26, ఏప్రిల్ 2017, బుధవారం

అవార్డుకే అవార్డు వచ్చింది


మా పెద్దన్నయ్య కీర్తిశేషులు పర్వతాలరావు గారికి సినిమాల గోల పట్టదు. అలాంటిది ఆయన స్వయంగా ఒక సినిమాకి ముందుగా టిక్కెట్లు బుక్ చేయించాడు. చిక్కడపల్లి, అశోక్ నగర్ లలో ఉంటున్న కుటుంబాల వాళ్ళం మేమందరం, సుమారు ఓ పాతిక మందిమి పోలో మంటూ రిక్షాలు కట్టించుకుని సుల్తాన్ బజార్ దాపుల్లో, హనుమాన్  వ్యాయామ శాలకు దగ్గర్లో, కందస్వామి లేన్ లో ఉన్న రాయల్ టాకీసుకి  వెళ్ళాము. (ఈ హాలు లహౌటీ అనే పెద్ద వ్యాపారస్తుడిదనీ, ఆ హాల్లో కర్టెన్లు, కుర్చీలు అన్నీ పింక్ రంగులో ఉంటాయని, అంచేత దాన్ని పింక్ థియేటర్ అనేవాళ్ళనీ నా జర్నలిష్టు మిత్రుడు, సినిమాల విషయాల్లో ఉద్దండుడూ అయిన వీజేఎం దివాకర్ చెప్పాడు)    సినిమా మొదలయింది. హాలు హాలంతా నిశ్శబ్దంగా సినిమా చూస్తున్నారు. అంతా సంగీతం, పాటలు, హీరోయిన్ కి మాటలే లేవు, యేవో పొడిపొడిగా అక్కడక్కడా రెండు మూడు ముక్కలు తప్ప. (జంధ్యాల మాటలు రాశాడు. కధానాయకుడు, నాయకి నడుమ మాటలే వుండవు. సినిమాలో ఎక్కువ డైలాగులు వున్నది అల్లు రామలింగయ్య పాత్రకే)  ఇంటర్వెల్ లో ఎవరో అంటున్నారు, ‘మొదట్లోనే రావడం మంచిదయింది, తీరు చూస్తుంటే రెండో వారం పోస్టరు కూడా పడేట్టు లేదు’ తనలో తాను గొణుక్కుంటున్నట్టు.
ఆశ్చర్యంగా రెండో వారం నుంచే మంచి టాకంటుకుంది. జనం క్యూల్లో నిలబడి టిక్కెట్లు కొనుక్కుని చూడ్డం మొదలెట్టారు.
కొన్ని రోజులు పోయాక, విలేకరులకోసం రామకృష్ణా స్టూడియోలోని మినీ థియేటర్లో ఆ సినిమా ప్రీవ్యూ వేశారు. నేనూ వెళ్లాను. హాలు సగం వరకు కుర్చీలు వేశారు. మొదటి వరసలో ఒకాయన కాకీ ప్యాంటు, కాకీ షర్టు టక్ చేసుకుని దీక్షగా సినిమా చూస్తున్నారు. నేను ఆల్రెడీ చూసిన సినిమాయే కనుక ఆయన్నే గమనిస్తూ పోయాను. ఒక విగ్రహంలా కూర్చుని, కన్ను ఆర్పకుండా చూస్తూ సినిమాలో లీనమైపోయారు. ఇంటర్వెల్  లో మళ్ళీ ఈ లోకంలో పడడానికి ఆయనగారికి కొంత వ్యవధి పట్టింది. అంతా లేచివెళ్ళి ఆయన్ని అభినందిస్తున్నారు. నేనూ వెళ్లి నమస్కరించాను.
ఇవ్వాళ మళ్ళీ వెళ్లి ఆ దాదా సాహెబ్ ఫాల్కే  అవార్డు గ్రహీతను అభినందించాలని అనిపించింది. కానీ తర్వాత తట్టింది.

ఆయన్ని అభినందించాలా! ఆ అవార్డుని అభినందించాలా!      

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Yes sir. The aura shankarabharanam created in 1980 was all encompassing. Sankarabharanam Sagara sangamam all time classics. The way he blended music and dance in his themes is praiseworthy. Legendary director who thoroughly deserves the award.

Zilebi చెప్పారు...



--

కాశీనాథుని విశ్వనాథునికి మా కైమోడ్పు ! జేజేలు‌ ! దా
దాసాహెబ్ బిరుదొందె! యాంధ్రులకు మోదంబయ్యె నమ్మా జిలే
బీ! శోభస్కరమయ్యె గాద సినిమా ఫీల్డున్ సుమా ! శ్రీకరం
బౌ!సంకల్పబలంబు మేలు బడసెన్ భావాటులన్దీర్చెనౌ !

జిలేబి

Pavan Kumar Reddy Rendeddula చెప్పారు...

రెండవదే కరెక్ట్ అనుకుంటానండి శ్రీనివాస రావు గారూ. మంచి పోస్ట్ అందించినందుకు ధన్యవాదాలు.

YVR's అం'తరంగం' చెప్పారు...

సర్ , Simple yet superb 🙏
ప్రభుత్వాన్ని , అవార్డు ని సన్మానించాల్సిన సందర్భమే ఇది.

YVR's అం'తరంగం' చెప్పారు...

సర్ , Simple yet superb 🙏
ప్రభుత్వాన్ని , అవార్డు ని సన్మానించాల్సిన సందర్భమే ఇది.