3, ఏప్రిల్ 2011, ఆదివారం

సభా సంఘంతో పరువు నిలబెట్టుకున్న ప్రభుత్వం – భండారు శ్రీనివాసరావు

సభా సంఘంతో పరువు నిలబెట్టుకున్న ప్రభుత్వం – భండారు శ్రీనివాసరావు


(ఏప్రిల్ మూడో తేదీ ఆదివారం ‘సూర్య’ దినపత్రికలో ప్రచురితం)

‘నేడే విడుదల, రేపే ఆఖరు, ఈరోజే చూడండి’ అన్న చందంగా సాగిన రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు అనుకున్నట్టుగా జరక్కపోయినా అనుకున్న గడువులో మాత్రం ముగిశాయి. చివరొక్కరోజును మినహాయిస్తే , ముందుగా నిర్ణయించుకున్న కాల వ్యవధిలో ఒక్కటంటే ఒక్కరోజు కూడా సభ సజావుగా సాగిన దాఖలా లేదు. సభాపర్వంలో వాయిదాలకే అధిక సమయం చెల్లిపోయింది.

‘ఐస్ హావిట్ ఐస్ హావిట్ ది మోషన్ ఈజ్ మూవ్డ్ అండ్ ది బిల్ ఈజ్ పాస్డ్’ (Ayes have it. Ayes have it. The motion is moved and the bill is passed) అని స్పీకర్ స్తానంలో వున్న డిప్యూటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ అంటుండగానే పరీక్షిత్తు యజ్ఞగుండం దగ్గర నిలబడి ‘సహేంద్ర తక్షకాయ స్వాహా’ అంటే తక్షణం వచ్చి వాలిన తక్షకుడి మాదిరిగా, సమావేశాల్లో చర్చించి ఆమోదించాల్సిన బిల్లులన్నీ ఒకదానివెంట మరొకటి సభ ఆమోదం పొందడం క్షణాల్లో జరిగిపోయింది.(Ayes అంటే - ప్రాచీన ఆంగ్ల భాషలో అనుకూలంగా వోటు చేయడానికి అంగీకరించడం – Nyes have it అంటే వ్యతిరేకించడం అని ఇంగ్లీష్ నిఘంటువు చెబుతోంది-రచయిత)

ఏప్రిల్ ఒకటో తేదీన మొదలయ్యే కొత్త ఆర్ధిక సంవత్సరం నుంచి ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర ప్రభుత్వ చెల్లింపులకు ఎలాటి అవరోధం లేకుండా ద్రవ్య వినిమయ బిల్లుతో సహా అన్ని బిల్లులను – ఎలాటి చర్చా లేకుండానే తూనా బొడ్డు తంతుగా నిమిషాలమీద సభ ఆమోదించడాన్ని ఆఖరు రోజున యావదాంధ్ర ప్రజలు టీవీల్లో చూశారు. పనిలో పనిగా శాసనసభ్యుల జీత భత్యాలు ఇబ్బడిముబ్బడిగా పెంచే బిల్లును కూడా సభలోని అన్ని పక్షాలు యధాశక్తి సహకరించి వొడ్డున పడేశాయి. దీనివల్ల అన్నీ కలిపి నెలకు అక్షరాలా 95 వేల రూపాయలు గౌరవ శాసన సభ్యులకు ముడతాయి. ఇంత మాత్రం నెలవారీ జీతాలు పొందేవారు ప్రతిజిల్లాలో హీనపక్షం అయిదారుగురు అధికారులు వున్నప్పుడు, వారి మీద పెత్తనం చేసే తమకు ఆమాత్రం వేతనం లేకపోతే ఏం గౌరవం అనుకున్నారేమో – ఈ ఒక్క విషయంలో మాత్రం పార్టీలకతీతంగా అంతా చేతులు కలిపి ‘మమ అనిపించారు. ఆ చేత్తోనే, మాజీ శాసన సభ్యుల పింఛను గరిష్ట మొత్తాన్ని నెలకు 25 వేలకు పెంచారు. సీపీయం మాత్రం ఈ పెంపుదలను వ్యతిరేకించింది. చర్చ జరగకుండానే ఈ బిల్లు సభ ఆమోదం పొందిన కారణంగా ఆ పార్టీ నిరసన ప్రకటనకే పరిమితమయింది. శాసన సభ కార్యాలయం విడుదలచేసిన వివరాలప్రకారం సభ మొత్తం 29 రోజులు జరిగింది. 15 బిల్లులు ప్రవేశపెట్టగా అందులో 10 బిల్లులు ఆమోదం పొందాయి. అన్ని రోజులు కలిపి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడింది 2 గంటల 58 నిమిషాలయితే, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు 3 గంటల 53 నిమిషాల సమయం తీసుకున్నారు. వాళ్ల మాదిరిగానే రెండు గంటలకు పైగా సమయం వాడుకున్న ఘనత మజ్లిస్ నేత అక్బరుద్దీన్ కు దక్కుతుంది. టీ.ఆర్.ఎస్. సభ్యుడు రాజేందర్, ఒకప్పటి ప్రజారాజ్యం నేత చిరంజీవి - అసలు నోరువిప్పని సభ్యుల జాబితాలో వుండడం విశేషం. అత్యధిక సభా సమయాన్ని ఉపయోగించుకున్న వారిలో లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ్ వున్నారు. ఆయన మొత్తం 3 గంటల 27 నిమిషాలు సభలో ప్రసంగించి రెండో స్తానం సంపాదించారు. లెక్కకు 29 రోజులు సభ నడిచినా అందులో వాయిదాలు పడ్డ సమయమే ఎక్కువ. ఇన్ని రోజుల వ్యవధిలో సభ సజావుగా నడిచింది 52 గంటల 30 నిమిషాలే. కాంగ్రెస్ ఇంచుమించు 23 గంటలు, తెలుగుదేశం దాదాపు 14 గంటలు తీసుకున్నాయి. ఈ లెక్కన చూస్తే సభ రోజుకు సరాసరి గంట కంటే తక్కువ కాలం నడిచినట్టు లెక్క. బహుశా సభా సమయం ఎంత వృధా అయినా, చివరిలో ఎలాగో అలాగా గిలెటిన్ అస్త్రం ప్రయోగించి పని పూర్తి చేయొచ్చునన్న ‘ఎరుక’ కలిగిన వారు కాబట్టే చట్టసభలోని సభ్యులందరూ చట్టరీత్యా పూర్తిచేయాల్సిన కార్యక్రమాలను మాత్రం ఎట్టకేలకు తు చ తప్పకుండా పూర్తిచేశారు.

ఈసారి బడ్జెట్ సమావేశాల్లో సంప్రదాయాలకు నీళ్ళు వొదిలిన సందర్భాలు అనేకం. ఉభయ సభల సంయుక్త సమావేశం ఆరంభంలోనే గవర్నర్ కుర్చీ లాగివేయడం, సభ ఆవరణలోనే ఒక సభ్యుడిపై చేయి చేసుకోవడం, బడ్జెట్ సమావేశాలు పూర్తికావడానికి ఒక్క రోజు ముందు సాక్షాత్తు ఒక మంత్ర్రే ప్రతిపక్ష సభ్యులపై సభలోనే భౌతిక దాడికి దిగడం, అసలు శాసనసభకు పోటీగా కొందరు సభ్యులు కలసి వేరేచోట మాక్ అసెంబ్లీ నిర్వహించడం, మరికొందరు సభ్యులు ఏకంగా అనేక రోజులపాటు సభనే బహిష్కరించడం - ఒకటా రెండా ‘ఏమి చెప్పుదు సంజయా!’ అన్నట్టు ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నభూతో నభవిష్యతి అన్న చందంగా సంఘటనల మయంగా ముగిసిపోయాయి.

సమావేశాల మధ్యలో వచ్చిన విధాన మండలి ఎన్నికలు వివిధ రాజకీయపార్తీలలోని అవకాశవాదాన్ని ఎత్తిచూపాయి. సిద్ధాంతాలకు తిలోదకాలు వొదిలి అన్ని పార్టీలవాళ్ళు క్రాస్ వోటింగులో తమ ప్రతిభను, సొంత లాభాలపట్ల తమ నిబద్ధతను నిరూపించుకున్నారు.

సాధారణ రాజకీయాలకు విభిన్నమయిన, మరో విచిత్రమయిన పరిస్తితి ఈ సమావేశాల కాలంలో ప్రస్పుటమయింది. పదవిని వొదులుకోవడానికి మామూలుగా ఏ రాజకీయ నాయకుడు వొప్పుకోడన్నది సామాన్య జనంలో వున్న అభిప్రాయం. దీనికి భిన్నంగా ఒక మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణాకు మద్దతుగా పదవికి రాజీనామా చేసారు. క్రాస్ వోటింగ్ ఉదంతానికి సంబంధించి నైతిక బాధ్యతగా ముగ్గురు టీ.ఆర్.ఎస్. సభ్యులు రాజీనామా చేసారు. అలాగే, టీడీపీ సభ్యుడు, మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి - తెలంగాణా పట్ల పార్టీ అధిష్టానం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా పార్టీ నుంచి తప్పుకుని టీ.ఆర్.ఎస్. తీర్ధం పుచ్చుకున్నారు. ఈయనగారి రాజీనామా లేఖ డిప్యూటీ స్పీకర్ దగ్గర పెండింగ్ లో వుండిపోయింది. దాన్ని ఆమోదించాలంటూ ఆయన ఏకంగా నిరసన దీక్షకు దిగాల్సివచ్చింది. మంత్రి జూపల్లి కృష్ణారావు రాజీనామా ముఖ్యమంత్రి దగ్గరా, ముగ్గురు టీ.ఆర్.ఎస్. సభ్యుల రాజీనామాలు ఆ పార్టీ  అధినేత దగ్గరా ‘నిద్ర’ చేస్తున్నాయి. రాజీనామా చేసిన మంత్రి తన విధులకు హాజరు కానంటూ మొండికేయడంతో – సమావేశాల సమయంలో ఆయన తరపున సమాధానాలు చెప్పే బాధ్యతను మరో మంత్రికి వొప్పగించాల్సిన విచిత్రమయిన పరిస్తితి. మరోవైపు జగన్ వర్గం సభ్యులు రాజీనామా చేయకుండానే నిండు సభలో పార్టీని ధిక్కరించినా ఏమీ చేయలేని బలహీనత.
సమావేశాల చివరిరోజున సభ్యులు, వివిధ పక్షాల నేతలు అతి ముఖ్యమయిన ఒక అంశంపై జరిగిన సుదీర్ఘమయిన చర్చపట్ల కొంత బాధ్యతాయుతంగా వ్యవహరించినట్టే కనిపించింది. పారిశ్రామిక ప్రగతి పేరుతొ, ఉపాధి అవకాశాలను పెంచే నెపంతో విచ్చలవిడిగా ప్రభుత్వాలు జరిపిన భూ పందేరాలపై సాగిన ఈ చర్చలో పాల్గొన్నవారందరూ సంయమనంతో చేసిన ప్రసంగాలు, సవివరంగా చేసిన సూచనలు వింటున్న వారికి సభపై గౌరవం కొంత పెరిగింది. కడప ఉపఎన్నికలు గడప ముందుకు వచ్చిన నేపధ్యంలో ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారన్న విషయం పక్కనబెడితే, సభాసంఘం వల్ల ఇష్టారాజ్యంగా జరిపే భూముల పంపిణీల జోరు ఒకమేరకయినా కట్టడి అయ్యే అవకాశం వుంటుంది. రాజకీయంగా కొందరికి ఇబ్బందికరం అయినప్పటికీ, దీని ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించడం ఈ సమావేశాల కొసమెరుపుగా చెప్పుకోవచ్చు.

ఇంతమాత్రందానికి, శాసన సభ సమావేశాల పేరుతొ ఇంత హడావుడి అవసరమా అన్న సామాన్యుడి ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పేవారులేరు. (02-04-2011)



కామెంట్‌లు లేవు: