జర్నలిస్టులు, ఫోను కనెక్షన్లు గురించి
హిందూ సాయి శేఖర్ (హిందూ పేపర్ ఒదిలేసినా నేను అలానే పిలుస్తాను) అద్భుతమైన,
ఆసక్తికరమైన సొంత అనుభవం ఒకటి పోస్ట్ చేశారు. దుర్వినియోగం అంటారో, వినియోగం
అంటారో తెలియదు కానీ ప్రతి పాత్రికేయుడూ
ఎప్పుడో ఒకసారి కొన్ని పనులు ఇలాంటివి (రైలు టిక్కెట్లు, విమానం టిక్కెట్లు చివరి
క్షణంలో కన్ఫర్మ్ చేయించడం వగయిరా) వృత్తిరీత్యా చేయక తప్పదు. బహుశా ఈ విషయంలో నాది ఒక రికార్డు
అని చెప్పుకోవడానికి వీలైన అనుభవాలు బోలెడు బొచ్చెడు వున్నాయి.
ముందు టెలిఫోన్ సంగతి. రేడియోలో
చేరినప్పుడు మా ఇంట్లో ఫోను వుండేది కాదు. వార్త ఇవ్వాలంటే మేముంటున్న చిక్కడపల్లి
త్యాగరాయ గానసభ దగ్గర నుంచి ఆర్టీసీ
క్రాస్ రోడ్డులో ఉన్న టెలిఫోన్ (తంతి కార్యాలయం అనాలేమో) ఆఫీసుకో, లేదా అశోక్ నగర్
లో ఉన్న జ్వాలా ఇంటికో వెళ్ళాలి. (ఆయనకీ ఈ సౌకర్యం లేదు కాని వాళ్ళ బావగారి (మా
మేనల్లుడు డాక్టర్ రంగారావు) ఫోను అక్కడ వుండేది.
కొన్నాళ్ళు అలా గడిచిన తరువాత ఫోను
కావాలనే విషయం అప్పటి జనరల్ మేనేజర్ తో (అప్పట్లో హోల్ మొత్తం ఇరవై మూడు జిల్లాలకు ఆయనే
సర్వాధికారి) దృష్టికి తీసుకువెడితే ఆయన మారుమాట్లాడకుండా ఒకే ఒక్క రోజులో మా
ఇంట్లో ఫోను పెట్టించారు. ఏరియా సబ్ డివిజినల్ మేనేజర్ స్వయంగా వచ్చి ఫస్ట్ కాల్
కనెక్ట్ చేసి మాట్లాడారు. ముందు నేను కోరుకున్న నెంబర్ 65758 ఇచ్చారు. మొదటి బిల్లు కూడా
కట్టక మునుపే ఆ నెంబరు మీద మొహం మొత్తింది. 66066 కావాలంటే మళ్ళీ దానికి మార్చారు. టెలిఫోన్ డైరెక్టరీలో బోల్డ్
అక్షరాల్లో నా పేరు వేసేవారు. మేము మాస్కో వెళ్ళేంతవరకు అదే నెంబరు. అయిదేళ్ళ
తర్వాత తిరిగొచ్చాను. మా అన్నయ్య ఇంట్లో ఉంటూ అద్దె ఇంటికోసం వెతుకులాట మొదలు
పెట్టాము. ఎందుకో ఓ రోజు బేగం పేట ఎయిర్ పోర్టుకి వెడితే అక్కడ కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ రంగయ్య
నాయుడు (ఇప్పుడు లేరు) కలిసారు. ఎన్నాళ్ళయింది మాస్కో నుంచి వచ్చి అని అడిగారు.
ఇంటి కోసం చూస్తున్నాను అని చెప్పాను. మర్నాడు మధ్యాన్నం రేడియోకి వెళ్ళే సరికి
ఇద్దరు ముగ్గురు టెలిఫోన్ డిపార్ట్ మెంటు వాళ్ళు కనిపించారు. ‘మీకు ఫోన్ శాంక్షన్
చేస్తూ రాత్రి ఢిల్లీ నుంచి టెలెక్స్ మెసేజ్ వచ్చింది. ఈ ఫారం పూర్తి చేసి, అడ్రసు
వివరాలు ఇవ్వండి’ అన్నారు. ‘ఇల్లే ఇంకా దొరకలేదు ఫోను ఎక్కడ పెట్టుకోను’ అంటే
వాళ్ళు ఆశ్చర్యపోయారు. సరే ఇల్లు దొరికిన తర్వాత చెప్పండని వెళ్ళిపోయారు.
పంజాగుట్ట దుర్గానగర్ కాలనీలో ఇల్లు తీసుకుని పాలు పొంగించక ముందే ఫోను, లాంగ్
కార్డుతో సహా ప్రత్యక్షం అయ్యారు. అప్పుడు మళ్ళీ నెంబరు సమస్య. నేను అడిగిన 22011 ఇచ్చారు. ఇస్తూనే చెప్పారు. ఇలా వరస నెంబర్లతో కొంత ఇబ్బంది పడతారు
జాగ్రత్త అని. అయినా నేను వినలేదు. మర్నాటి నుంచి రాంగ్ కాల్స్. పలానా వారు
వున్నారా అంటే పరవాలేదు. “హిందూ స్మశానమా! రాత్రి మా బంధువు చనిపోయారు, దహనం
చెయ్యాలి’ అని ఒకరు, “పోలీసు కంట్రోల్ రూమా” అని మరొకరు, “గ్యాస్ బుకింగా” అని
ఇంకొకరు ... ఇలా కాల్స్ వచ్చేవి.
అయినా సాయి శేఖర్ చెప్పినట్టు ఫోను ఆ
రోజుల్లో ఒక అపురూపమైన వస్తువు. ఇంట్లో ఫోను మోగుతుంటే అదో దర్జా! అదో వైభోగం!
3 కామెంట్‌లు:
పెళ్ళికి ఒక రెండ్రోజుల ముందు ఫోనులో సంబాషణ (1997 - ఇంకా సెల్ ఫోన్ లు రాలేదు ఇండియాలో)
"బాగా రేపు నాలుగో తారీఖున మా చిన్న అబ్బాయి పెళ్ళి, ఇలా అనుకోకుండా వెంఠనే కుదిరిపోయింది. నువ్వు అక్కనీ పిల్లల్నీ తీసుకుని తప్పకుండా రావాలి"
"ఇది లారీ సప్లై ఆఫీసండి."
"బాగా" అన్నది "బావా" అని చదువుకోండి.
(బహుశా ఈ విషయంలో నాది ఒక రికార్డు అని చెప్పుకోవడానికి వీలైన అనుభవాలు బోలెడు బొచ్చెడు వున్నాయి.) అని చెప్పి తీరా చెప్పినవి ఒకటో రెండో శాంపిల్స్. అవికూడా "ఇదీ ఒక దుర్వినియోగమేనా" అని అనిపించేలా ఉన్నాయి.
ఇంతకంటే ఘనకార్యాలు ఉన్నా నిజాలని తొక్కిపడేయ్యటం లో మీడియా వ్యక్తులు మహా ఘనులు!!
కామెంట్‌ను పోస్ట్ చేయండి