అంతర్జాతీయ యోగా దినోత్సవం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అంతర్జాతీయ యోగా దినోత్సవం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, జూన్ 2026, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (329): భండారు శ్రీనివాసరావు

 

యోగ కాలం
పొందలేని దాన్ని సాధించగలగడాన్ని యోగం అంటారు. ఉదాహరణకు ఆత్మ సాక్షాత్కారం. దీన్ని సాధించడం అంత సులభం ఏమీ కాదు. సాధించాలంటే అందుకుతగ్గట్టుగా శరీరాన్ని తయారు చేసుకోవాలి. ఈ సాధనే యోగా. ఈ సాధన చేసేవారిని పూర్వం యోగులు అనేవారు. యోగసాధన ద్వారా లక్ష్యాన్ని అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలిగిన వారిని యోగయుక్తులు అంటారు. లక్ష్యసాధన ఒక ఎత్తయితే, సాధించిన దాన్ని పదిలపరచుకోవడం మరో ఎత్తు. మొదటిది యోగం, రెండోది క్షేమం. ఈ 'యోగక్షేమాల' ప్రసక్తి భగవద్గీతలో కూడా వుంది. గీత తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండో శ్లోకంలో అంటాడు భగవానుడు అర్జునుడితో, " అనన్యాచింతయంతోమా యేజనాః పర్యూపాసతే, తేషామ్ నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్" అని.
అంటే 'వేరే ధ్యాస లేకుండా నన్నే తలుస్తూ, నన్నే ధ్యానిస్తూ పోతే వారి యోగక్షేమాలు నేను చూసుకుంటాను' అని స్తూలార్ధం. అలాగే, 'అధాతో బ్రహ్మ జిజ్ఞాసా' అనే దానితో 'బాదరాయణ బ్రహ్మ సూత్రాలు' మొదలవుతాయి. ( ఈ బ్రహ్మ సూత్రాలు వేద వ్యాస విరచితమనీ, కాదు బాదరాయణుడు రాశాడనీ కొన్ని వాదాలు వున్నాయి. ఆ ఇద్దరూ ఒకరనే వాదం కూడా వుంది, అది వేరే విషయం)
బ్రహ్మసూత్రాలలో చెప్పిన అధాతో అంటే 'అటు పిమ్మట...'. శరీరాన్ని యోగాతో ఆత్మసాక్షాత్కారానికి అనువుగా 'మార్చుకున్న పిమ్మట' అని భాష్యం చెప్పుకోవచ్చు. శంకర భాష్యాన్ని ప్రముఖ పండితులు పుల్లెల రామచంద్రుడు తెనిగించి పుణ్యం కట్టుకున్నారు.
అందులోని జిజ్ఞాస అధికరణంలో ఈ యోగ ప్రసక్తి వుంది. ఈ యోగ సూత్రాలను పతంజలి మహాముని వెలికితీసి ఒకచోట గుదిగుచ్చి పంచాంగాలతో, కర్మ యోగము, రాజ యోగము, భక్తి యోగము, ధ్యాన యోగము, జ్ఞాన యోగములతో కూడిన 'యోగ దర్శనం' తయారు చేశారు. అదే పతంజలి యోగశాస్త్రంగా ఈనాటికీ మన్ననలు అందుకుంటోంది.
పతంజలి యోగానికి ఇచ్చిన నిర్వచనం 'యోగసు కర్మ కౌశల్యం', 'చిత్తవృత్తి నిరోధం'. ఏ కర్మ (పని) చేసినా దాన్ని నైపుణ్యంతో చేయడం, మానసిక చాంచల్యాలను జయించడం అని అర్ధం చెప్పుకోవచ్చు.
ఇందుకోసం ఆయన సాధన చతుష్టయాన్ని ప్రబోధించారు. నిత్యానిత్య వస్తువు వివేక జ్ఞానము, ఇహలోక పరలోక విషయం భోగ వైరాగ్యము, శమదమాది సాధన సంపద, మోక్షం పొందాలనే తీవ్రమైన వాంఛ- ఈ నాలుగు అలవరచుకుని యోగసాధన మొదలు పెట్టాలి. శమదమాది సాధన సంపద అంటే ఒకటి శమము( మనో నిగ్రహము), రెండు దమము ( బాహ్య ఇంద్రియ నిగ్రహము ) మూడు ఉపరతి (విషయాలనుంచి వెనక్కు మరలడం) నాలుగు తితిక్ష (సహనం), అయిదు శ్రద్ధ (శాస్త్రాదుల పట్ల పరిపూర్ణ విశ్వాసం).
ఈ అయిదూ యోగసాధకుడికి అత్యవసరం. బ్రహ్మ సూత్రాలలో చెప్పిన మొదటి సూత్రం 'యధాతో బ్రహ్మ జిజ్ఞాస' అంటే అటు పిమ్మట అనేది, 'ఈ అయిదూ సాధించిన' పిమ్మట అనేది గ్రాహ్యం. తద్వారా ఆత్మ సాక్షాత్కార సాధన సులభం అవుతుంది. ఈ నైపుణ్యం అలవరచుకోవడం కోసం కర్మయోగాది పంచ యోగాలు ఉపయోగపడతాయి.
కర్మ, రాజ, భక్తి, ధ్యాన, జ్ఞాన యోగాలు కర్మతో మొదలయి జ్ఞానంతో అంతమవుతాయి. ఈ జ్ఞాన సాధనతో యోగి యోగయుక్తుడు/ యోగసిద్ధుడు కాగలుగుతాడు.
పతంజలి చెప్పిన అష్టాంగయోగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి విభాగాలు వున్నాయి.
ఇవన్నీ సరే, మామూలు మనిషికి ఇవన్నీ యెందుకు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.
మానవ శరీరం శాశ్వతం కాదు. ఎప్పుడో ఒకప్పుడు నశించి పోయేదే. జీవుడు శాశ్వతం. అతడికి నాశనం లేదు. కానీ శరీరాన్ని ఆవహించుకుని వున్న జీవుడికి ఆ తాత్కాలిక ఆవాసం మీదనే మోజు. తద్వారా సంప్రాప్తించిన సుఖ దుఃఖాలతో మునిగితేలుతుంటాడు. ఈ అజ్ఞానం తొలగగానే లౌకిక వ్యవహారాలను నిర్లిప్త వైఖరితో పరికించే స్తితి వస్తుంది. ఇట్టి స్తితికే ముక్తి, కైవల్యం, అపవర్గం అని పేర్లు.
ఇలాటి స్తితిని దేహం వుండగానే చేరుకోగలిగితే అది జీవన్ముక్తి అనిపించుకుంటుంది. ఈ యావత్ యోగ సాధన అంతా ఈ స్తితికి చేరుకోవడం కోసమే.
బుధజనులతో అప్పుడప్పుడు జరిపే సంభాషణల్లో వినవచ్చిన కొన్ని మంచి సంగతులు ఇవన్నీ.
ఆరువేల ఏళ్ళ క్రితం మన పూర్వీకులు మనకందించి వెళ్ళిన ఈ అత్యంత విలువైన జీవన విధానం ఇది. అలాటి యోగాకి ప్రత్యేకించి ఒక దినాన్ని కేటాయించాలని ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన విజ్ఞప్తి మేరకు ఏటా జూన్ ఇరవై ఒకటో తేదీని అంతర్జాతీయ యోగాదినంగా ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. అతి నిరాడంబరంగా పూర్వీకులు అందించిన భారతీయ యోగ శాస్త్రానికి సంప్రాప్తించిన మహా యోగం.
మరో ముఖ్యమైన విషయం. మొత్తం మానవాళికి యోగవిద్యను ప్రసాదించింది భారతీయులే. కానీ మనస్సును, శరీరాన్ని అదుపులో వుంచుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాలను కాపాడుకోవడానికి మంచి ఉపకరణం అయిన యోగాను ఏదో ఒక దేశానికో లేదా మతానికో పరిమితం చేసి చూడడం మంచిది కాదు. ఇస్కాన్ గతంలో నిర్వహించిన భగవద్గీత పఠనం పోటీలో మర్యం ఆసిఫ్ సిద్దికీ అనే ముస్లిం బాలిక ప్రధమ స్థానం దక్కించుకోవడం మనందరికీ గర్వకారణం.
అలాగే, మనం బాధపడాల్సిన అంశాలు కూడా వున్నాయి. మతాన్ని నల్లమందుతో సమానంగా పరిగణించే కమ్యూనిష్ట్ చైనాలో భగవద్గీతను చైనా భాషలో ప్రచురించి ప్రజలకు అందుబాటులో పెట్టారు. మనం పవిత్ర గ్రంధం అని పైకి గొప్పగా చెప్పుకుంటాము కాని భగవద్గీత గ్రంధాల ఉనికి, కోర్టుల్లో సాక్షి ప్రమాణాలకు, మనుషులు కాలం చేసినప్పుడు మైకుల్లో వినిపించడానికి పరిమితం అయిపోయింది. ఇదొక విషాదం.
తోక టపా:
నలభై ఏళ్ళ కిందట నేను పూర్వపు సోవియట్ యూనియన్ రాజధాని మాస్కోలో, మాస్కో రేడియోలో ఉద్యోగం చేస్తున్నరోజులవి.
రష్యన్ టీవీ నేషనల్ ఛానల్ ప్రైం టైంలో నాటి కమ్యూనిష్ట్ పార్టీ అధినేత, ఆ దేశాధ్యక్షుడు అయిన మిహాయిల్ గోర్భచెవ్ తో సమానంగా టెలివిజన్ తెరపై గంటలు గంటలు కనిపించే అవకాశం దక్కిన ఏకైక వ్యక్తి ఒక సాధారణ భారతీయుడు అంటే నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ ఇది నిజం. ఆయన పేరు లక్ష్మణరావు గారు. తెలుగు బాగా తెలిసిన కన్నడిగుడు. భారత రాయబార కార్యాలయం నడిపే ఇండియన్ స్కూలులో యోగా టీచరు.
ఆయన ప్రతి రోజూ టీవీ ద్వారా రష్యన్ పౌరులకు యోగా పాఠాలు బోధించేవారు. దీన్ని బట్టి భారతీయ యోగాకి అప్పట్లోనే విదేశాల్లో వున్న ఆదరణ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.
(ఇంకా వుంది)