8, ఫిబ్రవరి 2013, శుక్రవారం

మా ఆవిడకు నేనిస్తున్న ‘యోగ్యతాపత్రం’






తన బలమేమిటో, బలహీనతలేమిటో తనకు  ఏమీ తెలియకపోవడం వల్ల ఈ నలభై రెండేళ్ళ పైచిలుకు వైవాహిక జీవితాన్నినాతో నెట్టుకు రాగలిగింది.
అయితే ఆమె బలమూ, బలహీనతలు నాకు తెలుసు. మగవాడిగా పుట్టి నా స్థానంలో వున్నట్టయితే మా సంసారాన్ని ఇంకా గొప్ప విజయ తీరాలకు  చేర్చివుండేది కూడా.  ఆ విషయంలో నాకు ఎలాటి సందేహం లేదు. వొప్పుకోవడానికి ఎలాటి భేషజం లేదు. బహుశా మొగుళ్లలో తొంభయ్ తొమ్మిది శాతం మందికి  అంతరాంతరాల్లో తమ భార్యల గురించి  పైకి చెప్పుకోలేని  ఈ మాదిరి అభిప్రాయమే వుండి వుండవచ్చు కూడా.
తన గురించి ఇన్నేళ్ళ తరువాత బాహాటంగా చెబుతున్న ఈ ఒక్క మంచి ముక్క కూడా తను చదివే ఛాన్స్ లేదు. ఎందుకంటే జర్నలిస్టుగా  పత్రికల్లో, సోషల్ నెట్ వర్కుల్లో నేను రాసే  రాతలు, విశ్లేషకుడిగా టీవీల్లో నేను చెప్పే మాటలు ఆమెకు ఏమీ పట్టవు. తన పనేదో తనది. కుటుంబం, దాని బాగోగులు తప్ప తనకు మరో ధ్యాస లేదు. ఈ రెంటినీ పట్టించుకునే తీరికా  ఓపికా నాకు లేవు. అంచేత  కుటుంబపరమయిన బాధలూ,  బాధ్యతలూ  తనవి. చుట్టపక్కాల  మెచ్చుకోళ్లన్నీ నా ఖాతాలోకి. ‘మంచి’ బదిలీ పధకం అన్న మాట. మరోరకంగా ఇది మా ఆవిడ బలహీనత, నా బలమున్నూ.
అన్నదమ్ములు లేరు. అక్కచెల్లెళ్ళు లేరు.  తలిదండ్రులకు ఒక్కగానొక్క కుమార్తె. అయినా,   నాకోసం అయినవారినందర్నీ  కాదనుకుని, అన్నింటినీ వొదులుకుని గత  నలభై వసంతాలుగా   నావెంట నడిచివస్తూ, వెనకవుండి నన్ను నడిపిస్తూ వస్తున్న మా ఆవిడ నిర్మల - 58 పుట్టినరోజు ఈనెల తొమ్మిదో తేదీ.  ఎప్పటిలా ఆరోజు నాకు  గుర్తుండదని తెలిసినవాడిని  కనుక ముందుగానే రాసిపెట్టి వుంచుకున్న  యోగ్యతాపత్రం ఇది.  మనసు పెట్టి రాసి ఇస్తున్న పుట్టిన రోజు కానుక కూడా. (అల్ప సంతోషులతో వున్న లాభాల్లో ఇదొకటి)   
- భండారు శ్రీనివాసరావు      

4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

బాగుంది.
మీ భార్యకి మా తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయండి.

శారద విభావరి చెప్పారు...

నిర్మల గారు చాలా లక్కీ . మా తరఫున కూడా ఆవిడకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి.

PRASAD చెప్పారు...

శ్రీనివాస రావు గారూ,
ఇంచుమించుగా మనందరిది ఇదే స్టోరి. నా బలం, బలహీనత రెండు కూడా ముమ్మాటికీ మా ఆవిడే. మీ శ్రీమతి నిర్మల గారికి జన్మదిన శుభాకాంక్షలు.


ప్రసాద్ శర్మ, హైదరాబాద్.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

చాలా మంది దంపతుల కధే మీది. అభినందనలు.
మీ శ్రీమతి గారికి జన్మదిన శుభాకాంక్షలు.