ఈరోజు శుక్రవారంనాడు ప్రధాన తెలుగు
దినపత్రికల్లో పతాక శీర్షికలు చూసి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు పడ్డ సంబరం
ఆ రోజు సాయంత్రానికే ఆవిరై పోయింది. మాట్లాడుకుందాం రండి, సమస్యలను సామరస్య
పూర్వకంగా పరిష్కరించుకుందాం అంటూ తెలుగుదేశం అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు, గతం గతః , ఆంధ్ర తెలంగాణా గొడవలేవీ మనసులో పెట్టుకోవద్దని టీ.ఆర్.యస్. అధినేత, తెలంగాణా ముఖ్యమంత్రి
కే.చంద్రశేఖరరావు అన్నట్టు పత్రికల్లో చదివి ఆహా! మంచి రోజులు వచ్చేస్తున్నాయని
జనం అటుపక్కా, ఇటు పక్కా మురిసి ముక్కచెక్కలయ్యారు. కానీ ఒక్క రోజుకూడా
తిరక్కుండానే నాగార్జున సాగర్ దగ్గర రెండు రాష్ట్రాల అధికారుల నడుమ సంఘర్షణ
ముదిరిపాకాన పడింది. సాగర్ లో నీటిమట్టం మాదిరిగానే మాటలు తగ్గి చేతులు కలుపుకునే
పరిస్తితి దాపురించింది. అంతటితో ఆగకుండా ఇరు రాష్ట్రాల పోలీసులు రంగం లోకి దిగి ఒకరిపై
మరొకరు లాఠీలు ఝలిపిస్తున్న దృశ్యాలు టీవీ తెరలపై దర్శనమిచ్చాయి. ఇద్దరు
ముఖ్యమంత్రులు చెప్పిన మంచి ముక్కలు ఉదయం పత్రికల్లో అయితే వచ్చాయి కానీ, వాళ్ల
మాటల్లో కానవచ్చిన మంచితనం కింది స్థాయి దాకా చేరినట్టులేదు. రెండు దేశాల నడుమ
సైనికుల్లా ఈ రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు తలపడితే ఏమవుతుందని ప్రజలు తలలు
పట్టుకుంటున్నారు. వాస్తు, ముహూర్తాలపట్ల నమ్మకాలు లేనివాళ్ళకు కూడా ఈ పరిణామాలు చూస్తుంటే,
రాష్ట్ర విభజన 'మంచి ముహూర్తం'లో
జరగలేదేమో అని అనుమానించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
(మంచితనం మాటలకే పరిమితమా?)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి