13, అక్టోబర్ 2018, శనివారం

ఐటీ ముఖ్యమంత్రికి ఐటీ తలపోటు – భండారు శ్రీనివాసరావు



ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) అనగానే గుర్తొచ్చే రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు.  అదే ఇప్పుడు మరో రూపంలో (ఐటీ)  ఆయనకు ఓ తలనొప్పిగా తయారయింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) చేస్తున్న దాడులు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. గత మార్చి మాసంలో కేంద్రంలోని ఎన్డీయే కూటమి నుంచి తెలుగు దేశం పార్టీ వైదొలగిన తర్వాత ఇలాంటి పరిణామాలు తప్పకుండా  చోటుచేసుకునే అవకాశాలు వున్నాయని టీడీపీ వర్గాలు మొదటి నుంచీ  అనుమానిస్తూనే వున్నాయి. ఇందుకు తోడు,  బీజేపీ స్థానిక నాయకుల నోట ‘చుక్కలు చూపిస్తాం’ అనే మాటలు రావడం, వాటిని సాకుగా చూపుతూ ఈ ఐటీ దాడులు కేవలం రాజకీయ కక్షతో జరుగుతున్నాయని టీడీపీ నాయకులు ఎదురు దాడి  ప్రారంభించడం ఈ ఐటీ తిత్లీ తుపానుకు ఆద్యం పోశాయి. ఇవన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని రాజకీయంగా దెబ్బతీసే లక్ష్యంతో సాగుతున్నాయనే సందేహాలు వ్యక్తం చేస్తూ ఆ తెలుగునాట చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 2014 జూన్ రెండో తేదీన మునుపటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయింది. అంతకు ముందే  ఉమ్మడి రాష్ట్రంలో విభజిత రాష్ట్రాల అసెంబ్లీలకు విడి విడిగా ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో గెలుపొందిన టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తిధి వార నక్షత్రాల పట్టింపులు జాస్తి అని చెబుతారు. కానీ ఆయన   ఏమాత్రం కాలయాపన చేయకుండా, జూన్ రెండో తేదీనే నూతన తెలంగాణా రాష్ట్రపు తొలి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసారు.
మరో పక్క నూతన  ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు మరో ఆరు రోజులు ఆగి ఎనిమిదో తేదీన ముహూర్తం పెట్టుకుని మరీ పదవీ ప్రమాణ స్వీకారం చేసారు. నిజానికి ఇలాంటి నమ్మకాలు ఆయనకు చాలా  తక్కువ అని తెలిసినవాళ్ళు చెప్పుకుంటారు.  మంత్రివర్గ సమావేశాలకు కూడా ముహూర్తాలు ఎంచుకోవడం ఆయన్ని ఎరిగిన వారిని మరింత ఆశ్చర్యచకితులను చేసింది.    
ముహూర్త బలమో ఏదో  తెలియదు కానీ,  ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న నాటినుంచి ఈరోజు వరకు ఆయనకు కంటిమీద కునుకులేని రాత్రులే.  ఆయన ఒక్కడే కాదు, ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహనరెడ్డితో సహా ఆంధ్రప్రదేశ్  రాజకీయాలు నెరిపే వారెవ్వరూ కూడా నిద్రలేని రోజులే గడుపుతున్నారు అంటే అతిశయోక్తి లేదు. ఆ రాష్ట్ర రాజకీయాలు ఆవిధంగా తయారయ్యాయి. పొరుగున ఉన్న తమిళనాడును తలపించేలా సాగుతున్నాయి. పాలకపక్షం, ప్రతిపక్షం ఒకరినొకరు శత్రు పక్షాలుగా భావించుకుని రాజకీయాలు చేస్తున్నాయి.
రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తాడనే మంచి పేరు ఇప్పటికే చంద్రబాబు ఖాతాలో వుంది. ‘నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను’ అని తరచూ చంద్రబాబు చెప్పే మాటలు ఇప్పుడు  నిజం అవుతున్నాయి. గతంలో ఇరవై మూడు జిల్లాల  ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో పరిపాలనలో తల మునకలుగా వుండి ఆయన నిద్ర పోలేదు. ఈసారి పదమూడు జిల్లాల కొత్త రాష్ట్రపు ముఖ్యమంత్రిగా సమస్యల అమావాస్యల నడుమ చిక్కిన  చంద్రుడిలా సరిగా నిదుర పోలేని పరిస్తితి.
దేశ విదేశాల్లో ఆయనకు అభిమానులు వున్నారు. టెక్నాలజీని తెలుగు ప్రజలకు పరిచయం చేసిన ముఖ్యమంత్రిగా గుర్తు పెట్టుకునేవాళ్ళు ఈనాటికీ వున్నారు. పొరబాటున ప్రజలు మరచిపోతారేమో అన్నట్టుగా చంద్రబాబు మధ్య మధ్య ఈ విషయాన్ని గుర్తుచేస్తుంటారు కూడా.
గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కంప్యూటర్లు, వాటి పరిభాష జనాలకు కొత్త. ఆయన ఏం చెప్పినా, ఏం చేసినా వారికి ఓ వింతగా వుండేది. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా హైదరాబాదు నగరంలో కలయ తిరుగుతూ, బస్సు నుంచే సెల్ ఫోనులో సంబంధిత మునిసిపల్ అధికారిని నిద్రలేపి, ‘నేను, చంద్రబాబును మాట్లాడుతున్నాను, ఎందుకు ఇక్కడ ఇలా చెత్త పేరుకుపోయింది’ అని ప్రశ్నిస్తుంటే ఆ బస్సులో ఆయనతో పాటు ప్రయాణిస్తున్న విలేకరులు కూడా విస్తుపోయిన రోజులకు నేనే సాక్షిని.
ఇలాటి సంఘటనలు చిలవలు పలవులుగా ప్రాచుర్యంలోకి వచ్చి ఆయనకు ఐటీ ముఖ్యమంత్రి అనే బిరుదును కట్టబెట్టాయి. ఆ నాటి యువజనంలో ఆయన పట్ల ఒక రకమయిన ఆరాధనా భావాన్ని కలగచేసాయి.
ఇదంతా గతం. ఒకప్పుడు నేను సెల్ ఫోన్లో మాట్లాడుతుంటే మా ఊరిజనం వింతగా చూసేవాళ్ళు. ఇప్పుడు వరికోతలకు పోయేవాళ్ళ చేతుల్లో కూడా మొబైల్ ఫోన్లు కానవస్తున్నాయి. ఈ తేడాను పాలకుడు అనేవాడు మరింత గమనంలో పెట్టుకోవడం అవసరం. కంప్యూటర్లు, వాటి పరిభాష ఇవన్నీ ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా కరతలామలకం. వారిముందు మన ప్రతిభ  ప్రదర్శించాలని చూడడం సబబుగా వుండదు. నిజానికి పాత తరం ఈ కొత్త విషయాలను వారినుంచే తెలుసుకోవాల్సిన పరిస్తితి ఈనాడు వుంది.
సరే. అసలు విషయానికి వద్దాము.
నిజానికి ఐటీ దాడులు అనేవి శాఖాపరంగా జరిగేవి. సాధారణంగా పన్ను కట్టని వారిపై జరుగుతుంటాయి. పన్ను కట్టడం, కట్టకపోవడం  లేదా ఆదాయానికి తగిన లెక్కలు చూపడం, చూపక పోవడం అనేవి జైలుకు పంపించేటంత స్థాయి నేరాలు కావు. వడ్డీతో సహా కడితే ఆ కేసు అంతటితో మూసివేస్తారు. కాకపొతే డబ్బును అక్రమంగా వేరేవాళ్ళ ఖాతాలోకి మళ్ళించడం, విదేశాలకు చేరవేయడం వంటివి ప్రమాదకరం. ఆదాయపు లెక్కలు తేల్చేవారికి ఈ వివరాలు తెలుస్తాయి. అలాంటి ఆధారాలు ఏవీ  సోదాల్లో దొరకక పొతే పేచీయే లేదు.
కాకపొతే, రాజకీయ కోణం. ఇప్పుడు చర్చలు అన్నీ దీని చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. బీజేపీతో తెగతెంపులు చేసుకుని, కేంద్రాన్ని ప్రశ్నించడం మొదలెట్టిన తర్వాతనే ఈ దాడులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందినవాళ్ళమీదా, లేదా చంద్రబాబుకు బాగా సన్నిహితులయిన వాళ్ళమీదా ఒక పధకం ప్రకారం జరుగుతున్నాయని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దాడులు జరిగిన సమయాన్ని, విధానాన్ని గమనంలోకి తీసుకుంటే వారి వాదన సబబే అనిపిస్తుంది. అయితే, ఎందుకీ దాడులు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే వారి అభిప్రాయం పొరబాటని తోస్తుంది. తప్పుడు లెక్కలతో ప్రభుత్వాన్ని మోసగించాలని చూసేవారిపై దాడులు జరిపితే దాన్ని తప్పు ఎంచడం ఏమేరకు సబబు అనే ప్రశ్న తలెత్తుతుంది.   
తమ నాయకుడు కేంద్ర ప్రభుత్వంపై ధర్మ పోరాటం మొదలు పెట్టినందువల్లే ఈ దాడులు అని టీడీపీ ఆరోపణ. స్నేహం చేసిన రోజుల్లో కూడా ఇటువంటి దాడులు టీడీపీ  నాయకులపై జరిగిన దృష్టాంతాలను పేర్కొంటూ బీజేపీ నాయకులు టీడీపీ శ్రేణుల వాదాన్ని పూర్వపక్షం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇరు పక్షాలు తమ వాదోపవాదాలతో చెలియలికట్ట దాటుతున్నాయనే అభిప్రాయం సామాన్య జనంలో కలుగుతోంది.
‘చూసింది ఇంతే, చూడాల్సింది ఇంకా ఎంతో వుంది’ అనే తరహాలో స్థానిక బీజేపీ నాయకులు సవాళ్లు విసిరినట్టుగా వార్తలు వినబడుతున్నాయి. అలాగే దాడులు చేసే ఐటీ అధికారులు కోరినా పోలీసుల మద్దతు ఇవ్వరాదని కేబినేట్ నిర్ణయించినట్టు కూడా పుకార్లు షికారు చేశాయి.
వ్యవస్థలు లేకుండా ఏ ప్రభుత్వం పనిచేయలేదు. వ్యవస్థలు పనిచేయని ప్రభుత్వం ప్రభుత్వమే కాదు. కానీ వున్నంతలో ప్రతి ప్రభుత్వం, కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, స్థానిక సంస్థల ద్వారా ఎన్నికయిన అధికార వ్యవస్థలు కావచ్చు తమ కింద పనిచేసే విభాగాలను ఎంతోకొంత తమ గుప్పిట్లో వుంచుకోవాలనే చూస్తాయి. ముఖ్యంగా ఐటీ, ఈడీ, ఏసీబీ, పోలీసు, రెవెన్యూ విభాగాలు ఈ కోవలోకి వస్తాయి. ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలు పోలీసులను ఉద్దేశించి హెచ్చరికలు చేస్తూ వుండడం పరిపాటి. ‘ మా పార్టీ అధికారంలోకి రాగానే మీ సంగతి చూస్తాం’ అనే రీతిలో ఇవి సాగుతుంటాయి. ప్రస్తుతం అధికారంలో వున్నవాళ్ళు కూడా  లోగడ ఇలా హెచ్చరికలు చేసినవారే కావడం గమనార్హం. ఇందుకు తగ్గట్టుగా రాజకీయ ప్రేరేపిత కేసులను తమ భుజ స్కందాలపై వేసుకుని విశృంఖలంగా అధికార దుర్వినియోగం చేసే అధికార గణానికి కూడా ప్రస్తుత వ్యవస్థలో లోటులేదు. అంచేతే ప్రతిదీ రాజకీయ రంగు పులుముకుని పెద్ద పెద్ద కేసులు కూడా దూదిపింజల్లా తేలిపోతున్నాయి.
దుష్ట శక్తుల పీడలు సోకకుండా వుండడానికి కొందరు  తావీదులురక్షరేఖలు ధరిస్తుంటారు.
ఇప్పుడు రాజకీయం అలాటి రక్షరేఖగా మారిపోయింది. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టు మామూలు ప్రజలకు వర్తించే చట్టాలునియమ నిబంధనలురాజకీయ నాయకులకి వర్తించవు.
చట్టం చేతులు చాలా పొడుగు అనే పొడుగాటి డైలాగులు డైలాగులకే పరిమితం. రాజకీయుల  జోలికి వెళ్ళడానికి పోలీసులు జంకుతారు. మామూలుమనిషిని అరెస్టు చేయడానికిపోలీసు స్టేషనుకు రప్పించడానికి వుండే నియమాలునిబంధనలు, ఖాకీ దర్పం  రాజకీయ నాయకుల విషయంలో హాం ఫట్హుష్ కాకీ. అధవా గత్యంతరం లేక అరెస్టు చేయాల్సిన పరిస్తితే  వస్తే వారికి ఆకస్మిక అనారోగ్యం ఎక్కడినుంచో వూడిపడుతుంది. మామూలు మనిషయితే బాగు చేయిస్తాం రాఅని స్టేషనుకు లాక్కెళ్లి మక్కెలు విరగబొడుస్తారు. నాయకుల విషయం వచ్చేసరికి  నిబంధనలన్నీ కట్టగట్టుకుని  గాలికి ఎగిరిపోతాయి.
రాజకీయం అనే రక్షరేకు వల్ల ఇన్ని లాభాలు వుండడం వల్లనే సమాజంలోని అన్ని వర్గాల వాళ్లు పొలోమని ఆ దారులవెంట పరుగులు తీస్తున్నారు. ఏదో ఒక పార్టీ గొడుగు కింద  వుంటే చాలు ఏవీ లేకపోయినా అన్నీ వున్నట్టే లెక్క. అలా అని హోల్ మొత్తంగా రాజకీయ నాయకులందరూ ఇలాగే ఉంటారా, వాళ్ళల్లో మంచివాళ్ళు లేరా అంటే ఎందుకు లేరుగతంలో వున్నారు. ఇప్పుడూ వున్నారు. ఇకముందూ  వుంటారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అలాటి వారి సంఖ్య క్రమంగా పలచపడిపోతోంది.
అన్ని రంగాల్లో మాదిరిగానే, ఇప్పుడు రాజకీయాల్లోకి యువరక్తం చేరుతోంది. రిజర్వేషన్ల పుణ్యమా అని శాసన సభల్లో బడుగు బలహీన వర్గాల ప్రాతినిధ్యం పెరుగుతోంది. చదువుకున్న వారుమంచి విద్యార్హతలు వుండి కూడా వేరే ఉద్యోగ వ్యాపకాల్లో చేరకుండా రాజకీయ రంగం పట్ల ఆసక్తి పెంచుకునే విద్యాధికుల సంఖ్య గణనీయంగానే ఉంటోంది. నిజానికివన్నీ ఆహ్వానించ తగ్గ పరిణామాలు. అసలు ఈనేపధ్యంలోనే ముందు పేర్కొన్న రాజకీయ అవలక్షణాలను అంతగా ఉదహరించింది. ఎందుకంటే ఈ విపరీత ధోరణులను కొత్తగా రాజకీయ రంగప్రవేశం చేస్తున్న యువకులువిద్యాధికులు, మహిళలు గుర్తించి వాటికి దూరంగా మసలుకోవడం అలవరచుకోవాలి. లేని పక్షంలో ఇటువంటి నిందలను వాళ్ళు కూడా మోయాల్సివస్తుంది.
దేశంలో  స్వార్ధ రాజకీయ శక్తులకు కొదవలేదు. అయినా కానీ, మన  ప్రజాస్వామ్య వ్యవస్థ చెక్కుచెదరకుండా వుంది. పడ్డ పునాదులు అంత బలిష్టంగాపటిష్టంగా ఉన్నాయనుకోవాలి. అది ప్రజలు చేసుకున్న అదృష్టం.
రాజకీయ వ్యవస్థకు చెదలు పట్టనంత కాలం ప్రజల భద్రతకు ధోకా వుండదు. ఆ వ్యవస్థను కాపాడుకోవడం అందరి బాధ్యత. అయితే ఇందులో సింహ భాగం రాజకీయులదే అనడంలో సందేహం లేదు.
రాజకీయం అనేది దేశానికి రక్షరేఖగా వుండాలి కానిఎవ్వరో కొందరు రాజకీయ నాయకులకి కాదు.  

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

జిలేబి పైకూ పద్యం ఆకాశవాణిలో ప్రసారం. వెర్రిగా గుండెలు బాదుకుంటున్న పెజానీకం

అజ్ఞాత చెప్పారు...

ఈ అత్తి పత్తి సుత్తి ఆర్టికల్స్ తోని ఏమి ఉపయోగం సార్. ఏదో మీ తుత్తి.

సూర్య చెప్పారు...

It titli అనే మాటకు నేను అభ్యంతరం చెప్తున్నా. తితిలి తుఫాను వల్ల సామాన్యులు నష్టపోయారు కానీ ఈ it checks (ఐటీ దాడులు అనేది కూడా తప్పుడు అర్థం ధ్వనిస్తుంది.) వల్ల సామాన్యులకు నష్టంలేదు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత: "ఈ అత్తి పత్తి సుత్తి ఆర్టికల్స్ తోని ఏమి ఉపయోగం సార్. ఏదో మీ తుత్తి." ఈ వాక్యాన్ని కాపీ చేసి పెట్టుకోండి. నా పోస్ట్ రాగానే ఇది పేస్ట్ చేసేయండి. ఒక పనయి పోతుంది.

అన్యగామి చెప్పారు...

మీ వ్యాసం ఉత్తర భాగం అన్ని కాలములకి వర్తిస్తుంది. మీ హెచ్చరికని యువతరం గమనించి, మెలగు గాక!