27, జూన్ 2015, శనివారం

పీవీ గారి జ్ఞాపకాలు

(PUBLISHED BY 'SURYA' TELUGU DAILY ON 28-06-2-15, SUNDAY)

(జూన్ ఇరవై ఎనిమిది పీవీ నరసింహారావు జయంతి)  
పీవీ నరసింహారావు ప్రధానిగా వున్నంతకాలం అందరూ ఆహా! ఓహో!! అన్నారు. పీకలలోతు  సమస్యల్లో కూరుకుపోయివున్న దేశ ఆర్ధిక వ్యవస్థను నూతన సంస్కరణలతో ఒడ్డున పడేసిన మేధావిగా కీర్తించారు. సంఖ్యాబలం  బొటాబొటిగా వున్న పాలకపక్షాన్ని అయిదేళ్ళ పాటు పూర్తి కాలం అధికార పీఠంపై వుంచిన అపర చాణక్యుడని  వేనోళ్ళ పొగిడారు. అధికారం దూరం అయిన తరువాత,  పదవి నుంచి దిగిపోయిన తరువాత  పొగిడిన  ఆ నోళ్ల తోనే  ఆయన్ని  తెగడడం ప్రారంభించారు. పదవికి ప్రాణం ఇచ్చే పార్టీ నాయకులు ఆయన పదవికి దూరం కాగానే వాళ్ళూ దూరం జరిగారు. పోనీ  ఆయన తరవాత కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన వ్యక్తి సీతారాం కేసరికి పీవీని  మించిన గొప్ప లక్షణాలేమీ లేవు. కానీ పదవే సర్వస్వమయిన  కాంగ్రెస్ వారికి  కేసరి భజనే సర్వస్వమయిపోయింది. మాజీగా మారిన పీవీపై విమర్శల దాడి మొదలుపెట్టిన కాంగ్రెస్  పార్టీ పత్తిత్తులకు ఆయన చేసిన మేళ్ళు కానరాలేదు.


అయిదేళ్ళు తెలుగువాడి లోని వాడినీ  వేడినీ లోకానికి చాటిచెప్పిన వృద్ధ రాజకీయవేత్త  న్యాయస్థానాలలో నిస్సహాయంగా బోనులో నిలబడినప్పుడు,  ఆయన పార్టీ వాళ్ళెవ్వరూ ఆయనను పట్టించుకోక పోగా ఏమీ తెలియనట్టు కళ్ళు’, నోళ్ళు  మూసుకున్నారు. ప్రధానిగా ఆయన హయాములో జరిగిన తప్పులను  సమర్ధించడం ఈ వ్యాసకర్త వుద్దేశ్యం కాదు. రాజకీయాల్లో కృతజ్ఞత, ‘విధేయత  అనే పదాలకి  తావు లేకుండా పోయిందన్న విషయాన్ని విశదం చేయడానికే ఈ ఉదాహరణ.

పీవీ మరణించడానికి కొన్ని నెలలముందు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్ లో బస చేసారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ దిగినప్పుడు కనబడే హడావిడి యెలా వుండేదో  ఒక విలేకరిగా నాకు తెలుసు.  ఆయన చుట్టూనే కాదు చుట్టుపక్కల ఎక్కడ చూసినా  అధికారులు, అనధికారులు, మందీ మార్బలాలు, వందిమాగధులు,  ఆయన కళ్ళల్లో పడితే చాలనుకునే రాజకీయనాయకులు  ఆ వైభోగం వర్ణించ తరమా? అన్నట్టు వుండేది.
ఒక్క పీవీ అనే కాదు ప్రధానమంత్రి ఎవరయినా సరే,  రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు అంటే చాలు యావత్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయిపోయేవి. శాఖల వారీగానే కాదు అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ఉన్నతస్థాయి సమావేశాలు జరిపి ప్రధాని పర్యటన ఏర్పాట్లు సమీక్షించేవారు. ఆకాశవాణి, దూరదర్శన్ ల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రధాని పాల్గొనే ప్రతి కార్యక్రమాన్ని రెండు టేపుల్లో  రికార్డు చేయడానికి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో  ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసేవారు. కార్యక్రమం ముగియగానే ఆ వివరాలు రాసివున్న ఒక టేపును అక్కడికక్కడే ప్రధాని బృందంలోని అధికారులకు అందచేసేవారు. అవన్నీ ప్రధాని పాటు ఢిల్లీ చేరిపోయి ఆ తరువాత ప్రధాని కార్యాలయంలోని 'ఆర్చివ్స్' విభాగానికి చేరేవి. ఇప్పుడంటే మొబైల్స్ వచ్చాయి కనుక ఇబ్బంది లేదు. పూర్వం ప్రధాని ప్రసంగించే వేదిక దగ్గరగా టెలిఫోన్స్ డిపార్టుమెంటు వాళ్లు, దేశంలో ఎక్కడికయినా మాట్లాడగలిగే ఫోనును అమర్చేవారు. ఆ ఫోను ఎవరికి ఉపయోగపడిందో లేదో తెలవదు కాని ప్రధాని పర్యటన సమాచారం ఢిల్లీ, హైదరాబాదు, విజయవాడలకు ఫోను చేసి చెప్పడానికి రేడియో విలేకరిగా నాకు పలుసందర్భాల్లో ఉపయోగపడిన మాట వాస్తవం. పీవీ ప్రధానమంత్రిగా వున్నప్పుడు బేగంపేటలోని  ఒక సందులో వున్న స్వామి రామానంద తీర్ధ ట్రస్టు కార్యాలయానికి వచ్చేవారు. ఇక అక్కడ చూడాలి అధికారులు, అనధికారుల హడావిడి. ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తరువాత అక్కడ జరిగిన ట్రస్టు సమావేశాలకు కూడా  హాజరయ్యేవారు. వాటిని కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు 'అధికారాంతమునందు...' అనే పద్యపాదం  జ్ఞాపకం చేసుకోవాలో, 'ఈ కర్మభూమిలో పదవి, అధికారం ముందు అన్నీ దిగదుడుపే' అనే నిజాన్ని హరాయించుకోవాలో నాకు అర్ధం అయ్యేది కాదు.
పీవీ గురించిన మరో జ్ఞాపకం నా మదిలో వుండిపోయింది.      

మాజీ ప్రధానిగా పీవీ  రాజ భవన్ లో వున్నప్పుడు  నేనూ , ఆకాశవాణిలో నా సీనియర్ కొలీగ్   ఆర్వీవీ కృష్ణారావు గారు  - గవర్నర్ రికార్డింగ్ నిమిత్తం  వెళ్లి -  పని పూర్తిచేసుకున్నతరవాత - రాజ్ భవన్  గెస్ట్ హౌస్ మీదుగా తిరిగి  వెడుతూ అటువైపు తొంగి చూసాము. సెక్యూరిటీ మినహా రాజకీయుల హడావిడి కనిపించక పోవడంతో మేము లోపలకు వెళ్ళాము.  ‘పీవీ గారిని చూడడం వీలుపడుతుందా అని అక్కడవున్న భద్రతాదికారిని  అడిగాము. అతడు తాపీగా  'లోపలకు వెళ్ళండి' అన్నట్టు సైగ చేసాడు. ఆశ్చర్యపోతూ లోపలకు అడుగు పెట్టాము.


పెట్టిన తరవాత  మా ఆశ్చర్యం రెట్టింపు అయింది. పీవీ ఒక్కరే కూర్చుని టీవీలో ఫుట్ బాల్  మాచ్  చూస్తూ కనిపించారు. డిస్టర్బ్ చేశామేమో అన్న ఫీలింగుతోనే - మమ్మల్ని పరిచయం చేసుకున్నాము. లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకునివున్న పీవీగారు  నా వైపు చూస్తూ- 'మీ అన్నయ్య పర్వతాలరావు  ఎలావున్నాడయ్యా !' అని అడిగేసరికి నాకు మతి పోయినంత పనయింది. ఎప్పుడో  దశాబ్దాల క్రితం పీవీగారు ముఖ్యమంత్రి గా వున్నప్పుడు - రాష్ట్ర సమాచార శాఖలో పనిచేస్తున్న మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు  ఆయనకు పీఆర్వో గా కొద్దికాలం పనిచేశారు. అసలు పీవీ గారు  ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం. అప్పటి విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన  అవసరం ఆయనకు లేదు.  అయినా ఆప్యాయంగా గుర్తు పెట్టుకుని మరీ అడిగారు. అదీ  పీవీగారి గొప్పతనం.  ఆ తరవాత కూడా  ఆయన ఏదో మాట్లాడుతున్నారు  కానీ మాకు కలయో వైష్ణవ మాయయో అన్నట్టుగావుంది. మేము కలసి కూర్చుంది  కొన్నేళ్ళ క్రితం వరకు దేశాన్ని వొంటి చేత్తో పాలించిన వ్యక్తితో అన్న స్పృహ వుండడం వల్ల  కొంత ఇబ్బంది పడుతూ కూర్చున్నాము. కాసేపటి తరవాత  కొణిజేటి రోశయ్య గారు వచ్చారు. ఆయన్ని చూడగానే  పీవీ గారి మొహంలో ఒక రిలీఫ్ కనిపించింది. రోశయ్య గారు వచ్చిన తరువాత కాసేపు వుండి మేము వచ్చేశాము. ఇది జరిగి  ఏళ్ళు గడిచిపోయాయి కానీ ఈ చక్కని జ్ఞాపకం మాత్రం మా గుండెల్లో ఇంకా తాజాగానే వుంది.  మరోసారి వారిని ఢిల్లీలో కలిసాను. రేడియో మాస్కోలో పనిచేయడానికి మాస్కో వెడుతూ అప్పుడు కేంద్రమంత్రిగా అత్యంత ఉచ్ఛ స్థానంలో వున్న  పీవీ గారిని కలుద్దామని వెళ్లాను. బంగ్లా అంతటా  నిశ్శబ్ధం. కాసేపటి తరువాత ఎవరో అటుగా వస్తే 'పీవీ గారిని కలవడానికి వీలుంటుందా' అని హిందీలో అడిగాను. ఆతగాడు బంగ్లాలో ఓ గది చూపించి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా తలుపు తోసి చూస్తే ఎదురుగా పీవీ గారు. ఎవ్వరూ లేరు. పరిచయం చేసుకుని మాస్కో వెడుతున్నట్టు చెప్పాను. అప్పుడు ఆయన విదేశాంగ మంత్రి అనుకుంటాను. నా మొహంలో భావాలు పసికట్టినట్టున్నారు. 'పనులు చేసి పెడుతూ వుంటే కదా పదిమంది వచ్చేది' అన్నారు ఆయన తన మొహంలో భావాలు ఏమీ తెలియకుండా. 'మాస్కో ఎందుకయ్యా వేరే దేశంలో మీ రేడియో ఉద్యోగాలు లేవా ? బాగా చలిదేశం. పెళ్ళాం పిల్లలతో ఎలావుంటావు' అని అడిగారు. చాలా ముక్తసరిగా మాట్లాడేవారని పేరున్న పీవీ గారు నేను వూహించని విధంగా చనువుగా ఆ రెండు ముక్కలు మాట్లాడ్డం నా అదృష్టం అనే భావిస్తాను.
అలాటి మహానుభావుడు మరణించినప్పుడు ఆయన పార్టీ వాళ్లు ప్రవర్తించిన తీరు మరింత బాధాకరం.
కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణా ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పీవీ జయంతి, వర్ధంతి రెండింటినీ అధికారికంగా నిర్వహించాలని తలపెట్టడం ఓ వూరట.
పీవీ స్మృతికి నా నివాళి. (27-06-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

11 కామెంట్‌లు:

నీహారిక చెప్పారు...

ఎప్పటి సంగతో ఇది,ఇప్పుడు కేంద్రమంత్రులూ,ప్రధాన మంత్రులూ ట్విట్టర్ లో ఫేస్ బుక్ లో తప్ప బయట దొరకరు.మాజీలు కూడా దొరకడం కష్టం. మీరు జర్నలిస్టు కాబట్టి ఐడెంటిటీ చూపిస్తే లోపలికి వెళ్ళనిస్తారేమో కానీ మాలాంటి వాళ్ళకి పీ ఏ వరకూ మాత్రమే వెళ్ళగలం. పోనీ ట్విట్టర్లో అయినా దొరుకుతారా అంటే వాళ్ళు ట్వీట్ చేసే" మన్ కీ బాత్ "లు మనం వినవలసిందే కానీ మన "మన్ కీ బాత్" వారు చూసే అవకాశమే లేదు.
ఒక జర్నలిస్ట్ గా కాకుండా సామాన్యుడుగా ట్వీట్ చేసి చూడండి.

నీహారిక చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Jai Gottimukkala చెప్పారు...

"ప్రధానిగా ఆయన హయాములో జరిగిన తప్పులను సమర్ధించడం ఈ వ్యాసకర్త వుద్దేశ్యం కాదు"

"ప్రధానిగా ఆయన *తన* హయాములో చేసినట్టు *చెప్పబడుతున్న* తప్పులను *మరియు నేరాలను* సమర్ధించడం ఈ వ్యాసకర్త వుద్దేశ్యం కాదు" అంటే బాగుండేదేమో?

"కానీ ‘పదవే’ సర్వస్వమయిన కాంగ్రెస్ వారికి ‘కేసరి భజనే’ సర్వస్వమయిపోయింది"

అద్వానీ/మోడీ ఉదాహరణ కూడా ఇంతే కదండీ

"సెక్యూరిటీ మినహా రాజకీయుల హడావిడి కనిపించక పోవడంతో మేము లోపలకు వెళ్ళాము"

పదవి ఊడినాక వాజపేయీ గారి పరిస్తితి ఏమిటో చూస్తూనే ఉన్నాం

నీహారిక చెప్పారు...

వాజ్ పేయి గారు మాజీ ప్రధాని మరియు అనారోగ్యంతో ఉన్నారు.ఆయనని కలవడం కూడా సాధ్యం కాదు.సెక్యూరిట్ వరకే వెళ్ళగలం.అద్వానీ గారు కూడా ఎవరినీ కలవరు.రాహుల్ గాంధీ గారయితే మరీ ఘోరం వాళ్ళు గడిపే జైలు జీవితం పగవాళ్ళకి కూడా ఉండకూడదు.ఇందిర గారు చనిపోయిన దగ్గరనుండీ గృహనిర్బంధమే ! చుట్టూ ఉన్న కోటరీ దాటి వెళ్ళడం చాలా కష్టం.కనీసం మెయిల్స్ అయినా చూస్తారా అంటే అదీ లేదు.

నీహారిక చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
నీహారిక చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
నీహారిక చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
నీహారిక చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Jai Gottimukkala చెప్పారు...

@నీహారిక:

మీరు మాట్లాడుతున్నది వారికి ఉండే భద్రతా వలయం గురించి. నేను నరసింహా రావు గారికి జరిగినట్టు చెప్పబడుతున్న నిరాదరణ గురించి రాసాను.

It is very fashionable these days to claim PV (or NTR or others whom the speaker likes) was mistreated. This is almost always linked to the speaker's favorite "bias theory".

ఉ. "పీవీ నరసింహా రావు తెలుగు వారు కాబట్టే ఆయన్ను అనుమానించారు. ఇదే ఆయన ఉత్తర భారతీయుడయితే జరిగేనా" వంటి పిడివాదనలు. వీటికి జవాబు "వాజ్పీయీ గతి కూడా ఇంతే"

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Jai Gottimukkala - Englishlo 'alleged to have been, said to have been ..'అనే పద ప్రయోగాలు వున్నాయి. తెలుగులో మీరు చెప్పిన 'బడు' ధాతువు వుంది. కానీ మాది 'నార్ల స్కూలు'. ఆయన ఎటువంటి పరిస్తితిలో అనబడు, చెప్పబడు' అని రాయనిచ్చేవారు కాదు. అలాగే 'యొక్క' తెలుగు భాషకు 'బొక్క' అని ఎద్దేవా చేసి ఆ మాట తన పత్రికలో రాయనిచ్చేవారు కాదు. అదీ కధ.

Jai Gottimukkala చెప్పారు...

@ Bhandaru Srinivasrao: Thanks for the explanation sir.