ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రం
భారత స్వాతంత్రోత్సవ అమృత ఘడియల్లో శ్రోతలందరికి ఒక ప్రముఖ వ్యక్తిని పరిచయం చేయడం ఆనందంగా వుంది.
ఇప్పుడు ఆయన మన స్టుడియోలోనే వున్నారు. పేరు బ్రిగేడియర్ ఎస్. శ్రీరాములు. భారత సైన్యంలో చాలా ఉన్నత స్థానానికి చేరుకుని ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్నారు.
బ్రిగేడియర్ శ్రీరాములు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని కృష్ణాజిల్లాలో జన్మించారు. విజయవాడ ఎస్సారార్ కాలేజీలో చదివారు. గ్రాడ్యుయేషన్ తరువాత సైన్యంలో అధికారిగా చేరారు. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారి తీసిన 1971 ఇండో పాక్ యుద్ధంలో భారత సైన్యం తరపున పాల్గొన్నారు. మౌంటెన్ ఆర్టిలరీ బ్రిగేడ్ కు నాయకత్వం వహిస్తూ, 2003లో పదవీ విరమణ చేశారు.
ఈ సుదీర్ఘమైన సైనిక జీవితంలో బ్రిగేడియర్ శ్రీరాములు అనేక ప్రశంసలు, సైనిక గౌరవాలు, పురస్కారాలు అందుకున్నారు.
ఆయన మిలిటరీ అనుభవాలు గురించి, సైనిక జీవితంలో ఎదురైన కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు గురించి బ్రిగేడియర్ శ్రీరాములు గారినే అడిగి తెలుసుకుందాం.
భండారు శ్రీనివాసరావు:
బ్రిగేడియర్ శ్రీరాములు గారు, తెలుగు రాష్ట్రాల నుంచి సైన్యంలో చేరేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుందనే అపోహ ఒకటి ప్రచారంలో వుంది. మరి ఈ నేపధ్యంలో, కాలేజి చదువు పూర్తి చేసుకోగానే వేరే ఉద్యోగాలకోసం ప్రయత్నించకుండా నేరుగా సైన్యంలో చేరాలనే ఉద్దేశ్యం ఎందుకు కలిగింది? మీ కుటుంబంలో కూడా ఎవరికీ మిలిటరీ అనుభవం వున్నట్టు లేదు.
బ్రిగేడియర్ శ్రీరాములు జవాబు:
మీరు అనేది నిజమే. మా కుటుంబంలోనే కాదు మా ఊరి నుంచి కూడా ఎవరూ ఆర్మీ లో చేరాలని ఆలోచించే వారు కాదు. ఐతే 1962 లో చైనా యుద్ధం జరిగే సమయానికి నేను ఉంగుటూరులో స్కూల్లో చదువుకుంటున్నాను. రక్షణనిధి చందా పోగు చేయడం కోసం స్కూలు పిల్లలని వరిపొలాల్లో కోతలకు పంపారు. మేమందరం చాల ఉత్సాహంగా కోతలు కోస్తుంటే ఓ రైతు నన్ను చూసి, 'అంత సరదాగా పని చేస్తున్నావు ఆర్మీ లో చేరి యుద్ధం చేస్తావా ?' అని సరదాగానే అడిగారు. నామనసులో ఆ మాట నాటుకుపోయింది. ఆ తరవాత 1965 లో పాకిస్తాన్ తో యుద్ధం జరిగే సమాయానికి నేను విజయవాడ ఎస్ ఆర్ ఆర్ కాలేజీ లో చదువుతున్నాను. ఆ సమయంలో రొజూ రేడియోలో యుద్ధం వార్తలు వింటూ ఉండేవాళ్ళం. అప్పుడు నా మనసులో ఆర్మీ లో చేరాలనే ఆలోచన మరింత బలపడింది. అదే లక్ష్యంగా పెట్టుకుని డిగ్రీ చదువుతూనే ఆర్మీ సెలెక్షన్స్ కి ప్రిపేర్ అయ్యాను. 'యద్భావం తద్భవతి' అన్నట్లు డిగ్రీ అవగానే ఆర్మీ ఇంటర్వ్యూ కి వెళ్లడం, సెలెక్ట్ అవడం జరిగిపోయాయి. ఆలా లక్ష్యం, శ్రమ, అదృష్టం అన్నీ కలిసొచ్చాయి.
భండారు శ్రీనివాసరావు:
ప్రస్తుతం భారత జాతి యావత్తు ఆజాదీగా అమృత మహోత్సవాలు జరుపుకుంటున్న తరుణం. మన స్వాతంత్రం కూడా బ్రిటిష్ వారితో యుద్ధాలు చేసి సాధించుకున్నది కాదు. మరి ఇప్పుడు జరుగుతున్న ఈ ఉత్సవాలను ఒక సైనికాధికారిగా ఎలా అన్వయించి చెబుతారు?
బ్రిగేడియర్ శ్రీరాములు జవాబు:
అమృత మథనం కథ మనందరికీ తెలిసిందే. దేవతలూ రాక్షసులూ మేరు పర్వతాన్ని,వాసుకి అనే సర్పాన్ని తాడుగా ఉపయోగించి సుదీర్ఘ కాలం క్షీర సాగర మథనం చేసారు. ఒకదాని తరవాత ఒకటిగా మంచి వస్తువులు, చెడ్డ వస్తువులు ఉద్భవించాయి. హాలాహలాన్ని నిర్మూలించడానికి దేవతలు శివుని సహాయం కూడా తీసుకోవలసి వచ్చింది.
స్వతంత్ర భారతదేశ చరిత్ర కూడా అమృత మథనం లాగే సాగుతోంది. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాసుకి మాదిరిగా తాడులాగా పని చేసి, మథనం ఆగకుండా చూస్తూ, మంచి ఫలితాలు వస్తూనే ఉండేలా, చెడ్డ వస్తువులొస్తే వాటిని నిర్మూలించడానికి పనిచేసే ప్రమథ గణాల వలె పని చేస్తున్నాయి. ఈ బ్రహ్మయజ్ఞంలో, తాడులో ఒక చిన్న పోగులా నా జీవితం సాగిపోయింది. మహాకవి శ్రీ శ్రీ గారు చెప్పినట్లు 'నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను' . అది నా అదృష్టం.
భండారు శ్రీనివాసరావు:
బ్రిగేడియర్! ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వాతంత్ర అమృత మధనంలో సైనిక దళాల పాత్ర ఏమిటి అని అంటే ఏం చెబుతారు?
బ్రిగేడియర్ శ్రీరాములు జవాబు:
ఏ యజ్ఞానికైనా రక్షణ అవసరం. విశ్వామిత్రుడంతటి మహర్షి తన యజ్ఞానికి శ్రీ రాముల వారి సహాయం తీసుకున్నారు. అలాగే స్వతంత్ర భారత అమృత మధన యజ్ఞానికి ఇండియన్ ఆర్మీ ఎల్లకాలం రక్షణ కల్పించింది, కల్పిస్తుంది కూడా.
విరోధి దేశాలే కాదు, దేశంలోపల కూడా చాలా దేశ విరోధ శక్తులు పని చేస్తున్నాయని అందరికీ తెలుసు. విరోధి దేశాలతో యుధ్ధాలే కాకుండా అంతర్విరోధ శక్తులతో కూడా సైన్యం ఎన్నోసార్లు తలపడే అవసరాలొచ్చాయి. స్వాతంత్య్రం వచ్చిన రొజు నుంచి ఈ రొజు వరకు సైన్యం చేసిన సేవలు ఒకసారి గుర్తు చేసుకుందాం.
1 . యుద్ధాలు. 1947 - 48 జమ్మూ కాశ్మీర్ యుద్ధం; 1962 - చైనా యుద్ధం; 1965 - పాకిస్తాన్ తో యుద్ధం; 1967 - సిక్కింలో చైనా తో యుద్ధం; 1971 - పాకిస్తాన్ తో యుద్ధం, 1999 - కార్గిల్ యుద్ధం.
