(ఈ వ్యాసాలు రాసి
నాలుగయిదేళ్ళు గడిచిపోయాయి. ఆనాటి సంఘటనలు, సందర్భాలు వేరు. అందుకే వీటికి పాత చింతకాయ పచ్చడి కబుర్లు అని పేరు
పెట్టాల్సి వచ్చింది. ఇది గమనంలో వుంచుకోవాలని చదువరులకు ముందుగానే విజ్ఞప్తి
చేస్తున్నాను. తేదీలు వేసినా కొందరవి గమనించక పోయే అవకాశం వుంది కాబట్టి ఈ వినతి.)
ఈ ప్రశ్నకు బదులేది?
"అతడు ఖచ్చితంగా ఉగ్రవాది అయివుంటాడు. అతడి దగ్గర రేషన్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ వున్నాయి. మామూలు వాడికి ఇన్ని కార్డులు సంపాదించడం అంటే మాటలు కాదు"
(కార్టూనిస్టు సుభానీ గారికి కృతజ్ఞతలతో)
పూర్వం ఆదిశంకరులవారు కాశీలో వెడుతున్నప్పుడు దారిలో ఎదురయిన వ్యక్తిని
తప్పుకోమంటారు.
‘ఎవరిని తప్పుకోమంటున్నావు? నన్నా? నాలోని ఆత్మనా?’ అని ఆ వ్యక్తి ఎదురు ప్రశ్నించడంతో
– ఎదురుపడ్డవాడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అన్న ఎరుకగలిగిన ఆదిశంకరులవారు –
శివుడిని స్తుతిస్తూ ఐదు శ్లోకాలతో కూడిన ‘మనీషా పంచకా’న్ని పఠిస్తారు.
ఈ ఘట్టాన్ని యెందుకు స్మరించుకోవాల్సి వచ్చిందంటే –
నగర జీవికి కావాల్సిన నిత్యావసరాల జాబితా క్రమంగా పెరిగిపోతోంది. వెనకటికి –
రోటీ,కపడా,మకాన్- అంటే తినేందుకు తిండీ, కట్టేందుకు బట్టా,వుండేందుకు గూడూ వుంటే
సరిపోతుందనుకునే వారు. ఇప్పుడీ జాబితాలో కొత్తగా ‘అడ్రసు ప్రూఫ్’ అనే కొత్త పదం
జోడయింది.(అప్పటికి ‘ఆధార్’ కార్డుల ఆలోచన కూడా పురుడు పోసుకోలేదు) రేషన్ కార్డు
మొదలుకుని పాన్ కార్డు వరకు యేది కావాలన్నా ముందు అడిగేది ఈ ‘అడ్రసు ప్రూఫే’
నువ్వెవరో ఏమిటో అక్కరలేదు. కాని వుంటున్న చిరునామాకి సంబంధించిన రుజువు మాత్రం
సంపాదించి పెట్టుకోవాలి. సెల్ ఫోన్ కొనుక్కోవాలన్నా, టెలి ఫోన్ పెట్టించుకోవాలన్నా
ఈ ‘చిరునామా ధృవీకరణ పత్రం’ (రెసిడెన్సు ప్రూఫ్) తప్పనిసరి.
ఇక్కడే ‘కోడి ముందా? గుడ్డు ముందా?’ అనే మాదిరి ప్రశ్న తలెత్తుతుంది.
‘మీరు పలానా చిరునామాలో వున్నట్టు రుజువు పట్రండి’ అని తేలిగ్గా అనేస్తారు.
కరెంటు బిల్లో, వాటర్ బిల్లో, టెలిఫోన్ బిల్లో జిరాక్స్ కాపీలు తెమ్మంటారు.
నగరంలో అధిక శాతం జనాభాకి సొంత ఇళ్లు వుండవు. కిరాయి ఇళ్ళల్లో బతుకు బండి లాగిస్తుంటారు.
కరెంటు బిల్లు, వాటర్ బిల్లు ఇంటి యజమానుల పేరుతొ వుంటాయి. పోనీ ఫోను
పెట్టించుకుని ఆ బిల్లు కాపీ పెడదామనుకుంటే ఫోను మంజూరుకు చిరునామా రుజువు పట్టుకు
రమ్మంటారు. ‘అయ్యా! పలానా ఇంట్లో వున్నది నేనే’ అని నెత్తీ నోరూ బాదుకున్నా ప్రయోజనం వుండదు. ‘అడ్రసు
ప్రూఫ్’ లేనిదే పని నడవదు. రోజు గడవదు.
రేషన్ కార్డు, వోటర్ గుర్తింపు కార్డు, బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు, పనిచేస్తున్న ఉద్యోగం తాలూకు
కార్డు, చివరాఖరుకు పాస్ పోర్ట్ తో సహా అన్నీవున్నా – సొంత గూడు లేని సగటు జీవికి
మాత్రం వుంటున్న చిరునామా కార్డు కార్డుకీ
ఇల్లు మారినప్పుడల్లా మారిపోతూనే వుంటుంది. అడ్రసు ప్రూఫ్ అవసరం వచ్చిందంటే మళ్ళీ కధ మొదటికి వచ్చినట్టే.
‘నువ్వెవరు? నీ చిరునామా ఏమిటి?’ అనేవి నిజానికి చిన్న ప్రశ్నలే. రుజువు
అడిగినప్పుడే సమాధానం దొరకని క్లిష్ట ప్రశ్నలుగా మారతాయి.
ప్రస్తుత ప్రపంచీకరణ నేపధ్యంలో ఒక చోటు నుంచి మరో ప్రాంతానికి వలసలు
తప్పనిసరి. వలస వెళ్ళినప్పుడల్లా చిరునామాకు రుజువులు సంపాదించుకోవడంలోనే సగం కాలం
చెల్లిపోతోంది. అందుబాటులోవున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఈ
సమస్యకు ఏదయినా పరిష్కారాన్ని కనుగొనగలిగితే సామాన్యుల కష్టాలు గట్టెక్కుతాయి.
‘నేనంటే ఎవరు? నేనా? నా లోని ఆత్మా?’ అన్న ప్రశ్నతో ఆదిశంకరులవారు ‘మనీషా
పంచకాన్ని’ పఠించి – ఆ ప్రశ్న లోని క్లిష్టతను జగత్తుకు చాటి చెప్పగలిగారు.
‘ఎవరు నువ్వు? నీ చిరునామా ఏమిటి? దానికి రుజువేమిటి?’ అనే ఈనాటి ప్రశ్నలకు
సమాధానం చెప్పాలంటే సామాన్యులకు సాధ్యపడే పనేనా? పాలకులూ ఆలోచించండి!
(వార్తా వ్యాఖ్య – భండారు శ్రీనివాసరావు – 13-01-2008)
1 కామెంట్:
ఈ విషయాలకు ఇంకా కాలదోషం పట్టలేదండి. ఇప్పుడూ ఇదే పరిస్థితి కదా!
పైన ఉన్న కార్టూన్ మాత్రం భలే ఉంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి