పదమూడయినా చూపకపోతుందా
మార్గం
2012 వ
సంవత్సరం అంచున నిలబడి ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే ......
ఎన్ని వ్యాపకాలు,
ఎన్నెన్ని జ్ఞాపకాలు
కొన్ని మధురం
కొన్ని మరికొన్ని వ్యధాబంధురం
కొన్ని మరపురానివి
మరికొన్ని మరచిపోవాలని అనుకునేవి
కొన్ని తీపి గురుతులు
కొన్ని చేదు గుళికలు
ఉగాది పచ్చడిలా
కష్టసుఖాల సమ్మేళనమా అంటే కాదాయె
కొని తెచ్చుకున్న
ఇక్కట్లు కొన్నయితే పైనబడ్డ ఇబ్బందులు మరి కొన్ని
కొన్ని ప్రకృతి
ప్రసాదాలు మరికొన్ని మనిషి స్వయంకృతాలు
కొన్ని
స్వార్ధశక్తుల ప్రేరేపకాలు మరికొన్ని రాజకీయ కుశ్చిత కుతంత్ర జనిత విష పుత్రికలు
పులులు పంజాలు
విసిరే చోట లేడికూనల దీనాలాపాలు
విష నాగులు
సంచరించే వనంలో రెక్కలు విప్పుకుంటున్న శాంతి కపోతాలు
ఎవరి దోవ వారిదే
ఎవరి యావ వారిదే
ఎవరి వాదన వారిదే
ఎవరి రోదన వారిదే
ఎవరి గోల వారిదే
ఎవరి లీల వారిదే
ఒకరి మాట మరొకరికి
ఎక్కదు
ఒకరి గోడు మరొకరికి
పట్టదు
వివాదాల ముందు
వివేచన తల వంచుకుంది
వాదప్రతివాదాల నడుమ
హేతువు తల దించుకుంది
పంతాలు పట్టింపుల హోరులో
నోర్లు తెగబడ్డాయి, వూర్లు తగలడ్డాయి
నాలుకలు చీలిన నాయకుల ప్రేలాపనలతో
బుల్లితెరలు చిల్లులు పడ్డాయి
మాటల తూటాలతో మాధ్యమాలు
దద్దరిల్లాయి
అమృతం కురవాల్సిన
చోట విషం ధారగా కారింది
మంచితనం మనుగడే ప్రశ్నార్ధకంగా మారింది
వాస్తవాలను ఎరుక
పరచాల్సిన విజ్ఞులు తానులో ముక్కలయ్యారు
మౌనంగా
పరికిస్తున్న సామాన్యులు నోటమాట రాక అవాక్కయ్యారు
ఏడాది చివరిలో
హస్తినలో జరిగిన ఘోరకలి కలి ఉనికిని నిర్ధారించింది
యుగాంతం వదంతి
నిజమయినా బాగుండేదన్న భావన అందరిలో కలిగింది
అయినా ఏదో ఆశ
మనిషిని బతికిస్తున్న
ఆశ
నిరాశ నిస్పృహల నడుమ జోగాడుతున్న ఆశ
మంచి రోజులు
వస్తాయన్న ఆశ
మంచి కాలం
ముందుందన్న ఆశ
తిట్టుకుంటున్న
నోళ్ళు కట్టుబడతాయన్న ఆశ
కొట్టుకుంటున్న
చేతులు కలుసుకుంటాయన్న ఆశ
జనాలను
దోచుకుంటున్న నాయకులు జనాలను
కాచుకుంటారన్న ఆశ
కొత్త ఏడాది రూపంలో
ఎదుట నిలబడి వుంది
చెబుదాం దానికి
స్వాగతం
కాలమే సమస్యలకు
పరిష్కారం
రెండువేల పదమూడయినా
చూపాలి దానికి ఓ మార్గం (30-12-2012)