14, ఏప్రిల్ 2011, గురువారం

సద సంశయం – భండారు శ్రీనివాసరావు

సద సంశయం – భండారు శ్రీనివాసరావు


శీతల పానీయాలు తయారు చేసే కంపెనీలకు శుద్ధి చేసిన మంచి నీటిని ప్రభుత్వం ఎందుకు సరఫరా చేయాలని రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించిన నేపధ్యంలో -


జలాశయాల్లోని నీటిని ప్రజలు తాగడానికి వీలయిన విధంగా ‘రక్షిత మంచి నీరు’ గా మార్చడానికి సంబంధిత ప్రభుత్వ యంత్రాగం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నదో తెలవదు కానీ రాజధాని నగరం హైదరాబాదులో సంపన్న వర్గాలు నివసించే అనేక ప్రాంతాల్లోని సువిశాల భవంతుల్లో- పచ్చిక బయళ్ళు పెంచడానికీ, కులీనులు పెంచుకునే కుక్క పిల్లలకు స్నానాలు చేయించడానికీ, వారి ఖరీదయిన కార్లు కడుక్కోవడానికీ - ప్రజాధనంతో శుద్ధిచేసిన మంచినీటినే మంచినీళ్ళ ప్రాయంలా వాడుతున్నారనేది జగమెరిగిన సత్యం.


ప్రజాహితాన్ని కోరుకునే పెద్దలు ఈ విషయంపై కూడా దృష్టి సారిస్తే బాగుంటుందేమో. (24, అక్టోబర్, 2006)

12, ఏప్రిల్ 2011, మంగళవారం

దటీజ్ ఎన్టీఆర్ – భండారు శ్రీనివాసరావు

దటీజ్ ఎన్టీఆర్ – భండారు శ్రీనివాసరావు


అన్నా హజారే పుణ్యమా అని నీతీ నిజాయితీలను గురించి నలుగురూ తీరిగ్గా చర్చించుకోవడం మొదలయింది. తెలుగు టీవీ చానళ్ళు కూడా అవినీతిని ఖండిస్తూ చర్చా కార్యక్రమాలు నిర్వహించాయి. డీజీపీ గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఏ.కే.మహంతి- ఏ.బీ.ఎన్. ఆంధ్రజ్యోతి ఛానల్లో పాల్గొన్నారు. ఆయన చెప్పిన విషయాలలో ఒక ఆణిముత్యం.

“ ఎన్.టీ.ఆర్. బెస్ట్ సీ.ఎం. ఓ జిల్లాలో పోలీసు అధికారిగా పనిచేస్తున్నప్పుడు నేనంటే గిట్టని కొందరు రాజకీయనాయకులు నాపై లేనిపోని మాటలు చెప్పి నన్ను బదిలీ చేయించాలని చూశారు. ఆయన వారిని రెండే ప్రశ్నలు వేశారు.

‘మహంతి అవినీతి పరుడా? చేతకానివాడా?’

‘కాదన్నారు’ వాళ్ళు.

‘మరేమిటి?’ సీ.ఎం. ఆరా.

‘పార్టీకి పనికిరాడు.’ పార్టీ నేతల జవాబు.

‘పార్టీకి పనికి రాకపోతే మీకేమిటి నష్టం? పార్టీ పని మీరు చేయండి. ప్రభుత్వం చేయాల్సింది అధికారులు చేస్తారు.’ సంభాషణ ముగించారు ఎన్టీఆర్.

వార్తలు- వ్యాఖ్యలు -1– భండారు శ్రీనివాసరావు

వార్తలు- వ్యాఖ్యలు -1– భండారు శ్రీనివాసరావు


సందర్భం : సుబ్బరామిరెడ్డి ఫిలిం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం


ఒక టీవీ ఛానల్ లో అవార్డ్ స్వీకర్త, హాస్య నటుడు బ్రహ్మానందం ప్రసంగిస్తున్న సన్నివేశం ప్రసారమవుతోంది.


“టి. సుబ్బరామిరెడ్డి గారు నాకు ఆధ్యాత్మిక గురువు. ఆయన ఇంట్లో వున్న ‘శక్తి’ పీఠాన్ని చూస్తే చాలు మనల్ని ఏదో శక్తి ఆవహిస్తుంది.”


ఆయన మాటల్లోని ‘శక్తి’ ఆ టీవీ ఛానల్ ఎడిటింగ్ బృందాన్ని ఆవహించినట్టుంది.అంతే! క్షణం ఆలశ్యం లేకుండా అదే వేదిక మీద అర్ధ నగ్న సుందరీమణులు చేసిన అశ్లీల నృత్య ప్రసారం ప్రారంభమయింది. ఆధ్యాత్మికమయినా, పారమార్దికమయినా ఇంటి గడప వరకే. నలుగురు జనం చేరే చోట వారు కోరేదే ఇవ్వాలనుకోవడం సినీ జీవులకు, రాజకీయులకు కొత్తేమీ కాదు కదా.(12-04-2011)

11, ఏప్రిల్ 2011, సోమవారం

ఎంత మార్పు! ఎంత మార్పు!! ఇంత మార్పు దేనికోసం? – భండారు శ్రీనివాసరావు


ఎంత మార్పు! ఎంత మార్పు!! ఇంత మార్పు దేనికోసం? – భండారు శ్రీనివాసరావు

కడప ఉప ఎన్నికల్లో విజయలక్ష్మి ఎవరిని వరిస్తుంది అన్నదే ఈనాడు అందరి మనస్సులనూ తొలుస్తున్న తొలి ప్రశ్న. వారసత్వ రాజకీయాలను ఈసడించుకునే వారు సైతం ‘వై.ఎస్.ఆర్.’ కి నిజమయిన రాజకీయ వారసులెవ్వరు?’ అని లేవనెత్తుతున్నది రెండో ప్రశ్న.
‘విదియ నాడు కనబడని చంద్రుడు తదియ నాడు తానే కనబడతాడ’న్న సామెత ప్రకారం వీటికి సమాధానం లభించడానికి కొద్ది వారాలు ఆగితే చాలు. స్వల్ప వ్యవధిలో తేలిపోయే విషయాలే అయినా ఎన్నికల సమరంలో దిగినవారెవ్వరూ అంత తేలిగ్గా తీసుకుంటున్న దాఖలాలు లేవు. కారణం రాష్ట్రం లోని రెండు ప్రధాన రాజకీయ పక్షాలతో పాటు తాజాగా ఎన్నికల బరిలో కాలు మోపుతున్న కొత్త పార్టీ - వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ ఉప ఎన్నికలు ఒక రకంగా అగ్ని పరీక్షే. ఇందులో నెగ్గగలిగితేనే మునుముందు రాజకీయంగా నెగ్గుకురాగలిగిన పరిస్తితి జగన్ పార్టీది. భవిష్యత్తును ఆటో ఇటో తేల్చగల ‘తుది సమరం’ జగన్ పార్టీ చేయబోతోంది కనుక అసలు సిసలు పరీక్ష ఆ పార్టీదే.
పోతే, తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమే కాని  ప్రాణాంతకం కావు. కాకపొతే, ప్రాంతీయ ఉద్యమాలతో దిక్కుతోచని స్తితిలో వున్న ఆ పార్టీకి ఈ ఉప ఎన్నికల్లో లభించే కాసింత విజయం కూడా కొండంత ఆత్మ విశ్వాసాన్ని కొనితెస్తుంది కాబట్టి కడప ఉపఎన్నికలు టీ.డీ.పి. కి సైతం ముఖ్యమయినవే.
ఇక కాంగ్రెస్ విషయం తీసుకుంటే, ఎన్నికల ఫలితాలు ఎలావున్నా, రాష్ట్రంలో ప్రభుత్వ మనుగడకు వెనువెంటనే వచ్చే ముప్పు ఏమీ వుండకపోవచ్చు. అయినా, ఈ ఎన్నికల్లో పరాజయం పాలయితే దాని ప్రభావం ముందు పడేది పార్టీ రాష్ట్ర నాయకత్వం మీదే అన్న ఎరుక ఆ పార్టీ నాయకులకు లేకపోలేదు. పైపెచ్చు, ఇటీవల జరిగిన శాసన మండలి ఎన్నికల్లో కడపలో తగిలిన ‘ఎదురు దెబ్బ’ నేపధ్యంలో – కడప, పులివెందుల ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి నిజమయిన అగ్ని పరీక్షగా మారనున్నాయి.
ఎన్నికల చిహ్నం ఏమిటో కూడా తెలియకముందే కొత్త పార్టీ నాయకుడు, వై ఎస్సార్ తనయుడు జగన్, దివంగత నేత భార్య విజయమ్మ- అందరికంటే ముందుగానే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ‘ఆత్మగౌరవానికి అహంకారానికీ నడుమ జరిగే సమరంగా’ ఆయన తన ఎన్నికల నినాదాన్ని ఓటర్లపై వొదిలారు. ‘కడప ఉపఎన్నికలు వైఎస్సార్ కు, కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు మధ్య జరిగే యుద్ధంగా’ కూడా ఆయన అభివర్ణించడం చర్చనీయాంశంగా మారింది. సోనియాపై ఈగ వాలినా వూరుకోని కాంగ్రెస్ నాయక శ్రేణులు జగన్ వ్యాఖ్యను ఆయన అహంభావానికి నిదర్శనమని విమర్శించాయి. వై ఎస్ జీవించివున్న కాలంలో ఆయన సోనియా పట్ల ప్రదర్శించిన వినయ విధేయతలను ఉటంకిస్తూ, ఆయనే ఈనాడు బతికి వుంటే జగన్ వ్యాఖ్యలకు ఎంతగా కుమిలి పోయివుండేవారో జగన్ తెలుసుకుని మాట్లాడాలని సలహా చెప్పాయి. అయితే, వై. ఎస్. ఆర్. అనేది కొత్త పార్టీ పేరు కనుక దీంట్లో తప్పు పట్టాల్సిందీ, ఆక్షేపించాల్సిందీ ఏముందన్నది జగన్ వర్గీయుల వాదన.
మామూలు పరిస్థితుల్లో అయితే, ఒకటి రెండు స్తానాలకు జరిగే ఉపఎన్నికల ఫలితాల ప్రభావం పాలక పక్షం పై పడే అవకాశం వుండదు. సంఖ్యాబలంలో చిన్న చిన్న తేడాలు ప్రభుత్వ మనుగడకు ప్రమాదకరంగా మారే వీలుండదు. అయితే ఈసారి కడప పార్లమెంట్, పులివెందుల శాసన సభ నియోజకవర్గాల ఉప ఎన్నికలు ఒక ప్రత్యేక రాజకీయ నేపధ్యంలో జరుగుతున్నాయి. వీటికి లోగడ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, శ్రీమతి విజయమ్మ ఇరువురూ కాంగ్రెస్ అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి, ఆ పార్టీకి రాజీనామా చేసి, చట్టసభల్లో తమ సభ్యత్వాలను వొదులుకుని, వై. ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ పెట్టుకుని మళ్ళీ ఎన్నికల బరిలో దిగిన కారణంగా, కడప ఉప ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా పరిణమించాయి. ప్రత్యేకించి ఇటీవలే జరిగిన శాసన మండలి ఎన్నికల్లో ఎదురయిన పరాజయాలు పాలక పక్షాన్ని కొంత ఇరకాటంలో పడేసిన నేపధ్యంలో, మరో అవమానాన్ని తట్టుకోగల స్తితిలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం లేదు. అలాగే, శాసన మండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ లోపాయకారీగా కుమ్మక్కయ్యాయని వెలువడిన ఆరోపణల దృష్ట్యా టీ.డీ.పీ. అధినాయకత్వం కూడా ఆ మచ్చను మాపుకునే క్రమంలో అభ్యర్ధుల ఎంపికలో తీవ్రమయిన కసరత్తు చేయాల్సిన పరిస్తితి ఏర్పడింది.
అనేక వడబోతల అనంతరం పార్టీ రాజ్యసభ సభ్యుడు, కడప జిల్లా రాజకీయాల్లో పండిపోయిన సీనియర్ నాయకుడు అయిన డాక్టర్ మైసూరారెడ్డిని జగన్ మోహన రెడ్డిపై పోటీకి టీ.డీ.పీ. నిలబెట్టింది. పులివెందులలో మాత్రం అంతగా జనం నోళ్ళలో నలగని బీటెక్ రెడ్డిని తెరపైకి తెచ్చింది. ఇక కాంగ్రెస్ తరపున ఆ నియోజకవర్గం నుంచి వై ఎస్ సోదరుడు వివేకానందరెడ్డి స్వయానా వొదినె విజయమ్మతోనే అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.
పోతే, కడప పార్లమెంట్ స్తానానికి జగన్ కు దీటయిన అభ్యర్దిని వెతికే క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అనేక పాట్లు పడాల్సివచ్చింది. గతంలో ఒకసారి వై ఎస్సార్ కే గట్టి పోటీ ఇచ్చిన టీ.డీ.పీ. నాయకుడు కందుల రాజమోహన రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తీర్ధం ఇప్పించి జగన్ పై పోటీకి నిలబెట్టాలని చేసిన ప్రయత్నాలు కొంత వరకే పనిచేశాయి. కందుల సోదరుల కాంగ్రెస్ పార్టీ ప్రవేశం మాత్రం ఎలాటి అవాంతరాలు లేకుండా జరిగిపోయింది కానీ, జగన్ పై పోటీలోకి దిగడానికి వారిద్దరూ ససేమిరా అనడంతో వైద్య శాఖ మంత్రి డాక్టర్ డీ.ఎల్. రవీంద్రారెడ్డిని ఆఖరు నిమిషంలో పార్టీ అభ్యర్ధిగా ప్రకటించాల్సిన దైన్య స్తితిలో కాంగ్రెస్ పడింది. ఈ కధ ఇన్ని మలుపులు తిరగడానికి దారి తీసిన పరిణామాలు కూడా శోభస్కరంగా లేవనే చెప్పాలి. కడప పార్లమెంట్ సీటు నుంచి పోటీ చేయడానికి ఈసారి కందుల సోదరులు పెట్టిన ముందస్తు షరతులు టీ.డీ.పీ. అధ్యక్షుడు చంద్రబాబుకు మనస్కరించకపోవడంతో మనస్తాపానికి గురయిన వారిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించి, ఇద్దరిలో ఒకరికి పార్టీ టిక్కెట్టు ఇచ్చిపోటీలో నిలబెట్టి జగన్ కు గట్టి పోటీ ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు గట్టి ప్రయత్నమే చేసినట్టు మీడియా కోడై కూసింది. జగన్ పై పోటీకి దిగడానికి కందుల సోదరులు పెట్టిన షరతులకు కాంగ్రెస్ అధిష్టానం పచ్చ జెండా వూపని కారణంగానే, వారు పోటీకి వెనుకడుగు వేసినట్టు వార్తలు గుప్పుమన్నాయి. పోటీ చేయాల్సిన అభ్యర్ధులే ఫలితాలు తారుమారయిన పక్షంలో తమ రాజకీయ భవిష్యత్తు కోసం అధినాయకులనుంచి హామీ కోరాల్సిన పరిస్తితులు ఏర్పడ్డాయంటే, వాస్తవ పరిస్తితులు ఎలావున్నాయో తేలిగ్గా అర్ధం చేసుకోవచ్చు.
కందుల సోదరులు పోటీ చేయమని భీష్మించుకున్న నేపధ్యంలో ఇక విధి లేక మంత్రి డీ.ఎల్.రవీంద్రారెడ్డి పేరును కడప పార్లమెంట్ స్తానానికి అభ్యర్ధిగా అధిష్టానానికి సూచించినట్టు ప్రకటించి రాష్ట్ర నేతలు చేతులు దులుపుకున్నారు. అయితే, దానికి ముందే కడప జిల్లాకు చెందిన అధికార పార్టీ శాసన సభ్యుడు వీరశివారెడ్డి – కడప పార్లమెంటు సీటుకు పార్టీ తరపున డీ.ఎల్. పోటీచేస్తారని మీడియాకు వెల్లడించి ఆ పార్టీలో కొత్త సంప్రదాయానికి తెర తీసారు. చిన్నపాటి కార్పొరేషన్ చైర్మన్ ఎంపిక విషయంలో కూడా అధిష్టానం అనుమతి లేకుండా స్వతంత్రించి నిర్ణయం తీసుకోలేని కాంగ్రెస్ పార్టీలో, ఒక శాసన సభ్యుడు- ఏకంగా పార్లమెంటుకు పార్టీ తరపున పలానా వ్యక్తి పోటీ చేస్తారని ప్రకటించడం కాంగ్రెస్ సంస్కృతి తెలిసిన వారికి వింతగానే అనిపించింది. నిజంగా ఇది చాలా గొప్ప మార్పు. అయితే దేని కోసం ఇంత మార్పు అన్నదే ఇక్కడ ప్రధాన ప్రశ్నగా మిగులుతోంది. శతాధిక సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక పెద్ద పార్టీ, ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారంలో వున్న జాతీయ పార్టీ - ఒక్క వ్యక్తిని ఎదుర్కోవడం కోసం ఇన్ని మల్లగుల్లాలు పడుతుండడం చూసేవారికి ఆ పార్టీ నిజంగానే బలంగా వుందా లేదా అంతగా బలహీన పడిందా అని అనిపించడంలో వింతేమీ లేదు.
అభ్యర్ధి నిర్ణయ ప్రక్రియలో ఇన్నిన్ని కప్పదాట్లకు అవకాశం ఇవ్వకుండా, ముందుగానే రవీంద్రారెడ్డి అభ్యర్ధిత్వాన్ని నిర్ణయించి, ప్రకటించి వుంటే పార్టీ ఇంత అపప్రధ మూటకట్టుకునేది కాదు. ఎందుకంటే, కడప జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో పలుకుబడి కలిగిన నాయకుడాయన. పైపెచ్చు వై.ఎస్.ఆర్.నే నేరుగా రాజకీయంగా ఎదుర్కున్న వ్యక్తి. జగన్ రెడ్డి పై ఆయన విజయావకాశాలు యెలా వుంటాయన్నది ప్రశ్న కాదు. యే ఎన్నికల్లో అయినా గెలుపోటములు అభ్యర్ధుల చేతుల్లో వుండవు. కాకపోతే, జగన్ రెడ్డి పై పోటీ చేసే అభ్యర్ధిని ఎంపికచేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ కిందుమీదవుతోందన్న మీమాంసకు తావు లేకుండా పోయేది. కానీ, అలా చేయకుండా, అభ్యర్ధి నిర్ణయంలో తాత్సారం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమరంలో కొంత ముందస్తు ఓటమిని అంగీకరిస్తున్న భావాన్ని కలిగించింది. మనసులో మాట దాచుకోకుండా వ్యక్తం చేసే మంత్రి బొచ్చ సత్యనారాయణ ఇదే విషయాన్ని మరోరకంగా వెల్లడించారు కూడా. దీనికి తోడు ఈ ఉప ఎన్నికలు రిఫరెండం కావంటూ పీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్ చేసిన ప్రకటన.
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరో విచిత్రమయిన అంశం ఈ ఎన్నికల సందర్భంగా వెలుగులోకి వచ్చింది. సాధారణంగా పార్టీ టికెట్ కోసం కాంగ్రెస్ అభ్యర్ధులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఢిల్లీ చుట్టూ ఎన్నో ప్రదక్షిణాలు చేయాలి. అధిష్టానం వద్ద పట్టుందని భ్రమ కల్పిస్తూ పబ్బం గడుపుకుంటున్న ఎందరెందరో తాబేదార్లను మెప్పించాలి. ఇంతా చేసినా టికెట్ రావాలని లేదు. ఒకవేళ టికెట్ వచ్చినా బీ ఫారం చేటికి చేతికి ఇస్తారని  ఆశ  లేదు. అధవా బీ ఫారం ఇచ్చినా నామినేషన్ వేసేంతవరకు అధిష్టానం మనసు మార్చుకోదన్న నమ్మకం లేదు. కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నం చేసిన ఎవరినడిగినా ఈ విషయాలు చెబుతారు. అలాటిది, ఈ సారి అనేకమంది కాంగ్రెస్ నాయకులు, ‘అధిష్టానం ఆదేశిస్తే జగన్ పై పోటీ చేస్తామ’ని బహిరంగ ప్రకటనలు చేశారు. అధినాయకత్వం ఆదేశించాలే కాని ఔదలదాల్చని వారెవరుంటారు? మరెందుకిలా బీరాలు పోయినట్టు? దీనికి ఒక కాంగ్రెస్ నాయకుడే ప్రైవేటు సంభాషణలో సమాధానం చెప్పాడు. అధిష్టానం ఆదేశించడం అంటే – ఎన్నికకు పూర్తి బాధ్యత పార్టీ స్వీకరించాలి. యావత్తు భారాన్ని పార్టీయే మోయాలి. మొత్తం పార్టీ శ్రేణుల్నీ సమన్వయం చేసి పార్టీ అభ్యర్ధికి అనుకూలంగా పనిచేసేట్టు చూడాలి. తీరా ఫలితంలో ఏవన్నా తేడాపాడాలు వస్తే, ఆ అభ్యర్ధుల రాజకీయ భవిష్యత్తును మరో రకంగా కాపాడాలి. అధిష్టానం ఆదేశించడం అంటే ‘కంప్లీట్ ప్యాకేజ్’ అన్నమాట. కాకపొతే, కాస్త అటూ ఇటూగా అన్ని ప్రధాన పార్టీల్లో ఈ ప్యాకేజి ఏదో ఒక రూపంలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అమలవుతోందట. (11-04-2011)



8, ఏప్రిల్ 2011, శుక్రవారం

ఎవరీ అన్నా హజారే? - భండారు శ్రీనివాసరావు

'ఎవరీ అన్నా హజారే?' - భండారు శ్రీనివాసరావు

'ఎవరీ అన్నా హజారే?'
'ఓ మాజీ సైనికుడు. 1965 లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో పాల్గొన్నాడు.'
'ఎవరితడు? ఏమిటి ఈయన ప్రత్యేకత? యిరవై నాలుగ్గంటలు దేశవ్యాప్తంగా మీడియా లో వార్తలన్నీ ఈయన గురించే. మహారాష్ట్ర లోని అహమ్మద్ నగర్ జిల్లాలో రాలెగావ్ అనే ఆదర్స ఆదర్శగ్రామ సృష్టికర్త అయిన అన్నా హజారే గురించే. ఏమిటి అన్నా హజారే విశిష్టత? ఏమిటి ఈ గ్రామం గొప్పదనం?'
'స్వయం పోషకంగా, ఎవరిమీదా ఆధారపడకుండా అన్ని హంగులు దీనికి ఏర్పరిచారు. ఈ గ్రామానికి అవసరమయిన విద్యుచ్చక్తి అక్కడే ఉత్పత్తి అవుతుంది. సౌర శక్తి, గాలిమరలు, బయో ఫ్యూయల్ ఇందుకోసం వాడుతున్నారు. మూడు దశాబ్దాల క్రితం వరకు పేదరికం తాండవించిన గ్రామం అంటే ఈనాడు నమ్మడం కష్టం. ఎందుకంటె ఇప్పుడా గ్రామం మొత్తం దేశంలోనే అత్యంత సంపన్నగ్రామాల్లో ఒకటిగా తయారయింది కాబట్టి. దీన్ని ఆదర్శ గ్రామంగా నిర్ణయించడానికి అనేక కారణాలు వున్నాయి. ప్రభుత్వాల మీదా, ప్రభుత్వ పధకాల మీదా ఆధారపడకుండా అన్ని వసతులు గ్రామ ప్రజలే సొంతంగా ఏర్పాటుచేసుకున్నారు. ప్రకృతి సమతుల్యం దెబ్బతినని రీతిలో అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన జరిగింది. అన్నింటికీ మించి ఆ గ్రామ ప్రజల నడుమ వెల్లివిరిసే సామరస్యాన్ని మరెక్కడా చూడలేము.
ఇన్ని మంచి పనులు ప్రచారం జోలికి పోకుండా చేసిన మంచి వ్యక్తి కాబట్టే భారత ప్రభుత్వం అన్నా హజారేను పద్మ భూషణ్ పురస్కారంతో గౌరవించింది.'
'అది సరే! అన్నా హజారే పోరాటం అంటూ మీడియాలో వస్తోంది. దేనిమీద ఆయన పోరాటం. దేనికోసం ఆయన ఆరాటం?'
'ఆయన ఒక మంచి అంశం మీద పోరాటం ప్రారంభించారు. అవినీతిని నిర్మూలించే ధ్యేయంతో చట్టానికి సవరణ చేయాలన్నది ఆయన డిమాండ్.'
'ఈ రోజుల్లో ఇలాటివి సాధ్యమయ్యే పనులేనా?'
'మామూలు మనుషులకు కష్టమే. కానీ అన్నా హజారే వంటి వ్యక్తులు అనుకుంటే సాధ్యం కానిది వుండదు.
'ఇందుకోసం అన్నా హజారే లోక్ పాల్ బిల్లు కావాలంటున్నారు. మంత్రులతో సహా రాజకీయరంగంలోవున్న వాళ్ళు , ఐ ఏ ఎస్ ఐ పీఎస్ లతో సహా అధికార యంత్రాంగంలో పనిచేసే సిబ్బంది అందర్నీ – ఎవరికీ ఎలాటి మినహాయింపు లేకుండా ఈ బిల్లు పరిధిలోకి తీసుకు రావాలన్నది అన్నా హజారే కోరిక. ఈ బిల్లు ద్వారా ఏర్పడే వ్యవస్థ అత్యంత బలీయంగా వుండాలని కూడా ఆయన కోరుకుంటున్నారు.
'లోక్ పాల్ బిల్లు అంత కొత్త విషయం ఏమీ కాదే. 1972 లోనే అప్పటి కేంద్ర న్యాయ శాఖ మంత్రి శాంతి భూషణ్ ఈ బిల్లును ప్రతిపాదించారు.'
'కానీ ఏమి లాభం! మళ్ళీ ఎవరూ దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. రాజకీయ నాయకులకు, బ్యూరోక్రాట్లకు ఈ బిల్లు పట్ల శ్రద్ధ వుండదు. అక్రమ సంపాదనకు అలవాటు పడిన వారెవ్వరికీ ఇలాటి చట్టాలు రుచించవు.
'అందుకే, మచ్చలేని ప్రజాసేవకుడయిన అన్నా హజారే ఎట్టకేలకు ఈ బిల్లుకు మోక్షం కలిగించడానికి నడుం బిగించాల్సి వచ్చింది. ఇందుకోసం ఆయన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ దీక్షకు మద్దతుగా దేశవ్యాప్తంగా స్పందన లభిస్తోంది. ప్రభుత్వం కూడా స్పందించి బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింప చేస్తామని ప్రకటించాలని అన్న హజారే కోరుతున్నారు. ఈ బిల్లు రూపకల్పన కోసం ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలన్నది కూడా ఆయన డిమాండ్. ఈ కమిటీలో ప్రభుత్వంతో పాటు ప్రజా సంఘాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని కూడా కోరుతున్నారు. ఎందుకంటె, ఇలాటి ముఖ్యమయిన బిల్లును తయారుచేసే బాధ్యతను కేవలం ప్రభుత్వాలకు వొదిలివేస్తే ప్రయోజనం వుండదని ఆయన అభిప్రాయం.
అన్నా హజారే కోరుకున్న విధంగా బిల్లు తయారయి చట్ట సభల ఆమోదం పొందితే, స్వయం ప్రతిపత్తి కలిగిన లోక్ పాల్ వ్యవస్థ ఏర్పడుతుంది. భారత ఎన్నికల సంఘం మాదిరిగా ఈ లోక్ పాల్ వ్యవస్తకు కూడా సర్వాధికారాలు వుంటాయి. ప్రతి రాష్ట్రం లో స్వయం ప్రతిపత్తి కలిగిన లోకాయుక్త వ్యవస్తలు ఆవిర్భవిస్తాయి. అవినీతి ఆరోపణలు వచ్చిన రాజకీయ నాయకుడిని కానీ, అధికారిని కానీ ఈ వ్యవస్థ విచారిస్తుంది. ఈ దర్యాప్తు ఏళ్ళూ పూళ్ళూ సాగకుండా ఒక్క ఏడాది వ్యవధిలో పూర్తి చేయాల్సి వుంటుంది. కేవలం రెండేళ్ళ లో అవినీతికి పాల్పడిన వ్యక్తిని శిక్షించాల్సి వుంటుంది. బోఫార్స్ కుంభకోణం విషయంలో, భోపాల్ గ్యాస్ దుర్ఘటన విషయంలో ఏమి జరిగిందో గుర్తుకు తెచ్చుకోండి. ఆ దర్యాప్తులు దాదాపు పాతికేళ్ళకు పైగా సాగాయి. చివరికి సాధించింది శూన్యం.
అవినీతి పై అన్న హజారే ప్రారంభించిన ఈ మహోద్యమంలో ఆయన ఒంటరి కాదు.
బాబా రాం దేవ్, మాజీ ఐ.పీ.ఎస్. అధికారి కిరణ్ బేడీ, స్వామి అగ్ని వేష్, సమాచార హక్కు ఉద్యమకారుడు అరవింద్ కేజరీ వాల్, ఇంకా అనేకమంది అన్నా హజారేకు మద్దతుగా నిలిచారు. అలాగే, ప్రముఖ సినీ నటులు అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ ఆయనకు బాసటగా నిలబడ్డారు. అందరి బాగుకోసం అన్నా హజారే ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని దేశం నలుమూలలకు, ఇంటింటికీ చేర్చడంలో ప్రతి ఒక్కరు తమకు చేతనయిన విధంగా తోడ్పాటు అందించాలని కోరడానికే ఈ వివరాలు. అవినీతిపై అన్నా హజారే మొదలు పెట్టిన ఈ ఉద్యమ స్పూర్తిని నేల నాలుగు చెరగులకు చేర్చడం ప్రతి ఒక్కరి కర్తవ్యం.' (08-04-2011)