2 . అన్యాక్రాంతమైన భారత దేశ భూభాగాల స్వతంత్రీకరణ. హైదరాబాద్ (1948) ; దాద్రా, నగర్ హవేలీ (1954 ) ; నాగాల్యాండ్ (1955 -56 ); గోవా, డియూ, డామన్ (1961)
3. తిరుగుబాటు దారులతో సంఘర్షణ. నాగాలాండ్, అస్సాం, మణిపూర్, మిజోరాం, జమ్మూ & కాశ్మీర్ . జమ్మూ & కాశ్మీర్ లో 1987 నుంచి ఈ రొజు వరకు సాగుతూనే ఉన్నాయి
4 . సరిహద్దుల రక్షణ - 365 రోజులూ, 24 గంటలూ దాదాపు 15000 కిలోమీటర్ల దేశ సరిహద్దుల నిరంతర రక్షణ బాధ్యత సైన్యానిదే. - ఇందులో 740 కిలోమీటర్ల లైన్ అఫ్ కంట్రోల్ పాకిస్తాన్ తో- అడుగడుగునా టెర్రరిస్టులు చొచ్ఛుకుని వచ్చే ప్రమాదం, 70 కిలోమీటర్ల, ప్రపంచం లోకల్లా ఎత్తైన రణభూమి సియాచిన్ లో మైనస్ 50 డిగ్రీల చలిలో ఐస్ మీద డ్యూటీ, దాదాపు 4000 కిలోమీటర్ల చైనా బోర్డర్ రక్షణ, టెర్రరిస్టులు, స్మగ్లర్లు, రెఫ్యూజీలు రాకుండా ఆపడం - ఇవన్నీ సైన్యం బాధ్యతలే కదా !
5 . శ్రీలంక 1987 - 89
6 . ఐక్య రాజ్య సమితి నియమిత శాంతి రక్షణ చర్యలు . కొరియా (1950 ) మొదలు ఈ రొజు వరకు చాలా దేశాలలో భారత సైన్యం పని చేసింది, చేస్తోంది. చాలా వరకు ఇవి కూడా యుద్ధాల వంటివే.
7 . మిత్రులైన చిన్న దేశాల రక్షణ . మాల్దీవ్స్ (1988 ) .
8 . విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయులని క్షేమంగా దేశంలోకి తీసుకు రావడం . 1990 లో లక్షాయాభై వేలమందిని క్షేమం గా ఇరాక్ నుంచి తీసుకు రావడం ఒక రికార్డు. అప్పటినించి ఈ రొజు వరకు వేర్వేరు దేశాలలో చిక్కుకుపోయిన భారతీయులకు సైన్యం రక్షణ కల్పిస్తోంది . ఇటీవల యుక్రెయిన్ నుంచి మన విద్యార్థులని క్షేమంగా తీసుకు రావడం ఇంకో ఉదాహరణ
9. ఉపద్రవాలు సంభవించినప్పుడు ప్రజా రక్షణ. సునామి, భూకంపాలు, వరదలు, అంత దాకా ఎందుకు బోరు బావిలో పడినా సరే, ఆర్మీ నిస్సంకోచం గా సహాయం చేస్తుంది.
10 . దేశ నిర్మాణం. సరిహద్దు ప్రాంతాలలో రోడ్లు, వంతెనలు నిర్మించడం, చిన్న తరహా హైడెల్ ప్రాజెక్ట్స్ , టెర్రరిస్ట్ ప్రభావిత ప్రాంతాలలో స్కూల్స్ నడిపించడం వరకు సైన్యం సంతోషం గా చేస్తున్నది.
11 . స్పోర్ట్స్ . సైన్యం బాధ్యత తీసుకున్న తరవాత మన దేశ ఆటగాళ్లు ఒలింపిక్స్ లో స్వర్ణ, రజత, కాంస్య మెడల్స్ సాధించడం మొదలైంది
భండారు శ్రీనివాసరావు:
ఆర్మీ అనగానే అదేదో మనకు సంబంధం లేని విషయం అనే భావన ఇంకా చాలామందిలో వుంది. వెనక కాశీ పోయిన వాడు, కాటికి పోయిన వాడు ఒకటే అనే నానుడి వుండేది. అలాగే సైన్యంలో చేరే వారి గురించి ఇలాగే చెప్పుకునేవారు. అందులో చేరడం అంటే ఇక ఇంటికి తిరిగిరాడు వంటి అపోహల నడుమ, మీరు సుదీర్ఘ కాలం సైన్యంలో పనిచేశారు. పిల్లను ఇవ్వడానికి కూడా సంక్షేపించే తలితండ్రుల కాలంలో మీరు ఎలా నెగ్గుకు వచ్చారు. మీ విజయాల్లో మీ శ్రీమతి గారి పాత్ర ఏమిటి? మిలిటరీ జీవితం ఎలా వుండేది! ఆ వివరాలు కొన్ని మా శ్రోతలతో పంచుకుంటారా?
బ్రిగేడియర్ శ్రీరాములు జవాబు:
ఆర్మీలో చేరడం ఎలా జరిగిందో మీకు చెప్పాను. చేరిన తరువాత ట్రైనింగ్ లో కొంత వరకు ధైర్యం, స్థైర్యం, యుద్ధ విద్యలు నేర్చుకుంటాం. నా అదృష్టమేమంటే చేరిన కొన్ని నెలలలోనే యుద్ధంలో పని చేసే అవకాశం దొరికింది. పాకిస్తాన్ విమానాల బాంబులు, గన్స్ నుంచి తూటాలు, అన్నీ అనుభవించాను . మొదట్లో కొంచెం భయం వేసిన మాట నిజమే. కానీ త్వర లోనే అలవాటై పోయింది. 'నా పేరు రాసి ఉన్న బులెట్ వచ్చే వరకు నాకేం కాదు' అన్న ధైర్యం ఈ రొజు వరకు నన్ను నిర్భయం గా ఉంచుతోంది.
నాకంటే ధైర్యం, స్థైర్యం, నా శ్రీమతి ప్రేమ కుమారి లో జన్మ సిద్ధం గా ఉన్నాయి. తణుకులో పుట్టి పెరిగిన తెలుగు మహిళకి అవి ఎలా వచ్చాయో నాకు తెలియదు. యుధ్ధాలల్లో డేంజర్ అని తెలిసీ నన్ను ఎందుకు ఎంచుకుందో అది కూడా నాకు తెలీదు. లేకపోతే 'కన్యా వరయతే రూపం' అన్నట్లు నేను స్మార్ట్ గా కనిపించానని సరదా పడిందో,నా అదృష్టం అంతే. వివాహమైన రొజు నుంచి ఈరోజు వరకు నా కర్తవ్యాన్ని సపోర్ట్ చేస్తూ వస్తోంది.
సైన్యంలో మాకు సపోర్ట్ ఉండేది కానీ సోల్జర్ ఫామిలీస్ కి, ముఖ్యం గా భర్తలు బోర్డర్ లో ఉన్నప్పుడు ఒంటరి గా ఉండే మహిళలకి ఏ రకమైన సపోర్ట్ ఉండేది కాదు. పైగా మా రోజుల్లో ఇళ్లల్లో టెలీఫోన్స్ లేవు, మొబైల్ ఫోన్ అప్పటికి రాలేదు. ఒక చిన్న అనుభవం చెపుతాను.
1988 లో నేను కాశ్మీర్ లో, భార్యా పిల్లలూ హైద్రాబాద్ లో ఉన్నాం. మా అబ్బాయి కి ఏడేళ్లు, అమ్మాయికి ఐదేళ్లు. ఒక రోజున మా అమ్మాయి లాల్ బజార్ దగ్గర స్కూటర్ కింద పడింది. బాగా దెబ్బలు తగిలాయి. నాకు ఈ ఆక్సిడెంట్ గురించి తెలిపే సౌకర్యం లేదు. ఇన్లాండ్ లెటర్ రాస్తే అది మా యూనిట్ చేరడానికి 20 రోజులు పట్టింది. నేను యూనిట్ నుంచి 200 కి మీ దూరంలో ఒక పర్వతం పైన డ్యూటీ లో ఉన్న్నాను. సో, నాకు ఆ ఉత్తరం చేరడానికి ఇంకో 15 రోజులు పట్టింది. ఆ తరవాత లీవ్ దొరకలేదు. పాపని చూడడానికి 4 నెలల వరకు రాలేక పోయాను. ఈ రొజుకి కూడా అది గుర్తొస్తే బాధగా ఉంటుంది కానీ ఏం చేస్తాం?
ఇలాంటి అనుభవాలు ప్రతి సైనికుడికి తప్పవు. అయితే 32 సంవత్సరాలు సేవ, సాధించిన విజయాలు, చేసిన సేవా కార్యాలు తలుచుకుంటే నాకే కాదు, నా భార్య, పిల్లలు కూడా గర్వంగా ఫీల్ అవుతారు. సర్వీస్ లో దాదాపు 13 సంవత్సరాలు టెర్రరిస్టులని వేటాడుతూ గడిపాను. రిటైర్ అయిన రొజు గూడా ఒక టెర్రరిస్ట్ నా మీదికి ఫైర్ చేసాడు. ఆ బులెట్ మీద నా పేరు లేదు గనక నేను మీ ముందున్నాను. ఇంత సేవచేసే అవకాశం దొరకటం అదృష్టం కాదా?
ఇది నా అమృత మంథన యాత్ర. నా ముందు, నా తరవాత భారత సైన్యం సేవ నిరంతరం సాగుతుంది, అమృతం ఉద్భవిస్తూనే ఉంటుంది
నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను ( శ్రీ శ్రీ )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి