నవ్యాంధ్ర ప్రదేశ్ కు విజయవాడ అధికారికంగా కొత్త
రాజధాని కాకపోవచ్చు. కానీ రాష్ట్ర విభజన
జరిగిన జూన్ రెండో తేదీ నుంచి రాజధాని
అన్నప్పుడల్లా బెజవాడ పేరే వినిపిస్తూ వస్తున్నదేమో నిన్న విజయవాడలో ఒక రోజు
వున్నప్పుడు నాకూ అదే భావన కలిగి 'రాజధాని కబుర్లు' అని మొదలు పెట్టాను.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ వూళ్ళో ఆకస్మిక తనిఖీలు చేసి అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించిన మరునాడే నేనా వూరు
వెళ్లాను, మా మూడో అక్కయ్యగారి సంవత్సరీకాలకోసం. చిన్నప్పుడు చదువుకున్న వూరు కావడం
వల్లా, కాస్త వ్యవధానం దొరకడం వల్లా పొద్దున్నే లేచి వూళ్ళో నాలుగయిదు చోట్లు - గవర్నర్ పేటలోని చక్రవర్తి రోడ్డు, మ్యూజియం
రోడ్డు, అలంకార్ టాకీసు, ఏలూరు కాలువ వంతెన, గాంధీ నగరం లోని సన్యాసి రాజు వీధి, జింఖానా
రోడ్డు అలా అలా నడిచి తిరిగాను. బెజవాడలో మరో సౌలభ్యం ఏమిటంటే అలా కాలినడక మీదే చాలా ప్రాంతాలు చుట్టబెట్టి రావచ్చు.బందరు
రోడ్డు, ఏలూరు రోడ్డు బాగానే వున్నాయి. మిగిలిన
చోట్ల పారిశుధ్యం పరిస్తితి ఘోరం అనిపించింది.
(విజయవాడలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ఆకస్మిక తనిఖీలు)
అందుకే కాబోలు మునిసిపల్ మేయర్, కమీషనర్ తమ
విధులను పొద్దటి నుంచీ మొదలు పెట్టాలని సీ.ఎమ్. ఆదేశించినట్టు ఆరోజే పత్రికల్లో
కూడా చదివాను. ఉరుకులు పరుగులు పెట్టి అలసిపోయి,
రేపటినుంచీ చూసుకుందాం అనుకున్నారేమో వీధులన్నీ
కాస్త కంపరం కలిగించేలానే వున్నాయి. మరీ అంత ఉదయమే చూస్తె అన్ని ఊళ్లల్లో అలానే
వుంటాయి అని వాదించవచ్చు కాని, హైదరాబాదులో పొద్దున్నే కలయ తిరగడం ఛానల్ల చర్చల
పుణ్యమా అని నాకు అలవాటే. మరీ గొప్పగా
లేకపోయినా, వెగటు కలిగించే పరిస్తితులు
హైదరాబాదులో లేవని మాత్రం చెప్పవచ్చు. బెజవాడలో నా చిన్నప్పుడే అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి అంకురార్పణ
జరిగింది. మరి గాంధీనగరం వంటి చోట్ల కూడా రోడ్డుకు ఇరువైపులా మురికి కాలువలు
కనిపించాయి. బహుశా వర్షపు నీరు పోవడానికి ఏర్పాటు కావచ్చు కానీ వాటిల్లో
కనిపించింది మురికి నీరే. నగరానికి వస్తున్న భవానీ భక్తుల కారణంగా హైదరాబాదు నుంచి
వచ్చే వాహనాలను దుర్గ గుడి వైపునుంచి కాకుండా వేరే మార్గాల్లో మళ్లించినందు వల్ల అంతకు
ముందు రోజు సాయంత్రం ఓ గంట సేపు అదనంగా వూళ్ళో తిరగాల్సివచ్చింది.
పాత బస్తీ, చిట్టి నగర్ ఇలా అనేక ప్రాంతాలను చుట్టబెడుతూ మా నగర సందర్శన సాగింది.
ఒకచోట ఎవరినో దారి అడిగితె 'నేరుగా వెళ్ళండి మూడు వంతెనలు వస్తాయి, దాటిన తరువాత వంద ఫీట్ల రోడ్డు ఎక్కండి' అని సలహా
చెప్పాడు. అన్నట్టే మూడు వంతెనలు తగిలాయి. నాకూ వాటి సంగతి తెలియదు. అవి ఎలా
ఉన్నాయంటే వాటిని దాటేలోగా కూలిపోతాయేమో అనేంత పాతపడి, మాంధాతల కాలంలో కట్టినట్టుగా వున్నాయి.
కొత్త రాజధాని నిర్మాణం
ఎక్కడ జరిగినా, అందులో విజయవాడకు ఎంతో కొంత ప్రాధాన్యం, పాత్ర తప్పకుండా వుంటాయి.
కాబట్టి అ నగరం మంచి చెడ్డలు గురించి మరింత ఎక్కువ దృష్టి పెడితే బాగుంటుందేమో అని
కూడా అనిపించింది. అందుకే ఈ నాలుగు ముక్కలు.NOTE: PHOTO COURTESY SAKSHI
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి