17, జూన్ 2015, బుధవారం

రాజకీయాల్లో విలువలు

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 18-06-2015, THURSDAY)

"ఇదొక యుద్ధం. ఒక యుద్ధాన్ని గెలవడానికి ఓ పోరాటంలో ఓడిపోయినా పరవాలేదన్నది నా సిద్ధాంతం.  నేను చెబుతున్నాను.  మళ్ళీ నేను నిలబడతాను. నిలబడి పోరాడతాను. టీవీ పెట్టి చూడండి. ఆట మొదలయింది"
"మరో అందమయిన ప్రదేశం చేరుకోవడానికి విమానం ఎక్కాను" అని చెప్పడానికి ముందు లలిత్  మోడీ ట్విట్టర్ లో రాసిన వాక్యాలు ఇవి. ఇంగ్లీష్ లో ఆయన ట్వీట్ చేసిన దానికి కాస్త అటూ ఇటూగా తెలుగు అనువాదం ఇది.
ఎవరీ లలిత్  మోడీ అని వేరే చెప్పక్కర లేదు. గతంలో కంటే ఈ మధ్య మీడియాలో ప్రత్యేకించి జాతీయ మీడియాలో అనుదినం నలుగుతున్న పేరిది. పేరులో మోడీ అని వున్నా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఈ లలిత్ మోడీకి ఎలాటి సంబంధ బాంధవ్యాలు లేవు. అయినా ప్రస్తుతం లలిత్ మోడీ చిక్కుకున్న వివాదంలో ప్రధాని మోడీ పేరు కూడా అక్కడక్కడా వినబడుతోంది. వినబడ్డమే కాదు ప్రధాని మోడీ తన పదవికి రాజీనామా చేయాలని  డిమాండు చేసేవరకు కొందరు ఈ వివాదాన్ని సాగదీస్తున్నారు.
ముందు లలిత్ మోడీ వ్యవహారం చూద్దాం. అది చూడాలంటే కాసేపు క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టాలి.
పూర్వం క్రికెట్ పోటీలు రెండు జట్ల నడుమ అయిదు రోజులపాటు జరిగేవి. రెండు జట్లు దాదాపు ఒకే మోస్తరు తెల్లని దుస్తులు ధరించి ఆడేవారు. కాలం  గడుస్తున్న కొద్దీ, జీవన వేగం పెరుగుతున్న కొద్దీ, దశాబ్దాల తరబడి ఆడుతున్న ఈ దొరల ఆటలో కూడా కొన్ని మార్పులు అనివార్యం అయ్యాయి. ఫలితంగా అయిదు రోజుల ఆటకు  పూర్తిగా భరత వాక్యం పలకకుండా, యాభయ్ పరిమిత ఓవర్ల ఒకరోజు క్రికెట్ పోటీలు వూపందుకున్నాయి. క్రమేణా  ఈ వన్ డే మ్యాచులకు ప్రజల్లో ఆదరణ పెరగడం మొదలయింది. ఆటగాళ్ళ దుస్తుల్లో, ఆట మైదానం రూపురేఖల్లో, ఆటని బుల్లి తెరలపై అద్భుతంగా చూపించే తీరులో అనేక మార్పులు వచ్చాయి. అంతర్జాతీయ క్రికెట్ పోటీ ఒక్కదానిలో అడుగుపెడితే చాలు ఆ ఆటగాడి భవిష్యత్తే పూర్తిగా మారిపోయే వాణిజ్య ధోరణులు క్రికెట్ ఆటలో చోటు చేసుకోవడం కూడా మొదలయింది. దానాదీనా ఈ ఆటలో విలువలు దిగజారి, డబ్బుకు పెద్దపీట వేసే పెడధోరణి పీఠం వేసుకుని కూర్చుంది. అలా అలా జరిగి పోతున్న క్రికెట్ కధ వున్నట్టుండి పెద్ద మలుపు తిరిగింది. యాభయ్ ఓవర్ల వన్ డే మ్యాచ్ ని మించిన 'ట్వంటీ ట్వంటీ' మ్యాచ్ రూపుదిద్దుకుంది. దానితో,  క్రికెట్ ఆట రంగూ రుచీ ఒక్కసారిగా మారిపోవడంతో పాటు, హంగులు, హొయలు కూడా రంగప్రవేశం చేసాయి. 'చీర్  గాళ్స్' పేరుతో,  అర్ధ నగ్న సుందరీమణులు అటు ఆటగాళ్లను, ఇటు ప్రేక్షకులను రంజింప చేయడానికి బహిరంగ మైదానాల్లో అరంగ్రేట్రం చేశారు. దాంతో డబ్బు వెదజల్లి టిక్కెట్లు కొనే ప్రేక్షకులు పెరిగారు. నిర్వాహకులకు రాబడి పెరిగింది. ఇక ఆటగాళ్ల సంగతి చెప్పక్కర లేదు, అనతికాలంలోనే కోట్లకు పడగెత్తే  సువర్ణావకాశం వారి వొళ్ళో పడింది. అందర్నీ అన్ని రకాలుగా సంతోషపెట్టి సంతోషపడే కొత్త క్రికెట్ కు ఆద్యుడు ఎవరయ్యా అంటే, ఇదిగో మనం ముందు చెప్పుకున్న లలిత్ మోడీ.  ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనే పేరుతో 2008 లో లలిత్ మోడీ ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ అతి కొద్ది కాలంలోనే పెరిగి పెద్ద వట వృక్షంగా తయారయింది. అందులో అతితేలిగ్గా ప్రవేశించిన వాణిజ్య ధోరణులు సయితం అలాగే పెరిగి పెద్దవవుతూ కాలక్రమంలో వెర్రితలలు వేయడం మొదలెట్టాయి. త్వరగా సులభంగా డబ్బు సంపాదించడం ఎట్లాఅని ఆలోచించేవాళ్ళు, ఆ వేగంలో, వురవడిలో  కాలుజారడం కూడా అంతే తేలిక. లలిత్ మోడీ దీనికి భిన్నం ఏమీ కాదు. అలాగే జరిగింది కూడా. ఎదుగుదల యెంత వేగంగా జరిగిందో పతనం కూడా దానికి రెట్టింపు వేగంతో సాగింది. ఫలితం స్వదేశంలో మీద పడ్డ కేసులను ఎదుర్కోలేక పరాయి దేశంలో రోజులు వెళ్ళ దీయాల్సిన దుస్తితి దాపురించింది. ఈ కధ ఇంతటితో ఆగితే ఇలాటివాళ్ళను గురించి ఈ నాడు ఇంతగా తలచుకోవాల్సిన పరిస్తితి వుండేది కాదు. ఈరకమైన వ్యక్తులు తమకు తాము అపకారం చేసుకోవడం మాత్రమే కాదు, తమను గుడ్డిగా నమ్మిన వారికి కూడా కీడు కలిగిస్తారు. ఈ క్రమంలో జరిగిన పరిణామాలే ఈనాడు జాతీయ మీడియాలో చర్చోపచర్చలకు, జాతీయ పార్టీలయిన బీజేపీ, కాంగ్రెస్ ల నడుమ రచ్చరచ్చకు దారి తీస్తున్నాయి.
ఈ లలిత్ మోడీ విషయం కాసేపు పక్కన పెడదాం.
నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీయే కూటమిని మట్టి కరిపించి కేంద్రంలో అధికార పీఠం ఎక్కింది. భారత రాజకీయాల్లో మోడీ సాధించింది అద్వితీయ విజయమని అందరూ వేనోళ్ళ పొగిడారు.  ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంలో కూడా మోడీ ప్రభుత్వం సాధించిన ఘన విజయాల జాబితాలో ఘనంగా పేర్కొన్నది కూడా గత ఏడాది కాలంలో తమ ప్రభుత్వం ఎలాటి మచ్చలేని స్వచ్ఛ పాలనను ప్రజలకు అందించిందన్న విషయాన్నే. ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయంలో మోడీ ప్రభుత్వాన్ని నిలదీయలేని నిస్సహాయ స్తితి.
సరిగ్గా ఇదే సమయంలో  లలిత్ మోడీ వ్యవహారం తెర మీదకు వచ్చింది.
ఇంగ్లండులో తలదాచుకుంటున్న లలిత్ మోడీకి అత్యవసరంగా పోర్చుగల్ ప్రయాణం పడింది. అనారోగ్యంతో వున్న ఆయన భార్యకు అవసరమయిన వైద్యసాయం అక్కడ లభిస్తుందని ఆయన భావించారు. అందులో తప్పుపట్టడానికి ఏమీ లేదు. వచ్చిన చిక్కల్లా ఇంగ్లండు నుంచి పోర్చుగల్ వెళ్ళాలంటే తగిన అనుమతి పత్రాలు అక్కడి ప్రభుత్వం ఇవ్వాలి. అలా ఇస్తే రెండు దేశాల నడుమ సంబంధాలు దెబ్బతింటాయని బ్రిటిష్ ప్రభుత్వం సంకోచించింది. ఈ సమయంలో లలిత్ మోడీ తరపున భారత విదేశాంగ మంత్రిగా వ్యవహరిస్తున్న సుష్మా స్వరాజ్ కు అభ్యర్ధన వచ్చింది. రాజకీయాల్లో వున్నవాళ్ళకు ఇలాటి సిఫారసు లేఖల గొడవ తప్పనిసరి తలనొప్పి. ఇష్టం వున్నా లేకపోయినా, సిఫారసు చేసే వ్యక్తులతో ముఖ పరిచయం వున్నా లేకపోయినా రాజకీయ నాయకులు సిఫారసు చేయక తప్పని ఒత్తిడి వారిపై వుంటుంది. అందుకే సుష్మా స్వరాజ్ కూడా ఆ ఒత్తిడికి  లొంగి లలిత్ మోడీ విషయంలో ఒక సిఫారసు చేశారు. 'మీకున్న నియమ నిబంధనల పరిధిలోనే అనుమతి పత్రాలు ఇవ్వండి' అని ఆమె సిఫారసు చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇందులో ఆక్షేపించడానికి ఏమీ లేదు. కానీ ఆ మంత్రి తమ సిఫారసు లేఖలో మరో పేరా జోడించారు. 'మీరు తీసుకునే నిర్ణయం ఉభయ దేశాల సంబంధాలపై ఏమాత్రం ప్రభావం చూపదు' అని. ఇలా రాయడం ద్వారా, 'లలిత్ మోడీకి సాయం చేయండి' అని నిర్ద్వందంగా చెప్పినట్టయింది. మోడీకి పరోక్షంగా సర్టిఫికేట్ ఇచ్చినట్టు అయింది.
సరే. ఆ తరువాత లలిత్ మోడీకి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆయన పోర్చుగల్ వెళ్ళి తన పని పూర్తి చేసుకుని ఇంగ్లండు కూడా తిరిగి వచ్చేసారు. దాంతో కధ కంచికి పోవాలి. అలా జరిగితే కధ యెలా అవుతుంది. అందుకే సామాజిక మాధ్యమాల పుణ్యమా అని మళ్ళీ వెలుగులోకి వచ్చి, 'అనేక కేసుల్లో చిక్కుకున్న లలిత్ మోడీకి ఎలా అలా  సిఫారసు లేఖ ఇస్తారు' అనే ప్రశ్నతో మొదలయి ఇప్పుడది మోడీ ప్రభుత్వం మెడకు చుట్టుకుంది.
కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు లేఖ ఇచ్చిన సుష్మా స్వరాజ్ ని రాజీనామా చేయాలని షరామామూలుగా పట్టుబడుతున్నాయి. అలా చేసేది లేదని బీజేపీ అగ్ర నాయకులు అంతే షరా మామూలుగా   తెగేసి చెబుతున్నారు.


(చుట్టరికం లేకుండా చిక్కుల్లో పడ్డ ఇద్దరు మోడీలు)


మామూలుగా అయితే ఇదంతా వడ్ల గింజలో బియ్యపు గింజ మాదిరి తేలిపోవాల్సిన వివాదం. కానీ మోడీ ప్రభుత్వం నైతిక విలువలు గురించి ఘనంగా చెప్పుకుంటోంది కనుక సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్తితి.
ఇక్కడే రాజకీయాల్లో నైతిక విలువలు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. రాజీనామా చేయాలని  డిమాండు చేయడం యెలా మోతాదుకు మించిన సంగతో, అలానే 'చేయను గాక చేయను' అని భీష్మించుకు కూర్చోవడం కూడా అదే వరస.
రాజీనామా చేయాలని కాంగ్రెస్ కోరనక్కరలేదు. రాజీనామా చేయమని ప్రధాని మోడీ తన మంత్రివర్గ సహచరురాలికి సూచించనక్కరలేదు. రాజకీయాల్లో విలువలు గురించి మాట్లాడేవాళ్లందరూ ఎవరికి వాళ్లు తమకు తాముగా తీసుకోవాల్సిన నిర్ణయం. అలా చేయడం వల్ల ఇప్పటికే మసకబారుతున్న ప్రజాస్వామ్య విలువలకు కాస్త వూపిరి వూదినట్టవుతుంది.
ఈ సూత్రం సుష్మా స్వరాజ్ ఒక్కరికే కాదు రాజకీయాల్లో వున్న ప్రతిఒక్కరికీ వర్తిస్తుంది. (17-06-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595
NOTE: Courtesy Image Owner

5 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

కొన్ని కొన్ని విషయాలు చూసే కళ్ళని బట్టి వేర్వేరు రంగు రుచి వాసనలతో కనబడటంలో వింతలేదు.

ఒక అనారోగ్యంతో ఉన్న మనిషికి వైద్యసహాయం అందించటానికి ఎవరైన పరోక్షంగా కాని ప్రత్యక్షంగా కాని పరిధులను మీరకుండా సహకారం అందిస్తే అందులో అక్షేపించవలసినది ఏమీ లేదు.

ఇది సాధారణంగా అందరికి సమ్మతమయ్యే మాటే.
కాని రాజకీయదృక్కోణాలు అవసరార్థం పెడర్థాలు వెదకుతాయి.
రగడలు చెలరేగుతాయి!

జబ్బుతో ఉన్న ఖైదీలను మానవతాదృక్పధంతో విడుదలచేయటం కూడా సమాజం అక్షేపించటం తక్కువ.
రాజకీయకారణాలతో ఒక జబ్బుమనిషికి సాయం చేయటాన్ని అక్షేపించటం బాగోలేదు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@శ్యామలీయం - "........ఇష్టం వున్నా లేకపోయినా, సిఫారసు చేసే వ్యక్తులతో ముఖ పరిచయం వున్నా లేకపోయినా రాజకీయ నాయకులు సిఫారసు చేయక తప్పని ఒత్తిడి వారిపై వుంటుంది. అందుకే సుష్మా స్వరాజ్ కూడా ఆ ఒత్తిడికి లొంగి లలిత్ మోడీ విషయంలో ఒక సిఫారసు చేశారు. 'మీకున్న నియమ నిబంధనల పరిధిలోనే అనుమతి పత్రాలు ఇవ్వండి' అని ఆమె సిఫారసు చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇందులో ఆక్షేపించడానికి ఏమీ లేదు. కానీ ఆ మంత్రి తమ సిఫారసు లేఖలో మరో పేరా జోడించారు. 'మీరు తీసుకునే నిర్ణయం ఉభయ దేశాల సంబంధాలపై ఏమాత్రం ప్రభావం చూపదు' అని. ఇలా రాయడం ద్వారా, 'లలిత్ మోడీకి సాయం చేయండి' అని నిర్ద్వందంగా చెప్పినట్టయింది. మోడీకి పరోక్షంగా సర్టిఫికేట్ ఇచ్చినట్టు అయింది.........."

Jai Gottimukkala చెప్పారు...

లలిత్ మోడీ పై ఈడీ కేసులు ఉన్నాయి. ఇంగ్లాండు వారు భారత దేశంలో నేరారోపణలు ఎదురుకుంటున్న ముద్దాయిలను ఎక్స్త్రాడైట్ చేయరు కానీ పోర్తుగాల్ గతంలో ఈ విషయంలో మనతో సహకరించింది.

శ్యామలీయం చెప్పారు...

ఈ ముక్కా చదివాను మీ వ్యాసంలో.

నియమ నిబంధనల పరిధిలోనే అనుమతి పత్రాలు ఇవ్వటంలో అక్షేపించటానికి ఏమీ లేదు. కాని ఆ సంగతిని కూడా రాజకీయం చేస్తున్నారా లేదా పరిశీలించగలరు. నాకైతే తెలియదు.

ఒక జబ్బుమనిషికి వైద్యసహాయం కోరినట్లుగా అందటానికి తీసుకునే నిర్ణయం ఉభయ దేశాల సంబంధాలపై ఏమాత్రం ప్రభావం చూపదన్న మాట కూడా అక్షేపించదగినది కాదనే అనుకుంటాను.

పాకిస్తాన్ మనకు శత్రుదేశమైనప్పటికీ పాకిస్థానీయులు మనదేశంకోసం వైద్యానికి రావటాన్ని ఆదేశమూ ఈదేశమూ కూడా రాజకీయాల పేరుతో అడ్డుకుంటోందా? లేదు కదా? అటువంటప్పుడు, (ఇలా వైద్యసంబందమైన అవసరం కోసం తీసుకునే) నిర్ణయం ఉభయ దేశాల సంబంధాలపై ఏమాత్రం ప్రభావం చూపదు అని అనటంలో 'లలిత్ మోడీకి సాయం చేయండి' అని నిర్ద్వందంగా చెప్పినట్టయింది అని ఎందుకు మనం దురర్థం తీయాలో బోధపదదు. ఇది మోడీకి పరోక్షంగా సర్టిఫికేట్ ఇచ్చినట్టు కానే కాదు. కాని ముందు నేను చేసిన వ్యాఖ్యలో అన్నట్లుగా రాజకీయాది దృక్పధాలను బట్టి చూచేవారి వివిధరకాలుగా విషయాలను అర్థం చేసుకోవటం అటువంటి వక్రీకరణలు (కొన్ని అనుద్దిష్టం, కొన్ని కావాలని ఉద్దేశించి) చేయటం జరుగుతోందని అనిపిస్తోంది.

నేను రాజకీయవిశ్లేషకుణ్ణి కాను కాబట్టి నాదే పొరపాటని అనవచ్చునేమో.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@శ్యామలీయం - అలా అనుకోకండి. ఇది పత్రిక కాదు. ఎవరి అభిప్రాయాలు వాళ్లు స్వేచ్చగా చెప్పుకోవచ్చు. ఓకే అంశం మీద విభిన్నమైన అభిప్రాయాలు వుండడం అతి సహజం. అందరూ తమతో ఎకీభవించాలి అనే ఉద్దేశ్యంతో రాస్తే మనం చెప్పాలనుకున్నది చెప్పలేకపోయే అవకాశం వుంటుంది. నా అభిప్రాయంతో మీరు ఏకీభవించనంత మాత్రాన నేను రాసేదే రైటు అని నేననుకుంటే నా అంత మూర్ఖుడు మరొకడు వుండరు. నేను దీన్ని అభిప్రాయాలు పరస్పరం తెలియచెప్పుకునే వేదికగానే పరిగణిస్తాను. తెలియనిది నేర్చుకోవడానికి, తప్పు రాస్తే సరిదిద్దుకోవడానికి కూడా వెసులుబాటు వున్న వేదిక.ధన్యవాదాలు. - భండారు శ్రీనివాసరావు