'ఈ పాడు ప్రపంచంలో అందరూ అందరే. ఎవరికీ మనగురించి
పట్టదు. మన మేలు కోరుకునే వాళ్లు ఎవళ్ళూ లేరు' అన్నాడు ఏకాంబరం
'అలా యెలా? అసలాసంగతి ముందు చెప్పు' అడిగాడు
లంబోదరం
'యెలా ఏమిటి? ఈ డాక్టర్లు వున్నారు చూడు, మనం
బాగుండకపోతేనే వాళ్లకు బాగుండేది. అందుకే ఏదో రోగం రొష్టూ రావాలనే వాళ్ల యావంతా'
'అలాగా'
'అలాగే. పోలీసులకి మనం ఒక దొంగ కావాలని, అయితే ఓ
పట్టు పట్టేసుకుని అడ్డదారిలో ఓ ప్రమోషనో,
రహదారిలో ఓ ఆమ్యామ్యానో నొక్కేద్దామని
దొంగచూపులు చూస్తుంటారు. లాయర్లూ అంతే! ఏదో ఒక కేసులో ఇరుక్కుంటే మనల్ని బయట పడేసి తాము బాగుపడిపోదామని వెధవది వాళ్లకు వెధవాశ.
పొట్టకొస్తే అక్షరమ్ముక్క రానివాళ్లమయితే ట్యూషన్లు చెప్పి నాలుగు డబ్బులు
పోగేసుకుందామని చూస్తారు టీచర్లు. ఇక మన ఇంటి ఓనరు వుంటాడు చూడు, మనం ఎప్పటికీ
ఏబ్రాసి మొహం వేసుకుని ఇలాగే సొంత ఇల్లు
కొనుక్కోకుండా, జీవిత పర్యంతం వాడికి కిరాయి కడుతూ అద్దె ఇంట్లోనే అఘోరించాలని
పాడు ఏడుపు. పోనీ ఆ పంటి వైద్యుడికయినా మనమీద కనికరం వుందా అంటే అదీ లేదు, మనం
పుటకతోనే పుచ్చిన పళ్ళతో పుడితే పండగ చేసుకునే రకం. మన స్కూటరు పంక్చరు కావాలని,
కారు ఇంజిను రీబోరింగుకు రావాలని మెకానిక్కులు
దేవుడికి మొక్కుకున్నా ఆశ్చర్యం లేదు. ఏం చెప్పమంటావు లంబోదరం, ఈ లోకంలో అందరూ మన కీడు కోరుకునేవారే. ఒక్క దొంగ
తప్ప. వీళ్ళందరికన్నా ఇళ్లకు కన్నాలు వేసే ఆ దొంగే మిన్న'
'దొంగా! అదెలా!' నోరెళ్ళబెట్టి అడిగాడు లంబోదరం'
ఏకాంబరం చెప్పిన జవాబుతో లంబోదరం తెరుచుకున్న
నోరు మళ్ళీ మూతపడకుండా అలాగే వుండిపోయింది.
'ప్రతి ఒక్కరూ బాగుపడాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో
ఒంట్లో పుష్కలంగా వుండాలి. ఏడువారాల నగలు చేయించుకోవాలి. బ్యాంకుల్లోనే కాదు ఇళ్లల్లోను
దాచుకునేంత దండిగా డబ్బులుండాలి. రాత్రి పూట హాయిగా గురక పెట్టి నిద్రపోవాలి' అని
మనసారా కోరుకునే శ్రేయోభిలాషి నిజానికి ఈ సృష్టి మొత్తంలో దొంగ ఒక్కడే. కాదంటావా
లంబోదరం!
(30=06=2015)
Note :
Courtesy Image Owner
1 కామెంట్:
హ హ హ .....
కామెంట్‌ను పోస్ట్ చేయండి