narisetti innaiah లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
narisetti innaiah లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, డిసెంబర్ 2013, శుక్రవారం

ఓరి భగవంతుడా ! – భండారు శ్రీనివాసరావు


(దేవుడ్ని నమ్మని శ్రీ నరిసెట్టి ఇన్నయ్య గారికి, దేవుడ్ని నమ్మే నాలాటి వారికి ఇది అంకితం)
దేవుడు లేడని ఆయన్ని నమ్మనివాళ్ళంటారు.
వున్నాడని నమ్మేవాళ్ళంటారు.
దేవుడు పేరు చెప్పి సొమ్ములు పోగేసుకుంటున్నారని నాస్తికులు ఆరోపిస్తుంటే, దేవుడు లేడని చెబుతూ డబ్బులు దండుకుంటున్నారని వారి ప్రత్యర్ధులు అంటుంటారు. నాకయితే ఇద్దరూ కరక్టే అనిపిస్తుంది.
దేవుడ్ని నమ్మినా నమ్మకపోయినా నమ్మినట్టు నటించడం వల్ల కొన్ని ప్రయోజనాలు వున్నట్టే, దేవుడ్ని నమ్ముతున్నా నమ్మనట్టు బూకరించడం వల్ల కూడా కొన్ని లాభాలు వున్నాయి. ఈ రెండు తరగతులవారు నిత్యం అందరికీ తారసపడుతూనే వుంటారు కాబట్టి వీరు కనబడడం కోసం ప్రత్యేకంగా తపస్సులు చేయనక్కరలేదు. ఏదో ఒక అంశంపై టీవీ తెరలపై అనునిత్యం దర్శనం ఇస్తూనే వుంటారు.
వీరుకాక మరో రెండు తరగతులవారు వున్నారు. దేవుడే సాక్షాత్తు దిగివచ్చినా దేవుడ్ని నమ్మని వారు ఒక బాపతు. కానీ ఆ విషయం పైకి టముకు వేసుకోరు. మనసా వాచా కర్మణా పూర్తిగా నమ్మేవారు రెండో రకం. వీరు కూడా భగవంతుడిని బజారుకు లాగరు. గుండెల్లోనే గుడికట్టుకుని వుంచుకుంటారు. కానీ, నమ్మకం లేని ఆ భగవంతుడూ నమ్మని వీళ్ళను కనుక్కోడు. నమ్మిన ఆ దేవుడూ నమ్మేవాళ్లను పట్టించుకోడు. హీనపక్షం టీవీ ఛానళ్ళ కూడా వారికి కూడా వీరి అయిపూ ఆజా పట్టదు. ఎందుకంటె వారి రేటింగులకు కావాల్సినట్టు దేవుడు గురించి ఎద్దేవాగా మాట్లాడడం, దేవుడికోసం పోట్లాడడం వీరికి, వారికి బొత్తిగా తెలియదు కాబట్టి.
దేవుడున్నాడో లేదో తెలియదు కానీ దేవుడున్నాడా లేడా అన్న ప్రశ్న మాత్రం అనాదినుంచి వుంటున్నదే. ఆస్తికులు, నాస్తికుల మధ్య దేవుడిని గురించిన చర్చ కూడా అనాదినుంచి సాగుతున్నదే. ఈ ఎడతెగని చర్చకు దేవుడి మాదిరిగానే అంతం అంటూ లేదు.
తొక్కితే రాయి మొక్కితే సాయి. అంతా నమ్మకం.
దేవుడ్ని నమ్మడం ఎంత నమ్మకమో నమ్మకపోవడం కూడా అంతే నమ్మకమని నా నమ్మకం.

దేవుడు పేరు చెప్పి మోసం చేయడం ఎంత ద్రోహమో దేవుడు లేడంటూ పనికిమాలిన చర్చలు లేవదీయడం కూడా అంతే దారుణం. ఎందుకంటె దేవుడనే వాడు నా దృష్టిలో వ్యక్తిగతం. నాకంటే గొప్పవాడు, శక్తిమంతుడు మరొకడు వున్నాడని ఒప్పుకోవడానికి నామోషీ పడనక్కరలేదు. ఇతరులలోని గొప్పదనం గుర్తించేవారు వారు నాస్తికులయినా సరే భగవంతుడనే సర్వ శక్తిమంతుడు మరొకడు వుండేవుంటాడని అనుకుంటే పేచీ లేదు. అలాగే దేవుళ్ళని నమ్మేవాళ్ళు కూడా. భగవంతుడు వున్నాడని పూర్తిగా విశ్వసించే గజేంద్రుడే మొసలినోట చిక్కి విలవిలలాడుతున్నప్పుడు కలడు కలండనెడివాడు కలడో లేడో?’ అని అనుమానపడతాడు. పరీక్ష పెట్టికానీ మార్కులు వేసే అలవాటులేని ఆ దేవదేవుడు పందొమ్మిదో రీలు తరువాత కానీ ఏనుగు రక్షణకు రాడు.
దేవుడ్ని నమ్మని గోరాగారు దేవుడు లేదుఅనేవాడు. లేదుఏమిటండి లేడుఅనాలిగా అంటే అసలు ‘లేని’ వాడు పుంలింగం అయితే ఏమిటి స్త్రీ లింగం అయితే ఏమిటని ఎదురు ప్రశ్న వేసేవారు. ఆయన వ్యక్తిత్వశోభ ముందు అలా చెల్లిపోయింది. కాకపోతే ఇప్పుడు బెజవాడ నాస్తిక కేంద్రం వారికి గోరానే దేవుడు. ఆ మాటకొస్తే దేవుళ్ళందరూ ఇలా అవతరించిన వాళ్ళేనేమో. వాళ్ల వాళ్ల కాలంలో తమ గుణగణాలచేత విఖ్యాతులయిన వాళ్లు తదనంతర కాలంలో దేవుళ్ళుగా కొలవబడ్డారేమో.
దేవుళ్ళను చూస్తే జాలి వేస్తుంది. వాళ్లు చెప్పిన మాట వాళ్ల భక్తులు కూడా వినరు. బుద్దుడు విగ్రహారాధన వద్దంటే శిష్యులు మాట వింటేనా. బహుశా అంతంత పెద్ద విగ్రహాలు ప్రపంచంలో మరే దేవుడుకి లేవేమో. (బుద్దుడు దేవుడా అంటే అది మరో చర్చ)
నేను సర్వవ్యాపితుడిని. ఎందెందు వెదకి చూసిన అందందే వుంటానని ఎంత మొత్తుకున్నా వినేదెవరు?
చెట్టులో,పుట్టలో అంతటా నేనేఅన్నా విన్నదెవరు? చిన్నదో పెద్దదో ఓ గుడికట్టి అక్కడే కట్టిపడేశారు.
మా చిన్నప్పుడు వంటింట్లో గోడమీద ఎర్రగా ఓ చదరంలో వేంకటేశ్వర స్వామి నామాలు వుండేవి. అదే అందరికీ పూజాగృహం. స్నానం చేసిన తరువాత అక్కడ నిలబడి ఓ దణ్ణం పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడో! పూజ రూమ్ వుందా?’ అన్నది ఫ్లాట్ కొనేముందు అడిగే మొదటి ప్రశ్న.

పూర్వం పిల్లలకు తల వెంట్రుకలు తీయించడానికి ఏడాదికో, రెండేళ్లకో తిరుపతి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పరీక్షలకు ముందు, తరువాత, రిజల్ట్స్ రాకముందు వచ్చిన తరువాత - అన్ని కుటుంబాల వాళ్లు పోలో మంటూ తిరుపతి యాత్రలే. మరి రద్దీ పెరిగిందంటే పెరగదా!
దేవుడ్ని నమ్మేవాళ్ళు ఆ నమ్మకాన్ని తమవరకే పరిమితం చేసుకోవాలి.
నమ్మని వాళ్లు అదేదో అంతర్జాతీయ సమస్య  అన్నట్టు అదేపనిగా దేవుళ్ల మీద ఒంటికాలు మీద లేవడం కూడా మంచిదికాదు. బాధాసర్పద్రష్టులను ఉద్దరించడానికి ఇంకా సవాలక్ష మార్గాలున్నాయి. దేవుడ్ని నమ్మేవారిని వారి మానానికి వొదిలేసి తమపని తాము చూసుకుంటే సగం వాతావరణ (శబ్ద) కాలుష్యం తగ్గిపోతుంది.

సమాజం ఇప్పుడు ఎదుర్కుంటున్న సమస్యలు ఎన్నో వున్నాయి. వాటి ముందు దేవుడు ఒక సమస్యే కాదు. నిజానికి మనమే ఆయనకు సమస్య.

9, అక్టోబర్ 2012, మంగళవారం

మిసిమి వ్యాసాల ఇన్నయ్య పుస్తకం


మిసిమి వ్యాసాల ఇన్నయ్య పుస్తకం
కొందరు జంతువుల్ని ప్రేమిస్తారు. మరికొందరు మొక్కల్ని ప్రేమిస్తారు. నాకు తెలిసి పుస్తకాల్ని ప్రేమించే వ్యక్తి ఒకరు వున్నారు. పుస్తకాలను అందరూ చదువుతారు. మంచి పుస్తకాలను కొందరే ఎంపిక చేసుకుని చదువుతారు. పుస్తక ప్రేమికుడయిన ఈ వ్యక్తి తను పుస్తకాన్ని ‘కొని’ చదవడమే కాదు పుస్తకాల్ని ప్రేమించే గుణం వున్న మరికొందరికి ఆ పుస్తకాల్ని కొని, పోస్ట్ ఖర్చులు పెట్టుకుని మరీ పంపి చదివిస్తారు. ఏదయినా పుస్తకం బాగా నచ్చితే వందల సంఖ్యలో వాటిని కొని బంధుమిత్రుల ప్రత్యేక వేడుకలకు ‘కానుక’గా పంపుతారు. అరుదయిన ఈ వ్యక్తిత్వం కలిగిన ఈ వ్యక్తి పేరు దేవినేని మధుసూదనరావు. వీరిలో పేర్కొన దాగిన  విశిష్ట లక్షణాలు మరికొన్నివున్నాయి. వాటిని మరో సందర్భంలో ప్రస్తావించుకుంటాను.


వీరిని తలచుకునే సందర్భం ఈ రోజు తటస్థ పడింది. హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో నరిసెట్టి ఇన్నయ్య రాసిన మిసిమి వ్యాసాల సంకలన గ్రంధాన్ని హెచ్.ఎం.టీ.వీ.  సీ.యీ.వో., కే. రామచంద్రమూర్తి ఆవిష్కరించారు. ఒక చక్కటి ఆశయంతో, అంకితభావంతో రెండు దశాబ్దాల క్రితం ‘మిసిమి’ పత్రికను ప్రారంభించినప్పటినుంచి ఇన్నయ్య తనదయిన శైలిలో ఈ వ్యాసాలను రాస్తూ వచ్చారు. ఎన్నుకున్న అంశాల పరిధి అతి విస్తృతం. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన రచయితల రచనలతో పాటు, వారి వ్యక్తిత్వాలను పరిచయంచేసే సరికొత్త ప్రక్రియను నెత్తికెత్తుకోవడం ఒక్క మిసిమి వంటి పత్రికకే సాధ్యం.
ఇన్నయ్య కేవలం  రచయిత మాత్రమే అయితే ఈ రచనల తరహా మరోరకంగా సాగివుండేది. ఆయన గొప్ప  మానవతావాది. పైగా  కరుడుగట్టిన హేతువాది. తను నమ్మిన సిద్ధాంతాలను తాను మొండిగా నమ్మడమే కాదు ఇతరులను కూడా నమ్మించాలని శక్తివంచన లేకుండా శ్రమిస్తుండడం ఆయన వ్యక్తిత్వంలోని మరో కోణం. ఈ స్వభావం ఆయనకు ఒక ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. దానితో పాటు అభిమానులను అదే సంఖ్యలో విమర్శకులను సంపాదించిపెట్టింది.
ఇన్నయ్య దేవుడిని నమ్మరు. నమ్మని వాళ్లు చాలామంది వుంటారు. కానీ ఇన్నయ్య అంతటితో దేవుడిని వదలరు. వెంటబడి మరీ దేవుడి అస్తిత్వాన్ని ప్రశ్నిస్తారు. అది అంత అవసరమా అని అడిగే మిత్రులం కొంతమందిమి ఆ దేవుడి దయవల్ల ఇప్పటివరకూ ఆయనతో స్నేహాన్ని కొనసాగించగలుగుతున్నాము. (‘నీవు దేముడితో మాట్లాడితే ప్రార్ధన అంటారు. దేవుడు నీతో మాట్లాడాడంటే పిచ్చి అంటారు’ అనే థామస్ సాజ్  ధర్మసూక్ష్మాన్ని ఆయన ఈ పుస్తకంలో పేర్కొన్నారు.)
జీవన ప్రమాణాలకు శాస్త్రీయ విజ్ఞానం తోడ్పడాలని ఆయన కోరుకుంటారు. మానవీయ విలువలను మూఢ నమ్మకాలతో అణగదొక్కరాదు అన్నది ఆయన సిద్ధాంతం.
ఇక పుస్తకం విషయానికి వస్తే – ఇది ఆషామాషీగా చదివిపక్కన పడేసే పుస్తకం కాదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధులయిన అనేకమంది రచయితల జీవన రేఖలను ఆయన ఇందులో స్పృశించారు. అలాగే, అనామకులని  అనలేం కాని,సాధారణ  జనాలకు అంతగా పరిచయంలేని రచయితల గురించి, వారి రచనలు గురించీ ఇన్నయ్య రాసిన విమర్శనాత్మక వ్యాసాలూ ఇందులో వున్నాయి.
ప్రపంచ ప్రసిద్ధి పొందిన పదిమంది మేధావులను ఎడ్వర్డ్ షిల్జ్ అనే సోషియాలజిస్ట్ ఎంపికచేసి రాసిన వ్యాసాలను ఆయన మరణానంతరం ప్రచురించారు. రేమండ్ ఆరన్, సిడ్నీ హుక్, రాబర్ట్ మేనార్క్ హచిన్స్, లె పోల్ద్ లబెజ్, హరాల్డ్ లా స్కీ, కార్ల్ మన్ హమ్, ఆర్నాల్దో డాంటెమొమిగ్లయానో, జాన్ యు నెఫ్, లియోజీ లార్డ్ ల వ్యక్తిత్వ విశేషాలను ఇన్నయ్య తేటతెలుగులో తెలియచేసారు. షిల్జ్ మహాశయులవారు ఉదహరించిన ఆ పదిమంది మేధా వులలో మన దేశానికి చెందిన నిరాద్ సి. చౌదరి వుండడం విశేషం.
అందరికీ తెలియని విషయాలు కూడా  కొన్ని ఇందులో వున్నాయి. ఉదాహరణకు సుభాష్ చంద్ర బోస్ బెర్లిన్ లో వున్నప్పుడు ‘సినార్ మజహే’ అనే గుప్తనామంతో చలామణి అయ్యేవారట. ప్రపంచ ప్రఖ్యాత మానవతావాది ఎం ఎన్ రాయ్ అసలు పేరు నరేంద్రనాథ్ భట్టాచార్య అనీ, ఆయన భార్య ఎవిలిన్ ట్రెంట్ ఆయనతో విడిపోవడానికి ముందు - ఇండియాలో ఒక్కమారుకూడా అడుగుపెట్టకుండానే అనేక సంవత్సరాలపాటు భారత స్వాతంత్ర్య విప్లవ పోరాటానికి దోహదం చేశారనీ ఇన్నయ్య రాశారు.
చక్కటి రచనలు అతి చక్కగా అచ్చు వేసిన ఖ్యాతి ప్రచురణకర్తలది. కాకపొతే, అక్కడక్కడా ముద్రారాక్షసాలు పంటికింద రాయిలా పుస్తక పఠనానికి అడ్డుతగులుతున్నాయి. (పేజీ 33 – ఒకయాన –ఒకాయన) ఇలాగే మరికొన్ని. కాకపొతే ఇంతటి బృహత్తర ప్రయత్నం ముందు అవి ఎన్నదగ్గవి కాదు. - భండారు శ్రీనివాసరావు
(09-10-2012)