ఓ కుక్క దారి తప్పి దారి పక్కన కనబడ్డ ఓ మ్యూజియం
లోకి ప్రవేశించింది. ఆ హాల్లో ఎటు చూసినా అద్దాలే. బ్రూస్ లీ సినిమాలో మాదిరిగా
కిందా, పైన, పక్కనా, నలువైపులా నిలువెత్తు అద్దాలు. అందులో చేరిన కుక్కకు మతి
పోయింది. ఎటు చూసినా తనను బోలిన శునకాలే. నిజమో కాదో తేల్చుకోవడానికి ఆ కుక్క
పళ్ళు బయటపెట్టి భయపెట్టింది. చుట్టూ అద్దాల్లో కనిపిస్తూవున్నవి దాని
ప్రతిబింబాలే. అవికూడా పళ్ళు బయటపెట్టి భయపెట్టినట్టు కనిపించడంతో ఓ కుక్కల గుంపు నడుమ తాను నిష్కారణంగా చిక్కుకు
పోయాననుకుని ఆ కుక్కకు పెద్ద భయం పట్టుకుంది. వాటిని మరింత భయపెట్టి తప్పించుకుందామన్న
ఆలోచనతో మొరగడం మొదలు పెట్టింది. చుట్టూ అద్దాల్లో కనిపించే ఆ కుక్క ప్రతిబింబాలు
సయితం అదేమాదిరిగా మొరగడం మొదలు పెట్టాయి. కుక్క గొంతు పెంచి గట్టిగా మొరుగుతూ అటూ
ఇటూ దూకడం మొదలెట్టింది. చుట్టూ అడ్డాల్లోని వందలాది కుక్కలు కూడా అంతే మెరుపు వేగంతో గెంతడం
మొదలయింది. ప్రాణ భయంతో కుక్క ప్రాణాలు ఠావులు తప్పాయి. ఆరోజు సెలవు దినం కావడం
వల్ల మ్యూజియం సిబ్బంది మరునాడు వచ్చి తలుపు తీసేసరికి ఆ అద్దాల మహల్ లోని అద్దాలు అన్నీ పగిలిపోయి చిందరవందరగా పడివున్నాయి. వాటి మధ్యలో విగతజీవిగా పడున్న ఓ
కుక్క శరీరం.
నిజానికి ఆ హాల్లో కుక్కకు హాని తలపెట్టే వాళ్లు
ఎవ్వళ్ళూ లేరు. అద్దాల్లో తన ప్రతిబింబాలను తానే చూసుకుని గాభరా పడిపోయి, అందువల్ల
కలిగిన భయంతో తన చావును తానే కొనితెచ్చుకుంది.
ఈ ప్రపంచం తనకు తానుగా ప్రజలకు ఏ అపకారం తలపెట్టదు.
మన మనస్సుల్లోని ఆలోచనలే మనకు మేలయినా,
కీడయినా కలిగిస్తాయి. మనకు మంచి జరిగినా,
చెడు జరిగినా దానికి కారణం మన భావాలే. మన
కోరికలే. మన నిర్ణయాలే. మనం చేసే పనులే.
ఎందుకంటే మన చుట్టూ వున్న లోకమే ఓ పెద్ద దర్పణం.
(శ్రీనివాస్ వూటుకూరు పోస్ట్ ఆధారంగా)
13-06-2015
NOTE: Courtesy Image Owner
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి