22, జూన్ 2015, సోమవారం

జన్మ ధన్యం


'పిల్లా పాపలతో కలకాలం ఆనందంగా జీవించండి' పెళ్ళయిన జంటను పెద్దలు ఆశీర్వదించే తీరిది.
ఇలాటి ఆశీస్సు నిజంగా నిజమైన సందర్భం నిన్న తటస్థ పడింది.


(యువ దంపతులు వనం కోదండ రామారావు గారు, శ్రీమతి ఫణి రాజకుమారి గారు) 

ఒక కోదండరామారావు గారు, ఒక ఫణిరాజకుమారి గారు యాభయ్ ఏళ్ళక్రితం ఒకింటివారయ్యారు. నలుగురు అమ్మాయిలను కన్నారు. పెంచారు. విద్యాబుద్ధులు చెప్పించారు. పెళ్ళిళ్ళు చేసి వారి బాధ్యత నెరవేర్చుకున్నారు. నలుగురూ నాలుగు కుటుంబాల్లో కోడళ్ళు గా చేరి ఆఇంటి దీపాలుగా వెలుగులు పంచి పెడుతున్నారు. ఆ పిల్లలకు పిల్లలు. నిన్న అంతా కలిసి చూడ ముచ్చటగా ఆ పుణ్య దంపతుల యాభయ్యవ పెళ్లి వేడుకను కళ్ళు చెదిరేలా చేశారు. అల్లుళ్ళు సహకరించారు. అన్నేళ్ళ క్రితం వాళ్ల పెళ్ళికి హాజరయిన ఓ పెద్దమనిషి మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత పిల్లలు చేసిన పెద్దల పెళ్ళికి కూడా హాజరయి పాత సంగతులు గుర్తు చేసుకున్నారు. ఆ నాడు పెళ్లి చూడలేని ఈ తరం వాళ్లందరూ ఈ పెళ్లి వేడుకను కళ్ళారా చూసి ఆనందించారు. ఆశీస్సులు అందుకోవాల్సిన జంటను ఆశీర్వదించడానికి ఆ పెళ్లి మండపంలో ఆ జంటను మించిన పెద్దలు ఎవ్వరూ లేరు. అంచేత వాళ్ళే పెళ్ళికి వచ్చిన పిల్లా పాపలకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు.
'పిల్లాపాపలతో ఆనందంగా జీవించండి' అని యాభయ్ ఏళ్ళనాడు వాళ్ల పెద్దలు ఇచ్చిన ఆశీస్సులు నిజమైన సందర్భం నిన్న జరిగిన ఆ వేడుక. నలుగురు కుమార్తెలు, నలుగురు  అల్లుళ్ళు, వాళ్ల పిల్లలు ఆటా పాటలతో అలరిస్తే వేద పండితులు మంగళాక్షతలతో ఆశీర్వదించారు. అంత చక్కని వేడుక కళ్ళారా చూసిన వారికి భోజనాలు చేయకుండానే కడుపులు నిండిపోయాయి. ఆ తరువాత నిండయిన తెలుగు  భోజనంతో పొంగి పొర్లాయి.
అలా కన్నపిల్లల నడుమ, మనుమలు మనుమరాళ్ళ మధ్య ఇంత  చక్కటి వేడుక జరుపుకోవడం కంటే వేరే భాగ్యం ఏముంటుంది? ఇహపరమయిన ఇతర భోగభాగ్యాలన్నీ ఈ భాగ్యం ముందు దిగదుడుపు అనిపించింది.
జన్మధన్యం కావడం అంటే ఇదేనేమో!  (22-06-2015)

కామెంట్‌లు లేవు: