2, మే 2014, శుక్రవారం

పత్రికా స్వేచ్ఛకు సరికొత్త భాష్యాలు - భండారు శ్రీనివాసరావు


అవి ఎమర్జెన్సీ రోజులు.
హైదరాబాద్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తవిభాగంలో నేను కొత్తగా అడుగుపెట్టాను.
 పత్రికా స్వేచ్చ పట్ల అపరితమయిన గౌరవాభిమానాలతో జర్నలిజం ను వృత్తిగా స్వీకరించిన నా స్నేహితుడొకరు ఒక ప్రముఖ దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాడు. రేడియోలో పనిచేసే నాకు వృత్తిపరమయిన స్వతంత్రం లేదనే భావన అతనిది. సర్కారు జర్నలిస్టుగా ముద్రవేసి నన్ను ఆట పట్టించడం అతగాడికో అలవాటుగా మారింది. దీనికి ఎప్పుడో ఒకప్పుడు అడ్డుకట్ట వేయాలనే తలంపులో వున్న నేను - ఒక రోజు అతడిని బాహాటంగా సవాలు చేసాను. ‘నాకో వార్త చెప్పు. అది యధాతధంగా సాయంత్రం రేడియో వార్తల్లో వస్తుందో రాదో చూద్దాము. అలాగే నేను చెప్పిన వార్త రేపు దయం నీ పేపరులో వస్తే నీకు స్వేచ్చవుందని ఒప్పుకుంటాను.’
పత్రికా స్వేచ్చపట్ల అపారమయిన గౌరవం వున్న నా స్నేహితుడు నేను విసిరిన సవాలుని స్వీకరించాడు. ఫలితం గురించి చెప్పాల్సిన పని లేదు. అతను పంపిన వార్తకు అతడి పేపర్లో అతీగతీ లేదు. నేను ఫోనులో చెప్పిన వార్త అదే సాయంత్రం ప్రాంతీయ వార్తల్లో ప్రసారమయింది. అప్పటినుంచి ఇప్పటివరకు మా స్నేహ బంధం కొనసాగుతూ వచ్చింది కానీ ఆతను ఎప్పుడు పత్రికా స్వేచ్చ గురించిన ప్రసక్తి నా వద్ద తీసుకురాలేదు.
ఈ ఒక్క చిన్న ఉదాహరణతో పత్రికా స్వేచ్చకు భాష్యం చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. కానీ ఈ స్వేచ్చ అనేది జర్నలిష్టులకన్నా వారు పనిచేసే పత్రికల యాజమాన్యాలు ఎక్కువగా అనుభవిస్తున్నాయని అభిప్రాయపడడంలో తప్పులేదేమో.
నా ఈ అభిప్రాయం బలపడడానికి యిటీవల జరిగిన మరో సంఘటన దోహదం చేసింది.
ఆకాశవాణి, దూరదర్శన్ వార్తా విభాగాలలో మూడు దశాబ్దాలకు పైగా పనిచేసి పదవీ విరమణ అనంతరం – అడిగిన పత్రికలవారికి వారు అడిగిన అంశాలపై నా అనుభవాలను జతచేసి వ్యాసాలు రాసే పనిని ఒక పనిగా పెట్టుకున్నాను. ఈ పత్రికలు కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా చిన్న పత్రికలు. కానీ వాటి సంపాదకులు ఎవ్వరు కూడా నేను రాసిన అంశాలతో ఏకీభవించినా, ఏకీభవించకపోయినా - ఏనాడూ ఒక చిన్నవాక్యాన్ని సయితం ‘ఎడిట్’ చేయలేదు. రాసినవి రాసినట్టు ప్రచురిస్తూ వస్తున్నాయి. పేరుకు చిన్న పత్రికలయినా పెద్దమనసుతో ‘పత్రికా స్వేచ్చకు’ పెద్ద పీట వేస్తున్నాయి. ఈ నేపధ్యంలో - బాగా ప్రాచుర్యంలో వున్న ఒక పెద్ద దినపత్రిక సంపాదక వర్గం వారు  ఫోను చేసి ఒక అంశంపై ఆర్టికిల్ అడిగి మరీ రా యించుకున్నారు. వారు అడిగిన వ్యవధిలోనే పంపడం జరిగింది కానీ ఆ వ్యాసం మాత్రం వెలుగు చూడలేదు. కారణం కూడా వారే సెలవిచ్చారు. నేను పంపిన ఆర్టికిల్ లోని విషయం వారి ‘ఎడిటోరియల్ పాలసీ’కి అనుగుణంగాలేదట. అందుకే ప్రచురించలేదట.
నార్ల గారు, నండూరి రామమోహనరావు గారు, పురాణం సుబ్రమణ్యశర్మ గారు మొదలయిన ఉద్దండ జర్నలిస్టులు సంపాదకులుగావున్నప్పుడు వారి పత్రికలలో ఉపసంపాదకుడిగా పనిచేసిన అనుభవం నాకున్నది. ఆకాశవాణిలో విలేకరిగా ఉద్యోగం రావడానికి ఈ అనుభవమే అక్కరకు వచ్చింది. తెలుగు జర్నలిజానికి పునాది రాళ్లుగా నిలిచిన వీరెవ్వరు - ‘ఎడిటోరియల్ పాలసీ’ అంటే ముందు పేర్కొన్న పత్రిక వైఖరి మాదిరిగా వుంటుందని వుంటుందని ఎప్పుడు చెప్పలేదు. ఆ పాలసీ అనేది కేవలం పత్రిక రాసే సంపాదకీయాలకు మాత్రమే  పరిమితం కావాలి కాని, . పత్రికలో పడే ప్రతి వార్తా, ప్రతి వ్యాసం – ఆ పత్రికా విధానానికి అనువుగా వుండాలని పట్టుబడితే ఇక పత్రికా స్వేచ్చకు అర్ధమేముంటుంది?
ఓ నలభయ్ ఏళ్ళ క్రితం నిజంగా జరిగిన ఒక ఉదంతంతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను.
ఒకానొక ప్రముఖ దినపత్రిక – సమాజంలో నైతిక విలువలు భ్రష్టు పట్టిపోతున్నాయని తన సంపాదకీయాలలో గగ్గోలు పెడుతుండేది. ఒక రోజు ఆ సంపాదకుడికి ఒక లేఖ వచ్చింది. అందులో ఇలావుంది.
“అయ్యా! సమాజం పట్ల, ఆ సమాజంలో లుప్తమవుతూవున్న నైతిక విలువలపట్ల మీకున్న ఆవేదన మెచ్చదగినదిగావుంది.
‘అయితే మీకు తెలియని విషయం ఒకటుంది. మీ పత్రిక ఆఫీసు ఎదురుగా ఓ చాయ్ దుకాణం వుంది. పావలా మనది కాదనుకుని అరకప్పు టీ తాగిస్తే అరకాలం వార్త మీ పేపర్లో రాసే సిబ్బంది ఆ దుకాణంలో ఎప్పుడు సిద్దంగా వుంటారు. సమాజం సంగతి సరే! ముందు మీ ఇల్లు చక్కపెట్టుకోండి”

3 కామెంట్‌లు:

Saahitya Abhimaani చెప్పారు...

అద్భుతంగా ఉన్నది మీ వ్యాసం శ్రీనివాస రావుగారూ. ముఖ్యంగా చిట్టచివర మీరు ఇచ్చిన పిట్టకథ అప్పుడెప్పుడో కాదు ఈనాటికీ నిజం. అందుకనే , పైడ్ న్యూస్, వార్తా వ్యాపారులు వంటి మాటలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. పత్రికా స్వాతంత్ర్యం కాదు పత్రికా యజమానులకు స్వతంత్రం. ఇది నిఖార్సైన నిజం. ఏడిటోరియల్ పాలసీ అంటే ఏమిటి! నేను, నా పత్రిక, నాకు పెట్టుబడి పెట్టిన పెద్దలు వాళ్ళకు కాని, వారి ఉద్దేశ్యాలకు కాని, లేదా ఫలానా ఇజానికి (సామాన్యంగా ఇది విదేశీ ఇజం అయ్యి ఉంటుంది) భిన్నంగా వ్రాయకపోవటమే కదా! ఇంత మాత్రానికి నాలుగో స్థంభం ఇంకా ఇలాంటి గంభీరమైన మాటలు వాడేసుకుని ఈ నాటి మీడియాగా పిలవబడుతున్న వ్యాపార సంస్థలు (ఇందులో చాలా భాగం పార్టీ కరపత్రాలే వార్తా పత్రికలుగా చలామణీ అవుతున్నాయి) ఎందుకు మభ్యపెట్టాలని చూస్తున్నాయో తెలుసుకోవటం పెద్ద విషయం ఏమీ కాదు.

ఎన్నికల సమయంలో, రాజకీయా పార్టీలకు వాళ్ళు ప్రచార నిర్వహణ తదితర విషయల్లో ఎలా ఉండాలో, ముఖ్యంగా ఎలా ఉండకూడదో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. నా ఉద్దేశ్యంలో, ప్రస్తుతం ఉన్న విచ్చలవిడి మీడియాకు కూడా ముక్కు తాడు వేసి, కనీసం ఎన్నికల సమయంలో ఎలా ఉండకూడదో నిర్దేశించాల్సిన సమయం వచ్చింది. కాని ఎవరు చెయ్యాలి ఈ పని. మరో శేషన్ రావాలేమో!

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ శివరామప్రసాద్ గారికి - మీకున్న అనేకానేక వ్యాసంగాలతో తీరుబడి లేకుండా వుంటూ కూడా నా వ్యాసాలను, వ్యాఖ్యలను చదివి స్పందిస్తున్న తీరు అమోఘం.ధన్యవాదాలు- భండారు శ్రీనివాసరావు

జాజిశర్మ చెప్పారు...

శ్రీనివాస రావు గారు! పొగుడుతూన్నప్పుడు పేర్లు చెప్పడం, విమర్సిస్తున్నప్పుడు పేర్లు చెప్పకుండా ఉండటం జర్నలిస్టుల సంప్రదాయం గా వస్తున్నది. దీనిని నుండి కనీనం మీరైనా బయటపడలేరా?