లక్ష రూపాయల డిక్రీ కధ
అమెరికాలో మా పెద్ద కుమారుడు
సందీప్ వుంటున్న సియాటిల్ కి దాదాపు మూడు వందల మైళ్ల దూరంలో వున్న స్పోకెన్ నగరం
నుంచి స్పోక్స్ మన్ రివ్యూ అనే పత్రిక
125 సంవత్సరాలకు పైగా ప్రచురితమవుతూ వస్తోంది. కిందటి
ఎపిసోడ్ లోని ఫోటోలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు
గారు చూస్తున్న, లేదా నేను
చూపిస్తున్న పత్రిక ఇదే.
హైదరాబాదు ఆలిండియా
రేడియోలో నా సహోద్యోగిగా పనిచేసిన పవని విజయ లక్ష్మి, ఆమె భర్త బాలాజీ
ఉద్యోగరీత్యా ఆ నగరంలో వుంటున్నారు. 2004 లో కాబోలు, నేను
అమెరికా వచ్చిన సంగతి తెలుసుకుని, వాళ్ళ వూరు రావాల్సిందని పదే పదే ఫోన్లు చేస్తూ
వుండడంతో ఒకరోజు నేను మా ఆవిడను తీసుకుని స్పోకేన్ కు వెళ్ళాను.
అక్కడ వాళ్ళు కొనుక్కున్న ఇల్లు చూడముచ్చటగా వుంది. అంతకు ముందే బాలాజీ తలిదండ్రులు హైదరాబాద్ నుంచి
వచ్చి కొడుకూ కోడలి దగ్గర ఆరు నెలలు వుండి తిరిగి ఇండియాకు వెళ్లారు. సగటు తెలుగు
కుటుంబాల్లో ఇది సహజంగా జరిగేదే. అయితే, అక్కడి అమెరికన్లకు ఇదొక వింత. వేరు కాపురం పెట్టుకున్న కొడుకు దగ్గర
తలిదండ్రులు అన్ని నెలలు గడపడం అక్కడివారికి ఎంతో వింతగా తోచింది. ఆ నోటా ఈ నోటా
పడి ఈ సంగతి స్పోక్స్ మన్ రివ్యూ పత్రిక
విలేఖరి రెబెక్కా నప్పీ చెవిన పడింది. ఇంకేముంది ఆమె అమాంతం విజయలక్ష్మి అడ్రసు
కనుక్కుని ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేసి మొత్తం ఫ్యామిలీ ఫొటోలతో సహా మొదటి పుటలో
ప్రచురించింది. ఆ
వార్తాకధనానికి వచ్చిన మంచి స్పందన గమనించిన ఆ
స్పోక్స్ మన్ రివ్యూ పత్రిక వాళ్ళు, వారం వారం విజయలక్ష్మి కార్యకలాపాలను కేంద్రంగా
చేసుకుని, ప్రత్యేక కధనాలను ప్రచురించడం
ప్రారంభించారు. అంటే స్పోకెన్ నగరంలో ఆమె
ఒక ఐకాన్ గా మారిపోయింది. రెబెక్క ఆ
పత్రికకు ఇంటరాక్టివ్ ఎడిటర్ గా కూడా పనిచేస్తున్నారు. నేను ఆలిండియా రేడియో
విలేకరినని తెలుసుకున్న మీదట ఆమె స్పోక్స్ మన్ రివ్యూ పత్రిక కార్యాలయానికి ఆహ్వానించారు.
డౌన్ టౌన్ రివర్ సైడ్ ఎవేన్యూ లో అనేక అంతస్తులలో వున్న
ఈ పత్రిక భవనం అతి పురాతనమయినది. చారిత్రిక అవశేషాలు దెబ్బతినకుండా భవనం లోపల
ఇంటీరియర్ ను మాత్రం ఫైవ్ స్టార్ హోటల్ మాదిరిగా అధునాతనంగా తీర్చిదిద్దారు.
సుమారు నూరేళ్ళ నాటి లిఫ్ట్ దగ్గర నిలబడి ఫోటోలు దిగాము. రెబెక్క మమ్మల్ని
ఆప్యాయంగా ఆహ్వానించి వివిధ విభాగాలకు తీసుకువెళ్లి, అక్కడ పనిచేస్తున్న
జర్నలిష్టులను పరిచయం చేసారు.
అంతే కాకుండా ఎడిటోరియల్ స్టాఫ్ మీటింగ్ లో కూర్చోబెట్టి
‘జర్నలిస్ట్ ఫ్రెండ్ ఫ్రం ఇండియా’ అని పరిచయం చేసిన తీరు మరిచిపోలేనిది. పత్రిక
చీఫ్ ఎడిటర్ ఎలాటి భేషజం ప్రదర్శించకుండా చక్కని హాస్యోక్తులతో కూడిన ప్రొఫెషనల్
సీరియస్ నెస్ తో సమావేశాన్ని రక్తి కట్టించారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా వివిధ
ప్రాంతాల విలేకరులతో మాట్లాడి ఏ వార్తకు ఆ రోజు ఎలాటి ప్రాధాన్యం ఇవ్వాలో అందరితో
చర్చించి నిర్ణయించడంతో ఆ సమావేశం ముగిసింది. తరవాత చివరి అంతస్తులో వున్న కాంటీన్
కు వెళ్లి కాఫీలు కలుపుకు తాగాము. అక్కడ మేడ మీద పెద్ద పెద్ద గుడ్లగూబ పక్షుల
బొమ్మలు కనిపించాయి. మన వైపు వీధి వాకిళ్ళ వద్ద కనిపించే సింహాల బొమ్మల మాదిరిగా
వున్నాయి. క్షుద్ర శక్తులు ప్రవేశించకుండా ఈ బొమ్మలు కాపాడుతాయని తమ పూర్వీకులు
నమ్మేవారని రెబెక్క చెప్పారు.
ఆధునిక జీవన శైలికి, నమ్మకాలకు సంబంధం లేదని ఆమె మాటల్ని బట్టి అర్ధం
అయింది. పూర్వం మేము కమ్యూనిస్ట్ రష్యాలో వున్నప్పుడు కూడా ఎవరైనా తుమ్మితే, నెత్తి
మీద తట్టి, రష్యన్ లో
చిరంజీవ అనే అర్ధం వచ్చే విధంగా (Da zdravstvuyet) అనే నోరు తిరగని పదం అనేవారు.
ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే,
విజయలక్ష్మి ఇక్కడ హైదరాబాదులో వున్నప్పుడు తాను ఇతరుల గురించి వార్తలు సేకరించేది,
అమెరికా వెళ్ళిన తర్వాత తానే వార్తల్లో వ్యక్తి అయింది. చాలా సమాజ సేవా
కార్యకలాపాల్లో పాల్గొంటో౦దని, ఆ పత్రికా కధనాలను బట్టి మాకు అర్ధం అయింది. ఆమె
ఒకసారి హైదరాబాదు వచ్చినప్పుడు, వాటినే నాటి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చూపిస్తే, ఆయన ఆసక్తిగా తిలకించారు. ఇదీ ఆ ఫోటో వెనుక కధ.
పొతే, లక్ష రూపాయల కోర్టు డిక్రీ సంగతి.
పది వేలు గరిష్ట పరిమితితో అప్పు మంజూరు చేశారు కానీ,
వాస్తవంగా ఆ పెయింటర్/ ఆర్టిస్టు తీసుకున్నది మూడు వేలే. ఆ బాకీ వాయిదాలు కూడా
సరిగా కట్టలేక ఆ వ్యాపారం వదిలేసాడో ఏమిటో తెలియదు. మనిషి జాడ లేడు. హామీ సంతకం చేసింది నేను కాబట్టి నాకు నోటీసులు
పంపారేమో అదీ తెలియదు. నేను అద్దె ఇల్లు ఖాళీ చేసి హైదరాబాదు వచ్చేశాను. మాస్కో
నుంచి వచ్చాక, హైకోర్టు ఇచ్చిన డిక్రీ మీద
ఒక లాయరు స్టే తెప్పించారు. డిక్రీ అమలు అయితే నాకు వేరే ఆదాయాలు లేవు కాబట్టి, వచ్చే
జీతంలో పావు వంతు కంటే తక్కువ ప్రతి నెలా కట్టాల్సి వుంటుందన్నారు. అప్పటికి నాకు
ఇంకా పదమూడేళ్ల సర్వీసు వుంది. అంతటితో సరి. పెన్షన్ కి ఈ కత్తిరింపులు వుండవుట. స్టే వెకేట్ కాగానే ఇలా బాకీ చెల్లింపు చేయాలని
మానసికంగా సిద్ధపడ్డాము. అయితే ఈ లోగా ఒక విచిత్రం జరిగింది.
ఒక మంచి రోజు చూసుకుని ఆ బ్యాంకు దివాళా తీసింది.
(చిన్నచిన్న మొండి బకాయిలకంటే, ఆ
అప్పులను వసూలు చేసే క్రమంలో, పెద్ద పెద్ద లాయర్లకి చెల్లించిన భారీ ఫీజుల వల్లే
అలా జరిగిందని నా అనుమానం)
కింది ఫోటో:
పవని విజయలక్ష్మి, రేడియోలో సీనియర్ సహోద్యోగి ఆర్వీవీ కృష్ణారావు, మా ఆవిడ నిర్మల
(ఇంకా వుంది)