"ఇప్పుడే అందిన వార్త: రాజకీయ వలసలు గమనించిన మీదట తాము రావడం ఇక అనవసరమనుకుని ఈ ఏడాది కొల్లేటి సరస్సుకు వలస పక్షులు రావడం వాయిదా వేసుకున్నాయి"
11, ఏప్రిల్ 2014, శుక్రవారం
వాహ్వ్
లేబుళ్లు:
వాహ్వ్ - ఆంధ్ర జ్యోతి
నాసికా శాస్త్రం
ముక్కు వుంది చీదడానికే అని
అదేపనిగా చీదేయకండి. ముక్కుతో కూడా ఎన్నో
ఉపయోగాలున్నాయని ఓ ముక్కు శర్మగారు సెలవిస్తున్నారు. తలనొప్పిని అయిదే అయిదు
నిమిషాల్లో ఎగరగొట్టే మహత్తర శక్తి ముక్కుకు వుందన్నది ఆయన మాటల తాత్పర్యం.
ఇంతకీ విషయం ఏమిటంటే -
ముక్కుకు రెండు రంధ్రాలు
వుంటాయి. ఈ నిజం తెలుసుకోవడానికి ముక్కు శర్మగారు అవసరం లేదు. కానీ ఆయన చెప్పేది
ఇంకా వుంది. ఆ రెండు రంధ్రాల్లో ఎడమవైపుది చంద్రుడి స్థానం అయితే, కుడి వైపుది సూర్యుడి
స్థానం. బాగా తలనొప్పిగా వున్నప్పుడు కుడి రంధ్రాన్ని ఓ అయిదు నిమిషాల పాటు
మూసివుంచి ఒక్క ఎడమవైపు రంధ్రం ద్వారా మాత్రమే శ్వాస తీసుకుంటే తలనొప్పి గాయబ్.
అంతేనా అంటే అంతే కాదు అంటున్నారు ముక్కు శర్మగారు.
బాగా అలిసిపోయినప్పుడు ఎడమవైపు
రంధ్రాన్ని చేతి వేలితో మూసి, కుడి వైపు రంధ్రం నుంచి శ్వాస పీల్చి చూడండి. ఇక
చూడండి, రిఫ్రెష్ బటన్ నొక్కినట్టు మనస్సు
పాతిక లైకులు చూసినంత హాయిగా తాజాగా అయిపోతుంది (ట)
ప్రయత్నించి చూస్తే
పోయేదేమీ లేదు ఓ అయిదు నిమిషాలు టైం తప్ప.
స్టార్ట్ ....వన్ టూ త్రీ....
తోకముక్క:
నెట్లో ఈ సమాచారం ఇంగ్లీషులో పంపిణీ చేసిన దేవినేని మధుసూదన రావు గారికి
కృతజ్ఞతలు. దాన్ని స్వేచ్చగా తెలుగులోకి
మార్చిన భవదీయుడికి (అంటే నేనే) అభినందనలు.NOTE: Courtesy Image Owner
10, ఏప్రిల్ 2014, గురువారం
మూలిగే నక్కమీద తాటిపండు
'ఏవిటో బాధ్యతలు ఒకదాన్ని మించి ఒకటి మీద పడుతున్నాయి. అమ్మాయి పెళ్లి, అబ్బాయి చదువు యెలా అని మధన పడుతుంటే - ఇప్పుడు కొత్తగా మా పార్టీని గెలిపించాల్సిన బాధ్యత కూడా ప్రజలదే అంటున్నారు నాయకులు' - సామాన్యుడి స్వగతం
లేబుళ్లు:
మూలిగే నక్కమీద తాటిపండు
పొసగని విషయాలు
"వోటు హక్కు వినియోగించుకోండి - మంచి అభ్యర్ధిని ఎన్నుకోండి"
వలసపక్షులు
బొమ్మను చేసీ ప్రాణము పోసీ.......
బ్రహ్మగారు సత్యలోకంలో బాసింపట్టు వేసుకుని, రేడియో వింటూ చేసే వంట లాగా, అర్ధాంగి వీణావాణి చెబుతున్నవిదంగా
సృష్టి కార్యం పూర్తి చేస్తున్నారు.
'అందం అరవై పాళ్ళు' అన్నది సరస్వతి.
అక్షరాలా అరవై పాళ్ళు అందం కొలిచి పోశాడు విధాత.
'సౌకుమార్యం పాతిక పాళ్ళు' అన్నది సరస్వతమ్మ.
'తధాస్తు' అన్నాడు విధాత.
'అమ్మతనం అరవై ఆరుపాళ్ళు, ఆత్మబలం ఆరుపాళ్ళు, అహంకారం మరో ఆరుపాళ్ళు.
వినయం అయిదుపాళ్ళు, అణకువ ఆరుపాళ్ళు, మేధస్సు ముప్పై పాళ్ళు, మానసిక బలహీనతలు నలభై
పాళ్ళు, శారీరకబలం లవణం మాదిరిగా తగినంత.' చెప్పుకుంటూ పోతోంది చదువుల తల్లి.
విధాత వింటూనే ఆ బొమ్మకు మెరుగులు దిద్దుతున్నాడు.
బొమ్మ పూర్తయింది. దాని అందం చందం చూసి హాటక
గర్భురాణికే మతి పోయింది. ఇంత సౌందర్యం, ఇన్ని తెలివితేటలు, అమ్మో ఇంకేమైనా వుందా అని
గాభరా పడిపోయింది.
బ్రహ్మ భార్య కంగారు చూసి మూడు బోసి నోళ్ళతో ముసి
ముసి నవ్వులు నవ్వాడు. నవ్వి చెప్పాడు.
"నువ్వు పాళ్ళు చెబుతున్నప్పుడే అనుమానం
వచ్చింది. కొన్ని శృతిమించుతున్నాయేమో అనికూడా అనిపించింది. అదీ మంచిదేలే, సరే పోనీలే అనుకున్నాను. ఎందుకంటావా? శారీరక బలం
వంటలో లవణం మాదిరిగా తగినంత అన్నావు. దానికి ఇన్ని పాళ్ళు అనిచెప్పలేదు.
ఉజ్జాయింపుగా కొలిచివేసేటప్పుడు కొంత తభావతు తధ్యం. ఇక మానసిక బలహీనతలు ఏకంగా
ఎక్కువే పెట్టావు. పాళ్ళు ఎక్కువైనా కష్టమే అన్న సూత్రం నువ్వు పట్టించుకోలేదు.
వంటకం పూర్తయింది. ఇక రుచి అంటావా. వేసే దినుసుల పాళ్ళని బట్టి వుంటుంది. అలాగే, ఈ బొమ్మ బతుకూ అంతే. తెలివితేటలు,
బలాబలాలు, మేధస్సు యేది తీసుకున్నా ఎవరికీ తీసిపోని మాట నిజమే. కానీ పాళ్ళలోనే
తేడా. అందువల్లే ఈ విషయాల్లో ఒక స్త్రీకి మరో స్త్రీకీ ఎంతో తేడా. దండలో దారంలాగా
అమ్మతనం ఒక్కటే ఆడవారందరికీ ఉమ్మడి ఆభరణం. అదొక్కటే ప్రపంచానికి కూడా పెద్దదిక్కు, ఆ గౌరవంతోనే సరిపుచ్చుకుని మిగిలిన
అన్నింటినీ తేలిగ్గా మరచిపోతుంది. ఈ
పుత్తడి బొమ్మకు నేనిస్తున్న అదనపు వరం
ఇదే'
NOTE : Courtesy Image Owner
లేబుళ్లు:
బొమ్మను చేసీ ప్రాణము పోసీ ....
9, ఏప్రిల్ 2014, బుధవారం
ఏ కౌన్ హై?
'ఈడెవడు?'
'తెల్వదు సార్ ఇప్పుడే గోడదూకి వస్తున్నాడు'
'ఏ పార్టీ?'
'అదీ తెల్వదు సార్! ఈ క్షణం నుంచీ మన పార్టీయే
అంటున్నాడు'
పర్వా నై
"సార్ తొందర్లో అతగాడిని మన పార్టీ
అభ్యర్ధిగా ప్రకటించకండి. మనం పొత్తు పెట్టుకుందామని చర్చలు జరుపుతున్న పార్టీలో కొద్ది
సేపటి క్రితమే దూరి పోయి ఆ పార్టీ కండువా కప్పెసుకున్నాడు."
"పర్వా నై భాయ్. అయితే ఆ సీటును పొత్తుల్లో
ఆ పార్టీకి ఇచ్చేస్తున్నట్టు ఒక ప్రకటన చేస్తే సరిపోతుంది. దీనికి గాభరా
యెందుకు?"
8, ఏప్రిల్ 2014, మంగళవారం
అమెరికన్ కాకమ్మ కధ
కాకమ్మ కధలు చెప్పేవాళ్ళు అమెరికాలో కూడా
వుంటారు. అలాటి ఒక కధే ఇది.
కధ కాబట్టి, అందులోను అమెరికా కధ కాబట్టి వూరికూరికే డౌట్లు అడక్కూడదు.
అనగనగా ఓ చదువుకోని నిరుద్యోగి మైక్రోసాఫ్టు
ఆఫీసులో బంట్రోతు పనికోసం వెళ్ళి అక్కడి హెచ్ ఆర్ మేనేజర్ని కలిసాడు.
(మైక్రోసాఫ్టు లాంటి సంస్థలో బంట్రోతు ఉద్యోగం
ఏమిటి అనే చొప్పదంటు ప్రశ్నలు మధ్యలో అడగరాదన్నది ఈ కాకమ్మ కధ చెప్పేవాడి కండిషన్.)
హెచ్ ఆర్ మేనేజర్ మనవాడి ఈ మెయిల్ అడిగాడు. 'పూటకు
ఠికానా లేదు నాకో కంప్యూటర్ పైగా ఓ ఈ
మెయిల్ ఐడీ కూడానా' అని మనవాడు జవాబు చెప్పాడు. మేనేజర్ ఆశ్చర్యపోయాడు. 'నీకు ఈమెయిల్ ఐడీ కూడా లేదా. అదికూడా లేకుండా అమెరికాలో యెలా
బతుకుతున్నావు?' అని ప్రశ్న మీద ప్రశ్న వేస్తుంటే మనవాడు మొహం తిప్పుకుని బయట
పడ్డాడు.
బయట పడ్డాడే కాని జీవితం పెట్టిన పరీక్ష నుంచి
యెలా బయటపడాలో తెలియలేదు. అల్లా నడుచుకుంటూ వెడుతుంటే ఆదివారం సంత (?) కనబడింది.
జేబులో పది డాలర్లు వున్నాయి. అవ్వే ఈనెలకు, కాదు కాదు మొత్తం ఈ ఏడాదికీ మిగిలిన ఆఖరు మొత్తం.
వెళ్ళి ధైర్యం చేసి పది డాలర్లు పెట్టి పది కిలోల టమాటాలు కొన్నాడు. ఓ సంచీలో
వేసుకుని ఇల్లిల్లు తిరిగి అమ్మాడు. సాయంత్రం చూసుకుంటే ఇరవై డాలర్లు లాభం. ఓహో
డబ్బు సంపాదించడం అంటే ఇదా అనుకున్నాడు. మళ్ళీ ఆ డబ్బులన్నీ పెట్టి టమాటాలు కొని
మళ్ళీ వాటిని ఇంటింటికీ తిరిగి అమ్మాడు. పొద్దున జేబులో వున్న పది డాలర్లు రాత్రికి ఇంటికి
చేరేసరికి పిల్లలు పెట్టి అరవై అయ్యాయి.
తిరుగుడు, శారీరక శ్రమ తప్ప వేరే పెట్టుబడి లేదు. అతడికి తత్వం బోధపడింది. ఇక
వెనుతిరిగి చూడలేదు.
నెల తిరిగేసరికల్లా బండి కొన్నాడు. మరోనెలకల్లా
ట్రక్కు కొన్నాడు. మూడు నెలల్లో టోకు దుకాణం తెరిచాడు. ఐదేళ్ళల్లో ఏకంగా దేశంలో ఒక
పెద్ద చైన్ సంస్థగా ఎదిగాడు. లక్షలకొద్దీ ఆదాయం, వేలకొద్దీ సిబ్బంది.
కుటుంబం కోసం ఏదయినా చేయాలనిపించి ఒక ఇన్స్యూరెన్స్ సంస్థని సంప్రదించాడు. అతడు
అడిగిందే భాగ్యం అనుకుని ఆ కంపెనీ తమ మార్కెటింగ్ చీఫ్ నే అతడి ఇంటికి పంపింది. అతగాడు వివరాలు తీసుకుంటూ యధాలాపంగా మనవాడి ఈ మెయిల్ అడిగాడు. అలాటిదేదీ లేదన్నాడు.
ఇన్స్యూరెన్స్ వాడు బిత్తరపోయాడు. ఇన్ని బిలియమ్ల టర్నోవర్ వున్న ఇంత భారీ సంస్థకు
అధిపతి అయివుండి ఈ మెయిల్ కూడా లేకుండా ఇన్నిన్ని వ్యాపారాలు యెలా చేయగలుగుతున్నారని అడుగుతూ అది
కూడా వుంటే మీరు మరిన్ని కోట్లకు పడగలేట్టేవాల్లేమో అని నసిగాడు.
మనవాడు నవ్వాడు. అవతల మార్కెటింగు చీఫ్ గుండె
పగిలేలా బిగ్గరగా నవ్వాడు.
నవ్వి అన్నాడు.
'అవును ఈ మెయిల్ అవీ వుండి వుంటే నేను ఈ పాటికి
మైక్రోసాఫ్టు సంస్థలో ఆఫీసు బాయ్ గా వుండి వుండేవాడిని'
ఇలాటి కాకమ్మ కధలు బొచ్చెడు తెలుసంటారా? నాకు ఈ
కధ చెప్పిన వాడితో నేనూ అదే అన్నాను.
(ఇంగ్లీష్ లో ఈ కధను పీవీవీజీ
స్వామి గారు నాకు మెయిల్ చేశారు. నేను
దాన్ని ఇష్టం వచ్చినట్టు తెలుగులో చెక్కేసాను. షరా మామూలుగా స్వామిగారికి
కృతజ్ఞతలు)
లేబుళ్లు:
అమెరికన్ కాకమ్మ కధ,
PVVG SWAMY
శ్రీరాముడితో పోల్చి వోటు వేయాలంటే 'NOTA'నే గతి!
" ఓటేసే ముందు ప్రతి అభ్యర్ధికీ రాముడి
లక్షణాల లిట్మస్ పరీక్ష పెట్టాలి. శ్రీరాముడితో పోలిస్తే ఎవరికెన్ని మార్కులొస్తాయో
లెక్కగట్టి పక్కాగా అంచనా వేసుకోవాలి" - వోటర్లకు ఈ నాటి 'ఈనాడు' సలహా!
" అలా పోల్చి వోటు వేయాలంటే వోటర్లకు ఒక్క అభ్యర్ధీ
కలికానికి కూడా దొరకడు. ఇక అప్పుడు 'NOTA' నే శరణ్యం!
లేబుళ్లు:
NOTA (NONE OF THE ABOVE) - నోటా
7, ఏప్రిల్ 2014, సోమవారం
రెండు లీటర్లు చాలు
ఏకాంబరం కారు డ్రైవ్ చేసుకుంటూ ఢిల్లీ రోడ్ల మీద
తిరుగుతూ పార్లమెంటు భవనం వైపు వెళ్లాడు. అక్కడ అంతా గందరగోళంగా వుంది.
విండో కిందికి దించి అడిగాడు ఏం జరుగుతోందని.
'టెర్రరిష్టులు భవనంలో జొరబడి సభ్యులనందరినీ
బంధించారు. విడిచిపెట్టడానికి వెయ్యి కోట్లు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే
వారినందరినీ పెట్రోలు పోసి తగలబెడతామని బెదిరిస్తున్నారు. అందుకని చందాలు
అడుగుతున్నాం.'
'యెంత ఇమ్మంటారేమిటి' ఏకాంబరం అడిగాడు పర్సు
తీస్తూ.
'తలా రెండు లీటర్లు ఇస్తే సరిపోతుందని
అనుకుంటున్నాం'
(నెట్లో కనబడ్డ ఇంగ్లీష్
జోక్కి స్వేచ్చానువాదం)
లేబుళ్లు:
రెండు లీటర్లు చాలు
ఉభయతారకం
పొత్తులతో కుదేలవుతున్న పార్టీలకి ఓ చిన్న చిట్కా.
A పార్టీ B పార్టీకి పొత్తులో భాగంగా పలానా స్థానాలు ఇవ్వడానికి అంగీకరించింది. పలానా రెండో పార్టీ పలానా మొదటి పార్టీకి పలానా పలానా స్థానాలు వొదులుకోవడానికి సిద్ధపడింది. కానీ ఆ పలానా పలానా స్థానాల్లో పాతుకుపోయిన వాళ్లకు యెలా సర్ది చెప్పేట్టు. అందుకే ఈ చిట్కా.
అలా పాతుకుపోయివున్న పాతవారికి పొత్తు కుదుర్చుకునే కొత్త పార్టీ కండవా కప్పేసి ఆ కొత్త పార్టీచేత బీ ఫారం వారిచేతిలో పెట్టించాలి. పొత్తు కుదుర్చుకున్నట్టు వుంటుంది. తమ పార్టీ వాళ్ళకే టిక్కెట్టు ఇప్పించినట్లు వుంటుంది. ఉభయతారకం. ఏమంటారు?
A పార్టీ B పార్టీకి పొత్తులో భాగంగా పలానా స్థానాలు ఇవ్వడానికి అంగీకరించింది. పలానా రెండో పార్టీ పలానా మొదటి పార్టీకి పలానా పలానా స్థానాలు వొదులుకోవడానికి సిద్ధపడింది. కానీ ఆ పలానా పలానా స్థానాల్లో పాతుకుపోయిన వాళ్లకు యెలా సర్ది చెప్పేట్టు. అందుకే ఈ చిట్కా.
అలా పాతుకుపోయివున్న పాతవారికి పొత్తు కుదుర్చుకునే కొత్త పార్టీ కండవా కప్పేసి ఆ కొత్త పార్టీచేత బీ ఫారం వారిచేతిలో పెట్టించాలి. పొత్తు కుదుర్చుకున్నట్టు వుంటుంది. తమ పార్టీ వాళ్ళకే టిక్కెట్టు ఇప్పించినట్లు వుంటుంది. ఉభయతారకం. ఏమంటారు?
సరికి సరి
మనవాడే అయ్యుంటాడు
అంజయ్య గారి భోలాతనం గురించి ఆ రోజుల్లో ఓ కధ చెప్పేవాళ్ళు. నిజంగా ఇది కధే. నిజంగా నిజం కాదు. ఆయన ఓ సారి మంత్రివర్గాన్ని భారిగా విస్తరించారు. జంబో క్యాబినెట్ అనేవాళ్ళు. ఇప్పుడంటే అవి మామూలయిపోయాయి. ఒకరోజు కొత్తమంత్రి ఒకరు ముఖ్యమంత్రి అంజయ్య గారిని కలవడానికి వచ్చారు. ఆయన్ని చూడగానే అంజయ్య గారు నొచ్చుకుంటూ - ఈ సారి నిన్ను తీసుకోవడం కుదరలేదు. మళ్ళీ ఎప్పుడయినా మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు నిన్ను తప్పకుండా చేర్చుకునే పూచీ నాది'అన్నారు. మంత్రివర్గంలో ఎవరెవరు వున్నారో ఆయనకే తెలియదని ఆ రోజుల్లో హాస్యోక్తిగా అనుకునేవారు. ఇప్పుడు మళ్ళీ అలాగే వుంది. ఎన్నికలముందు ఎవరు ఏ పార్టీలోకి వెడుతున్నారో తెలవదు. వెళ్ళిన వాళ్లు అక్కడ ఎన్నాళ్ళు వుంటారో తెలవదు. ఏ పార్టీనుంచి ఏ గుర్తుమీద పోటీ చేస్తున్నారో తెలవదు. ప్రచారానికి పోయినప్పుడు పాత పార్టీని తిట్టాలో తెలియదు. కొత్త పార్టీని పొగడాలో తెలియదు. ఫలితాలు వెల్లడయిన తరువాత కూడా గెలిచినవాడు మనవాడేనా కాదో తెలియదు. ఇన్ని అయోమయాల మధ్య జరుగుతున్న ఎన్నికల్ని మనం చూడబోతున్నాం.
లేబుళ్లు:
మనవాడే అయ్యుంటాడు
ఈ ప్రశ్నకు బదులిది
వోటేసి రావడానికి వాళ్ల వూరు వెళ్ళిన పనిమనిషి
కుటుంబం తిరిగొచ్చింది.
'కొత్త రాజధాని ఎక్కడ అనుకుంటున్నారు' యాదాలాపంగానే
అడిగాను.
'బిల్దింగులూ, రోడ్లు, మెట్రో రైళ్ళూ అన్నీ
కలిగినోళ్ళకి. మాకిట్లా నాలుగువేళ్ళు నోట్లోకి పోతే చాలు'
'?'
లేబుళ్లు:
ఈ ప్రశ్నకు బదులిది AP Elections
5, ఏప్రిల్ 2014, శనివారం
వినదగునెవ్వరు చెప్పిన.....
మన వైఖరిలో లేదా నడతలో
ఏదైనా బలహీనత వుంటే అది మన వ్యక్తిత్వంలో కూడా ప్రస్పుటమవుతుంది.
కొందరు మంచి
జరిగినప్పుడు ఆనందంతో మందహాసం చేస్తారు. తామ్ము నవ్వినప్పుడే మంచి జరుగుతుందని మరికొందరు
విశ్వసిస్తారు.
చక్కటి మానవ సంబంధాలను
దెబ్బతీయడానికి కావలసిన ఏకైక వనరు ఒక్కటే. అదే అహంకారం.
రాత్రికి రాత్రే
లక్ష్యాలను మార్చుకుంటూ పోవడం సమర్ధనీయం కాదు. కానీ ఆ లక్ష్యసాధనకోసం
అనుసరించాల్సిన మార్గాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ పోవచ్చు.
అసంబద్ధం అయిన విషయాలు
చెప్పి మిమ్మల్ని నమ్మించేవాళ్ళు మీచేత అకృత్యాలు చేయించినా ఆశ్చర్యపోనక్కరలేదు.
విజయం సాధించినప్పుడు
అది మీకు స్వాభావికం అనుకోవాలి. వోటమి ఎదురయినప్పుడు మార్పుకోసం దాన్ని ఆస్వాదించగలగాలి.
నిరాశావాది ఎదురుగాలి
గురించి ఆందోళన చెందుతాడు. ఆశావాది ఆ వ్యతిరేక పవనాలను తనకు సానుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాడు.
అద్భుతం అంటే అదేదో
అరుదుగా జరిగే అద్భుతం అనుకోకండి. చూడకలిగే
కళ్ళు వుంటే మన చుట్టూ కనబడే ప్రతిదీ ఒక
పరమాద్భుతమే.
ప్రతిదీ భగవంతుడి మీద
భారం వేసి ప్రార్ధన చేయండి. కానీ పని చేసేటప్పుడు మాత్రం అన్నీ మీమీదే, మీ కృషి
మీదే ఆధారపడివున్నాయన్న విశ్వాసంతో మొదలుపెట్టండి.
మీ చుట్టు వున్న
లోకాన్ని మార్చడానికి చాలా కాలం పడుతుంది. కానీ ముందు మిమ్మల్ని మీరు మార్చుకునే
ప్రయత్నం చేయండి. దానికి కావాల్సింది సమయం కాదు, పట్టుదల, నిబద్ధత.
మీకు మంచి నైపుణ్యం
వుంది అనుకున్న రంగంలో మరింత మెరుగయిన కృషి చేయక పోతే మీ ఎదుగుదల అసాధ్యం
జీవితం, సమయం మనకు మంచి
ఆచార్యులు. సమయాన్ని యెలా వాడుకోవాలో జీవితం నేర్పితే, జీవితపు విలువ ఏమిటో సమయం
బోధిస్తుంది.
పొద్దున్న నిద్ర లేవడం
అన్నది ఒక మంచి ఆలోచనతో మొదలయితే చాలు, ఇక ఆ రోజంతా మీకు చాలా ఆనందంగా ఆహ్లాదంగా గడిచిపోవడం ఖాయం.
పనిచేయడం, ప్రయత్నించడం
రెండు వేర్వేరు విషయాలు. ప్రయత్నించడం అంటే జరుగుతుందని ఆశ పడడం. పని పూర్తి చేయడం అంటే ఫలితాన్ని
సాధించడం.
ఏదో సాధించాలి అన్న తపనే
మీరు ఈరోజున్న స్థానానికి మిమ్మల్ని చేర్చింది అన్న విషయం ఎప్పుడూ గుర్తు
పెట్టుకోండి.
ఈ క్షణంలో ఏదయినా బాగా
చేయగలిగితేనే అది మరు క్షణంలో మిమ్మల్ని మరో మంచి స్థానంలోకి చేరుస్తుంది.
ఆశావాది మరచిపోవడానికి
నవ్వుతాడు. నిరాశావాది నవ్వడమే మరచిపోతాడు.
ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం కావాలంటే కావాల్సినవి ఎయిర్ కండిషనర్లు
కాదు. మంచి మనసులు, మంచి మనుషులు.
ఆకాశంలో అంత ఎత్తున ఎగిరే
బెలూన్లు కూడా మంచి పాఠం బోధిస్తాయి.
జీవితంలో అలా పైపైకి ఎదుగుతూ పోవాలంటే 'సరుకు'
వుండాల్సింది బయట కాదు, లోపల అని.
లేబుళ్లు:
వినదగునెవ్వరు చెప్పిన.....
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)





