22, ఏప్రిల్ 2013, సోమవారం

ఫోటో వెనుక జ్ఞాపకం



రష్యాలో కమ్యూనిస్టుల పాలన సాగుతున్న రోజుల్లో రేడియో మాస్కోలో పనిచేయడానికి మాస్కోలో కాలు పెట్టాను. సోవియట్ పౌరులందరికీ గుర్తింపు కార్డులు వుంటాయి. వాటిని విధిగా వెంట వుంచుకోవాలి కూడా.  సరే! మాస్కో రేడియో వాళ్లు కూడా నాకూ,  మా కుటుంబసభ్యులందరికీ ఈ కార్డులు ఇచ్చారు. దీన్ని ప్రొపుస్కా అనేవారనుకుంటాను. ఇదిలేకుండా బయటకు వెడితే ఇంతే సంగతులు.
అక్కడ నిబంధనలు యెంత ఖచ్చితం అంటే, ఎంతటివారయినా ఆఖరికి సాక్షాత్తు రేడియో వ్యవహారాలు చూసే మంత్రి అయినా సరే ఈ గుర్తింపు కార్డు చూపిన తరువాతనే ఆఫీసులు లోపలకు అనుమతించేవారు. పొరబాటున ఇంట్లో మరచిపోయి ఆఫీసుకు పోతే, రోజూ చూస్తున్న మనిషే కదా  అన్న మొహమాటం కూడా  వుండేది కాదు.  అప్పుడు ఇంటికి ఫోను చేస్తే, పిల్లలు అప్పటికే స్కూలుకు పోయేవాళ్ళు కాబట్టి  మా ఆవిడే టాక్సీ వేసుకుని నా కార్డు పట్టుకువచ్చేది.


ఆ కార్డుకోసం ఓ ఫోటో స్టూడియోకు వెడితే ఓ రూబులు కాబోలు తీసుకుని ఇదిగో ఇలా ఓ నాలుగయిదు షీట్ల మీద వరసగా ఫోటోలు ప్రింటు వేసి ఇచ్చాడు.  

21, ఏప్రిల్ 2013, ఆదివారం

తెలుగులో పిల్లలకోసం కొత్త పత్రిక



శృతి ఫౌండేషన్ ప్రచురిస్తున్న ద్వైమాసిక పిల్లల పత్రిక తొలి ప్రతిని తమిళనాడు గవర్నర్ శ్రీ కె.రోశయ్య గారు ఈరోజు హైదరాబాదులో ఆవిష్కరించారు.



ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీ వీకే అగర్వాల్, ఐ.యే.ఎస్., డాక్టర్ ఊట్ల బాలాజీ, సీ.ఈ.ఓ. హెచ్.ఎం.ఆర్.ఐ., శ్రీ ఎర్రబల్లి రామమోహన రావు, శ్రీ జైపాల్ రెడ్డి, డాక్టర్ వేణుగోపాల్ అగర్వాల్, భండారు శ్రీనివాసరావు, శృతి ఫౌండేషన్ సీ.ఈ.ఓ. శ్రీ చలపతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ రోశయ్యగారి చేతులమీదుగా చిన్నారి బాలబాలికలు శృతి సంచిక ప్రతులను స్వీకరించారు. వారితో కలసి అడిగిమరీ ఫోటో తీయించుకున్న ఔన్నత్యం శ్రీ రోశయ్య గారిది.


21-04-2013

20, ఏప్రిల్ 2013, శనివారం

జోకులకి కూడా కాపీ రైట్లు వుంటాయా?




“జోకులకి కూడా కాపీ రైట్లు వుంటాయా మాస్టారూ”
“కాపీ రైట్ అంటేనే  కాపీ కొట్టే రైట్ శిష్యా!”

“ఆరంజి పండుకి యాపిల్  పండుకి వున్న తేడా ఏమిటి?”
“ఆరంజి పండు ఆరంజి రంగులో వుంటుంది. యాపిల్ పండు యాపిల్ రంగులో వుండదు”

యాదగిరి కొత్త మొబైల్ ఫోను కొని తెలిసిన వాళ్ల నెంబర్లకు 
ఎస్.ఎం.ఎస్. లు పంపాడు.
“నా ఫోను నెంబర్ మారింది. మునుపు నాది   నోకియా  3310  అయితే ఇప్పుడది నోకియా 6610  గా మారింది. దయచేసి   ఈ నెంబరు మార్పు నోటు చేసుకోండి.”

“డాక్టర్ గారు  ఫుట్ బాల్ ఆడుతున్నట్టు కలలు వస్తున్నాయి”
“అయితే ఈ రాత్రి నిద్రపోయేముందు ఈ మాత్ర వేసుకోండి. సర్దుకుంటుంది”
“రేపటి నుంచి వేసుకుంటా డాక్టర్. ఇవ్వాళే ఫైనల్ మ్యాచ్”

“నేను చనిపోయాననుకో! నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా”
“లేదు. నా చెల్లెలు  దగ్గరకి వెళ్ళి వుంటాను కాని, మళ్ళీ పెళ్లి చేసుకోను. మరి మీ సంగతేమిటి? నేను పోతే మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా?”
“లేదు లేదు. నేనూ  మీ చెల్లెలితోనే వుంటాను”
 
“రాత్రి ఇంట్లో దొంగలు పడ్డారు. ఒక్క టీవీ తప్ప అన్నీ ఎత్తుకెళ్లారు ఇనస్పెక్టర్”
“అదేమిటి టీవీ ఒక్కదాన్ని యెందుకు పట్టుకుపోలేదు”
“దొంగలు వచ్చినప్పుడు నేను టీవీ చూస్తున్నాను”

“ఎందుకలా అంతా పరిగెడుతున్నారు?”
“పరుగు పందెం. గెలిచిన వాళ్లకు మెడల్  ఇస్తారు?”
“గెలిచినవాళ్లకు  మెడల్  ఇస్తారు సరే!  కానీ మిగిలినవాళ్ళెందుకు పరిగెత్తుతున్నట్టు”

“నేను ఒకడిని హత్య చేసాను. ఈ వాక్యాన్ని భవిష్యత్ కాలంలోకి మార్చి చెప్పు”
“నువ్వు జైలుకు వెడతావ్”

“ వెళ్ళు. వెళ్ళి మొక్కలకు నీళ్ళు పొయ్యి”
“వర్షం పడుతున్నట్టుంది”
“అయితే ఏమిటట! గొడుగు తీసుకెళ్ళు”

“నా మొబైల్ బిల్లు యెంత వచ్చిందో చెబుతారా”
“దానికి నా సాయం అక్కరలేదు. మీ మొబైల్ నుంచి  121 డయల్ చేస్తే  మీ కరెంట్ బిల్లు ఎంతో ఏమిటో  మీకు వెంటనే ఎస్.ఎం. ఎస్’ వస్తుంది”
“ఏడిచినట్టే వుంది. నేను అడుగుతోంది నా మొబైల్ బిల్లు సంగతి. కరెంటు బిల్లు కాదు”

“ఆ అమ్మాయికి పుట్ట చెముడులా వుంది”
“ఏం అలా అంటున్నావు”
“ ఇందాక ఆ అమ్మాయిని కలిసి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పా. అలా చెప్పాక కూడా ‘నా చెప్పులు కొత్తవి తెలుసా’ అంటోంది”

“నిన్ను నా  కోర్టులో మళ్ళీ మళ్ళీ  చూస్తున్నాను. మూడో సారి కూడా ముద్దాయిగా కోర్టుకు  రావడానికి నీకు సిగ్గనిపించడం  లేదా”
“యెందుకు సిగ్గు!  మీరు మాత్రం రోజూ కోర్టుకు రావడం లేదా”
 
“రాముడు, బుద్ధుడు, మహమ్మదు ప్రవక్త,  ఏసు క్రీస్తు, గాంధీ -  వీరిలో నీకు కామన్ గా కనిపించే విషయం ఏమిటి”
“అందరూ ప్రభుత్వ సెలవుదినాల్లోనే  పుట్టారు
“మిస్ నిన్న నా మొబైల్ కేమైనా ఫోను చేసారా?”
“లేదే! ఎందుకలా  అడిగారు”
“ఏమీ లేదు నా ఫోన్ లో ఒక మిస్ కాల్ వుంది.”




(ఇవన్నీ నెట్లో విహారం చేస్తున్న ఇంగ్లీష్ జోకులు. ముందే చెప్పినట్టు తెలుగులోకి కాపీ కొట్టే రైట్ కొట్టేశానన్నమాట. మొట్టమొదటిదొక్కటే అచ్చంగా నా సొంతం. పోతే ఇమేజ్ సొంతదారుకు ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు)

19, ఏప్రిల్ 2013, శుక్రవారం

న్నిఝoగా న్నిజం !


న్నిఝoగా న్నిజం ! - నిన్ననో మొన్ననో టీవీల్లో కూడా బంగారు దుకాణాల్లోనూ, వాటి బయటా బారులుతీరిన జనాలను చూపించారు. జనం దగ్గర అంత డబ్బుందా లేక బంగారం అంటే అంత మోజా!



ఒబామా వర్సెస్ మన్మోహన్

Views can be expressed in many ways. Silence is one among them.


ఉప్పుకప్పురంబు .......



గుండీలు మార్చినంత సులభంగా గుండెలు మార్చడంలో పేరొందిన ఒక సర్జన్ గారు తను నడిపే కారు ట్రబుల్ ఇస్తుండడంతో దాన్ని తీసుకుని మెకానిక్ దగ్గరికి వెళ్లాడు. ఆ సమయంలో మెకానిక్  మరో కారులోని భాగాలను అలవోకగా  విడతీస్తూ, మారుస్తూ బిజీబిజీగా వున్నాడు.  డాక్టర్ రావడం వోరకంట గమనించిన  మెకానిక్ ఆయన దగ్గరకు వచ్చి, చేతికంటిన గ్రీజు తుడుచుకుంటూ పలకరించాడు. ఆయన చెప్పింది విని చిటికెలో డాక్టరు గారి కారు బాగుచేసాడు. స్టార్ట్ చేసి చూపెట్టాడు. అంతతొందరగా పనిపూర్తిచేసినందుకు డాక్టర్ ధన్యవాదాలు తెలిపి డబ్బు తీసి ఇస్తుండగా మెకానిక్ వున్నట్టుండి    
“ఎన్నాళ్ళ నుంచో నాకొక  అనుమానం  డాక్టర్ గారు  అడగమంటారా?” అన్నాడు.
డాక్టర్ కూడా కాస్త తీరిగ్గా వున్నాడో యేమో  “చెప్పు ఏమిటి నీ సందేహం?” అని అడిగాడు.
మెకానిక్ కాసేపు అడగాల్నా వద్దా అన్నట్టు మొహం పెట్టి చివరికి అడిగేసాడు.
‘డాక్టర్ గారు. మీరేమో మనిషి గుండె ఓపెన్ చేసి, భాగాలు మార్చి, మరమ్మతు చేసి  మళ్ళీ రోగిని మామూలు మనిషిని చేస్తారు. నిజానికి మేమూ చేసేదీ  అదే. కారు ఇంజిన్ వూడతీస్తాం. చెడిపోయిన పార్టులు బయటకు తీస్తాం. కొత్త పార్టులు వేస్తాం.  పాత వాల్వులు తీసి కొత్త వాల్వులు వేస్తాం.  మళ్ళీ ఇంజిన్ మామూలుగా పనిచేసేట్టు చేస్తాం. మీరూ మాలాగే గుండె వాల్వులు మార్చి కొత్తవి వేస్తారు. మీకేమో అడిగినంత డబ్బు అడక్కుండానే ఇస్తారు. మా దగ్గరకు వచ్చేసరికి గీసి గీసి బేరం చేస్తారు. మీరూ మేమూ చేసేది ఒకే పని కదా! అటువంటప్పుడు  ఈ తేడా యెందుకు చెప్పండి?”
డాక్టర్ ఒక్క క్షణం నివ్వెరపోయినట్టు కనిపించినా వెంటనే తేరుకున్నాడు.  కారు  బానెట్  మీదికి  వొంగి అతడి చెవిలో గుసగుసలాడాడు.
అది విన్న మెకానిక్ ఒక్కసారి నోరు తెరిచాడు.
ఇంతకీ డాక్టర్ గారు ఆ మెకానిక్ చెవిలో చెప్పింది ఏమిటి?
కాస్త ఆలోచించి చూడండి..................

.........డాక్టర్ ఏంచెప్పాడంటే -
“నువ్వు చెప్పింది బాగానే వుంది. అయితే కారు నడుస్తున్నప్పుడు  ఆ పనేదో చేసి చూడు,  అప్పుడు తెలుస్తుంది తేడా ఏమిటన్నది”

18, ఏప్రిల్ 2013, గురువారం

బీపీకి అసలు సిసలు మందు



నాకు బీపీ వుందని డాక్టర్లు నిర్ధారించి దాదాపు ముప్పయ్యేళ్ళు గడిచాయి. ఈ  మాయదారి రోగం రావడానికి అప్పట్లో నాకు కనబడ్డ కారణాలు రెండే రెండు. ఒకటి ఆటోరిక్షా డ్రైవర్లు కాగా  రెండోకారణం  ట్రాఫిక్ పోలీసులు.
ఆఫీసుకు పోవాలంటే ఆటో శరణ్యం. సందు మొగదల్లో ఆటోలు ఆపుకుని అందులో శేషతల్పశాయి మాదిరిగా డ్రైవర్లు విశ్రాంతి తీసుకుంటూ వుండేవారు. వాళ్ళల్లో వొకడ్ని నిద్రలేపి రేడియో స్టేషన్ కు పోవాలి వస్తావా అని అడిగేవాడిని మర్యాదగా. ‘రాను’ అనే సమాధానం వచ్చేది దురుసుగా.
ఇక సంభాషణ నా చేయిదాటిపోయేది.
‘ఏం ఎగస్ట్రా ఇవ్వాలా?’
‘ఆ మాట వేరే చెప్పాలా’ కాసింత ఎటకారం.
ఎక్కడ కాలాలో అక్కడే కాలేది. ఆ ఆటోని వొదిలేసి మరోటి పట్టుకుంటే మళ్ళీ అదే జవాబు ‘రాను’
మరో ఆటోవాలా సమాధానం మరోరకంగా వుండేది.
‘సికింద్రాబాద్ కయితే సరే’
దానికి నేనూ సరే. ఎందుకంటే ఈ మధ్యలో ఏదో ఒక క్రాస్ రోడ్డు రాకపోదా. ఎవరో ఒక ట్రాఫిక్ పోలీసు కనబడక పోడా! అదీ నా ఆలోచన.
అనుకున్నట్టే పోలీసు తగిలేవాడు. నేను పలానా అని చెప్పగానే అతడు ఆటోవాడికి నాలుగు తగిలించేవాడు. ఓ క్లాసుపీకేవాడు. అంతే. నేను ఎంచక్కా అదే ఆటోలో  ఆఫీసుకుకి చేరిపోయేవాడిని. ఉద్యోగ మహత్యం.
కానీ ఇది ఒక రోజు మాట కాదుకదా. ప్రతి రోజూ ఇదే తంతాయే!
భార్యాపిల్లల్ని తీసుకుని సినిమాకు బయలుదేరిన వాడిని ఆటోవాళ్ళ పుణ్యమా అని  చివరకు ఆటో వాడితో సహా పోలీసు స్టేషన్ కు చేరేవాడిని. అక్కడ దృశ్యం షరా మామూలే.
ఇదంతా చూసి మా వాళ్లు నాతో బయటకు రావడమే మానుకున్నారు.
చివరికి ఇది పని కాదనుకుని బ్యాంకు లోను తీసుకుని స్కూటర్ కొనుక్కుంటే మూడో వాయిదా కూడా కట్టక మునుపే పోలీసులు పట్టుకున్నారు. హెల్మెట్ లేదంటారు.  ఈ గతుకుల రోడ్లమీద హెల్మెట్ ఎందుకని నా ప్రశ్న. చివరికోరోజు పట్టుకుని పోలీసు స్టేషన్ కు పట్టుకెళ్లారు. నానా రభస. జర్నలిస్టులందరూ సంఘీభావం ప్రకటించి  మూకుమ్మడిగా పోలీసు స్టేషన్ కు వచ్చారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. ఆయన అప్పుడు మద్రాసులో వున్నారు. మర్నాడు జర్నలిస్టులు అసెంబ్లీని బహిష్కరించారు. ప్రభుత్వం దిగివచ్చింది. రిటైర్డ్ హై కోర్టు న్యాయ మూర్తితో జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేసింది. నన్ను పట్టుకున్న పోలీసు ఇనస్పెక్టర్ ని వేరే చోటుకి బదిలీ చేశారు. ఇదంతా నాపై తీవ్ర ప్రభావం చూపింది. ఈలోగా మాస్కో ఎసైన్మెంట్ వచ్చింది. దాంతోపాటే బీపీ కూడా వచ్చింది. కాబట్టి ఇన్నేళ్ళ తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా చిన్నతనం అనిపిస్తుంది.
నాతో  పోల్చుకుంటే మా పిల్లలే నయమనిపిస్తారు. ప్రతి విషయంలో నిదానంగా  వ్యవహరిస్తారు. వయస్సులో వున్నప్పుడు నా తరహా వారిలా వుండేది కాదు. అలా వుండివుంటే ఇదిగో ఈ బీపీలు గట్రా వుండేవి కావేమో!
ఏం చేస్తాం.
జ్ఞానోదయం అయింది కాని  బోధి వృక్షమే ఆలశ్యంగా కనబడింది. (18-04-2013)

17, ఏప్రిల్ 2013, బుధవారం

రావూరు భరద్వాజ గారి అసలు పేరు


జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికయిన రావూరు భరద్వాజ (పూర్వాశ్రమంలో రావూరు శరభాచారి) గురించి 
మరో చిన్న జ్ఞాపకం: 
మొగ్గతొడిగిన ఎర్రగులాబి - తెలుగు అనువాదం : రావూరు భరద్వాజ 


ఈ పుస్తకం వెనుక చిన్న కధ చెప్పుకోవడం నాకు తెలుసు. రాజకీయ నాయకుల్లో నెహ్రూ ఒక్కరినే అమితంగా అభిమానించే సుప్రసిద్ధ జర్నలిస్టు కేయే అబ్బాస్, నెహ్రూ అనంతరం ఆయన బిడ్డ ఇందిర ప్రధాని కాగానే 'Return of the RED ROSE' అనే పేరుతొ ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని 'మొగ్గ తొడిగిన ఎర్రగులాబి' పేరుతొ శ్రీ రావూరి భరద్వాజ తెలుగులోకి అనువదించారు. శ్రీమతి గాంధి హైదరాబాదు వచ్చినప్పుడు, అప్పుడు రేడియోలో పనిచేస్తున్న భరద్వాజ గారే స్వయంగా తాను అనువదించిన ఈ పుస్తకాన్ని శ్రీమతి ఇందిరాగాంధీకి బహుకరించారు. ఆవిడ అంతకుముందు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా వున్నప్పుడు రేడియోలో (అప్పటికి దూరదర్శన్ లేదు) పనిచేస్తున్న స్టాఫ్ ఆర్టిస్టుల ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలతో సమానం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రేడియోలో స్టాఫ్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న భరద్వాజ గారు ఆమె చేసిన ఈ మేలుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ పుస్తకాన్ని ఆమెకు అందచేసారు.
మొగ్గతొడిగిన ఎర్రగులాబి - కె.ఎ.అబ్బాస్‌
వెల: 100 రూపాయలు
తెలుగు అనువాదం : రావూరి భరద్వాజ
ప్రచురణ: ఎమెస్కో బుక్స్
(భారతదేశంలోనూ, ప్రపంచంలోనూ క్రమానుగతంగా వచ్చిన విప్లవాత్మకమైన అభివృద్ధి, ఆయా సందర్భాలలో శ్రీమతి ఇందిరాగాంధీని ప్రభావితం చేసిన సంఘటనలు, ఆమెను తీర్చిదిద్ది వ్యక్తిత్వాన్ని రూపొందింపజేసిన సంఘటనలూ తీసుకొని ఆమెను ఇందులో పరిచయం చేయడం జరిగింది- ప్రకాశకులు)

17-04-2013

జ్ఞానపీఠంపై రావూరి భరద్వాజ





రావూరి భరద్వాజ గారు  ఇంత పొడవు గడ్డం  పెంచనప్పుడే కాదు అసలు గడ్డం ఏదీ లేనప్పుడు కూడా నాకు తెలుసు. రేడియోలో పనిచేస్తున్నప్పుడు విలక్షణ వ్యక్తిత్వం కలిగిన ఈ మహా రచయితతో సన్నిహిత పరిచయం వుండేది. నా చిన్నతనంలోనే ఆయన రాసిన 'పాకుడురాళ్ళు' నవల సీరియల్ గా వస్తున్న రోజుల్లోనే నన్నెంతో ఆకర్షించింది. తరువాతి కాలంలో భరద్వాజ గారితో ఆకాశవాణిలో కలసిపనిచేసే మరో అదృష్టం లభించింది. జ్ఞానపీఠం అవార్డ్ ఆయన స్థాయికి చిన్నదని చెప్పను కాని ఆలస్యంగా వచ్చిందని మాత్రం చెప్పగలను. మా గురువుగారికి మనఃపూర్వక అభినందనలు - భండారు శ్రీనివాసరావు (17-04-2013)

Vartha vyakhya _ KCR gives open offer to Congress MPs to join TRS _ 16-0...



నిన్న మంగళవారం ఉదయం హె.ఎం.టీ.వీ. వార్తావ్యాఖ్య కార్యక్రమంలో పాల్గొంటూ....

16, ఏప్రిల్ 2013, మంగళవారం

ఇదీ సంగతి



ఒక్కరు ఒక్కరంటే ఒక్కరు ముందుకొచ్చినా మా అమ్మ బతికేది అని ఆక్రోశిస్తోంది తెనాలి ఆడపడుచు మౌనిక. కంటిఎదుటే కన్నతల్లిని పోగొట్టుకున్న ఆవేదన ఆమెది.




తాగుబోతుల ముష్కర చర్యకు ఒక నిండు ప్రాణం నలుగురి ఎదుటే నడిబజారులో గాలిలో కలిసిపోయింది. ఆ క్షణంలో జరగాల్సింది జరగక, జరగకూడనిది జరిగిపోయిన తరువాత మాత్రం నానా హడావిడీ జరిగింది. తదాదిగా,  స్పందించని వ్యక్తులు లేరు. వ్యవస్థ లేదు. కానీ, సమయానికి సాయం చేయని సమాజం ఆ తరువాత ఎన్ని మొసలి కన్నీళ్ళు పెట్టుకుంటే ఏం లాభం? ఎవరికి లాభం? అదే ఆ అమ్మాయి చెబుతోంది. ఒక్కరు ముందుకొచ్చినా మా అమ్మ బతికేది అంటోంది.
సరే! నాలుగు రోజులు మీడియా హడావిడి. తరువాత అంతా మామూలే.
ఇలా వుండగానే మీడియాలో జైపూర్ రోడ్డు ప్రమాదం వార్త -     
జైపూర్ లో ఓ యువకుడు, భార్యను,  నాలుగేళ్ల కొడుకును,  నెలల పసికందుని స్కూటర్ పై తీసుకుని వెడుతుండగా లారీని డీకొని అందరూ  రోడ్డుపై పడిపోయారు. కట్టుకున్న ఇల్లాలు, కన్నకూతురు అతడి  కళ్ళముందే కన్నుమూశారు. గాయాలబారిన పడిన పిల్లవాడు, పక్కనే విగతజీవులయిన వారి దేహాలు, వాటిపక్కన నిలబడి నెత్తీనోరూ కొట్టుకుంటూ  సాయంకోసం అర్ధించే యువకుడు - నిజానికి ఈ దృశ్యం చూసినవారికి కళ్లు చెమర్చి తీరాలి.  అయితే జరిగింది వేరు. దారిన పోతున్న ప్రతిఒక్కరూ ఒక్క క్షణం పాటు ఆగి చూసిపోతున్నవారే కాని కలగచేసుకుని సాయం చేద్దామనుకున్న వారు ఒక్కరూ లేకపోయారు. గంటసేపు ఇదే సీను  ఎలాటి అంతరాయం లేకుండా కొనసాగింది. సాయపడేవారు లేకపోవడంతో నిస్పృహకు గురైన  ఆ యువకుడు నడిరోడ్డు మీదనే తలపట్టుకుని కుప్పకూలిపోయాడు. ఈ దృశ్యాలన్నింటినీ తరువాత ఈ పవిత్ర దేశంలోని  ప్రజలందరూ బుల్లితెరలపై వీక్షించి తరించారు. అది వేరే సంగతి.

ఈ నేపధ్యంలో ఒక పాత సంగతి గుర్తుచేసుకుందాం.
ఇది ఇప్పటి మాట కాదు. యాభై ఏళ్ళ పైమాటే.
మద్రాసు జనరల్ ఆసుపత్రి బీట్ చూసే ఒక విలేకరికి ఒక రోజు స్కూటర్ ప్రమాదంలో గాయపడి మరణించిన వ్యక్తి శవం కనిపించింది. పక్కనే ఎవరికోసమో ఎదురు చూస్తున్న లక్ష్మి అనే వ్యక్తి అతడికి తారసపడింది. ఆమె ఒక నిర్మాణ కూలీ. స్కూటర్ పై వెడుతున్న ఓ ఇద్దర్ని అటుగా పోయే వాహనం  కొట్టేసి ఆగకుండా అందరూ చూస్తుండగానే వెళ్ళిపోయింది. కిందపడి గిలగిలా కొట్టుకుంటున్నవారిని అందరితో పాటు ఈమె కూడా చూసింది. అందరూ వింత చూసేవారే కాని ఒక్కరూ కలగచేసుకోలేదు.  ఈమే పరిగెట్టుకువెళ్లి వాళ్ళను లేవదీయాలని ప్రయత్నించింది.  ఓ టాక్సీని ఆపింది. అప్పటికే ముగ్గురు నలుగురు ఆపకుండా పోయారు. మరి కిరాయి ఎవరిస్తారని టాక్సీవాడు అడిగాడు. డబ్బులేదు. ముక్కుపుడక చూపించింది. టాక్సీలో ఇద్దరినీ జనరల్ ఆసుపత్రికి తీసుకువెళ్ళింది.  అయిన ఆలస్యం వల్ల ఒకడు అప్పటికే చనిపోయాడు. ఈ స్తితిలో విషయం తెలుసుకున్న  విలేకరి హృదయం ద్రవించింది.
నిరక్షురాస్యురాలయిన ఓ కూలీ వనిత తన రోజుకూలీ కూడా వొదులుకుని, ముక్కుపుడక టాక్సీవాడికి ఇచ్చి ఆసుపత్రికి చేర్చిన వైనాన్ని ఆ విలేకరి మరునాడు తన పత్రికలో రాసాడు. ‘క్వాలిటీ ఆఫ్ మెర్సీ’ అనే శీర్షికతో రాసిన ఆ వార్త మద్రాసులో చర్చనీయాంశం అయింది. పోలీసు కమీషనర్ లక్ష్మికి పాతిక రూపాయల నగదు బహుమతి ప్రకటించారు. ఆమె రోజు కూలీ రూపాయన్నరతో పోల్చుకుంటే ఆ రోజుల్లో అది పెద్ద మొత్తమే. పత్రికా పాఠకులనుంచి కూడా మంచి స్పందన వచ్చింది. అనేకమంది ఆమెకు కానుకలు పంపారు. మధురై నుంచి వెంకటేశ్వరన్ అనే వ్యక్తి ఒక పార్సెల్ పంపాడు. గాయపడ్డవారి రక్తంతో తడిసిన ఆమె చీరెకు బదులుగా ఒక కొత్తచీరెను కానుకగా పంపించాడు. పత్రిక పాఠకులనుంచి దాదాపు వెయ్యి రూపాయల సాయం అందింది. వందరూపాయలు మించి వస్తే ఒక ఇత్తడి గిన్నె కొనుక్కుంటానని ఆ యువతి తరువాత అదే  పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ చదివిన కంచి కామకోటి పీఠాధిపతి, పరమాచార్య ఒక ఇత్తడి గిన్నెను కానుకగా పంపించారు.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే -
ఆ వార్త రాసిన పత్రిక హిందూ. ఆ వార్త రాసింది ఆ పత్రికలో కొత్తగా విలేకరిగా చేరిన ఆర్.జే. రాజేంద్రప్రసాద్.
(అర్ధం అయింది కదా. ప్రసాద్ గారు రాసిన ‘డేట్ లైన్ ఆంధ్ర’ అనే పుస్తకంలో ఈ సమాచారం వుంది. మొన్న ఆదివారం నాడు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవిష్కరించారు. ప్రచురణకర్త శ్రీ ఆర్.ఎస్. ప్రసాద్. విశాలాంధ్ర ప్రచురణాలయం అన్ని శాఖల్లో ఈ పుస్తకం దొరుకుతుందని పేర్కొన్నారు. వెల: 75 రూపాయలు)
16-04-2013

15, ఏప్రిల్ 2013, సోమవారం

చెన్నారెడ్డి! ది మోస్ట్ కరప్ట్ సీఎం!




(సుప్రసిద్ధ పాత్రికేయులు, కీర్తిశేషులు ఆర్.జే. రాజేంద్రప్రసాద్ రాసిన రెండు పుస్తకాలను నిన్న ఆదివారం హైదరాబాదులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి,  జస్టిస్  ఎన్.వీ. రమణ ఆవిష్కరించారు.' డేట్ లైన్ ఆంధ్ర', 'వీచిన ప్రాంతీయ పవనాలు' అనే పేరుతొ  ప్రచురించిన ఈ పుస్తకాలు, కొన్ని దశాబ్దాల రాష్ట్ర రాజకీయాలను మన కళ్ళముందు వుంచుతాయి. హైదరాబాద్ హిందూ ఎడిషన్ రెసిడెంటు ఎడిటర్ గా, ఆ పత్రిక న్యూస్ బ్యూరో చీఫ్ గా గడించిన అనేక సంవత్సరాల అనుభవంతో రాసిన ఈ పుస్తకాల్లో ఒక నిబద్ధత కలిగిన పాత్రికేయ దృక్కోణం కానవస్తుంది. ఈ గ్రంధాలలోనుంచి కొన్ని ఆసక్తికరమైన భాగాలు)






డాక్టర్ చెన్నారెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు (కాంగ్రెస్ పార్టీలో) అసమ్మతి కార్యకలాపాలు ఉధృతంగా ఉండేవి. తనను అభిమానించే అనుచరులతో తన గదిలో కూర్చుని వాళ్ళతో జోకులు వేస్తూ కాలాన్నే మరచిపోయేవారు. ఆయనను చూడడానికి వచ్చిన జనం బయట కిక్కిరిసి వుండేవారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉప కార్యదర్శి వస్తే ప్రధాన కార్యదర్శిని  ఉడికించడానికా అన్నట్టు ఆయన్ని బయట వెయిట్ చేయించి ముందు ఉప కార్యదర్శిని లోపలకు రమ్మనేవారు.
1978 లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రి  అయినప్పుడు కేంద్రంలో ఇందిరాగాంధి అధికారంలో లేరు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఐ) తన ఆర్ధిక అవసరాలకోసం ఆంధ్రప్రదేశ్, కర్నాటకల్లోని కాంగ్రెస్(ఐ) ప్రభుత్వాలపై ఆధారపడింది.  చెన్నారెడ్డి క్రమం తప్పకుండా ఢిల్లీకి డబ్బు పంపేవారు. దీనివల్ల ఆయనకూ చెడ్డపేరు వచ్చింది.  (చెడు వార్తలు రాకుండా) పత్రికలను  మేనేజ్ చేసేందుకు అనేకులు రంగంలోకి దిగారు. మంత్రి సరోజినీ పుల్లారెడ్డి సచివాలయంలోని ప్రెస్ రూముకు వచ్చి’విలేకరులు క్యాంటీన్ లో డబ్బు పెట్టి కాఫీ తాగడం ఏమిటి’ అంటూ ‘విలేకరులకు రోజూ అతిధిమర్యాదలు జరగాల’ని ఆదేశించారు. (పనిచేసే) విలేకరులు సంబరపడిపోలేదు కాని, గుర్తింపు పత్రాలు వున్నా యే పత్రికకు వార్తలు రాయని జర్నలిస్టులు మాత్రం మంత్రి ఔదార్యాన్ని వాడుకున్నారు.
‘ఇలా వుండగా ఢిల్లీ నుంచి సండే మ్యాగజైన్ విలేకరి చెన్నారెడ్డి గారిపై వ్యాసం రాయడానికి హైదరాబాదు వచ్చారు. అతిధి గృహంలో బస, తిరగడానికి  కారు, తోడుగా ఒక అధికారి ఇలా  నాలుగు రోజులపాటు రాష్ట్రంలో విలాసవంతంగా తిరిగి, ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేసి ఆయన గారు ఢిల్లీ వెళ్ళిపోయారు. ఆదివారం ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తే వార్త ఆ పత్రికలో వస్తుందని అంతా అనుకున్నారు. అన్నట్టుగానే ఆ పత్రికలో వార్త వచ్చింది. కానీ అనుకున్నట్టుగా రాలేదు. ముఖచిత్రంపై చెన్నారెడ్డి ఫోటో వేసి ‘చెన్నారెడ్డి! మోస్ట్ కరప్ట్ సీఎం!’ అని శీర్షిక పెట్టారు. వ్యాసరచయిత తాను హైదరాబాదులో విమానాశ్రయం నుంచి ఆటోరిక్షాలో ఓ మధ్యతరగతి హోటల్ కు వెళ్లానని, డ్రైవర్ మీటర్ పై అయిదు రూపాయలు అదనంగా డిమాండ్ చేసాడని, అదేమిటని అడిగితె ముఖ్యమంత్రికి తాను కమీషన్ ఇవ్వాలని చెప్పాడని పత్రికలో రాసాడు.”

(15-04-2013)

14, ఏప్రిల్ 2013, ఆదివారం

ఫేస్ బుక్కులో బొమ్మరిల్లు



సిద్దు : “మొత్తం మీరే చేశారు, మొత్తం మీరే చేశారు నాన్నా...”
డాడ్ : “నేనేం చేసారా?”
సిద్దు: “నేనేదో కొత్తగా ఫేస్ బుక్ ఎక్కౌంట్ క్రియేట్ చేస్కొని ఫంకీ ప్రొఫైల్ పిక్చర్  పెట్టుకుంటే, వద్దు వివేకానంద పిక్చర్ పెట్టుకొమ్మన్నారు. నేను ఒక అమ్మాయి పిక్చర్ నచ్చిందని కామెంట్ చేద్దాం అనుకుంటే వద్దు లైక్ చేయమన్నారు.”
“మా ఫ్రెండ్ పోస్ట్ పెట్టాడని తెల్సి షేర్ చేద్దామనుకుని ఫేస్ బుక్ ఓపెన్ చేస్తే...
“అసలు నా ఫ్రెండ్ నే  లిస్టులో లేకుండా చేశారు కదా నాన్నా మీరు.....
“ర్రెయ్ ర్రెయ్ సిద్దూ ఈ స్టేటస్ లైక్ చేయ్ ఆ పిక్చర్ కి కామెంట్ కొట్టు దీన్ని షేర్ చెయ్యంటూ ......
“ఆఖరికి ఒక అమ్మాయి ఫ్రెం రిక్వెస్ట్ పంపితే... నా మౌస్ ఇలా పట్టుకుని నా కళ్ళముందే నాట్ నౌ కొట్టేశారు....
“వెళ్ళిపోతున్నారు నాన్నా నన్ను చూసి ఫ్రెండ్స్ ఆఫ్ లైన్ కి ....
“నా అక్కౌంట్ కూడా మీరే  వాడేస్తుంటే నేనెందుకు నాన్నా ఇంకా  వాడడం .....
“నా ఫొటోస్ కి లైక్ కొట్టండి నాన్నా ... నాతో చాట్ చెయ్యండి నాన్నా...”
డాడ్: “ఏరా!! ఎప్పుడూ ఆ మాట నేను కదా అంటాను?”
సిద్దూ: “అంటారు కానీ నాతొ చాట్ చేయరు... ఏమైనా ఉంటె నా ఫ్రెండ్స్ తో చాట్ చేస్తారు..
“మీరు ఇవన్నీ చేస్తుంటే నాకు యెలా వుంటుందో తెలుసా ....
“మిమ్మల్ని అన్ ఫ్రెండ్ చేసి నన్ను పర్మనెంటు గా బ్లాక్ చెయ్యండి నాన్నా అని పెద్దగా పోస్ట్ పెట్టాలి అనిపిస్తుంది.....
డాడ్: “తెలియదురా నాకు... ఓఓఓ....(భార్య వైపు చూస్తూ)తెలియదే నాకు....”
భార్య: “బ్లాక్ చేసేస్తా మిమ్మల్ని....”

సిద్దూ: “ఇంకో విషయం నాన్నా .. ఇప్పటికీ నా పాస్ వర్డ్ కూడా మీ దగ్గరే వుంది  నాన్నా....”


( దీన్ని ఇంగ్లీష్ లో షేర్ చేసిన గొర్తి శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలతో )