21, డిసెంబర్ 2013, శనివారం

తిరుక్షవర సేవలో....



(పిల్లలకు చెడ్డీలు మార్చినంత సులభంగా రాజకీయనాయకులు పార్టీలు మార్చగలరన్న అపవాదును రాజకీయనాయకులు మోస్తున్నారు. దీనికి తోడు  ‘ఈ దేశంలో ప్రతిదీ తమ సొంతం , ప్రతిదీ తమకు ఉచితం’ అనే భావన వారిలో ప్రబలిపోయిందని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. దీనికి  సంకేతంగా నెట్లో ఇంగ్లీష్ లో  ప్రచారంలోవున్న  ఓ కధనం  నా తెలుగులో మీకోసం)


“క్షవరం చేయించుకుందామని పువ్వులమ్ముకునే ఓ చిరు వ్యాపారి ఓ రోజు ఓ క్షవరశాలకు వెళ్లాడు. పని పూర్తయిన తరవాత డబ్బులు ఇవ్వబోయాడు. ఈ వారం రోజులూ నేను నా తోటివారికి నా చేతనయిన సర్వీసు ఉచితంగా చేద్దామనుకుంటున్నాను. అందువల్ల డబ్బులు తీసుకోనుఅని అతగాడు మృదువుగా తిరస్కరించాడు. ఆ మాటలకు ముగ్ధుడయిన ఆ పూల వ్యాపారి అక్కడినుంచి నిష్క్రమించాడు. మరునాడు క్షురకుడు తన దుకాణం వద్దకు వెళ్లేసరికి అందంగా తయారు చేసిన పూల బొత్తి షాపు ముందు కనిపించింది. మీ సేవకు ధన్యవాదాలుఅని దానికో చీటీ పెట్టివుంది.
“తరువాత, ఆ షాపుకు ఓ పోలీసు వచ్చాడు. బిల్లు చెల్లించబోయేటప్పుడు అతడికి కూడా అదే సమాధానం వచ్చింది. ఈ వారమంతా అందరికీ ఉచిత సేవ అందించాలన్న నిర్ణయానికి అనుగుణంగా డబ్బులు తీసుకోనని క్షురకుడు తెగేసి చెప్పాడు. మరునాటి ఉదయం అతడు దుకాణం తెరవడానికి వచ్చినప్పుడు ఆ పోలీసు పంపిన ధన్యవాదాల సందేశం, దానితో పాటు అతడి ఇల్లాలు స్వయంగా తయారు చేసిన మిఠాయిలు కనిపించాయి. 
“ఆ మరునాడు, ఘనత వహించిన పార్లమెంట్ సభ్యుడు ఒకరు క్షవరం చేయించుకుందామని ఆ దుకాణానికే వెళ్లాడు. క్షురకుడు యధావిధిగా డబ్బులు తీసుకోకపోవడానికి కారణం ఆయన గారికి నివేదించుకున్నాడు. ఈ వారమంతా ఉచిత సేవ చేయాలని అనుకున్నానని పార్లమెంటు సభ్యుడితో చెప్పాడు. అస్తమానం ప్రజాసేవలో తరించే ఆ ప్రజా ప్రతినిధి ఆ మాటలు విని ఎంతో మురిసిపోయి వెళ్లి పోయాడు.
“మరుసటి రోజు ఉదయం క్షురకుడు తన దుకాణం తెరవడానికి వెళ్ళినప్పుడు అక్కడ బారులు తీరి జనం కనబడ్డారు . విచారిస్తే తెలిసినదేమిటంటే వారంతా గౌరవ పార్లమెంటు సభ్యులేనని. ఉచితంగా దొరికే క్షవర సేవను అందుకుందామని వచ్చారని. తీరిగ్గా విచారించడమే ఇక అతగాడికి మిగిలింది”
సాధారణ జనాలకు, వారిని పాలించే రాజకీయ నాయకులకు - మనస్తత్వాల్లో స్తూలంగా వున్న తేడాను ఎత్తిచూపుతూ వెలువడిన ఈ కధనం ముక్తాయింపు ఇలా వుంది.

“చంటి పిల్లలకు వాడే డైపర్’ లనూ, రాజకీయనాయకులనూ తరచూ మారుస్తుండడం చాలా అవసరం” 
NOTE: Courtesy Cartoonist 

20, డిసెంబర్ 2013, శుక్రవారం

ఓరి భగవంతుడా ! – భండారు శ్రీనివాసరావు


(దేవుడ్ని నమ్మని శ్రీ నరిసెట్టి ఇన్నయ్య గారికి, దేవుడ్ని నమ్మే నాలాటి వారికి ఇది అంకితం)
దేవుడు లేడని ఆయన్ని నమ్మనివాళ్ళంటారు.
వున్నాడని నమ్మేవాళ్ళంటారు.
దేవుడు పేరు చెప్పి సొమ్ములు పోగేసుకుంటున్నారని నాస్తికులు ఆరోపిస్తుంటే, దేవుడు లేడని చెబుతూ డబ్బులు దండుకుంటున్నారని వారి ప్రత్యర్ధులు అంటుంటారు. నాకయితే ఇద్దరూ కరక్టే అనిపిస్తుంది.
దేవుడ్ని నమ్మినా నమ్మకపోయినా నమ్మినట్టు నటించడం వల్ల కొన్ని ప్రయోజనాలు వున్నట్టే, దేవుడ్ని నమ్ముతున్నా నమ్మనట్టు బూకరించడం వల్ల కూడా కొన్ని లాభాలు వున్నాయి. ఈ రెండు తరగతులవారు నిత్యం అందరికీ తారసపడుతూనే వుంటారు కాబట్టి వీరు కనబడడం కోసం ప్రత్యేకంగా తపస్సులు చేయనక్కరలేదు. ఏదో ఒక అంశంపై టీవీ తెరలపై అనునిత్యం దర్శనం ఇస్తూనే వుంటారు.
వీరుకాక మరో రెండు తరగతులవారు వున్నారు. దేవుడే సాక్షాత్తు దిగివచ్చినా దేవుడ్ని నమ్మని వారు ఒక బాపతు. కానీ ఆ విషయం పైకి టముకు వేసుకోరు. మనసా వాచా కర్మణా పూర్తిగా నమ్మేవారు రెండో రకం. వీరు కూడా భగవంతుడిని బజారుకు లాగరు. గుండెల్లోనే గుడికట్టుకుని వుంచుకుంటారు. కానీ, నమ్మకం లేని ఆ భగవంతుడూ నమ్మని వీళ్ళను కనుక్కోడు. నమ్మిన ఆ దేవుడూ నమ్మేవాళ్లను పట్టించుకోడు. హీనపక్షం టీవీ ఛానళ్ళ కూడా వారికి కూడా వీరి అయిపూ ఆజా పట్టదు. ఎందుకంటె వారి రేటింగులకు కావాల్సినట్టు దేవుడు గురించి ఎద్దేవాగా మాట్లాడడం, దేవుడికోసం పోట్లాడడం వీరికి, వారికి బొత్తిగా తెలియదు కాబట్టి.
దేవుడున్నాడో లేదో తెలియదు కానీ దేవుడున్నాడా లేడా అన్న ప్రశ్న మాత్రం అనాదినుంచి వుంటున్నదే. ఆస్తికులు, నాస్తికుల మధ్య దేవుడిని గురించిన చర్చ కూడా అనాదినుంచి సాగుతున్నదే. ఈ ఎడతెగని చర్చకు దేవుడి మాదిరిగానే అంతం అంటూ లేదు.
తొక్కితే రాయి మొక్కితే సాయి. అంతా నమ్మకం.
దేవుడ్ని నమ్మడం ఎంత నమ్మకమో నమ్మకపోవడం కూడా అంతే నమ్మకమని నా నమ్మకం.

దేవుడు పేరు చెప్పి మోసం చేయడం ఎంత ద్రోహమో దేవుడు లేడంటూ పనికిమాలిన చర్చలు లేవదీయడం కూడా అంతే దారుణం. ఎందుకంటె దేవుడనే వాడు నా దృష్టిలో వ్యక్తిగతం. నాకంటే గొప్పవాడు, శక్తిమంతుడు మరొకడు వున్నాడని ఒప్పుకోవడానికి నామోషీ పడనక్కరలేదు. ఇతరులలోని గొప్పదనం గుర్తించేవారు వారు నాస్తికులయినా సరే భగవంతుడనే సర్వ శక్తిమంతుడు మరొకడు వుండేవుంటాడని అనుకుంటే పేచీ లేదు. అలాగే దేవుళ్ళని నమ్మేవాళ్ళు కూడా. భగవంతుడు వున్నాడని పూర్తిగా విశ్వసించే గజేంద్రుడే మొసలినోట చిక్కి విలవిలలాడుతున్నప్పుడు కలడు కలండనెడివాడు కలడో లేడో?’ అని అనుమానపడతాడు. పరీక్ష పెట్టికానీ మార్కులు వేసే అలవాటులేని ఆ దేవదేవుడు పందొమ్మిదో రీలు తరువాత కానీ ఏనుగు రక్షణకు రాడు.
దేవుడ్ని నమ్మని గోరాగారు దేవుడు లేదుఅనేవాడు. లేదుఏమిటండి లేడుఅనాలిగా అంటే అసలు ‘లేని’ వాడు పుంలింగం అయితే ఏమిటి స్త్రీ లింగం అయితే ఏమిటని ఎదురు ప్రశ్న వేసేవారు. ఆయన వ్యక్తిత్వశోభ ముందు అలా చెల్లిపోయింది. కాకపోతే ఇప్పుడు బెజవాడ నాస్తిక కేంద్రం వారికి గోరానే దేవుడు. ఆ మాటకొస్తే దేవుళ్ళందరూ ఇలా అవతరించిన వాళ్ళేనేమో. వాళ్ల వాళ్ల కాలంలో తమ గుణగణాలచేత విఖ్యాతులయిన వాళ్లు తదనంతర కాలంలో దేవుళ్ళుగా కొలవబడ్డారేమో.
దేవుళ్ళను చూస్తే జాలి వేస్తుంది. వాళ్లు చెప్పిన మాట వాళ్ల భక్తులు కూడా వినరు. బుద్దుడు విగ్రహారాధన వద్దంటే శిష్యులు మాట వింటేనా. బహుశా అంతంత పెద్ద విగ్రహాలు ప్రపంచంలో మరే దేవుడుకి లేవేమో. (బుద్దుడు దేవుడా అంటే అది మరో చర్చ)
నేను సర్వవ్యాపితుడిని. ఎందెందు వెదకి చూసిన అందందే వుంటానని ఎంత మొత్తుకున్నా వినేదెవరు?
చెట్టులో,పుట్టలో అంతటా నేనేఅన్నా విన్నదెవరు? చిన్నదో పెద్దదో ఓ గుడికట్టి అక్కడే కట్టిపడేశారు.
మా చిన్నప్పుడు వంటింట్లో గోడమీద ఎర్రగా ఓ చదరంలో వేంకటేశ్వర స్వామి నామాలు వుండేవి. అదే అందరికీ పూజాగృహం. స్నానం చేసిన తరువాత అక్కడ నిలబడి ఓ దణ్ణం పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడో! పూజ రూమ్ వుందా?’ అన్నది ఫ్లాట్ కొనేముందు అడిగే మొదటి ప్రశ్న.

పూర్వం పిల్లలకు తల వెంట్రుకలు తీయించడానికి ఏడాదికో, రెండేళ్లకో తిరుపతి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పరీక్షలకు ముందు, తరువాత, రిజల్ట్స్ రాకముందు వచ్చిన తరువాత - అన్ని కుటుంబాల వాళ్లు పోలో మంటూ తిరుపతి యాత్రలే. మరి రద్దీ పెరిగిందంటే పెరగదా!
దేవుడ్ని నమ్మేవాళ్ళు ఆ నమ్మకాన్ని తమవరకే పరిమితం చేసుకోవాలి.
నమ్మని వాళ్లు అదేదో అంతర్జాతీయ సమస్య  అన్నట్టు అదేపనిగా దేవుళ్ల మీద ఒంటికాలు మీద లేవడం కూడా మంచిదికాదు. బాధాసర్పద్రష్టులను ఉద్దరించడానికి ఇంకా సవాలక్ష మార్గాలున్నాయి. దేవుడ్ని నమ్మేవారిని వారి మానానికి వొదిలేసి తమపని తాము చూసుకుంటే సగం వాతావరణ (శబ్ద) కాలుష్యం తగ్గిపోతుంది.

సమాజం ఇప్పుడు ఎదుర్కుంటున్న సమస్యలు ఎన్నో వున్నాయి. వాటి ముందు దేవుడు ఒక సమస్యే కాదు. నిజానికి మనమే ఆయనకు సమస్య.

బొద్దింక నేర్పిన బ్రహ్మ రహస్యం



ఆనంద రావుకు చికాగ్గా వుంది.

తెల్లారకముందే ఇంట్లో తండ్రి పెట్టిన చివాట్లు ఓ పక్కన, ఆఫీసులో బాసు విసిరిన వ్యంగాస్త్రాలు మరో పక్కన గుర్తుకొచ్చి మనసును ముల్లుతో గుచ్చుతున్నాయి. ఆ గందరగోళంలో ఏం చెయ్యాలో తోచక కాఫీ తాగుదామని హోటల్లోకి అడుగుపెట్టాడు.

వేళ కాని వేళేమో ఖాళీగావుంది. ఓ మూల బల్ల దగ్గర కూర్చుని కాఫీ ఆర్డర్ చేసాడు. ఇంతలో ఎక్కడినుంచో వూడిపడ్డట్టు అయిదారుగురు అమ్మాయిలు పక్క టేబుల్ వద్దకు చేరారు.

అసలే ఆడపిల్లలు. ఉద్యోగాలు చేస్తూ సొంతంగా సంపాదించు కుంటున్న వాళ్లు. లోకం పోకడ తెలిసిన వాళ్లు. ఇక కబుర్లకేం తక్కువ. ఎక్కడలేని విషయాలు వాళ్ల నోళ్ల నుంచి గలగలా తన్నుకువస్తున్నాయి.

ఏమయిందో యేమో వారిలో ఒకమ్మాయి దిగ్గున లేచి కెవ్వున కేక పెట్టింది. ఆనందరావు కూడా అటు చూశాడు.

చూడరానిదేదో చూసినట్టు ఆమె మొహంలో భయం తాండవిస్తోంది. తాకరానిదేదో తాకినట్టు ఆమె వొళ్ళు కంపిస్తోంది. సాయం చేయండంటూ స్నేహితురాళ్ల ని కంటి చూపుతోనే బేలగా అర్ధిస్తోంది.



తీరా చూస్తే ఆమె చున్నీ మీద ఓ బొద్దింక విలాసంగా వాలి తమాషా చూస్తోంది.

బొద్దింక ను చూడగానే వాళ్ళందరికీ మతులు పోయాయి. అది లేచి వచ్చి తమ మీద ఎక్కడ దాడి చేస్తుందేమో అన్నట్టుగా వాళ్ళంతా హడలి పోతున్నారు.

వాళ్లు అనుకున్నంతా అయింది. బొద్దింక మొదటి అమ్మాయిని వొదిలేసి మరో అమ్మడి భుజం మీద వాలింది. అంతే! ఇక ఏడుపులు మొత్తుకోళ్ళు ఆ రెండో అమ్మాయి వంతయ్యాయి.

ఇదంతా చూసి ఓ వెయిటర్ ముందుకు వచ్చాడు. రిలే జంపింగ్ లో భాగంగా బొద్దింక అమాంతం యెగిరి అతడి చొక్కాపై వాలింది.

కానీ, అతడు కంగారు పడలేదు. ఇతరులను కంగారు పెట్టలేదు. కదలకుండా నిలబడి దానివైపు కాసేపు కళ్ళార్పకుండా చూశాడు. తనని తాను కుదుట పరచుకున్నాడు. సుతారంగా చేయి చాపి బొద్దింకను వేళ్ళతో పట్టి విలాసంగా బయటకు విసిరేసాడు.

కాఫీ చప్పరిస్తూ ఇదంతా గమనిస్తున్న ఆనంద రావులో కొత్త ఆలోచనలు సుళ్ళు తిరిగాయి. ఆ ఆడపిల్లలు అలా భయం భయంగా ప్రవర్తించడానికి కారణం ఆ బొద్దింక అయివుంటుందా ?

పోనీ అలానే అనుకున్న పక్షంలో అదే బొద్దింక ను చూసి వెయిటర్ ఎందుకు కంగారు పడలేదు? కంగారు పడకపోగా ఎలాటి గందరగోళానికి తావివ్వకుండా , ఎటువంటి నాటకీయతకు అవకాశం ఇవ్వకుండా ఆ బొద్దింక ను ఎలా వొదుల్చుకోగలిగాడు?

వేర్వేరు వ్యక్తులు ఒకేరకమయిన పరిస్థితుల్లో విభిన్నంగా ప్రవర్తించడానికి కారణం ఏమయి వుంటుంది?’

అంటే ఏమిటన్న మాట.

అమ్మాయిలు అలా గాభరా పడడానికి కారణం బొద్దింక కానే కాదు. అనుకోకుండా ఎదురయిన పరిస్తితిని ఎదుర్కోవడానికి వాళ్ల శక్తి యుక్తులు, సామర్ధ్యం సమయానికి అక్కరకు రాలేదని అనుకోవాలి.

ఆనందరావు ఆలోచనలు మరింత వెనక్కు సాగాయి.

నాన్న తనపై కేకలు వేసినప్పుడు, బాసు ఆఫీసులో అకారణంగా ఇంతెత్తున యెగిరి పడ్డప్పుడు తన మనసు బాధ పడింది. నిజానికి ఇంత గందరగోళపడడానికి వాళ్ల ప్రవర్తన ఎంత మాత్రం కారణం కాదన్నమాట. ఆ సమయంలో ఆ పరిస్తితిని తట్టుకోవడంలో తన మానసిక సామర్ధ్యం కొరవడడమే కారణం అన్నమాట.

మనసు కలత పడడానికి, బాధ పడడానికి మనసు కారణం కాదు. తగిన మానసిక ధైర్యంతో పరిస్తితులను వాటికి తగ్గట్టుగా ఎదుర్కోలేకపోవడమే మానసిక వొడిదుడుకులకు కారణం.

రోడ్డుమీద వెడుతుంటా ము. ట్రాఫిక్ జాం లో చిక్కుకోగానే మనసు గందరగోళంలో పడుతుంది. దీనికి కారణం ట్రాఫిక్ జాం అని విసుక్కుంటాము. అంతేకాని ట్రాఫిక్ జాం చూడగానే మనసులో ఏర్పడ్డ గందర గోళాన్ని ఎదుర్కోవడంలో మన వైఫల్యం అని అనుకోము.

సమస్య కంటే కూడా ఆ సమస్యవల్ల కలిగే మానసిక వొత్తిడే మనుషుల్ని ఎక్కువ బాధ పెడుతోంది.

అందుకే, బొద్దింక ను చూడగానే అమ్మాయిలు గాభరా పడ్డారు. వెయిటర్ మాత్రం కుదురుగా ఆ పరిస్తితిని ఎదుర్కున్నాడు.

జీవితంలో ఎదురయ్యే సంఘటనలను చూసి గందరగోళానికి గురికాకూడదు. వాటిని ఎదుర్కోవడం పైనే దృష్టి పెట్టగలగాలి.

క్రియ ప్రతిక్రియ అతి సహజంగా అప్పటికప్పుడు జరిగేవి.

స్పందన ప్రతిస్పందన బుద్ధి సూక్ష్మత వల్ల కలిగేవి.

సమస్య పట్ల రియాక్ట్ కావడం కాదు దాని విషయంలో సరిగా రెస్పాండ్ కావలి. అప్పుడే పరిష్కారం లభిస్తుంది.

బోధి వృక్షం అవసరం లేకుండానే ఆనందరావుకు జ్ఞానోదయం అయింది.


దేవుడా జాగ్రత్త!



హే భగవాన్!