7, ఏప్రిల్ 2011, గురువారం

సర్వము తానె అయినవాడెవ్వడు? – భండారు శ్రీనివాసరావు


సర్వము తానె అయినవాడెవ్వడు? – భండారు శ్రీనివాసరావు



"స్వామి క్షేమం గురించి ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్వామికి ఎలాటి ఆపదా రాదు. ఒకవేళ అలాటి ఆపదలు సంభవిస్తే స్వామే స్వయంగా వాటినుంచి చెక్కుచెదరకుండా బయటపడగలరు. అందుచేత ఎవ్వరు భయపడాల్సిన పని లేదు. విచారించాల్సిన అవసరం లేదు. స్వామే అన్నీ సాధించుకుంటూ వస్తాడు. అన్నింటినీ నెగ్గుకుంటూ వస్తాడు. అయినప్పటికీ, పాంచభౌతికమయిన శరీరానికి కొన్ని అవస్తలు తప్పవు. ఆహారం,పరిసరాలు దేహంలో ఎన్నో మార్పులు తెస్తాయి.భౌతికమయిన దేహంలో ఎన్నో జరగవచ్చు. అయితే, ఇవన్నీ తాత్కాలికం. శాశ్వితం కాదు. అంచేత స్వామి మీరంతా ధైర్యంగా వుండాలని కోరుకుంటాడు.

"ఇంతకీ నా మెడిసిన్ ఏమిటి? భక్తులు నాకోసం మనస్పూర్తిగా చేసే ప్రార్ధనలే నా మెడిసిన్. నాకోసం, అది మద్రాస్ కావచ్చు, హైదరాబాదో, ముంబయ్యో, బెంగుళూరో ఏ నగరమయినా కావచ్చు – అక్కడి భక్తులందరూ నా కోసం ప్రార్ధనలు చేశారు. భజనలు చేశారు. నామస్మరణలు చేశారు. తపస్సులు చేశారు. యజ్ఞాలు చేశారు. వారు చేసిన ప్రార్ధనల ఫలితంగానే నేనీనాడు మీ ముందు ఈ విధంగా నిలబడి మాట్లాడుతున్నాను.

"ఈ శరీరం ఇలా బాధ పడాలని నేను కోరుకోలేదు. అలాగని ఇలా బాగుపడాలని కూడా అనుకోలేదు. మీరు మీ ప్రార్ధనల ద్వారా దీన్ని సాధించారు. ఇలా జరగాలని ఆశించిందీ మీరే. కోరుకున్నదీ మీరే. ఈ దేహం నాది కాదు. మీదే. దీన్ని  మీరే కాపాడుకోవాలి. అది మీ బాధ్యత.

"నేను దేహాన్ని కాదు. నేను దేహిని మాత్రమే. దేహం పాంచభౌతికం. దేహి నిరామయుడు.

"ఈ దేహాన్ని రక్షించడం కోసం డాక్టర్లు ఎన్నో చేశారు. ఎంతో కష్టపడ్డారు. వారు తమ విద్యుక్తధర్మాన్ని చక్కగా నిర్వర్తించారు.  అయితే, నేను మాత్రం ఈ దేహాన్ని గురించి ఎంతమాత్రం ఆలోచించలేదు. దేహం పట్ల మమకారం పెంచుకోకూడదన్న మంచి భావనను నేను నిరూపించదలిచాను. ఇప్పుడే కాదు గత రెండేళ్లుగా నేను పదేపదే ఇదే చెబుతూ వస్తున్నాను. దేహం పట్ల అభిమానాన్ని తగ్గించుకోండి. క్రమంగా మీ దేహాభిమానాన్ని తగ్గించుకోండి. ఆత్మాభిమానాన్ని పెంచుకోండి. మీ దేహం మీది కాదు. ఆత్మకు మీరు ప్రతిరూపం. ఈ శరీరం పుడుతుంది. పెరుగుతుంది. ఏదో ఒకనాడు కాలగర్భం లో కలసిపోతుంది. బాధలు, క్లేశాలు అన్నీ దేహానికే. ఆత్మకు కాదు.

"నాకున్న దైవ శక్తిని  నా దేహాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నడూ వాడుకోలేదు. అలా చేయాలనుకుంటే నాకు క్షణం పట్టదు. నా దైహిక బాధలను నేను లిప్త కాలంలో మాయం చేసుకోగలను. నన్ను నేను స్వస్తత పరచుకోవాలన్న స్వార్ధం నాకు లేదు. అలాటి స్వార్ధ భావన నాకు లేశమాత్రంగా కూడా లేదు. ఈ ప్రపంచంలో ప్రతిఒక్కరు హాయిగా సంతోషంగా వుండాలి. ఇదొక్కటే నాకున్న స్వార్ధపూరితమయిన ఆశ. ఆలోచన.

"ఒక్కటి గుర్తుంచు కోండి. ఈ దేహం పాంచ భౌతికం. కాస్త అటూ ఇటూగా పంచ భూతాల్లో కలసిపోయేదే. కాని దేహంలో వున్న ఆత్మకు చావు పుటకలు లేవు. ఆత్మకు ఎలాటి భవబంధాలు వుండవు. నిజం చెప్పాలంటే, ఆత్మే పరమాత్మ."

(2003 సంవత్సరం జులై 13 వ తేదీన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శ్రీ సత్య సాయి బాబా చేసిన అనుగ్రహ భాషణం నుంచి ప్రొఫెసర్ జి.వెంకటరామన్ భద్రపరచిన కొన్ని భాగాలు, ఈ నాటి పరిస్తితులకు తగినట్టుగా వున్నాయన్న వుద్దేశ్యంతో బ్లాగులో పెట్టడం జరుగుతోంది. అప్పటికి స్వామి తన విరిగిన కాలుకు పెద్ద శస్త్ర చికిత్స చేయించుకోవడం జరిగింది. – భండారు శ్రీనివాసరావు)

3, ఏప్రిల్ 2011, ఆదివారం

సభా సంఘంతో పరువు నిలబెట్టుకున్న ప్రభుత్వం – భండారు శ్రీనివాసరావు

సభా సంఘంతో పరువు నిలబెట్టుకున్న ప్రభుత్వం – భండారు శ్రీనివాసరావు


(ఏప్రిల్ మూడో తేదీ ఆదివారం ‘సూర్య’ దినపత్రికలో ప్రచురితం)

‘నేడే విడుదల, రేపే ఆఖరు, ఈరోజే చూడండి’ అన్న చందంగా సాగిన రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు అనుకున్నట్టుగా జరక్కపోయినా అనుకున్న గడువులో మాత్రం ముగిశాయి. చివరొక్కరోజును మినహాయిస్తే , ముందుగా నిర్ణయించుకున్న కాల వ్యవధిలో ఒక్కటంటే ఒక్కరోజు కూడా సభ సజావుగా సాగిన దాఖలా లేదు. సభాపర్వంలో వాయిదాలకే అధిక సమయం చెల్లిపోయింది.

‘ఐస్ హావిట్ ఐస్ హావిట్ ది మోషన్ ఈజ్ మూవ్డ్ అండ్ ది బిల్ ఈజ్ పాస్డ్’ (Ayes have it. Ayes have it. The motion is moved and the bill is passed) అని స్పీకర్ స్తానంలో వున్న డిప్యూటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ అంటుండగానే పరీక్షిత్తు యజ్ఞగుండం దగ్గర నిలబడి ‘సహేంద్ర తక్షకాయ స్వాహా’ అంటే తక్షణం వచ్చి వాలిన తక్షకుడి మాదిరిగా, సమావేశాల్లో చర్చించి ఆమోదించాల్సిన బిల్లులన్నీ ఒకదానివెంట మరొకటి సభ ఆమోదం పొందడం క్షణాల్లో జరిగిపోయింది.(Ayes అంటే - ప్రాచీన ఆంగ్ల భాషలో అనుకూలంగా వోటు చేయడానికి అంగీకరించడం – Nyes have it అంటే వ్యతిరేకించడం అని ఇంగ్లీష్ నిఘంటువు చెబుతోంది-రచయిత)

ఏప్రిల్ ఒకటో తేదీన మొదలయ్యే కొత్త ఆర్ధిక సంవత్సరం నుంచి ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర ప్రభుత్వ చెల్లింపులకు ఎలాటి అవరోధం లేకుండా ద్రవ్య వినిమయ బిల్లుతో సహా అన్ని బిల్లులను – ఎలాటి చర్చా లేకుండానే తూనా బొడ్డు తంతుగా నిమిషాలమీద సభ ఆమోదించడాన్ని ఆఖరు రోజున యావదాంధ్ర ప్రజలు టీవీల్లో చూశారు. పనిలో పనిగా శాసనసభ్యుల జీత భత్యాలు ఇబ్బడిముబ్బడిగా పెంచే బిల్లును కూడా సభలోని అన్ని పక్షాలు యధాశక్తి సహకరించి వొడ్డున పడేశాయి. దీనివల్ల అన్నీ కలిపి నెలకు అక్షరాలా 95 వేల రూపాయలు గౌరవ శాసన సభ్యులకు ముడతాయి. ఇంత మాత్రం నెలవారీ జీతాలు పొందేవారు ప్రతిజిల్లాలో హీనపక్షం అయిదారుగురు అధికారులు వున్నప్పుడు, వారి మీద పెత్తనం చేసే తమకు ఆమాత్రం వేతనం లేకపోతే ఏం గౌరవం అనుకున్నారేమో – ఈ ఒక్క విషయంలో మాత్రం పార్టీలకతీతంగా అంతా చేతులు కలిపి ‘మమ అనిపించారు. ఆ చేత్తోనే, మాజీ శాసన సభ్యుల పింఛను గరిష్ట మొత్తాన్ని నెలకు 25 వేలకు పెంచారు. సీపీయం మాత్రం ఈ పెంపుదలను వ్యతిరేకించింది. చర్చ జరగకుండానే ఈ బిల్లు సభ ఆమోదం పొందిన కారణంగా ఆ పార్టీ నిరసన ప్రకటనకే పరిమితమయింది. శాసన సభ కార్యాలయం విడుదలచేసిన వివరాలప్రకారం సభ మొత్తం 29 రోజులు జరిగింది. 15 బిల్లులు ప్రవేశపెట్టగా అందులో 10 బిల్లులు ఆమోదం పొందాయి. అన్ని రోజులు కలిపి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడింది 2 గంటల 58 నిమిషాలయితే, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు 3 గంటల 53 నిమిషాల సమయం తీసుకున్నారు. వాళ్ల మాదిరిగానే రెండు గంటలకు పైగా సమయం వాడుకున్న ఘనత మజ్లిస్ నేత అక్బరుద్దీన్ కు దక్కుతుంది. టీ.ఆర్.ఎస్. సభ్యుడు రాజేందర్, ఒకప్పటి ప్రజారాజ్యం నేత చిరంజీవి - అసలు నోరువిప్పని సభ్యుల జాబితాలో వుండడం విశేషం. అత్యధిక సభా సమయాన్ని ఉపయోగించుకున్న వారిలో లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ్ వున్నారు. ఆయన మొత్తం 3 గంటల 27 నిమిషాలు సభలో ప్రసంగించి రెండో స్తానం సంపాదించారు. లెక్కకు 29 రోజులు సభ నడిచినా అందులో వాయిదాలు పడ్డ సమయమే ఎక్కువ. ఇన్ని రోజుల వ్యవధిలో సభ సజావుగా నడిచింది 52 గంటల 30 నిమిషాలే. కాంగ్రెస్ ఇంచుమించు 23 గంటలు, తెలుగుదేశం దాదాపు 14 గంటలు తీసుకున్నాయి. ఈ లెక్కన చూస్తే సభ రోజుకు సరాసరి గంట కంటే తక్కువ కాలం నడిచినట్టు లెక్క. బహుశా సభా సమయం ఎంత వృధా అయినా, చివరిలో ఎలాగో అలాగా గిలెటిన్ అస్త్రం ప్రయోగించి పని పూర్తి చేయొచ్చునన్న ‘ఎరుక’ కలిగిన వారు కాబట్టే చట్టసభలోని సభ్యులందరూ చట్టరీత్యా పూర్తిచేయాల్సిన కార్యక్రమాలను మాత్రం ఎట్టకేలకు తు చ తప్పకుండా పూర్తిచేశారు.

ఈసారి బడ్జెట్ సమావేశాల్లో సంప్రదాయాలకు నీళ్ళు వొదిలిన సందర్భాలు అనేకం. ఉభయ సభల సంయుక్త సమావేశం ఆరంభంలోనే గవర్నర్ కుర్చీ లాగివేయడం, సభ ఆవరణలోనే ఒక సభ్యుడిపై చేయి చేసుకోవడం, బడ్జెట్ సమావేశాలు పూర్తికావడానికి ఒక్క రోజు ముందు సాక్షాత్తు ఒక మంత్ర్రే ప్రతిపక్ష సభ్యులపై సభలోనే భౌతిక దాడికి దిగడం, అసలు శాసనసభకు పోటీగా కొందరు సభ్యులు కలసి వేరేచోట మాక్ అసెంబ్లీ నిర్వహించడం, మరికొందరు సభ్యులు ఏకంగా అనేక రోజులపాటు సభనే బహిష్కరించడం - ఒకటా రెండా ‘ఏమి చెప్పుదు సంజయా!’ అన్నట్టు ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నభూతో నభవిష్యతి అన్న చందంగా సంఘటనల మయంగా ముగిసిపోయాయి.

సమావేశాల మధ్యలో వచ్చిన విధాన మండలి ఎన్నికలు వివిధ రాజకీయపార్తీలలోని అవకాశవాదాన్ని ఎత్తిచూపాయి. సిద్ధాంతాలకు తిలోదకాలు వొదిలి అన్ని పార్టీలవాళ్ళు క్రాస్ వోటింగులో తమ ప్రతిభను, సొంత లాభాలపట్ల తమ నిబద్ధతను నిరూపించుకున్నారు.

సాధారణ రాజకీయాలకు విభిన్నమయిన, మరో విచిత్రమయిన పరిస్తితి ఈ సమావేశాల కాలంలో ప్రస్పుటమయింది. పదవిని వొదులుకోవడానికి మామూలుగా ఏ రాజకీయ నాయకుడు వొప్పుకోడన్నది సామాన్య జనంలో వున్న అభిప్రాయం. దీనికి భిన్నంగా ఒక మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణాకు మద్దతుగా పదవికి రాజీనామా చేసారు. క్రాస్ వోటింగ్ ఉదంతానికి సంబంధించి నైతిక బాధ్యతగా ముగ్గురు టీ.ఆర్.ఎస్. సభ్యులు రాజీనామా చేసారు. అలాగే, టీడీపీ సభ్యుడు, మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి - తెలంగాణా పట్ల పార్టీ అధిష్టానం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా పార్టీ నుంచి తప్పుకుని టీ.ఆర్.ఎస్. తీర్ధం పుచ్చుకున్నారు. ఈయనగారి రాజీనామా లేఖ డిప్యూటీ స్పీకర్ దగ్గర పెండింగ్ లో వుండిపోయింది. దాన్ని ఆమోదించాలంటూ ఆయన ఏకంగా నిరసన దీక్షకు దిగాల్సివచ్చింది. మంత్రి జూపల్లి కృష్ణారావు రాజీనామా ముఖ్యమంత్రి దగ్గరా, ముగ్గురు టీ.ఆర్.ఎస్. సభ్యుల రాజీనామాలు ఆ పార్టీ  అధినేత దగ్గరా ‘నిద్ర’ చేస్తున్నాయి. రాజీనామా చేసిన మంత్రి తన విధులకు హాజరు కానంటూ మొండికేయడంతో – సమావేశాల సమయంలో ఆయన తరపున సమాధానాలు చెప్పే బాధ్యతను మరో మంత్రికి వొప్పగించాల్సిన విచిత్రమయిన పరిస్తితి. మరోవైపు జగన్ వర్గం సభ్యులు రాజీనామా చేయకుండానే నిండు సభలో పార్టీని ధిక్కరించినా ఏమీ చేయలేని బలహీనత.
సమావేశాల చివరిరోజున సభ్యులు, వివిధ పక్షాల నేతలు అతి ముఖ్యమయిన ఒక అంశంపై జరిగిన సుదీర్ఘమయిన చర్చపట్ల కొంత బాధ్యతాయుతంగా వ్యవహరించినట్టే కనిపించింది. పారిశ్రామిక ప్రగతి పేరుతొ, ఉపాధి అవకాశాలను పెంచే నెపంతో విచ్చలవిడిగా ప్రభుత్వాలు జరిపిన భూ పందేరాలపై సాగిన ఈ చర్చలో పాల్గొన్నవారందరూ సంయమనంతో చేసిన ప్రసంగాలు, సవివరంగా చేసిన సూచనలు వింటున్న వారికి సభపై గౌరవం కొంత పెరిగింది. కడప ఉపఎన్నికలు గడప ముందుకు వచ్చిన నేపధ్యంలో ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారన్న విషయం పక్కనబెడితే, సభాసంఘం వల్ల ఇష్టారాజ్యంగా జరిపే భూముల పంపిణీల జోరు ఒకమేరకయినా కట్టడి అయ్యే అవకాశం వుంటుంది. రాజకీయంగా కొందరికి ఇబ్బందికరం అయినప్పటికీ, దీని ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించడం ఈ సమావేశాల కొసమెరుపుగా చెప్పుకోవచ్చు.

ఇంతమాత్రందానికి, శాసన సభ సమావేశాల పేరుతొ ఇంత హడావుడి అవసరమా అన్న సామాన్యుడి ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పేవారులేరు. (02-04-2011)