27, ఫిబ్రవరి 2019, బుధవారం

ఆ తరానికి మరో తరానికి నడుమ...... భండారు శ్రీనివాసరావు


యాభయ్ ఏళ్ళ క్రితం...
నాకు చదువు మీద శ్రద్ధ తగ్గిపోతోందని గ్రహించిన మా పెద్దన్నయ్య పర్వతాలరావుగారు, నాకా విషయం గ్రహింపుకి రావడానికి తనదయిన పద్దతి ఎన్నుకున్నాడు. అతి సామాన్యమైన చదువు మాత్రమే చదువుకున్న మా వదినెగారి చేత వైద్య విద్వాన్ ఆయుర్వేద పరీక్షకు కట్టించి ఫస్టున పాసయ్యేలా చేసి ‘శ్రద్ధ వుంటే చాలు లక్ష్యం సాధించడానికి ఆట్టే కష్టపడనక్కరలేద’ని నాకు పరోక్షంగా చెప్పాడు. ఆయన పద్దతి ఆయనకుంటే ఆయన తమ్ముడిని  నా పద్దతి నాకూ వుంటుంది. అంచేత అవేవీ చెవికి ఎక్కించుకోకుండా నా చదువును అధ్వాన్నపు బాటలోనే సాగించాను, ‘ఏమి చదివి పక్షులు పైకెగురగలిగెను’ అనే పాట పాడుకుంటూ.
ఫలితం డెబ్బయ్యేళ్లకు ఇదిగో ఇలా మిగిలాను. నో రిగ్రెట్స్! ఇపుడు చింతించి వగచిన ఏమి ఫలము?
మా రెండోవాడు నా బాటే పట్టాడు. అంటే నా తోవన నడిచాడు అని కాదు. తనకు తోచిన విధంగా తానూ నడిచాడు అని చెప్పడం. పుష్కరం క్రితమే నెలకు లక్ష రూపాయల జీతం ఇచ్చే ఉద్యోగం వదిలిపెట్టి యేవో ‘యాప్’ లు తయారు చేసే సొంత ఉపాధి ఎంచుకుని కుస్తీ పడుతున్నాడు. ఇంకా ఒక కొలిక్కి రాకపోయినా వస్తుందనే ఆశ వాడిది. నీతులు చెప్పగలిగే గతం నాకు లేదు కాబట్టి సహజంగానే సరిపెట్టుకున్నాను.
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే....
మా అన్నయ్య కష్టజీవి. తాను కష్టపడ్డాడు. ఇంట్లోవాళ్ళని మరీ సుఖాల పల్లకీలో ఊరేగించక పోయినా కష్టాల పాలు చేయలేదు.
ఇక నా తరం. నేను కష్టపడలేదు, అలా అని మరీ సుఖపడ్డదీలేదు. మా ఇంట్లోవాళ్ళని మరీ కష్టపెట్టలేదు. అలా అని బాగా సుఖపెట్టిందీ లేదు. సో సో.... అందుకే మరోసారి, నో రిగ్రెట్స్.
ఇక మా వాడిది, మరీ కష్టపడకుండా బాగా సుఖపడాలని, తమ వారిని మరింత  సుఖపెట్టాలని  కోరుకునే తరం.
ముందే చెప్పాకదా!    
మా వాడిది కూడా నా టైపే అని. బంగారం లాంటి ఉద్యోగం వదులుకుని సొంత కాళ్ళపై నిలబడే ప్రయత్నాలు చేయడం గురించి  నాతోసహా ఇంట్లో బయటా జనాలు  గొణుక్కోవడం గమనించినట్టున్నాడు.  నిన్న తనకు వచ్చిన ఓ మెయిల్ ని నాకు ఫార్వార్డ్ చేసాడు. బెంగళూరులోని DEL (EMC) వాళ్ళు పంపిన ఆఫర్ లెటర్ అది. కాంపెంసేషన్ బ్రహ్మాండంగా వుంది.
ఎప్పుడు చేరాలి అంటే ఎందుకు చేరాలి అనే విధంగా జవాబు. ఈ పోటీ యుగంలో  ఇంటర్వ్యూలకు వెడితే ఉద్యోగం  వస్తుందా రాదా అనే సందేహాలు ఉన్నవాళ్ళ అనుమానాలు తీర్చడానికి ఒక టెస్ట్ కింద ఈ ప్రయత్నం చేశానని వివరణ.
మా ఆవిడకు మాత్రం వాడు ఉద్యోగంలో చేరతాడనే నమ్మకం. చూడాలి ఏం జరుగుతుందో.
ఏం జరిగినా, అసలు ఏం జరగకున్నా నో రిగ్రెట్స్! ఎందుకంటే కష్టపడకుండా, పెద్ద ఆశలు లేకుండా  బతుకు బండి నడిపే జీవితం నాది.    

కామెంట్‌లు లేవు: