28, ఫిబ్రవరి 2015, శనివారం

కాపీ జోకులు


కాపీ కొట్టే రైట్లే కాని కాపీ రైట్లు లేనివాటిని జోకులంటారని ఓ జోకారావు చెప్పాడు. అలాంటివే ఇవి.
పీతాంబరం భర్త ఏకాంబరాన్ని ఒంటరిగా దొరకబుచ్చుకుని అడిగింది. 'మీరు నన్ను ప్రేమిస్తున్నారా?  ప్రేమిస్తే ఎంతగా ప్రేమిస్తున్నారు?' అని. అతగాడికి ఓ పట్టాన ఆ ప్రశ్నే అర్ధం కాలేదు. అర్ధం కాగానే అందులో  ఏదో మతలబు వుందని పసిగట్టి, 'నిన్ను బోలెడు బొచ్చెడు  ప్రేమిస్తున్నాను, తాగుతున్న ఈ మందు మీద ఒట్టు' అనేసాడు ధైర్యంగా. అలా చెబితే కుదరదు, ఇదిగో ఇంత అని చెప్పాలి' అంది గారాలు పోతూ. ఏకాంబరం క్షణం ఆలోచించి చెప్పాడు. మాటవరసకు  నేను ఒక సెల్ ఫోన్ అనుకో. నువ్వు సిమ్  కార్డులాంటిదానివి. సిమ్ కార్డు లేకపోతే ఫోను ఉట్టిదేగా! అలా అన్న మాట' అన్నాడు. 'ఓహో! అలాగా' అని  పీతాంబరం బోలెడు సంతోషపడి యింది. ఏకాంబరం మనస్సులో అనుకున్నాడు 'అమ్మయ్య బతికిపొయానురా బాబూ ఈ పూటకు. పిచ్చిది, చెప్పగానే  నమ్మేసింది, కానీ దానికేం తెలుసు, నేను చైనా ఫోను లాంటివాడిననీ, నాలుగు సిమ్ కార్డులు వుంటాయని'   




NOTE: Courtesy Image Owner 

ఓ కప్ప కధ


అనగనగా ఓ కప్ప. ఆ  కప్పకు రోజు చెట్టెక్కాలని బుద్దిపుట్టింది. అనిపించిందే తడవు, నున్నగా సన్నగా వున్న ఓ చెట్టు చూసుకుని  ఎక్కడం మొదలెట్టింది. మిగిలిన కప్పలు చుట్టూచేరి, 'వద్దు వద్దు, చెట్లెక్కడం మన ఇంటా వంటా లేదు. అందులోను అంత పొడుగు చెట్టు అసలెక్కలేవు. అక్కడినుంచి పడ్డావంటే జనాభా లెక్కల్లో లేకుండా పోతావు,  దిగిరా దిగిరా' అని నిరుత్సాహపరుస్తూ బావురుమంటూ వెంటపడ్డాయి.  అయినా లెక్కచేయకుండా  ఆ కప్ప  అమాంతం ఆ చెట్టెక్కి కూర్చుంది.


యెలా?
యెల్లా అంటే,  ఆ కప్ప చెవిటిది. ఒక్క ముక్కా వినబడదు.  అందుకే తోటికప్పలు బావురు బావురుమంటూ, 'వద్దు వద్దం'టూ ఇచ్చే ప్రతికూల సలహాలు దాని చెవికెక్కలేదు. అందుకే హాయిగా చెట్టెక్కగలిగింది.
ఈ కప్ప కధలోని నీతి ఏమిటంటే ఏ పనిచేయబోయినా 'వద్దు వద్దు ఆ పని నువ్వు చెయ్యలేవు' అని నిరుత్సాహపరిచే వాళ్ళే  ఎక్కువ వుంటారు. సాహసాలు చేసేవాళ్ళు అలాటి మాటలు చెవిన పెట్టకూడదు. ఎవరేమన్నా ముందు అనుకున్న 
 రీతిలోనే  ముందుకు సాగిపోవాలి.

NOTE: Courtesy Image Owner 

27, ఫిబ్రవరి 2015, శుక్రవారం

కొత్త రైళ్ల కూతలు, చార్జీల మోతలు లేని బడ్జెట్

(Published in 'SURYA' telugu daily in it's edit page on 01-03-2015, SUNDAY)
పరిగెత్తి పాలు తాగాలా ? నిలబడి నీళ్ళు తాగాలా? అంటే రైల్వే మంత్రి సురేష్ ప్రభు రెండోదే ఎంచుకున్నట్టు అనిపిస్తోంది. ఆయన ప్రవేశ పెట్టిన మోడీ మార్కు రైల్వే బడ్జెట్ లో ఈ ధోరణే ద్యోతకమవుతోంది.


ఏ బడ్జెట్ అయినా  అది సార్వత్రిక బడ్జెట్ కానివ్వండి లేదా రైల్వే బడ్జెట్ కానివ్వండి అది చూసేవారి కంటినిబట్టి రెండు రకాలుగా కనిపిస్తుంది. అధికార పక్షం వారికి ఆహా ఓహో బడ్జెట్. ఇంకా కాస్త పొగడాలని అనిపిస్తే 'అభివృద్ధికి బాటలు వేసే అద్భుతమైన బడ్జెట్'. అదే బడ్జెట్   ప్రతిపక్షం వారికంటికి  అంకెల గారడీ బడ్జెట్. ఇంకా తెగడాలని అనిపిస్తే, 'అభివృద్ధి నిరోధక బడ్జెట్'.  అయితే ఈ రెండు కళ్ళే కాదు, పైకి కనబడని  మూడో కన్ను మరోటి వుంది. అది ప్రజలది. అంటే ప్రయాణీకులది. అందులోనూ అతి సాధారణ ప్రయాణీకులది. కానీ వారి గోడు ఎన్నికల సమయంలో తప్ప ఎవ్వరికీ పట్టదు. తమకున్న  ఈ 'మూడో కన్ను' తెరవాలంటే ఎన్నికలదాకా ఆగాలన్న 'మునిశాపం' వాళ్లకు  వుంది. రైల్వే భాషలో చెప్పాలంటే వాళ్ళది 'వెయిట్ లిస్టు' కేటగిరీ.
సురేష్ 'ప్రభువుల'వారి రైల్వే బడ్జెట్ 'భవిష్యత్ పట్ల భరోసా కల్పించేదిగా వుంద'ని సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీగారే అన్నారు కాబట్టి  ఇక అధికార పక్షం వారి 'మద్దతు' వ్యాఖ్యానాల అవసరమే లేకుండా పోయింది. పోతే,  కొత్త రైలు ప్రస్తావన లేని మొట్టమొదటి రైల్వే బడ్జెట్ అంటూ షరా మామూలు పద్దతిలోనే ప్రతిపక్షాల వాళ్లు  విమర్శలు చేశారు.
బడ్జెట్ పాత పద్దతిలో కాకుండా నవ్యత్వం చూపడానికి రైల్వేమంత్రి కొంత  ప్రయత్నం చేశారు. అయితే, అనేక సంవత్సరాలుగా బడ్జెట్ అంటే ఒక ఒరవడికి అలవాటుపడిన వారికి అది ఒక బడ్జెట్ మాదిరిగా కాకుండా మంత్రిగారి 'ఊహలచిత్రం' గా కానరావడంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీలేదు. అయితే మోడీగారి 'స్వచ్చభారత్' 'డిజిటల్ ఇండియా' నినాదాల ప్రభావం ఈ బడ్జెట్ లో అడుగడుగునా దర్శనం ఇచ్చింది.
ఇంట్లో నుంచే టికెట్ బుకింగ్, ఈ టికెట్ తో రైల్లో కావాల్సిన భోజనం, ఆన్ లైన్ ద్వారా వీల్  చైర్ సౌకర్యం, మహిళలకు, వృద్ధులకు కింది బెర్తులు, రైళ్ల రాకపోకల సమయాలు గురించి మొబైల్ ఫోన్లలో ఎస్.ఎం.ఎస్. అలర్టులు, ఆడవాళ్ల బోగీల్లో నిఘా కెమెరాలు, నాలుగు నెలల ముందే టికెట్ రిజర్వేషన్ ఇలా ఒకటా రెండా, కొత్త రైళ్ల వూసే లేని ఈ కొత్త రైల్వే బడ్జెట్ లో ఇలాటి వూసులు ఎన్నో, ఎన్నెన్నో.
కాకపొతే రైళ్ళలో అనునిత్యం ప్రయాణించే కోటిన్నర పైచిలుకు ప్రయాణీకుల్లో ఈ మాటలు వినని వాళ్లు, వాటికి అర్ధం తెలియని వాళ్లు, అసలు వాటి అవసరమే లేనివాళ్ళు అధిక సంఖ్యలో వున్నారు. ఆ జనాలకు సురేష్ ప్రభుగారు ప్రతిపాదించిన 'ఈ' భోజనాలు. 'ఈ' టిక్కెట్లు, 'ఈ'  దుప్పట్లు, వీటి  అవసరమే లేదు. వారికి  కావాల్సింది సమయానికి వచ్చి, కడగండ్లు లేకుండా  సమయానికి గమ్యం చేర్చే ప్రయాణపు బండ్లు. వాటిల్లో కూర్చోవడానికి ఎలాగూ చోటుండదు, కనీసం సౌకర్యంగా నిలబడి ప్రయాణించడానికి కాసింత వీలుంటే చాలనుకునే వాళ్లు చాలామంది. ఇలాటి  సాధారణ బోగీల్లో కూడా  మొబైల్ చార్జింగ్ సదుపాయం కల్పిస్తామని అంటున్నారు, సంతోషం. అలాగే, స్వచ్ఛ భారత్ ఆలోచనలను మామూలు బోగీల్లోని మరుగు దొడ్ల వైపు కూడా మళ్లిస్తే మరింత సంతోషం. ప్లాటుఫారాలపై లిఫ్టులు, ఎస్కలేటర్లు పెడతామంటున్నారు. వాటితో పాటు, ప్రస్తుతం వున్న మెట్ల దారిలో ట్రాలీ సూటుకేసులు తోసుకుంటూ తీసికెళ్లగల సైడ్ వాక్ సౌకర్యం గురించి యెందుకు ఆలోచించరు? ఈరోజుల్లో అనేకమంది ప్రయాణీకులు రైల్వే  పోర్టర్ల మీద ఆధారపడకుండా  తోసుకుంటూ వెంట తీసుకువెళ్ళే ట్రాలీ  లగేజీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాటివారు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మెట్లు ఎక్కడానికీ, దిగడానికీ పడుతున్న  అవస్థలు తెలుసుకోవడానికి ప్రత్యేక అధ్యయనాలు చేయించనక్కర లేదు, ఏ రైలు స్టేషన్ కు వెళ్ళినా ఈ దృశ్యాలు కానవస్తాయి. ఈ సందర్భంలో గతం గురించిన ఒ ముచ్చట చెప్పుకోవడం అసందర్భం కానేరదు.
పూర్వం జనతా ప్రభుత్వం హయాములో రైల్వే మంత్రిగా మధుదండావతే పని చేశారు. అప్పటి వరకు సాధారణ టూ టయర్, త్రీ టయర్ బోగీల్లో పడుకోవడానికి చెక్క బల్లలు వుండేవి. దండావతే గారి పుణ్యమా అని ఆ బోగీలకు కూడా ఫోం పరుపులు అమర్చారు. ఆ ఒకే ఒక్క నిర్ణయంతో సామాన్యులు కూడా తామూ సమాజంలో ఎదుగుతున్నాం అనే ఉన్నత భావనకు లోనయ్యారు. సామాన్యులకు దగ్గరకావడం అంటే ఏమిటో, ఎలానో నాటి రైల్వే మంత్రి దండావతే చేసి చూపించారు.  సురేష్ ప్రభు, మోడీ తలచుకుంటే ఇటువంటివి చాలా చెయ్యవచ్చు. అలాటి సంకల్పం వారికి కలగాలని, సురేష్ ప్రభుగారే స్వయంగా బడ్జెట్ ప్రసంగంలో చెప్పినట్టు,  ఆ పైనున్న 'ప్రభువు' ను మనసారా  కోరుకుందాం.     
నిజానికి రైలుబళ్ళు యావత్ భారతానికి నకళ్ళు. ఇంట్లో, వొంట్లో పుష్కలంగా వున్న వాళ్ళకోసం రాజులు, మహారాజులు కోరే సకల  సౌకర్యాలతో 'ప్యాలెస్ ఆన్ వీల్స్' అనే పేరుతొ పట్టాలపై నడిచే  రాజప్రసాదాలు మనదేశంలో ఇప్పటికే  వున్నాయి. 'ఎప్పుడు వస్తుందో తెలియని, ఎప్పుడు గమ్యం  చేరుతుందో తెలియని' అతి మామూలు పాసింజర్ రైళ్ళు కూడా అదే పట్టాలపై తిరుగుతుంటాయి. ఇక మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి, దిగువ తరగతి వాళ్లందరూ వేరు వేరు బోగీల్లో ఒకే రైలులో ప్రయాణిస్తుంటారు. వారి భాషలు వేరు, సంస్కృతులు వేరు, మాటతీరు వేరు, అయినా ఒక  కుటుంబం మాదిరిగా రైలు బండ్లు వారిని కలిపి వుంచుతాయి. అదే సమయంలో వారిని వేరువేరుగా చూస్తాయి. పక్కపక్కనే వున్నా వారి పక్కలు వేరు, వారికి కల్పించే భోజన వసతులు వేరు. ఇదంతా వారు చెల్లించే టికెట్టు ధర నిర్ణయిస్తుంది.  కొందరేమో  శబ్దం చెయ్యని ఏసీ బోగీల్లో దుప్పట్లు కప్పుకుని వెచ్చగా పడుకుని వెడుతుంటే, అదే రైల్లో మరో సాధారణ బోగీలో కాలు చేయీ కదపడానికి  కూడా వీల్లేని స్తితిలో మరికొందరు ప్రయాణం సాగిస్తుంటారు. అచ్చమైన భారతానికి అచ్చమైన నకలు ఏదైనా వుందంటే అది మన దేశంలోని రైలుబండే, సందేహం లేదు.
సురేష్ ప్రభుగారి విషయంలో ఒక విషయం మాత్రం ఒప్పుకుని తీరాలి. పదవిలోకి వచ్చి మూడు మాసాలే అయినప్పటికీ, బడ్జెట్ రూపకల్పనలో ఎక్కడా తన సొంత రాష్ట్రం 'మహారాష్ట్ర' కు ఏదో ఒరగబెట్టాలని యెంత మాత్రం అనుకోలేదు. ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. ఈ ఒక్క విషయంలో  వెనుకటి మంత్రులతో పోలిస్తే ఈయన చాలా మెరుగు.
గతంలో రైల్వే మంత్రులగా పనిచేసినవాళ్ళల్లో చాలామంది 'తమ' ప్రాంతాల 'పాల రుణం' తీర్చుకోవడానికి నిస్సిగ్గుగా రైల్వే బడ్జెట్ ని ఉపయోగించుకున్నారు. వీరిలో బెంగాల్ ఆడపులి మమతా బెనర్జీ పేరే ముందు చెప్పుకోవాలి. యూపీయే హయాములో ఆమె 'రైలు భవన్ మహరాణీ' గా ఓ వెలుగు వెలిగినప్పుడు,  రైల్వే బడ్జెట్ లో సింహభాగాన్ని తూర్పు' వెళ్ళే రైలు  ఎక్కించేసి  చేతులు దులుపుకున్నారు. పశ్చిమ బెంగాల్  రాష్ట్రంలో  34 ఏళ్ళపాటు అవిచ్చిన్నంగా సాగుతూ వచ్చిన ఎర్రదండు పాలనకు శ్రీమతి బెనర్జీ 'ఎర్ర జెండా' చూపగలదేమో అన్న ఆశతో వున్న 'అప్పటి'  యుపీఏ నాయకులు, ఆవిడ ప్రతిపాదించిన (బెంగాల్) రైల్వే బడ్జెట్ కు పచ్చజెండా వూపారు. మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా  సమర్పించిన  బడ్జెట్ లో  పశ్చిమ బెంగాల్ పై వరాలవర్షం కురిపించి అందరూ ఆశ్చర్యంతో హౌరా అని నోళ్ళు వెళ్ళబెట్టేట్టు చేసారు. సింగూరులో మెట్రో కోచ్ ఫాక్టరీ, డార్జిలింగ్ లో సాఫ్ట్ వేర్ ఎక్సెలెన్సీ సెంటర్, కోల్ కతాకు ఇంటిగ్రేటెడ్ సబర్బన్ నెట్ వర్క్, అక్కడి మెట్రో కు 34 కొత్త సర్వీసులు,  ఇలా వరాల వాన కురిపించారు. 'లోగడ రైల్వే మంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్, తన అధికారాన్ని ఉపయోగించి అత్తవారి వూరికి ఏకంగా ఒక రైలును వేయగాలేనిది ఇప్పుడు తాను చేసిన దాంట్లో తప్పు పట్టాల్సింది ఏముంది' అన్న రీతిలో మమతా బెనర్జీ, పుట్టింటిపై  తన ప్రేమను సమర్ధించుకున్నారు. 'సొంత రాష్ట్రానికి, సొంత జనానికి ఏమి చేస్తే ఏమి తప్పుపడతారో' అని సంకోచించే నిత్య శంకితులకు మాత్రం నిజంగా  ఇది కనువిప్పే.
సరే అదలా వుంచి, కొత్తగా పురుడు పోసుకున్న తెలుగు రాష్ట్రాల సంగతికి వస్తే - 
రైల్వే మంత్రి సురేష్ ప్రభు పార్లమెంటుకు సమర్పించిన ఈ బడ్జెట్, ఈ రెండు ప్రాంతాల ప్రజలను మాత్రం  ఉసూరుమనిపించింది. ఆంధ్ర. తెలంగాణా ముఖ్యమంత్రులిద్దరూ 'ఈ బడ్జెట్ లో కాస్త కనికరం చూపండి మహాప్రభూ' అంటూ, అనేక సార్లు ఢిల్లీ ప్రదక్షిణాలు చేసి రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు. బహుశా వారి మొర, మంత్రిగారి మనసు పొరలను తట్టిందో ఏమిటో కానీ, సురేష్ ప్రభువుల వారు, గంట పైచిలుకు చేసిన తమ బడ్జెట్ ప్రసంగంలో కాస్త  దయతలచి, ఈ రెండు తెలుగు రాష్ట్రాలలోని 'రెండు వూర్ల పేర్లు' ఒక్కటంటే ఒకేసారి  అనామత్తుగా ప్రస్తావించి వూరుకున్నారు.  'ఖాజీపేట (తెలంగాణా) - విజయవాడ (ఆంధ్ర ప్రదేశ్) నడుమ మూడో రైలు మార్గం వేసే ప్రతిపాదన పరిశీలనలో వుంద'ని దాని తాత్పర్యం. తాత దగ్గుకే మురవమన్నట్టు రెండు తెలుగు రాష్ట్రాలవాళ్లు ఆ ఒక్క మాటకే మురిసిక్కచెక్కలవుతారని మంత్రిగారి అభిప్రాయమేమో తెలవదు.        
ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు అన్నట్టు లోకసభ సభ్యుడు ఎవరయినా రైల్వే మంత్రిని కలిసినప్పుడు, తన నియోజక వర్గం సమస్యలు తీర్చాలని  మహజరులు సమర్పిస్తుంటారు. రైల్వే ఓవర్ బ్రిడ్జిలు గురించో, లేక ఫలానా స్టేషనులో ఫలానా రైలుకు స్టాప్ ఏర్పాటు చేయాలనో  ఇలా చాలావరకు స్తానిక సమస్యలపైనే వారి విజ్ఞప్తులు  వుంటాయి. మొత్తం రాష్ట్రానికి సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే కలగచేసుకుని ముందుగా తమ అవసరాలను రైల్వే మంత్రికి తెలియచేసుకోవాల్సి వుంటుంది. నిజానికి ఈ విషయంలో ప్రతి ముఖ్యమంత్రి కూడా తమ కోరికల చిట్టాలను ఏటా రైల్వే మంత్రికి అందచేస్తూనే వుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా వున్న చంద్రబాబు. కేసీఆర్ ఇరువురూ ఈ విషయంలో తమ బాధ్యతను ఏమాత్రం విస్మరించలేదు. ఢిల్లీ పెద్దలకు ముందస్తుగానే శాయంగల విన్నపాలు చేసుకున్నారు. కానీ వాటిని కొత్త ప్రభుత్వం అంతగా పట్టించుకున్న దాఖలాలు బడ్జెట్ లో కనబడడం లేదు.
ఏదిఏమయినా, ఈసారి తెలుగు రాష్ట్రాలకు  అనుకున్న రీతిలో రైల్వేమంత్రి పూర్తి స్థాయిలో  న్యాయం చేయలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.  గత జులైలో సమర్పించిన రైల్వే బడ్జెట్ లో ప్రతిపాదనకు నోచుకున్న కొన్ని స్పీడ్ రైళ్ళు మాత్రం, ఆ ఒక్క రోజు  టీవీ స్క్రోలింగుల్లో గిరగిరా తిరిగివూరుకున్నాయి.  పట్టాలు ఎక్కిన దాఖలా లేదు. 'వూరికే మాటలు చెప్పడం యెందుకు అనుకున్నారేమో' ఈసారి అలాటి ప్రతిపాదనల వూసు కూడా లేశమాత్రం కూడా లేదు. విశాఖ కేంద్రంగా  కొత్త రైల్వే జొన్ గురించి ప్రకటన వెలువడగలదని ఆశించిన వారికి మళ్ళీ  నిరాశే ఎదురయింది. అల్లాగే, దశాబ్దాల తరబడి నానుతూ వస్తున్న కాజీపేట కోచ్ ఫాక్టరీ వ్యవహారం.
అయితే, ముందే చెప్పినట్టు ఈ బడ్జెట్ ని ప్రజల దృక్కోణంలో నుంచి పరిశీలిస్తే ఒకింత వూరట కలిగించే పద్ధతిలో వుందనే చెప్పాలి. వాళ్ళమీద కొత్త భారాలేవీ మోపలేదు. చార్జీలు ఏమీ పెంచలేదు. ఎందుకంటే ఆ పని ఆర్నెళ్ల ముందుగానే పూర్తయిపోయింది కాబట్టి. సరకుల రవాణా చార్జీలు మాత్రం ఘనంగానే పెంచారు. వీటి భారం పరోక్షంగా ప్రజలందరూ కలిసి మోస్తారు.  
ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు’ ‘ఎక్కిన రైలు గమ్యం చేరుతుందా లేదా అనే డౌటు ప్రయాణీకులకు లేకుండా చేయగలిగితే ఆ బడ్జెట్ సార్ధకమైనట్టే లెక్క. అలాగే, భద్రతకు పెద్దపీట వేసి,  రైలెక్కిన ప్రయాణీకుడి పేరు ముందు 'లేటు' అని రాయాల్సిన అవసరం లేకుండా చేస్తే మరీ గ్రేటు. (27-02-2015)    

NOTE: Courtesy Cartoonist 

26, ఫిబ్రవరి 2015, గురువారం

ప్రభువులవారి రైల్వే బడ్జెట్



ప్రధాని మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు  రెండో రైల్వే బడ్జెట్ కూడా పట్టాలెక్కేసింది. రైల్వే మంత్రి సురేష్ ప్రభు పార్లమెంటుకు సమర్పించిన ఈ బడ్జెట్ 'కొత్తగా పురుడు పోసుకున్న రెండు తెలుగు రాష్ట్రాలను మాత్రం  ఉసూరుమనిపించింది. ఆంధ్ర.తెలంగాణా ముఖ్యమంత్రులిద్దరూ 'ఈ బడ్జెట్ లో కాస్త కనికరం చూపండి మహాప్రభూ' అంటూ, అనేక సార్లు ఢిల్లీ ప్రదక్షిణాలు చేసి రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు. బహుశా వారి మొర, మంత్రిగారి మనసు పొరలను తట్టిందో ఏమిటో కానీ, సురేష్ ప్రభువుల వారు,   తమ గంట పైచిలుకు చేసిన బడ్జెట్ ప్రసంగంలో కాస్త  దయతలచి, ఈ రెండు తెలుగు రాష్ట్రాలలోని 'రెండు వూర్ల పేర్లు' ఓసారి అనామత్తుగా ప్రస్తావించి వూరుకున్నారు.  'ఖాజీపేట (తెలంగాణా) - విజయవాడ (ఆంధ్ర ప్రదేశ్) నడుమ మూడో రైలు మార్గం వేసే ప్రతిపాదన పరిశీలనలో వుంద'ని దాని తాత్పర్యం. తాత దగ్గుకే మురవమన్నట్టు రెండు తెలుగు రాష్ట్రాలవాళ్లు ఆ ఒక్క మాటకే మురిసి ముక్కచెక్కలవుతారని మంత్రిగారి అభిప్రాయమేమో తెలవదు. 


      

ఏ బడ్జెట్ అయినా అది సార్వత్రిక బడ్జెట్ కానివ్వండి లేదా రైల్వే బడ్జెట్ కానివ్వండి అది రెండురకాలుగా కనిపిస్తుంది. అధికార పక్షం వారికి ఆహా ఓహోబడ్జెట్. ప్రతిపక్షం వారికి అదే బడ్జెట్ అంకెల గారడీ. అయితే ఈ రెండు కళ్ళే కాదు, పైకి కనబడని  మూడో కన్నుమరోటి వుంది. అది ప్రజలది. అంటే ప్రయాణీకులది. అందులోనూ అతి సాధారణ ప్రయాణీకులది. కానీ వారి గోడు ఎన్నికల సమయంలో తప్ప ఎవ్వరికీ పట్టదు. తమ ఈ 'మూడో కన్ను' తెరవాలంటే ఎన్నికలదాకా ఆగాలన్న ముని శాపం వాళ్లకు  వుంది.

గతంలో రైల్వే మంత్రులగా పనిచేసినవాళ్ళల్లో చాలామంది 'తమ' ప్రాంతాల 'పాల రుణం' అంతో ఇంతో కొంత  తీర్చుకున్నారు. వీరిలో బెంగాల్ ఆడపులి మమతా బెనర్జీ పేరే ముందు చెప్పుకోవాలి. యూపీయే హయాములో ఆమె రైలు భవన్ రాణీగా ఓ వెలుగు వెలిగినప్పుడు రైల్వే బడ్జెట్ లో సింహభాగాన్ని తూర్పు వెళ్ళే రైలుఎక్కించడానికి ఆవిడ  ఎంతమాత్రం సంకోచించలేదు. ఆ రాష్ట్రంలో గత 34 ఏళ్లుగా అవిచ్చిన్నంగా సాగుతూ వస్తున్న ఎర్రదండుపాలనకు శ్రీమతి బెనర్జీ 'ఎర్ర జెండా' చూపగలదేమో అన్న ఆశతో వున్న అప్పటి  యుపీఏ నాయకులు, ఆవిడ ప్రతిపాదించిన (బెంగాల్) రైల్వే బడ్జెట్ కు పచ్చజెండా వూపారు. ఆవిడ సమర్పించిన రైల్వే బడ్జెట్ లో  పశ్చిమ బెంగాల్ పై వరాలవర్షం కురిపించి అందరూ ఆశ్చర్యంతో హౌరాఅని నోళ్ళు వెళ్ళబెట్టేట్టు చేసారు. సింగూరులో మెట్రో కోచ్ ఫాక్టరీ, డార్జిలింగ్ లో సాఫ్ట్ వేర్ ఎక్సేలెన్సీ సెంటర్, కోల్ కతాకు ఇంటిగ్రేటెడ్ సబర్బన్ నెట్ వర్క్, అక్కడి మెట్రో కు 34 కొత్త సర్వీసులు ఇలా వరాల వాన కురిపించారు. లోగడ రైల్వే మంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ 'తన అధికారాన్ని ఉపయోగించి అత్తవారి వూరికి ఏకంగా ఒక రైలును వేయగాలేనిది ఇప్పుడు తాను చేసిన దాంట్లో తప్పు పట్టాల్సింది ఏముంది' అన్న రీతిలో మమతా బెనర్జీ రైల్వే బడ్జెట్ ను రూపొందించి, పుట్టింటిపై  ప్రేమను పార్లమెంటు సాక్షిగా  బాహాటంగా ప్రదర్శించి చూపారు. 'సొంత రాష్ట్రానికి, సొంత జనానికి ఏమి చేస్తే ఏమి తప్పుపడతారో' అని సంకోచించే నిత్య శంకితులకు మాత్రం నిజంగా  ఇది కనువిప్పే.
ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు అన్నట్టు లోకసభ సభ్యుడు ఎవరయినా రైల్వే మంత్రిని కలిసినప్పుడు, తన నియోజక వర్గం సమస్యలు తీర్చాలని మాత్రమే మహజరులు సమర్పిస్తారు.  రైల్వే ఓవర్ బ్రిడ్జిలు గురించో, లేక ఫలానా స్టేషనులో ఫలానా రైలుకు స్టాప్ ఏర్పాటు చేయాలనో  ఇలా చాలావరకు స్తానిక సమస్యలపైనే వుంటాయి. మొత్తం రాష్ట్రానికి సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే కలగచేసుకుని ముందుగా తమ అవసరాలను రైల్వే మంత్రికి తెలియచేసుకోవాల్సి వుంటుంది. నిజానికి ఈ విషయంలో ప్రతి ముఖ్యమంత్రి కూడా తమ కోరికల చిట్టాలను ఏటా రైల్వే మంత్రికి అందచేస్తూనే వుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా వున్న చంద్రబాబు. కేసీఆర్  ఇరువురూ ఈ విషయంలో తమ బాధ్యతను ఏమాత్రం విస్మరించలేదు. ఢిల్లీ పెద్దలకు ముందస్తుగానే శాయంగల విన్నపాలు చేసుకున్నారు. కానీ వాటిని కొత్త ప్రభుత్వం అంతగా పట్టించుకున్న దాఖలాలు బడ్జెట్ లో కనబడడం లేదు.
ఏదిఏమయినా, ఈసారి తెలుగు రాష్ట్రాలకు  అనుకున్న రీతిలో రైల్వే మంత్రి పూర్తి న్యాయం చేయలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.  గత జులైలో సమర్పించిన రైల్వే బడ్జెట్ లో ప్రతిపాదనకు నోచుకున్న కొన్ని స్పీడ్ రైళ్ళు మాత్రం, ఆ ఒక్క రోజు  టీవీ స్క్రోలింగులకే పరిమితం అయ్యాయి కాని,  పట్టాలు ఎక్కిన దాఖలా లేదు. 'వూరికే మాటలు చెప్పడం యెందుకు అనుకున్నారేమో' ఈసారి అలాటి ప్రతిపాదనల వూసు కూడా లేదు. విశాఖ కేంద్రంగా  కొత్త రైల్వే జొన్ గురించి ప్రకటన వెలువడగలదని ఆశించిన వారికి మళ్ళీ  నిరాశే ఎదురయింది.
అయితే, ముందే చెప్పినట్టు ఈ బడ్జెట్ ని ప్రజల దృక్కోణంలో నుంచి పరిశీలిస్తే ఒకింత వూరట కలిగించే పద్ధతిలో వుందనే చెప్పాలి. వాళ్ళమీద కొత్త భారాలేవీ మోపలేదు. చార్జీలు ఏమీ పెంచలేదు. ఎందుకంటే ఆ పని ఆర్నెళ్ల ముందుగానే పూర్తయిపోయింది కాబట్టి.  

ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు’ ‘ఎక్కిన రైలు గమ్యం చేరుతుందా లేదా అనే డౌటు ప్రయాణీకులకు లేకుండా చేయగలిగితే ఆ బడ్జెట్ సార్ధకమైనట్టే లెక్క. అలాగే, భద్రతకు పెద్దపీట వేసి,  రైలెక్కిన ప్రయాణీకుడి పేరు ముందు 'లేటు' అని రాయాల్సిన అవసరం లేకుండా చేస్తే మరీ గ్రేటు.    
NOTE: Courtesy Image Owner 

25, ఫిబ్రవరి 2015, బుధవారం

పెళ్ళయిన కొత్తలో.....


'ఓ కప్పు కాఫీ పట్రా'
'ఒక్క క్షణంలో తెస్తాను వుండండి'
పదేళ్ళ తరువాత ..
'ఓ కప్పు కాఫీ ఇస్తావా?'
'ఓక్షణం ఆగండి. చేతిలో పని కాగానే పట్టుకొస్తాను'
మరో పదేళ్ళ తరువాత .....
'ఇదిగో! ఏమోయ్! తల నాదుగా వుంది. ఓ కప్పు కాఫీ ఏమైనా దొరుకుతుందా!'
'అదిగో. ఫ్లాస్క్ లో పోసి పెట్టాను. తాగండి'
ఇంకో పదేళ్ళ తరువాత....
'సరేగాని ఓ కప్పు కాఫీ...'
'ఏమిటి! ఏమిటీ అంటున్నారు. కాస్త గట్టిగా చెప్పండి''
'అబ్బే! ఏం లేదు. నేను కాఫీ పెట్టుకుంటున్నాను. నీకూ కావాలేమో అని. అంతే! అంతే!!'







(చట్టబద్ధమైన హెచ్చరిక: ఆడవారి కాలమానం అందరికీ ఒక్క లాగా వుండదు. కాలం కలిసిరాకపోతే ఈ మొత్తం సీనూ ఒక్క పదేళ్ళలోపే అనుభవం లోకి రావచ్చు' )

చిత్రకారులు 'శ్రీరామ్' గారికి కృతజ్ఞతలు  

24, ఫిబ్రవరి 2015, మంగళవారం

హోదా గోదాలో రాజకీయ వస్తాదులు

(Published by "SURYA" telugu daily in it's edit page on 26-02-2015, THURSDAY)
రంగస్థలం అదే. పాత్రలూ అవే, పాత్రధారులూ వాళ్ళే. పాడే పద్యాలు అవే. చెప్పే డైలాగులూ అవే. కాకపొతే, ఒక్క ఏడాదిలోనే  పాత్రధారుల పాత్రలు మారిపోయాయి. పాడే పద్యాలు మారిపోయాయి. చెప్పే డైలాగులు చెదిరిపోయాయి. చూసే ప్రేక్షకులు మాత్రం మారలేదు. టిక్కెట్టు లేని సినిమా చూసినట్టు  పండిత, పామరులనే  తేడా లేకుండా జనాలు ఉచిత వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఏడాది ముందు ఏం జరిగిందో మరపున పడిందన్న నమ్మకంతో కాబోలు,  పార్లమెంటు సాక్షిగా చెప్పిన మాటలు గుర్తులేనట్టు ఈనాడు నాయకులు మాట్లాడుతున్నారు. 'మీరలా  అన్నార'ని  ఒకళ్ళు అంటుంటే 'తామలా అన'నే లేదని మరొకళ్ళు బుకాయిస్తున్నారు. చట్టసభల రికార్డుల్లో మొత్తం వ్యవహారం పదిలంగా వుందని తెలిసికూడా మొండిగా వాదిస్తున్నారు.   రాజకీయ అభినయకళ ముందు, చతుష్టష్టి  కళల్లో మిగిలిన అరవై మూడూ వెలవెలబోతున్నాయి.
నిరుడు కేంద్రంలో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, పార్లమెంట్ ఉభయసభల సమావేశాల తుది ఘడియల్లో ఆంధ్ర ప్రదేశ్ విభజన బిల్లును తెర మీదకు తెచ్చింది. విభజనానంతర ఆంధ్ర ప్రదేశ్ కు అయిదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పించబోతున్నట్టు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ లోక సభ సాక్షిగా హామీ ఇచ్చారు. బిల్లు సానుకూలంగా నెగ్గే విధంగా చూడాలని కాంగ్రెస్ నేతలు బీజేపీ నాయకులను అభ్యర్ధించారు. ఎందుకంటే బిల్లు  ఆమోదం పొందాలంటే  ప్రతిపక్ష బీజేపీ సహకారం కావాలి. 'కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం' లాంటి ఆ బిల్లును అన్ని రాజకీయపార్టీలు ఇష్టం వున్నా లేకపోయినా తమ తమ రాజకీయ ప్రయోజనాలకోసం 'మమ' అనిపించి బిల్లును అప్పటికి గట్టెక్కించాయి. బిల్లు తెచ్చిన కాంగ్రెస్ సర్కారును ఒడ్డెక్కించాయి. లోపల ఏమున్నా బయటకు మాత్రం ఈ మొత్తం వ్యవహారం రాష్ట్రానికి సంబంధించిన అన్ని పార్టీల పూర్తి ఆమోదంతోనో, పాక్షిక ఆమోదంతోనో జరిగిందనడం వాస్తవం.
నిరుడు ఫిబ్రవరి నెలలో ఏం జరిగిందో ఓసారి సింహావలోకనం చేసుకుందాం.
పార్లమెంటు సమావేశాలు ముగియనున్న తరుణంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం లోకసభలో రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశపెట్టింది. సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్, తెలుగు దేశం సభ్యులు నిరసన తెలుపుతున్న నేపధ్యంలో,  ప్రత్యక్ష ప్రసారాలు నిలుపుచేసి, మూజువాణీ ఓటుతో  బిల్లును ఆమోదింప చేశారు.  హైదరాబాదు నగరాన్ని రెండు రాష్ట్రాలకు పదేళ్ళపాటు రాజధానిగా వుంచుతూ బిల్లులో పొందుపరచిన అంశంతో విభేదిస్తూ ఎంఐఎం ప్రవేశపెట్టిన సవరణ తిరస్కరణకు గురయింది. 'ఒక అనారోగ్య సంప్రదాయానికి తెర తీసినట్టయింద'ని ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. బిల్లు ఆమోదం పొందిన సంబరంలో టీఆర్ఎస్ నాయకుడు చంద్రశేఖర రావు, కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ అజాద్  ఆనందోత్సాహాలు వెలిబుచ్చుతున్న సమయంలోనే, 'భారత దేశ చరిత్రలోనే ఇది చీకటి అధ్యాయం అంటూ,  'పట్టపగలే ప్రజాస్వామ్యం  ఖూనీ అవడం కళ్ళారా చూస్తున్నామ'ని  వై.యస్.ఆర్.సీ.పీ.  నాయకుడు వై.యస్. జగన్ మోహన రెడ్డి అభివర్ణించారు.    
'సీమాంధ్రకు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ఇవ్వడం జరుగుతుంద'ని నాటి హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే సభలో ప్రకటించారు.
మరునాడే రాజ్యసభ కూడా ఈ బిల్లును ఆమోదించింది. విభజనకు వ్యతిరేకం కాదంటూనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదేళ్ళపాటు ప్రత్యేక హోదా కల్పించాలని బీజేపీ కోరడం, అయిదు సంవత్సరాలకు మాత్రమే కాంగ్రెస్ అంగీకరించడం చచకా జరిగిపోయాయి. బిల్లు రాజ్యసభ ఆమోదం పొందడంతో దేశంలో ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా తెలంగాణా ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. ఈ పరిణామాలకు నిరసనగా రాష్ట్ర  కాంగ్రెస్ లో నిరసనలు మొదలయ్యాయి.  సీమాంధ్ర కు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు తమ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడదే నాయకుడు నవజాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేస్తున్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆఖరి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఖ్యాతి దక్కించుకున్న  శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి  కాంగ్రెస్ నుంచి తప్పుకుని సొంత పార్టీ పెట్టుకున్నారు. దరిమిలా ఉమ్మడి రాష్ట్రానికి జరిగిన ఎన్నికల్లో పార్టీల తలరాతల్ని ప్రజలు మార్చేసారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్ పుణ్యమే అని బలంగా నమ్మిన సీమాంధ్ర ఓటర్లు ఆ పార్టీని పూర్తిగా తిరస్కరించారు. ఇటు తెలంగాణాలో కూడా దాదాపు అదే పరిస్తితి. తెలంగాణా తెచ్చిన పార్టీగా టీ.ఆర్.యస్. పేరు దక్కించుకుంది.  కానీ తెలంగాణా ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ను ప్రజలు గుర్తించకపోవడంతో ఆ పార్టీ పని రెంటికీ చెడ్డ రేవడి చందం అయింది. కాంగ్రెస్ చేసిన రాజకీయం సీమాంధ్రలో తెలుగుదేశానికి కలిసివచ్చింది. విభజన తరువాత రాష్ట్రాన్ని పునర్నిర్మించగల చేవ  చంద్రబాబుకు వున్నదని గట్టిగా నమ్మడంతో అంతవరకూ అన్ని సర్వేల్లో అజేయంగా ముందుకు దూసుకువెడుతున్న వై.యస్.ఆర్.సీ.పీ.  ఆఖరు పరీక్షలో కుదేలయింది. ఆఖరి క్షణం వరకు చేతికందే దూరంలో వూరిస్తూ వచ్చిన అధికారానికి  దూరం అయింది.   
'రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా' అన్నట్టు ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు తలచుకోవలే కానీ ఎలాటి బిల్లులయినా చిటికెలో చట్టసభల ఆమోదం పొంది చట్టాలుగా మారతాయని అనడానికి, ఇన్ని పరిణామాలకు కారణం అయిన  ఆంధ్ర ప్రదేశ్ విభజన  తీరే  ఒక ఉదాహరణ.
నిరుడు ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీన ఈ బిల్లును లోక్ సభ ఆమోదించింది. మూడో రోజునే అంటే ఇరవయ్యో తేదీన  రాజ్యసభ ఆమోదం పొందింది. మార్చి ఒకటో తేదీన  రాష్ట్రపతి ఆమోద ముద్ర పడింది. వెంటనే దాన్ని అధికారిక రాజపత్రం (గెజిట్)లో ప్రచురించారు. జూన్ రెండో తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి రావడం, ఆ తేదీనుంచే సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ అనే రెండు రాష్ట్రాలుగా వేరుపడడం ఆఘమేఘాలమీద జరిగిపోయాయి. పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం సాక్షిగా ఇవన్నీ జరిగాయి. సరిగ్గా ఏడాది తరువాత తెరలేచిన తాజా పరిణామాలకు కూడా ఆ మహాత్ముడే సాక్షి కావడం కాకతాళీయం కావచ్చేమో!
ఈ విషయాలన్నీ గుర్తు చేసుకోవడానికి కారణం వుంది. విభజన అనంతరం ఏర్పడే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని ప్రస్తుతం పాత్ర మారిపోయిన  కాంగ్రెస్, కొత్తగా  ప్రభుత్వంలోకి వచ్చిన బీజేపీని కోరుతోంది. ఇందుకోసం పార్లమెంటు ఆవరణలోని మహాత్ముడి విగ్రహం ఎదుట బడ్జెట్ సమావేశాల తొలిరోజునే కాంగ్రెస్ దీక్షా కార్యక్రమం నిర్వహించింది. ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతూ, ఏపీ కాంగ్రెస్ కమిటీ కోటి సంతకాల సేకరణకు పూనుకుంది. అయిదేళ్ళు కాదు, పదేళ్ళ ప్యాకేజీ కోసం ఆనాడు పట్టుబట్టిన బీజేపీ ఈనాడు పాలకపక్షం పాత్ర ధరించి, ఆ హామీ విషయంలో పాత్రోచితంగా  మీనమేషాలు లెక్కబెడుతోంది. పాత్రలు తారుమారు కావడం అంటే ఇదే కాబోలు.
ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అంటే ఏమిటి? దానివల్ల లభించే ప్రయోజనాలేమిటి? అనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  1969లో తొలిసారి రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది.   ఐదు అంశాల ఆధారంగా ప్రత్యేక హోదా కల్పించాలని నాటి ఆర్ధిక సంఘం సిఫారసు చేసింది.  మొదటిది ఈ హోదా కోరుతున్న రాష్ట్రం పర్వత ప్రాంతం అయివుండాలి. జన సాంద్రత తక్కువగా వుండడమే కాకుండా వున్న జనాభాలో గిరిజనుల సంఖ్య అధికంగా వుండాలి. ఇరుగు పొరుగు దేశాలతో సరిహద్దులు కలిగిన రాష్ట్రం అయివుండాలి. ఆర్థిక, మౌలిక సదుపాయాల్లో వెనుకబడి వుండడం, ఆర్ధిక పరిస్తితి నిరాశాజనకంగా ఉండడం అనేవి కూడా ఈ హోదా పొందడానికి ఉపకరిస్తాయి. పోతే ప్రధాన మంత్రి, ఆయా  రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడిన జాతీయ అభివృద్ధి మండలి, ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలి అనే విషయాన్ని నిర్ధారిస్తుంది.  
చివరి రెండు అంశాలు మినహా ఈ హోదా పొందేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిసి వచ్చే  నిబంధనలు ఏవీ లేవు.
మొదట అసోం, నాగాలాండ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు. తరువాత అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ప్రత్యేక హోదా రాష్ట్రాల జాబితాలో చేర్చారు.
ఈ హోదా కలిగిన రాష్ట్రాలకు కేంద్రం నుంచి అదనపు నిధులు లభిస్తాయి. మొత్తం కేంద్ర సాయంలో ముప్పయి శాతం నిధులు ఈ పదకొండు రాష్ట్రాలకు కేటాయిస్తారు. మిగిలిన డెబ్బయి శాతం నిధులను తతిమ్మా రాష్ట్రాలు అన్నీ కలిసి పంచుకోవాలి. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు తమ అవసరాల మేర రుణాలు పొందే స్వేచ్ఛ ఉంటుంది. అంతేకాదు,  ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు పలు రాయితీలు, పన్ను మినహాయింపులు పొందుతాయి. ఎక్సైజ్, కస్టమ్స్, ఆదాయపు పన్ను రేట్లు, కార్పొరేట్ పన్ను రేట్లలో మినహాయింపులు ఉంటాయి.
ఇన్ని వెసులుబాట్లు వున్నాయి కనుకనే బీహారు మొదలయిన రాష్ట్రాలు ఈ ప్రత్యేక హోదా సాధన కోసం పట్టుబడుతున్నాయి. రెండేళ్ళ క్రితం బీహారు ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్ ఏకంగా ఢిల్లీలోనే అధికారికంగా ఆందోళన నిర్వహించారు. అయినా ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం సుతరామూ అంగీకరించలేదు. ప్రత్యేక హోదా ఇవ్వడంలో ఎన్నో ఇబ్బందులు వున్నాయని బాగా తెలిసిన వాళ్ళే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కు ఆ హోదా ఇవ్వాలని పార్లమెంటు సాక్షిగా ఆందోళనలకు దిగడం విడ్డూరం. అలాగే ఈ వాస్తవం ఎరిగుండీ ప్రస్తుతం అధికారంలో వున్న బీజేపీ నాయకులు  కూడా అదేవిధమైన హామీలు ఇస్తూ పోతుండడం మరో విడ్డూరం. అన్నీ తెలిసినవాళ్ళే ఈ విషయంతో రాజకీయ క్రీడ ఆడుతుంటే, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన జనసేన అదినేత పవన్ కళ్యాణ్ సయితం ప్రత్యేక హోదా సంగతి ప్రస్తావిస్తూ, అన్యాపదేశంగా బీజేపీ,  టీడీపీలకు హెచ్చరికలు చేస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేయడం వీటిని మించిన విడ్డూరం. ఇక ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది మరింత విచిత్రమైన పరిస్తితి. ఆయన పాలనలో వున్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం అనేది అందరికంటే ఆయనకే ఎక్కువ అవసరం. అందుకే ఆయన అనేకసార్లు హస్తిన ప్రయాణాలు కట్టారు. ఎక్కిన గడప దిగిన గడప చందంగా కలుసుకోవాల్సిన వాళ్ళను కలుసుకున్నారు. శాయంగల విన్నపాలు చేశారు.  కానీ ఫలితం పూజ్యం. కనీసం రాష్ట్రపతి ప్రసంగంలో అన్నా ప్రత్యేక హోదా ప్రస్తావన వుంటుందని అనుకుంటే అదీ నిరాశే అయింది. పార్లమెంటు సమావేశాలముందు ఆనవాయితీగా నిర్వహించే పార్టీ పార్లమెంటు సభ్యుల సమావేశంలో కూడా ఆయన ఈ విషయంలో గట్టి ప్రయత్నం చేయమని కోరినట్టు పత్రికల్లో వచ్చింది. స్వయంగా అధినాయకుడి ప్రయత్నాలకే దిక్కు లేకపోయినప్పుడు పార్టీ ఎంపీలు మాత్రం ఏం చెయ్యగలుగుతారు? మామూలుగా అయితే, ఆత్మ గౌరవం నినాదం కలిగిన తెలుగు దేశం పార్టీకి ఇది చక్కని అదును. కానీ ఢిల్లీలో చక్రం తిప్పుతున్నది మిత్ర పక్షం కావడంతో ఏమీ పాలుపోని స్తితి. మింగలేని కక్కలేని పరిస్తితి. 

       


ఉపశ్రుతి: నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని తెలిసి అన్నారో ఏవిటో తెలియదు కాని, సీమాంధ్రకు బుందేల్‌ఖండ్ తరహాలో ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్  రాజ్యసభలో ప్రకటించారు. ఈ హోదాకింద బుందేల్‌ఖండ్‌కు దక్కిందెంతో తెలుసా? ప్రకటించింది 7,266 కోట్ల రూపాయలయితే,  వాస్తవంగా ఇచ్చింది కేవలం 3,450 కోట్లే. (25-02-2015)
NOTE: Courtesy Image Owner 

20, ఫిబ్రవరి 2015, శుక్రవారం

అమ్మయ్య! హైదరాబాదు మనదీ, మనందరిదీ!


(Published by 'SURYA' telugu daily in it's edit page on 22-02-2015, SUNDAY)

ఎన్నో ఏళ్ళక్రితమే, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాదులో స్థిరనివాసం ఏర్పరచుకున్న కుటుంబాలు ఎన్ని వేలున్నాయో, లక్షలు వున్నాయో  ఆ లెక్క తెలియదు కానీ, వాళ్ళల్లో చాలామంది  మొన్న గురువారం రాత్రి గుండెలమీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోయివుంటారని  తేలిగ్గా చెప్పవచ్చు. తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు మంత్రించి ఒదిలిన మాటల మత్తు అలాటిది మరి.
'ఇక్కడ (హైదరాబాదులో) సెట్లర్స్ ఎవ్వరూ లేరు. వున్నవాళ్లందరూ హైదరాబాదీలే!'   
పుష్కరం పైచిలుకు తెలంగాణా ఉద్యమ ప్రస్థానంలో, ఏడుమాసాల టీ.ఆర్.యస్.పరిపాలనాకాలంలో ఇటువంటి  ఉపశమన వాక్యాలు వినడానికి నోచుకోని  హైదరాబాదీ ఆంధ్రులు, 'కలా నిజమా' అని తేల్చుకోలేని స్తితిలో పడిపోయారు. హైదరాబాదులో ఆంధ్రులతో పాటు, తమిళులు, కన్నడిగులు, మళయాళీలు, మరాఠీలు, మార్వాడీలు, రాజస్థానీలు ఇలా వాళ్ళూ వీళ్ళని కాదు సమస్త భారతదేశంలోని సమస్త ప్రాంతాలవాళ్ళు, సమస్త భాషల వాళ్లు, సమస్త సంస్కృతుల వాళ్లు  ఎన్నో ఏళ్లుగా ఈ నగరంలో  నివసిస్తూ 'ఇది మాది' అన్న భావనలోనే వుండిపోయారు.  ఈ మధ్య కాలంలో ఒక్క ఆంధ్రులకు మాత్రమే ఈ భావన దూరం అవుతూ వచ్చింది. 'హైదరాబాదు మాదీ' అని చెప్పుకోలేని పరిస్తితి. 'మేము కూడా హైదరాబాదీ'లమే అని ఒప్పుకోలేని దుస్తితి. 'ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసే వుందాం' అంటూ ప్రత్యేక తెలంగాణా ఉద్యమ నాయకులూ, ప్రత్యేకించి తెలంగాణా రాష్ట్ర సమితి నాయకులూ ఉద్యమ కాలంలో ఎన్నిసార్లో ఉద్ఘాటించారు. కానీ అవేవీ హైదరాబాదులో నివసిస్తున్న సాధారణ ఆంధ్రులకు ఏమాత్రం ఉపశమనం కలిగించలేకపోయాయి. ఎంతమాత్రం భరోసా కల్పించలేకపోయాయి. తెలంగాణా ఏర్పడి, కేసీఆర్ నేతృత్వంలో కొత్త సర్కారు ఏలుబడి మొదలయి ఇన్ని నెలలు గడిచిపోతున్నా 'సెట్లర్లు' గా ముద్రపడిన ఆంధ్రులు  గుబులుగుబులుగానే  రోజులు గడుపుతున్నారు. అన్నింటికీ మించి హైదరాబాదులో నివసించే మరెవ్వరికీ లేని విధంగా 'సెట్లర్లు' అనే  ముద్రపడడం వారికి పుండు మీద కారం రాసినట్టుగా బాధపడిపోతున్నారు. ఉద్యమ స్పూర్తి కోసం, ఉద్యమ వేడి చల్లారకుండా చూడ్డం కోసం,  ఉద్యమ వ్యతిరేకులయిన బడా ఆంధ్రా బాబుల్ని తేలికపరచి మాట్లాడినట్టుగా,  తెలంగాణాను తమదిగా భావించి జీవనం గడుపుతున్న సాధారణ ఆంధ్రా పౌరులను  అలాగే హీనంగా చూడడం వారిని మరింత క్షోభ పెట్టి వుంటుంది. రాష్ట్రం విడిపోయింది. నిజమే.  కానీ, ఇప్పటివరకు ఏళ్లతరబడి హైదరాబాదులోనే వుంటున్న వారు తమ ఇళ్ళూ వాకిళ్ళూ ఒదులుకుని, ఎప్పుడో విడిచివచ్చిన ప్రాంతాలకు తరలివెళ్లడం అంత  ఆషామాషీ వ్యవహారం కాదు. భారతదేశ విభజన సమయంలోనే అనేకమంది ముస్లిం కుటుంబాలు పాకీస్తాన్ కు వెళ్ళకుండా హైదరాబాదులోనే వుండిపోయిన సందర్భాలను వారు గుర్తుచేస్తున్నారు. అంచేతే, అంతటి ఆందోళనలకు గురవుతూ వున్నందువల్లనే, కేసీఆర్ చేసిన ఈ ప్రకటనతో వాళ్లకు  ప్రాణాలు లేచివచ్చినట్టయింది. 'పరవాలేదు , ఇక మంచి రోజులు వచ్చేశాయ్' అన్న నమ్మకం కలిగింది. స్వయంగా టీ.ఆర్.యస్. అధినేతే  'ఇక్కడ సెట్లర్లు ఎవ్వరూ లేరు, వున్నవాళ్ళందరూ హైదరాబాదీలే' అన్న తరువాత దానికి తిరుగేముంటుంది? అదీ వారి ధీమా.
అయితే ఆయన మాటల్ని తేలిగ్గా తీసుకునేవాళ్ళు కూడా లేకపోలేదు. 'హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అయ్యేదాకా కేసీఆర్ ఇలాగే  మాట్లాడుతాడు, ఆ తరువాత మళ్ళీ షరా మామూలే' అని సన్నాయి నొక్కులు ఇప్పటికే మొదలయ్యాయి. బహుశా అలాటి వాళ్ళను దృష్టిలో పెట్టుకునే  కేసీఆర్ తన ప్రసంగంలో కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. 'అబద్దాలు చెప్పడం తనకు నచ్చదనీ, చెప్పేది నూటికి నూరు శాతం చేసి చూపిస్తామనీ' అన్నారు.    
పత్రికల్లో ప్రచురితం అయిన దానిప్రకారం కేసీఆర్ ప్రసంగం ఇలా సాగిపోయింది.
'నిజాం పాలనకు ముందు నుంచీ ఇక్కడ (హైదరాబాదు) అన్ని ప్రాంతాలవాళ్ళు కలిసి జీవించారు. ఇప్పుడూ అలాగే ముందుకెళదాం. తెలంగాణా రాష్ట్రం మనదనే భావనతో సాగుదాం. మా ప్రభుత్వానికి ప్రాంతీయ బేధం లేదు. మీరు (హైదరాబాదులో వుంటున్న ఆంధ్రులు) సెటిలర్స్ కాదు. మీ తాతలు తండ్రులు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు, కాబట్టి సెటిలర్స్ అన్న భావన విడిచిపెట్టండి' అంటూ చెప్పుకొచ్చారు కేసీఆర్.
'సెటిలర్స్' అన్న ముద్ర వేసిన వాళ్ళే ఆ భావన విడిచిపెట్టాలని అంటుంటే అనుమానం కలగడం సహజం. ఈ విషయం తెలియనివారు కాదాయన. అందుకే సందేహ నివృత్తి చేసే ప్రయత్నం చేశారు.
'ఉద్యమ సమయంలో కొన్ని సందర్భాలలో అవసరాన్నిబట్టి తేడాలు వచ్చాయి. ఇప్పుడా అవసరం లేదు. మీ కాలికి ముల్లుగుచ్చుకుంటే నా పంటితో తీస్తా'
ఏవన్నా అరకొర అనుమానాలు వుంటే ఇదిగో ఈ దెబ్బతో పటాపంచలు. మాటలను మంత్రించి ఒదలడం కేసీఆర్ కి వెన్నతో పెట్టిన విద్య.   
అయినా మనసు మూలల్లో ఏదో ఒకమూల సందిగ్ధం. అందుకే కాబోలు చివరి బాణం కూడా ఒదిలారు.
'నేను రాష్ట్రానికి ఇప్పుడు ముఖ్యమంత్రిని. అందరికీ రక్షణ కల్పించడం సీఎం గా నా బాధ్యత'.
అంతటితో ఆగితే అయన కేసీఆర్ యెలా అవుతారు?
అందుకే దానికి 'రాజధర్మం' అనే మాటకూడా జత కలిపారు.
అనుమాన నివృత్తి చేసిన విధానం మాత్రం, సీమాంధ్రకు చెందిన ఒక సీనియర్ జర్నలిష్టు అన్నట్టు, నూటికి నూరుపాళ్ళు మార్కులు పడేలావుంది.  
విన్నవాళ్లు కూడా  'అమ్మయ్య, ఇక భయం లేదు' అనుకునే వుంటారు.




కార్పొరేషన్ ఎన్నికల అవసరం అలా  చెప్పించిందో, రాజకీయ చాణక్యం అలా  మాట్లాడించిందో, ఏమైతేనేం, సెట్లర్స్ అనే ఆంధ్రులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఉపశమన వాక్యాలు సాక్షాత్తూ తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షడు, తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నోటనే వెలువడడం ఆహ్వానించదగ్గ పరిణామం.
'గతం గతః వెనుకటి రోజులు మరిచిపోదాం' అని చెప్పి, కొద్ది రోజులు కూడా  గడవకముందే దానికి కొనసాగింపుగా కేసీఆర్  చెప్పిన ఈ వూరడింపు మాటలు హైదరాబాదులో నివసిస్తున్న ఆంధ్రులకు అవసరమైన మనోధైర్యాన్ని ఇచ్చేవుండాలి. రాష్ట్ర విభజన జరిగిన తీరు పట్ల ఆంధ్ర ప్రాంతం వాళ్లు ఎంతగా రగిలిపోతున్నారో ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పరిస్తితి చూసిన ప్రతి ఒక్కరికీ అర్ధం అయ్యే వుంటుంది. ఈ విషయం అర్ధం చేసుకోగల రాజకీయ పరిపక్వత కేసీఆర్ లో పుష్కలం. రాష్ట్ర విభజన జరిగిపోయి, కోరుకున్న విధంగా పరిపాలనా పగ్గాలు చేతికి వచ్చినప్పుడు చేసే యుద్ధం రాజకీయ పార్టీలతో చేయాలి కానీ, అమాయకులయిన జనాలతో కాదన్న వాస్తవం బోధపడి వుండాలి. మొన్నటి ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ప్రజలకు చెప్పిన బహిరంగ క్షమాపణ, ఎన్నికల వేళ ప్రత్యర్ధి  నేతల తల రాతల్నే మార్చివేసింది. యేమో! టీ.ఆర్.యస్. అంటే ఏ కోశానా ఇష్టం లేనివాళ్ళు కూడా కేసీఆర్ మాటలతో మనసు మార్చుకుంటారేమో  అనే ఆలోచన కూడా ఈ మార్పుకు దోహదం చేసి వుండొచ్చు. మార్పు కోసం వేస్తున్న అడుగు, చెబుతున్న మాటలు జనం మంచికోసమే అయినప్పుడు అందులో కాదనడానికి ఏముంటుంది? అని సమాధానపడేవాళ్ళు సమాజంలో పుష్కలం. పోనీ,  ఎన్నికలకోసమే ఇలాటి బులిబుచ్చకపు మాటలు చెప్పి, తరువాత  మాట తప్పారే అనుకోండి, ప్రజలదగ్గర అంతకంటే పదునయిన ఆయుధమే 'ఓటు' రూపంలో వుంది.     
నిజానికి కేసీఆర్ చెప్పిన 'సెట్లర్ల' సంగతే మరునాడు పత్రికలకు  ప్రధాన శీర్షిక కావాలి. మీడియాకు ఇదే ముఖ్యమైన చర్చనీయాంశం కావాలి. కానీ మరుసటి రోజు  తెలుగు పత్రికలు ఈ వార్తకు ప్రాధాన్యం ఇచ్చి మొదటి పుటలోనే ప్రచురించినప్పటికీ అసలు ప్రాధన్యాన్ని కాస్తా  మరో సంచలన వార్త తన్నుకుపోయింది. దానికి కూడా కేసీఆరే కేంద్ర బిందువు కావడం కాకతాళీయం కావచ్చు.
తెలంగాణా సచివాలయంలోకి మీడియాకు 'నో ఎంట్రీ' అంటూ పత్రికలు, టీవీలు మొత్తం దృష్టిని అటు మరల్చేలా చేసాయి. నిజానికి అది నిర్ణయం కాదు. ఒక ఆలోచన మాత్రమే. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో వుంటూ అలాటి ఆలోచన కూడా చేయకూడదనే  ఎవరయినా ఆశిస్తారు.
సచివాలయంలోకి మీడియాను అనుమతించని రాష్ట్రాలు లేకపోలేదు. ఉదాహరణకు నిన్నగాక మొన్న ఢిల్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో అపూర్వ విజయం సాధించి మీడియాచేత వేనోళ్ళ కొనియాడబడిన  కేజ్రీవాల్ మహాశయులే అధికార పీఠం ఎక్కగానే చేసిన మొదటి పనుల్లో ఒకటి మీడియా మీద ఆంక్షలు విధించడం. అదేమని ప్రశ్నిస్తే మీడియాకంటే తనను నమ్ముకున్న  ప్రజలే ముఖ్యమని చెప్పడం.
మీడియా చేసుకున్న దురదృష్టం ఏమిటో కానీ ఏ పార్టీ అధికారానికి దూరమైనా వారు దగ్గరకు తీసేది మీడియానే. పోగొట్టుకున్న పూర్వ వైభవాన్ని తిరిగి పొందడం కోసం అనండి, లేదా ప్రజలకు దగ్గర కావడానికి మీడియాను మించిన సాధనం లేదన్న నమ్మకంతో కానివ్వండి ఆ పార్టీలు ముందు చేసే పని మీడియాను మాలిమి చేసుకోవడమే. అవే పార్టీలు  అధికారానికి వచ్చిన మరుక్షణం నుంచీ చేసే మొదటి పని కూడా  మీడియాను ఎడం  పెట్టడమే.  ఈ విషయంలో మినహాయింపు ఇవ్వగల ఒక్క రాజకీయ పార్టీ కూడా లేదనడం సత్య దూరం కాదు.
ఇక్కడ మరో విషయం కూడా ప్రభుత్వంలో వున్నవాళ్ళు గమనించాలి. సచివాలయానికి వచ్చే జర్నలిష్టులు లేదా విలేకరులు చాలావరకు ప్రభుత్వ కార్యక్రమాలు, పధకాలకే తమ వార్తల ద్వారా ప్రచారం కల్పిస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కాణీ ఖర్చులేని ప్రచారం. పార్టీ కార్యాలయాల వార్తలు సేకరించే విలేకరులు కేవలం రాజకీయ  మసాలా వున్న వార్తలకోసమే వెతుకుతుంటారు. వాటితో పోలిస్తే సచివాలయం బీటు చూసే పత్రికల వాళ్ళే కొంత నయం అనుకోవాలి.
ఈ విషయంలో ప్రభుత్వం కొంత పునరాలోచనలో పడిన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యాసం సిద్ధం అవుతున్న సమయానికి కేసీఆర్ ప్రెస్ అకాడమీకి వెళ్ళి జర్నలిష్టులతో సంప్రదిస్తారని వార్తలు వస్తున్నాయి. ముందే చెప్పినట్టు, మనిషి మారినా, విధానాలు మార్చుకున్నా అది మంచికోసమే అయినప్పుడు దాన్ని స్వాగతించాలి. (20-02-2015)

జర్నలిష్టులకు నో ఎంట్రీ


సచివాలయం - కొన్ని జ్ఞాపకాలు  
1975 నవంబర్ లో నేను హైదరాబాదు ఆకాశవాణిలో విలేకరిగా చేరిన నాటి నుంచి కొన్ని దశాబ్దాలపాటు ఒకటే దినచర్య. నేను వుంటున్న చిక్కడపల్లి నుంచి బయలుదేరి రెండు బస్సులు మారి రేడియో స్టేషన్ కు రెండు  స్టాపుల ముందే, సరోవర్ హోటల్ దగ్గర  దిగిపోయేవాడిని. నేను పనిచేసేది రేడియో స్టేషన్ అయినా నా కార్యస్థానం మాత్రం సచివాలయమే. ఆరోజుల్లో సెక్రెటేరియట్ ప్రధాన ద్వారం, రాజసం ఒలకబోసే ఇనుపకమ్మీలతో ప్రస్తుతం ఫ్లై ఓవర్ మొదలయ్యే ప్రధాన రహదారిలో వుండేది. దాని ఎదురుగా ఆంధ్ర జ్యోతి సిటీ బ్యూరో ఆఫీసు. ఆదిరాజు వేంకటేశ్వర రావు గారు దానికి విలేకరి. ఆంధ్ర జ్యోతి పత్రిక మాత్రం బెజవాడలో అచ్చయ్యేది. ఆయన ఇక్కడనుంచే టెలిప్రింటర్  లో వార్తలు పంపేవాడు. నేను రేడియోలో చేరకముందు ఒకసారి ఆయనతో కలిసి సచివాలయానికి వెళ్లాను. అంతకుముందు ఎప్పుడూ అందులో అడుగు పెట్టిన అనుభవం లేదు. ఆదిరాజు పేరులోనే కాకుండా వేషభాషల్లో  కూడా. ఫుల్ సూటు. నెక్ టై. చేతిలో బ్రీఫ్ కేసు. ఢిల్లీలో ఎక్కువకాలం వుండడం వల్ల అలవడ్డ అలవాట్లు కాబోలు. సచివాలయం గేటు దగ్గర కాపలా మనిషి ఆదిరాజుని చూడగానే రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాడు. అయన వెంట వస్తున్న నన్ను చూసి  కనీసం ఎవరని కూడా అడగలేదు. సిగరెట్ వెలుగుతున్న చేయిని విలాసంగా వూపుతూ ఆదిరాజు లోపలకు వెళ్లాడు. ఆయనతో పాటే నేనూ. ఆ తరువాత రేడియో విలేకరిగా నాకు సచివాలయం మొదటి కార్యస్థానంగా మారిపోయింది. ప్రతి రోజూ ముందు హాజరు అక్కడే. ఆ తరువాతే రేడియో. ఎందుకంటే రేడియో వార్తలకి  అవసరం అయ్యే అధికారిక సమాచారం యావత్తూ అక్కడే దొరికేది. కాలక్రమంలో  గేటు మనిషి నుంచి ముఖ్యమంత్రివరకు అందరితో ముఖపరిచయాలు. ఎక్కడికయినా గేటు (తలుపు) తోసుకుని వెళ్ళగల చనువూ, వెసులుబాటు, వీటికి తోడు రేడియో విలేకరి  అన్న ట్యాగు లైను.
గతంలో ముఖ్యమంత్రుల కార్యాలయం  వున్న పాత (హెరిటేజ్) భవనం వెనుకపక్కనే ప్రెస్ రూమ్. విశాలంగా వుండేది. ఒకటి రెండు సోఫాలు, కుర్చీలు. పక్కనే భోషాణం మాదిరి చిన్న చెక్క బీరువా. అందులో ఫోను. ఈ ఫోను కోసమే చాలామంది వచ్చేవాళ్ళు. ఎందుకంటే అది డైరెక్ట్ ఫోను. సచివాలయం టెలిఫోన్ ఆపరేటర్ తో సంబంధం లేకుండా నేరుగా ఫోను చేసి మాట్లాడుకోవచ్చు. ఆరోజుల్లో చాలామంది సీనియర్ జర్నలిష్టులకు సయితం ఇళ్ళల్లో ఫోన్లు వుండేవి కావు. ఒకరిద్దరికి వున్నా ఆఫీసు బిల్లు కట్టే పద్దతి వుండేది కాదు. అంచేత వార్తా సేకరణకోసం ప్రెస్ రూమ్ ఫోను బాగా పనికి వచ్చేది. పేపర్లవాళ్ల కంటే నాకు బాగా ఉపయోగంగా వుండేది. వాళ్లు వార్త సుదీర్ఘంగా రాయాలి కనుక ఆఫీసులకి వెళ్ళి ఇచ్చేవాళ్ళు. రేడియోకి మూడు ముక్కలాటే కనుక వార్తల టైముకు ముందుగా ఫోను చేసి చెప్పేవాడిని. ప్రెస్ రూములో రేడియో కూడా వుండేది. ఫోనులో చెప్పిన వార్త అప్పటికప్పుడే రేడియోలో రావడం కొంతమందికి ఆశ్చర్యంగా వుండేది.
ప్రెస్ రూములో   టీ, కాఫీలు తెచ్చి పెట్టడానికి ఒక అటెండరు. డెక్కన్ క్రానికల్ కరస్పాండెంట్ సింహం (నరసింహారావు) ఒక సోఫాలో నిద్రపోతూ వుండేవారు. కానీ ఆయనది కాకి నిద్ర. చటుక్కున లేచి కూర్చునే వారు. ప్రెస్ మీట్ లో అవతలవాడు మంత్రికానీ, ముఖ్యమంత్రి కానీ ప్రశ్నలతో సింహం మాదిరిగానే విరుచుకు పడేవాడు. ఈనాడు శాస్త్రి గారు, ఆంధ్ర పత్రిక (ముక్కు) శర్మ గారు, హిందూ రాజేంద్రప్రసాద్   పీ.యస్. సుందరం (ముందు ఆంధ్ర పత్రిక విలేకరి, తరువాత ఇండియన్ ఎక్స్ ప్రెస్ రెసిడెంట్ ఎడిటర్), శ్రీకాంత్ విఠల్, యూఎన్ఐ పార్ధసారధి, పీటీఐ జమాల్, యెన్ ఎస్ ఎస్ లక్ష్మారెడ్డి, కల్యాణి, ఆంధ్ర జ్యోతి వెంకట రావు గారు, ఎన్.ఇన్నయ్య, దామోదరస్వామి, ఉడయవర్లు, ఆంధ్ర ప్రభ నంద్యాల గోపాల్, ఇలా ఎంతో మంది జర్నలిష్టులతో పరిచయాలు బలపడడానికి ప్రెస్ రూమ్ దోహదం చేసింది. జమాల్, కల్యాణి, లక్ష్మారెడ్డి ఎప్పుడూ కలిసి తిరుగుతుండే వారు.  వారి పేర్లలో మొదటి అక్షరాలతో వారిని 'జాకాల్' అని ముద్దు పేరు పెట్టి పిలిచేవాళ్ళు. వీళ్ళల్లో నలుగురయిదుగురు మినహా మిగిలిన వాళ్ళు కాలం చేశారు. చాలా కాలం అయింది కాబట్టి కాస్త మతిమరపు సహజం. ఎవరి పేర్లు అయినా మరచిపోతే క్షంతవ్యుణ్ణి.
అంతా ఒక కుటుంబం మాదిరిగా మధ్యాహ్నం దాకా సచివాలయంలో గడిపి, వార్తలు సేకరించుకుని, తోటి వారితో పంచుకుని, అనుమానాలు వుంటే తీర్చుకుని ఎవరి ఆఫీసులకు వాళ్ళం వెళ్ళేవాళ్ళం. ఈరోజు చాలామంది అడుగుతుంటారు, 'మీరు యెందుకు మార్నింగ్ వాక్ చేయరు' అని. ఎందుకంటే ఒక జీవితానికి సరిపడా నడక  ఆ రోజుల్లో సచివాలయంలోనే  నడిచాను కనుక.  ఒక బ్లాకు నుంచి మరో బ్లాకుకు, ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి, ఎక్కే మెట్లు, దిగే మెట్లు, నడకే, నడక, పరుగే  పరుగు.
ఇప్పుడా ప్రెస్ రూమే లేదు. మేము నడయాడిన పాత భవనాలు లేవు, ఈరోజు మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం తెలంగాణా సచివాలయంలోకి ప్రవేశించడానికి 'జర్నలిష్టులకు నో ఎంట్రీ' అంటున్నారు (ట). సచివాలయంతో మూడు దశాబ్దాల పైచిలుకు అనుబంధం పదేళ్ళ క్రితం పదవీ విరమణ చేసినప్పుడే తెగిపోయింది. జీతభత్యాల విషయంలో ఈనాటి జర్నలిష్టులకు సాటి రాకున్నా, పోలిక లేకున్నా  ఆ రోజుల్లో జర్నలిష్టులుగా పొందిన గౌరవాభిమానాలు మాత్రం వెలకట్టలేనివి. అవే మరపురాని, మరవలేని జ్ఞాపకాలుగా మిగిలాయి. 



ఇక నో ఎంట్రీ సంగతి అంటారా?
రవి కాంచని చోట కవి కాంచును అన్నారు అందుకే. జర్నలిష్టులకు కాస్త పనిభారం పెరుగుతుంది.                  

 (వచ్చే ఆదివారం సూర్య పత్రికకి వ్యాసం రాయడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్న సమయంలో విన్నకోట నరసింహారావు ఈ అంశంపై బ్లాగులో రాయమని సూచించారు. ఈ నాలుగు ముక్కలు అయన చలవే - భండారు శ్రీనివాసరావు)