ఈ వ్యాసాలు రాసి
నాలుగయిదేళ్ళు గడిచిపోయాయి. ఆనాటి సంఘటనలు, సందర్భాలు వేరు. అందుకే వీటికి పాత చింతకాయ పచ్చడి కబుర్లు అని పేరు
పెట్టాల్సి వచ్చింది. ఇది గమనంలో వుంచుకోవాలని చదువరులకు ముందుగానే విజ్ఞప్తి
చేస్తున్నాను. తేదీలు వేసినా కొందరవి గమనించక పోయే అవకాసం వుంది కాబట్టి ఈ వినతి. - రచయిత
శ్రీ నరిసెట్టి ఇన్నయ్య
విదేశీ మద్యంలాటి
పుస్తకం
రామభద్రుడంతటివాడు
పలికించాడు కనుకనే తాను భాగవతం రాయగలిగానని భక్త పోతన అంతటివాడు చెప్పుకున్నాడు.
పలికేవాడికి
పలికించేవాడు – రాసేవాడికి రాయించే వాడు – చదివేవాడికి చదివించేవాడు వుండాలన్నది
నా అనుభవం.
లబ్ధప్రతిష్టుడయిన
ఓ రచయిత – అంతగా ప్రతిష్ట లబ్దం కాని తొలి రోజుల్లో – తన ఇంట్లోని డ్రాయింగు రూమ్
అనే ఇంటి ముందు వసారాలో ఓ చిన్న సైజు గ్రంధాలయం లాంటి పుస్తక భాండాగారాన్ని
ప్రదర్శించేవాడు.
‘అయ్యా/అమ్మా –
దయచేసి ఈ పుస్తకాలను అరువు అడక్కండి. ఎందుకంటే ఇక్కడ వున్న ఈ పుస్తకాలన్నీ అలా
అరువడిగి సేకరించినవే!’ అని రాసివున్న కాగితాన్ని ఆ పుస్తకాల బీరువాకు
అంటించేవాడు. ఆ స్థాయిలో కాకపోయినా మా ఇంట్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలోనే పుస్తకాలు
వున్నాయి. వీటిల్లో మిత్రులు ఆర్ వీ వీ కృష్ణారావు గారు ఇచ్చినవే ఎక్కువ. ఆయన
ఎప్పుడు పుస్తకాలు కొన్నా – మూడు నాలుగు కొనేసి- ఒకటి తను వుంచుకుని మిగిలినవి
పుస్తక ప్రియులకు కానుకగా ఇచ్చేవాడు. ఆయనకున్న ఈ మహత్తర అలవాటు పుణ్యమా అని
అనేకానేక పుస్తకాలను ఉచితంగా చదివే మహదవకాశం నాకు లభించింది. అలా ఎన్.ఇన్నయ్య
రాసిన పుస్తకం ఒకటి ఈ మధ్య చదివాను. జర్నలిస్తుగా చిరకాలం పనిచేసిన ఇన్నయ్య, భిన్న
రంగాలకు చెందిన వారితో తన అనుభవాలను ఇందులో పొందుపరిచారు.
అదృష్ట
దురదృష్టాలను నమ్మే వ్యక్తి కాకపోయినా – తన అనుభవ’సారా’లను (ఆయన మాత్రం సరసాలనే
రాసుకున్నారు) ఒక పుస్తకంగా అచ్చువేయించుకోగలిగారు.
చాలామంది జర్నలిష్టులు ఈ విషయంలో దురదృష్టవంతులే.
ఇక ఇన్నయ్య గారు ఈ
పుస్తకంలో –అబ్బూరి మొదలుకుని పాలగుమ్మి పద్మరాజు దాకా ముప్పయి నాలుగు మందితో
తనకున్న జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. వీరందరూ కీర్తిమంతుల కోవలోని వారే – ఇద్దరు
ముగ్గురు మినహా- పోతే మిగిలినవారందరూ కీర్తిశేషులే.
కులాలు,మతాలూ,
మూఢవిశ్వాసాలు వీటి పొడ గిట్టని ఇన్నయ్య ఈ పుస్తకంలో పేర్కొన్న కొందరిపట్ల చేసిన
వ్యాఖ్యలు, వారితోవున్న చనువుతో చేసానని చెప్పుకున్నప్పటికీ – వివరణ ఇచ్చుకునే
అవకాశం లేనివారిపట్ల కొంత ఉదారంగా వుంటే బాగుండునని ఈ పుస్తకం చదివిన తరువాత
ఇన్నయ్యగారి మిత్ర బృందంలో ఒకడినయిన నాకు అనిపించింది.
నండూరి రామమోహనరావు
‘గుమాస్తా’ ఎడిటర్ అని, దేవులపల్లి కృష్ణ శాస్త్రి అబద్ధాలతో బతికేవాడని, పీవీ
నరసింహారావు శీలవంతుడు కాడని, పురాణం సుబ్రహ్మణ్య శర్మ నార్ల కాళ్ళపై పడి
క్షమించమని వేడుకుని ఉద్యోగం కాపాడుకున్నాడనీ- ఇలా కొన్ని వాక్యాలు చదివినప్పుడు,
తెలిసిన అన్ని విషయాలను తెలిసినంత మాత్రాన ‘నగ్నంగా’ రాయాలని రూలేమీ లేదు కదా! అని
ఎవరికయినా అనిపించకతప్పదు.
‘సినారె’ గురించి ఈ
పుస్తకంలో ఇన్నయ్య రాసిన ఒక పేరా.
‘నారాయణ రెడ్డి
సభలలో మాట్లాడేటప్పుడు అందరూ నిశ్శబ్దంగా వుండి, శ్రద్ధగా వినాలని కోరేవాడు. తన
బిరుదులన్నీ విధిగా ఆహ్వాన పత్రికలో వేయాలని షరతు పెట్టేవాడు. కాని ఇతరులు సభలో
మాట్లాడేటప్పుడు సినారె క్రమశిక్షణ పాటించేవాడు కాదు’ – నిజం కాదని యెవరనగలరు?
‘సాహితీపరులు,
పాత్రికేయులతో సరసాలు’ అనే పేరుతొ నరిసెట్టి ఇన్నయ్య రాసిన ఈ పుస్తకంలో పటుతరమయిన
వ్యాఖ్యలు, కటుతరమయిన విమర్శలు, చురుక్కుమనిపించే ఛలోక్తులు, చివుక్కుమనిపించే
వ్యంగోక్తులతో పాటు – పేజీకి కనీసం నాలుగు పెగ్గులయినా ‘మద్యం’ ప్రసక్తి దొర్లడం ఈ
పుస్తకంలో మరో ప్రత్యేకత.
హాట్స్ ఆఫ్ టు
ఇన్నయ్య! – త్రీ చీర్స్ టు ఇన్నయ్య!
(ఫిబ్రవరి -2009)
1 కామెంట్:
‘అయ్యా/అమ్మా – దయచేసి ఈ పుస్తకాలను అరువు అడక్కండి. ఎందుకంటే ఇక్కడ వున్న ఈ పుస్తకాలన్నీ అలా అరువడిగి సేకరించినవే!’
ఆ రచయిత పేరు గొల్లపూడి మారుతిరావు గారు కదండి ... :):):)
కామెంట్‌ను పోస్ట్ చేయండి