ఒక కేసు విషయంలో కోల్ కతా పోలీసు
కమీషనర్ ను విచారించడానికి సీబీఐ అధికారుల బృందం వెళ్ళింది. స్థానిక పోలీసులు
వారిని అడ్డుకున్నారు. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హుటాహుటిన అక్కడికి
వెళ్ళారు. ప్రధానమంత్రి మోడీ, సీబీఐని అడ్డుపెట్టుకుని తమ ప్రభుత్వంలో పనిచేసే
అధికారులను వేధిస్తున్నారని ధర్నాకు దిగారు. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు
రాహుల్ గాంధి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయుడుతో సహా
దేశవ్యాప్తంగా అనేకమంది బీజేపీ వ్యతిరేకులు కోల్ కతా దీదీకి సంఘీభావం తెలిపారు.
ఓ పదేళ్ళు వెనక్కి వెడదాం.
2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి అప్పటి
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించినప్పుడు
అహమ్మదాబాదులో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న మోడీ
ఏమన్నారో చూడండి.
‘సీబీఐ అంటే ఏమిటో తెలుసునా !
కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ సీబీఐ తమ ఢిల్లీ బాసులను మెప్పించడం కోసం
మా ప్రభుత్వాన్ని వేధిస్తున్నారు. మా మంత్రులను, అధికారులను టార్గెట్
చేస్తున్నారు. అయితే ఈ అధికారులు ఒక విషయం మరచిపోవద్దు. ఏదో ఒకరోజున మీరు జవాబు
చెప్పుకోవాల్సివస్తుంది సుమా!’
మళ్ళీ ఓసారి ఆరేళ్ళు వెనక్కి వెడదాం!
2013. సుప్రీం కోర్టు. కోర్టు హాలు
సూదిపడితే వినబడేంత నిశ్శబ్దంగా వుంది.
జస్టిస్ ఆర్. ఎం. లోధా గొంతు పెంచి తీవ్ర స్వరంతో అన్నారు.
‘సీబీఐ. ప్రభుత్వ పంజరంలోని చిలుక’
కోర్టు హాలులో వున్నవాళ్ళందరూ నివ్వెర
పోయారు న్యాయమూర్తి చేసిన ఈ బహిరంగ వ్యాఖ్యతో.
అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రైవేట్
కంపెనీలకు బొగ్గు కేటాయింపులలో జరిగిన అవకతవకలను కప్పిపుచ్చుకోవడానికి సీబీఐని ఓ పావులా వాడుకుంటోందని విపక్షాలు
చేస్తున్న ఆరోపణలకు, సుప్రీం న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్యతో మంచి ఊతం చిక్కినట్టయింది. ‘కోల్ గేట్’ కుంభకోణంగా
మీడియా దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన
సంగతి తెలిసిందే.
రెండేళ్ళ క్రితం సీబీఐ గురించి
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి ఏమన్నారో చూద్దాం.
ఉత్తర ప్రదేశ్ లోని సిధౌలిలో ఒక బహిరంగ
సభలో మాట్లాడుతూ ఇలా చెప్పారు. ‘సమాజ్ వాది, బిఎస్ పిలను అదుపు చేయడానికి, తన
గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్ద ఒక తాళం చెవి వుంది.
దాని పేరే సీబీఐ’.
1 కామెంట్:
ఈలెక్కన cbi ని మూసేయ్యమని ప్రజాఉద్యమం చేయాల్సిన అవసరం ఉందేమో!
కామెంట్‌ను పోస్ట్ చేయండి