13, ఫిబ్రవరి 2019, బుధవారం

దక్షిణాన రేడియో: తెలుగువాడి ఘనత భండారు శ్రీనివాసరావు



(ఫిబ్రవరి  13 ప్రపంచ రేడియో దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం. సంపాదకులకు కృతజ్ఞతలు)

దక్షిణ భారత దేశంలో రేడియో ప్రసారాలు ప్రారంభం కావడానికి కారకులు ఓ
తెలుగు వ్యక్తి అంటే ఒక పట్టాన నమ్మడం కష్టమే. తెలుగువారయిన రావు బహదూర్
సీ వీ కృష్ణ స్వామి సెట్టి,   మద్రాసులోనూ, మాంచెస్టర్ లోను విద్యాభ్యాసం
చేసి  1914 లో మద్రాసు నగర పాలక సంస్థలో ఎలక్త్రికల్ ఇంజినీర్ గా చేరారు.
ఆ నగర వీధులలో మొదటిసారి విద్యుత్ దీపాలు ఏర్పాటుచేసిన ఘనత కూడా వారిదే.
1910
లో విమాన ప్రయాణం చేసిన తొలి భారతీయులలో ఆయన కూడా ఒకరు. 1924లో
మద్రాసు రేడియో క్లబ్ ద్వారా ఆయన రేడియో ప్రసారాలు మొదలుపెట్టారు. ఈ
రేడియో క్లబ్ లో పుర ప్రముఖులు ఎందరో సభ్యులుగా వున్నప్పటికీ, ఆ సంస్థ
కార్యదర్శిగా వున్న కృష్ణ స్వామి సెట్టి పాత్ర ప్రధానమైనది. రేడియో క్లబ్
నెలకొల్పాలని ప్రతిపాదించి, ఆ క్లబ్ ద్వారా ప్రసారాలు జరగడానికి ఆయన ఎంతో
కృషి చేశారు.  1924 మే 16 న ఏర్పడిన ఈ మద్రాసు ప్రెసిడెన్సీ రేడియో
క్లబ్, 1924 జులై  31 నాడు ప్రసారాలు మొదలు పెట్టింది. అయితే ఆ
ప్రసారాలలో సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యం వుండేది.1927 అక్టోబర్ లో
మద్రాసు ప్రెసిడెన్సీ రేడియో క్లబ్ మూతపడింది. కానీకృష్ణ స్వామి
సెట్టి గారి పూనికతో 1930 ఏప్రిల్ 1 వ తేదీ నుంచి మద్రాసు నగర పాలక సంస్థ
రేడియో ప్రసారాలు ప్రారంభించింది. కాని  ఆ ప్రసారాలు కూడా  పరిమితమైనవే.
ఈ ప్రసారాలలో తెలుగు పాటలు విన్పించినా తెలుగు నాటకాలు వంటివి ప్రసారం
అయిన ఆధారాలు  లేవు. పోలీసువారి ప్రకటనలు, ఆరోగ్య విశేషాలు కొన్ని
ప్రసారం చేసేవారు. బడి పిల్లలకోసం  కొన్ని కార్యక్రమాలు వినిపించేవారు. ఈ
ప్రసారాలు  చిత్తూరు, వేంకటగిరి మొదలయిన  చోట్ల వినిపించేవి. వాతావరణం
అనుకూలించినప్పుడు బంగాళాఖాతం తీరం వెంబడి వున్న వూళ్ళల్లో విశాఖపట్నం
దాకా వినిపించేవని అప్పటి వార్తల వల్ల తెలుస్తున్నది.

1923
లో మహబూబ్ ఆలీ అనే తపాలాశాఖ ఉద్యోగి హైదరాబాదులో చిరాగ్ ఆలీ సందులో
200
వాట్ల శక్తి కలిగిన రేడియో కేంద్రం నెలకొల్పాడు. 1935 ఫిబ్రవరి 3
నుంచి అది నిజాం అధీనంలోకి వచ్చింది. ఆ రేడియో కేంద్రంలో ప్రసార భాష
ఉర్దూ. ప్రసార శక్తి చాలా తక్కువ కావడం వల్ల ప్రసారాలు చాలా  పరిమితమైన
దూరాలకే వినిపించేవి.

1939
జులైలో అయిదు కిలోవాట్ల శక్తి కలిగిన రేడియో రిలే  కేంద్రాన్ని
 
సరూర్ నగర్ ఓ ఏర్పాటు చేసి డెక్కన్ రేడియో పేరిట ప్రసారాలు
మొదలు పెట్టారు. ఉర్దూతో పాటు తెలుగు, కన్నడ, మరాఠీ భాషల్లో ప్రసారాలు
చేసేవారు.  అయితే ఉర్దూతో పోలిస్తే తక్కిన భాషల ప్రసారాలు పరిమితంగా
వుండేవి. మొహర్రం మాసంలో ప్రసారాలు వుండేవి కావట. కొన్నాళ్ళకు స్టూడియోను
సరూర్ నగర్ నుంచి నగరంలోని ఖైరతాబాదులోవున్న యావర్ మంజిల్ కు మార్చారు.
రిలే స్టేషన్  మాత్రం సరూర్ నగర్ లో వుండేది. తెలుగులో
ప్రసారాలు మొదట తక్కువ వ్యవధిలో ఇచ్చేవాళ్ళు. కాలక్రమేణా రోజుకు గంట సేపు
ప్రసారాలు చేసేవారు. ఈ కేంద్రం ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర దాకా,
సాయంకాలం అయిదున్నర నుంచి రాత్రి పదిన్నర దాకా ప్రసారాలు చేసేది.
హిందూస్తానీ సంగీతానికి ప్రాధాన్యం ఇచ్చేవారు.  చాలా ఏళ్ళ తరువాత కర్నాటక
సంగీతానికి కొంత సమయం కేటాయించసాగారు. ముస్లిం వనితలకోసం పరదా పధ్ధతి,
వారికోసం విడిగా వాకిలి ఏర్పాటుచేశారు. వసీంఖాన్ అనే ఆయన  తెలుగు
కార్యక్రమాల అధికారిగా పనిచేశారు. రాయప్రోలు రాజశేఖర్ సహాయ దర్శకులుగా,
భాస్కరభట్ల కృష్ణారావు, దుర్గా చలం కార్యక్రమ నిర్వాహకులుగా పనిచేసేవారు.
కురుగంటి సీతారామయ్య, మహారధి సంభాషణలు, వార్తలు వంటివి రాసేవారు. కే.ఎల్.
నరసింహారావు గ్రామీణ కార్యక్రమాలు నిర్వహించేవారు. లలిత, వెంకటేశ్వర్లు
అనేవాళ్ళు  వార్తలు చదివేవాళ్ళు. మల్లి  పాటలు, ఎల్లి పాటలు మొదలయిన
శీర్షికలతో జానపద గీతాలు ప్రసారం అయ్యేవి.

1938
జూన్  16 నాడు మద్రాసు రేడియో అప్పటి మద్రాసు గవర్నర్ ఎర్స్కిన్ ప్రభువు
రాష్ట్ర ప్రధానమంత్రి  (ఇప్పటి మాటల్లో చెప్పాలంటే ముఖ్యమంత్రి)
చక్రవర్తుల రాజగోపాలాచారి ప్రారంభించారు. అప్పటికే ఆల్ ఇండియా రేడియో అనే
పేరుతొ ప్రభుత్వ వ్యవస్థలో ఏర్పాటుచేసిన ఆ సంస్థను వ్యవహరిస్తూ
వస్తున్నప్పటికీరాజాజీ మాత్రం ఆంగ్లంలో చేసిన తన  ప్రారంభోపన్యాసంలో
హిందూస్తాన్ ఆకాశవాణిఅనే ప్రస్తావించారు.

ఆ కేంద్రం ఆ సాయంకాలం ఐదున్నరకు సౌరాష్ట్ర రాగంలో శ్రీ త్యాగరాజ స్వామి
వారు రచించిన శ్రీ గణపతిని సేవింప రారేఅనే తెలుగు కృతిని తిరువెణ్
కాడు సుబ్రహ్మణ్య పిళ్ళై అనే విద్వాంసులు నాదస్వరంపై వాయిస్తుండగా
మొదలయింది. రాజాజీ ప్రారంభోపన్యాసం తరువాత సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్
గాత్ర కచేరీ, తిరిగి సుబ్రహ్మణ్యపిళ్ళై గారి నాదస్వర సభ ప్రసారం అయ్యాయి.
ఆ వెంటనే రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు భారత దేశము -  రేడియో
అనే విషయం గురించిసర్ కూర్మా వెంకట రెడ్డి నాయుడు తెలుగులో
ప్రసంగించారు. (జస్టిస్ పార్టీ నాయకులలో ఒకరయిన నాయుడు గారు 1939 ఏప్రిల్
ఒకటి నుంచి 14 దాకా ఉమ్మడి మద్రాసు ప్రధానిగా పనిచేశారు) మద్రాసు రేడియో
కేంద్రం నుంచి తొలి ప్రసంగం చేసిన ఖ్యాతి కూడా ఆయన ఖాతాలో చేరింది. ఆయన
అప్పుడు చేసిన ప్రసంగం లోని మొదటి వాక్యాలు నేనిప్పుడు చెన్నపట్నం
నుంచి మాట్లాడుచున్నాను. మీరెక్కడ నుంచి వినుచున్నారో చెప్పజాలను. కానీ
అనేక స్థలములయందు వుండి వినుచున్నారని తలచుచున్నాను. నేనీ రోజున
చెప్పవలసినది ఏమనగా ఆకాశవాణి యొక్క ఉపయోగములే. దీన్నే ఇంగ్లీష్ లో రేడియో
అనెదరు.

రేడియోకు తెలుగు పర్యాయ పదంగా ఆకాశవాణి’ అనే పదాన్ని  వాడిన సర్ కూర్మా వెంకట రెడ్డి
నాయుడు గారు తమ ప్రసంగం ముగింపులో చెప్పిన అంశాలు నేటికీ ప్రసార సాధనాలకు
వర్తిస్తాయి. ఆయన ఇలా చెప్పారు.యెంత మంచి వస్తువయిననూ మంచిదే కాక
చెడునకు కూడా ఉపయోగింపనగును. కొన్ని దేశములందు వివిధ రాజకీయ పక్షములవారు
తమ పక్షముల గొప్ప చెప్పుకొనుటకు, వైరులను (విపక్షాలను) తక్కువచేసి
చెప్పుకొనుటకు ఉపయోగింతురు. ప్రస్తుతము మన దేశము నందు అన్నింటికంటే
విద్యావ్యాప్తి చాలా ముఖ్యము. కనుక, ఆకాశ వాణిని సర్వజనోపయోగకరమైన
విషయములందును, ఆనందము కలుగచేయు పనుల యందును స్వచ్ఛ మనసుతో ఉపయోగింపవలెనని
నా హెచ్చరిక


(
సమాచార సేకరణలో అమూల్య సహకారం అందించిన ఆకాశవాణి పూర్వ సంచాలకులు
డాక్టర్ పీ ఎస్ గోపాలకృష్ణ, శ్రీ వీవీ శాస్త్రి గార్లకు కైమోడ్పులు)
Tur

10 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

// “దక్షిణ భారత దేశంలో రేడియో ప్రసారాలు ప్రారంభం కావడానికి కారకులు ఓ తెలుగు వ్యక్తి అంటే ఒక పట్టాన నమ్మడం కష్టమే.” //

ఎందుకండి కష్టం? తెలుగువారి సామర్థ్యం మీద నాకు గట్టి నమ్మకం, కాబట్టి నాకేమీ ఆశ్చర్యం లేదు.

దక్షిణాదిన రేడియో సుదీర్ఘ ప్రయాణం గురించి బాగా వివరించారు. ఒకప్పటి వైభవం. ఇప్పుడు రేడియో అంటే అంతా FM గోలే కదా.

sarma చెప్పారు...

The major difference between AM and FM is the noise. AM is noise prone and FM is noise free.

sistla చెప్పారు...

ఆయన తెలుగు వాడు కాదు. ఆంధ్రుడు.

Jai Gottimukkala చెప్పారు...

ఎవరు స్థాపించారో తెలీదు కానీ హైదరాబాదు సంస్థానంలో తొలి రేడియో స్టేషన్ 1919లో (not 1923) నెలకొల్పారు.

1923 & 1924 రెండిట్లో ఏది ముందు? మీ వ్యాసంలో ఈ విషయంలో గందరగోళం ఉన్నట్టుంది.

"1923లో మహబూబ్ ఆలీ అనే తపాలాశాఖ ఉద్యోగి హైదరాబాదులో చిరాగ్ ఆలీ సందులో 200 వాట్ల శక్తి కలిగిన రేడియో కేంద్రం నెలకొల్పాడు"

"1924 మే 16 న ఏర్పడిన ఈ మద్రాసు ప్రెసిడెన్సీ రేడియో క్లబ్, 1924 జులై 31 నాడు ప్రసారాలు మొదలు పెట్టింది"

విన్నకోట నరసింహా రావు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Jai Gottimukkala :రెండు సందర్భాల లోను నేను పలానాది 'ముందు' అని రాయలేదు. గమనించగలరు.

Jai Gottimukkala చెప్పారు...

@Bhandaru Srinivasrao:

"పలానాది 'ముందు' అని రాయలేదు"

నిజమే "ముందు" అనలేదు కానీ "ప్రారంభం" అనే పదం వాడారు కదా. మీరు రాసిన తేదీల ప్రకారం (అవి కరెక్ట్ అయితే సుమా) దక్షిణాదిలో రేడియో ప్రారంభం అయి అప్పటికే ఏడాది దాటింది.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

శర్మ గారు, థాంక్స్. నా వ్యాఖ్యలో నేను సరిగా చెప్పలేకపోయానేమో? నేను FM గోల అన్నది frequency గురించి, సౌండ్ క్వాలిటీ గురించి కాదు. Radio Mirchi ఇది చాలా హాట్ గురూ ... వంటి ప్రైవేట్ FM స్టేషన్ల ప్రోగ్రాముల గురించి 🙏.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

తెలుగువాడికి, ఆంధ్రుడికీ తేడా ఏమిటి sistla వారూ? 🤔

సూర్య చెప్పారు...

స్పైస్FM ఇది పక్కా లోకల్.