కడప ఉప ఎన్నికల్లో విజయలక్ష్మి ఎవరిని వరిస్తుంది అన్నదే ఈనాడు అందరి మనస్సులనూ తొలుస్తున్న తొలి ప్రశ్న. వారసత్వ రాజకీయాలను ఈసడించుకునే వారు సైతం ‘వై.ఎస్.ఆర్.’ కి నిజమయిన రాజకీయ వారసులెవ్వరు?’ అని లేవనెత్తుతున్నది రెండో ప్రశ్న.
‘విదియ నాడు కనబడని చంద్రుడు తదియ నాడు తానే కనబడతాడ’న్న సామెత ప్రకారం వీటికి సమాధానం లభించడానికి కొద్ది వారాలు ఆగితే చాలు. స్వల్ప వ్యవధిలో తేలిపోయే విషయాలే అయినా ఎన్నికల సమరంలో దిగినవారెవ్వరూ అంత తేలిగ్గా తీసుకుంటున్న దాఖలాలు లేవు. కారణం రాష్ట్రం లోని రెండు ప్రధాన రాజకీయ పక్షాలతో పాటు తాజాగా ఎన్నికల బరిలో కాలు మోపుతున్న కొత్త పార్టీ - వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ ఉప ఎన్నికలు ఒక రకంగా అగ్ని పరీక్షే. ఇందులో నెగ్గగలిగితేనే మునుముందు రాజకీయంగా నెగ్గుకురాగలిగిన పరిస్తితి జగన్ పార్టీది. భవిష్యత్తును ఆటో ఇటో తేల్చగల ‘తుది సమరం’ జగన్ పార్టీ చేయబోతోంది కనుక అసలు సిసలు పరీక్ష ఆ పార్టీదే.
పోతే, తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమే కాని ప్రాణాంతకం కావు. కాకపొతే, ప్రాంతీయ ఉద్యమాలతో దిక్కుతోచని స్తితిలో వున్న ఆ పార్టీకి ఈ ఉప ఎన్నికల్లో లభించే కాసింత విజయం కూడా కొండంత ఆత్మ విశ్వాసాన్ని కొనితెస్తుంది కాబట్టి కడప ఉపఎన్నికలు టీ.డీ.పి. కి సైతం ముఖ్యమయినవే.
ఇక కాంగ్రెస్ విషయం తీసుకుంటే, ఎన్నికల ఫలితాలు ఎలావున్నా, రాష్ట్రంలో ప్రభుత్వ మనుగడకు వెనువెంటనే వచ్చే ముప్పు ఏమీ వుండకపోవచ్చు. అయినా, ఈ ఎన్నికల్లో పరాజయం పాలయితే దాని ప్రభావం ముందు పడేది పార్టీ రాష్ట్ర నాయకత్వం మీదే అన్న ఎరుక ఆ పార్టీ నాయకులకు లేకపోలేదు. పైపెచ్చు, ఇటీవల జరిగిన శాసన మండలి ఎన్నికల్లో కడపలో తగిలిన ‘ఎదురు దెబ్బ’ నేపధ్యంలో – కడప, పులివెందుల ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి నిజమయిన అగ్ని పరీక్షగా మారనున్నాయి.
ఎన్నికల చిహ్నం ఏమిటో కూడా తెలియకముందే కొత్త పార్టీ నాయకుడు, వై ఎస్సార్ తనయుడు జగన్, దివంగత నేత భార్య విజయమ్మ- అందరికంటే ముందుగానే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ‘ఆత్మగౌరవానికి అహంకారానికీ నడుమ జరిగే సమరంగా’ ఆయన తన ఎన్నికల నినాదాన్ని ఓటర్లపై వొదిలారు. ‘కడప ఉపఎన్నికలు వైఎస్సార్ కు, కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు మధ్య జరిగే యుద్ధంగా’ కూడా ఆయన అభివర్ణించడం చర్చనీయాంశంగా మారింది. సోనియాపై ఈగ వాలినా వూరుకోని కాంగ్రెస్ నాయక శ్రేణులు జగన్ వ్యాఖ్యను ఆయన అహంభావానికి నిదర్శనమని విమర్శించాయి. వై ఎస్ జీవించివున్న కాలంలో ఆయన సోనియా పట్ల ప్రదర్శించిన వినయ విధేయతలను ఉటంకిస్తూ, ఆయనే ఈనాడు బతికి వుంటే జగన్ వ్యాఖ్యలకు ఎంతగా కుమిలి పోయివుండేవారో జగన్ తెలుసుకుని మాట్లాడాలని సలహా చెప్పాయి. అయితే, వై. ఎస్. ఆర్. అనేది కొత్త పార్టీ పేరు కనుక దీంట్లో తప్పు పట్టాల్సిందీ, ఆక్షేపించాల్సిందీ ఏముందన్నది జగన్ వర్గీయుల వాదన.
