ఈ మాట అనగానే రాజకీయుల వాగ్దానాలు గుర్తొస్తే చేసేదేమీ
లేదు.
నేను చెప్పబోయే 'ఈ మాట' ఎవరికి వారు
ఇచ్చుకునేమాట. కొత్త ఏడాదిలో 'ఇది చేస్తాం అది మానేస్తాం' అంటూ మనకు మనమే
ఇచ్చుకునే మాట అన్నమాట.
ఈ మాట్లాట మానేసి అసలు విషయానికి వద్దాం.
న్యూ ఇయర్ రిజల్యూషన్స్ పేరుతో ఎన్నో చేయాలని
అనుకుంటాం. అదేం పాపమో ఏడాది మొదట్లోనే వాటికి పురిటి సంధి కొడుతుంది.
చాలామంది మగ పురుషులు ప్రతిఏడాది కామన్ గా తమకుతాము
ఇచ్చుకునే వాగ్దానం కామన్ గా ఒకటుంది. అదేమిటంటే మందు మానేస్తాం, సిగరెట్లు తాగడం
ఆపేస్తాం అని. కానీ, కామన్ గా జరిగేది ఏమిటంటే మర్నాడు సీను షరా మామూలే. హాల్లో పీఠం
వేసుకుని, విలాసంగా సిగరెట్టు వెలిగించి,
మందహాసంతో మందు గ్లాసు పట్టుకున్న తరువాత కూడా ఎందుకో ఏమిటో ఈ మాట
అస్సలు గుర్తురాదు. ఆవిళ్ళు (ఆవిడలు అనగా భార్యలు)
పనిగట్టుకుని గుర్తుచేయబోయినా 'ఆ మాట నిరుడు కదా చెప్పాను' అనేస్తారు అదేదో పూర్వ
జన్మ వృత్తాంతం అన్నట్టు. కావున, కావుకావుమని చెప్పేదేమిటంటే, ఎన్నికల్లో చేసిన
వాగ్దానాలు అధికారంలోకి వచ్చిన తరువాత నిలబెట్టుకోలేదెందుకని రాజకీయ నాయకులను నిలదీసే హక్కు మనకు బొత్తిగా లేదని.
మనం మాట తప్పడానికి కూడా ఓ కారణం వుంది. ఈ కొత్త ఏడాది
పాతపడి గిర్రున ఏడాది తిరిగి మరో కొత్త ఏడాది మళ్ళీ వస్తుందని.
వాళ్ళు మాట తప్పడానికి కూడా దాదాపు అదే కారణం.
అయిదేళ్ళ తరువాత మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు
అప్పుడు మరో మాట ఇస్తే పోలా అని.
కావున, అల్లా ఆలోచించి ఎన్నికల్లో ఇచ్చిన పాత మాటలన్నీ
(వోట్ల వొట్లు అన్నమాట) మూటగట్టి మన గట్టునే పెట్టి వెడుతున్నారు.
అదన్న మాట.
NOTE: Courtesy Cartoonist
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి