నాకు బీపీ వుందని డాక్టర్లు నిర్ధారించి దాదాపు
ముప్పయ్యేళ్ళు గడిచాయి. ఈ మాయదారి రోగం రావడానికి
అప్పట్లో నాకు కనబడ్డ కారణాలు రెండే రెండు. ఒకటి ఆటోరిక్షా డ్రైవర్లు కాగా రెండోకారణం
ట్రాఫిక్ పోలీసులు.
ఆఫీసుకు పోవాలంటే ఆటో శరణ్యం. సందు మొగదల్లో
ఆటోలు ఆపుకుని అందులో శేషతల్పశాయి మాదిరిగా డ్రైవర్లు విశ్రాంతి తీసుకుంటూ
వుండేవారు. వాళ్ళల్లో వొకడ్ని నిద్రలేపి రేడియో స్టేషన్ కు పోవాలి వస్తావా అని అడిగేవాడిని
మర్యాదగా. ‘రాను’ అనే సమాధానం వచ్చేది దురుసుగా.
ఇక సంభాషణ నా చేయిదాటిపోయేది.
‘ఏం ఎగస్ట్రా ఇవ్వాలా?’
‘ఆ మాట వేరే చెప్పాలా’ కాసింత ఎటకారం.
ఎక్కడ కాలాలో అక్కడే కాలేది. ఆ ఆటోని వొదిలేసి
మరోటి పట్టుకుంటే మళ్ళీ అదే జవాబు ‘రాను’
మరో ఆటోవాలా సమాధానం మరోరకంగా వుండేది.
‘సికింద్రాబాద్ కయితే సరే’
దానికి నేనూ సరే. ఎందుకంటే ఈ మధ్యలో ఏదో ఒక
క్రాస్ రోడ్డు రాకపోదా. ఎవరో ఒక ట్రాఫిక్ పోలీసు కనబడక పోడా! అదీ నా ఆలోచన.
అనుకున్నట్టే పోలీసు తగిలేవాడు. నేను పలానా అని
చెప్పగానే అతడు ఆటోవాడికి నాలుగు తగిలించేవాడు. ఓ క్లాసుపీకేవాడు. అంతే. నేను
ఎంచక్కా అదే ఆటోలో ఆఫీసుకుకి చేరిపోయేవాడిని.
ఉద్యోగ మహత్యం.
కానీ ఇది ఒక రోజు మాట కాదుకదా. ప్రతి రోజూ ఇదే తంతాయే!
భార్యాపిల్లల్ని తీసుకుని సినిమాకు బయలుదేరిన
వాడిని ఆటోవాళ్ళ పుణ్యమా అని చివరకు ఆటో
వాడితో సహా పోలీసు స్టేషన్ కు చేరేవాడిని. అక్కడ దృశ్యం షరా మామూలే.
ఇదంతా చూసి మా వాళ్లు నాతో బయటకు రావడమే
మానుకున్నారు.
చివరికి ఇది పని కాదనుకుని బ్యాంకు లోను తీసుకుని
స్కూటర్ కొనుక్కుంటే మూడో వాయిదా కూడా కట్టక మునుపే పోలీసులు పట్టుకున్నారు.
హెల్మెట్ లేదంటారు. ఈ గతుకుల రోడ్లమీద
హెల్మెట్ ఎందుకని నా ప్రశ్న. చివరికోరోజు పట్టుకుని పోలీసు స్టేషన్ కు
పట్టుకెళ్లారు. నానా రభస. జర్నలిస్టులందరూ సంఘీభావం ప్రకటించి మూకుమ్మడిగా పోలీసు స్టేషన్ కు వచ్చారు. ఎన్టీ
రామారావు గారు ముఖ్యమంత్రి. ఆయన అప్పుడు మద్రాసులో వున్నారు. మర్నాడు జర్నలిస్టులు
అసెంబ్లీని బహిష్కరించారు. ప్రభుత్వం దిగివచ్చింది. రిటైర్డ్ హై కోర్టు న్యాయ
మూర్తితో జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేసింది. నన్ను పట్టుకున్న పోలీసు
ఇనస్పెక్టర్ ని వేరే చోటుకి బదిలీ చేశారు. ఇదంతా నాపై తీవ్ర ప్రభావం చూపింది.
ఈలోగా మాస్కో ఎసైన్మెంట్ వచ్చింది. దాంతోపాటే బీపీ కూడా వచ్చింది. కాబట్టి ఇన్నేళ్ళ
తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా చిన్నతనం అనిపిస్తుంది.
నాతో పోల్చుకుంటే మా పిల్లలే నయమనిపిస్తారు. ప్రతి
విషయంలో నిదానంగా వ్యవహరిస్తారు. వయస్సులో
వున్నప్పుడు నా తరహా వారిలా వుండేది కాదు. అలా వుండివుంటే ఇదిగో ఈ బీపీలు గట్రా వుండేవి
కావేమో!
ఏం చేస్తాం.
జ్ఞానోదయం అయింది కాని బోధి వృక్షమే ఆలశ్యంగా కనబడింది. (18-04-2013)
8 కామెంట్‌లు:
:))
:)
బాగుంది. చాలా. ఒకటి మరిచి పోయారు. ఇప్పటి పిల్లలు మనలాగా కాదు నిజమే, కానీ, మన బీపీలకు కారకుల జాబితాలో వారు కూడా ఒకరని చాలా మంది అంటూ ఉంటారు,
bhale chepparu sir...!!!
"...వయస్సులో వున్నప్పుడు నా తరహా వారిలా వుండేది కాదు..."
True. Today's young people compared to last generation appear to be calm.
సమస్యలనేది మనిషికి సహజం. నాకు కూడా బి పి వుంది. నేను ఒక కస్తమర్ని ఆయన ఆఫీసులొ కలిసినపుడు ఒక పొస్టర్ గోడకు వేలాడుతుంటే ఆసక్తిగా చదివాను. దాని సారాంశం ఏమిటంటె --
పరిష్కారం లేని సమస్య గురించి మధన పడవలదు, ఎందుకంటె, పరిష్కారం లేదు అని నువ్వె చెప్తున్నావు కాబట్టి
పరిహ్కారం ఉన్న సమస్య గురించి అస్సలు ఆలోచించ వద్దు, ఎందుకంటే, పరిష్కారం దొరుకుతుంది అని నీకు నమ్మకం వుంది కనుక---
అప్పటికే నేను కొన్ని బాధలలో వున్నాను, అది చదివిన తరువాత కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకొవదం వలన నాకు మనశ్శాంతి దొరికింది
నేను కూడా ఈ రకంగా బీపీ పెంచేసుకోవడం తగ్గించా...కాక పోతే వాళ్ళు మన దగ్గరకి వచ్చినప్పుడు వాయించేస్తా కక్షతో...మా దగ్గరకి వచ్చే..ఈ ఆటో వాళ్ళూ..రిక్షా వాళ్ళూ..పేదవాళ్ళం బాబూ..అని మొదలు పెడతారు...అప్పుడు ఈ సంఘటనలు చెబుతూ, కష్ట పడ్డానికి బద్దకిస్తారు..పేదరికం పొమ్మంటే ఎలా పోద్దివాయ్?అని వాయించి పడేస్తా..కొన్ని హాట్ టాపిక్స్ లో, బీపీ లు పెరిగి చెత్త పోస్ట్లు పెట్టి...తర్వాత సారీ ...చెప్పుకున్న సంఘటనలూ ఉన్నాయ్..అందుకే బయటి విషయాలు చూసీ చూడనట్టు వెళ్ళక పోతే ఈ బీపీలు నెత్తికెక్కి కూర్చుంటాయ్...
విసుగు కోపంతో బిపి రాదు. బిపి వుంటే కోపం త్వరగా వస్తుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి