2, డిసెంబర్ 2014, మంగళవారం

ఆరు మాసాలు - అరవై వివాదాలు

(PUBLISHED BY 'SURYA' TELUGU DAILY IN IT'S EDIT PAGE ON 04-12-2014, THURSDAY)

'ఎంతో చేద్దామనుకున్నాను. కొంతే  చేయగలిగాను. ఏదయినా మంచి పని చేయాలని అనుకున్నప్పుడు ఇన్నిన్ని అవాంతరాలు, అడ్డంకులు ఉంటాయని అప్పుడు వూహించలేకపోయాను'
పదవి దిగిపోయేముందు  ప్రతి రాజకీయ నాయకుడూ చెప్పే మాట ఇది.
'ఈసారి మరో అవకాశం ఇచ్చి చూడండి. ఏం చేద్దామని అనుకున్నానో, ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తాను'
ఆ ప్రతి రాజకీయ నాయకుడు  మళ్ళీ మళ్ళీ చెప్పే మాటలు కూడా ఇవే.  
కొత్త రాష్ట్రం ఏర్పడీ, కొత్త ప్రభుత్వం ఏర్పాటయి అక్షరాలా ఆరు మాసాలు. మరో కొత్త రాష్ట్రంలో మరో కొత్త ప్రభుత్వం ఏర్పడి మరో వారంలో ఆరు నెలలు పూర్తవుతాయి. తప్పదనుకున్నా, తప్పే అయినా తప్పనిసరిగా పోల్చి చూసుకోవాల్సిన పరిస్తితి ఈ రెండు తెలుగు రాష్ట్రాలదీ. బహుశా, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏర్పడిన కొత్త రాష్ట్రాలలో వేటిల్లో కూడా ఈ ఆంద్ర,  తెలంగాణాల్లో వున్న విచిత్ర, వింత  పరిస్తితి వుందనుకోలేము.
కోరి కోరి, పోరి పోరి కోరిన రాష్ట్రం తెచ్చుకుని ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన టీ ఆర్ ఎస్ పార్టీకి విభజన తలనొప్పులు తప్పలేదు.
అవిభాజ్య ఆంద్ర ప్రదేశ్ గా వున్నప్పుడు, 'కలసివుంటే పండగ, వేరు కుంపటి దండగ' అంటూ పల్లవులు పాడి, చివరకు గత్యంతరం లేని స్తితిలో విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి, విభజనానంతర అవశేష ఆంద్ర ప్రదేశ్ లో అధికార పగ్గాలు దక్కించుకున్న తెలుగు దేశం పార్టీకి అవే తలనొప్పులు. వచ్చిపడ్డవి కొన్నయితే, కొని తెచ్చుకున్నవి మరి కొన్ని. ఈ నొప్పులు వారివరకు పరిమితమయితే కధ వేరుగా వుండేది. అవి ప్రజల వరకు బదిలీ అవుతుండడమే ఇందులోని విషాదం.
కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు కొత్త ఇబ్బందులు సహజం. అవి ఎలా ఉంటాయో, వాటి పర్యవసానాలు ఎలా వుండబోతాయో అన్నది అందరికీ ముందే తెలుసు. అయినా అందరి సమ్మతితోనే రాష్ట్ర విభజన జరిగి పోయింది. విభజన నిర్ణయం జరిగీ జరగగానే, ఉమ్మడి రాష్ట్రంలో అటు లోక సభకు ఎన్నికలు జరిగాయి. మరో విడ్డూరం ఏమిటంటే, రాష్ట్ర విభజన జరగక ముందే రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికల తంతు ముగించారు. ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడిన తరువాతనే, జూన్ రెండో తేదీన రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తిచేశారు. ఎన్నికయిన రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఓ వారం రోజుల తేడాతో కొలువు తీరాయి. ఇక అప్పుడు మొదలయింది అసలు కధ. 
    
మొదటి అధ్యాయం చంద్రబాబు నాయుడు సర్కారు ఎక్కుబెట్టిన  పీపీయే అస్త్రంతో  శ్రీకారం చుట్టుకుంది. అది పెరిగి పెరిగి  రగిలి రగిలి మంటలుగా మారుతూ ఉన్నప్పుడే, తెలంగాణా సర్కారు తన అంబుల పొదిలోని ఫీజు రీ ఇంబర్స్ మెంటు అంశాన్ని తీసి అంకుశంలా ప్రయోగించింది. దానితో, పిల్లల చదువులతో పాటు  కాలేజీ యాజమాన్యాలు కూడా గందరగోళంలో పడ్డాయి. స్థానికత వివాదం సుడులు రేపుతుండగానే మరో పక్క  కరెంటు సెగ రాజుకుంది. అటూ ఇటూ అందరూ కలిసి  దాన్ని మరింత ఎగదోశారు. రెండు పార్టీల నడుమ సహజంగా వున్న వైరుధ్యాలు ఆధ్యం పోశాయి. ఇరువైపులా మాటల తూటాలు పేలాయి. అనేక సందర్భాలలో అవి సభ్యతాసంస్కారాలకు కొంత  దూరం జరిగాయి. వీటికి తోడు శ్రీశైలం జలవివాదం కమ్ముకుంది. వీధి కొళాయిల దగ్గర తగాదాలను మరిపించింది. చివరికి సేద్యపు నీటి  ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలను మోహరించాలని డిమాండ్ చేసేవరకు కధ ముదిరింది. కాదేదీ వివాదానికి అతీతం అన్నట్టుగా, వాహనాల రిజిస్ట్రేషన్, ఇంటర్ బోర్డు, ఉమ్మడి పరీక్షలు  ఇలా ఏది తీసుకున్నా ప్రతి చిన్న అంశం రెండు రాష్ట్రాల నడుమ పెద్ద వివాదాలకు కారణమవుతోంది.  ఇక ఉన్నతాధికారుల విభజన పూర్తిగా తేలకుండానే  మిగిలిపోయింది. తమ నిష్క్రియాయపరత్వానికి ఓ సాకుగా ఈ అంశం ఉభయ ప్రభుత్వాలకు ఉపయోగపడుతోంది. అది వేరే విషయం.
ఒక్క ముక్కలో చెప్పాలంటే,     
గత ఆరుమాసాలుగా ఈ రెండు నవజాత రాష్ట్రాలలోని  రెండు ప్రభుత్వాల నడుమ సయోధ్య అన్నది కలికానికి  కూడా కనబడకుండా పోయింది. ఇద్దరు  ముఖ్యమంత్రుల నడుమ మాటా  మంతీ లేదు. కలుసుకున్న సందర్భాలు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. దానికి కూడా గవర్నర్ స్వయంగా పూనుకోవాల్సివచ్చింది.
ఇదీ, ఈ ఆరు నెలలుగా అవిశ్రాంతంగా సాగిపోతున్న కధ.
'ఆరు నెలలు.
'అప్పుడే ఆరు నెలలు గడిచిపోయాయా! ఇంకెంత? మరో నాలుగున్నర ఏళ్ళు. ఎంతలో గడిచిపోతాయి'
కాచుకు కూర్చున్న ప్రతిపక్షాల ఆశ.
'ఆరునెలలు.
'ఆరునెలలు చాలా స్వల్ప కాలం. ఎంతో చేయాలని సంకల్పించుకున్నప్పుడు ఇది మరీ తక్కువ సమయం. అయినా ఇంకా నాలుగున్నర సంవత్సరాలు అలాగే మిగిలున్నాయి. మిగులు తరుగులన్నీ పూర్తిచేసుకోవడానికి అది చాలు'
అధికార పక్షం ఆకాంక్ష.
అటయినా, ఇటయినా ఇదే ఆట. ఆడేవారు వేరు కాని పాత్రల స్వభావం ఒకటే.
ఇక ఇంతేనా అంటే ఇంతే అని చెబితే అది 'అర్ధ సత్య' అవుతుంది.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటు చంద్రశేఖర రావు, అటు చంద్ర బాబు నాయుడు ఇరువురికీ తమ తమ రాష్ట్రాల గురించి ఎన్నో  కలలు వున్నాయి. వాటిని సాకారం చేసుకోవడంకోసం ఎన్నో పధకాలు తయారు చేస్తున్నారు. ఒకరు బంగారు తెలంగాణా సాధన అంటుంటే, మరొకరు స్వర్ణాంధ్ర సాధన అంటున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తమ స్వప్నాలు యెంత సుందరంగా వున్నాయో ప్రజలకు విడమరచి చెబుతున్నారు. వాటిని నిజం చేయడం ఎలాగో తమకు తెలుసని అంటున్నారు కానీ ఎలా అన్నది చెప్పడం లేదు. వారి ప్రత్యర్ధులు సయితం వొప్పుకునే మంచి గుణం వారికి వున్న సమర్ధత. ఆ సమర్ధత పట్ల వారి వారి రాష్ట్రాల్లో అధిక సంఖ్యాకులకు వున్న అపార  నమ్మకం. ఇదే ప్రస్తుతానికి వారికి శ్రీరామ రక్ష.
ఏ రాజకీయ నాయకుడికీ ఇంతవరకూ లభించని అపూర్వ అవకాశం వీరిద్దరికీ లభించింది. ఒకరికి కొత్త రాష్ట్రాన్ని నిర్మించే అవకాశం. మరొకరికి కొంగొత్త రాజధాని నగరాన్ని నిర్మించే  అవకాశం.
ఇద్దరూ ఈ విషయంలో ఎవరికీ తీసిపోకూడదనే పావులు కదుపుతున్నారు. ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నారు. తమ కృషి పట్ల, తమ సామర్ధ్యం పట్ల ప్రజల్లో  విశ్వాసం పాదుకొలిపే ప్రయత్నం చేస్తున్నారు.   
ఎంతటి నమ్మకమైనా కాలం కలిసి రాకుంటే సడలిపోతుంది.  ఎంతటి కవచమైనా పరిస్తితులను బట్టి శిధిలమవుతుంది.
ప్రజల్లో నమ్మకం కలిగించేవాడు నాయకుడవుతాడు. ఆ నమ్మకాన్ని పది కాలాలపాటు నిలబెట్టుకోగలిగినవాడు ప్రజా నాయకుడు అవుతాడు.  
లేకుంటే, గతంలో ఓ వెలుగు వెలిగి మలిగిపోయిన అనేకానేక మంది రాజకీయుల్లో ఒకడిగా మిగిలిపోతాడు.
ఇది చరిత్ర చెప్పే సత్యం.         

(02-12-2014)

1 కామెంట్‌:

hari.S.babu చెప్పారు...

తాను మునిగింది గంగ తాను వలచింది రంభ
అనడంలో ఇద్దరూ ఇద్దరే - తీరునా వీరి చింత!