కొన్ని చిత్రంగా అనిపిస్తాయి. మరికొన్ని బహు
విచిత్రంగా కనిపిస్తాయి.
కొన్ని దృష్టి మహిమ. మరికొన్ని ఆ సర్వేశ్వరుడి సృష్టి
మహిమ. నమ్మినవానికి, రాయే సాయి. నమ్మనివానికి,
సాయే రాయి. అందుకే తొక్కితే రాయి. మొక్కితే సాయి అని పెద్దలు అంటారు. అంతా నమ్మకం.
పరిపూర్ణానంద స్వామి
దేవుడిని
విశ్వసిస్తామని చెప్పేవారేకాని నిజంగా మన ప్రార్ధనలకు మెచ్చి భగవంతుడు కోరిన
వరాలు ఇస్తాడని నమ్మేవాళ్ళు తక్కువే.
విశ్వాసమనేది సంపూర్తిగా వుండాలి కాని అరకొరగా వుండకూడదని బోధించే చిన్న నీతికధ
ఇది.
ఒక
వూరిలో వానలు పడక పంటలు ఎండిపోయి వూరిజనం అల్లాడిపోతున్నారు. వూరి నడుమ వున్న గుడి
వద్ద ఒక రాత్రంతా భజనలు చేస్తే వర్షాలు కురుస్తాయని ఎవరో చెప్పగా విని
పిల్లాపీచుతో సహా వూళ్ళో వాళ్లందరూ
కట్టగట్టుకుని గుడి వద్దకు చేరుకున్నారు. ఒక పిల్లవాడు గొడుగుతో సహా వచ్చాడు.
దేవుడి మీద, చేసే భజన మీదా అతడికున్న విశ్వాసం అది. నిజమయిన విశ్వాసం అంటే కూడా అదే.
పసి
పాపల్ని ఆడించడానికి తలిదండ్రులు ఒక్కోసారి వారిని గాల్లోకి ఎగరేసి పట్టుకుంటూవుంటారు.
అలా చేస్తున్నప్పుడు పాప పడి పడి నవ్వుతుందే కాని కింద పడేస్తారేమోనని ఏమాత్రం
భయపడదు. తాను పడిపోకుండా తల్లీ తండ్రీ తనను భద్రంగా పట్టుకుంటారని ఆ పసి పాప
నమ్మకం.
నిన్న సాయంత్రం అంటే 2013 ఏప్రిల్ 25 వ తేదీన హైదరాబాదు ఎన్టీయార్ స్టేడియంలో శ్రీ
పరిపూర్ణానంద స్వామివారి ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమయిన కార్యక్రమం జరిగింది. వేలాదిమంది
భక్త జనం స్వచ్చందంగా తరలి వచ్చి సామూహిక జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు కుంభవృష్టి కురుస్తుందా అన్నట్టు
ఆకాశం మేఘావృతమై వుంది. అంతా బహిరంగ ప్రదేశం. వాన పడితే తలదాచుకోవడం అని
సందేహించినవాళ్ళు సంక్షేపించి వూరుకున్నారు. అటూ ఇటూ మనసు చలించేవారు, వర్షం పడితే
అప్పుడు చూద్దాంలే అనుకుంటూ వెళ్లారు.
(బహుశా నాది అంటే భార్యల్ని వెంట తీసుకువెళ్ళిన నాలాటివారిది ఈ తరగతి అనుకుంటా) ఇక
పోతే, వాన వచ్చేది, పిడుగులు పడేది - పోకుండా మానేది లేదు అని భీష్మించుకు వెళ్ళినవాళ్ళూ వున్నారు. నిజానికి ఇలాటి వాళ్ళదే అక్కడ మెజారిటీ. వాళ్ల నమ్మకమే నిజమైంది. జడివాన
కాదుకదా చిన్నపాటి చినుకు కూడా రాలలేదు.
సరే! పరిపూర్ణానంద స్వామివారు, వేదిక మీద జ్యోతి
ప్రజ్వలనతో కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. వచ్చిన భక్త జనులందరూ తమ వెంట
తెచ్చుకున్న ప్రమిదలు, ఆవునేతితో తడిపిన వొత్తులతో
ఎవరికి వారు దీపాలను వెలిగించారు. కృత్రిమ విద్యుత్ దీపాలను తాత్కాలికంగా ఆర్పివేశారు. దానితో ఆ విశాల ప్రాంగణమంతా భక్తులు వెలిగించిన వేలాది దీపాల వెలుగులతో నిండిపోయింది. స్వామివారి
అనుగ్రహభాషణం ఓ పక్క, దీపాల కాంతులు మరోపక్క. ఆ యావత్ ప్రదేశం ధార్మిక కర్మ భూమిగా
శోభిల్లింది.
ఇక విచిత్రం ఏమిటంటారా! ఒక భక్తురాలు వెలిగించిన
దీపశిఖ ఇదిగో ఇలా ‘ఓం’ ఆకారంలో ప్రజ్వరిల్లి అశేష భక్తులను ఆకర్షించింది.
ముందే చెప్పినట్టు అంతా నమ్మకం.
అయితే ఒకటి నిజం. త్రికరణశుద్ధిగా నమ్మినది ఏదీ కూడా మనల్ని మోసం చేయదు. నిజానికి నమ్మకంలో వున్న గొప్పతనం అదే. (26-04-2013)
1 కామెంట్:
అవును
కామెంట్‌ను పోస్ట్ చేయండి