22, ఏప్రిల్ 2013, సోమవారం

ఉరుకుల పరుగుల జీవితం




చిన్నప్పుడు ఒక కధ చెప్పేవాళ్ళు.
ఒక చదువుకున్న జ్ఞాని  దేశ సంచారం చేస్తూ ఒక వూరికి వెడతాడు. అక్కడ ఒక మోతుబరి ఇంట్లో వేడుక జరుగుతూ వుంటుంది. ఈయన మాసిన బట్టలతో వెడితే ఎవరూ గుర్తించక పోగా లోపలకు రాకుండా అడ్డుకుంటారు. అతగాడు ఇది పనికాదనుకుని తన మాసిన దుస్తులు విసర్జించి ఖరీదయిన నూతన వస్త్రాలు ధరించి తిరిగి అక్కడికే వెడతాడు. వేషం మార్చుకుని వచ్చిన అతడికి మోతుబరి ఇంట్లో ఘన సత్కారాలు జరుగుతాయి. షడ్రసోపేతమైన విందు భోజనం వడ్డిస్తారు. ఆ జ్ఞాని ఆ పిండివంటలు తినకుండా తను  ధరించిన దుస్తులకు పెట్టే ప్రయత్నం చేయడం చూసి విస్తుపోయిన గృహస్తు సందేహ నివారణ చేయమని కోరతాడు.
‘మీరు గౌరవిస్తున్నది నాలోని విద్యను కాదు, నేను వేసుకున్న దుస్తులను. కాబట్టి ఈ పిండివంటలు ఈ దుస్తులకే చెందుతాయి’ అని జవాబిచ్చాడు.
ఎప్పుడో చిన్నప్పుడు చదివిన ఈ కధలోని  నీతి  మరోమారు రుజువయింది.
కాకపొతే అమెరికాలో.



“వాషింగ్టన్ డీసీ లోని ఒక మెట్రో స్టేషన్ దగ్గర్లో వీధి పక్కన ఒక సంగీతకారుడు నిలబడి వయోలిన్ వాయిస్తూవుంటాడు. ఆ దేశంలో ఇలాటివి షరా మామూలు దృశ్యాలే. ఆఫీసులకు పోయే టైము. జనం హడావిడిగా ఎవరిపనులమీద వారు ఉరుకులు పరుగులతో వెడుతుంటారు. దాదాపు నలభై అయిదు నిమిషాలపాటు ఆ సంగీతకారుడి వయోలిన్ వాయిద్య కచ్చేరీ సాగిపోతూనే వుంటుంది. కాసేపటి తరువాత ఒక నడికారు మనిషి మెట్రో రైలు దిగివస్తూ అతడ్ని చూస్తాడు. కాసేపు ఆగి వింటాడు కానీ అలానే  ఆగిపోయి వినే  వ్యవధానం వుండక తన దారిన తాను పోతాడు. మరి కాసేపటికి ఓ మహిళ  కొద్దిసేపు ఆగి  కాసేపు సంగీతం ఆస్వాదించి ఒక డాలరు నోటు అక్కడపెట్టి చక్కాపోతుంది. మొత్తం మీద ఆ ముప్పావుగంటలో అక్కడ ఆగివిన్నది ఆరుగురే. ఇక వచ్చిన సొమ్ము అక్షరాలా ముప్పై రెండు డాలర్లు మాత్రమే.
ఈ కధ ఇంతటితో అయిపోలేదు.
ఎందుకంటే అంతకు రెండురోజుల ముందే అసలు కధ మొదలయింది.
ఆ సంగీతకారుడి పేరు జాషువా బెల్. బోస్టన్ లో అతడు ఇచ్చిన ప్రదర్శనకు టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. వంద డాలర్లు చెల్లించి మరీ టిక్కెట్లు కొనుక్కుని కిక్కిరిసిన ధియేటర్లో అతడి సంగీతాన్ని ఆస్వాదించారు.
అదే  సంగీతకారుడు సాధారణ దుస్తుల్లో అతి సాధారణంగా  మెట్రో దగ్గర  వాయిస్తే అతడ్ని పట్టించుకున్నవాళ్ళే లేరు. పైగా ఆయన వయోలిన్ పై ఆ సాయంత్రం వాయించిన బిట్టు వాణిజ్యపరంగా లెక్కకడితే మూడున్నర మిలియన్ల డాలర్లు. అంటే మన రూపాయల్లో చెప్పాలంటే అక్షరాలా పదిహేడు  కోట్ల పైమాటే.  
ఇంతకీ ఆ మెట్రో దగ్గర వయొలిన్ వాయించాలని అంత గొప్ప సంగీతకారుడికి యెందుకు అనిపించినట్టు?
దీనికీ ఒక నేపధ్యం వుంది.
ప్రజలు, వారి అభిరుచులు, వారి  ప్రాధాన్యతల మీద ఒక ప్రయోగం చేయాలని  వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు అనిపించడమే అసలు కారణం. (22-04-2013)

4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

గురజాడవారు మధురవాణి చేత అనిపిస్తారు’ ఈ ఊళ్ళో గంధ్ర్వుడొచ్చి పాడినా వినేవాడు లేడని’

అజ్ఞాత చెప్పారు...

గంధర్వుడు

voleti చెప్పారు...

కష్టేఫలి గారు "గంధర్వుడు" కాదండి.. "నారదుడు"..

voleti చెప్పారు...

కష్టేఫలి గారు "గంధర్వుడు" కాదండి.. "నారదుడు"..