“ఫోను గణగణమంది.
గుండెలు బిగబట్టుకుని
ఎత్తాను. ఏం మాట్లాడాలో తెలియదు. ఆవేశంలో ఏం మాట్లాడుతానో తెలియదు. నా సంగతి నాకు
బాగా తెలుసు కనుక ముందే రాసి పెట్టుకున్న కాగితాన్ని వొణుకుతున్న చేతులతో గట్టిగా
పట్టుకుని, ‘హలో’ అన్నాను.
అవతలనుంచి ఏమీ
వినిపించలేదు. ఆ నిశ్శబ్ధం చాలు నా మనసును నా వశంలో లేకుండా చేయడానికి. కోపం
కట్టలు తెంచుకునే లోగా నెమ్మదిగా ‘ఉ’ అని భారంగా వినిపించింది.
నేననుకున్న
రెస్పాన్స్ రాకపోవడంతో నాకు వొళ్ళు మండిపోయింది. ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియని
పరిస్తితి దాపురించింది.
‘ఇక నీవు రానక్కరలేదు.
ఇంతటితో మన ఆలుమగల సంబంధం సరి’
ఫోనులో సన్నగా
రోదిస్తున్న ధ్వని. కానీ నా పట్టుదలముందు నాకేమీ పట్టదు. నేను అనుకున్నది
అనుకున్నట్టు జరిగిపోవాలి. నేను రమ్మన్నట్టుగా
పుట్టింటి నుంచి రెండు రోజుల్లో వచ్చి వాలిపోవాలి.
‘మా నాన్న గారు
వూళ్ళో లేరు. రాగానే రిజర్వేషన్ చేయించుకుని వారం రోజుల్లో వచ్చేస్తాము. లేకపోతే
చంటి పిల్లవాడితో ప్రయాణం ఇబ్బంది. దయచేసి అర్ధం చేసుకోండి. మొండి పట్టు పట్టకండి.
మీకు చెప్పాల్సినదాన్ని కాను. మీరూ చెప్పించుకోవాల్సిన మనిషి కారు’
నేను కోపం వస్తే
మనిషిని కాను. కానీ, వేరే వాళ్లు ఆ నిజాన్ని నా మొహం మీదే చెబితే విని వూరుకునే ఉదారగుణం
నాకు లేదు.
‘ఇక నీతో మాట్లాడే
తీరుబడి నాకు లేదు. అలాగే, ఇక నీకూ నాకూ సంబంధం లేదు. ఫోను పెట్టేస్తున్నాను.’
ఇలాంటిదేదో చెత్త నోటికి వచ్చినట్టు వాగి ఫోను పెట్టేశాను.
పురిటికి
పుట్టింటికి వెళ్లి, పండంటి తొలి చూలు బిడ్డతో, పుట్టెడు సంతోషంతో తిరిగివచ్చే
భార్యతో ఈ ప్రపంచంలో యే మగాడూ ఇలా మాట్లాడడు. కానీ నా తరహాయే వేరాయే. అది నా
ఒక్కడికే చెల్లు.
పట్టింపులు, పంతాలు
నా మనసును చెదలా పట్టి, నా జీవితాన్ని కొరుక్కు తినేస్తున్నాయి. అంతటితో పోతే
ఇబ్బంది లేదు. నన్ను ప్రేమించి, నాకోసం అయినవారందరిని కాదనుకుని వచ్చి నా ఇల్లాలిగా నాతో జీవితం పంచుకుని, తన నడవడితో, మంచితనంతో మెట్టింటివారిని మెప్పించి, పుట్టింటి వారిని
వొప్పించి తనకో సంసారాన్ని, నాకో సంసార జీవితాన్ని అందించి మాతృత్వపు మాధుర్యం చవి చూసే తరుణంలో నా నోటి నుంచి ఇలాటి మాటలు.
ఫోను బూతునుంచి
బయటపడి తడబడే నడకతో ఇంటి దారి పట్టాను. వర్షం పడుతోంది. రిక్షా పిలవాలని కూడా
అనిపించలేదు. అలా తడుస్తూనే ఇంటికి చేరాను. తాళం తీసి లోపలకొచ్చాను. అద్దంలో మొహం
చూసుకుంటే నేనేనా అనిపించింది. మనసులో వికారపు ఆలోచనలు సుళ్ళు తిరుగుతూ వుంటే మొహం
యెందుకు బాగుంటుంది. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారందుకే కాబోలు. గడ్డం
పెరిగింది. వాన నీటి చుక్కలు తల వెంట్రుకల
కొసలనుంచి కారుతున్నాయి. తల తుడుచుకోవాలని అనిపించలేదు. బట్టలు మార్చుకోవాలని
అనిపించలేదు”
కరెంటు పోయినప్పుడు
టీవీ ఆగిపోయినట్టు హఠాత్తుగా ఆగిపోయింది.
ముడతలు పడిన
కాగితంలో రాసివున్న వాక్యాల వెంట
పరిగెత్తుతున్న నా కళ్ళు కూడా అలాగే ఆగిపోయాయి.
కొత్తగా కిరాయికి
తీసుకున్న ఇంటిని సర్డుకుంటుంటే కళ్లబడిన కాగితం అది.
ఎవరితను? రచయితా? అతడు
మొదలుపెట్టి పూర్తిచేయని కధలో భాగమా? భార్యకు రాసిన లేదా రాసి పోస్ట్ చేయని ఉత్తరమా?
అలా అయితే అసంపూర్తిగా యెందుకు వుంది?
ఆవిడ పుట్టింటి
నుంచి వచ్చిందా? అతడికంత ఆవేశం వచ్చి ఆ విధమయిన ఉత్తరం రాయాలని అనుకోవడానికి కారణం
యేమయివుంటుంది?
కొన్ని విషయాలు అంతే!
అర్ధం అయ్యీ అవనట్టు వుంటాయి. (02-02-1978)
4 కామెంట్‌లు:
కొత్తగా కథలు వ్రాయటం మొదలెట్టారా? కథా ప్రపంచానికి స్వాగతం.
@cbrao - చివరలో గమనించలేదా రావు గారు - ఇది - 02-02-1978 లో రాసింది.అంటే దాదాపు ముప్పై అయిదు సంవత్సరాల క్రితం. - భండారు శ్రీనివాసరావు
చంపేశారు మాస్టారూ.
aa manishi evaro kaani nannu nenu addam lo choosukunnatle undi..
కామెంట్‌ను పోస్ట్ చేయండి