మామూలు పరిస్థితుల్లో అయితే, ఒకటి రెండు స్తానాలకు జరిగే ఉపఎన్నికల ఫలితాల ప్రభావం పాలక పక్షం పై పడే అవకాశం వుండదు. సంఖ్యాబలంలో చిన్న చిన్న తేడాలు ప్రభుత్వ మనుగడకు ప్రమాదకరంగా మారే వీలుండదు. అయితే ఈసారి కడప పార్లమెంట్, పులివెందుల శాసన సభ నియోజకవర్గాల ఉప ఎన్నికలు ఒక ప్రత్యేక రాజకీయ నేపధ్యంలో జరుగుతున్నాయి. వీటికి లోగడ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, శ్రీమతి విజయమ్మ ఇరువురూ కాంగ్రెస్ అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి, ఆ పార్టీకి రాజీనామా చేసి, చట్టసభల్లో తమ సభ్యత్వాలను వొదులుకుని, వై. ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ పెట్టుకుని మళ్ళీ ఎన్నికల బరిలో దిగిన కారణంగా, కడప ఉప ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా పరిణమించాయి. ప్రత్యేకించి ఇటీవలే జరిగిన శాసన మండలి ఎన్నికల్లో ఎదురయిన పరాజయాలు పాలక పక్షాన్ని కొంత ఇరకాటంలో పడేసిన నేపధ్యంలో, మరో అవమానాన్ని తట్టుకోగల స్తితిలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం లేదు. అలాగే, శాసన మండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ లోపాయకారీగా కుమ్మక్కయ్యాయని వెలువడిన ఆరోపణల దృష్ట్యా టీ.డీ.పీ. అధినాయకత్వం కూడా ఆ మచ్చను మాపుకునే క్రమంలో అభ్యర్ధుల ఎంపికలో తీవ్రమయిన కసరత్తు చేయాల్సిన పరిస్తితి ఏర్పడింది.
అనేక వడబోతల అనంతరం పార్టీ రాజ్యసభ సభ్యుడు, కడప జిల్లా రాజకీయాల్లో పండిపోయిన సీనియర్ నాయకుడు అయిన డాక్టర్ మైసూరారెడ్డిని జగన్ మోహన రెడ్డిపై పోటీకి టీ.డీ.పీ. నిలబెట్టింది. పులివెందులలో మాత్రం అంతగా జనం నోళ్ళలో నలగని బీటెక్ రెడ్డిని తెరపైకి తెచ్చింది. ఇక కాంగ్రెస్ తరపున ఆ నియోజకవర్గం నుంచి వై ఎస్ సోదరుడు వివేకానందరెడ్డి స్వయానా వొదినె విజయమ్మతోనే అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.
పోతే, కడప పార్లమెంట్ స్తానానికి జగన్ కు దీటయిన అభ్యర్దిని వెతికే క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అనేక పాట్లు పడాల్సివచ్చింది. గతంలో ఒకసారి వై ఎస్సార్ కే గట్టి పోటీ ఇచ్చిన టీ.డీ.పీ. నాయకుడు కందుల రాజమోహన రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తీర్ధం ఇప్పించి జగన్ పై పోటీకి నిలబెట్టాలని చేసిన ప్రయత్నాలు కొంత వరకే పనిచేశాయి. కందుల సోదరుల కాంగ్రెస్ పార్టీ ప్రవేశం మాత్రం ఎలాటి అవాంతరాలు లేకుండా జరిగిపోయింది కానీ, జగన్ పై పోటీలోకి దిగడానికి వారిద్దరూ ససేమిరా అనడంతో వైద్య శాఖ మంత్రి డాక్టర్ డీ.ఎల్. రవీంద్రారెడ్డిని ఆఖరు నిమిషంలో పార్టీ అభ్యర్ధిగా ప్రకటించాల్సిన దైన్య స్తితిలో కాంగ్రెస్ పడింది. ఈ కధ ఇన్ని మలుపులు తిరగడానికి దారి తీసిన పరిణామాలు కూడా శోభస్కరంగా లేవనే చెప్పాలి. కడప పార్లమెంట్ సీటు నుంచి పోటీ చేయడానికి ఈసారి కందుల సోదరులు పెట్టిన ముందస్తు షరతులు టీ.డీ.పీ. అధ్యక్షుడు చంద్రబాబుకు మనస్కరించకపోవడంతో మనస్తాపానికి గురయిన వారిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించి, ఇద్దరిలో ఒకరికి పార్టీ టిక్కెట్టు ఇచ్చిపోటీలో నిలబెట్టి జగన్ కు గట్టి పోటీ ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు గట్టి ప్రయత్నమే చేసినట్టు మీడియా కోడై కూసింది. జగన్ పై పోటీకి దిగడానికి కందుల సోదరులు పెట్టిన షరతులకు కాంగ్రెస్ అధిష్టానం పచ్చ జెండా వూపని కారణంగానే, వారు పోటీకి వెనుకడుగు వేసినట్టు వార్తలు గుప్పుమన్నాయి. పోటీ చేయాల్సిన అభ్యర్ధులే ఫలితాలు తారుమారయిన పక్షంలో తమ రాజకీయ భవిష్యత్తు కోసం అధినాయకులనుంచి హామీ కోరాల్సిన పరిస్తితులు ఏర్పడ్డాయంటే, వాస్తవ పరిస్తితులు ఎలావున్నాయో తేలిగ్గా అర్ధం చేసుకోవచ్చు.
కందుల సోదరులు పోటీ చేయమని భీష్మించుకున్న నేపధ్యంలో ఇక విధి లేక మంత్రి డీ.ఎల్.రవీంద్రారెడ్డి పేరును కడప పార్లమెంట్ స్తానానికి అభ్యర్ధిగా అధిష్టానానికి సూచించినట్టు ప్రకటించి రాష్ట్ర నేతలు చేతులు దులుపుకున్నారు. అయితే, దానికి ముందే కడప జిల్లాకు చెందిన అధికార పార్టీ శాసన సభ్యుడు వీరశివారెడ్డి – కడప పార్లమెంటు సీటుకు పార్టీ తరపున డీ.ఎల్. పోటీచేస్తారని మీడియాకు వెల్లడించి ఆ పార్టీలో కొత్త సంప్రదాయానికి తెర తీసారు. చిన్నపాటి కార్పొరేషన్ చైర్మన్ ఎంపిక విషయంలో కూడా అధిష్టానం అనుమతి లేకుండా స్వతంత్రించి నిర్ణయం తీసుకోలేని కాంగ్రెస్ పార్టీలో, ఒక శాసన సభ్యుడు- ఏకంగా పార్లమెంటుకు పార్టీ తరపున పలానా వ్యక్తి పోటీ చేస్తారని ప్రకటించడం కాంగ్రెస్ సంస్కృతి తెలిసిన వారికి వింతగానే అనిపించింది. నిజంగా ఇది చాలా గొప్ప మార్పు. అయితే దేని కోసం ఇంత మార్పు అన్నదే ఇక్కడ ప్రధాన ప్రశ్నగా మిగులుతోంది. శతాధిక సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక పెద్ద పార్టీ, ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారంలో వున్న జాతీయ పార్టీ - ఒక్క వ్యక్తిని ఎదుర్కోవడం కోసం ఇన్ని మల్లగుల్లాలు పడుతుండడం చూసేవారికి ఆ పార్టీ నిజంగానే బలంగా వుందా లేదా అంతగా బలహీన పడిందా అని అనిపించడంలో వింతేమీ లేదు.
అభ్యర్ధి నిర్ణయ ప్రక్రియలో ఇన్నిన్ని కప్పదాట్లకు అవకాశం ఇవ్వకుండా, ముందుగానే రవీంద్రారెడ్డి అభ్యర్ధిత్వాన్ని నిర్ణయించి, ప్రకటించి వుంటే పార్టీ ఇంత అపప్రధ మూటకట్టుకునేది కాదు. ఎందుకంటే, కడప జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో పలుకుబడి కలిగిన నాయకుడాయన. పైపెచ్చు వై.ఎస్.ఆర్.నే నేరుగా రాజకీయంగా ఎదుర్కున్న వ్యక్తి. జగన్ రెడ్డి పై ఆయన విజయావకాశాలు యెలా వుంటాయన్నది ప్రశ్న కాదు. యే ఎన్నికల్లో అయినా గెలుపోటములు అభ్యర్ధుల చేతుల్లో వుండవు. కాకపోతే, జగన్ రెడ్డి పై పోటీ చేసే అభ్యర్ధిని ఎంపికచేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ కిందుమీదవుతోందన్న మీమాంసకు తావు లేకుండా పోయేది. కానీ, అలా చేయకుండా, అభ్యర్ధి నిర్ణయంలో తాత్సారం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమరంలో కొంత ముందస్తు ఓటమిని అంగీకరిస్తున్న భావాన్ని కలిగించింది. మనసులో మాట దాచుకోకుండా వ్యక్తం చేసే మంత్రి బొచ్చ సత్యనారాయణ ఇదే విషయాన్ని మరోరకంగా వెల్లడించారు కూడా. దీనికి తోడు ఈ ఉప ఎన్నికలు రిఫరెండం కావంటూ పీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్ చేసిన ప్రకటన.
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరో విచిత్రమయిన అంశం ఈ ఎన్నికల సందర్భంగా వెలుగులోకి వచ్చింది. సాధారణంగా పార్టీ టికెట్ కోసం కాంగ్రెస్ అభ్యర్ధులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఢిల్లీ చుట్టూ ఎన్నో ప్రదక్షిణాలు చేయాలి. అధిష్టానం వద్ద పట్టుందని భ్రమ కల్పిస్తూ పబ్బం గడుపుకుంటున్న ఎందరెందరో తాబేదార్లను మెప్పించాలి. ఇంతా చేసినా టికెట్ రావాలని లేదు. ఒకవేళ టికెట్ వచ్చినా బీ ఫారం చేటికి చేతికి ఇస్తారని ఆశ లేదు. అధవా బీ ఫారం ఇచ్చినా నామినేషన్ వేసేంతవరకు అధిష్టానం మనసు మార్చుకోదన్న నమ్మకం లేదు. కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నం చేసిన ఎవరినడిగినా ఈ విషయాలు చెబుతారు. అలాటిది, ఈ సారి అనేకమంది కాంగ్రెస్ నాయకులు, ‘అధిష్టానం ఆదేశిస్తే జగన్ పై పోటీ చేస్తామ’ని బహిరంగ ప్రకటనలు చేశారు. అధినాయకత్వం ఆదేశించాలే కాని ఔదలదాల్చని వారెవరుంటారు? మరెందుకిలా బీరాలు పోయినట్టు? దీనికి ఒక కాంగ్రెస్ నాయకుడే ప్రైవేటు సంభాషణలో సమాధానం చెప్పాడు. అధిష్టానం ఆదేశించడం అంటే – ఎన్నికకు పూర్తి బాధ్యత పార్టీ స్వీకరించాలి. యావత్తు భారాన్ని పార్టీయే మోయాలి. మొత్తం పార్టీ శ్రేణుల్నీ సమన్వయం చేసి పార్టీ అభ్యర్ధికి అనుకూలంగా పనిచేసేట్టు చూడాలి. తీరా ఫలితంలో ఏవన్నా తేడాపాడాలు వస్తే, ఆ అభ్యర్ధుల రాజకీయ భవిష్యత్తును మరో రకంగా కాపాడాలి. అధిష్టానం ఆదేశించడం అంటే ‘కంప్లీట్ ప్యాకేజ్’ అన్నమాట. కాకపొతే, కాస్త అటూ ఇటూగా అన్ని ప్రధాన పార్టీల్లో ఈ ప్యాకేజి ఏదో ఒక రూపంలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అమలవుతోందట. (11-04-2011)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి