9, ఏప్రిల్ 2013, మంగళవారం

మనం మంచివాళ్ళ మధ్యనే వుంటున్నాం



ఒకరకంగా మన అందరం అదృష్టవంతులమే. ఎందుకంటే , జస్టిస్ చంద్రు వంటి  అరుదయిన మంచి మనుషులు జీవిస్తున్న కాలంలోనే మనమూ బతుకుతున్నాము కాబట్టి.

జస్టిస్  చంద్రు 

జస్టిస్ చంద్రు చెన్నై హై కోర్ట్లులో చాలాకాలం జడ్జిగా  పనిచేసి ఈమధ్యనే పదవీ విరమణ చేశారు. ఆయన్ని గురించిన నాలుగు మంచిమాటలు చెప్పుకునే ముందు మరో విషయం ప్రస్తావించడం అసందర్భం ఏమీ కాబోదు.
ఆంధ్రప్రదేశ్  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.వి.రావు  ఇటీవల ఒక సంచలన వ్యాఖ్య చేశారు. దేశవ్యాప్తంగా న్యాయస్తానాలలో మూడుకోట్లకు పైగా కేసులు పరిష్కారానికి నోచుకోకుండా పేరుకుపోయివున్నాయనీ, ఇవన్నీ ఓ కొలిక్కి   రావాలంటే  300 లసంవత్సరాలకు  పైగా పడుతుందనీ జస్టిస్ రావు  చెప్పారు. ఆయన చెప్పింది అక్షరసత్యమే కావచ్చుకాని,  జస్టిస్  చంద్రు వంటి న్యాయమూర్తులు మరికొందరు వుండివుంటే,  బహుశా కేసుల పరిష్కారానికి  అంత సమయం అవసరం పడదేమో! ఎందుకంటే కేసుల పరిష్కారం  విషయంలో జస్టిస్ చంద్రు నెలకొల్పిన  రికార్డు అలాటిది మరి.  న్యాయమూర్తిగా ఆయన అక్షరాలా  యాభై నాలుగు వేల కేసులను పరిష్క రించారు. భారత న్యాయస్తానాల చరిత్రలో ఇదొక అరుదయిన రికార్డు.
సరే! విషయానికి వద్దాం.
ఏదయినా ఉద్యోగంలో వున్న వ్యక్తి యెంతటి  సమర్ధుడైనా సరే,  ఏదో ఒకనాడు పదవీ విరమణ చేయకతప్పదు. జస్టిస్ చంద్రుకు కూడా ఆ రోజు వచ్చింది.
మామూలుగా ఇలాటి సందర్భాలలో కొన్ని సంప్రదాయాలు వుంటాయి. న్యాయమూర్తి ఎవరయినా రిటైర్ అవుతున్నప్పుడు  కోర్టులోనే అధికారికంగా ఒక వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేస్తారు. ప్రధాన న్యాయమూర్తి,  ఇతర న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్  వగైరా  హాజరవుతారు. వీడుకోలు ప్రసంగాలు చేస్తారు. పుష్పగుచ్చాలు అందచేస్తారు.  తేనీటి విందు జరుగుతుంది. అందరూ కలసి ఫోటో దిగుతారు. వీలునుబట్టి,  ఆ సాయంత్రం ఓ  ఫైవ్ స్టార్ హోటల్లో వీడ్కోలు  విందు ఏర్పాటుచేస్తారు.
కానీ జస్టిస్ చంద్రు తరహానే వేరు. అందువల్ల ఆయన పదవీ విరమణ ఆయన పద్దతిలోనే జరిగింది. ఏడేళ్ళపాటు జడ్జిగా  పనిచేసి  రిటైర్ అయ్యేముందు అంటే  ఈ ఏడాది ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఆయన ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు. వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయవద్దని అందులో ముందుగానే  అభ్యర్ధించారు.
ఒక జడ్జి  నిరాడంబరంగా పదవీ విరమణ చేయడం ఎన్నడూ జరగలేదా అంటే  జరిగింది. కానీ ఎప్పుడూ?  మన దేశానికి  స్వాతంత్ర్యం రాకముందు 1929లో జరిగింది.  ఆరోజుల్లో జస్టిస్ జాక్సన్ నాటి అడ్వొకేట్ జనరల్ తో చెప్పారు. ‘ నా రిటైర్ మెంటు విషయంలో అనవసరమైన హడావిడి ఏమీ చేయవద్దు. నా విధులు నేను నిర్వర్తించాను.  వీడ్కోలు ఇవ్వాల్సిన అవసరం ఏమి వుంది?’
మళ్ళీ ఎనభై రెండేళ్ళ తరువాత జస్టిస్ చంద్రు అలాటి నిర్ణయం తీసుకోగలిగారు.     
 మార్చి  ఎనిమిది, శుక్రవారం.
జస్టిస్ చంద్రు రోజుమాదిరిగానే  కోర్టుకు వచ్చారు. తన ఆస్తిపాస్తుల  వివరాలను స్వచ్చందంగా తెలియచేస్తూ ఒక డాక్యుమెంటును ప్రధాన న్యాయమూర్తికి అందచేసారు. తరువాత తన చాంబర్స్ కు వచ్చి అవసరమైన కొన్ని పత్రాలపై సంతకాలు చేశారు. మీడియా మిత్రులతో కూర్చుని తేనీరు  సేవిస్తూ కొద్దిసేపు ముచ్చటించారు.
రిటైర్ అయినరోజున కూడా ఆయన అధికారిక వాహనాన్ని వాడుకోలేదు. అన్నిసంవత్సరాలుగా  వెన్నంటివున్న డఫేదారునూ వెంటతీసుకోపోలేదు.
తరువాత హై కోర్టు బయటకు వచ్చి నడుచుకుంటూ సుభాష్ చంద్రబోస్ రోడ్డు దాటి అక్కడవున్న సంగీత రెస్టారెంటులో మిత్రులతో కాఫీ తాగుతూ ముచ్చట్లు చెబుతూ గడిపారు. ఆ పిదప, బీచ్ రోడ్డు స్టేషన్ కు వెళ్ళి వేలాచెర్రి వెళ్ళే ఎం.ఆర్.టీ.ఎస్. లోకల్ ట్రైన్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయారు.
న్యాయమూర్తిగా వున్నప్పుడు కూడా జస్టిస్ చంద్రు ఉద్యోగంతోపాటు వచ్చే హంగులు ఆర్భాటాలకు  దూరంగానే వుంటూ వచ్చారు. సాధారణంగా న్యాయమూర్తులు తమ చాంబర్ నుంచి కోర్టు హాలుకు వెళ్ళేటప్పుడు  యూనిఫారం ధరించిన  బిళ్ళ బంట్రోతు వొకరు చేత దండం ధరించి ముందు నడుస్తూ వెళ్లడం ఆనవాయితీ. జస్టిస్ చంద్రు దీనికి స్వస్తి చెప్పారు.  తన అధికారిక వాహనానికి యెర్ర దీపం ఏర్పాటు తీసేయించారు. సెక్యూరిటీ సిబ్బందిని  అవసరంలేదని చెప్పి వాపసు పంపేసారు.  ఇంటివద్ద పనులకోసం బంట్రోతులను వాడుకోలేదు.
చెన్నై హైకోర్టులో జస్టిస్ చంద్రు చాంబర్ ముందు ఒక బోర్డు మీద ఇలా రాసివుండేది.

“పూలు,బొకేలు పట్రాకండి – నేనేమీ దేవుడ్ని కాను
ఆకలితో లేను  – కాబట్టి పళ్ళూ మిఠాయిలు తేకండి
చలితో గడగడలాడిపోవడం లేదు –  శాలువల అవసరం ఏమీ లేదు  
అలా అని మీనుంచి నేనేమీ ఆశించడంలేదనుకోకండి.
లోపలకు వచ్చేటప్పుడు శుభాశీస్సులు పట్టుకురావడం మాత్రం మరచిపోకండి.”
   
బహుశా ఇప్పుడాబోర్డు అక్కడ వుండి వుండదు. దాని అవసరం కూడా వుండకపోవచ్చు.
(09-04-2013)
NOTE: COURTESY IMAGE OWENER

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

ఆడంబరాలూ..విలాసాల తో జీవితాన్ని గడుపుతూ నలుగురికీ ఆ జాడ్యాన్ని అంటిస్తున్న మహాజనుల మద్య..నిజమే సర్..ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు కొద్ది మందే...అయినా ఉన్నారు..వీళ్ళ నుంచి ఏ కొంచెమయినా నేర్చుకుంటే ..