1982 - 2008
- 2014
తెలుగు జాతి రాజకీయ చరిత్రకు
సంబంధించి ఈ సంవత్సరాలకు చాలా
ప్రాధాన్యత వుంది. ఆ మూడు సంవత్సరాలలో తెలుగు సినీరంగ ప్రముఖులు మువ్వురు తెలుగునాట
రాజకీయ రంగ ప్రవేశం చేసి రాష్ట్ర రాజకీయాలను కొత్త మలుపు తిప్పారు. వీరిలో
ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు అలనాడు ధృవతారగా వెలిగిన శ్రీ నందమూరి తారక
రామారావు. 1982 మార్చి21 వ తేదీన ఆనాటి సమైక్య
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 'తెలుగుదేశం' పేరుతొ ఒక పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు నాటకీయ
పక్కీలో ఒక ప్రకటన చేసి మొత్తం రాజకీయ వర్గాలను ఆశ్చర్య చకితులను చేసారు. అంతకుముందు
సినీ రంగానికి చెందిన జగ్గయ్య వంటి
కళాకారులు ఎన్నికల్లో పోటీచేసినా అది
పరిమిత పరిధుల్లోనే జరిగింది. పొరుగున వున్న తమిళనాట మాదిరిగా సినీ రంగానికి చెందిన
వారు రాజకీయ పార్టీలను ఏర్పాటుచేసే సంప్రదాయం మన రాష్ట్రానికి అప్పటికి కొత్త. పార్టీని
స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఎన్నికల్లో
గెలిచి ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు
చేపట్టి దేశ రాజకీయ చరిత్రలోనే ఎన్టీయార్ ఒక రికార్డు నెలకొల్పారు. ఆ తరువాత చాలా ఏళ్ళు
గడిచిన అనంతరం 2008 లో మరో
అగ్రనటుడు రాజకీయాల్లోకి వచ్చి 'ప్రజారాజ్యం' పేరుతొ మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు
చేస్తున్నట్టు ప్రకటించారు. వరసగా అనేక
సంవత్సరాలు తెలుగు చలనచిత్రసీమను వొంటి చేత్తో శాసించిన మెగా స్టార్ చిరంజీవి తన పార్టీని ఓ ప్రభంజనం మాదిరిగా జనంలోకి తెచ్చి
మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో పోటీకి నిలబెట్టారు. అయితే ఆయన ప్రయత్నాలు
అనుకున్న విధంగా ఫలించక పోవడంతో
పద్దెనిమిది సీట్లు, పద్దెనిమిది శాతం వోట్లతో అధికారానికి ఆమడ దూరంలోనే ఆగిపోయారు.
తన మనస్తత్వానికి ఈ రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు సరిపడవని నిర్ధారణకు వచ్చారేమో
తెలియదు కాని, తొమ్మిదినెలల్లో అధికారానికి వచ్చిన ఎన్టీయార్ రికార్డు మాదిరిగా
పార్టీని స్థాపించిన మూడేళ్ళలోనే దాన్ని కాంగ్రెస్ లో కలిపేసి చేతులు
దులుపుకున్నారు. దరిమిలా కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక స్థాయి మంత్రి పదవితో సంతృప్తి పడి, గత
ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తరువాత నామమాత్రంగా ఆ పార్టీలో కొనసాగుతున్నారు. అన్నగారి
ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగం అయిన యువ
రాజ్యం నాయకుడుగా రాష్ట్రం నలుమూలలు తిరిగి ప్రజారాజ్యం తరపున ప్రచారం చేసి,
కాంగ్రెస్ వారి పంచెలు వూడదీస్తాననే తీరులో తనదైన బాణీలో ఆవేశపూరిత ప్రసంగాలు చేసి, ఎన్నికల అనంతరం అన్నగారు పార్టీతో సహా ఆ
కాంగ్రెస్ పంచనే చేరడం హరాయించుకోలేక పవన్
కళ్యాణ్ కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా, మౌనంగా వుండిపోయారు.. మళ్ళీ ఈ ఏడాది
ఎన్నికలకు ముందు హఠాత్తుగా రంగ
ప్రవేశం చేసి 2014 మార్చిలో జనసేన
పేరుతో ఓ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసున్నట్టు ఆర్భాటంగా ప్రకటించి తన
అభిమానులను అలరించారు. రాజకీయ ప్రత్యర్ధులను అదరగొట్టారు. అప్పటివరకు అన్నచాటు తమ్ముడిగా పేరున్న పవన్, అదే అన్నగారి పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేయడం అందరికీ ముఖ్యంగా
అయన కుటుంబంలోని వారికే ఎంతో ఆశ్చర్యం
కలిగించింది. పేరుకు పార్టీ అయితే
పెట్టారు. కానీ ఎన్నికల్లో పోటీ చేసేది లేదని మరో ప్రకటన చేసి అభిమానులను
ఉసూరుమనిపించారు. ఈలోగా రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. రాష్ట్ర విభజన అంశం ఆయనకు బాగా కలిసివచ్చింది.
జాతీయ రాజకీయాల్లో కొత్త మెరుపులు మెరిపిస్తున్న మోడీ ఆయనకు బాగా నచ్చారు. పవన్ వంటి జనాదరణ వున్న సినీ హీరోల అవసరం మోడీకి
లేదా ఆయన నాయకత్వం వహిస్తున్న బీజేపీకి వున్న
మాట కూడా కాదనలేనిది. ఆనాటి పరిస్తితులు అలాటివి. అది పవన్ కళ్యాణ్ కు మరింతగా కలిసివచ్చింది.
మంచి డైరెక్టర్, చక్కని తారాగణం, గట్టి కధాబలం వున్న సినిమా కాసుల వర్షం కురిపిస్తుంది
అన్న సినీ సూత్రం వంటబట్టించుకున్న పవన్, తెలివిగా అడుగులు వేసి బీజేపీతో చేతులు
కలిపాడు. అంతే కాదు, తాను కొత్తగా
స్థాపించిన 'జనసేన' పార్టీని ఎన్నికలబరిలో దింపకుండా, సీట్లకోసం బేరసారాలు ఆడకుండా,
తాను కూడా పోటీ చేయకుండా ఒక కొత్త
వ్యూహంతో మోడీ పార్టీకి ప్రచారం చేసిపెట్టాడు. ఇది సినీ రంగంలో మామూలే. తాము వాడని
సబ్బులకు వారు తమ ప్రకటనలతో గిరాకీ
కలిపిస్తారు. అదే వాణిజ్య సూత్రాన్ని పవన్ ఎన్నికల్లో ప్రయోగించి ఫలితాలను ప్రభావితం చేసే
విధంగా అటు మోడీకి, మరోపక్క బీజేపీ
మిత్రపక్షం అయిన టీడీపికి ప్రచారం చేసిపెట్టారు. పవన్ ఆవేశం, సమాజంపట్ల ఆవేదన ఆయన ప్రసంగాలలో ప్రతిఫలించడంతో అభిమానులనే కాకుండా సాధారణ జనాలను సయితం ఆయన ఆకట్టుకోగలిగాడు. ఫలితం
గురించి వేరే చెప్పక్కర లేదు. ఆ ఎన్నికల్లో బీజేపీ కూటమికి లభించిన విజయంతో మోడీ దృష్టిలో
పవన్ నిజంగా ఒక హీరో అయిపోయాడు. మోడీ తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందని స్వయంగా ఆహ్వానించడం దీనికి దృష్టాంతం.
సరే! ఎన్నికలు ముగిసాయి.
కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కొలువు తీరారు. ఎవరికి వారు తమ
పనుల్లో తీరికలేకుండా మునిగి పోయారు. వారు అధికారంలోకి రావడానికి ప్రత్యక్షంగానో,
పరోక్షంగానో, కొద్దో, గొప్పో సహకరించిన మరి
పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళు ఏమైనట్టు? ఆయన
పెట్టిన జనసేన సంగతి ఏమిటి? కాకపొతే, ఇటీవల ఒక సందర్భంలో ఆయనే చెప్పారు కొత్త
చిత్రాలతో బిజీగా వున్నానని.
ఈ నేపధ్యంలో ఒక వార్త
తిరిగి సంచలనం సృష్టించింది. పవన్ పార్టీ జనసేన, రిజిస్ట్రేషన్ కోసం పెట్టుకున్న
దరఖాస్తుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని. పార్టీ ఎన్నికల చిహ్నం విషయం
కూడా త్వరలో నిర్ణయం కాబోతోందని. స్థానిక సంస్థల ఎన్నికలలో ఒకే గుర్తుపై పోటీ
చేయడానికి వీలుగా తాము పెట్టుకున్న అర్జీకి ఆమోదం రాగానే జనసేన భవిష్యత్
కార్యక్రమాన్ని ప్రకటించడం జరుగుతుందని
స్వయంగా పార్టీ అధ్యక్షుడి హోదాలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన 'జనసేన' వెబ్ సైట్ లో
కానవస్తోంది. అంటే క్రియాశీలక రాజకీయ పార్టీగా జనసేన ఇక ముందు వ్యవహరించబోతోందన్న ధ్వని
ఇందులో వుంది. దానికి తోడు 2019 ఎన్నికల్లో జనసేన పోటీ
చేస్తుందని గతంలోనే పవన్ కళ్యాణ్ చెప్పిన
మాట గమనార్హం.
ఈ నేపధ్యంలో రానున్న
రోజుల్లో పవన్ పార్టీ, రాష్ట్ర రాజకీయాలను
అంటే, ఇటు తెలంగాణాలో, అటు ఆంద్ర ప్రదేశ్ లో ఏమేరకు
ప్రభావితం చేయగలుగుతుంది అన్నది చర్చనీయాంశంగా తయారయింది. ఎన్నికలకు ఇంకా చాలా
వ్యవధానం వుంది కాని అది వేరే సంగతి.
ప్రస్తుతానికయితే దేశంలో
మోడీ హవా బాగా సాగుతోంది. స్వయంగా ముందరి కాళ్ళకు తనకు తానుగా బంధాలు వేసుకోకపోతే
చంద్రబాబు నాయుడికీ అంత ఇబ్బందికర పరిస్తితి ఏమీ కనబడడం లేదు. ఏదయినా అలాటి అవకాశం వస్తే ఎగరేసుకుపోవడానికి వైయస్సార్
పార్టీ కాచుకునే వుంది. మరి ఈ పరిస్తితుల్లో - అప్పుడప్పుడు మెరిసి
మురిపించే పార్టీగా పేరు తెచ్చుకున్న పవన్ పార్టీ కి కొత్తగా లభించే
అవకాశాలు ఏపాటివి?
భవిష్యత్ ఎన్నికల్లో
ప్రత్యేకించి ఆంద్ర ప్రదేశ్ లో పవన్ సాయం తీసుకోవడానికి బీజేపీకి ఎలాటి అభ్యంతరాలు
ఉండకపోవచ్చు. పవన్ వంటి ప్రజాకర్షణ కలిగిన నాయకుడు వొప్పుకోవాలే కాని జనసేనను తమ పార్టీలో కలుపుకోవడానికి కూడా
సిద్ధపడవచ్చు. ఒక క్రమబద్ధమైన ప్రణాళికతో, ముందస్తు చూపుతో 'కాంగ్రెస్ రహిత భారత
దేశం' అనే స్వప్నాన్ని సాకారం
చేసుకునేందుకు భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఆయా రాష్ట్రాలలో, ప్రధానంగా దక్షిణాదిన,
ప్రజాదరణ
వున్న స్థానిక నాయకులను దగ్గరికి తీసుకునెందుకు పావులు కదుపుతున్న విషయం రహస్యమేమీ
కాదు. మోడీకి దగ్గరవాడు కావడం, రాజకీయాలకు
కొత్తకావడం పవన్ కు ఈ విషయంలో అదనపు అర్హతలు.
అయితే ఇక్కడ చిక్కుముడి
ఎవరో కాదు. పవన్ కల్యాణే. పవన్ అంటేనే గాలి. అది ఎటు వీస్తుందో ఎవరికీ తెలియదు. పవన్ మనసులో ఏముందో
పవన్ కే తెలియదని హాస్యోక్తిగా చెప్పుకుంటారు.
అట్టహాసంగా పార్టీ
పెట్టాడు. పోటీ చేయలేదు. పెట్టిన పదేళ్ళ తరువాత పోటీకి దిగుతానని మరో ప్రకటన
చేసాడు. రాజకీయాల్లో ఇవన్నీ కొత్త పుంతలు.
రాజకీయ విశ్లేషణలు
చేసేవారికి కూడా ఆయన ఒక పట్టాన కొరుకుడు
పడడు. అందుకే అయన ఏం చెయ్యబోతున్నాడన్నది
ఊహకు అందని విషయం.
కొసమెరుపు:
'జనసేన' వెబ్ సైట్ చూసిన
వారికి ప్రముఖంగా ఒక వాక్యం కనిపిస్తుంది.
"నేను రాజకీయవాదిని
కాను - పవన్ కళ్యాణ్"
(12-12-2014)
NOTE : Image Courtesy Owner
4 కామెంట్‌లు:
పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం వల్లే టీడీపీకి లేదా భాజపాకి ఎంత లాభం జరిగిందో బేరీజు వేయడం కష్టం అయితే మరీ ఎక్కువ కాదని ఖచ్చితంగా చెప్పొచ్చు. రెండు పార్టీలకు సొంత బలం కానీ సినిమా నటుల మద్దతు కానీ పుష్కలంగా ఉన్నాయి. ఇంకొక్క నటుడి వల్ల పెద్దగా ఒరిగేది ఏమీ లేదని స్పష్టంగా తెలుస్తుంది.
పార్టీ పేరు నమోదు (register) చేసుకోవడం సాదా సీదా ప్రక్రియ. గత ఎన్నికలలో తెలంగాణాలో 75 (& ఆంధ్రలో 64) నమోదయిన పార్టీలు పోటీ చేసాయి. 53 ఊరు పేరు తెలీని పార్టీల 224 అభ్యర్తులను అందరినీ కలిపితే నోటాతో సమానంగా లక్షన్నర వోట్లు వచ్చాయి. కిరణ్ కుమార్ రెడ్డి చేసిన అట్టహాసానికి ఆయన పార్టీకి ప్రజలు విదిల్చిన 12 వేలకు వోట్లు పొత్తే లేదు. రిజిస్ట్రేషన్ పెద్ద ఘనకార్యం అనుకోవడం పొరపాటు.
ఇకనైనా ప్రశ్నించడం ప్రారంభిస్తాడో? లేదో? చూడాలి. ఇక ఈ గాలి ఎటు మళ్లుతుందో మరి!
పవన్ కల్యాణ్‌కు తె లంగాన లో ఫాలోయింగు వుంది. మిగులు బడ్జట్ వున్నా ప్రభుత్వ భూములు అమ్ముకుని సొమ్ముచేసుకునేందుకు ఆరాట పడుతున్న పెభుత్వ అరాచకానికి పవన్‌వీచిక ఓ దెబ్బ ఇస్తుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి