17, ఫిబ్రవరి 2015, మంగళవారం

చంద్రునికో నూలుపోగు


Published by 'Namaste Telangana' Telugu Daily on 17th Feb.2015, Tuesday.
(ఫిబ్రవరి 17 -  తెలంగాణా తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టిన రోజు)


'కేసీఆర్' అనే ఒక బక్కపలచటి రాజకీయ నాయకుడి గురించి చాలా బాగా తెలుసు అని అనుకునేవాళ్ళు చాలా మంది కనిపిస్తారు. ఇలాటి వారికి కూడా ఆయన గురించి పూర్తిగా తెలుసు అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే కేసీఆర్ అర్ధం అయినట్టు అనిపించే అర్ధం కాని మనిషి. అలా అనిచెప్పి,  ఆయన పైకి ఒక రకంగా లోపల మరో రకంగా వ్యవహరించే వ్యక్తి అని అర్ధం కాదు.   
నవజాత  తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పదవిని స్వీకరించిన తొలినాళ్ళలోనే కేసీఆర్ తెలంగాణా రాష్ట్రానికి చెందిన అధికారుల సమావేశంలో ఆయన చేసిన ప్రసంగం - ఆయన్ని దగ్గరగా ఎరిగిన అనేకమందిలో కూడా, ఈయన మనకు తెలిసిన చంద్రశేఖర రావుగారేనా  అన్న అభిప్రాయం కలిగించింది.   
ఆ రోజు, ఆ సమయంలో కరెంటు వుండడం వల్ల నేను కేసీఆర్  ప్రసంగాన్ని ఆసాంతం టీవీ తెరపై ఇంట్లో కూర్చుని  చూడగలిగాను. 'మాటల మాంత్రికుడ'ని, 'మాటలతో ఎదుటి వారిని బురిడీ కొట్టిస్తార'ని ఆయన గురించి అనుకోవడం కద్దు.  అయితే ఆ రోజు, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో  నవ తెలంగాణా లక్ష్యాలు వివరిస్తూ, తెలంగాణా మొదటి ముఖ్యమంత్రిగా ఆయన చేసిన  ప్రసంగానికి శ్రోతలుగా వున్నది అంత ఆషామాషీ వ్యక్తులు కాదు. మొత్తం తెలంగాణా అధికారయంత్రాంగం ఆయన మాటల్ని ఆలకించింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, శాఖాధిపతులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
బహుశా వారిలో చాలామందికి తాము ఎరిగివున్న కేసీఆర్ కు బదులు కొత్త కేసీఆర్ కనబడివుంటాడని టీవీలో ఆయన ప్రసంగాని చూస్తూ, వింటున్న నాకు అనిపించింది. 'నవ తెలంగాణా యెలా వుండాలి' అనే దానిపై ఆయన అభిప్రాయాలు యెలా వుంటాయన్న దానిపై అప్పటికే  నాకు అవగాహన వుంది. ఎందుకంటే నిరుటి అసెంబ్లీ ఎన్నికలకు చాలా పూర్వమే తెలంగాణా జర్నలిస్టులు ఏర్పాటుచేసిన ఒక సమావేశంలో ఆయన చేసిన అంతరంగ ఆవిష్కరణకు నేనూ ఒక  ప్రత్యక్ష శ్రోతను. అంచేత ఒక్కటి మాత్రం గట్టిగా చెప్పగలను. చెప్పదలచుకున్న అంశాలను సంగ్రహంగా, సూటిగా, అరటి పండు వొలిచి చేతిలో పెట్టిన చందంగా చెప్పగలిగే చతురత కేసీఆర్  కు వున్నట్టు వర్తమాన రాష్ట్ర రాజకీయ నాయకుల్లో ఎవరికీ వున్నట్టు లేదు. 'తెలంగాణా సమస్యలపట్ల తనకు అవగాహన హెచ్చు' అని చెప్పుకుంటూనే, కొన్ని కొన్ని గణాంకాల ప్రస్తావన  వచ్చినప్పుడు ఎలాటి భేషజాలకు పోకుండా పక్కనే కూర్చున్న సేద్యపు నీటి రంగ నిపుణులు విద్యాసాగర్ రావు గారిని అడిగి తెలుసుకుని సరిదిద్దుకున్న విధానం గమనించినప్పుడు ఆయనలోని నిజాయితీ అధికారులకు తెలిసివచ్చి వుండాలి. 'కింది అధికారులతో, సిబ్బందితో తెలుగులో మాట్లాడండి, ఇంగ్లీష్ లో అడిగి బెదరగొట్టకండి' అంటూ జిల్లా కలెక్టర్లకు సూచనలు చేసిన పద్దతి కూడా బాగుంది. 'అందర్నీ కలుపుకు పోవడం ద్వారా మాత్రమే కన్న కలలు నిజం చేసుకోగలుగుతామ'ని ఓ పక్క సుతిమెత్తగా చెబుతూనే, 'ప్రతి విషయంలో ఆలోచన, ఆచరణ రెండూ కూడా కేవలం తెలంగాణాను దృష్టిలో పెట్టుకుని సాగాల'ని అధికారులకు దిశానిర్దేశం చేసిన తీరు పరికించినప్పుడు రానున్న రోజుల్లో ఆయన అనుసరించబోయే ఎత్తుగడలు యెంత కఠినంగా వుండబోతున్నాయో కూడా అవగతమైంది.
సరే. అవి  అధికారంలోకి వచ్చిన మొదటి రోజులు. చూస్తూ వుండగానే ఎనిమిదిన్నర పైచిలుకు మాసాలు గడిచిపోయాయి. అయినా ఆయన మాట తీరు కానీ, నడక తీరు కానీ లవలేశం కూడా మారలేదు.   కేసీఆర్ కి కలిసివచ్చిందీ, రానిదీ కూడా ఆయనలోని ఈ విలక్షణ లక్షణమే.  
కొత్త ప్రభుత్వం ఏర్పాటయిన తొలినాళ్ళనుంచే టీ.ఆర్.యస్.  ప్రత్యర్ధులు, ప్రత్యేకించి తెలంగాణా టీడీపీ  నాయకులు తమ విమర్శలకు పదును పెడుతూ వచ్చారు. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తీసుకున్నకొన్ని నిర్ణయాలు చర్చనీయాంశాలుగా మారడం వారికి కలిసివచ్చింది. కాంట్రాక్ట్  ఉద్యోగుల సర్వీసులను  ఖాయం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణా విద్యార్దులలోనే అలజడులు రేపింది. అలాగే, రెండు ప్రైవేటు టీవీ ఛానళ్ళ ప్రసారాలను నిలిపివేస్తూ తెలంగాణా కేబులు టీవీ ఆపరేటర్లు తీసుకున్న నిర్ణయం విషయంలో ప్రభుత్వం కావాలని ఉదాసీన  వైఖరి అవలంబిస్తోందని కొన్ని జర్నలిష్టు సంఘాలు చేస్తున్న విమర్శలు జాతీయ స్థాయిలో  కూడా ప్రకంపనలకు దారితీయడం  కొత్త ప్రభుత్వానికి కొంత ఇబ్బంది కలిగిస్తున్న  విషయమే. ఇక కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తిచేసిన ఇంటింటి  సర్వే కూడా  ప్రతికూల పవనాలను సృష్టించింది. కాకపొతే ఈ సర్వే వల్ల సర్వత్రా కొంత ప్రతికూలత కనబడ్డప్పటికీ,  పరిపాలన విషయంలో సర్కారు తీసుకునే నిర్ణయాలపట్ల సామాన్య జనాలకున్న భయం భక్తీ  తేటతెల్లం అయ్యాయి. ఈ సర్వేతో  సాధించింది ఏవిటన్నది ఇప్పటికీ ప్రశ్నగానే వుంది. కానీ, రాజకీయ ప్రత్యర్దులపై బాణాలు ఎక్కుపెట్టడానికి కేసీఆర్ ఎంతమాత్రం వెనుకాడరన్న అభిప్రాయం కలిగించడంలో ఆయన కృతకృత్యులు అయ్యారనే  చెప్పొచ్చు. కాకపోతే,  ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేకానేక అసాధ్య వాగ్దానాలు నెరవేర్చే విషయంలో కొత్త ప్రభుత్వం వేస్తున్న కప్పదాట్లు ముందు ముందు గుదిబండగా మారే ప్రమాదం లేకపోలేదన్న అభిప్రాయాలు కూడా  వ్యక్తం అవుతున్నాయి.
ఎమ్సెట్ పరీక్ష, 1956 నిబంధన, అయ్యప్ప సొసైటీలో ఇళ్ళ కూల్చివేతలు, కృష్ణా జలాల వివాదం, సచివాలయం తరపింపు నిర్ణయం   ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వివాదాస్పద అంశాలు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న నీలాపనిందలు.           
అయితే, పుష్కర కాలానికి పైగా తెలంగాణా ఉద్యమాన్ని వేడి తగ్గకుండా నిభాయించుకుంటూ వచ్చిన చంద్రశేఖరరావుగారికి ఇలాటి విమర్శలను ఖాతరు చేయకపోవడం కొత్తేమీ కాదు. వీటిని ఆయన తన సహజసిద్ధ ధోరణిలోనే కొట్టిపారవేయడం జరిగింది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. టీ.ఆర్.యస్.  అనే దీపానికి  తెలంగాణావాదం  'చమురు' లాటిది. ఈ విషయం కేసీఆర్ కి పూర్తిగా తెలుసు. తెలంగాణా రావడంతోనే తెలంగాణా వాదానికి విలువ లేకుండా పోయిందనే వాదాన్ని ఆయన విశ్వసించరు. ఆ వాదం కొడిగట్టిపోకుండా  చూసుకోవడం యెంత అవసరమో ఆ ఉద్యమ నాయకుడిగా ఆయనకు మంచి అవగాహన  వుంది.  అందుకే ఆయన చేసే ప్రతి ఆలోచనలో, చేపట్టే ప్రతి కార్యక్రమంలో, మాట్లాడే ప్రతి మాటలో  అది నిరంతరంగా  రగులుతూనే ఉండేట్టు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఏ నిర్ణయమైనా, ఏ పధకం అయినా దాని వెనుక 'తెలంగాణా స్పూర్తి' ఉండేలా చూసుకోవడం కేసీఆర్ కి వెన్నతో పెట్టిన విద్య,   
ఆయన తరచుగా మాట్లాడే మాటలను బట్టి ఒక విషయం నిర్ధారణగా అర్ధం అవుతోంది. తెలంగాణా ఏర్పాటు అన్న కల సాకారమైన తరువాత, ఆ కొత్త తెలంగాణాను ఏ రూపంలో ఆవిష్కరించుకోవాలి అనేదానిపై ఒక నిర్దిష్టమైన అవగాహనకు ఆయన వచ్చినట్టు కనబడుతోంది. 'బంగారు తెలంగాణా' అని పదే పదే చెప్పడంలో కొంత రాజకీయ వ్యూహం, ప్రయోజనం ఉన్నప్పటికీ, కొత్త విధానాలు, కొత్త వ్యవస్థతోనే  తెలంగాణా భవిష్యత్ చిత్రపఠం తయారుచేయాలన్న తాపత్రయంతో కేసీఆర్ అడుగులు వేస్తున్నట్టు స్పష్టం అవుతోంది. పాత పద్దతులను అనుసరిస్తూపొతే,  తాను  అనుకున్న అడుగులు అనుకున్నట్టు వేయలేనన్న ఉద్దేశ్యంతోనే, కొంత  ఆలస్యం అయినా కొత్త బాట పట్టడానికే ఆయన కృతనిశ్చయంతో వున్నట్టు ఆయన చేతలు తెలుపుతున్నాయి. ఎన్ని విమర్శలు వచ్చినా తోసిరాజని ఇంటింటి సర్వే నిర్వహించిన తీరు ఇందుకు అద్దం పడుతోంది. కొంత మొండిగా అనిపించినా ఈ ఆలోచనల్లో హేతుబద్ధత లేకపోలేదు. సవాలక్ష  సమస్యల నేపధ్యంలో తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించింది. కొత్త ఇల్లు సదురుకోవడం ఒక ఎత్తయితే, పాత కాపురం కొనసాగింపుగా మిగిలిన సమస్యలు మరికొన్ని. ఈ నేపధ్య కోణం నుంచి చూస్తే, 'కేసీఆర్ తరచుగా మాట మారుస్తారు, ఒకసారి చెప్పినదానికీ, మరోసారి అన్నదానికీ పొంతన వుండదు,  అది అయన అసలు నైజం' అనే వారూ వున్నారు. అయన ఏది చేసినా అది బంగారు తెలంగాణా కల నెరవేర్చుకోవడం కోసమే అని మనః స్పూర్తిగా నమ్మేవారు కూడా అధిక సంఖ్యలోనే వున్నారు.  రాజకీయంగా అస్థిర పరిస్తితులు లేకున్నా, పొంచి వున్న రాజకీయ ప్రత్యర్ధుల ఎత్తుగడల నడుమ,  అత్తెసరు మెజారిటీ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడం కత్తి మీద సాము అన్న ఎరుక కలిగిన రాజకీయ దురంధరుడు కేసీఆర్. ముందు ముందు ఎలాటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందు చూపుతో, నైతికం అనైతికం  అన్న వాదనలను లెక్కపెట్టకుండా, అన్ని పార్టీలనుంచి స్థానికంగా బలంగా వుండే రాజకీయ నాయకులను టీ.ఆర్.యస్. లోకి రప్పించే అంశానికే ఆయన పెద్దపీట వేసినట్టు కనబడుతుంది. ఇతర పార్టీలకు చెందిన  అనేకమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు  టీ.ఆర్.యస్. తీర్ధం పుచ్చుకునేలా చేయడమే ఇందుకు ఉదాహరణ. అధికారంలో లేకపోతే   ప్రజాసేవ చేయడం కష్టం అనే అభిప్రాయం పెంచుకుంటున్న రాజకీయ నాయకుల సంఖ్య అన్ని పార్టీల్లో పెరుగుతున్నప్పుడు 'ఆకర్ష్' పధకం అమలుచేయడానికి పెద్ద కష్టపడనక్కరలేదన్న విషయం ఆకళింపు చేసుకున్న రాజకీయవేత్త  కేసీఆర్. అందుకే, అధికార పగ్గాలు చేపట్టిన వంద రోజుల్లోనే ఈ జంప్ జిలానీల సంఖ్య ఈ విధంగా పెరుగుతోంది. తమ పార్టీని బలపరచుకోవడం అనేది ఏ పార్టీ అయినా చేస్తుంది. అయితే అవతల పార్టీలను బలహీన పరచడం  ద్వారా తాము బలపడే కొత్త రాజకీయ సంస్కృతి ఇటీవలి కాలంలో అన్ని పార్టీల్లో బలంగా వేళ్ళూనుకుంటోంది. 'కాంగ్రెస్ రహిత భారతం' అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇచ్చిన నినాదంలో దాగున్న నిజం ఇదే. కాబట్టి, అందరూ చేస్తున్నది అదే అయినప్పుడు, 'పదుగురాడుమాట పాడియై ధరజెల్లు'  అన్న వేమన  సూక్తికి తగ్గట్టే ఈ పార్టీ మార్పిళ్లు అన్ని పార్టీల్లోనూ నిస్సిగ్గుగా జరిగిపోతున్నాయి.
ఇన్ని నెలల పరిపాలనలో ఒక ముఖ్యమంత్రిగా సాధించింది ఏమిటన్న ప్రశ్నకు సమాధానంగా ఆయన చెబుతూ వస్తోంది ఒక్కటే. ఏమి చేశామన్నది కాదు ఏమి చేయాలి అన్నదానిపై ఆయన నిత్యం కసరత్తు చేస్తూ వస్తున్నారు. చేయాల్సినవి ఇంకా చాలా వున్నాయంటున్నారు. అందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయంటున్నారు. పిండిని బట్టి రొట్టె కాకుండా,  ఎన్ని రొట్టెలు అవసరమో ముందు  లెక్క తేల్చుకుని ఆ తరువాత యెంత పిండిని  సమీకరించుకోవాలో లెక్కవేసుకుంటామని కూడా అంటున్నారు. ఆయన ఆలోచనలు కొన్ని అబ్బురపరిచేవిగా వుంటాయి.  మరొకొన్ని 'ఇవన్నీ అయ్యే పనేనా' అన్న సందేహాలను రేకెత్తిస్తాయి.
సరే! కేసీఆర్ ను, ఆయన నడిపే తెలంగాణా  సర్కారును ఆ పనిలో ఉండనివ్వండి. కానీ,  ఈ లెక్కలు డొక్కలు తేల్చుకునే క్రమంలో, పాలన కుదురుకోలేదనే నెపంతో  రోజులు వెళ్ళదీసే ఆలోచన చేయకూడదనే అందరూ కోరుకునేది.

కొత్త ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి కొంత వ్యవధానం ఇవ్వడం  అవసరం.  కానీ విమర్శలు చేసే అవకాశం ఇవ్వకుండా చూసుకోవడం  ప్రభుత్వానికి కూడా  అంతే అవసరం.  
తెలంగాణా ముఖ్యమంత్రిగా తొలి పుట్టిన రోజు జరుపుకుంటున్న కేసీఆర్ గారికి శుభాకాంక్షలు. తెలంగాణా రాష్ట్రం తొలి పుట్టిన రోజుకల్లా ఆయన తన కలల్లో కొన్నింటినయినా సాకారం చేయాలనీ, చేయగలగాలని కోరుకుందాం!

(15-02-2015)  

కామెంట్‌లు లేవు: