29, ఆగస్టు 2022, సోమవారం

హక్కులకు సైతం హద్దులు వుండాలి – భండారు శ్రీనివాసరావు

 

“పత్రికలు చదవను. టీవీ చూడను. ఇదే నా ఆరోగ్య రహస్యం” అన్నారు మాజీ ప్రధాని, కీర్తిశేషులు చరణ్ సింగ్.
భారత ప్రజాస్వామ్య సౌధానికి మూల స్తంభాలయిన వ్యవస్థల ప్రతినిధుల నిర్వాకాలు గమనిస్తుంటే చరణ్ సింగ్ మాటలు గుర్తుకొస్తున్నాయి.
“విద్యాసంస్థలు బంద్ అని టీవీల్లో స్క్రోలింగులు కనబడగానే మా అమ్మాయి బడికి వెళ్ళకుండా ఇంట్లో వుండిపోతుంది. యెంత చెప్పినా వినదు. ఇక స్కూళ్ళు కూడా అలాగే మూసేస్తున్నారు. ఇదంతా మీడియా సృష్టిస్తున్నభయాందోళనల వల్లే”.
ఈ మాటలు అన్నది సాక్షాత్తూ ఒకప్పటి ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ ఏకే ఖాన్ అంటే నమ్మశక్యం కాకపోవచ్చు కానీ ఇది నిజంగా నిజం.
అప్పుడు నగరంలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ ఆయన తన మనసులోని మాటలను బయట పెట్టారు. ఈ క్రమంలో ఇజ్రాయల్ దేశాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. “ఆ దేశంలో యెంత పెద్ద హింసాత్మక సంఘటన జరిగినా అక్కడి మీడియా ఆ విషయాన్ని లోపలి పేజీల్లో ప్రచురిస్తుంది. అభివృద్ధికి సంబంధించిన వార్తల్ని ప్రముఖంగా మొదటి పేజీల్లో వేస్తుంది. మన దగ్గర మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా జరుగుతోంది. స్తానికంగా పరిమితమయిన సంఘటనలను సార్వత్రికం చేసి వార్తలు ప్రచారం చేయడం వల్ల లేనిపోని అనర్ధాలు జరుగుతున్నాయి.”
ఇతరుల హక్కులకు భంగం కలగకుండా ఉద్యమాలను నిర్వహించుకోవాలని హితవు పలికారు.
“రోడ్ల మీద భైఠాయించి ఇతరుల హక్కులకు భంగం కలిగించే స్వేచ్చ ఆందోళనకారులకు ఎక్కడిద”ని నిలదీశారు.
ఖాన్ గారి ఈ భావజాలంతో ఏకీభవించాల్సిన అవసరం వుందని కాదు కానీ, ఈ అంశాన్ని గురించి ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమయిందని మాత్రం చెప్పవచ్చు.

‘చేతులు బార్లా జాపుకునే స్వేచ్చ ప్రతి ఒక్కరికీ వుంటుంది. అయితే ఆ చేతివేలి కొనభాగం పక్కవాడి ముక్కునో, కంటినో తాకనంత వరకే ఆ స్వేచ్చ’ అని ఓ ఆంగ్ల సామెత వుంది. అంటే స్వేచ్చకు సయితం హద్దులు వున్నాయని చెప్పడం ఈ నానుడి తాత్పర్యం.


మేధావులమని అనుకుంటున్నవాళ్ళు గమనించాల్సిన విషయం మరోటుంది. ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టులయిన వ్యవస్థలన్నీ ఈ ఏడుదశాబ్దాల పైచిలుకు కాలంలో చెదలు పట్టిపోయాయి. ఒకదానికి మరొకటి దన్నుగా వుండాల్సిన ఈ వ్యవస్థలన్నీ ఆధిపత్య పోరులో కూరుకుపోయి తమని తాము నిర్వీర్యం చేసుకుంటున్నాయి. మీడియాలో, పత్రికల్లో, రాజకీయుల ప్రకటనల్లో, న్యాయస్థానాల్లో , చట్టసభల్లో చోటుచేసుకుంటున్న వార్తలు, వ్యాఖ్యలు, విమర్శలు, ప్రతి విమర్శలు, వాదోపవాదాలు, నీలాపనిందలు ఈ అంశాన్నే స్పష్టం చేస్తున్నాయి.

ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే-
పరిపాలన పేరుతొ పార్టీలు, పారదర్శకత ముసుగులో ప్రచార వూడిగం చేస్తూ పత్రికలూ,
వ్యాపారకళలో ఆరితేరి బలవత్తర శక్తులుగా రూపాంతరం చెందాయి. పరస్పరాధీనంగా పెరుగుతూ వచ్చిన ఈ వ్యవస్థలు, కాలక్రమేణా ప్రత్యర్ధులపై పైచేయి కోసం కత్తులు దూస్తున్నాయి.
పత్రికలను, మీడియాను అడ్డంపెట్టుకుంటూ, సంస్థలకు, వ్యవస్థలకు నాయకులమని సాకుగా చూపుతూ ప్రభుత్వాలను లొంగదీసుకోవాలనుకుని చేసే ప్రయత్నాలవల్ల ప్రజాస్వామ్యానికి వాటిల్లే ముప్పు తక్కువేమీ కాదు.
తాము ప్రాతినిధ్యం వహించే సంస్థల వల్ల సంక్రమించే ప్రత్యేక హక్కుల పేరుతొ లేని హోదాలని అనుభవిస్తూ, తమ రాతలతో, చేతలతో, చేష్టలతో, రెచ్చగొట్టే మాటలతో, వ్యాఖ్యలతో, ప్రవర్తనతో సమాజానికి సంకటంగా తయారయిన వారు, వారు ఎవరయినా సరే, ఆ వ్యక్తి -
గ్రామస్థాయిలో చిన్న ఉద్యోగి కావచ్చు, బాధ్యత కలిగిన పెద్ద అధికారి కావచ్చు, ఏదయినా పార్టీ కార్యకర్త కావచ్చు, రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించే అధినేత కావచ్చు, పార్ట్ టైం విలేకరి కావచ్చు, ప్రధాన సంపాదకుడు కావచ్చు,
ఏ స్తాయిలో వున్నా, ఏ హోదాలో వున్నా సరే! ఖండనకు అర్హులే. విమర్శకు పాత్రులే!
ఏదో ఒక పేరుతొ, ఏదో ఒక సాకుతో అలాటివారిని కాపాడాలని అనుకోవడం, వెన్ను కాయాలని తలపోయడం కూర్చున్న కొమ్మని చేజేతులా నరుక్కోవడమే అవుతుంది.

(ఘాటుగా ఉందా! ఏమో అలా రాయాలని అనిపించింది)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

హమ్మయ్య మొదటి సారి గో.పి. వాటం లా లేకుండా వ్రాసారు గురువు గారు :)