మమ్మల్ని క్షమించు.నీ ముందు మోకరిల్లి మేము రోజూ చేసే ప్రార్ధనలకు, అనుదినం మేము చేస్తున్న పనులకు ఏమాత్రం పొంతనలేదు.
ప్రతి రోజు ప్రార్ధన సమయంలో దేవుడి మాటలంటూనువ్వు చెప్పే వాటన్నిటినీ బుద్ధిగా వల్లె వేస్తాం.
అడుగు జరగగానే వాటిని నీ గుడి వాకిటి లోనే  మరచిపోతాం.
ఆడపిల్లల్ని గురించి పెద్ద పెద్ద కబుర్లు చెబుతాం. కానీ, ఆడపిల్లల్ని వారి  తల్లి గర్భంలో  
వుండగానే మట్టుబెట్టే ప్రయత్నం చేస్తాం. 
అధికారం అందితే చాలు, ఇక దాన్ని అవధులు లేకుండా  దుర్వినియోగం చేస్తాం. దానికి రాజకీయం అని ముద్దు పేరు పెట్టుకుంటాం.
పరాయి సొమ్ము పాముతో సమానమని సుద్దులు చెబుతాం. కానీ పరుల సొమ్ముకు ఇట్టే  ఆశపడతాం.  ధనం సంపాదించడం ముఖ్యం కాని దాన్ని యెలా సంపాదించావన్నది ముఖ్యం కాదని సిద్ధాంతాలు లేవదీస్తాం. 
సభ్యసమాజంలో సభ్యతగా మెలగాలని అందరికీ సూక్తులు బోధిస్తాం. వీలు చిక్కిందంటే చాలు నీలి చిత్రాలు చూడాలని మనసు పడతాం. రాతల్లో, రచనల్లో నీతులు కుమ్మరిస్తాం. సమయం దొరికిందంటే చాలు, కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లి మాదిరిగా ఆ నీతుల చుట్టూ గీతలు గీసిఅసలు రూపాలతో పాపాలు చేస్తుంటాం. అసభ్యచిత్రాలతో,అడ్డమయిన  రాతలతో సమాజాన్ని కలుషితం చేస్తాం. ఈ ఘనకార్యానికి భావప్రకటనా స్వేచ్ఛ అని ఘనమయిన పేరు పెట్టుకుంటాం.
తాతల తండ్రులనుంచి వారసత్వంగా మా చేతికందిన విలువలను కాలరాచేస్తాం. పాతతరం భావాలు పాతరవేసి కొత్తతరాన్ని ఆవిష్కరిస్తున్నామని ఆర్భాటాలు పోతూ,  
మానసిక పరిణతికి ఈ మార్పును కొలమానంగా పేర్కొంటాం.
అందుకే  ఓ భగవాన్.
ఓ విషయం తెలుసుకో. మాకు నిన్ను మెప్పించడం తెలుసు. వరాలు కోరుకోవడం తెలుసు. వాటిని  నీ నుంచి పొందడం తెలుసు. ఈఠక్కుఠమార విద్యలన్నింటిలో మేము పెద్ద పెద్ద పట్టాలే పుచ్చుకున్నాం. కానీ నీకిచ్చే మాటలను నిలుపుకోవడం మాత్రం తెలియదు. తెలియదని కాదు, తెలియనట్టు వుంటాం. అది తెలుసుకో ముందు.
చేసేవన్నీ చేసేసి అవన్నీ నీమీదకు తోసేసే తెలివితేటలు మాకు నువ్వే ఇచ్చావన్న సంగతి మాత్రం మరచిపోకు.
జాగ్రత్త! మమ్మల్నో కంటమాత్రం  కనిపెట్టిచూస్తుండు.
మా మనుషుల తరహా చూస్తుంటే వాళ్ళల్లో ఒకడినయిన నాకే భయం వేస్తోంది. అందుకే సమయం చూసి నీకీ విషయాలు చెవిలో వేస్తున్నాను.
మా మాదిరిగానే నువ్వుకూడా నీ సృష్టినీ, నీ సంతానాన్ని  గాలికి  వొదిలేస్తే, మమ్మల్ని కనిపెట్టిచూడడానికి నువ్వున్నట్టు నీకెవ్వరూ లేరు. అది గుర్తుంచుకో. అప్పుడు – ‘ధర్మ సంస్థాప నార్ధాయ సంభవామి యుగే యుగే అంటూ  మరో అవతారం ఎత్తినా  ఎలాటి ఫలితం వుండదు.
మేం నువ్వు పుట్టించిన మానవులమే. కానీ నీ చేతికి చిక్కే సామాన్యులం కాదు. అందుకే -

తస్మాత్ జాగ్రత్త!

ఐడియాల వొడియాలు


(బిస్కెట్లు పెట్టుకునే కాఫీ మగ్గు)



(ఇద్దరికీ పనికొచ్చే ఒకే గొడుగు)


(పొట్ట పెరుగుతోందా? వాడండి ఈ బెల్ట్ )


(అసలు సిసలు 'స్ప్రింగ్ కాట్ )


(అరలున్న చెక్క మెట్లు)


For Details:






అది అమెరికా ! ఇది ఇండియా!

అక్కడలా! ఇక్కడిలా! 


(అక్కడ)


(ఇక్కడ)

అక్కడేమో సాక్షాత్తు దేశాధ్యక్షుడు  ఒబామా గారు వోటు వేయడానికి పోలింగు కేంద్రానికి వెడితే అక్కడి సిబ్బంది చిరునవ్వుతో స్వాగతం చెప్పారు కానీ ఒక్కరూ లేచి నిలబడలేదు. ఇక్కడేమో జనం ఇలా సాష్టాంగదండప్రమాణాలు చేస్తున్నారు.

19, డిసెంబర్ 2013, గురువారం

దేవుడి తెలివితేటలు



అవి అన్నీ ఇన్నీ కాదు. అందుకే కొద్దికొద్దిగా చెప్పుకుందాం.
(దేవుడ్ని నమ్మని వాళ్లకు ఓ వినతి. భగవంతుడు మన సమస్యలను పరిష్కరిస్తే ఆయన  సమర్ధత పట్ల మనకు నమ్మకం వుంటుంది. దేవుడు మన సమస్యలను తీర్చలేకపోతే ఆయనకు మన సామర్ధ్యం పట్ల విశ్వాసం వున్నది అనుకోవాలి. సృష్టి నిర్మాణంలో దేవుడు చేసిన చమక్కులు గమనిస్తే ఆయన గొప్పతనం ఏమిటో బోధపడుతుంది. అందుకే ఈ ప్రయత్నం)

మనకు ఈనాడు కనపడే జంతువుల్లో ఏనుగుది భారీ కాయం. అందుకే ఏనుగు నాలుగు కాళ్ళు వొకే పద్దతిలో ముందుకే వొంగివుండే ఏర్పాటు చేసాడు. అంతటి వొళ్ళు వున్న జంతువు మామూలుగా ఇతర జంతువుల మాదిరిగా లేచి నిలబడడం కష్టం. అందుకే సృష్టికర్త ఏనుగుకు ఈ వెసులుబాటు కలిపించాడు. అదే గుర్రం విషయం తీసుకోండి. అది  ముందు కాళ్ళు ముందు పైకి లేపి తరువాత నిలబడుతుంది.  ఆవులు, గేదెలు మాత్రం  వెనుక కాళ్ళు ముందు పైకి లేపి తరువాత  నిలబడతాయి. ఇది చిన్న విషయంలా కనబడవచ్చు. కానీ ఈ అమరికలో ఎన్నో  శాస్త్రీయ పద్దతులు దాగివున్నాయి.



కలువలూ, తామరలూ రెండూ పూలే. కానీ తామర సూర్యోదయ సమయంలో వికసిస్తే కలువ పూవు చంద్రోదయ సమయంలో రెక్కలు విప్పుతుంది. అలాగే ప్రపంచంలో అనేక రకాల పుష్పజాతులు ఒక్కోసమయంలో వికసించే విధానాన్ని గమనించినప్పుడు సృష్టి కార్యం లోని గొప్పతనం అవగతమవుతుంది. లినాయాస్ అనే ప్రఖ్యాత వృక్ష శాస్త్రవేత్త – ‘రక రకాల పూల మొక్కలను ఒకేచోట పెంచగలిగిన వీలున్న పక్షంలో అవి వికసించే సమయాన్నిబట్టి గడియారం అవసరం లేకుండా కాలనిర్ణయం చేయొచ్చున’ని అంటాడు. ఈ వొక్క ముక్క చాలు సృష్టిలో దాగున్న రహస్యాలను అర్ధం చేసుకోవడానికి.
(ఒక ఇంగ్లీష్ గల్పిక ఆధారంగా)

NOTE: Courtesy Image Owner

18, డిసెంబర్ 2013, బుధవారం

మూడంటే మూడే ప్రశ్నలు


యక్ష ప్రశ్నలు కాదు కాబట్టి  ప్రయత్నించి చూడండి.
సమాధానం మాత్రం వెంటనే చెప్పాలి సుమా. ఆలోచిస్తూ పోతే కుదరదు.
ఇదిగో! ఇదే  మొదటి ప్రశ్న.


మీరో  పరుగు పందెంలో పాల్గొంటున్నారు..
రెండో స్తానంలో వున్న ప్రత్యర్ధిని మీరు దాటిపోయారు.
అప్పుడు పందెంలో  మీరే స్తానంలో వున్నట్టు ?
  
అవును! అదే  అనుకున్నాను.
మొదటి స్తానం చేరుకున్నట్టు జవాబు చెబుతారని.
అయితే ఆ జవాబు పూర్తిగా తప్పు.
పందెంలో రెండో స్తానంలో వున్న వ్యక్తిని దాటిపోయారంటే అతడి స్తానంలో మీరు చేరినట్టు. అంటే ఈ ప్రశ్నకు సరయిన సమాధానం రెండో స్తానం అన్నమాట.

ఇప్పుడిక రెండో ప్రశ్న
ఈ పరుగు పందెంలో మీరు చిట్టచివరవున్న ప్రత్యర్ధిని దాటారనుకుందాం.
అప్పుడు  మీరు ఏ స్తానంలో వున్నట్టు ?
దీనికి మీ సమాధానం పందెంలో చివరివాడికంటే ముందున్నట్టు. అవునా!
అయితే మాత్రం మళ్ళీ పప్పులో కాలేసినట్టే.    
ఎందుకని మీరు అడగక్కరలేదు. నేను చెప్పక్కరలేదు.
వరుసలో ‘చిట్ట చివరివాడి’ని  దాటిపోవడం అన్నది ఎవరికయినా  అసాధ్యం కాబట్టి. 

 
 
పోతే ముచ్చటగా మూడో ప్రశ్న.
కాకపొతే, చాలా చిక్కు ప్రశ్న – నోటితోనే టక్కున జవాబు చెప్పాలి. పెన్నూ కాగితం తీసుకుని లెక్కలు వేసుకుంటూ కూచుంటామంటే  కుదరదు.
ముందు వెయ్యి అంకె తీసుకోండి. దానికి  నలభయ్ కలపండి. మళ్ళీ మరో వెయ్యి కలపండి. ముప్పై, ఇంకో వెయ్యి, ఇరవై,  మరో వెయ్యి,  పదీ ఇలా  కలుపుతూ పోండి. ఇప్పుడు చెప్పండి.  అన్నీ కూడితే ఎంత వచ్చింది?
అయిదువేలా !  కాదు.
ఈ ప్రశ్నకు సరయిన సమాధానం 4100 సుమా! నమ్మకపోతే కాలిక్యులేటర్ తీసుకుని లెక్కవేయండి.    


అయ్యో ఇవ్వాళ ఒక్క ప్రశ్నకు  సరయిన జవాబు తట్టలేదని బాధపడకండి.
బోనసుగా ఇంకో ప్రశ్న.
అదే ఇది.
సీగాన పెసూనాంబ (శ్రీ జ్ఞాన ప్రసూనాంబకు ముళ్ళపూడి బుడుగు పెట్టిన ముద్దుపేరు)  తండ్రికి అయిదుగురు ఆడపిల్లలు.
అందులో ఒకరి పేరు సుబ్బలక్ష్మి
మరో అమ్మాయి వెంకట లక్ష్మి
ఇంకో అమ్మాయి మహాలక్ష్మి
నాలుగో అమ్మాయి పేరు విజయలక్ష్మి
ఐదో అమ్మాయి పేరేమిటి? ఆదిలక్ష్మి అనుకుంటున్నారా?

కాదు. మన సీగాన పెసూనాంబే!  
Note: Courtesy Image Owner 

ఎంతో చిన్నది జీవితం!


స్నేహం అనేది నీటి మీద రాత కాదు రాతి మీద గీత.
ఇద్దరు మిత్రులు అడవి మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. మధ్యలో ఓ నది దాటుతుండగా  వారి నడుమ ఏదో  విషయంలో వాదప్రతివాదాలు మొదలయ్యాయి.
మాటామాటా పెరిగింది. వాటిలో తీవ్రత పెరిగింది. అందులో ఒకడు కోపం పట్టలేక రెండో వాడిని చాచి లెంపకాయ కొట్టాడు.
దెబ్బతిన్నవాడు ఖిన్నుడయ్యాడు. కానీ స్నేహితుడుపై తిరిగి చేయిచేసుకోలేదు.    

మౌనంగా తల దించుకుని చేతి వేళ్ళతో నీటిమీద ఓ వాక్యం రాసాడు.
ఈ రోజు నాకు చాలా దుర్దినం.  మంచి స్నేహితుడు అనుకుంటున్న వ్యక్తి నా చెంప పగలగొట్టాడు
వేళ్ళ కదలికనుబట్టి  దెబ్బకొట్టినవాడికి స్నేహితుడు రాసినదేమిటో అర్ధం అయింది.  కానీ ఏమీ మాట్లాడలేదు. ప్రయాణం సాగుతోంది. కానీ వారి నడుమ మాటలే నిలచిపోయాయి. 
నీటిలో నడుస్తుండగానే ఉన్నట్టుండి  ఓ అల విసురుగా వచ్చింది. దాని తాకిడికి దెబ్బతిన్న వ్యక్తి ప్రవాహంలో కొట్టుకుపోసాగాడు. రెండోవాడు ప్రమాదాన్ని పసికట్టి ఈదుకుంటూ వెళ్లి మునిగిపోతున్న స్నేహితుడ్ని కాపాడి వొడ్డుకు చేర్చాడు.
ప్రాణం కాపాడిన వాడికి  కృతజ్ఞతలు యెలా చెప్పాలో త్రుటిలో ప్రాణాలు దక్కించుకున్నవాడికి తెలియలేదు. తీరం చేరగానే  కనిపించిన ఓ రాతిపై తన మనసులోని భావాన్ని చెక్కాడు.


ఈ రోజు నా జీవితంలో మరవలేని  రోజు.  నా స్నేహితుడు తన ప్రాణాన్ని సయితం లెక్క చేయకుండా నా ప్రాణాన్ని కాపాడాడు. ఈ రోజునూ, అతడు నాకు చేసిన సాయాన్నీ ఎన్నటికీ  మరువలేను.
అది చదివి ఆశ్చర్యపోవడం రెండోవాడి వంతయింది.
ఇదేమిటి? దెబ్బ కొట్టినప్పుడు నీటి  మీద గెలికాడు. ఇప్పుడేమో రాతి మీద చెక్కాడు.
మనసులో మెదిలిన సందేహాన్ని మనసులోనే దాచుకోకుండా స్నేహితుడి ముందు బయట పెట్టాడు.
చెప్పు మిత్రమా! నాతో దెబ్బతిన్నప్పుడేమో నీటిమీద రాశావు. ఇప్పడేమో రాతిమీద  గీశావు. ఏమిటి ఇందులోని మర్మం.
రెండోవాడు ఇలా జవాబు ఇచ్చాడు.
ఎవరయినా  మనల్ని బాధ పెట్టినప్పుడు దాన్ని గుర్తు పెట్టుకోకూడదు. నీటి  మీద రాసిన రాత ఎంతమాత్రం నిలవదు. మరచిపోవాల్సిన విషయం కనుక అలా రాసాను. పోతే నీవు చేసిన సాయం అంటావా. ఒకరోజుతో మరచిపోయేది కాదు.  జీవితాంతం జ్ఞాపకం పెట్టుకోవాలి. రాతి మీద గీతలా కలకాలం గుర్తుండిపోవాలి. అందుకే అలా రాశాను
  
Note: Courtesy Image Owner

వయసు నవ్వింది


రామారావును నేను చిన్నప్పటినుంచీ ఎరుగుదును.
చిన్నతనంలో బొద్దుగా ముద్దుగా వుండేవాడు. వున్న వూళ్ళో స్కూలు లేక పట్నంలో  బావ గారింటికి చేరాల్సివచ్చింది. వేసవి సెలవులివ్వగానే సొంతూరు మీద గాలిమళ్ళేది. అంతే.  బస్సెక్కి తుర్రున  వాళ్ల వూరు బయలుదేరేవాడు. ఆ రోజుల్లో బస్సు టిక్కెట్టు- అందులో అరటిక్కెట్టాయె -  నాలుగణాలు పోను అక్కయ్య ఇచ్చిన రూపాయిలో ఇంకా ముప్పావలా జేబులో మిగిలేది. మరో అణా పెట్టి కట్టె మిఠాయి, ఇంకో అణా పెట్టి జీళ్ళు  కొనుక్కుని కాలవగట్టెక్కేవాడు. ఇక అక్కడినుంచి ఒకటే పాటలు, పద్యాలు.  టైం తెలిసేది కాదు. మాయాబజారులో వివాహభోజనంబు  పాట పదమూడోసారి ఎత్తుకునేలోపల వూరొచ్చేసేది. మూడు మైళ్ళు మూడంగల్లో దాటి  వచ్చిన ఫీలింగు. ఆహా అనుకునేవాడు. తన గొప్పే అనుకునేవాడు. చూసి నవ్వుకునేవాడిని.
పల్లెటూళ్ళో రాజభోగం. వేడి వేడి అన్నం. వెన్న కాచిన నెయ్యి. అరచేతి మందాన మీగడ. ముద్దపప్పు. వూటలూరే కొత్తావకాయ. ఓహో ఏమి రుచి. రాళ్ళు తిని హరాయించుకునే ఆరోగ్యం తనదని మురిసి ముక్కచెక్కలయ్యేవాడు. రామారావుని చూసి జాలితో నవ్వుకునేవాడిని.  
రామారావు పెరిగాడు. ఎదిగాడు. సన్నగీత  గీసినట్టు మీసకట్టు. నిగనిగలాడే జుట్టు. ఎగదువ్విన క్రాఫు. ఎవరో అచ్చు  నాగేశ్వర్రావులావుంటావన్నారు. నిజమే కాబోలనుకున్నాడు.  నవ్వుకోవడం నా వంతయింది.
రామారావుకు పెళ్లయింది. పిల్లలు పుట్టారు. అయినా చిన్న కుర్రాడిలానే వున్నాడు.  తోటివారిలా బొజ్జ రాలేదు. బరువు పెరగలేదు. జుట్టు నెరవలేదు. బట్ట తల రాలేదు.  కంటి చూపు తగ్గలేదు. ముప్పయ్యేళ్ళ క్రితం ఎలావున్నాయో ముప్పయి రెండు పళ్ళు అలాగే గట్టిగా పటిష్టంగా వున్నాయి. ‘నాది పెగ్గుల లెక్క కాదు జగ్గుల లెక్క’ అంటూ మూడు సీసాలు ఆరు సోడాల మాదిరిగా సాయంకాలక్షేపాలు చేసేవాడు. ‘చూశారా నా స్పెషాలిటీ’ అన్నట్టు రొమ్ము విరుచుకు తిరిగే వాడు. రామారావుని  చూస్తుంటే నాకిక నవ్వు రావడం లేదు. జాలి కలుగుతోంది.


చూస్తుండగానే రామారావుకు ఏళ్ళు మీదపడడం మొదలయింది. కొంచెం కొంచెంగా వెంట్రుకలు చెప్పాపెట్టకుండా రాలిపోతున్నాయి. వెనుకనుంచి చూసేవారికి జుట్టు మధ్యలో గచ్చకాయ మందంలో ఖాళీ కనబడుతోంది. నెలల తేడాలోనే బెల్ట్ సైజ్ పెరిగింది. ముందు పొట్ట కనబడి తరువాత రామారావు కనబడుతున్నాడు. దళసరి కళ్ళజోడు మొహం మీద చేరింది. మరీ ముదుసలిలా కాకపోయినా ముడుతలు కనబడుతున్నాయి. అతికించినట్టు పెదాలపై   చిరునవ్వు. అయితే అందులో నాకు జీవం కనబడ్డం లేదు.
రామారావుకు క్రమంగా సృష్టి రహస్యం అర్ధం అవుతున్నట్టు అనిపిస్తోంది. శాశ్వితం అనుకుంటున్నవేవీ నిజానికి శాశ్వితం కావు. ఈ నిజం తెలుసుకున్న రామారావుని చూసినప్పుడు నాకు నవ్వు రాలేదు. జాలీ వెయ్యలేదు. గర్వంగా అనిపించింది.
ఎందుకంటె నా పేరు ‘వయస్సు’ కనుక.
(Note: Courtesy Image Owner)