(Published in 'SURYA' telugu daily in it's edit page on 01-03-2015, SUNDAY)
పరిగెత్తి పాలు తాగాలా ? నిలబడి నీళ్ళు తాగాలా? అంటే రైల్వే మంత్రి సురేష్ ప్రభు రెండోదే ఎంచుకున్నట్టు అనిపిస్తోంది. ఆయన ప్రవేశ పెట్టిన మోడీ మార్కు రైల్వే బడ్జెట్ లో ఈ ధోరణే ద్యోతకమవుతోంది.
పరిగెత్తి పాలు తాగాలా ? నిలబడి నీళ్ళు తాగాలా? అంటే రైల్వే మంత్రి సురేష్ ప్రభు రెండోదే ఎంచుకున్నట్టు అనిపిస్తోంది. ఆయన ప్రవేశ పెట్టిన మోడీ మార్కు రైల్వే బడ్జెట్ లో ఈ ధోరణే ద్యోతకమవుతోంది.
ఏ బడ్జెట్ అయినా – అది సార్వత్రిక బడ్జెట్
కానివ్వండి లేదా రైల్వే బడ్జెట్ కానివ్వండి అది చూసేవారి కంటినిబట్టి రెండు రకాలుగా
కనిపిస్తుంది. అధికార పక్షం వారికి ‘ఆహా ఓహో’ బడ్జెట్.
ఇంకా కాస్త పొగడాలని అనిపిస్తే 'అభివృద్ధికి బాటలు వేసే అద్భుతమైన బడ్జెట్'. అదే
బడ్జెట్ ప్రతిపక్షం వారికంటికి ‘అంకెల
గారడీ’ బడ్జెట్. ఇంకా తెగడాలని అనిపిస్తే, 'అభివృద్ధి నిరోధక
బడ్జెట్'. అయితే ఈ రెండు కళ్ళే కాదు, పైకి కనబడని ‘మూడో కన్ను’ మరోటి
వుంది. అది ప్రజలది. అంటే ప్రయాణీకులది. అందులోనూ అతి సాధారణ ప్రయాణీకులది. కానీ
వారి గోడు ఎన్నికల సమయంలో తప్ప ఎవ్వరికీ పట్టదు. తమకున్న ఈ 'మూడో కన్ను'
తెరవాలంటే ఎన్నికలదాకా ఆగాలన్న 'మునిశాపం' వాళ్లకు వుంది. రైల్వే
భాషలో చెప్పాలంటే వాళ్ళది 'వెయిట్ లిస్టు' కేటగిరీ.
సురేష్ 'ప్రభువుల'వారి
రైల్వే బడ్జెట్ 'భవిష్యత్ పట్ల భరోసా కల్పించేదిగా వుంద'ని సాక్షాత్తు
ప్రధానమంత్రి మోడీగారే అన్నారు కాబట్టి ఇక
అధికార పక్షం వారి 'మద్దతు' వ్యాఖ్యానాల అవసరమే లేకుండా పోయింది. పోతే, కొత్త రైలు ప్రస్తావన లేని మొట్టమొదటి రైల్వే బడ్జెట్
అంటూ షరా మామూలు పద్దతిలోనే ప్రతిపక్షాల వాళ్లు విమర్శలు చేశారు.
బడ్జెట్ పాత పద్దతిలో
కాకుండా నవ్యత్వం చూపడానికి రైల్వేమంత్రి కొంత ప్రయత్నం చేశారు. అయితే, అనేక సంవత్సరాలుగా
బడ్జెట్ అంటే ఒక ఒరవడికి అలవాటుపడిన వారికి అది ఒక బడ్జెట్ మాదిరిగా కాకుండా
మంత్రిగారి 'ఊహలచిత్రం' గా కానరావడంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీలేదు. అయితే మోడీగారి 'స్వచ్చభారత్'
'డిజిటల్ ఇండియా' నినాదాల ప్రభావం ఈ బడ్జెట్ లో అడుగడుగునా దర్శనం ఇచ్చింది.
ఇంట్లో నుంచే టికెట్
బుకింగ్, ఈ టికెట్ తో రైల్లో కావాల్సిన భోజనం, ఆన్ లైన్ ద్వారా వీల్ చైర్ సౌకర్యం, మహిళలకు, వృద్ధులకు కింది
బెర్తులు, రైళ్ల రాకపోకల సమయాలు గురించి మొబైల్ ఫోన్లలో ఎస్.ఎం.ఎస్. అలర్టులు, ఆడవాళ్ల
బోగీల్లో నిఘా కెమెరాలు, నాలుగు నెలల ముందే టికెట్ రిజర్వేషన్ ఇలా ఒకటా రెండా,
కొత్త రైళ్ల వూసే లేని ఈ కొత్త రైల్వే బడ్జెట్ లో ఇలాటి వూసులు ఎన్నో, ఎన్నెన్నో.
కాకపొతే రైళ్ళలో
అనునిత్యం ప్రయాణించే కోటిన్నర పైచిలుకు ప్రయాణీకుల్లో ఈ మాటలు వినని వాళ్లు,
వాటికి అర్ధం తెలియని వాళ్లు, అసలు వాటి అవసరమే లేనివాళ్ళు అధిక సంఖ్యలో వున్నారు.
ఆ జనాలకు సురేష్ ప్రభుగారు ప్రతిపాదించిన 'ఈ' భోజనాలు. 'ఈ' టిక్కెట్లు, 'ఈ' దుప్పట్లు, వీటి అవసరమే లేదు. వారికి కావాల్సింది సమయానికి వచ్చి, కడగండ్లు లేకుండా సమయానికి గమ్యం చేర్చే ప్రయాణపు బండ్లు.
వాటిల్లో కూర్చోవడానికి ఎలాగూ చోటుండదు, కనీసం సౌకర్యంగా నిలబడి ప్రయాణించడానికి కాసింత
వీలుంటే చాలనుకునే వాళ్లు చాలామంది. ఇలాటి సాధారణ బోగీల్లో కూడా మొబైల్ చార్జింగ్ సదుపాయం కల్పిస్తామని అంటున్నారు,
సంతోషం. అలాగే, స్వచ్ఛ భారత్ ఆలోచనలను మామూలు బోగీల్లోని మరుగు దొడ్ల వైపు కూడా
మళ్లిస్తే మరింత సంతోషం. ప్లాటుఫారాలపై లిఫ్టులు, ఎస్కలేటర్లు పెడతామంటున్నారు. వాటితో
పాటు, ప్రస్తుతం వున్న మెట్ల దారిలో ట్రాలీ సూటుకేసులు తోసుకుంటూ తీసికెళ్లగల సైడ్
వాక్ సౌకర్యం గురించి యెందుకు ఆలోచించరు? ఈరోజుల్లో అనేకమంది ప్రయాణీకులు రైల్వే పోర్టర్ల మీద ఆధారపడకుండా తోసుకుంటూ వెంట తీసుకువెళ్ళే ట్రాలీ లగేజీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాటివారు ఫుట్
ఓవర్ బ్రిడ్జ్ మెట్లు ఎక్కడానికీ, దిగడానికీ పడుతున్న అవస్థలు తెలుసుకోవడానికి ప్రత్యేక అధ్యయనాలు
చేయించనక్కర లేదు, ఏ రైలు స్టేషన్ కు వెళ్ళినా ఈ దృశ్యాలు కానవస్తాయి. ఈ సందర్భంలో
గతం గురించిన ఒ ముచ్చట చెప్పుకోవడం అసందర్భం కానేరదు.
పూర్వం జనతా ప్రభుత్వం
హయాములో రైల్వే మంత్రిగా మధుదండావతే పని చేశారు. అప్పటి వరకు సాధారణ టూ టయర్, త్రీ
టయర్ బోగీల్లో పడుకోవడానికి చెక్క బల్లలు వుండేవి. దండావతే గారి పుణ్యమా అని ఆ
బోగీలకు కూడా ఫోం పరుపులు అమర్చారు. ఆ ఒకే ఒక్క నిర్ణయంతో సామాన్యులు కూడా తామూ
సమాజంలో ఎదుగుతున్నాం అనే ఉన్నత భావనకు లోనయ్యారు. సామాన్యులకు దగ్గరకావడం అంటే
ఏమిటో, ఎలానో నాటి రైల్వే మంత్రి దండావతే చేసి చూపించారు. సురేష్ ప్రభు, మోడీ తలచుకుంటే ఇటువంటివి చాలా
చెయ్యవచ్చు. అలాటి సంకల్పం వారికి కలగాలని, సురేష్ ప్రభుగారే స్వయంగా బడ్జెట్
ప్రసంగంలో చెప్పినట్టు, ఆ పైనున్న
'ప్రభువు' ను మనసారా కోరుకుందాం.
నిజానికి రైలుబళ్ళు యావత్
భారతానికి నకళ్ళు. ఇంట్లో, వొంట్లో పుష్కలంగా వున్న వాళ్ళకోసం రాజులు, మహారాజులు
కోరే సకల సౌకర్యాలతో 'ప్యాలెస్ ఆన్
వీల్స్' అనే పేరుతొ పట్టాలపై నడిచే రాజప్రసాదాలు
మనదేశంలో ఇప్పటికే వున్నాయి. 'ఎప్పుడు
వస్తుందో తెలియని, ఎప్పుడు గమ్యం చేరుతుందో
తెలియని' అతి మామూలు పాసింజర్ రైళ్ళు కూడా అదే పట్టాలపై తిరుగుతుంటాయి. ఇక మధ్య
తరగతి, ఎగువ మధ్య తరగతి, దిగువ తరగతి వాళ్లందరూ వేరు వేరు బోగీల్లో ఒకే రైలులో
ప్రయాణిస్తుంటారు. వారి భాషలు వేరు, సంస్కృతులు వేరు, మాటతీరు వేరు, అయినా ఒక కుటుంబం మాదిరిగా రైలు బండ్లు వారిని కలిపి
వుంచుతాయి. అదే సమయంలో వారిని వేరువేరుగా చూస్తాయి. పక్కపక్కనే వున్నా వారి పక్కలు
వేరు, వారికి కల్పించే భోజన వసతులు వేరు. ఇదంతా వారు చెల్లించే టికెట్టు ధర
నిర్ణయిస్తుంది. కొందరేమో శబ్దం చెయ్యని ఏసీ బోగీల్లో దుప్పట్లు కప్పుకుని
వెచ్చగా పడుకుని వెడుతుంటే, అదే రైల్లో మరో సాధారణ బోగీలో కాలు చేయీ కదపడానికి కూడా వీల్లేని స్తితిలో మరికొందరు ప్రయాణం
సాగిస్తుంటారు. అచ్చమైన భారతానికి అచ్చమైన నకలు ఏదైనా వుందంటే అది మన దేశంలోని
రైలుబండే, సందేహం లేదు.
సురేష్ ప్రభుగారి విషయంలో
ఒక విషయం మాత్రం ఒప్పుకుని తీరాలి. పదవిలోకి వచ్చి మూడు మాసాలే అయినప్పటికీ,
బడ్జెట్ రూపకల్పనలో ఎక్కడా తన సొంత రాష్ట్రం 'మహారాష్ట్ర' కు ఏదో ఒరగబెట్టాలని యెంత
మాత్రం అనుకోలేదు. ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. ఈ ఒక్క విషయంలో వెనుకటి మంత్రులతో పోలిస్తే ఈయన చాలా మెరుగు.
