(Published by 'SURYA' telugu daily in its edit page on 18-12-2014, Thursday)
తెలంగాణా మంత్రివర్గం విస్తరణలో ఆఖరి పంక్తి వడ్డన కూడా పూర్తయింది. రాజ్యాంగం ప్రకారం శాసన సభ మొత్తం సభ్యుల సంఖ్యలో పదిహీను శాతం వరకు మంత్రులను నియమించుకునే తతంగం కూడా ముగిసింది. ముఖ్యమంత్రితో కలుపుకుని మొత్తం పద్దెనిమిది మందితో మంత్రివర్గం కొలువుతీరింది. ఇక పంచడానికి మిగిలింది ఏమీ లేదు. ఆశావహుల ఆశలపై నీళ్ళు చల్లినట్టే. అయితే చీకట్లో చిన్న కాంతి కిరణం ఏమిటంటే, మంత్రి పదవి రాలేదని కినుక వహించిన ఒక సీనియర్ టీ.ఆర్.యస్. నాయకుడిని బుజ్జగిస్తూ, త్వరలోనే కేబినెట్ పునర్వ్యవస్తీకరణ ఉంటుందనీ, అప్పుడు తప్పక న్యాయం చేస్తాననీ ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు వెలువడిన వార్తకధనాలే. వీటిల్లో నిజమెంతో తెలియదు కానీ, ఆశలు పెంచుకుని నిరాశకు గురయిన వారు తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేసినట్టు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్పుటంగా కానవచ్చింది. అయిన వాళ్ళకు ఆకుల్లో, కాని వాళ్లకు కంచాల్లో అనే నానుడిని వారు గుర్తు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని ఒక కొత్త సంప్రదాయానికి కూడా కేసీయార్ శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది ప్రధమార్ధంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ప్రమాణ స్వీకారానికి కొద్ది గంటల ముందే ఆయన తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తూ స్పీకర్ కు లేఖ పంపారు. అంటే మరో ఉప ఎన్నికకు రంగం సిద్దమవుతున్నట్టే.
తెలంగాణా మంత్రివర్గం విస్తరణలో ఆఖరి పంక్తి వడ్డన కూడా పూర్తయింది. రాజ్యాంగం ప్రకారం శాసన సభ మొత్తం సభ్యుల సంఖ్యలో పదిహీను శాతం వరకు మంత్రులను నియమించుకునే తతంగం కూడా ముగిసింది. ముఖ్యమంత్రితో కలుపుకుని మొత్తం పద్దెనిమిది మందితో మంత్రివర్గం కొలువుతీరింది. ఇక పంచడానికి మిగిలింది ఏమీ లేదు. ఆశావహుల ఆశలపై నీళ్ళు చల్లినట్టే. అయితే చీకట్లో చిన్న కాంతి కిరణం ఏమిటంటే, మంత్రి పదవి రాలేదని కినుక వహించిన ఒక సీనియర్ టీ.ఆర్.యస్. నాయకుడిని బుజ్జగిస్తూ, త్వరలోనే కేబినెట్ పునర్వ్యవస్తీకరణ ఉంటుందనీ, అప్పుడు తప్పక న్యాయం చేస్తాననీ ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు వెలువడిన వార్తకధనాలే. వీటిల్లో నిజమెంతో తెలియదు కానీ, ఆశలు పెంచుకుని నిరాశకు గురయిన వారు తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేసినట్టు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్పుటంగా కానవచ్చింది. అయిన వాళ్ళకు ఆకుల్లో, కాని వాళ్లకు కంచాల్లో అనే నానుడిని వారు గుర్తు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని ఒక కొత్త సంప్రదాయానికి కూడా కేసీయార్ శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది ప్రధమార్ధంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ప్రమాణ స్వీకారానికి కొద్ది గంటల ముందే ఆయన తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తూ స్పీకర్ కు లేఖ పంపారు. అంటే మరో ఉప ఎన్నికకు రంగం సిద్దమవుతున్నట్టే.
ప్రమాణ స్వీకారం వంటి కార్యక్రమాలకు ప్రతిపక్షాలు
మొహం చాటేయడం సహజమే కాని పాలక పక్షానికి చెందిన వారిలో పెక్కురు గైర్ హాజరు కావడం,
ముఖ్యంగా తెలంగాణా అసెంబ్లీలో చీఫ్ విప్
గా నియమితులయిన కొప్పుల ఈశ్వర్ వంటి సీనియర్ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి రాకపోవడం
పాలక పక్షానికి కొంత ఇబ్బంది కలిగించే
విషయమే. అదే రోజు ఉదయం విదేశీ పర్యటన నుంచి నగరానికి తిరిగి వచ్చిన రాష్ట్ర
మంత్రి, ముఖ్యమంత్రి కేసీయార్ కుమారుడు కే.టీ.
రామారావు సయితం మంత్రుల ప్రమాణ స్వీకారానికి రాకపోవడం ఆ పార్టీలో రగులుతున్న
అసంతృప్తి జ్వాలలకు సంకేతం అని వాదించేవారున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం
అనంతరం సాంప్రదాయంగా గవర్నర్ తో కలిసి దిగే మంత్రివర్గం ఫోటోలో కూడా కేటీఆర్ కనిపించలేదు. చీఫ్
విప్, విప్పులు, పార్లమెంటరీ సెక్రెటరీల నియామకం గురించి జీవోలు వెలువడ్డాయి కానీ,
ఆ పదవుల్లో నియమితులయిన వారిలో అనేకమంది మంత్రివర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి
హాజరు కాలేదు. గైర్హాజరుకు ఎవరికి వుండే
కారణాలు వారికి వున్నా, కేసీయార్ వ్యవహార శైలి నచ్చని ఆ పార్టీవారి చేతికి ఒక
ఆయుధం అందించినట్టు అయింది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న ప్రధాన ప్రతిపక్షాలన్నీ
అప్పుడే విమర్శల దాడి ప్రారంభించాయి. కొత్త మంత్రులలో అధికులు తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు ఒక వెలుగు
వెలిగిన వాళ్ళు కావడం సరి కొత్త విమర్శలకు, మీడియాలో విస్తృత చర్చలకు దారితీసింది. 'తెలంగాణా
మంత్రి వర్గాన్ని చూస్తుంటే రాష్ట్రాన్ని పాలిస్తోంది మా పార్టీ యేమో అన్న సందేహం
కలుగుతోంద'ని టీటీడీపీ సీనియర్ నాయకుడొకరు చమత్కరించడం కొస మెరుపు.
మంగళవారం నాడు జరిగిన మంత్రివర్గ విస్తరణ అనంతరం,
ఇది నిజమేనేమో అన్న అభిప్రాయం కలిగే అవకాశం వుంది. ముఖ్యమంత్రి
కాకుండా తెలంగాణా మంత్రులు పదిహేడు మందిలో ఎనిమిదిమంది వేరే పార్టీలకు చెందినవారు.
వారిలో ఎక్కువమంది తెలుగుదేశం పార్టీలో
ప్రముఖులుగా పేరుపొందిన వారు కావడం విశేషం.
ఈ విస్తరణతో తెలంగాణాలోని మొత్తం పది జిల్లాలకు మంత్రి వర్గంలో స్థానం లభించినట్టయింది.
తొలి విడతలో అవకాశం దక్కని రెండు
జిల్లాలకు ఈ సారి ప్రాతినిధ్యం లభించింది. మహబూబ్ నగర్ జిల్లా నుంచి జూపల్లి
కృష్ణారావు, సీ. లక్ష్మారెడ్డి, ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వరరావులను కేసీయార్ మంత్రులుగా
తీసుకున్నారు. తెలంగాణాలో కొన్ని చోట్ల బలంగా
వున్న ఒక సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకోవడానికే తుమ్మలను మంత్రిని చేసారనీ, కేవలం
హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే తలసాని శ్రీనివాస
యాదవ్ కి మంత్రి పదవి ఇచ్చారనీ ఇప్పటికే విమర్శలు బయలుదేరాయి కూడా.
ఎవరెన్ని అనుకున్నా, తాను అనుకున్న పద్దతిలోనే ముందుకు సాగడం కేసీయార్
తత్వం. అన్ని విషయాలను అందరితో చర్చిస్తూనే, కొన్ని అంశాలలో ఆయన తనకు తనుగానే
నిర్ణయాలను తీసుకుంటారు. ఎన్నో ఆటుపోట్లు నేర్పిన సుదీర్ఘ రాజకీయ అనుభవం వల్ల కావచ్చు,
పర్యవసానాలు ఎలా వున్నా ఎదుర్కునే గుండె నిబ్బరం ఆయనకు పుష్కలంగా అలవడింది. నాయకుడిగా
ఎదగడానికీ, నిలదొక్కుకోవడానికీ ఈ రకమైన దృఢచిత్తం, ఏకపక్ష నిర్ణయాలు అక్కరకు రావచ్చుకాని ప్రస్తుతం ఆయనకు వీటి అవసరం బొత్తిగా లేదు. టీ.ఆర్.యస్. పార్టీకి సంబంధించినంతవరకు
కేసీయారే కర్తా,కర్మా, క్రియా. ఆయన మాటని కాదనేవారు లేరు. కాదనుకుని నిలబడగలిగిన వారూ
లేరు. మొత్తం పార్టీకి కేసీయారే సర్వం సహా చక్రవర్తి. ప్రాంతీయ పార్టీ అధినాయకులను
ఎవరిని తీసుకున్నా ఇదే విధమైన వైఖరి కానవస్తుంది. దీనికి భిన్నంగా, ప్రజాస్వామ్య
బద్ధంగా ప్రాంతీయ పార్టీలను నడిపిన నాయకులతో పాటు, ఆ పార్టీలు కూడా చరిత్ర గతిలో కలసిపోయిన విషయం కూడా కాదనలేని
సత్యం.
మంత్రివర్గం కూర్పు అనేది పూర్తిగా ముఖ్యమంత్రి ఇష్టాఇష్టాల మీదే ఆధారపడి వుంటుంది. ఎవర్ని మంత్రులుగా
తీసుకోవాలి, ఎవరిని మంత్రివర్గం నుంచి తప్పించాలి, ఎవరికి ఏ శాఖలు అప్పగించాలి ఈ నిర్ణయాలు
అన్నీ ముఖ్యమంత్రి అభీష్టం ప్రకారం జరుగుతాయి. ఇప్పుడు అలాగే జరిగింది కూడా.
సహజంగానే, మరీ ముఖ్యంగా మరో అవకాశం ఇక లేదు అనుకున్న నేపధ్యంలో
అసంతృప్తులు పెరగడం కూడా సహజంగానే జరుగుతుంది. 'మరో నాలుగున్నర ఏళ్ళ వ్యవధానం వుంది
కదా! ఏదన్నా జరక్కపోతుందా, గుర్రం ఎగరకపోతుందా' అని వోపిగ్గా వేచి చూసే సహనం నేటి
తరం రాజకీయుల్లో నానాటికీ లుప్తమవుతోంది. 'ఇలా పార్టీ టిక్కెట్టు సంపాదించు కోవడం,
అలా ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందడం, వెనువెంటనే మంత్రిగా ప్రమాణ స్వీకారం
చేసెయ్యడం' ఇలా సాగిపోతాయి వారి కలలు. దీనికి తోడు, ఉద్యమ పార్టీ అయిన టీ.ఆర్.యస్.లో
ఆదినుంచీ పార్టీకు అన్నుదన్నుగా నిలబడి పోరాడిన వారికి, ఎట్టకేలకు తెలంగాణా కల
సాకారమై, బంగారు తెలంగాణా నిర్మాణంలో పాలుపంచుకునే సువర్ణావకాశం కోసం ఆరు మాసాలుగా ఎదురు చూస్తున్నవారికి,
అందినట్టే కనబడిన మంత్రి పదవులను, ఉద్యమంతో సంబంధం లేనివాళ్ళు ఆఖరు నిమిషంలో
ఎగరేసుకుపోవడం మరింత బాధ కలిగించడం అసహజమేమీ కాదు.
పుష్కర కాలానికి పైగా వొంటి చేత్తో ఉద్యమం నడిపి,
దుష్కరమనుకున్న ప్రత్యెక రాష్ట్రాన్ని సాధించిన కేసీయార్ కు ఈ విషయాలు తెలియవని
అనుకోలేము. ఇటువంటి వాటిని ఎలా నిభాయించుకు రావాలన్నది ఆయనకు కొట్టిన పిండి.
ఎవర్ని ఎలా బుజ్జగించాలో, ఎవర్నిఎక్కడ, ఎలా హద్దుల్లో ఉంచాలో తెలిసిన నాయకుడు
కాబట్టే ఇన్నేళ్ళు ఉద్యమం సెగ తగ్గకుండా చూడగలిగారు. అలా అని చెప్పి అన్ని రోజులూ
ఒకే విధంగా నడిచిపోతాయి అనే అభిప్రాయం పెంచుకోవడం కూడా సరయిన నాయకుడి లక్షణం కాదు.
నొప్పించే నిర్ణయాన్ని కూడా సహచరులకు నచ్చచెప్పి వొప్పించే కుశలత నాయకుడికి చాలా అవసరం. 'గోటితో పోయేదానికి గొడ్డలి ఎందుకనే'
సూక్తి రాజకీయ నాయకులకు పూర్తిగా వర్తిస్తుందని జనం చెప్పుకునేది ఇందుకే.
ఇక ఇప్పుడు తెలంగాణాకు పూర్తి స్థాయి మంత్రి
వర్గం ఏర్పడింది. రేపో మాపో అధికారుల విభజన ప్రక్రియ కూడా ఒక కొలిక్కి వస్తుంది.
కాబట్టి సాకులు చెప్పకుండా కాలయాపన లేకుండా పనులు జరిగేలా చూడాలి. కలలు కంటున్న బంగారు తెలంగాణా
సాకారం కావాలంటే ఎలాటి అలసత్వం కూడదు. పొరుగు రాష్ట్రంతో పొరపొచ్చాలు
తగ్గించుకుని, అవసరమైన సహకారం అడిగయినా తీసుకుని వడివడిగా అడుగులు వేయాలి.
రాజకీయ పరిణామాలు, పర్యవసానాలు గురించి
ఆలోచించకుండా, మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం, వెనువెంటనే మంత్రి
వర్గ సభ్యులకు దిశానిర్దేశం చేస్తూ సత్వర కార్యాచరణకు ఆయత్తమైన కేసీయార్ వైఖరి మెచ్చదగినదే. తాను పెట్టుకున్న లక్ష్యాలలో కొన్నింటినయినా
వెంటనే చేసి చూపించగలిగితే ఇప్పుడు వినవస్తున్న విమర్శలు దూదిపింజల్లా
కొట్టుకుపోతాయి. నాయకులకు పదవులు ప్రధానం కావచ్చు కానీ, ప్రజలకు అభివృద్ధి ముఖ్యం.
చెప్పింది చేసి చూపించడం ఒక్కటే విమర్శకుల నోళ్ళు మూయించడానికి సరయిన మార్గం.
రెండు తెలుగు రాష్ట్రాల అధినేతలు ఇక
రాష్ట్రాభివృద్ధి అనే ఒకే లక్ష్యంతో కలిసికట్టుగా పనిచేయగలిగితేనే రాష్ట్ర విభజన వల్ల ఏదైనా మంచి జరిగే వీలుంటే అది
జరుగుతుంది. లేనిపక్షంలో ఈ ప్రయోగం విఫలమవుతుంది.
తోక టపా: తెలంగాణా పూర్తి స్థాయి మంత్రివర్గం
ఏర్పడిందన్న మాటే కాని, 'ఆకాశంలో సగం' అని గొప్పగా చెప్పుకునే మహిళలకు అందులో
రవంత స్థానం లభించకపోవడం ఏవిధంగాను ఆమోదయోగ్యం కాదు, సమర్ధనీయమూ కాదు. ఇది నిష్టుర
సత్యం.
(17-12-2014)
NOTE : Courtesy Image Owner
5 కామెంట్‌లు:
ఆకాశంలో సగం - అని మీరంటే కేసీఆర్లో సగం
అని అర్ధం చేసుకుని వార్ని కూడా తీసుకొస్తారేమో?
"ముఖ్యమంత్రి కాకుండా తెలంగాణా మంత్రులు పదిహేడు మందిలో ఎనిమిదిమంది వేరే పార్టీలకు చెందినవారు"
You forgot the tense. Correct statement should read:
ముఖ్యమంత్రి కాకుండా తెలంగాణా మంత్రులు పదిహేడు మందిలో ఎనిమిదిమంది "గతంలో" వేరే పార్టీలకు చెందినవారు
More problems with correction of tense.
ముఖ్యమంత్రితో సహా దాదాపు అందరు తెలంగాణా మంత్రులూ "గతంలో" వేరే పార్టీలకు చెందినవారు.
కుడి యెడమైతే పొరపాటు లేదొయ్!
అన్న కవిది యెంత ముందుచూపో?
"పొరుగు రాష్ట్రంతో పొరపొచ్చాలు తగ్గించుకుని"
నిజమే ప్రస్తుత విద్యుత్ సమస్య దృష్ట్యా చత్తీస్గడ్ రాష్ట్రంతో ఎంత సఖ్యతగా ఉంటె తెలంగాణకు అంత మంచిది. ఇక మిగిలిన పొరుగు రాష్ట్రాలు (మహారాష్ట్ర, కర్నాటక, ఆంద్ర) విషయానికి వస్తే ఇష్యూని బట్టి వెళ్ళాలి లేకపోతె నెత్తికెక్కే ప్రమాదం ఉంది. (చాలా మటుకు) వదిలించుకున్నపెత్తనాన్ని పునరాహ్వానించకుండా జాగ్రత్త పడాలి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి