8, జూన్ 2015, సోమవారం

మిడిసిపాటు -


తెలుగులో నాకున్న కొద్దిపాటి  పాండిత్యం నలుగురిలో నాకొక పెద్ద  గుర్తింపు తెచ్చిపెట్టింది. నిజానికి నా తెలుగు అంతంత మాత్రమే. కానీ ఏమీ లేనిచోట ఆముదపు మొక్క మాదిరిగా అమెరికాలో నేనొక తెలుగు పండితుడన్న పేరు తెచ్చుకోవడానికి అది అడ్డం కాలేదు. చిన్నప్పుడు అప్పయ్య మాస్టారు బట్టీ వేయించిన తెలుగు పద్యాలనే కాస్త అటూ ఇటూ తిప్పి సందర్భం అసందర్భం అని చూసుకోకుండా అందరి నడుమ   ప్రయోగించే నా తెంపరితనాన్ని  నలుగురు నాలుగు రకాలుగా మెచ్చుకుంటూ వుండడంతో తెలుగు పండితుడన్న బిరుదు, దేశం కాని దేశంలో నాకు  స్తిరపడిపోయింది. దానితో ఆటా, తానా సభల్లో నేను ఆడింది ఆట పాడింది పద్యం అయిపోయింది.
అసలే ఎన్.ఆర్.ఐ. అనే మూడక్షరాలే  నా వొంట్లో పొగరును బాగా పెంచాయి. వీటికి తోడు ఈ మధ్య గ్రీన్ కార్డుఅనేది మరొకటి జత కలిసింది. ఇంకేముంది అసలే కోతి, కల్లు తాగింది కధలో మాదిరిరిగా పొగరుకు విగర్తోడయింది. ఇండియా వచ్చినప్పుడల్లా తెలుగు పుస్తకాలు భారీగా కొనుక్కుని వెళ్లి  అమెరికాలో తెలుగువారికి  పంచి పెడుతూ నా పేరును సార్ధకం చేసుకునే కొత్త భారాన్ని నెత్తికెత్తుకునేలాచేసింది.
ఈ సొంత గోల ఆపి అసలు విషయానికి వస్తాను.
ఈ మధ్య ఇండియా వచ్చి తిరిగివెళ్ళబోయేముందు తెలుగు పుస్తకాలు కొందామని వెళ్లాను. నేను అంతకు ముందు ఆ షాపుకు వెళ్ళలేదు. చాలా పెద్ద దుకాణం. కొనేవారికి సాయపడేందుకు సహాయకులను కూడా పెట్టారు. నాకు సాయంగా వచ్చిన అమ్మాయికి ఇరవై లోపే వయసు.  అందవికారంగా వుంది. వేసుకున్న దుస్తులు కూడా ఆమెకు నప్పలేదు. అసలే చింపిరి జుట్టు,  సరిగా దువ్వుకోకుండా ముడేసుకుంది.
మీరు ఏరకమైన పుస్తకాలు ఇష్టపడతారని మామూలుగా  అడిగింది. ఆమె ముందు నా పాండిత్యం వొలకబోయాలన్న దుర్బుద్ధి కలగడంతో  అద్వైతం గురించిన గ్రంధాలేమయినా వున్నాయా వుంటే చూపించుఅన్నాను, నిజానికి ద్వైతాద్వైతాలగురించి నాకు ఎలాటి  అవగాహన లేకపోయినా. అడిగినదే తడవుగా ఆ అమ్మాయి కొన్ని గ్రంధాలు తీసి చూపించింది.
నా తెలివిని మరింత ప్రదర్శించడానికి అద్వైతం అంటే నీకు ఏమాత్రం తెలుసు. పురాణ వాజ్మయంలో నీకున్న అవగాహన ఏపాటిది?’ అని అడిగాను.
ఆ ఆమ్మాయి చెప్పిన జవాబుతో నా కళ్ళు తెరిపిళ్ళు పడ్డాయి. నా అజ్ఞానం ఏస్థాయిలో వున్నదో  అర్ధం అయింది.
తిరుమల తిరుపతి దేవస్థానం వారు  అద్వైతాక్షర మాలిక అనే అనువాద గ్రంధాన్ని 2003 లో  ప్రచురించారు. భాగవతుల కుటుంబరావు గారు అనువాదం చేశారు. గ్రంధ సంపాదకులు పుల్లెల రామచంద్రుడు గారు. చూస్తుంటే  అద్వైతం పట్ల మీకు ఆసక్తి వున్నట్టుంది. వ్యవధానం వున్నట్టయితే  కొన్ని విషయాలు చెబుతాను.
చాలా సంవత్సరాలకిందట కొందరు పండితులు సంస్కృతంలో 51  వ్యాసాలు   రాశారు.  1945 లో   కుంభకోణంలో జరిగిన అద్వైత సభ సందర్భంగా కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర స్వామి వారి ఆశీస్సులతో ఈ గ్రంధాన్ని ప్రచురించారు.  
పోతే, పురాణ వాజ్మయం గురించి అడిగారు కదా. వేదవ్యాసులవారు తొలుత బ్రహ్మ నుంచి వేదాలను గ్రహించారు. వాటిని నాలుగు భాగాలుగా విభజించి తన శిష్యులయిన పైల, వైశంపాయన, జైమిని, సుమంతులకు ఉపదేశించారు. వారు వారి శిష్యులకు, వారు తమ అనుయాయులకు పరంపరగా అందించారు.
ఇక వేదాల విషయంలో కూడా మన తెలుగు పండితులు విశేష కృషి చేశారు. సంస్కృతంలో వ్యాస విరచిత వేద వాజ్మయాన్ని దాశరధి రంగాచార్య గారు 70 ఏళ్ళ వయస్సులో అయిదు వేల  పేజీల్లో  తెలుగులోకి అనువదించారు.  ఇందులో ఒక భాగమయిన శుక్ల యజుర్వేదాన్ని ఎమెస్కో ఆర్షభారతి వారు రెండువేల సంవత్సరంలో ఆవిష్కరించారు.  
వేద వాజ్మయాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు సాయణాచార్యుడి ప్రసక్తి అనివార్యం. ఎందుకంటే ఆయన అచ్చ తెలుగువాడు. భారద్వాజగోత్రుడు. అనేక ప్రకాండులను సమకూర్చుకుని అనేకమయిన వేద వ్యాఖ్యానాలు రచించాడు.
సాయణాచార్యులవారు మరికొన్నింటికి కూడా వ్యాఖ్యలు రాశారు.
తైత్తిరేయ బ్రాహ్మణము,  ఆర్షేయ బ్రాహ్మణము, దేవాధ్యాయ బ్రాహ్మణము, ఉపనిషద్ బ్రాహ్మణము, సంహితోపనిషద్ బ్రాహ్మణము  వీటిల్లో ముఖ్యమయినవి.
ఈ గ్రంధాల్లో కొన్ని దొరుకుతున్నాయి. కొన్ని లభ్యం కావడం లేదు. ఆదరించేవారు తక్కువ కావడం ప్రధాన కారణం. అమెరికాలో వుంటూ కూడా ఇలాటి ప్రాచీన భారతీయ  సాహిత్యం  పట్ల మీవంటి వారు చూపుతున్న ఆసక్తే, చనిపోతున్న ఈ సాహిత్యాన్ని  బతికించాలి.
అప్పటికే సిగ్గుతో సగం చచ్చిపోయి వున్నానేమో ఆ అమ్మాయి మాటలకు ఏం జవాబు చెప్పగలనో మీరే చెప్పండి.
గమనిక: పుస్తక ప్రేమికులు శ్రీ దేవినేని మధుసూదనరావు గారు ఇంగ్లీష్ లో వాషింగ్టన్ పోస్ట్ విలేఖరి రాసిన ఓ అద్భుత వ్యాసాన్ని నాకు మెయిల్లో పంపారు. తమిళనాడు నేపధ్యంలో సాగిన రూపొందిన రచన అది. కొన్ని మార్పులను చేసి ఆ వ్యాస భావం చెడకుండా రాయడానికి చేసిన ప్రయత్నం ఇది. భండారు శ్రీనివాసరావు  (10-12-2012)

NOTE: Courtesy Image Owner 

7 వ్యాఖ్యలు:

sarma చెప్పారు...

This was published by u long back

Bhandaru Srinivasrao చెప్పారు...

@sarma - Sarnaji - Did you not observed the date on which I have posted in my blog. I mentioned the same in bold type (10-12-2012). Really long back. I appreciate your DHARANA POWER. - Bhandaru Srinivas Rao

Zilebi చెప్పారు...


కష్టే ఫలే వారు

భండారు వారు మళ్ళీ ప్రచురించటం లో అర్థం అప్పటికి ఇప్పటికీ కూడా పరిస్థితి ఏమీ మారలేదు అని చెప్పడానికి అయి ఉంటుంది అనుకుంటా

కాకుంటే దాశరథి రంగాచార్య వారి వార్త వారిని ఈ టపా మళ్ళీ ప్రచురించ డానికి కారణ మై ఉండ వచ్చు

మరో పదేళ్ళు తరువాయి వ్రాసినా ఈ టపా ఎవర్ గ్రీన్ టపా యే అయి ఉంటుందను కుంటా :)

జిలేబి

Bhandaru Srinivasrao చెప్పారు...

@Zilebi - అవునండీ కరెక్టుగా చెప్పారు. ఆ మహానుభావుడిని ఈ విధంగా స్మరించుకున్నాను.

Kondala Rao Palla చెప్పారు...

బాగుంది. నిన్న దాశరధి పై వార్తలు వస్తున్న సందర్భంలో ఆయన వేదాలను తెలుగులో అనువదించారని, అదీ డెబ్బై ఏండ్ల వయసులో అని స్పూర్తిదాయకమనిపించింది. ఈ పోష్టు కూడా అలానే ఉపయోగపడుతుంది. రీ పబ్లిష్ అయినా అవసరమైనదే. చివరిదాకా చదివితే అర్ధమయింది ఇది మీ అనుభవం కాదని :) . పోష్టులో మేటర్ కూడా చాలా చాలా బాగుంది. చాలా మందికి ఇది కనువిప్పు కలిగించేది.

Bhandaru Srinivasrao చెప్పారు...

@Kondala Rao Palla - Thanks.

Bhandaru Srinivasrao చెప్పారు...

@Kondala Rao Palla - Thanks.