13, ఏప్రిల్ 2016, బుధవారం

ఇదెక్కడి న్యాయం?


సూటిగా....సుతిమెత్తగా.........

తెలుగులో అప్పుని సంస్కృతంలో  ఋణం అంటారు. ఋ అనేది కాలగర్భంలో కలిసిపోయింది కాబట్టి, పలకడానికి తేలిగ్గా వుంటుంది కాబట్టి రుణం అనే అనుకుందాం. మనుషుల మధ్య సంబంధాలన్నీ రుణ సంబంధాలే అనడానికి ఆ భాషలో ఓ సూక్తి కూడా వుంది.
‘ఋణానానుబంధ రూపేన పశుపత్ని సుతాలయాః ఋణ క్షయే క్షయం యాంతికాతత్ర వరిదేవనా’
అంటే ఏమిటట? గొడ్డూగోదా, భార్యా బిడ్డలు, ఇళ్ళూవాకిళ్ళూ అన్నీ రుణానుబంధాలే అన్నది దాని తాత్పర్యం. ఒక్కసారి  ఆ రుణం తీరిందో ఇక మంత్రం వేసినట్టు ఈ బంధాలన్నీ ఒదిలి చక్కాపోతాయట.
మార్క్స్ మహాశయులు కూడా దాదాపు ఇదేవిధంగా వాక్రుచ్చినట్టు గుర్తు. మనుషులమధ్య సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని ఆయన సెలవిచ్చినట్టుగా మార్క్స్ అభిమానులు ఇప్పటికీ చెబుతుంటారు.
అంటే మరోసారి ఏమిటట? ఈ సమస్త ప్రపంచం డబ్బు చుట్టూ తిరుగుతోందని, డబ్బుకు లోకం దాసోహం అని, డబ్బులేనివాడు డుబ్బుకు కొరగాడని ఎట్సెట్రా ఎట్సెట్రా సామెతలు, వాటిని అల్లుకుని సినిమా పాటలు. తీర్చలేని అప్పుకు పేరుకుపోయిన అసలు ఫాయిదాల్లా లెక్కలేనన్ని పుట్టుకు వచ్చాయి.
పూర్వం రుణత్రయం అని  మూడు రకాల అప్పుల పేర్లు చెప్పేవాళ్ళు.   దేవరుణం, పితృరుణం, మనుష్యరుణం. ఇవి కేవలం డబ్బుకు సంబంధించినవి మాత్రమే కాదు. ఇవి తీర్చే పద్దతులు కూడా పూర్వీకులే చెప్పారు. యజ్ఞయాగాదులు, పూజలు, నైవేద్యాల  ద్వారా దేవరుణాన్ని, పితృదేవతలను సంతృప్తి పరచడం ద్వారా పితృరుణాన్ని, అతిధి సత్కార్యాల రూపంలో మనుష్యరుణాన్ని తీరుస్తూవుండాలి.
సనాతన సాంప్రదాయాలు నిష్టగా పాటించే ఇళ్ళల్లో వైశ్వదేవం చేసేవాళ్ళు. భోజనం చేయడానికి ముందు బలిహరణం అనే ప్రక్రియ వుంటుంది. దీని ఆంతర్యం చాలా గొప్పది. సమస్త భూత రాశులను, కోటానుకోట్ల జీవ రాశులను భోజనానికి ముందు, తర్వాత ఆపోసన, ఉత్తరాపోసనల ద్వారా తృప్తి  పరచడం ఇందులోని విశిష్టత.
ఇది ఒక్క మనదేశానికే పరిమితం కాదు. పాశ్చాత్య దేశాల్లో కూడా ఆచరించడం నేను కళ్ళారా చూశాను. గతంలో అమెరికా వెళ్ళినప్పుడు, సియాటిల్ లో  సుసాన్ దంపతుల ఆతిధ్యం స్వీకరించినప్పుడు నాకీ విషయం బోధపడింది.  భోజనం మొదలు పెట్టడానికి ముందు ఆ దంపతులు  సకల జనుల సంక్షేమం కోసం, తమలాగానే ప్రజలందరికీ మంచి  భోజనం దొరకాలని దేవుడ్ని కోరుతూ ప్రార్ధన చేయడం గమనించినప్పుడు మంచి అనేది అన్ని దేశాల్లో ఒకటిగానే వుంటుందని అనిపించింది.       
ఇప్పుడంటే రకరకాల బ్యాంకులు. రకరకాల అప్పులు. కొన్ని దీర్ఘ కాలికం. కొన్ని స్వల్పకాలికం. పరిశ్రమలకోసం, మాల్స్ కోసం, మల్టీప్లెక్స్ సినిమా హాల్స్ కోసం ఇచ్చే అప్పులు కొన్నయితే,   కార్లు, టాక్సీలు, ఏసీ బస్సులు అన్నింటికీ బ్యాంకు అప్పులే. కూరగాయల దుకాణాలనుంచి పట్టు చీరెల షాపులవరకు అన్నీ అప్పులతో నడిచేవే. వెనుక ఆటోల వెనుక పలానా బ్యాంకు రుణ సహాయంతో అని పెద్ద అక్షరాలతో అప్పు డబ్బులతోనే రాయించే వాళ్ళు.  పెద్దవాళ్లకు ఇచ్చిన  అప్పులకు కూడా  అలారాయిస్తే వారిని  చిన్నబుచ్చినట్టు అవుతుందని పెద్దమనసు చేసుకున్నారేమో తెలవదు. 
ఓ యాభయ్ అరవయ్ ఏళ్ళక్రితం వూళ్ళో అప్పు పుట్టడం గగనంగా వుండేది. ఎవడికయినా పుట్టిందంటే అతడు పెట్టి పుట్టినట్టే లెక్క. పరపతి అంటేనే అప్పు పుట్టించగల సమర్ధత అని చెప్పుకునే వాళ్ళు. అలాగే అప్పు అంటే భయం వున్న రోజులవి. అప్పు వుంటే పక్కలో పామువున్నట్టే అని భావించేవాళ్ళు.  చనిపోయిన తర్వాత కూడా ఎవరికీ రుణాన పడిపోకూడదని, కొంత మొత్తాన్ని తమ అంత్యక్రియలకోసం తలగడలో దాచుకున్న పెద్దల గురించి నాకు తెలుసు.  తల తాకట్టు పెట్టయినా చేసిన అప్పు తీర్చాలనే పట్టుదలలు ఆ రోజుల్లో ఉండేవి. అల్లా అని అందరూ బుద్దిమంతుల్లా చేసిన అప్పులు అణాపైసలతో సహా తీర్చే వాళ్ళని కాదు. వాళ్ళల్లో కొందరు ‘బుడ్డిమంతులు’ తెచ్చుకున్న అప్పును ఆఖరి పైసా వరకు కల్లు దుకాణాలకు చెల్లు రాసేసి పెళ్ళాం పుస్తెలు అమ్మి అప్పులు తీర్చేవాళ్ళు కూడా  లేకపోలేదు.  చేసిన అప్పులు తీర్చలేక వాళ్ళ సంసారాలు వీధిన పడేవి. వసూళ్ళకు వచ్చిన కాబూలీవాలాల విచిత్ర విన్యాసాలు గురించి కధలు కధలుగా చెప్పుకుని భయపడిపోయేవాళ్ళు.  భయపడుతూ బతుకుతుండేవాళ్ళు.     
పొద్దున్నే ఈ అప్పుల గొడవేమిటంటారా! దానికీ ఒక కారణం వుంది. 
బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించి భారత సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు పత్రికల్లో చదివిన తరువాత నాకే కాదు, చాలామంది మనసులో మెదిలిన ప్రశ్న’ ఇదెక్కడి న్యాయం?’
ఢిల్లీకి చెందిన ఒక స్వచ్చంద సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆలోచింపచేసేవిగానే కాదు, ప్రస్తుత వ్యవస్థలో వున్న కొన్ని లోపాలను ఎత్తి చూపేవిగా కూడా వున్నాయి. 
2009 లో హడ్కో సంస్థ దాదాపు నలభయ్ వేల కోట్ల రుణాలను  రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంలోని  ఔచిత్యాన్ని ప్రశ్నిస్తూ ఢిల్లీ కి చెందిన ఒక స్వచ్చంద సంస్థ కోర్టు గడప తొక్కింది.  ఈ విచారణ సందర్భంగా, కోర్టు  లాగిన తీగె, రుణాల ఎగవేత అనే  డొంకను కదిల్చింది. అదీ దీని నేపధ్యం.
న్యాయస్థానం ఆదేశాల మేరకు రిజర్వ్ బ్యాంకు స్పందించి అయిదువందల కోట్ల రూపాయల పైబడిన బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించిన వివరాలను సుప్రీం కోర్టుకు సీల్డ్ కవర్ లో అందచేసింది.
అది విప్పి చూసిన న్యాయమూర్తులకు కళ్ళు గిర్రున తిరిగాయి. ఈ  విషయం నిండు న్యాయస్థానంలో వారు చేసిన వ్యాఖ్యలే తెలుపుతున్నాయి.
‘ఆ సొమ్ము చూస్తె దిమ్మ తిరుగుతుంది’ ఇదీ సుప్రీం వ్యాఖ్య.
అంతటితో ఆగలేదు.
న్యాయస్థానం ఇంకా ఇలా అంది.
‘బ్యాంకులకు ఆయా వ్యక్తులు, సంస్థలు ఎగవేసిన మొత్తం లక్షల కోట్లల్లో వుంది.
‘పదిహేను, ఇరవై వేల రూపాయలు రుణం వసూళ్ళ కోసం రైతులను యాతన పెట్టే బ్యాంకులు వేలకోట్ల రూపాయలు అప్పు చేసిన వాళ్ళు, తమ సంస్థలు ఖాయిలా పడ్డట్టు ప్రకటించి దర్జాగా తిరుగుతుంటారు. ఇదొక ద్వైదీభావం.’
ఈ వ్యా ఖ్యలు చేసిన సుప్రీం మరో మాట కూడా అంది.
‘ఆర్బీఐ నివేదిక ప్రకారం ఎగవేతల మొత్తం భారీగా వుంది. ఎగవేతదారుల పేర్లను బయటపెట్టాలనే వాదనకు  ఈ భారీ మొత్తం బలం చేకూరుస్తోంది.’
ఇదెక్కడి  న్యాయం అని ప్రశ్నిస్తూ, ఈ వ్యాసం మొదలు పెట్టడానికి సరిగ్గా ఇక్కడ తిరిగిన మలుపే దోహదం చేసింది.
సుప్రీం అభిప్రాయంతో ఖంగు తిన్న ఆర్బీఐ న్యాయవాదులు మరో వితండ వాదాన్ని తెరమీదకు తెచ్చారు. ఎగవేత దారుల పేర్లను బయట పెడితే, ఆర్ధిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నది ఆ వాదనల సారాంశం.   రుణసమాచార సంస్థల నియంత్రణ చట్టం ప్రకారం సమాచార గోప్యత తప్పనిసరి అని కోర్టుకు తెలియచేసింది. తదుపరి విచారణను ఈ నెల 26 వ తేదీకి వాయిదా వేసింది.
సరే సుప్రీం తుది తీర్పు ఎలా వుండబోతున్నదో అన్న దానిపై చర్చ అనవసరం. కానీ,  సమసమాజం అంటూ మనందరం ఘనంగా చెప్పుకుంటున్న మన ఈ సమాజంలో న్యాయం, ధర్మం అందరికీ సమానంగా ఉంటున్నాయా అన్న ప్రశ్నను ఈ కేసు అందరి ముందూ ఉంచింది. 
ఎన్నో కేసుల గురించి వింటున్నాం. కొందరు బడాబాబులు ఏదో ఒక పేరు చెప్పి, ఆశ చూపి అమాయక ప్రజలు దాచుకున్న డబ్బును పెట్టుబడులుగా పెట్టుకుని కోట్లు పోగేసుకుని రాత్రి రాత్రి బోర్డులు తిప్పేస్తున్నారు. మరికొందరు బడాబాబులు రాజకీయ ఛద్మవేషాలు ధరించి ప్రజలు  బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును రుణాల రూపంలో ఎగవేసుకువెళ్ళడమే కాకుండా వాటిని పూర్తిగా ఎగవేస్తున్నారు. ఎటు  తిరిగీ వీరు దోచుకునే  సొమ్ము కష్టపడి చమటోడ్చి కూడబెట్టుకున్న ప్రజలదే కావడం ఇందులోని విషాదం.   
ఈ బ్యాంకుల పేర్లూ, ఈ బడాబాబుల పేర్లూ ఎవ్వరికీ తెలియనివి కావు.    కానీ వారి పేర్లు బయట పెట్టడం ద్వారా ఆర్ధిక వ్యవస్థ కిందుమీదులవుతుందని చేస్తున్న వాదనే తలకిందులనిపిస్తోంది.  కోట్లాది రూపాయల రుణాలు ఎగ్గొట్టి, సూటూ బూటూ వేసుకుని విమానాల్లో తిరుగుతూ, అప్పులు ఇచ్చిన బ్యాంకు అధికారులకే ఆ మొత్తాలతోనే విలాసవంతమైన విందులు ఇస్తూ, దేశ విదేశాల్లో షికార్లు చేస్తున్న వారిని తాకడానికి కూడా భయపడే మన వ్యవస్థను చూసినప్పుడు ఏదో తెలియని భయం కలుగుతోంది.
ఋణం తీర్చగానే బంధాలు పోతాయని పూర్వీకులు చెప్పారు. రుణాలు ఎగ్గొట్టి కూడా  బంధాలు నిలుపుకోవచ్చని  ఈ తరం చెబుతోంది. ఇదొక వైచిత్రి.
ఉపశ్రుతి: అసందర్భంగా అనిపించినా  ఒక సందర్భం  ప్రస్తావించదలిచాను. 1970 ప్రాంతంలో   నేను  విజయవాడలో ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో పని చేసే రోజుల్లో జర్నలిష్టుగా సంఘంలో నా జీవితం ఒక మెట్టు పైన వుండేది. జీతభత్యాల రీత్యా  చూసుకున్నప్పుడు దారిద్య్ర రేఖకు దిగువన వుండేది. జీతానికీ, జీవితానికీ పొంతనలేని ఆ రోజుల్లో ఒకరోజు, ఒక్క రూపాయంటే ఒక్క రూపాయి జరూరుగా కావాల్సి వచ్చింది. ఇల్లంతా గాలించినా పాతిక పైసలు కూడా లేవు. పిల్లవాడికి పోతపాలు. పాలసీసా పగిలిపోయింది. నేనూ మా ఆవిడా దిగులు మొహాలు వేసుకుని కూర్చుని వుంటే రామారావు అని కొత్తగా పరిచయం అయిన వ్యక్తి మా ఇంటికి వచ్చాడు. అతడాసమయంలో అలా రావడం మా ఇద్దరికీ బాగనిపించలేదు. పరిస్తితి గమనించాడేమో వచ్చిన వాడు వచ్చినట్టే వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన వాడు ఇట్టే తిరిగి వచ్చాడు. అతడి చేతిలో పాలసీసా. మా ప్రాణాలు లేచి వచ్చాయి. కొద్దిరోజులుగా నానుంచి ఓ సాయం కోరుతూ అతడు నా వెంట తిరుగుతున్నాడు. అతనో పెయింటర్. సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలనే  తపన. బ్యాంకులో పూచీకత్తు ఇచ్చేవాళ్ళు  కావాలంటున్నారు. అతడు చేసిన సాయానికి ప్రతిగా బ్యాంకుకు వెళ్లి హామీ సంతకం చేసి పదివేలు అప్పు ఇప్పించాను. వెంటనే, హైదరాబాదు ఆకాశవాణిలో  ఉద్యోగం రావడం, ఆ తరువాత మాస్కో రేడియోలో పనిచేయడానికి మాస్కో వెళ్ళడం ఈ హడావిడిలో నేను బెజవాడ బ్యాంకు అప్పు సంగతి మరచిపోయాను. ఈలోగా అప్పుతీసుకున్న వ్యక్తి వ్యాపారం సరిగ్గా నడవక రోడ్డున పడడం,  బ్యాంకు వాళ్ళు హామీదారునయిన నా చిరునామా పట్టుకుని మాస్కోలోని ఇండియన్ ఎంబసీ ద్వారా లక్ష రూపాయలకు కోర్టు ఇచ్చిన డిక్రీ చేతిలో పెట్టడం సినిమాలోలా జరిగిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగిని కదా, అప్పు వసూలుకు నేను వారికి కనిపించి వుండడంలో ఆశ్చర్యం లేదు. ఆశ్చర్యం అల్లా ఇప్పుడు అలా జరగడం లేదేమిటని!
(13-04-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595             

‘         

4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఇది ఈ మధ్యన మీరు వ్రాసిన వ్యాసాల్లో అత్యుత్తమమైనది. అంతేకాకుండా చక్కటి ఉదాహరణలు మరియు చాల సందర్భసహితం. మీకు ఎన్నో అబినందనలు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ అజ్ఞాత- ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు

అజ్ఞాత చెప్పారు...

బ్యాంకు ముండలు అప్పులకోసం రైతులను వేపుకు తింటాయి. మాల్య, లాంకో,క్రానికల్.. బడాబాబులు వేలకోట్లు ఎగగొట్టినా ఏమీ చేయలేవు.

PRASAD చెప్పారు...

విషయం అలోచనీయం. ఎక్కడా చిన్న అసందర్భ పదం కూడా లేకుండా, పాఠకుడికి విసుగు కలగకుండా చదివించగలిగే మీ శైలి అద్భుతం. ఎక్సలెంట్... చాలా రోజుల తర్వాత కామెంటుతున్నాను.

Prasad Sarma