరికంటే ఒక  ఆకు ఎక్కువ చదివిన సీనియర్లను సామాజిక సమతుల్యం పేరుతొ పక్కనబెట్టారు. ఇది రుసరుసలకు దారితీయడంతో చివరి నిమిషంలో  కొన్నిమార్పులు చేశారు. రోజులు గడవకముందే చేసిన మార్పులకు మరి కొన్ని చేర్పులు చేశారు. ఇంకా చేస్తూనే వున్నారు. మరి ఇంత హైరానా పడి, రోజుల తరబడి కసరత్తులు చేసి సాధించింది ఏమిటన్న ప్రశ్న అలాగే వుంది. సరయిన గుర్తింపు లభించలేదని  అసహనంతో వున్నవాళ్ళు నెమ్మదించలేదు.  మార్పులు చేర్పుల్లో  మంచి హోదా లభిస్తుందని ఆశలు పెంచుకున్న వాళ్లకు కూడా  ఆ ఆనందం ఆఖరి క్షణంలో  ఆవిరై పోయింది. ఆశావహుల సంగతి ఎలావున్నా ఆంధ్ర ప్రదేశ్ కు స్వాతంత్ర్యం లభించిన తరువాత ఎన్నడూ కనీ వినీ ఎరుగని స్థాయిలో పది మందికి మంత్రివర్గంలో స్థానం లభించింది.  చిన్నవో పెద్దవో వివిధ మంత్రిత్వ శాఖలు  దొరికాయి. అంతవరకూ సంతోషించాలి. అయితే, ఈ ప్రక్రియలో తెలంగాణాకు అన్యాయం జరిగిందన్న ఆలోచన పురుడు పోసుకుంది. అది పెరిగి పెద్దది కాకుండానే మరో వాదం తెర ముందుకు వచ్చింది. అసలు తెలంగాణా ఇవ్వడానికే  ఇదంతా చేసారని, జైపాల్ రెడ్డికి చిన్న పోస్ట్ ఇచ్చి  రిజర్వ్ లో పెట్టింది ఇందుకోసమేనని  కొందరు భాష్యాలు చెప్పారు. 
కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయకముందే ఉత్తరాది మీడియా  బాంబు లాంటి వార్త పేల్చింది, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అభీష్టం మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుంచి మన రాష్ట్రానికి చెందిన సీనియర్ మంత్రి జైపాల్ రెడ్డిని తప్పిస్తున్నారని. రిలయన్స్ కు అనుకూలమయిన నిర్ణయాలు తీసుకోవడంలో జైపాల్ రెడ్డి విముఖత  ప్రదర్శిస్తూ  వుండడమే దానికి కారణమని కొన్ని  పత్రికలు ముక్తాయింపు కూడా  ఇచ్చాయి.
మీడియా వూహాగానాలను నిజం చేస్తూ జైపాల్ రెడ్డి శాఖ మారింది. చాలా చిన్న శాఖగా పరిగణించే శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖను జైపాల్ రెడ్డి వంటి సీనియర్ కు వొప్పగించిన తీరు చూసి నివ్వెర పోవడం అందరి వంతు అయింది. ఆయన మాత్రం నిబ్బరం కోల్పోలేదు. పెట్రోలియం శాఖ ఇచ్చినప్పుడు కొంత అసంతృప్తికి గురయ్యాను  కాని ఇప్పుడు శాస్త్ర సాంకేతిక శాఖ కేటాయించినప్పుడు ఎలాటి అసంతృప్తి లేదని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో పండిపోయిన మనిషి. యెలా స్పందించాలో ఆ మాత్రం తెలియని వ్యక్తి కాదు కదా.
అసలేం జరిగి వుంటుందన్న దానిపై కొత్త వూహాగానాలు మొదలయ్యాయి. ఇంకా పేరుపెట్టని కొత్త పార్టీ పెట్టి అన్ని పార్టీలకు చెందిన అగ్ర నాయకులపై  అవినీతి ఆరోపణాస్త్రాలు గుప్పిస్తూ మీడియాలో వెలిగిపోతున్న కేజ్రీ వాల్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని మరింత చెలరేగిపోయారు. అంతకుముందు తాను అవినీతి ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి ఖుర్షీద్ కు  శాఖల మార్పిడిలో పెద్దపీట వేయడం చూసి కేజ్రీ వాల్ కు పుండు మీద కారం రాసినట్టయింది. మీడియాలో వెల్లడయిన సమాచారానికి మరికొంత జోడించి తన అంబులపొదిలో  ఆరోపణాస్త్రాలకు కొదవలేదని  నిరూపించారు.
ముఖేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్  ఇండస్ట్రీస్ సంస్థకు  దేశ ప్రయోజనాలను ప్రభుత్వం తాకట్టు పెట్టిందని, ఇందులో భాగంగానే జైపాల్ రెడ్డిని పెట్రోలియం శాఖనుంచి తప్పించారని కేజ్రీ వాల్  ఆరోపణ. 
ప్రభుత్వంతో  కుదుర్చుకున్న అవగాహనకు విరుద్ధంగా రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తిని దాదాపు నిలిపివేసి  ధర పెంచాలని    అడ్డదారిలో వొత్తిడి తెస్తోందని అంటూ, సరకును దాచి పెట్టి కృత్రిమంగా రేట్లు పెంచాలని చూసే చిల్లర వ్యాపారుల  నైజంతో రిలయన్స్ దిగ్గజం వ్యవహారాన్ని కేజ్రీ వాల్ పోల్చారు. 
ముఖేష్ అంబానీ డిమాండ్లను అంగీకరిస్తే రిలయన్స్ సంస్థకు  అదనంగా 43  వేల కోట్ల  రూపాయల అదనపు లాభం  రాగలదని., కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై 53 వేల కోట్లు అదనపు భారం పడగలదని జైపాల్ రెడ్డి తయారుచేసిన నోట్ లో పేర్కొన్నారని కేజ్రీ వాల్ వెల్లడించారు. కృష్ణా గోదావరి బేసిన్ లో గ్యాస్ అన్వేషణ విషయంలో ప్రభుత్వంపై అధిక భారం పడగల అనేక రాయితీలను గతంలో బీజేపీ సారధ్యంలోని ఎన్ డీ యే ప్రభుత్వం కూడా సమకూర్చి పెట్టిందని ఆయన గుర్తుచేశారు.
ఈ ఆరోపణలను రిలయన్స్ తీవ్రంగా ఖండించింది. వీటి వెనుక స్వార్ధపర శక్తుల ప్రచ్చన్న హస్తం వుందని ఎదురు దాడికి దిగింది.
కేజ్రీ వాల్ ఆరోపణలు ఎలావున్నా, వాటిపై ప్రభుత్వం సరిగా స్పందించకపోవడం గమనార్హం.
ప్రతి ఆరోపణకూ సమాధానం చెప్పడం కుదిరేపని కాదని సమర్ధించుకోవచ్చు. కానీ విషయాలు ఇంత స్పష్టంగా వుండి సందేహాలకు తావిస్తున్నప్పుడు వివరణ ఇవ్వాల్సిన నైతిక బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోజాలదు. లేకపోతే దేశాన్ని ఎవరు పాలిస్తున్నారు ? ప్రజలతో ఎన్నికయిన ప్రభుత్వాలా? ప్రభుత్వ రాయితీలతో సంపద పోగేసుకుంటున్న బడా పారిశ్రామికవేత్తలా?  అనే మరో ప్రశ్న తలెత్తుతుంది.  (03-11-2012)