29, మే 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (170) – భండారు శ్రీనివాసరావు

 పౌరుడే  సుప్రీం

ముందు ఒకప్పటి సంగతి చెప్పుకుందాం.
1987 లో రేడియో మాస్కోలో నాకు ఉద్యోగం వచ్చింది. ఢిల్లీ నుంచి ఏరోఫ్లోట్ విమానంలో మాస్కో వెళ్ళాలి. దానికి ముందు హైదరాబాదు నుంచి రైల్లో ఢిల్లీ వెళ్ళాలి. మర్నాడు తెల్లారి ఉదయం భార్యాపిల్లలతో సహా బయలుదేరి సికిందరాబాదు స్టేషన్ లో రైలెక్కాలి. వీడుకోలు చెప్పడానికి చుట్టపక్కాలు చాలామంది మా ఇంటికి వచ్చారు. వచ్చిన వాళ్లకు కప్పు కాఫీ ఇవ్వడం మర్యాద. కానీ కాఫీ డికాషన్ పెట్టడానికి ఇంట్లో నీళ్ళ సమస్య. రోజు విడిచి రోజు నల్లా వదిలేవాళ్ళు. అదీ తెల్లవారుఝామున ఓ అరగంట. ఆ కాసేపట్లో ఆరు కుటుంబాల వాళ్ళు నీళ్ళు పట్టుకోవాలి. మాకు తెల్లారి ప్రయాణం కాబట్టి మిగిలిన వాళ్ళు మాకు ముందు అవకాశం ఇచ్చారు. లేని పక్షంలో కాఫీ డికాషన్ వేయడానికి కూడా నీళ్ళకు కటకట.
అప్పట్లో మరో సమస్య కరెంటు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలవదు. దీనికి తోడు విద్యుత్ కోతలు. వోల్టేజి సమస్యలు. ఇంట్లో అన్ని లైట్లు వేస్తే, ఇంట్లోదే కాదు, వీధిలో కరెంటు స్తంభం పైన ఫ్యూజు కూడా పోతుందని చెప్పుకునే రోజులు అవి. ముందు జాగ్రత్తగా కొవ్వొత్తులు కొని సిద్ధంగా పెట్టుకున్నాము. అదృష్టవశాత్తు వాటి అవసరం రాలేదు.
మూడో రోజు మాస్కో చేరాము. అక్కడ రేడియో మాస్కోలో పనిచేసే విదేశీ ఉద్యోగుల కోసం పదమూడు అంతస్తుల భవనంలో చిట్ట చివరి అంతస్తులో మాకు అపార్ట్ మెంటు కేటాయించారు. ఇంత ఎత్తుకు నీళ్ళు వస్తాయా! రాకపోతే ఇక్కడ కూడా హైదరాబాదు నీళ్ళ కష్టాలేనా, అనుకుంటూ లోపలకు వెళ్ళాము. వెళ్ళగానే చేసిన మొదటి పని నల్లా తిప్పి చూడడం. ధారగా నీళ్ళు వచ్చాయి. ప్రతి పంపు తిప్పి చూశాము. అన్నిట్లో నీళ్ళు. ఆనందంతో కళ్ళల్లో నీళ్ళు.
ఇలాంటి పరిస్థితి హైదరాబాదులో చూడడం అసాధ్యం అనుకున్నాము ఆ రోజు.
ఇదేదో ఉత్ప్రేక్ష కోసం, విమర్శ కోసం రాయడం లేదు. ఆ నాటి పరిస్థితులు, మంచి నీళ్ళ కష్టాలు ఈ తరానికి తెలియచెయ్యడం కోసం ఈ ప్రయత్నం.
ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా? ఖచ్చితంగా లేదనే చెప్పాలి. ఇది కళ్ళ ముందు జరిగిన అభివృద్ధి. కానీ కనబడదు.
ఎందుకో చెబుతాను.
ఇంట్లో పిల్లాడు పెరుగుతూ ఉంటాడు. కాలం గడిచిన కొద్దీ కొద్దోగొప్పో వళ్ళు చేస్తాడు. సహజం. అది రోజూ చూసేవారికి కనబడదు. ఎప్పుడో ఒక చుట్టం దిగబడతాడు. పిల్లాడ్ని చూసి ‘అరె! వీడేనా వాడు. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. పీలగా ఉండేవాడు. ఇప్పుడు కాస్త కండ పట్టి ముద్దొస్తున్నాడు’ అంటాడు. ‘నిజమేనా బాబాయ్’ అంటుంది తల్లి అనుమానంతో కూడిన ఆనందంతో.
అలాగే ఒక నగర వాసులకు తమ చుట్టుపక్కల జరిగే మార్పులు కంటికి ఆనవు.
అలాగే గత యాభయ్, అరవై ఏళ్ళలో ఇటు తెలంగాణాలో, అటు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఊరూ, ప్రతిపల్లె మారిపోయాయి. ఎటు చూసినా కళ్ళు మిరుమిట్లు కొలిపే మాల్స్. స్టార్ హోటళ్ళు. ఈ మార్పునే మనం అభివృద్ధి అనుకుంటున్నాం. మరి పౌరసౌకర్యాల మాటో. ఈ మాట ఎవ్వరికీ పట్టదు. ఇక పౌరధర్మం అంటారా! ఆ ఊసే ఎవరికీ అంటదు.
ఒకప్పుడు సప్త సముద్రాలు దాటి వెళ్ళిన అమెరికా ఈనాడు ఓ ఇరుగుపొరుగు దేశంగా మారిపోయింది. దాదాపు ప్రతి ఇంట్లో ఒకరైనా అమెరికాలో వుంటున్నారు. సుమారుగా ప్రతి తల్లీ తండ్రీ అమెరికా చూసి వచ్చిన వాళ్ళే కనబడతారు. వారిని అడిగితే చెబుతారు. అక్కడ చట్టాలు అన్నీ పౌరుడి దృష్టి కోణం నుంచి ఆలోచించి తయారు చేశారేమో అన్పిస్తుంది.
పౌరుల సర్వసాధారణ జీవితంలో ప్రభుత్వ ప్రమేయం అతి తక్కువగా వుండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. నేను గతంలో చూసిన సోవియట్ యూనియన్ లో కూడా ( పైగా అది అప్పట్లో ఇనుపతెర దేశంగా పేరుపొందిన దేశం) సాధారణ పౌర జీవితంలో ప్రభుత్వ అనవసర జోక్యం కానరాలేదు. అప్పటి సోవియట్ యూనియన్ లో ప్రజలకు నిత్యం తారసపడే ఏకైక ప్రభుత్వ ప్రతినిధి ట్రాఫిక్ పోలీసు. ట్రాఫిక్ రూలుని ఎవరయినా ఉల్లంఘించినప్పుడు చలానాలు వసూలు చేసే సందర్భాలలో వాళ్ళు పౌరులపట్ల యెంత మర్యాదగా వ్యహరిస్తారో కళ్ళారా చూసాను. అమెరికాలో ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై కూడా కానరారు. మన దగ్గర ప్రజలకు అతి చేరువగా వుండే ప్రభుత్వఅధికార ప్రతినిధులు, ముఖ్యంగా పట్టణాలలో, ట్రాఫిక్ పోలీసులే. వీరి ప్రవర్తన ఎలా వుంటుందో విడిగా చెప్పాల్సిన పని లేదు. పట్టపగలు, నడి రోడ్డుపై ప్రజలపై జులుం చేస్తూ ముక్కు పిండి, గోళ్ళూడగొట్టి డబ్బులు వసూలు చేసుకునే వీలున్న ఏకైక ప్రభుత్వ వ్యవస్థ కేవలం మన దేశంలోనే వుండడం మన దురదృష్టం.
1988లో మాస్కోలో నేనూ, మా ఆవిడా ఏదో పని మీద టాక్సీలో వెడుతుంటే, డ్రైవర్ సిగ్నల్ జంప్ చేశాడు. వెంటనే అక్కడే వున్న ట్రాఫిక్ పోలీసు (పోలీసుని మిలీషియా అంటారు) టాక్సీని నిలుపుచేసి, కారులో వున్న మాకు ఫుల్ సాల్యూట్ చేసి, డ్రైవర్ ని విచారించే మిషతో మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టకుండా, వేరే టాక్సీ ఆపి అందులో మమ్మల్ని పంపించాడు.
నమ్మకం
ఆ మెయిన్ రోడ్డు తిన్నగా పొతే సియాటిల్ నగరంలో మా మనుమరాళ్ళు చదువుకునే బెల్ వ్యూ స్కూలు వస్తుంది. కానీ అది ఒక మలుపు తిరిగే చోట మరో రోడ్డు పక్కనుంచి వచ్చి దానిలో కలుస్తుంది. ఆ దోవన వచ్చే వాహనదారులు ఆ రెండు రోడ్లు కలిసే చోట కాసేపు ఆగి, మెయిన్ రోడ్డులో వేరే వాహనాలు ఏవీ రావడం లేదన్న సంగతి ధృవపరచుకుని కానీ ఆ రోడ్డులోకి ప్రవేశించేవారు కారు. అయితే, హైదరాబాద్ ట్రాఫిక్కు అలవాటు పడివున్న నాకు మాత్రం ఆ వాహనాలు అదే వేగంతో మెయిన్ రోడ్డులోకి దూసుకు వస్తాయేమో అన్న భీతి పీడిస్తూ వుండేది.
“ఎందుకంత స్పీడు. కాస్త పక్కగా వచ్చే కార్లను చూసుకుని నడపకూడదా!” అనేవాడిని మా అబ్బాయితో.
“నమ్మకం” అనేవాడు మావాడు స్థిరంగా.
“అలా దూసుకు రావని ఇక్కడ మా నమ్మకం. వచ్చి తీరుతాయని హైదరాబాదులో మీ నమ్మకం. మా నమ్మకంతో ఇక్కడ మేమిలా స్పీడుగా పోగలుగుతున్నాం. మీ నమ్మకంతో అక్కడ మీరలా ఆచితూచి నడుపుతున్నారు. ఏదయినా అక్కడ మిమ్మల్నీ, ఇక్కడ మమ్మల్నీ నడుపుతోంది నమ్మకమే!” అన్నాడు అమెరికాలో అప్పటికి పదేళ్ళకు పైగా వుంటున్న మా వాడు మరింత నమ్మకంగా.
అమెరికన్లు ఒక పట్టాన ఎవరినీ నమ్మరంటారు. కానీ వారి జీవితాలన్నీ కేవలం ‘నమ్మకం’ ప్రాతిపదికపై నిశ్చింతగా నడిచిపోతున్నాయి.
చెక్కు ఇస్తే చెల్లుతుంది అన్న నమ్మకం.
వస్తువు కొంటే నాణ్యత వుంటుందన్న నమ్మకం, నచ్చని వస్తువును తిరిగి వాపసు చేయగలమన్న నమ్మకం.
కారు నడిపేటప్పుడు వెనుకనుంచో, పక్కనుంచో అడ్డదిడ్డంగా వేరే వాహనాలు దూసుకు రావన్న నమ్మకం.
ఫ్రీ వేస్ మినహాయిస్తే మిగిలిన రోడ్లను జీబ్రా క్రాసింగ్ ల వద్ద దాటేటప్పుడు ఎంతటి వేగంతో వచ్చే వాహనమయినా స్పీడు తగ్గించుకుని, కాలినడకనపోయేవారికి దోవ ఇస్తుందన్న నమ్మకం.
బహిరంగ ప్రదేశాలలలో పొరబాటున యెంత ఖరీదయిన వస్తువును మరచిపోయినా దాన్ని పరాయివారు పొరబాటున కూడా వేలేసి తాకరన్న నమ్మకం.
పలానా టైం కు వస్తామని చెబితే ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటారన్న నమ్మకం.
ఇలా నమ్మకాలమీద ఆధారపడి వారి జీవితాలు నమ్మకంగా గడిచిపోతున్నాయి.
ఇలాటి నమ్మకం ఏదయినా, ఒక్కటంటే ఒక్కటయినా మనకూ వుందని నమ్మకంగా చెప్పగలమా? లేదని మాత్రం ఘంటాపధంగా చెప్పగలం.
అమెరికాలో లావాదేవీలన్నీ ప్లాస్టిక్ కరెన్సీ అంటే క్రెడిట్ కార్డుల ద్వారా సాగిపోతుంటాయి.
అరటి పండ్లు అమ్మేవాడి దగ్గర కూడా డబ్బులు కాకుండా ఆన్ లైన్ చెల్లింపులు చేసే పద్దతి ఈ మధ్య మన దగ్గర పల్లెటూళ్ళలో కూడా వచ్చింది. అమెరికాలో మాత్రం ఇప్పటికీ క్రెడిట్ కార్డుల ద్వారానే ఎక్కువ లావాదేవీలు నడుస్తున్నాయి. కొన్ని విషయాల్లో మనమే ముందున్నామని అనిపిస్తుంది. యోజనాలు, కోసులు, మైళ్ళు దాటి కిలోమీటర్ల వరకూ మనం ముందుకు వచ్చినా, అమెరికా ఈ విషయంలో మైలురాయి దగ్గరే ఆగిపోయింది.
వినియోగదారుడు తనకున్న హక్కులను వాడుకోవడానికి ఇక్కడ వున్న వీలుచాళ్ళు, ఆ హక్కులకు ఒక అర్ధాన్ని పరమార్ధాన్ని కలిగిస్తున్నాయి. క్రయవిక్రయాలు, సేవల విషయంలో పౌరులకు కలిగే అసౌకర్యాలకు చెల్లించాల్సిన పరిహారాలు, అపరాధ రుసుములు పెద్ద మొత్తంలో వుండడంతో వారి ఆధిక్యత మరీ పెరిగిపోయింది. వేడి కాఫీ ఒలికి వొళ్ళు కాలిందని ఒక వినియోగదారుడు వేసిన కేసులో మెక్డోనాల్డ్ వంటి సంస్త లక్షల డాలర్లలో పరిహారం చెల్లించిన సందర్భాలు వున్నాయి.
అప్పటి నుంచీ ఆ కంపెనీ విక్రయించే కాఫీ గ్లాసులపై ‘వేడి కాఫీ – జాగ్రత్త’ అని హెచ్చరికలు ముద్రించడం ఆనవాయితీగా మారింది. అలాగే ఒక రెష్టారెంటులో తడి నేలపై కాలు జారిపడ్డ వ్యక్తికి పెద్ద మొత్తంలో నష్ట పరిహారం చెల్లించాల్సి రావడంతో, అన్ని హోటళ్ళలో ‘నేల తడిగా వుంది – చూసి నడవండి’ అనే బోర్డులు పెట్టడం మొదలయింది.
అమెరికన్లు యితరుల వ్యవహారాలలో ఏ మాత్రం జోక్యం చేసుకోరు. అలాగని బావిలో కప్పల్లా వుండిపోరు. తెలియని వాళ్ళను సైతం చిరునవ్వుతో పలకరిస్తారు. మందహాసమే వారి విజయ రహస్యం అనిపిస్తుంది.
రెండు బెలూన్లు – ఒక థాంక్స్
ఓ రోజు మా మనుమరాలిని స్త్రోలర్ లో కూర్చోపెట్టుకుని నేనూ మా ఆవిడా రెండు మైళ్ల దూరంలో వున్న ఫాక్తోరియా మాల్ కి వెళ్ళాము. (ఇప్పుడు దాని పేరు మార్చారని విన్నాము)
త్రోవలో ఒక చోట ‘గరాజ్ సేల్’ అని ఒక చిన్న బోర్డు పెట్టారు.
అది స్పుటంగా కనిపించడానికి కాబోలు- దానికి గాలిలో ఎగిరే రెండు బెలూన్లు వేలాడ తీసారు. వాటిని చూసి మా మనుమరాలు ‘బెలూన్-బెలూన్’ అని అరిచింది. దాని ముచ్చట చూసి కొనిపెడదామన్నా అవి ఎక్కడ దొరుకు తాయో మాకు తెలవదు. తిరిగి వస్తుంటే ఆ బెలూన్లు మళ్ళీ కనిపించాయి. వాటిని చూపిస్తూ మా మనుమరాలు మళ్ళీ ‘బెలూన్-బెలూన్’ అని కేకలు పెట్టింది.
ఈ లోగా ఓ కారు వచ్చి అక్కడ ఆగడం, ఎవరో దిగి ఆ గరాజ్ సేల్ బోర్డుతో పాటు ఆ బెలూన్లని తీసుకుపోవడం జరిగింది. అంటే అప్పటితో ఆ సేల్ ముగిసిందన్న మాట. మరో రెండు బ్లాకులు దాటి మేము మా ఇంటికి చేరే సమయంలో, మా పక్కగా వున్న సందులోకి ఓ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి దిగిన ఓ అమెరికన్ రెండు బెలూన్లు తీసి మా అమ్మాయికి ఇచ్చాడు. అతనేదో ఇంగ్లీష్ లో చెప్పాడు కానీ మాకు ఒక పట్టాన అర్ధం కాలేదు. తరవాత తీరిగ్గా ఆలోచిస్తే తెలిసిందేమిటంటే, మా మనుమరాలు బెలూన్ చూపించి అడగడం అతను గమనించినట్టున్నాడు. అయితే ఈలోగా సిగ్నల్ పడడంతో ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ మమ్మల్ని వెతుక్కుంటూ వెనక్కు వచ్చి బెలూన్లు ఇచ్చాడు. ఇలాటి సహృదయతనూ, సంస్కారాన్నీ మెచ్చుకోకుండా వుండగలమా?
ఇటువంటి సందర్భాలలో మనోభావాలకు అద్దం పట్టే ఇంగ్లీష్ పదం ఒకటుంది. అదే - ‘థాంక్యూ’.
అందుకే ఏళ్ళు గడిచిపోయినా ఈ సందర్భాన్ని, సన్నివేశాన్ని మరచిపోలేదు.
కింది ఫోటోలు:
సియాటిల్ లో మా దంపతులం (పదిహేనేళ్ల క్రితం)
(ఇంకావుంది)
All reactions:
Jamili Reddy Sagam, Varalakshmi Rangu Bhotla and 11 others
Like
Comment
Share
Facebook
Facebook
Facebook

28, మే 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (169) – భండారు శ్రీనివాసరావు

 కన్నంతలో విన్నంతలో అమెరికా

2003 వరకు సింగపూర్, మలేసియా, సోవియట్ యూనియన్ వంటి దేశాలకు వెళ్ళిన అనుభవం వుంది కానీ అమెరికా వెళ్ళడం మాత్రం ఆ ఏడాదే జరిగింది. ఒకానొక కాలంలో విదేశాలకు వెళ్ళడం అనేది వెళ్ళిన వారికీ, వారు అలా వెళ్ళడం వారి చుట్టపక్కాలకూ ఎంతో గొప్పగా అనిపించేది కానీ ఇపుడలా కాదు. అందరికీ అమెరికా వంటి దేశాలకు వెళ్ళే అవకాశాలు లభిస్తున్నాయి. దిగువ, మధ్య తరగతి తలితండ్రులకు మాత్రం వాళ్ళ పిల్లల వల్లనే. వెళ్ళిన ప్రతివారికీ మొదటిసారి అనుభవాలు కొత్తగా, గమ్మత్తుగా అనిపిస్తాయి. ఒకసారి వెళ్ళివచ్చిన వారికి ఇందులో ఏముంది అనిపించవచ్చు. కానీ ప్రప్రధమంగా వెళ్లేవారికి కొంత ఉపయోగపడవచ్చు అనే ఉద్దేశ్యమే అమెరికా అనుభవాలు కాగితం మీద పెట్టడానికి కారణం.

నేను హైస్కూల్ లో చదువుకునే రోజుల్లో ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వర రావు గారు అమెరికా సందర్శించి, ‘నేను చూసిన అమెరికా’ అని ఒక పుస్తకం రాశారు. అది చదివి ఆ పుస్తకానికి అలా ఎందుకు పేరు పెట్టారా అని అనుకునేవాడిని. మొదటిసారి వెళ్ళివచ్చిన తర్వాత అర్ధమయింది. అదొక సువిశాల దేశం. టూరిస్ట్ గా వచ్చిన వాళ్ళే కాదు, ఎన్నో ఏళ్లుగా అక్కడ వుంటూ వచ్చిన వాళ్ళు కూడా అమెరికాని పూర్తిగా చూడడం కుదరని పని. అందుకే చూసిన మేరకే అవగాహన చేసుకుని అక్షరబద్ధం చేసేందుకే ఈ ప్రయత్నం.

విన్నంతలో... కన్నంతలో... అని పేరు పెట్టడానికి ఇదే కారణం.

అమెరికా వెళ్లడం అన్నది మన దేశంలో చాలా మందికి తీరని కల. ఎందుకంటే వీసా నిబంధనలు అంత కఠినతరం. డబ్బున్నవాళ్ళు కూడా మరో మరో విదేశానికి వెళ్లి వచ్చినంత సులభంగా అమెరికా వెళ్ళలేరు. అలాగే ఆనాటి సోవియట్ యూనియన్ కూడా.

అయితే, ఓ పాతికేళ్ళ క్రితం ఆకాశవాణి పుణ్యమా అని మాస్కోవెళ్లి దాదాపు అయిదేళ్లు రేడియో మాస్కోలో పనిచేసివచ్చాను. ఆ రోజుల్లో ప్రపంచ దేశాల్లో అమెరికాకు పోటీగా నిలబడిన మరో ఏకైక అధికార ధ్రువం సోవియట్ యూనియన్. అనేక దశాబ్దాల తరబడి అప్రతిహతంగా సాగిన మొట్టమొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం అంతిమ ఘడియలు చూడగలిగే అరుదయిన అవకాశం లభించిన నేను ‘మార్పు చూసిన కళ్ళు’ అనే పేరుతొ ఆనాటి అనుభవాలను గ్రంధస్తం చేయడం జరిగింది.

పోతే, మాస్కో నుంచి తిరిగివచ్చిన ఇరవై రెండేళ్ల తర్వాత 2003లో సియాటిల్ లో వుంటున్న మా పెద్దకుమారుడు సందీప్, అమెరికా చూసే అవకాశాన్ని కల్పించి, సోవియట్ యూనియన్, అమెరికాలు రెండింటినీ చూడగలిగిన కొద్దిమంది హైదరాబాద్ జర్నలిష్టులలో నన్ను కూడా చేర్చాడు. నాకు తెలిసి ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ ఐ వెంకటరావు, , ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సెక్రెటరీ జనరల్ కె. శ్రీనివాసరెడ్డి, (ప్రస్తుతం తెలంగాణా మీడియా అకాడమి చైర్మన్) ఈ రెండు దేశాలను చూసినవారిలో వున్నారు. ఈ అవకాశం ఇక ఎవరికీ దొరికే వీలు కూడా లేదు. ఎందుకంటే అంత పెద్ద కమ్యూనిస్ట్ దేశం , కాలక్రమంలో అంగ వంగ కళింగ దేశాల మాదిరిగా విచ్చిన్నమై చరిత్ర పుటల్లో మిగిలిపోయింది.

కాగా, చెన్నై అమెరికన్ కాన్సులేట్ లో పత్రికా వ్యవహారాలు చూసే ఉద్యోగి, నా మిత్రుడు మాగంటి కోటీశ్వర రావుగారి పూనికతో ఎలాటి టెన్షన్ పడకుండా లభించిన పది సంవత్సరాల వీసాలతో నేనూ మా ఆవిడ నిర్మల, హైదరాబాదులో 2003 సెప్టెంబర్ ఆరో తేదీ శనివారం మలేసియన్ ఎయిర్ లైన్స్ లో బయలుదేరి కౌలాలంపూర్ మీదుగా సుమారు ముప్పయి గంటలు ప్రయాణం చేసి తిరిగి అదే రోజు, అంటే శనివారం నాడే అమెరికా లోని అతి పెద్ద విమానాశ్రయాల్లో ఒకటయిన లాస్ ఏంజెల్స్ చేరుకున్నాము. భూమండలానికి ఆవలవైపు వున్న దేశానికి చేరడంవల్ల కాలగమనంలో వచ్చిన మార్పు ఇది.

ఇప్పటిలా హైదరాబాదు నుంచి సియాటిల్ కు నేరుగా విమాన సౌకర్యం లేదు. లాస్ ఏంజెల్స్ నుంచి సియాటిల్ వెళ్ళడానికి మరో విమానం ఎక్కాలి. దానికి రెండు గంటలకు పైగా వ్యవధి వుంది.

లాస్ ఏంజెల్స్ చేరగానే ఆ విషయం సియాటిల్ వున్న తనకు తెలియచేయడానికి వీలుగా సందీప్ ముందుగానే ఒక ఫోన్ నంబర్ ఇచ్చాడు. డబ్బులతో అవసరం లేని నంబర్ అది. దాని ద్వారా కబురు అందించడానికి నేను చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నా పాట్లు గమనించిన ఒక అమెరికన మహిళ, తానే చొరవ తీసుకుని తన సెల్ ఫోన్ ద్వారా సియాటిల్ లోని సందీప్ కి మేము క్షేమంగా చేరిన సమాచారాన్ని చేరవేసింది. అమెరికన్లతో నా తొలి పరిచయం ఇలా సుహృద్భావంగా జరగడం చాలా సంతోషం అనిపించింది.

సియాటిల్ విమానం ఎక్కేముందు కూడా మా బాగేజీని క్షుణ్ణంగా పరీక్షించారు. ఊరగాయ పచ్చళ్ళను గురించి ఒకటికి రెండుసార్లు ప్రశ్నించారు. ఒక పెద్ద సూటుకేసులో పాకెట్లు చూసి వారికి అనుమానం కలిగినట్టుంది. అవన్నీ నేను తాగే సిగరెట్ల పాకెట్లు. ఆ బ్రాండు అమెరికాలో దొరుకుతుందో లేదో అని ముందు జాగ్రత్తగా ఎర్రమంజిల్ రెడ్ రోజ్ రెస్టారెంట్ దగ్గర పాన్ షాపులో ఆ సిగరెట్లు కొన్నాను. ఒక్కసారే అన్ని డజన్ల సిగరెట్ల పాకెట్లు టోకున కొంటుంటే ఆ షాపు వాడికి నేను కూడా ఓ షాపు తెరవబోతున్నానేమో అనే సంశయం కలిగివుంటుంది.

ఇన్ని సిగరెట్ ప్యాకెట్లు, అవీ ఒక సూటుకేసు నిండా వుండడం చూసి ఆ అమెరికన్ కస్టమ్స్ అధికారి కనుబొమ్మలు ఎగరేశాడు ఏవిటివన్నీ అనే అర్ధం వచ్చేట్టు. నా బాధ నేను చెప్పుకున్నాను. అతడూ ధూమపాన ప్రియుడేమో తెలవదు, మా సామానునంతా మా కళ్ళ ముందే సూట్ కేసుల్లో జాగ్రత్తగా సర్ది మాకప్పగించారు.

ఎట్టకేలకు సియాటిల్ వెళ్ళే విమానం ఎక్కాము. సుమారు రెండుగంటల ప్రయాణం.

సియాటిల్ గురించి నాకు తెలిసింది తక్కువ. మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయం సియాటిల్ లో వుందని తెలుసు. ఆంద్ర జ్యోతిలో లోగడ పనిచేసిన నా మిత్రుడు రామానాయుడు ఆ పత్రిక తరపున ఓసారి సియాటిల్ వెళ్లి వచ్చాడు. ఎప్పుడూ వానలు పడుతుంటాయి అని చెప్పాడు. మేము సియాటిల్ వెళ్లేసరికి వాతావరణం బాగానే వుంది. సందీప్ తన స్నేహితుడు అనూప్ తో కలసి రెండు కార్లు తీసుకుని ఎయిర్ పోర్ట్ కి వచ్చాడు. మేము వెళ్ళింది ఉగ్రవాదుల చేతుల్లో తొలిసారి అమెరికా షాక్ తిన్న తరువాత. భద్రతా ఏర్పాట్లు యెంత పటిష్టంగా వున్నా విజిటర్లని లగేజి కలెక్ట్ చేసుకునే ప్రదేశం వరకు అనుమతిస్తూనే వున్నారు. మా మనుమరాలు సఖి కూడా వెంట వచ్చింది. అందరం కలసి కారు పార్కింగ్ కు వెళ్ళాం. అదో పలు అంతస్తుల భవనం. ఒక్కో అంతస్తులో అనేక డజన్ల కార్లు పార్క్ చేసుకునే వీలుంది. మేము లిఫ్ట్ లో ఏడో అంతస్తుకు వెళ్లి కార్లలో లగేజి వేసుకుని గంట ప్రయాణం తరవాత బెల్ వ్యూ లోని సందీప్ అపార్ట్ మెంట్ కి చేరాము.

ఇంటికి చేరిన తరవాత, సూట్ కేసులు తెరిచి చూసుకుంటే, సామానులపైన, ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ ఎడ్మినిస్ట్రేషన్ వారి నోటీసు కనిపించింది.

అందులో ఇలా వుంది.

బ్యాగేజీ తనిఖీ నోటీసు:

మీకూ, మీ తోటి ప్రయాణీకులకూ భద్రత కల్పించే చర్యలలో భాగంగా మీ బ్యాగేజీని మేము క్షుణ్ణంగా తనిఖీ చేసాము. ఇందుకోసం ఎంపిక చేసిన బ్యాగేజీల్లో మీది కూడా వుంది.

నిషేధిత సామాగ్రి ఏమయినా వుందేమో తెలుసుకోవడం కోసం మీ బ్యాగేజీని మీ అనుమతి లేకుండానే తెరిచి చూసాము. తాళాలు వేసివున్నందువల్ల, గత్యంతరం లేని పరిస్థితిలో, వాటిని పగలగొట్టవలసి వచ్చింది. క్షంతవ్యులం. అయితే నిబంధనల మేరకే ఈ పని చేసాము. అందువల్ల, ఈ ప్రక్రియలో మీ బ్యాగేజీకి ఏమయినా నష్టం జరిగినా, దానికి మా పూచీ లేదు.

మీరు మరోసారి విమాన ప్రయాణం చేసినప్పుడు ఇలాటి అనుభవం పునరావృతం కాకుండా వుండాలంటే, బ్యాగేజీని ఎలా ప్యాక్ చేసుకోవాలో మీకు ముందే తెలిసివుంటే మంచిది.

www.tsa.gov వెబ్ సైట్ లో ఈ వివరాలు లభిస్తాయి. 866 289 9673 టోల్ ఫ్రీ నంబర్ కు కూడా ఫోన్ చేసి కానీ లేదా TSA -contact center@dhs.gov ఈమెయిల్ చేసి కానీ తెలుసుకోవచ్చు.”

అమెరికన్ కష్టమ్స్ అధికారులు ఆ యూనిఫారాల్లో చూడడానికి భీకరంగా కనిపిస్తారు కానీ, చాలా మర్యాదస్తులు అనిపించింది అది చదవగానే.

కింది ఫోటో:

సియాటిల్ ఎయిర్పోర్ట్ లో



(ఇంకా వుంది)