5, ఏప్రిల్ 2020, ఆదివారం

పెద్ద గీత గీద్దాం రండి – భండారు శ్రీనివాసరావు



(Published in నమస్తే తెలంగాణ daily on 5th April, SUNDAY)
ఒక తరం వారు కనీవినీ ఎరుగని ఒక మహా విపత్తు నేటి తరం అనుభవంలోకి వస్తోంది. గతంలో మన పెద్దవాళ్ళు రెండో ప్రపంచ యుద్ధ కాలంనాటి పరిస్తితులను గురించి చెప్పడం పాత తరం వారికి గుర్తుండే వుంటుంది. అది ప్రపంచదేశాల మధ్య జరిగిన యుద్ధం. కానీ ఇప్పుడు జరుగుతున్నది ప్రపంచదేశాలన్నీ కలిసి ఉమ్మడిగా ఒక మహమ్మారి వైరస్ తో సాగిస్తున్న సమరం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించినట్టు ‘కనపడని శత్రువుతో ఎడతెగని యుద్ధం’ ఇది. ఏ యుద్ధంలోనైనా గెలుపోటములు వుంటాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో గెలిచి తీరాల్సిన అవసరం వుంది. ఎందుకంటే సమస్త మానవాళి మనుగడ ఈ విజయం మీదనే ఆధారపడి వుంది.
కాకలు తీరిన రాజకీయ విశ్లేషకులందరూ ఇంతకాలం మూడో ప్రపంచ యుద్ధం గురించే ముచ్చటిస్తూ వచ్చారు. వారు ఏనాడు కూడా ఇటువంటి ముప్పొకటి యావత్ ప్రపంచాన్ని ఉడ్డుగుడుచుకునేలా చేస్తుందని లేశమాత్రం కూడా ఊహించలేదు. ఏదేశం ఎన్ని మారణాయుధాలను కలిగివున్నది, ఏ అగ్రరాజ్యం వద్ద నిమేష కాలంలో శత్రు దేశాలను భస్మీపటలం చేసే అణ్వాయుధాలు పోగుపడి వున్నది లెక్కలు కట్టి చెప్పి మూడో ప్రపంచయుద్ధం అంటూ జరిగితే అందులో విజేతలు, పరాజితులు అంటూ ఎవ్వరూ మిగలరని, ఆ సంగ్రామంలో మొత్తం మానవ సమాజం తుడిచి పెట్టుకు పోవడం మినహా నిర్దిష్ట ఫలితం శూన్యమని హెచ్చరిస్తూ వచ్చారు.
సరే! ఈ సంగతులు ఇలా ఉంచుదాం.
ఈ ఉదయం మా పనిమనిషి మూతికి గుడ్డ కట్టుకుని పనులు చేయడానికి వచ్చింది. ఆవిడ మా వాచ్ మన్ భార్య. బయట నుంచి రావాల్సిన అవసరం లేదు. రాగానే సానిటైజర్ తో చేతులు కడుక్కుని పనులన్నీ పూర్తి చేసుకుని వెడుతోంది. మామూలు రోజుల్లో అయితే, పక్కనే వున్న మరో రెండు ప్లాట్లలో పనిచేస్తుంది. కరోనా లాక్ డౌన్ కారణంగా వెళ్ళడం లేదు. ‘రేణుకా! ఏదైనా డబ్బు ఇబ్బందిగా వుంటే చెప్పు’ అన్నాను, వెళ్లిపోయేటప్పుడు.
ఆవిడ చెప్పిన జవాబు నా కళ్ళు తెరిపించింది. ‘డబ్బుకు ఇబ్బంది ఉన్న మాట నిజమే కాని కష్టంగా లేదు’
ఇబ్బందులు వేరు, కష్టాలు వేరు అనే భగవద్గీత ఆమె నాకు బోధించింది.
చదువుకున్న వాళ్ళం, ఇంట్లో వొంట్లో కాస్త వున్నవాళ్ళం ఈ వారం పది రోజులకే నానా హైరానా పడిపోయి ఎందుకు పరిస్తితుల్ని తిట్టుకుంటూ కూర్చున్నాం. అంతే కాదు ఈ కష్టాలకు ఎవరినో బాధ్యులను చేసి వాళ్ళ చేతకానితనం వల్లనే దేశం ఇన్ని ఇబ్బందుల్లో చిక్కుకుపోయిందని హాయిగా తీరి కూర్చుని ఫేసుబుక్కుల్లో పోస్టులు పెడుతున్నాం. నిజానికి మనం ఇబ్బందులు అనుకునేవి ఇబ్బందులేనా!
రోజూ ఆర్డరు వేసి తెప్పించుకునే పిజ్జాలు దొరక్క పోవడం, పనివున్నా లేకపోయినా బైకో, కారో వేసుకుని నాలుగు బజార్లు చక్కర్లు కొట్టిరావడానికి వీలులేకపోవడం, చేతి సంచీ పట్టుకుని మార్కెట్టుకు వెళ్లి గీసి గీసి బేరాలు చేసి కూరలు కొనుక్కువచ్చే అవకాశం లేకపోవడం, పెద్ద పెద్ద మాల్సుకు వెళ్లి, కలయతిరుగుతూ అవసరమైనవీ లేనివీ సమస్తాన్ని ట్రాలీల్లో నింపుకుంటూ షాపింగ్ చేసే వీలు లేకపోవడం, అర్ధరాత్రి దాకా బార్లలో, పబ్బుల్లో గడుపుతూ డ్రంకెన్ డ్రైవింగ్ లో పట్టుపడి పోలీసులతో యాగీపడుతూ, టీవీల్లో కనబడే సందర్భాలు కోల్పోవడం ఇవేనా మనం అనుకునే ఇబ్బందులు, కష్టాలు. నిజానికి ఇవన్నీ చిన్న గీతలు.
పగలూ రాత్రీ ఇళ్ళల్లోనే వుండి, కాలుమీద కాలువేసుకుని టీవీలు చూస్తూ కరోనాపై సాగిస్తున్న యుద్ధంలో వైద్య సిబ్బంది, పోలీసులు పడే కష్టాలను చూస్తూ మన తలలో దూరిన ప్రతి ఐడియాను సలహాల రూపంలో సాంఘిక మాధ్యమాల్లో గుప్పించడం, వాటికి లైకులు తగినన్ని రాలేదనో, లేదా వాటిని ఖండిస్తూ కామెంట్లు వచ్చాయనో జుట్టు పీక్కుంటూ కూర్చోవడం ఇవేనా మనం పడే కష్టాలు, ఇబ్బందులు. నిజానికి ఇవన్నీ చాలా చిన్న గీతలు.
మనం ఇలా ఇళ్ళల్లో వున్నామంటే ఎవరో మనకోసం వీధుల్లో మండుటెండలో నానా కష్టాలు పడుతున్నారని అర్ధం చేసుకోవాలి. రోజు మొత్తంలో ఎప్పుడో ఒకసారి కాసేపు కరెంటు పొతే, అసలే ఎండాకాలం, కరెంటు లేకపోతే ఎల్లాగా, ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అని విమర్శలు చేసే నైతిక హక్కు మనలో ఎవరికైనా ఉందా!
తగినన్ని సంఖ్యలో క్వారంటైన్ కేంద్రాలు లేవు, మాస్కుల ఉత్పత్తి సరిపోను లేదు అంటూ సన్నాయినొక్కులు నొక్కుతూ కాలక్షేపాలు చేయడం బాధ్యత అనిపించుకుంటుందా!
ఇంటికి నిప్పు అంటుకుంటుంది. అప్పుడు తక్షణం చేయాల్సిన పని ఏమిటి? ఆ మంటల్ని ఆర్పడం లేదా అవి పక్క ఇళ్ళకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవడం. అంతే కాని, అగ్ని ప్రమాదాలు జరగకుండా ఆ ఇంట్లో తగినన్ని ముందు జాగ్రత్తలు తీసుకోలేదని, అందుకే ఈ ప్రమాదం సంభవించిందని నోళ్ళు పారేసుకోవడం వల్ల ఉపయోగమేమిటి? ముందు నష్ట నివారణ చర్యలు తీసుకుని, ప్రాణ నష్టం నివారించి ఆ పిదప తీరిగ్గా ఈ విషయాలు చర్చించి బాధ్యులను నిర్ధారించి శిక్షలో జరిమానాలో వేయిస్తే ఆక్షేపించేవారు ఎవరుంటారు? నిజానికి ప్రభుత్వాలు చేస్తున్నది అదే! ఆ ప్రయత్నాలను ఆక్షేపించడం వల్ల ఉపయోగం ఏమిటి?
ఈ లాక్ డౌన్ వల్ల సమాజంలో కష్టపడేవాళ్ళు, ఇబ్బందులు పడేవాళ్ళు వేరే వున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, రోజు కూలీ చేసుకుని జీవనం గడిపే వాళ్ళు, రెక్కాడితేకాని డొక్కాడనివాళ్ళు ఎందరో వున్నారు. వాళ్ళ సంఖ్య ఎక్కువ కూడా. కానీ వాళ్ళని గురించి మాట్లాడేవాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటోంది. ఎంతసేపూ ఇఎంఐలు, వాయిదాలు, వడ్డీ గొడవలు ఇవే రోజువారీ చర్చల్లో కనబడుతున్నాయి. వీటిని తక్కువ చేసి చెబుతున్నానని అనుకోవద్దు. కానీ ఇవి ఇబ్బందులు మాత్రమే, కష్టాలు కాదు.
మా పనిమనిషి మాటలతో నాకు జ్ఞానోదయం అయిందని అనుకుంటున్నాను. నేను వెంటనే నా గీత పక్కనే పెద్ద గీత గీసుకున్నాను. దాంతో నాది చిన్న గీత అయింది. మనసు తేలికపడింది.
అందరం పెద్ద గీత గీసుకుందాం రండి! కష్టాలు అనుకున్నవి ఇబ్బందులుగా మారతాయి. మనసు తేలికపడ్డకొద్దీ ఇబ్బందులు కూడా దూదిపింజల్లా ఎగిరిపోతాయి.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

nijam chepperu. we have to see the truth through all the unnecessary noise.