గతంలో రైల్వే మంత్రులగా
పనిచేసినవాళ్ళల్లో చాలామంది 'తమ' ప్రాంతాల
'పాల రుణం' తీర్చుకోవడానికి
నిస్సిగ్గుగా రైల్వే బడ్జెట్ ని ఉపయోగించుకున్నారు. వీరిలో బెంగాల్ ఆడపులి మమతా
బెనర్జీ పేరే ముందు చెప్పుకోవాలి. యూపీయే హయాములో ఆమె 'రైలు భవన్ మహరాణీ' గా ఓ
వెలుగు వెలిగినప్పుడు, రైల్వే బడ్జెట్ లో
సింహభాగాన్ని ‘తూర్పు' వెళ్ళే రైలు ఎక్కించేసి
చేతులు దులుపుకున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 34 ఏళ్ళపాటు అవిచ్చిన్నంగా
సాగుతూ వచ్చిన ‘ఎర్రదండు’ పాలనకు
శ్రీమతి బెనర్జీ 'ఎర్ర జెండా' చూపగలదేమో అన్న
ఆశతో వున్న 'అప్పటి' యుపీఏ నాయకులు, ఆవిడ ప్రతిపాదించిన (బెంగాల్) రైల్వే
బడ్జెట్ కు పచ్చజెండా వూపారు. మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా సమర్పించిన బడ్జెట్ లో పశ్చిమ బెంగాల్ పై
వరాలవర్షం కురిపించి అందరూ ఆశ్చర్యంతో ‘హౌరా’ అని
నోళ్ళు వెళ్ళబెట్టేట్టు చేసారు. సింగూరులో మెట్రో కోచ్ ఫాక్టరీ, డార్జిలింగ్
లో సాఫ్ట్ వేర్ ఎక్సెలెన్సీ సెంటర్, కోల్
కతాకు ఇంటిగ్రేటెడ్ సబర్బన్ నెట్ వర్క్, అక్కడి
మెట్రో కు 34 కొత్త
సర్వీసులు, ఇలా వరాల వాన కురిపించారు. 'లోగడ
రైల్వే మంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్, తన అధికారాన్ని ఉపయోగించి అత్తవారి
వూరికి ఏకంగా ఒక రైలును వేయగాలేనిది ఇప్పుడు తాను చేసిన దాంట్లో తప్పు
పట్టాల్సింది ఏముంది' అన్న రీతిలో మమతా బెనర్జీ, పుట్టింటిపై తన ప్రేమను
సమర్ధించుకున్నారు. 'సొంత రాష్ట్రానికి, సొంత
జనానికి ఏమి చేస్తే ఏమి తప్పుపడతారో' అని సంకోచించే
నిత్య శంకితులకు మాత్రం నిజంగా ఇది కనువిప్పే.
సరే అదలా వుంచి, కొత్తగా
పురుడు పోసుకున్న తెలుగు రాష్ట్రాల సంగతికి వస్తే -
రైల్వే మంత్రి సురేష్ ప్రభు పార్లమెంటుకు సమర్పించిన ఈ
బడ్జెట్, ఈ రెండు ప్రాంతాల ప్రజలను మాత్రం ఉసూరుమనిపించింది. ఆంధ్ర. తెలంగాణా ముఖ్యమంత్రులిద్దరూ 'ఈ బడ్జెట్ లో కాస్త కనికరం చూపండి మహాప్రభూ' అంటూ,
అనేక సార్లు ఢిల్లీ ప్రదక్షిణాలు చేసి రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు
ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు. బహుశా వారి మొర, మంత్రిగారి
మనసు పొరలను తట్టిందో ఏమిటో కానీ, సురేష్ ప్రభువుల వారు, గంట పైచిలుకు
చేసిన తమ బడ్జెట్ ప్రసంగంలో కాస్త దయతలచి, ఈ రెండు తెలుగు రాష్ట్రాలలోని 'రెండు వూర్ల పేర్లు' ఒక్కటంటే ఒకేసారి అనామత్తుగా ప్రస్తావించి వూరుకున్నారు. 'ఖాజీపేట (తెలంగాణా) - విజయవాడ (ఆంధ్ర ప్రదేశ్) నడుమ మూడో రైలు మార్గం వేసే
ప్రతిపాదన పరిశీలనలో వుంద'ని దాని తాత్పర్యం. తాత దగ్గుకే
మురవమన్నట్టు రెండు తెలుగు రాష్ట్రాలవాళ్లు ఆ ఒక్క మాటకే మురిసిక్కచెక్కలవుతారని
మంత్రిగారి అభిప్రాయమేమో తెలవదు.
ఒక మాజీ పార్లమెంట్
సభ్యుడు అన్నట్టు లోకసభ సభ్యుడు ఎవరయినా రైల్వే మంత్రిని కలిసినప్పుడు, తన
నియోజక వర్గం సమస్యలు తీర్చాలని మహజరులు
సమర్పిస్తుంటారు. రైల్వే
ఓవర్ బ్రిడ్జిలు గురించో, లేక ఫలానా స్టేషనులో
ఫలానా రైలుకు ‘స్టాప్’ ఏర్పాటు
చేయాలనో – ఇలా
చాలావరకు స్తానిక సమస్యలపైనే వారి విజ్ఞప్తులు వుంటాయి. మొత్తం రాష్ట్రానికి సంబంధించి ఆయా
రాష్ట్ర ప్రభుత్వాలే కలగచేసుకుని ముందుగా తమ అవసరాలను రైల్వే మంత్రికి
తెలియచేసుకోవాల్సి వుంటుంది. నిజానికి ఈ విషయంలో ప్రతి ముఖ్యమంత్రి కూడా తమ కోరికల
చిట్టాలను ఏటా రైల్వే మంత్రికి అందచేస్తూనే వుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలకు
ముఖ్యమంత్రులుగా వున్న చంద్రబాబు. కేసీఆర్ ఇరువురూ ఈ విషయంలో తమ బాధ్యతను ఏమాత్రం
విస్మరించలేదు. ఢిల్లీ పెద్దలకు ముందస్తుగానే శాయంగల విన్నపాలు చేసుకున్నారు. కానీ
వాటిని కొత్త ప్రభుత్వం అంతగా పట్టించుకున్న దాఖలాలు బడ్జెట్ లో కనబడడం లేదు.
ఏదిఏమయినా, ఈసారి
తెలుగు రాష్ట్రాలకు అనుకున్న రీతిలో రైల్వేమంత్రి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం
అవుతోంది. గత జులైలో సమర్పించిన రైల్వే బడ్జెట్ లో ప్రతిపాదనకు నోచుకున్న కొన్ని
స్పీడ్ రైళ్ళు మాత్రం, ఆ ఒక్క రోజు టీవీ స్క్రోలింగుల్లో
గిరగిరా తిరిగివూరుకున్నాయి. పట్టాలు ఎక్కిన దాఖలా లేదు. 'వూరికే మాటలు చెప్పడం
యెందుకు అనుకున్నారేమో' ఈసారి అలాటి ప్రతిపాదనల వూసు కూడా లేశమాత్రం
కూడా లేదు. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జొన్ గురించి ప్రకటన వెలువడగలదని ఆశించిన వారికి మళ్ళీ నిరాశే ఎదురయింది.
అల్లాగే, దశాబ్దాల తరబడి నానుతూ వస్తున్న కాజీపేట కోచ్ ఫాక్టరీ వ్యవహారం.
అయితే, ముందే చెప్పినట్టు ఈ బడ్జెట్ ని ప్రజల దృక్కోణంలో నుంచి పరిశీలిస్తే ఒకింత
వూరట కలిగించే పద్ధతిలో వుందనే చెప్పాలి. వాళ్ళమీద కొత్త భారాలేవీ మోపలేదు.
చార్జీలు ఏమీ పెంచలేదు. ఎందుకంటే ఆ పని ఆర్నెళ్ల ముందుగానే పూర్తయిపోయింది కాబట్టి. సరకుల రవాణా
చార్జీలు మాత్రం ఘనంగానే పెంచారు. వీటి భారం పరోక్షంగా ప్రజలందరూ కలిసి మోస్తారు.
‘ఎక్కాల్సిన
రైలు జీవితకాలం లేటు’ ‘ఎక్కిన రైలు గమ్యం చేరుతుందా లేదా అనే డౌటు’ ప్రయాణీకులకు లేకుండా
చేయగలిగితే ఆ బడ్జెట్ సార్ధకమైనట్టే లెక్క. అలాగే, భద్రతకు
పెద్దపీట వేసి, రైలెక్కిన ప్రయాణీకుడి పేరు ముందు 'లేటు' అని రాయాల్సిన అవసరం లేకుండా చేస్తే మరీ గ్రేటు. (27-02-2015)
NOTE:
Courtesy Cartoonist
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి